హరవిలాసము (1931)/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి


పంచమాశ్వాసము

శ్రీమత్కుమారశైల
స్వామికృపాలధనిత్యశాశ్వతవిభవా!
హేమాచలధీర! ధరి
త్రీమండనచరిత! యవచిదేవయతిప్పా! 1

వ. ఆకర్ణింపుము. 2

ఉ. గౌరివివాహమై కుసుముకార్ముకుఁ గ్రమ్మఱిలంగఁ జేసి బృం
దారకవర్గము న్నిజపదంబున కన్పి హిమాచలంబుపైఁ
బారిషదవ్రజంబు దను భక్తి భజింపఁగ నాదరించె సం
సారసుఖంబు శంకరుఁడు సంభృతనవ్యకుటుంబభారుఁ డై. 3

తే. ప్రమథగణములతో మాతృసమితితోడ, నందికేశ్వరుతోడ నానందలీల
నార్యపైఁ బేర్మి యెట్టిదో యద్రియింట, నిల్లటంబుండెఁ ద్రిభువనాధీశ్వరుండు. 4

సీ. జమిలిపాములతోడిసాకతం బొల్లక సవరించు బంగారుజన్నిదములు
పచ్చయేనికతోలుపచ్చడంబుఁ దృజించి గడితంపుఁబట్టుఁబచ్చడముఁ గట్టు
భస్మాంగరాగంబు పనికట్టువడఁజేసి కస్తూరితోడ శ్రీగంధ మలఁదు
నస్థిమాల్యములపై ననురక్తి వర్జించి రమణీయతారహారములు దాల్చు
తే. జడలు బాగడ జొళ్ళెంబు సంతరించి, లేఁతరిక్కలరాయుఁ గీలించు నందు
మంచుగుబ్బలియింట సమ్మదము మీఱ, మనువుఁ గుడువంగ నున్నప్డు మదనవైరి. 5

తే. ఓషధిప్రస్థపురమున నుబ్బియుబ్బి, హేమపుంజప్పరంబుల నెక్కియాడు
గణము లిరువంకఁ గొలిచిరాఁ గాలగళుఁడు, వృషభపుంగవువాహ్యాళి వెడలునపుడు. 6

ఉ. ఆరభటీకఠోరతరహాసు లుదంచితచంద్రహాసు లం
గారనిభారుణాక్షులు ప్రకారవిశాలమనోజ్ఞపక్షు లా
కారధురంధరుల్ ప్రకటకంబుమనోహరకంధరుల్ జటా
ధారులు మేరుధీరులు సదాశివుసన్నిధి పారిపార్శ్వకుల్.



తే. వీటఁ దమ కెవ్వ రెదురని వెఱపు లేక, చెల్లుబడిఁ బ్రల్లదంబులు సేయఁదొడఁగి
రభవులెంకలు జమునిమారంకకార్లు, వేశవాటికుటీమధ్యవీథులందు. 8

క. కుంభోద్భవుపాళెమున ని, కుంభుదివాణమున భృంగి కులపతి గాఁగాఁ
గుంభోద్భవువగఁ దిరిగిరి, శంభునికింకరులు గర్వసంరంభమునన్. 9

సీ. పులికళాసంబు గప్పుదురు పాఱఁగ మీఁద విద్యాధరాంగనావిటగణంబు
గంధర్వకామినీకాముకవ్రాతంబు లాతాలఁ గొని మోఁది లజ్జగొండ్రు
కకపాలవెలిబూదిఁ గన్నులలోఁ బ్రామి బాధింతు రప్పరఃపల్లవకుల
గరుడభామాభుజంగప్రతానముఁ బట్టి బాధింతు రురుయోగపట్టకముల
తే. నాగడీలు మహాధూర్తు లగడుఁగాకు, లుధ్ధతులు గొంట్లు పలుగాకు లుదురుమిడుకు
లాకతాయలు శకులు గయ్యాళు లగుచు, నోషధిప్రస్థ మిల్లిల్లు నుడుకుచుండ. 10

