హరవిలాసము (1931)/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

షష్ఠాశ్వాసము

శ్రీవటుకనాథభైరవ
దేవశ్రీ పాదపద్మదృఢశరభక్తీ!
దేవబ్రాహ్మణసేవక
దేవప్రభుతనయ! యవచిదేవయతిప్పా! 1

వ. ఆకర్ణింపుము. 2

ఉ. హేమనగంబుమీఁద దివిజేంద్రులు గొల్వ మహావిశుద్ధము
క్తామణిరత్నసంఘటితకాంచనగండశిలాతలంబున్
హైమవతీసహాయుఁ డయి యర్ధశశాంకధరుండు దేవతా
గ్రామణి నీలకంఠుఁడు సుఖంబునఁ దాఁ గొలువుండె నర్మిలిన్. 3

వ. అప్పుడు పార్వతీదేవి మహాదేవునియింగితం బెఱింగి యి ట్లనియె. 4

తే. అభవ! నీకంఠమూలంబునందుఁ దెలిసి, కాననయ్యెడు నిదియేమి కప్పు సెప్పు
మఖిలలోకవిలోచనాహ్లాదకలన, కందమై యంద మయ్యె శృంగారరేఖ. 5

తే. ఆనతిమ్ము మహాదేవ! యభవ! నీదు, కంఠమూలము నలుపైనకారణంబు
నన్ను మన్నించి యీకారణంబు నాకు, నానతీఁ దగు నీకు లోకాభివంద్య. 6

వ. అనిన విని శంభుండు శాంభవి కి ట్లనియె. 7

మ. మును జంభాసురుబాహువిక్రమకళాముద్రావిభాభాసురున్
ఘనదంభోళినిశాతహేతినిహతిన్ ఖండించి యాఖండలుం
డనుమోదంబున దేవతల్ గొలువఁగా నైరావణారూఢుఁ డై
ఘనమార్గంబున వచ్చె నాకమునకున్ గర్వం బఖర్వంబుగన్. 8

క. ఆవేళను గంధర్వులు, కైవారపదానుసారకమనీయముగాఁ
బ్రావేశికధ్రువాగా, నావళులం బరిఢవించి రంచితలీలన్. 9

ఉ. క్రచ్చలఁ బారిజాతలతిలకావనదేవత జంభవైరిపై
మచ్చికఁ గూర్పఁగా నవసుమప్రకరంబుల వేల్పుటేఁటిలో
విచ్చినపైఁడితామరల వెంబడి వచ్చినకమ్మగాడ్పులన్
మెచ్చులరీతిఁ గోకిలసమీరణ దీవన లిచ్చె నొప్పుగన్. 10

. 

క. మందాకినీతరంగము, లాందోళము నందఁ జేయు చల్లల్లన సం
కందనునిమీఁదఁ బొలసెను, మందారలతావనాంతమందానిలముల్. 11

తే. దేవతాభర్త యమరావతీపురంబుఁ, జేరఁ జను దెంచె వేల్పులు చేరి కొలువ
భ్రాజధైరావణానేకపప్రచార, తరళమాణిక్యకుండలాభరణుఁ డగుచు. 12

వ. అయ్యవసరంబున. 13

శా. గీర్వాణాధిపుచెంగట న్నిలిచె నక్షీణప్రభావాధికాం
తర్వాణిస్తుతవాగ్విలాసుఁడు కృతద్వంద్వవ్యుదాసుండు చి
న్నిర్వాహస్థిరయోగవైభవకథానిత్యోదయోల్లాసుఁ డ
ద్దూర్వాసుండు ప్రసూనమాల్యరుచిమద్దోఃపద్మవిన్యాసుఁ డై. 14

తే. తనకుఁ బ్రమ్లోచ యను దేవతాపురంధ్రి, పావడముఁ జేసెనెద్దాని భయముతోడ
నట్టితనపారిజాతమాల్యంబు హరికి, దర్శనం బిచ్చె దీవించి తాపసుండు. 15

వ. ఇట్లు దూర్వాసుం డాశీర్వాదపూర్వకంబుగా నొసంగినకుమారపారిజాతమాల్యం బహల్యాజారుం డగుశునాసీరుండు దుర్వారవిజయగర్వాటోపంబునం గన్ను గానక పట్టితాలంకారతాటంకితలలాటం బగునైరావణకరటికుంభపీఠంబుపై నలవోకయుంబోలె వైచె వైచిన నమ్మదాంధగంధసింధురంబు వసుంధరాభరణశౌండం బగు తుండం బెత్తి నున్నని యప్పువ్వుదండఁ గ్రమ్మునఁ గ్రమ్మఱించి విసరికేసరంబులు వీసరవోవ మకరందంబు చిందఁ బొరలు విఱుగం బుప్పొడి సడలం గపోలభిత్తిభాగంబు మొత్తి యున్మత్తమధుపంబుల రేఁచి యుప్పరంబునం ద్రిప్పి చెందిరంబు ధూళిఁ దూలించి యందంద కొంతతడవు వినోదించె నప్పువుదండ వాస్తోష్పతి పట్టినయేనుంగువలన నిట్టు నట్టునుం బడి కువిటుచేతం బడినపూఁబోఁడిపోలిక బెబ్బులివాతం బడినహరిణిచందంబునఁ బ్రమత్తునికైవస మగురాజ్యలక్ష్మివిధంబున విడివడియు డస్సియుఁ గ్రుస్సియు నొగిలియుఁ బగిలియు దీనదశకు వచ్చినం గనుంగొని. 16

మ. వికటభ్రూకుటిఫాలభాగుఁడును బ్రస్వేదాంబుపూర్ణాఖిలాం
గకుఁడుం బాటలగండమండలుఁడు నై కల్పాంతసంహారరు
ద్రకఠోరాకృతి దుర్నిరీక్షుఁ డగుచున్ ధట్టించి దూర్వాసుఁ డు
గ్రకటాక్షంబున నింద్రుఁ జూచి పలికెన్ గాఢాగ్రహవ్యగ్రతన్. 17

క. ఓరి మదాంధ! యహల్యా, జార! త్రిలోకాధిరాజ్యజాత మగునహం
కారంబా యిది మమ్ముం, జీరికిఁ గైకొనక యిట్లుసేయుట యెల్లన్. 18

