హరవిలాసము (1931)/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక.

శ్లో. ఇదమన్ధం తమః కృత్స్నం జాయేత భువనత్రయమ్,
   యది శబ్దాహ్వయం జ్యోతిరాసంసారం న దీప్యతే.

అజ్ఞానగాఢాంధతమఃపటలంబుఁ బటాపంచలుసేసి ముల్లోకంబులందు విశుద్దదివ్యజ్ఞాన తేజఃపుంజంబు వెలయించి సకలపదార్ధస్వరూపంబు నిరూపింప నసాధారణం బగుసాధనంబు శబ్దజ్యోతి.

ఇయ్యది నిత్య మై దోషరహిత మై పరమానందరసైకాస్పద మై పరబ్రహాత్మకం బనఁదగి యున్నది.

ఋగాదిచతుర్వేదంబులును, శిక్షాదిషడంగంబులును, మన్వాద్యష్ఠాదశస్మృతులును, శాతాతపాద్యష్టాదశాగమములును, విష్ణ్వాద్యష్టాదశపురాణములును, వాయవ్యాద్యష్టాదశోపపురాణములును, భాష్యాదిషడ్దర్శనంబులును, భారతాదీతిహాసంబులును, దక్కుంగలసకలశాస్త్రంబులు నీశబ్దబ్రహ్మముదివ్యావతారంబులు. ఈ శబ్దబ్రహ్మము నుపాసించియే మనపూర్వాచార్యు లగువ్యాసపరాశరాది మహర్షిసత్తములు దివ్యానందరసైకాశ్రయం బగు మోక్షమార్గము నెఱింగి కృతకృత్యులైరి.

ఇట్టి పరమోపకారకం బగుశబ్దం బిహపరసుఖానందకందం బని నొక్కి వక్కాణించుట సాహసంబు గాదు. కానిచో నీవృత్తతర్షులై యరణ్యంబుల వాతాంబుపర్ణాశను లగుమహర్షులుగూడ, శ్రీరామాయణాదిదివ్యప్రబంధంబుల రచించి రేయియుం బవలు నాశబ్దసుథాప్రవాహమధ్యంబున మునుఁగుచుం దేలుచు నేల యుందురు? దివ్యప్రబంధకవితామృతరసానుభవంబువలనఁ దాము నిత్యానందంబు నొందుటయెకాక భావివిబుధులు పఠితలును శ్రోతలును విషయవైలక్షణ్యము లెఱింగి యుత్కృష్టపదవి నొందుమార్గము గనుఁగొందురుగాత యనియె మహర్షుల ముఖ్యోద్దేశము.

అట్టిమహానుభావు లగుఋషిపుంగవులగ్రంథములు కేవలము భావగర్భములును, బరోక్షమోక్షానందమును బొందించునవియు నగు టచేఁ బ్రతిమనుజునకుఁ దొలుదొలుత సామాన్యముగా వానియందుఁ బవృత్తిగలుగుట దుర్లభము. కాఁబట్టియే ప్రాచీనులగుమహర్షులసంప్రదాయము నెఱింగినవారు గావున నర్వాచీను లగుకాళిదాసాదిమహాకవులు సయితము రామాయణాది కావ్యరత్నంబుల వెలుంగుదివ్యకవితారసంబుఁ గ్రోలిక్రోలి మహానందంబునొందుచుఁ దనివిసనక, యందఱు నిట్టికావ్యానందంబు ననుభవింతురు గాత మని దయాపరవశులై సులభముగ నామహర్షి కృతిరత్నంబుల రసానుభవంబుఁ జేయఁదగిన యోగ్యత నలవఱుచునవియు నించుమించుగఁ బ్రాచీనర్షికృతుల ననుకరించు రఘువంశశాకుంతలకాదంబర్యాదిప్రబంధంబుల లోకోపకారకంబులుగ రచించి కవితారసమాధుర్యం బేకాంతంబున ననుభవించి నిత్యతృప్తహృదయులై కీర్తిశేషు లైరి.

సంస్కృత భాషావిలాస మిట్లుండ సంస్కృతజన్యము లగుకర్ణాట ద్రావిడాది వైకృతదేశభాషలలోపల “దేశభాషలందుఁ దెలుఁగు లెస్స” యను పండిత వచనానుసరణిగ నుత్తమభాష నాఁబడు నాంధ్రభాషయందుఁగూడ ననేకులు నన్నయభట్ట తిక్కనాది మహాకవిసార్వభౌములు కావ్యరత్నంబుల లోకంబున వెలయించి యభిరూపశిఖామణులహృదయంబుల నలరించి కీర్తిశేషులై నెలకొనియున్నారు. కాఁబట్టి యిట్టియాంధ్రభాషాకవుల దివ్యచారిత్రసుధారసమును గ్రోలి యానందానుభవము సేయుట యవశ్యకర్తవ్యమయినందునఁ బ్రకృత మీహరవిలాసప్రబంధనిర్మాత యగుమనశ్రీనాథునిచారిత్రామృత మించుక చవి చూతము.