వ. మఱియు నానాప్రకారంబులం బ్రమభ్రజటాధారులు యథేచ్ఛాచారులై యోషధిప్రస్థపురంబునం క్షుద్రోపద్రవంబులు సేయుచుండ హిమవంతుం డంతయు నెఱింగి మేనకాదేవియుం దాను మంతనం బుండి యీశ్వరునితోడిపొ త్తింతియ చాలునని యాప్రొద్దు కూఁతు రావించి యి ట్లనియె. ll

క. కమలాక్షీ యసంఖ్యాత, ప్రమథగణంబులును భూతపరిషత్తుఁ బిశా
చములున్ మొదలగు ధూర్తుల, సమూహమును నీమగండు సంభావించున్. 12

క. భూతప్రేతపిశాచ, వ్రాతంబులు తోడుగాఁగఁ బ్రమథులు పగలున్
రాతిరియును నష్టాదశ, జాతిప్రజలకును దుర్దశలు సంధింతుర్. 13

ఉ. వేమఱు రాత్రియుంబగలు వీథులఁ గల్పలతాప్రసూనమా
ధ్వీమదమత్తచిత్తు లయి వేలుపులేమలఁ బట్టుకొంద్రు నీ
స్వామికి నిష్టభృత్యు లగుజంగమ ముండ కపాలపాణి కా
ళాముఖవీరపాశుపతలాంఛనధారులు ధూర్తవర్తనుల్. 14

క. ఈవీట నసంఖ్యావలి, ద్యావాపృథివీమహామహత్తులకుం ద
ర్పావేశంబున ధౌర్త్యము, గావింపఁగ మాన్పఁదగదె కఱకంఠునకున్. 15

సీ. తలమీఁదిచదలేటిదరిమీలఁ దినఁ జేరు కొంగలు చెలఁగి కొంగొంగు రనఁగ
మెడదన్నుపునుకలనిడుపేరు లొండొంటిఁ బొరిఁబొరిఁదాఁకి బొణ్బొణుగు రనఁగఁ
గట్టినపులితోలుకడకొంగు సోఁకి యాఁబోతుతత్తడి చిఱ్ఱుబుఱ్ఱు మనఁగఁ
గడియంపుఁబాములు కకపాలలో నున్న భూతి మైఁ జిలికిన బుస్సు రనఁగ
తే. దమ్మిపూఁజూలిపునుకకంచమ్ము సాఁచి, దిట్టతనమున బిచ్చము దేహి యనుచు
వాడవాడల భిక్షించుకూడుగాని, యిట్టిదివ్యాన్నములు మెచ్చునే శివుండు. 16

తే. అఖిలలోకేశ్వరుఁడు మామయాత్మలోని, విసువుఁ జారజనంబులవేసటయును



బ్రమథగణములు సేయు ధౌర్త్యంబు నెఱిఁగి, దారుకావని కరుగంగఁ దలఁచె నపుడు. 17

వ. ఇట్లు దలంచి నందివాహనారూఢుండును గతిపయప్రమథపరివారపరివృతుండును నై మామ వీడుకొనక గౌరికిం జెప్పక నభోమార్గంబునఁ దత్పర్వతైకదేశస్థితం బగు దేవదారువనంబుం బ్రవేశించె నప్పర్వతం బెట్టిదనిన. 18

సీ. వృద్ధకచ్ఛపరాజువీఁ పంఘ్రిపీఠంబు సురతరంగిణివెల్లి శిరసుపాగ
మహిమండలమునకు మానదండము మేను పూర్వాపరంబులు పొరుగుటిండ్లు
కాత్యాయనీదేవి కన్యకారత్నంబు బేసికన్నులవేల్పు పెండ్లికొడుకు
పొలనీయము శేషశైలసామ్రాజ్యంబు యాగహవిర్భాగ మోగిరంబు
తే. మాల్యవన్మేరుకైలాసమలయసహ్య, గంధమాదనమందరక్రౌంచవింధ్య
భూధరంబులు చుట్టాలు పొగడఁ దరమె, సకలగుణధాముఁ బర్వతసార్వభౌము. 19