తే. ఏను దీవించి చేయెత్తి యిచ్చినట్టి, పుష్పమాలికనౌదలఁ బూనవైతి
హస్తిచేతికి నిచ్చితి వంతఁబోక , దండనార్హంబె యిప్పువ్వుదండ నీకు. 19

క. క్రోధం బితరులకుఁ దపో, బాధక మగుఁ గాని నాతపంబున కది యు

ద్బోధకమ సలిల మగ్నికి, బాధకమై వైద్యుతాగ్నిఁ బ్రభవించుగతిన్. 20

క. నీకనులకు నిది మాల్యం, బోకుధరవిరోధి! యింతనుండియు నిట నీ
నాకం బఖిలంబున ని, శ్శ్రీకం బగుఁ గాక నీవిజృంభణ మణఁగన్. 21

ఉ. నన్నుఁ దిరస్కరించితి మనంబున నించుక భీతిలేక వే
గన్నులఁ గాన వైతి మదగర్వవికారదురాగ్రహైకసం
పన్నుని రాజ్యలక్ష్మికి నపాయము గల్గక యుండు నెట్లు నీ
యన్నియు వస్తుజాతములు నంబుధిలోఁబడుఁగాత లక్ష్మితోన్. 22

క. ఎచ్చోట నుండు నిందిర, యచ్చోటనె యుండు సత్పదార్థంబులు నీ
యుచ్చైశ్శ్రవ మైరావణ, మచ్చర లమరద్రుమంబు లంభోధిఁ బడున్. 23

తే. అమృతకుంభంబు పడుఁగాక యబ్దియందుఁ, గామధేనువు పడుఁగాక కంధియందుఁ
దారకాధీశ్వరుండుఁ జింతామణియును, గూడ దుగ్ధాంబునిధిలోనఁ గూలుగాత. 24

వ. అని పల్కి దూర్వాసుండు చూడంజూడ నంతర్ధానంబు సేసిన. 25

క. యతిపతిశాపాక్షరములు, శతమఖున కసహ్యహృదయశల్యము లయ్యెన్
మతిఁ దలఁపఁ బూజ్యపూజా, వ్యతిక్రమము సర్వకార్యహర మగుఁ గాదే. 26

తే. మౌనిశాపాగ్నిదందహ్యమానుఁ డగుచు, విన్ననైనమొగంబుతో వీడు సొచ్చెఁ
బాకశాసనుఁ డఖిలదిక్పాలకులును, దైన్యవైవర్ణ్యవంతులై తన్నుఁ గొలువ. 27

వ. అంతం గొంతకాలంబునకు. 28

సీ. రంభాదు లగునప్సరస్సరోజాక్షులు పదునాల్గుజాతులు పడిరి వార్ధి
సంతానతరుపారిజాదికుజములు మున్నీటినీటిలో మునిఁగిపోయె
నైరావణమ్ముఁ జింతారత్నముం గూలె నుచ్చైశ్శ్రవంబుతో నుదధిలోనఁ
గామదుగ్ధేనువుఁ గాదంబరియుఁ దాను నమృతకుంభంబుతో నబ్ధిఁ బడియె
తే. నిమ్మహావస్తువులఁ గూడి యిందురేఖ, మున్నుగా దుగ్ధమయమహాంభోధిఁ జొచ్చె
బ్రహ్మమునిఘోరశాపప్రభావయుక్తిఁ, బ్రథమదిక్పాలుత్రైలోక్యభవ్యలక్ష్మి. 29

తే. దివ్యమణి లేక యప్సరస్త్రీలు లేక, యమృతకుంభాదు లగుపదార్థములు లేక
యుక్కెవడియుండె బహుకాల మొప్పుదఱిగి, విగతలక్ష్మీవిలాసుఁడై వేల్పుఱేఁడు. 30

చ. అమృతముఁ గల్పవృక్షనివహంబును లేనిసుధారసాశన
త్వమున నశోకవల్కపరిధానతయుం గలవేల్పుపెద్ద తా
నముచినిషూదనాదులు మనంబున నొందిరి ఖేదమోదదుః
ఖము గుడువంగ నోగిరము గట్టఁగఁ బుట్టముఁ బుట్టకుండుటన్. 31

వ. ఇవ్విధంబున బృందారకు లిందిరావ్యపాయంబున నపారదారిద్ర్యాంధకారమగ్నులై నగ్నాటులుం బోలి భయంపడి లేటమొగంబు వడి హాటకగర్భుపాలికిం బురందరుండు ముందఱగాఁ జని మునిశాపయుక్తి మూఁడులోకంబులరాచసిరి యబ్ధిలో మునింగినభంగి తేటతెల్లంబుగఁ దెలియంబఱచిన నానలినాసనుండు వెన్నునిం గూర్చుకొని మాసమీపమునకు వచ్చి మ మ్మిట్లు సన్నుతించె. 32

క. జయ పార్వతీమనోహర! జయ పరమానంద! జయ నిశాకరమౌళీ!
జయ భూమిసలిలపావక, వియదనలార్కేందుహోతృవిలసితమూర్తీ! 33

క. త్రిభువనభువనారంభా, రభటీసురంభమూలరత్నస్తంభా!
యభినవహిమకరరేఖా, శుభికాలంకారధామశోభితమకుటా! 34

క. దివసావసానసంధ్యా, నవపరమానందనందినాందీనాథ
వ్యవహారఝంక్రియావధి, వివిధమహాతాండవైకవిద్యాభిరతా! 35

క. తరుణహిమకిరణరేఖా, భరణా! సురనికరమకుటభాసురరత్న
స్ఫురణాపరిచయరంజిత,చరణా! నిరుపాధికాభిసంప్రతికరుణా. 36

తే. ఆజర! యవ్యయ! యనపాయ! యప్రమేయ!, యాద్య! యనవద్య! వేదవిద్యాభివంద్య!
నిర్మలాకార! నిర్ద్వంద్వ! నిరుపమాన!, నిత్య! నిజభక్తవైకుంఠ! నీలకంఠ. 37

వ. అని యనేక ప్రకారంబులం బస్తుతింప ననుకంపాపరాధీనుఁడ నగునే ని ట్లంటి. 38

తే. అబ్ధి మథియింపవలయు నీయవసరమున, నమృశలక్ష్మీప్రధానమహాపదార్థ
సముదయంబులు లేకున్న జగము లెల్ల, విన్నఁబోయిన వతిదీనవృత్తి నొంది. 39