శ్రీనాథుఁడు

అనవద్యహృద్యకావ్యకల్పనాధురీణుం డగుమహాకవిసార్వభౌమ్యుడు. ఈమహాకవి జన్మస్థానమునుగుఱించి కాశీఖండములో.

సీ. "చిన్నారిపొన్నారిచిఱుతకూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర
    నూనూఁగుమీసాలనూత్నయౌవనమున శాలివాహనసప్తశతి నొడివితి
    సంకరించితి నిండుజవ్వనంబునయందు హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ
    భ్రౌడనిర్భరవయఃపరిపాకమునఁ గొని యాడితి భీమనాయకుని మహిమఁ

బ్రాయ మింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
గాశికాఖండ మనుమహాగ్రంథ మేను
దెనుఁగుఁ జేసెదఁ గర్ణాటదేశకటక
పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని.”

--పద్యమునందు “కర్ణాటకటక పద్మవనహేళి” (కర్ణాటదేశపట్టణము --కమలములకు సూర్యుఁడు) అను విశేషణమును శ్రీనాథుఁడు దనకుఁ కూర్చుకొనియున్నందునను.

భీమేశ్వరఖండములో.

"ప్రౌడ పరికింప సంస్కృతభాష యండ్రు
పలుకునుడికారమున నాంధ్రభాషయందు
రెవ్వరేమన్న నండ్రు నా కేమి కొఱత
నా కవిత్వంబు నిజము కర్ణాటభాష.”

-- పద్యములో “నాకవిత్వంబు నిజము కర్ణాటభాష” యని తనకుఁ కర్ణాటభాషయందుఁ గల ప్రేమను సూచించియున్నందునను.-

ఆభీమఖండములోనే.-

"కనకక్ష్మాధరధీరు వారిధితటీకాల్పట్టణాధీశ్వరు౯
ఘనునిం బద్మపురాణసంగ్రహకళాకావ్యప్రబంధాధిఫు౯
వినమజ్జ్యాంతరసార్వభౌము: గవితావిద్యాధరుం గొల్తు నా
యనుఁగుందాతఁ బ్రదాత శ్రీకమలనాభామాత్య చూడామణిన్.”

--పద్యమునందు శ్రీనాథునిపితామహుడును బద్మపురాణగ్రంథ నిర్మాణాలంకర్మీణుఁడును కవితావిద్యాధురంధరుండును నగుకమలనాభామాత్యగ్రామణి పశ్చిమసముద్రతీరమునఁ గర్ణాటదేశములోఁ జేరిన కాల్పట్టమునకుఁ బ్రభువుగా నున్నట్లు చెప్పియున్నందునను.

శ్రీనాథుని వీధినాటకములో-

"కుళ్ళాయుంచితిఁ గోక సుట్టితి మహాకూర్బాసముం దొడ్గితి౯
వెల్లుల్లి౯ దిలపిష్టము౯ బిసికితి౯ విశ్వస్త వడ్డింపఁగాఁ
జల్లాయంబలి త్రావితి౯ రుచులు దోసంబంచుఁ బోనాడితి౯
దల్లీ! కన్నడరాజ్యలక్ష్మి! దయ లేదా నేను శ్రీనాథుఁడన్."

-- పద్యమునఁ " దల్లీ! ” యని కర్ణాటదేశమును సంబోధించినందునను ఈతని కవిత్వమునం బ్రాయికముగాఁ గన్నడపదములు గనఁబడుచున్నందునను -

శ్రీనాథుని జన్మస్థానము కర్ణాటదేశమనుట సమంజస మనియు నీతఁడు కర్ణాటదేశమున జన్మించినను శైశవముననే యీతని తలిదండ్రు లుద్యోగవశముననో మఱియు నేకారణముననో కొండవీటిసీమకు వచ్చి యుందురనియు నింటిలోఁ దలిదండ్రులతో మిశ్రకర్ణాటము మాట్లాడుచున్నను బాల్యమునుండి తెలుఁగుదేశములోఁ దెలుఁగువారితోఁ గలసిమెలసి యున్నందుసఁ దెలుఁగువానివలెఁ దోఁచుచున్నాఁ డనియుఁ బల్నాటివీరచరిత్రపీఠికాకారులవాదము.