క. అందు విహరించుఁ గాంచన, కందరమందిరములందుఁ గౌతుక మొప్పన్
బృందారకమిథునంబులు, కందర్పవిహారములఁ బగళ్లును రేలున్. 20

ఉ. ఎంచి నుతింప శక్యమె యహీశ్వరునంతటివానికైన ర
త్నాంచితరోచిరుద్దమనిరస్తరవీందుమరీచిజాలమున్
గాంచనకందరాయవనికాయితవారిధరాంతరాళ ని
ర్వంచితదేవతామిథునవాంఛితమూలము శీతశైలమున్. 21

తే. హేమశైలంబు దోఁగ్ధగా భూమి సురభి, నఖిలరత్నౌషధులును గల్పాదియందుఁ
బృథుమహారాజుపంపునఁ బితికె నెలమి, మంచుగొండను బెయ్యఁ గావించి గిరులు. 22

శా. ఆమోదంబున వేఁటలాడుదురు నీహారాద్రికాంతారరే
ఖామధ్యంబునఁ జాపటంకృతులతో గంధద్విపశ్రేణులన్
క్షౌమక్షామమనోజ్ఞమధ్యమలు గుంజాభూషణాలంకృతల్
వ్యామగ్రాహ్యపయోధరల్ శబరసేనాధీశసీమంతినుల్. 23

క. మృడుమేనిసాము కూఁతురు, జడనిధిచెలికాఁడు కొడుకు సర్వంసహకున్
గొలకోల కడలికడలకు, వడఁకులగుబ్బలికి సరియె వసుధాధరముల్. 24

క. ఆటవికభామినీభుజ, తాటంకితదీర్ఘదీర్ఘతరవేణుధను
ర్జ్యాటంకారధ్వనిపరి, పాటీముఖరములు తుహీనపర్వతతటముల్. 25

వ. మఱియు జాహ్నవీనిర్ఝరధారాఝాత్కారఘుమఘుమాయితమణిగుహాకుహరంబును వనమహిషకోణాభిఘాతప్రస్నిగ్ధపాషాణస్ఖలనరోహద్గర్భిణీగర్భపాతంబును శబరఫురంధ్రినీరంధ్రకుచకలశలేపనముద్రాయోగ్యవర్ణవర్ణనీయగైరికశిలాచూర్ణంబును గిన్నరమిథునక్రీడాసంకేతనికేతనాయమానకనకకేతకీకుంజక్రోడంబును గంధర్వకన్యకానఖముఖస్ఫాల్యమానవీణాగుణక్వాణసంగీతభంగీతరంగితాంతరంగవనకురంగంబును విద్యాధరాభిసారికామనోరథపదానురోధనిర్ణిరోధనిరవగాఢసంబాధప్పథులతమతమాలవీథీతిలకంబును నైననయక్కొండదక్షిణభాగంబున నుండుదాక్షాయణీవనంబున కనతిదూరంబున. 26

సీ. కర్ణికామాణిక్యకనకపద్మినులతోఁ గల్పవల్లీకుడుంగములతోడ
విమలచింతారత్నవేదికాస్థలులతో సిద్ధరసాపగాశ్రేణితోడ
దివ్యలోకాప్సరఃస్త్రీకదంబముతోడఁ గామధుగ్ధేనుసంఘములతోడ
దివ్యౌషధీలతాదీపమాలికలతో సకలర్తుసన్నివేశంబుతోడ
తే. మదనవైరికి గారాపుమామ యైన, మంచుగుబ్బలిఱేని సీమాంచలమున
దేవతామునిసేవ్యమై తేజరిల్లు, ధర్మసంజీవనము దేవదారువనము. 27

క. అందు వసియించు సంయమి, సందోహము పంచబాణసదృశము లీలా
సౌందర్యకళానిర్జిత, బృందారకసతులు వారిబింబాధరలున్. 28