సీ. ఆరసాతలమగ్న మయ్యు మునుంగని మందరాద్రీంద్రంబు మంథయష్టి
సర్వసర్వంసహాసంభృతిప్రవణుండు దందశూకస్వామి తరువుఁద్రాడు
చరమాంగపీఠికాస్థాపితశేషుండు కితవకచ్ఛపరాజు క్రిందిమట్టు
నింద్రాదిసురలు బలీంద్రాదిదనుజులు దర్పదుర్వారులై త్రచ్చువార
తే. లేను బ్రహ్మయు హరియును నింత నంత, నుండువారము కార్యప్రయోగరక్ష
నీవిధంబున దుగ్ధాబ్ధి యేచి తరువ, వివిధసద్వస్తులుం బ్రభవింపఁగలవు. 40

వ. ఇట్టి మహా ప్రారంభంబునకుం దగినసాధనసామగ్రి యిది. శేషుండును గమఠపతియును నశేషభువనభారంబునకుం దగినవారి నియోగించి వచ్చునది. యచ్యుతుండు సురాసురులం గూర్చుకొని మందరాచలంబు పెఱికితెచ్చునది. యేనును బితామహుండును మున్నాడి పాలమున్నీటిదరికిం జేరి యుండువారము. ఇదియ నిశ్చయం బని యే నంతర్ధానంబుఁ జేసితి. జలజాసనుండును మదాదేశంబున దుగ్ధాబ్ధితీరంబుఁ జేరె. జనార్దనుండును దేవదానవసేనాసమేతుండై దిక్పాలురుఁ గూడ రాఁ బశ్చిమదిశాముఖుండై చనువాఁడు ముందర. 41

శా. కాంచె న్మందరశైలమున్ మృదుతటీగండోపలశ్రేణికా
చంచన్నిర్జరవేణికాఘుమఘుమస్ఫాయద్దిశాగోళమున్

బంచాస్యస్ఫుటకంఠనాళనినదప్రధ్వస్తశుండాలమున్
సంచారాలసకిన్నరీశతలతాసంఛన్నహింతాలమున్. 42

వ. చనుదెంచి యప్పాంచజన్యధరుండు జంభారిప్రముఖు లగుదివిజవరుల నెడ గలుగం దొలంగ నియమించి. 43

సీ. కటిమండలంబునఁ గనకంపునునుఁజేల దృఢముగా బిగియించి దిండుగట్టి
కట్టాయితం బైనకంఠహుంకారంబు గావించె దిక్కులు గ్రక్కదలఁగ
సమధికావష్టంభసంరంభజృంభణ సమకూర్చె నిజభుజస్తంభమునకుఁ
బాదాభిఘట్టనఁ బార్శ్వదేశంబుల నదలించి ధాత్రి గ్రక్కదలఁ జేసి
తే. పట్టెఁ గదలించె నసియార్చెఁ బాఁతగల్చె, నెత్తె వక్షస్స్థలంబున నెఱియ నొత్తెఁ
దోయజాక్షుండు లోకైకదుర్ధరుండు, దాల్చె నవలీల నిట్లు మందరనగంబు. 44

సీ. అంగదాభరణంబులందుఁ గీలించిన వజ్రాలకీలన వదలకుండ
వక్షస్స్థలంబున వైచిననవకంపుఁ దులసిదండకు వాడు దోఁపకుండఁ
గడు నొప్పఁ దీర్చినకస్తూరితిలకంబు చెమటబిందులచేతఁ జెదరకుండ
నెట్టెంబు సుట్టిన నెమ్మిపించముదండ కొనలేక యొక్కింత గుదియకుండ
తే. శ్రవణకల్హారముకుళంబు జాఱకుండ, విరులకీల్కొప్పు వదలి కై పెక్కకుండ
నెత్తె శృంగారకంతుకం బెత్తినట్లు, కైటభారాతి మందరక్ష్మాధరంబు. 45

శా. గోలాంగూలకులంబు లాకులపడెన్ ఘోషించే శార్దూలముల్
జాలింబొందె లులాయముల్ సుడిగొనెన్ సారంగముల్ విచ్చె లేఁ
గోలంబుల్ బెదరెం జమూరుగణ మాక్రోశించెఁ బంచాస్యముల్
తాలాంకావరజుండు మందరమహాధాత్రీధరం బెత్తినన్. 46

తే. ఏడు పాతాళములును గగ్గోడువడియెఁ, బెల్లగించి మహీధ్రంబు పెఱికినప్పు
డిందిరాభర్త గిరిమీఁది కెత్తినపుడు, గ్రక్కదల సాగె బ్రహాండకర్పరంబు. 47

తే. ధాత్రి నాఁడు వరాహావతారవేళ, నేకదంష్ట్రాగ్రమున ధరియించినట్టి
తోయజాక్షుండు బాహాచతుష్టయమున, మాటమాత్రనె మోయఁడే మందరాద్రి. 48

లే. మందరాద్రిని మోయించి మాధవుండు, పట్టి తెప్పించె నిర్జరప్రతతిచేత
నసురయూథంబుచేత దుగ్ధాబ్ధిదరికి, నబ్జగర్భుండు నేనును నభినుతింప. 49

వ. అనంతరంబ నేనును హరిహిరణ్యగర్భులుం గార్యభారధురంధరులమై ప్రవర్తింపం బురందరాదిసురలు జలంధరాదిరాక్షసులును సముద్రమథనంబునకుం బ్రారంభించిరి. 50

తే. ఆఖిలకార్యసమారంభణాదులందుఁ, బూజనీయుండు గావున బుద్ధిఁ దలఁచి
విఘ్ననాయకు నంభోధివేలమీఁద, సురలు నసురులుఁ గొలిచిరి పరమభక్తి. 51



శా. క్షీరాంభోనిధి సైకతస్థలమున న్సింహాసనారూఢుఁగా
హేరంబు న్హరనందను న్నిలిపి ప్రత్యేకంబ దేవాసురుల్
గారామారఁగ నాచరించి రభిషేకం బుల్లసద్గంధక
స్తూరీసౌరభవాసితంబుల నదీతోయంబులం దోఁగఁగన్. 52