ఈ వాదమునకుఁ బ్రతికోరు ననుసరించి యాంధ్రులచరిత్ర మూఁడవభాగములో "కర్ణాటకటకపద్మవనహేళి" అసు విశేషణము కర్ణాటదేశాధిశుని (దేవరాయల) నిండోలగంబునఁ బాండిత్యశౌండీర్యంబున నుద్దండుఁ డగుడిండిమభట్టారకు నోడించి ప్రభుపండితసమ్మానపూర్వకంబుగఁ గవిసార్వభౌమబిరుదమున నలరారుటయ కాక యక్కవిసూర్యుఁడు కర్ణాటరాజధాని (యందలి విబుధరాజి) యనుకమలవనమునకు సూర్యుఁడై యుండెనను నభిప్రాయమునఁ దనకుఁ గూర్చుకొనియెఁ గాని కర్ణాటదేశాభిమానమునం గాదనియు,

"నాకవిత్వంబు నిజము కర్ణాటభాష” అనుపద్యము రాజమహేంద్రవరాధీశుమంత్రి బెండపూడియన్నయామాత్యునకుఁ గృతి యిచ్చిన భీముఖండములోనిదిగాన కోమటి వేమభూపాలుమరణానంతరము కొండవీటిరాజ్యము కర్ణాటాధీనము గాఁగా శ్రీనాథుఁ డన్నామాత్యుబాంధవ్యమును బట్టి రాజమహేంద్రవరమున కేతెంచి తద్రాజాస్థానకవీశ్వరుఁడుగ నున్న కాలమగుటచేఁ గాకతీయరాజ్య మంతరించినపిదప నాంధ్రదేశమున దక్షిణభాగము (పాకనాటిసీమవఱకుఁ గలదేశము) కర్ణాటరాజ్య మనఁ బరఁగుచున్నందున నచ్చటివాఁడగు శ్రీనాథుని గుఱించి రాజమహేంద్రవరపుంగవులు కొంద ఱీతని కవిత్వము సంస్కృతమనియుఁ గొందఱు కన్నడమనియు వంకలుపెట్ట “నెవ్వరేమన్న నండ్రు నాకేమికొఱఁత, నాకవిత్వంబు నిజము కర్ణాటభాష" యని యుత్తరము చెప్పియుండు ననియు, "తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మి!” యనుకర్ణాటదేశ మాతృసంబోధసము తన కాశ్రయులగు కొండవీటిరెడ్లు, రాజమహేంద్రవరపురెడ్లు, తెలుఁగురాయఁడు, మైలారిరెడ్డి మున్నగువారు స్వర్గస్థులయినపిదకు వార్ధక్యములోఁ గన్నడరాజ్యమున కేగినపు డాకాలస్థితినిబట్టి వారు తన్నాదరింపకుండఁగ "తల్లీ! దయలేదా? నేను డిండిమభట్టారకు నోడించిన శ్రీనాథుఁడ” నని తన్నెఱుకపఱుచుకొని యుండచ్చుననియు,

“కాల్పట్టణాధీశ్వరున్” అనుచో నాకాల్పట్టణము కర్ణాటరాజ్యములోని దైనట్లు నిదర్శనములు లేనందున నాయుక్తి విశ్వాసపాత్రము గాదనియు నిట్లు పైకారణముల ఖండించి శ్రీనాథుఁడు పాకనాఁడు జన్మస్థానముగాఁ గలయాంధ్రుఁడని చెప్పఁబడియున్నది.

ఈయుభయవాదహేతువులందును బలవత్తరమగువినిగమనము గనఁబడక పోయినను మఱికొన్ని కారణములవలనను జనశ్రుతివలనను నాంధ్రచరిత్రకారుల యభిప్రాయమే సమంజస మని తోఁచుచున్నది.

ఇద్దాని కుపబలముగా శ్రీనాథుని బంధువు లందఱు నాంధ్రదేశములోని యాంధ్రులుగనే యున్నారు. కాని కర్ణాటకుఁ డొక్కరుఁడైన నున్నట్లు తెలియఁబడదు.

నాచికేతోపాఖ్యానమును రచించి యుదయగిరిదుర్గాధీశుఁడగు చిట్టి గంగామాత్యునకుఁ గృతియిచ్చిన దగ్గుపల్లి దుగ్గయామాత్యుఁడు శ్రీనాథునిభార్యకుఁ దోఁబుట్టువు. శ్రీనాథునకు శిష్యుఁడు. ఈ గ్రంథమును ఓరియంటల్ లైబ్రరిలో నేఁ జదివియున్నాఁడను. ప్రౌఢముగా రసవంతముగానే యున్నది.

రాజమహేంద్రవరాధిపతి యగువీరభద్రభూపాలునిమంత్రి బెండపూడి యన్నామాత్యుఁడు.—

"వినిపించినాఁడవు. వేమభూపాలున, కఖిలపురాణవిద్యాగమములు
....... ....... ........ ........ ....... ........