సీ. జిలుఁగైనకనకంపుఁజీనాంబరముకొంగు పాలిండ్లబింకంబు బయలుపఱప
భ్రమరకంబులఁ జుట్టుప్రస్వేదకణములు నొసలికస్తురిబొట్టు నూలుకొలుప
దరవిశ్లథం బైనధమ్మిల్లభారంబు చిమ్మచీఁకటులకుఁ జిట్టమిడువఁ
దరళహాటకరత్నతాటంకదీప్తులు చెక్కుటద్దములపై జీరువాఱ
తే. బసిఁడికుండల నిర్ఝరాంభస్సుఁ దెచ్చి, పోయఁ గంకణనిక్వాణములు సెలంగఁ
గన్యలతలకు మునికన్యకాకదంబ,మభిమతం బైనయప్పావనాశ్రమమున. 29

క. జ్యోతిప్టోమాదిముఖ, త్రేతానలపుణ్యధూమరేఖామృతగం
ధాతిరయం బడఁగించుం, బాతకసంఘము తదీయపర్యంతమునన్. 30

ఉ. సమ్మదలీలతోఁ జదువు సామము లేడును గండుఁగోయిలల్
తుమ్మెద లాలపించుఁ బరితోషమునం బ్రణవాక్షరంబులన్
సమ్మతిఁ బ్రస్తవించు శుకశారిక లాగమభాషితంబులన్
నెమ్మదిఁ జెప్పు శాస్త్రముల నీలగళంబులు తద్వనంబునన్. 31

శా. కాముం జీరికిఁ గోక క్రోధము నహంకారంబు లోభంబు నీ
ర్ష్యామాత్సర్యమదావలేపకుహనారాగంబులం జేర నీ
కాముష్యాయణు లై ప్రశాంతమతు లై యయ్యాశ్రమాంతంబుల౯
సేమం బొప్పఁగ సంచరింతురు మునుల్ నీవారముష్టింపచుల్. 32

శా. ఆనందంబునఁ ద్రుళ్లుపుచ్ఛములు పెల్లల్లార్చుచున్ లేఁగ ల
క్కానన్ గోకులగోష్ఠదేశముల జంఘాలాఘవం బొప్ప హో
మానుష్ఠానవిధిప్రకారపరతంత్రాత్మప్రసూకామధు
గ్ధోనోదన్యసుధాప్రవాహలహరీతృప్తాంతరంగంబు లై. 33



శా. ఆయావేళల మౌనిభార్యలు గృహవ్యాపారలీలాభవ
త్కాయక్లేశము లుజ్జగింత్రు విలసత్కర్పూరరంభాతరు
చ్ఛాయన్ శీతలచంద్రకాంతమణిపాషాణప్రదేశంబులన్
వాయుప్రేరణఁ బచ్చకప్పురముపై వర్షింప నక్కానలోన్. 34

వ. మఱియు నత్తపోవనంబునందు. 35

క. నిలయవ్యాపారంబుల, యలపుల మేనులు చెమర్చి యపరాహ్ణమునన్
సెలయేఱులలోఁ జిల్లులు, చిలుకులు నాడుదురు మునులచివురుంబోణుల్. 36

సీ. సెలయేఁటితెలినీటఁ జిఱుబంతిపసుపాడి సేనక్రొమ్ముళ్లఁ బచ్చియలు తుఱిమి
గురువిందపేరులు గుబ్బచన్నులఁ దాల్చి నెమిలిపించంపుఁబుట్టములు గట్టి
పయ్యెదమాఱుగాఁ బాఱుటాకు లమర్చి చాదునఁ దిలకంబు సంతరించి
కంకేళిచిగురాకుఁ గర్లపూరముఁ జేసి కుసుమపూవులధూళిఁ గురులఁ దాల్చి
తే. చెంచుఁజిగురాకుఁబోణులచేత లెల్ల , నభినయింతురు పర్లశాలాంతరములఁ
దండ్రు లెందేనిఁ జనునప్డు తల్లులెదుర, గారవము సేయ మునికన్యకాజనంబు. 37