క. అభిషేకానంతరమున, నిభరాజాస్యునకుఁ గట్ట నిచ్చిరి యదితి
ప్రభవులును దితితనూజులు, నభినవదివ్యాంబరములు నాభరణములున్. 53

తే. కుంకుమాగురుమృగనాభిపంకములను, గంధకర్పూరనీహాగకర్దమముల
నలఁది రమరాసురులు భక్తి యతిశయిల్ల, భవునిపట్టికిఁ బసిఁడికుంభములఁ బట్టి. 54

సీ. ఉండ్రాలు నూఁబిండి పుండ్రేక్షులుం దేనె యనఁటిపండ్లుం బూరియలు ఘృతంబుఁ
బెసరుఁబప్పును బాలుఁ బెరు గోగిరంబులుఁ బాయసాన్నంబులుఁ బానకములు
నాళికేరంపుబొండాలు మీఁగడయును నవదధిపిండఖండా ల్గుడుములు
లడ్డువంబులు చక్కిలాలు మోరుండలు ఖండంబు చలిమిడి మండపప్పు
తే. లాదిగా భక్యచోష్యలేహ్యాదు లైన, బహుపదార్థంబు లర్పించి ప్రణతు లైరి
వేలుపులు రాక్షసులును నావిఘ్నపతికి, దుగ్ధపాథోధిమంథనోద్యోగవేళ. 55

వ. ఇట్లు పోడశోపచారంబులం బూజించి దేవాసురులు విఘ్ననాయకు నిట్లని స్తుతియించిరి. 56

దండకము. జయజయ జగదేకరక్షామణీ! దేవచూడామణిశ్రేణిశోణప్రభాజాలసుస్మేరపాదారవిందా! ముకుందప్రియా! యిందుధారీ! కటస్యందిదానాంబుధారాధునీధోరణీగాహకౌతూహలాయత్తమత్తద్విరేఫాంగనాగా సంగీతరంగీకృతస్వాంత! దంతావళాస్యా! నమస్యా! త్రిలోకైకవశ్యా! యవశ్యాయశైలాత్మజాధర్మసంతాన! సంతానకల్పద్రుపుష్పావతంసా! యసారోరుసంసారమాయాంధకారాహృతిప్రక్రియాభాస్కరా! కోటిభాస్వన్నిరాఘాటదేహప్రభాభాస్వరా! దేవ! హేరంబ! లంబోదరా! యేకదంతా! మహాకాయ! సంతప్తకార్తస్వరాభా! విశాలాక్ష! మౌంజీధరా! నాగయజ్జోపవీతా! సమన్వితకృష్ణాజినా! యాఖువాహా! కుఠారాయుధా! విఘ్నరాజా! గణాధ్యక్ష! కారుణ్యలీలాకటాక్షంబునన్ మమ్ము వీక్షించి రక్షింపుమీ క్షీరవారాశి నీ మందరక్ష్మాధరస్వామి కవ్వంబుగా నీభుజంగాధినాథుండు సూత్రంబుగాఁ గచ్ఛపాధీశుఁ డాధారపీఠంబుగా సర్వదివ్యౌషధీవల్లుల న్వైచి నానాపదార్థంబు లన్వెన్నలం బంచుకోఁగోరి యున్నార మిక్కార్య మేవిఘ్నముం బొందకుండంగ నేవిక్రియం జెంద కిష్టార్థసంసిద్ధులం గైకొనుం గాక నీయాజ్ఞ సర్వేశ! సర్వాత్మకా! నిర్వికల్పా! నిరీహా! నిరాతంక! నిశ్శంక! యోంకారమూర్తీ! నమస్తే నమస్తే నమః.

క. అని నిర్జరులును దైత్యులు, వననిధిమథనాదియందు వారణవక్త్రుం
గొనియాడి తత్ప్రసన్నతఁ, గనిరొగి సంతసము మీఱఁ గడఁక దలిర్పన్. 58

వ. కట్టాయితం బై సురాసురులు బిట్టేచి పాతాళగోళంబు క్రిందమట్టుగా నాదికమఠంబుఁ బెట్టి వాసుకిఁ దరిత్రాడుగాఁ జుట్టి తోఁకయు శిరంబును బట్టి మందరాచలమంథానంబున దుగ్ధసింధువు మథింపం దొడంగిరి. ఘుమఘుమధ్వానంబు దిక్కులం బిక్కటిల్లె. వారివాహవ్యూహంబులు కడ లవియఁ జదల నుదిలకొనియె. డిండీరపిండఖండంబులు బ్రహ్మాండంబునం బ్రస్తరించె. నంభస్తరంగంబులు దిగిభకుంభంబుల నాస్ఫాలించె. నావర్తచక్రంబులయందు గ్రహతారనక్షత్రంబులు తిరుగుడువడియె నప్పుడు రటత్తిమితిమింగిలంబులును లంబచ్ఛంబలంబును వళద్ధూళియు, విరుత్కమఠంబు నుద్బ్రమద్భుజంగంబునునై గంగకుం బరిభవంబును గోదావరికి భేదంబును బెన్నకు విన్నఁబాటును గాళిందికి మాలిన్యంబును వేత్రవతికిఁ ద్రాసంబును విపాశకుం గ్లేశంబును శతద్రువున కుపద్రవంబును నాపాదించుచు బాడబానలంబునం దొకతొకనుడుకునీరునుం గలసి నఖంపచంబై సంవర్తసమయారంభంబునుంబోలె మర్యాద నతిక్రమించుచు గిరికటకపాషాణసంఘట్టనంబున నెగయుమిణుంగురులుంబోలె నంతర్మణిశలాకాశకలంబులు మీఁదికెగయ నంభోనిధానంబు మధ్యమానంబయ్యె మఱియును. 59

సీ. మూలాశ్మసంఘాతములరాపిడిని జేసి కమఠంబు సుఖియించి కన్ను మోడ్చె
కటకపాషాణసంఘట్టనంబున వ్రస్సెఁ గుండలీంద్రునివీఁపుకుప్పసంబు
సానూపలద్రోణిఝలఝులత్కారంబు దిఙ్మండలంబుల దీటుకొనియె
శిఖరకోటీశిలాశ్రేణిరారాపుల గ్రహతారకములు చూర్ణంబు లయ్యెఁ
తే. బ్రబలబలగర్వదుర్వారబహుసుపర్వ, పూర్వగీర్వాణభుజదండభూరిసార
వితతమందరమంథానవివలనముల, సలిలనిధి మారె సంరంభసంభ్రమమున. 60

వ. ఇట్లు తరువందరువ సముద్రమధ్యంబున. 61

ఉ. బుగబుగమందుగర్భజలపూరము ఘూర్ణిల బంతిగట్టి క్రొం
బొగలు తరంగసంఘములఁ బొడ్మఁగ నూష్మ జగత్త్రయంబునుం
బొగులఁగఁ జేయనుద్దవిడిఁ బుట్టెను నల్లనిచిచ్చు మావిలేఁ
జిగురులచాయలం దెగడుజిహ్వలు గ్రోయుచు దుర్నిరీక్షమై. 62

క. వాసుకివిషభరవిషని,శ్వాసంబుల ఘట్టనముల సమధికతరమై
యీసాగరమధ్యంబున, భాసురహాలాహలంబు ప్రబలం బయ్యెన్. 63

చ. గరళమహత్తరానలశిఖానివహంబులు దూఱ పాఱినం
దరికొనియెం జగత్త్రయము తల్లడ మందిరి నెమ్మనంబులన్



సురుగరుడోరగామరులు స్రుక్కెఁ బితామహుఁ డంబుజాక్షుఁ డా
తురత వహించె దిక్పతులు తూలిరి ఘూర్ణిలె నేడువార్డులున్. 64

వ. అప్పుడు సుస్థిరుండై విరూపాక్షుండు త్రైలోక్యరక్షాదక్షం బగుతనదక్షిణహస్తం బెత్తి యోడకుండుఁ డభయం బిచ్చితి నని యెంత యూఱడించిన నూఱడిలక నారాయణాదులు గన న్వేల్పులు పలాయమానపరాయణు లై వెనుక మరలియుం జూడకపోవం దొడంగిన. 65

శా. హుంకారం బొనరించి యప్రతిమరౌద్రోద్రేకసంరంభని
శ్శంకాహంకృతిఁ జాఁచె నీశ్వరుఁడు హస్తంబున్ భుజంగాధిపా
లంకారంబు నశేషలోకపరిషల్లావణ్యలక్ష్మీకలా
సంకోచావహదాహభీషణవిష లాజిఘృక్షార్థమై. 66

క. స్తంభించి నిలిచె గరళము, శంభునిముందట యుగాంతజలధరముగతిన్
గంభీరహుంక్రియావ, ష్టంభసముజ్జృంభమాణసంరంభమునన్. 67

చ. జలధర మంతయై కరటిచందము గైకొని సూకరాకృతి
న్నిలిచి పికంబుతో దొరసి నేరెడుపండును బోలె నుండయై
కలశపయోధిమంథనముఖంబునఁ బుట్టినయమ్మహాహలా
హలము క్రమంబున న్శివునిహస్తసరోరుహ మెక్కెఁ జుక్కగన్. 68

క. కటుక మగువిషము విషధర, కటకం బగుకేలఁ బూని కౌతూహలియై
ఘుటికాసంసిద్ధుఁడు రస, ఘుటికయునుంబోలె మృడుఁడు గుటుకున మింగెన్. 69

తే. కంఠికానీలరత్నంబుకరణి నొప్పె, లలితమృగనాభిపంకంబు చెలువు దాల్చెఁ
గాలకూటవిషంబు తత్కంఠమునకు, నాభరణ మయ్యె బ్రహ్లాదు లభినుతింప. 70

వ. అప్పు డప్పరమేశ్వరు నిట్లని స్తుతియించిరి. 71

సీ. జయ విరూపాక్ష! యీశ్వర! దివ్యలోచన! జయ వజ్రహస్త! దిశానివాస!
జయ పినాకేష్వాస! శాశ్వత! నిత్య! యనిత్య! నిత్యానిత్య! నిరుపమాన !
జయ చింత్య! జయ రుద్ర ! జయ మహాదేవ! యచింత్య ! చింత్యాచింత్య! చిత్స్వరూప!
జయ పాదభక్తార్తిసంహారకారణ! జయ ముకుందప్రియ! జయ గిరీశ!
తే. దివసమాసార్ధమాససద్విశ్వరూప!, కల్పయుగవత్సరాధీనకాలఖేచ
రుండ! బహురూప! చండీశ ! దండపాణి!, జయ నమస్తే నమస్తే ప్రసన్నమూ ర్తీ! 72

వ. అని యనేకప్రకారంబులం బ్రస్తుతించి నీలకంఠుం డనునామధేయంబు శివుని కిచ్చి రిది కాలకూటోత్పత్తిప్రకారంబు. 73

ఉ. హాలహలాగ్నిదాహభయ మస్తమితం బయినం గడంకమై
వేలుపులు న్నిశాచరులు వెండియుఁ గవ్వపుఁగొండ వార్ధిలోఁ

దేలిచి గుమ్ముగుమ్మనఁగఁ ద్రిప్పఁగఁ జొచ్చిరి దానవేశ్వరుల్
వారిసహాయుఁ గాఁ గొని యవక్రభుజాబలవిక్రమంబునన్. 74

క. తరిగొండఁ దరువఁదరువన్, శరనిధిమధ్యమున నొక్క జలజము పుట్టెన్
బరిమళపరంపరలచే, సురభీకృత మయ్యె జగము సురుచిరభంగిన్. 75

వ. అయ్యష్టదళపద్మమునందు. 76

సీ. ఇరు ప్రక్కియలనుండి సురసింధురంబులు పరిపూర్ణహేమకుంభములు దాల్ప
నందంద నవనిధానాధిదేవతలును సొరిది బంగారువీచోపు లిడఁగ
జయజయధ్వనులతో సర్వదేవతలును గేలుఁదమ్ములు మౌళిఁ గీలుకొల్పఁ
బుష్పవర్షములకుఁ బ్రోది యై వినువీథి దేవదుందుభినాద మావహిల్లఁ
తే. బ్రబలి మున్నీటినడునీటఁ బాండువికచ, కమలకాంచనకర్లికాగ్రంబునందు
బ్రహ్మదిక్పాలవందితపాదపద్మ, పద్మ యుదయించెఁ గన్నులపండు వగుచు. 77