సీ. నిర్ఝరాంభఃకేళి నీలకంఠాంగనా తాండవాడంబరదర్శనంబు
పుష్పాపచాయంబు పూర్ణిమాతిథినిశాచంద్రోదయారంభసంభ్రమంబు
ప్రసవకందుకలీల బాలప్రవాళాచ్ఛగిరినదీసైకతక్రీడనంబు
పాంచాలికారక్తి కాంచనకుంభాంబుపూరకల్పితలతాపోషణంబు
తే. లతిథిపూజార్థసజ్జీకృతార్ఘ్యపాద్య, సలిలమధుపర్కలాజకుశప్రవాళ
గంధపుష్పాక్షతాదిప్రగల్భనములు, ప్రత్యహఃకృత్యములు మౌనిబాలికలకు. 33

వ. మఱియు నద్దేవదారువనంబునందు మునులవ్రతభంగంబు సేయంబూని యేతెంచిన పదునాల్గుజాతులయప్సరస్స్త్రీకదంబంబులు ప్రతిజాతి కొక్కొక్కవాడ యేర్పడ నానాసంకేశసన్నివేశంబులై తప్పకుండు మార్తాండమండలం బిక్షుదండంబులు మృత్యుదేవతావదనగహ్వరంబు నారాయణోరుకాండం బగ్నిజ్వాలాజాలంబు శంబరారాతిచెఱకువిల్లు ముక్కంటినొసలిచిచ్చఱకన్ను గంధర్వవంశద్వయం బాదిగా బహువిధాన్వయంబుల నుత్పన్నంబు లగుటం జేసి తమతమయుత్పత్తిలాంఛనంబులును, సౌభాగ్యధ్వజపతాకాపటలంబులుం దేటపడఁ బ్రతిభవనభిత్తిభాగంబునం జిత్రించిన చిత్తరువులయందుం గోరకితనేత్రత్రిభాగుండై కుసుమకంకపత్రంబుల వంక లొత్తుచు రతీదేవివృత్తస్తనంబులమీఁద నత్తమిల్లినయున్మత్తచిత్తభవువిక్రమసంపత్తిప్రకారంబును, బట్టపగలు యోజనగంధ యనుగంధగజగమనవట్రువచనుంగవ సూచి తొట్రుపడు వసిష్ఠపౌత్రుని దృష్టిప్రియత్వంబును, నాచార్యుభార్య యగుతారాదేవిమీఁదఁ దారకారాజు పఱపుచీటంబు వాటంబు సేయు లలితకటా క్షవీక్షావిక్షేపములును, ధృతిమాలి మాలినీసైకతంబున నేకతంబునం గురువిందపొదలో వేలుపులంజియకెంజిగురు చవి సూచినకుశికనందనురాగావేశంబును, గుసుమగోదండజయడిండిమం బగువిభాండకసుతునివనితామండలాసక్తియు, బృందావనంబునందు ముకుందు డొనరించిన నందవ్రజవధూవిహారాడంబరంబును, నంబురుహసూతి యాఁడుపట్టిం బట్టుకొనినపట్టునుం, బురుహూతుండు గౌతమకళత్రంబుమీఁదం గల్పించిన చీఁకటితప్పును జూఁ జూపఱకుఁజిత్తంబు లువ్విళ్ళూర, వేఱవేఱ వసియించియుండునచ్చేడియలలో విబుధమత్తకాశినీజనోత్తమ యగుతిలోత్తమయు వశీకృతకుసుమనారాచ యగుప్రమ్లోదయు నలకూబరనఖాంకరేఖాంకితస్తనకుంభ యగురంభయు గుణపేశి యగుసుకేశియుఁ గలమంజుఘోష యగుమంజుఘోషయు శృంగారరసరాశి యగునూర్వశియు రూపానురూపస్థానక యగుమేనకయుఁ గలికిచూపుల హేలాసందర్శితమేఖలాకలాపంబు లగువ్యాపారంబుల హాటకతులాకోటిఝళఝళత్కారమందరంబు లగుమందరగమనంబుల వికస్వరకపోలఫలకంబులగు మొలకనవ్వుల నమృతరసకూపంబు లగునాలాపంబులఁ ద్రిభువనంబులు వశీకరింతు రట్టి దేవదారువనంబునందు. 39