తే. పవడములఁ బోలు శ్రీహస్తపల్లవములు, దనర శోభిల్లు హేమపద్మము ధరించి
కలిమిచూపులపూఁబోఁడి కలశజలధి, నర్థిఁ గొలు వుండె రత్నసింహాసనమున. 78

క. జలరుహవాసిని పుట్టిన, కలితముహూర్తమున రెండుగడియలమాత్రం
జలిగురికాఁడై నిగనిగ, కలువలచెలికాఁడు పుట్టెఁ గలశపయోధిన్! 79

వ. తదనంతరంబ. 80

క. అందంద యుద్భవించెను, సందరమున నిందిరానుసంజాతములై
మందారకల్పతరుహరి, చందనసంతానపారిజాతాదు లొగిన్. 81

ఉ. ఆంతఁ బయోనిధానమునయం దుదయించె సరోజవాసినీ
కాంతకుఁ దోడఁబుట్టు వనఁగాఁ గరపద్మమునం జలూకికా
సంతతియున్ హరీతకియు సాధనసంగ్రహ మై తలిర్ప ధ
న్వంతరి యెట్టిరోగములవారికి నామయసౌఖ్యకారియై. 82

తే. ఆదివైద్యుఁ డతండు దుగ్ధాబ్ధిఁ బుట్టె, నమృతపూర్ణకుంభం బొకహస్తమునను
నంబుచరమును గరకకాయయును నొకటఁ, దాల్చి సాకారమైన శాంతమయుఁ డనఁగ. 84

వ. మఱియును. 85

క. అచ్చపువెన్నెలచాయల, మెచ్చనితనుదీప్తితోడ మేఘధ్వని పెం
పచ్చుపడఁగ సకిలించుచు, నుచ్చైశ్శ్రవ ముదధినడుమ నుదయంబయ్యెన్. 85

తే. క్షీరవారాశిలో నవతారమయ్యెఁ, దార యనుకన్యకయు నతిధవళనయన
తారకారాజబింబావదాతవదన, తారహారాదిభూషణోత్కరముతోడ. 86

శా. అయ్యంభోనిధివారిగర్భమునయం దైరావణం బుద్భవం
బయ్యెం గండతలంబునన్ దొరఁగుదానాంభఃప్రవాహంబు లెం



దొయ్యొయ్యన్ బ్రభవించి తజ్జలధినీ రుబ్బింప దిక్సంధుల
న్వియ్యం బందఁ గఠోరగర్జితమహానిర్ఘాతనిర్దోషముల్. 87

సీ. మధుకరంబులు పుట్టె మధుకరంబులు గావు రమణీయవేణీభరములు గాని
శశిబింబములు పుట్టె శశిబింబములు గావు మహితవక్త్రేందుబింబములు గాని
మెఱఁగుఁదీఁగలు వుట్టె మెఱుఁగుఁదీఁగలు గావు లలితకోమలతనూలతలు గాని
చక్రవాకులు వుట్టెఁ జక్రవాకులు గావు కఠినంబు లగుచన్నుఁగవలు గాని
తే. యనఁగ మందరకందరవ్యాప్తిచలిత, వార్ధికల్లోలవీచికావర్తతతుల
నుద్భవిల్లిరి రంభాతిలోత్తమాదు, లప్పరస్స్త్రీలు దేవవేశ్యాజనములు. 88

క. తరిగొండఁ దరువఁదరువం, దిరుగుడువడునుదధిలోనఁ దీవ్రముగా ది
ర్దిరఁ దిరుగుచుఁ దరఁగలవడి, దరతరమ సుపర్వసురభి దరికిం జేరెన్. 89

ఉ. అంత న్విద్రుమవల్లరీకిసలయవ్యాప్తైకశంకావహా
త్యంతస్వచ్ఛరుచిచ్ఛటల్ జలధిపై నందంద వర్తింపఁగా
స్వాంతాశాంతరభూమిభాగమున విశ్వంబుం బ్రకాశింపఁగాఁ
జింతారత్నశలాక పుట్టెను మహాక్షీరాబ్ధిమధ్యంబునన్. 90

తే. తరువఁ దరువంగ వార్ధిమధ్యంబునందు, నాగవల్లీలతాప్రతానంబు పుట్టె
నమృతసంసర్గమునఁ గదా యాఱునెలలు, జరగు నేయాకునకు లేనిసరసవృత్తి. 91

క. శీతలపరిమళధారా, పాతపవిత్రాయమానపవమానం బై
యాతోయధిమధ్యంబున, శ్రీతులసీవనము పుట్టె శ్రీయంశమునన్. 92

తే. కలిగె దివ్యౌషధీలతావలులశక్తిఁ, బాలమున్నీటినీటిలోఁ బ్రథితలీల
విమలగారుడమాణిక్యవిభ్రమంబు, లభినవంబులు హరితదూర్వాంకురములు. 93

వ. ఇట్లు మహార్ణవజాతంబు లగుపదార్థంబులు గనుంగొని బ్రహ్మాదిదేవతలు హరునకు శశాంకుని హరికి లక్ష్మి నింద్రునకు నైరావణోచ్చైశ్రవంబులను నిచ్చిరి. అప్సరసల నాకంబున నుండ నియమించిరి. కామధేనువును వరుణున కొప్పనంబు సేసిరి. కల్పతరుచింతామణుల నందనోద్యానంబునం బ్రతిష్ఠించిరి. దూర్వాంకురంబులు హేరంబున కవతంసంబుగా నొసంగిరి. నాగవల్లీదళంబులు భోగార్థంబుగా భూజనంబుల కిడిరి. శ్రీతులసికావనంబులును సకలతీర్థంబులకు సమాశ్రయంబుఁ గావించిరి. యనంతరంబ మందరంబును యథాస్థానంబునం బెట్టి వాసుకిం బాతాళంబున కనిచి కమఠపతిం గుస్తరించి నివాసంబులకుం బోవ నుద్యోగించి యున్నంత. 94

ఉ. అంధకకాలకేయమహిషాదులు దైత్యులు బాహుశైలద
ర్పాంధులు గూడి యొక్కమొగ మై వడిఁ దొమ్మి యొనర్చి వైద్యు ని



ర్బంధము సేసి కైకొనిరి గ్రక్కునఁ దన్మహనీయదక్షిణ
స్కంధముమీఁద నున్నమణికమ్రసుధారసహేమకుంభమున్. 95

తే. అమృతకుంభంబుఁ గైకొని యసురవరులు, వేఱ యొకచోట వేలంబు విఱిసియుండి
రమరులకు నీక యప్పదార్థముఁ గడంగి, తార విభజించి భుజియించువారుఁ బోలె. 96

వ. అవ్విధం బెఱింగి హరవిరించులు విష్ణు రావించి గోత్రకలహంబు మాన్ప నిఖిలమాయోపాయవిద్యావిదుండ వగు నీవ యెఱుంగుదు మాకు నిం కిక్కడ నుండం బని లేదు పోయివచ్చెద మని యామంత్రణంబు సేసి నిజస్థానంబుల కరిగినయనంతరంబ. 97

తే. కైటభారాతి యక్కార్యగతికిఁ దగిన, యనువు చింతించి యసురుల నవమతింప
సురల కమృతంబు నొప్పింప వెరవు దెలిసి, యరిగె నంతర్హితుం డయి యద్భుతముగ. 98

వ. ఇవ్విధంబున హరి యంతర్ధానంబు చేసిన ముహూర్తమాత్రంబున. 99

శా.ఆకాశంబుననుండి డిగ్గె నొకనీరాంభోజపత్రాక్షి ది
వ్యాకారంబును దివ్యమాల్యములు దివ్యాలంకృతు ల్దివ్యవ
స్త్రాకల్పంబులు దివ్యగంధములు నాహా పుట్టఁ జేయంగ నా
కౌకశ్శ్రేణికి దైత్యపఙ్క్తికిని విద్యుల్లేఖచందంబునన్. 100

క. బృందారకపథమున దిగి, యిందీవరపత్రనేత్ర యిరువంకలవా
రుం దమక తమక యిటు రా, యిం దనంగా రెండువీళ్ళయెడమున విడిసెన్. 101

వ. నిలిచి హావభావవిలాసంబులన దేవాసురులం భ్రమియింపం జేయుచు స్కంధావారమధ్యంబున. 102

సీ. పాకశాసనునకుఁ బరిహాసవచనంబుఁ గాలకేయునకు శృంగారలీల
వైవస్వతునకు భూవల్లరీనటనంబు కరటిదానవునకుఁ గలికిచూపు
పాశపాణికిఁ గుచప్రాంతోరుదర్శనం బంధకాసురునకు నలఁతినగవు
ధననాయకునకు నుత్కంఠావిశేషంబు మహిషునకును నర్మమర్మకలన
తే. గంధవహునకు సిగ్గు జలంధరునకుఁ, గలికితనము బావకునకుఁ గౌను బలికి
వలపు నటియించుచును వారవార తనకుఁ, దాన వారికి వారికి నైనయట్లు. 103

తే. అందఱను బ్రమవెట్టుచు నవ్వధూటి, యెవ్వరికిఁ దాను బ్రమయక యెడనయుండె
దానిపై వాలి చొక్కె నందఱమనములు, గంధఫలిమీఁద వాలు భృంగములపగిది. 104

తే. అసురులకు దేవతలకు నయ్యవసరమునఁ, బాలుపోకుండె నప్పు డప్పద్మనయన
యుభయవాదులు గూడి యయ్యుత్పలాక్షి, పాదపంకజములకును బట్టులైరి. 105

వ. మఱియు విష్ణుమాయావిశేషంబున. 106

క. ఇది చెప్పినట్ల చేయుదు, మిది పంచినయట్ల నడతు మిది కళ్యాణా
భ్యుదయనిధానము మాకని, హృదయంబులఁ దలఁచుచుండి రిరు దెసవారల్. 107



తే. కనకసింహాసనము వెట్టి కాళ్లు గడిగి, పాదతీర్థంబు లొగిఁ ద్రావి ప్రణతి సేసి
కొలిచి కూర్చుండి రిరువంకకొలమువారు, భువనమోహిని యైనయప్పువ్వుఁబోఁడి. 108

క. ఎవ్వనివంకఁ గనుంగొను, నవ్వనితామణివిలోచనాంచలమున వాఁ
డవ్వేళన కీలించు, న్మవ్వం బగుకేలుదోయి మకుటాగ్రమునన్. 109

వ. వైరాగ్యానుబంధంబు లుడిగి యియ్యిరువాగువారుం దమలోన ని ట్లనిరి. 110

క. మన మొండొరు నమ్మక యెడ, నునిచినయీయమృత మింతయును దగ నింకే
మని యొండుగాఁ దలఁప కీ, వనితామణి పంచిపెట్టవలయుం జుండీ. 111

వ. అని యమృతకలశంబుఁ దెచ్చి యప్పయోజాక్షిచేతి కిచ్చి ధర్మంబు పుణ్యంబు పాపంబు నీయది యిరుదెఱంగులవారు నీకు నొక్కరూప యిప్పదార్థంబు మాకు బంచిపెట్టుము. 112

తే. తప్పకుండఁగఁ బక్షపాతంబు లేక, పంచిపెట్టెడువా రబ్బరంచుఁ గాక
యన్నదమ్ముల మైయుండి యకట మేము, నిన్ను వడ్డించుమందుమె యన్నుమిన్న. 113

తే. అనిన నే నేర్తు నయ్య నీయంతవారు, కోరి కూర్చుండ నమృతంబుఁ గుడువఁబెట్టఁ
బంచి వడ్డింప నేర్చు టల్పంపుఁబనియె, తొల్లి యొకనాఁ డెఱింగినత్రోవగాదు. 114

వ. అయిన మీవచనంబులు చెఱపంజాల నా నేర్చినవిధంబున సుధారసంబు వడ్డించెద మీరందఱుఁ గృతస్నానులై పయోధిపులినవేదికాస్థలంబున నిరుదెఱంగులవారును రెండుబంతులుగాఁ గూర్చుండుఁ డని నియోగించిన. 115

తే. వార లట్ల చేసి వరుసగాఁ గూర్చుండి, పసిఁడిపళ్లెరములు పన్నికొనఁగ
నల్ల నల్ల వచ్చే నలసయానంబున, నమృతకుంభహస్త యగుచుఁ దరుణి. 116