సీ. నందికేశ్వరు నొక్కనవశాద్వలంబున హరితాంకురములు మేయంగఁ బనిచి
ప్రమథుల నొక్కసరస్సమీపంబున లింగార్చనంబుఁ జెల్లింప నునిచి
భూతజాతము నొక్కపులినస్థలంబున నాత్మేచ్ఛ నుండంగ ననుమతించి
మాత లేడ్వురు నొక్కమణికందరంబున విశ్రామ ముండంగ వెరవు చేసి
తే. పసిఁడికొప్పెర లాతంబుఁ బచ్చకోల, జోగపట్టియ కకపాల జోలిసంచి
కలిక కాటుకగీర్బొట్టు పలుగుపేరు, జాతిగాఁ దాల్చి నెఱమిండజంగ మగుచు. 40

వ. భిక్షాటనంబునకుం జొచ్చె నప్పు డవ్వేశవాటంబునందు. 41

శా. ప్రాలేయాచలకన్యకాధిపతికిం బ్రమ్లోచమోదాఫల
స్థూలాపూపఘృతాన్వితంబుగఁ గడుందోరంబు బిచ్చంబుఁ గెం
గేలం బెట్టె నఖాంకురద్యుతులతోఁ గీల్కొంచు మాణిక్యము
ద్రాలంకారమయూఖకందళదళవ్యాపార మేపారఁగన్. 42

లే. రంభ రంభామ్రఫలసమగ్రంబు గాఁగ, నమృతదివ్యాన్న భిక్ష కామారి కొసఁగె
రాపుఁజన్నులనడుమ రారాజుపట్టి, పట్టి యెత్తిననఖరేఖ బయలుపడఁగ. 43

సీ. కనకనూపురరణత్కారనిక్వాణంబురవలి మెట్టియలతో రాయిడింప
రవయుంగరంబులరత్నాలదీప్తులు వాలారుగోళ్లపై జీలువాఱఁ
గుదురునిండినమించుగుబ్బచన్నులమీఁద ముత్యాలహారంబు మురువు సూప
గంపించు బంగారుఁగమ్మల క్రొమ్మించు నిద్దంపుఁజెక్కుల నీడ సూప



తే. నెదురుగా నల్ల నేతెంచి హేమపాత్ర, నాజ్యమధుశర్కరాఫలాద్యర్హితముగ
మదనవైరికి నర్పించె మంజుఘోష, యమృతదివ్యాన్నపాయసాహారభిక్ష. 44

శా. అక్షయ్యంబుగ దివ్యమాధుకరభిక్షాన్నంబు వడ్డించెఁ దా
గోక్షీరంబులతోడ శర్కరలతోఁ గ్రొన్నేతితోఁ దేనెతో
ద్రాక్షాదాడిమచూతపాకములతో దాక్షాయణీభర్తకున్
చక్షూరాగ మెలర్పఁగా హరిణి విశ్వాసంబుతో ముంగిటన్. 45

ఉ. అల్లనఁ జేర వచ్చి ధవళాన్నముఁ గమ్మని యానినేతితో
బెల్లముతోడ నాల్కడపుఁబేసముతోడను నిమ్మపండ్లతో
వల్లభుకూర్మి నెచ్చెలికి వారణవైరికి మంచుగొండరా
యల్లునికిం బినాకికిఁ బ్రియంబున నూర్వశి పెట్టె భిక్షమున్. 46

ఉ. పెట్టెఁ దిలోత్తమాప్సరస భిక్ష ప్రియంబున భూతభర్తకున్
గట్టెఁ బసిండి శర్కరలఖండముతోడ ఘృతంబుతోడఁ గ్రొం
బట్టుఁబసిండి సిబ్బిలపుఁబయ్యెదకొం గొకకొంత జాఱి చ
న్గట్టు లలాటలోచనునికన్నులు మూఁటికి విందు సేయఁగన్. 47

తే. సహజసౌజన్య సహజన్య శంకరునకుఁ, బొసఁగ వడ్డించెఁ దత్కాలపుణ్యభిక్ష
సారదోర్మూలకూలంకషంబులైన, వీఁగుఁబాలిండ్లు పయ్యెద వీడుకొలుప. 48