మ. అరవిందానన పట్టుఁబుట్టముచెఱం గాందోళనం బొంద ని
ర్భరపీనస్తనభార మల్లఁ గదలన్ రత్నాలతాటంకము
ల్మెరయ న్నూపురమేఖలావలయముల్ మ్రోయంగ పాత్రంబుల
న్సురధేన్వాజ్యము త్రస్తరింపఁ దొడఁగె న్దూర్వాంకురాగ్రంబునన్. 117

ఉ. స్నానపవిత్రగాత్రులును చందనచర్చితబాహుమధ్యముల్
మానసమాధినిష్ఠులును మత్సరచిత్తులు నై మహాసమా
ధానముతోడ ను త్తరము దక్షిణము న్సముపాశ్రయించి య
ద్దానవులు స్సుపర్వులును దన్నుఁ బ్రియంబుగఁ జూచుచుండఁగన్. 118

తే. మధురగోక్షీరధారాసమాన మైన, మంచియమృతంబు వెట్టె వైమానికులకు
మగువ మృగతృష్ణికాంభస్సమాన మైన, కల్లయమృతంబు వడ్డించెఁ గర్భురులకు. 119

వ. ఇవ్విధంబున నప్పరమాణుమధ్య తథ్యమిథ్యామృతాహారంబు లాసురాసురులకు వెట్టి కామదుగ్ధేనుఘృతధారాభిఘారంబు గావించి పంక్తిమధ్యంబున నిలచి కంకణఝణ ఝణత్కారంబు తోరంబుగా నాపోశనంబు వోసి యారగింపుండు ప్రొద్దువోయె ననుచు నెలుంగెత్తి మత్తకోకిలకంఠకుహూపంచమస్వరంబునం బల్కిన. 120

తే. మొదలఁ దేనియలుట్టునంభోరుహాక్షి, ముద్దుఁబల్కులు శ్రుతిపుటంబుల భుజించి
పిదప భుజియింపఁ దొడఁగిరి త్రిదశవరులు, దైత్యులును దథ్యమిథ్యాసుధారసములు. 121

క. కిక్కురుమన కమృతంబుం, గ్రుక్కలు పెట్టుదురు సురలు కోణపముఖ్యుల్
తక్కరిసుధారసంబులు, గ్రుక్కలు వెట్టుదురు వారిఁ గూడియె తారున్. 122

తే. గ్రుక్కగ్రుక్కకుఁ గడుఁదేజ మెక్కుచుండె
నమరులకు గ్రుక్కగ్రుక్కకు నడఁగుచుండె
దైత్యులకుఁ దేజ మట్టివిధంబు గాక
రాహుకేతువు లనియెడురాత్రిచరులు. 123

వ. తమయెదిరిపంక్తి నున్నచంద్రార్కులసంగడి నొఱంగి కూర్చుండిన నాగ్రహరాజు లిద్దఱుం దమలోన నిట్లని విచారించిరి. 124

ఉ. వంచన వేల్పుటెంకి కిటువచ్చి యుపాంతమునందు ముందటం
గంచముఁ బెట్టుకొన్న యది కర్బురయుగ్మము మాఱువెట్ట నే
తెంచుచు నున్నవాఁడు మనదేవర విష్ణుఁడు వెంట నీరి సూ
చించుట మే ల్సుధారసము చిప్పెఁడువోయకమున్న శౌరికిన్. 125

తే. అని విచారించి చెప్పనున్నంతలోనఁ, బోసె నిరుగంచములయందుఁ బుడిసెఁడంత
త్రావియును ద్రావకుండఁగ రాహుకేతు, లనుచుఁ జెప్పిరి మురవైరి కర్కవిధులు. 126

మ. అటు విన్నప్పుడ తత్సుధారసము కంఠాధఃప్రదేశంబు సొ
చ్చుట లేకుండఁగ రాహుకేతువుల యక్షుద్రోత్తమాంగంబు లొ
క్కట ఖండించెను మాయపుంబడఁతియాకారంబు వీడ్కోక య
క్కటకాలంకృతహస్తచక్రమున శ్రీకాంతుం డవిభ్రాంతుఁడై. 127

క. రాహునకుఁ గేతునకు హరి, బాహాచక్రమున నదరు పాటిల్లుటయున్
హాహానినాదపటుకో, లాహలబహుళంబుగాఁ గలంగిరి దివిజుల్. 128

సీ. వేగ మాయావధూవేషంబు డిగఁద్రావి కైకొనె నిజమూర్తి కైటభారి
హరి తమ్ము వంచించె సరివేళ గాదని దైత్యులు చనిరి పాతాళమునకు
నమృతంబు భుజియించి యమృతకుంభముఁ గొంచు జనిరి వేల్పులు నిజస్థానమునకు
బహువారములయందు బహువస్తువులు గాంచి కలశపాథోరాశి కాను పుడిగె
తే. నుక్కెవడి యున్కిమానిపెల్లుబ్బె నాక, మప్సరఃకామినీతురంగాదికముల
నచ్యుతుఁడు లచ్చి నటఁ బెండ్లియాడి యరిగె, నాగరిపు నెక్కి వైకుంఠనగరమునకు. 129

క. ఈవార్ధిమథనకథనం, బేవారు పఠించిరేని నెలమియు నాయు



శ్శ్రీవృద్ధులఁ గాంతురు వి, ద్యావత్తయు యశము గల్గు నావారలకున్. 130

శా. శంకాతంకవిహీనవిక్రమకలాసాకల్యవిజ్ఞాన! సా
హంకారోరువివేకవిశ్రమ! సురాహారాహితస్పర్దిని
స్సంకాశోజ్జ్వలకీర్తివిభ్రమ! మహీసంకల్పకల్పద్రుమా!
లంకాశంకరశైలమధ్యవసుధాలంకారభవ్యక్రమా! 131

క. శరణాగతదీపంజర!, నరకుంజర! దానకర్ణ! నందితవిద్వ
ద్వరవర్ణ! విమలచరిత, స్ఫురితా! యనవరతశంభుపూజాని తా! 132

ఉపేంద్రవజ్రము. కులప్రదీపా! యలఘుప్రతాపా!
విలాసశక్రా! జితవీరచక్రా!
కలాజయంతా! ఘనకాంతికాంతా!
నిలీనశంకా! నిజనిష్కలంకా! 133

గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్త్ర వినయవిధేయ శ్రీనాథ
నామధేయప్రణీతం బయినహరవిలాసం బనుమహాప్రబంధంబునందు
షష్ఠాశ్వాసము.