క. విశ్వచతుర్దశభువనా, ధీశ్వరునకు భక్తియుక్తి నెసకంబెసఁగన్
విశ్వాచి యనెడునచ్చర, శశ్వన్మధురాన్నభిక్ష సమ్మతిఁ బెట్టెన్. 49

తే. కనకనూపురమేఖలాకలకలంబు, రత్నకంకణరవముతో రాయిడింప
నభవునకుఁ బెట్టె మధురదివ్యాన్నభిక్ష, చిత్తభవకీర్తిశశిరేఖ చిత్రరేఖ. 50

వ. మఱియుం దక్కులేఖాంగనలు భుజంగభూషణంనకు నపొంగరంగస్థలలాస్యలంపటంబులగు కటాక్షవీక్షణంబులతోడఁ గూడ భిక్షాహారంబులు సమర్పించిరి కందర్పసూదనుండునుం బ్రతిమందిరంబునం జందనకుసుమధూపదీపాద్యుపచారంబులు గ్రహించుచు నవ్వేశవాటంబున భిక్షాటనక్రీడ సలిపి యంతం దనివిసనక కనకగర్భకపాలపాత్రం బర్ధపూర్ణంబై కరపల్లవంబున నుల్లసిల్ల నల్లనల్లన యోగపాదుకాయుగళంబు గల్లుగల్లున మ్రోఁగ మునిజనాశ్రమంబుఁ బ్రవేశించి మునిమందిరముల మోసలల నిలిచి 'భవతి భిక్షాం దేహి' యటంచు వారివాహగర్జాగంభీరస్వరంబునఁ బలుకుచుఁ గులాంగనాజనంబు నపాంగదృక్తరంగంబులం జిఱునగవు లిసిఱింతలువాఱఁ గనుంగొనుచు సంయమివధూపాతివ్రత్యభంగంబు తనకుం బరమప్రయోజనంబుగా గర్భోక్తిసందర్భంబుల నిజాభిలాషంబుఁ దేటపఱచుచుఁ బర్యటింపం దొడంగిన. 51

మ. దరహాసంబుల భ్రూలతానటనచేతన్ విభ్రమప్రౌఢిమన్
బరిహాసోక్తుల భావగర్భరససంపత్తిస్ఫుటాలోకన
స్ఫురణాభంగుల మౌనికాంతలమనంబు ల్చూఱలాడెన్ మహే
శ్వరుఁ డుద్దామవిలాసదారువనికావాటప్రదేశంబులన్. 52

సీ. సుబలమార్కండేయశునకమౌంజాయన మాండవ్యగోత్రసంభవులయిండ్ల
బకదాల్భ్యరైభ్యకభల్లకిజతుకర్ణకణ్వకుత్సాన్వయాగ్రణులయిండ్ల
ఘటజానుకాత్రేయకటకలాపసుమిత్రహరివక్త్రమునివంశధరులయిండ్ల
వాయుభక్షకభార్గవవ్యాసజైమినిశుకకపిలకులప్రసూతులిండ్ల
తే. బుణ్యగృహిణులఁ బతిభక్తిపూర్ణమతుల, భాగ్యసంపన్నలను బుత్రపౌత్రవతుల
సతుల ముత్తైదువుల నిర్విశంకవృత్తి, రజనికరఖండమౌళి విరాళి గొలిపె. 53

వ. ఇట్లు ప్రతిగృహంబున భిక్షాటనంబు సేయుచు మహోక్షలాంఛనుఁడు వాంఛానుకూలప్రకారంబునం జోరరతవ్యాపారపారాయణుండై మగలకన్ను మొఱంగి సంధ్యాసమయంబుల ననుష్ఠానార్థంబు పురుషులు సమిత్కుశఫలాహరణార్థం బెందేనిం జనినయడరు వేచి శపథశతక్షతోష్ణంబును నిరుద్ధనిశ్వాసోత్సాహంబును నివారితోల్లాసంబును నిమేషమాత్రసాధ్యంబును నిబిరీసభయకంపంబు నైనసంభోగంబు లభిలషించు నారంభోరువుల మనంబు లెఱింగి సంకేతస్థానకేళికలను నికుంజక్రోడసంవేశక్రీడలను వాతదూతీపరామర్శంబులను భ్రూలతాదేశంబులను నపాంగరంగస్థలాస్యలంపటకటాక్షవీక్షావి క్షేపంబులను మందహాసకందళితపరిస్పందంబులఁ గందర్పపరబ్రహ్మానందం బనుభవింపం జేసి మిసిమింతుండునుంగాక దేవదారుకాంతారమధ్యంబున. 54

సీ. మువ్వన్నెపులితోలు మొలదిండుగాఁ గట్టి కర్కోటకాహి బాగగ బిగించి
చిలువపోఁగులను వ్రే ల్చెవులఁ గీలన చేసి వలరాచనీరు మైఁ గలయ నలఁది
చిన్నారిపొన్నారిశిశిరాంశుఁ దలఁదాల్చి కొనగోటిజత లేడికొదమఁ బూని
పచ్చియేనికతోలుపచ్చడంబు ధరించి గిలుకుమువ్వలకోలఁ గేలఁ బట్టి
తే. పసిఁడిజలపోసనముతోడ నెసఁక మెసఁగు, బిసరుహాననుపుఱియకప్పెర ధరించి
పెద్దనడివీథి నిలుచుండి భిక్ష యడుగు, నాశ్రమంబునయందు ఖట్వాంగపాణి. 55

వ. ఇవ్విధంబున మన్మథమథనుండు మదనోన్మాదంబునం గన్నుగానక మునికళత్రంబుల
పాతివ్రత్యంబులు పొలిపుచ్చుచు విచ్చలవిడిఁ జరియింపం బూనిన నిలింపమౌనివ్రాతంబు వారివారికి నెఱింగి గుజగుజవోవుచు వంచనంబు ప్రకాశింపంజాలక లోలోన యడంచుకొని యుండుచుండ నప్పాటం బ్రతిభవనంబునఁ బాటిల్లు చీఁకటితప్పు



కప్పిపుచ్చ వెరపుపడకుండునట్లుగాఁ బ్రకాశించినఁ గట్టాయితంబై యందఱు నా జెగ జెట్టివేల్పుఱేనిం బట్టుకొనువారై చుట్టుముట్టిన. 56

క. ముసిముసినవ్వులు నవ్వుచు
మిసిమింతుఁడు గాక యొక్క మిఱుత నిలిచి య
క్కుసుమశరహరుఁడు తపసులు
కసమసఁ దనుఁబట్టుకొనఁగఁ గడగినఁ బెలుచన్. 57

* * * *
* * * *
* * * *
* * * 58

ఆశ్వాసాంతము


శా. శ్రీమద్దక్షిణకాశికాపుర మహాశ్రీకాళహస్తీశ్వర
ప్రేమాత్మోద్భవ కాలభైరవ కృపాశ్రీ వర్థితైశ్వర్య! యు
ద్దామప్రాభవ ! దానవైభవకళాధౌరేయ! హేమాచల
స్థేమా! వీరకుమారగిర్యధిపలక్ష్మీభోగభాగోచితా! 59

క. కావేరీవల్లభ! సం
భావిత బుధలోక! సమరఫల్గున ! ధరణీ
దేవార్చనాపరాయణ
కోవిద! తిరుకచ్చినంబికులజలధిశశీ! 60

మాలిని. మృగమదఘనసారోన్మేలనాసంప్రయోగ
ప్రగుణితహిమపాతప్రౌఢకేళీవిహారా!
యగురుఘుసృణపంకవ్యాప్తిగంధాంబుగంధ
స్థగితదిగవకాశా! దానవిద్యానిధీశా! 61

గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర వినయవిధేయ శ్రీనాథ

నామధేయప్రణీతం బయినహరవిలాసంబను మహాప్రబంధంబునందుఁ

బంచమాశ్వాసము.


హరవిలాసము-లింగోద్భవము