పాకనాటింటివాఁడవు బాంధవుఁడవు
కమలనాభునిమనుమఁడ వమలమతివి
నాకుఁ గృపసేయు మొకప్రబంధంబు నీవు
కలితగుణధన్య శ్రీనాథకవివరేణ్య."

అని పలికె నని భీమఖండమున శ్రీనాథుఁడే వచించియున్నాఁడు. ఇందు “కమలనాభునిమనుమఁడ” వనియుఁ బేర్కొనినందున శ్రీనాథుఁడే కాక యితనితాత యగుకమలనాభుఁడు గూడ నన్నయమంత్రికిఁ జుట్టమని తేటపడుచున్నది.

మఱియు నాంధ్రభాగవతము రచించి శ్రీరాముని కర్పణముసేసిన భాగవతోత్తముఁడగు బమ్మెర పోతరాజునకును శ్రీనాథునకును సంబంధించిన శిష్టపరంపరాగతము లగుగాథలను బట్టి చూడఁ గొన్నిగాథలు సత్యాసత్యములుగ నున్నను వేంకటగిరివంశావళివలన సర్వజ్ఞ సింగమనాయనికాలములో నీకవులు సమకాలికులుగ నున్నట్లు తెలియుచున్నందునఁ గింవదంతి కనుకూలముగ నుభయులు బావమఱఁదులు నై యుండ వచ్చును గదా!

ఇఁకఁ గవిత్వములోఁ గన్నడపదములు ప్రాయికములుగాఁ గనఁబడుచున్న వనుటకుఁ దిక్కన సోమన మున్నగువారి కవిత్వమునఁ గూడఁ గలవు. కావున వారిం గర్ణాటులని యనఁదగదు గదా! ఒక వేళ శ్రీనాథుఁడు కర్ణాటదేశీయుఁడై యా దేశభాషయందుఁ బ్రేమగలిగినవాఁడైన నెన్నియో కర్ణాటగ్రంథముల రచింపకుండునా! ఏదీ యొక పద్యమయినం గానరాదే?

ఇంతియకాక యీతనితాత కమలనాభుఁడు పద్మపురాణముఁ దెనిగించె ననుటవలన నీతనివంశ మాంధ్రవంశమనియు నితనిదేశభాష లాంధ్రదేశభాషలనియును దృఢపడుచున్నవి. తద్‌జ్ఞులు ప్రమాణము. శ్రీనాథుఁ డాంధ్రకర్ణాటులలో నెవ్వం డైనను గవితామాధురికి లోపము గల్గదు గదా!

శ్రీనాథుఁడు పాకనాటి నియోగిబ్రాహ్మణుఁడు, భారద్వాజసగోత్రుఁడు, ఆపస్తంబసూత్త్రుఁడు, కమలనాభునిపౌత్త్రుఁడు, మారనకు భీమమకుఁ బుత్త్రుఁడు. ఈ విషయము హరవిలాసము పీఠికలోని "కమలనాభునిపౌత్త్రు" అను 8 వ పద్యమువలన స్పష్టము.

ఇక్కవిసార్వభౌమునివలననే కొండవీటిరెడ్లు, రాజమహేంద్రవరపురెడ్లు వన్నె కెక్కిరి. ఈ కవీంద్రుఁడు జీవించి యుండుకాలముం . .. గుఱించి విచారణీయాంశము లనేకము లున్నను విస్తరభీతీచే సంగ్రహముగ వివరించెద.

శ్రీనాథుఁడు శ్రీ శ. 1397 సం. మొ. 1422 సం. వఱకు రాజ్యము చేసిన ఫిరోజిషా కాలమునను 1382 సం. మొ. 1399 సం. వఱకు రాజ్యమొనర్చిన కుమారిగిరి వసంతభూపాలు కాలమునను, 1379 సం. మొ. 1401 సం. వఱకు కర్ణాటసింహాసనాధిష్ఠితుఁడైన హరిహరరాయల కాలమునను, 1422 సం. మొ. 1435 సం. వఱకు కల్బరిగ రాజ్యమును బాలించిన యహమ్మదుషా కాలమునను, అల్లాడభూపతి పుత్త్రులును, 1426 సం. మొ. 1450 సం. వఱకు రాజ్యముఁ బాలించిన వేమారెడ్డి - వీరభద్రారెడ్లకాలమున నున్న ట్లీకవిగ్రంథములవలనఁ దెలియుచున్నది. ఈవీరభద్రారెడ్డియు వేమారెడ్డియు మరణించిన పిదపఁ గొంతకాలమునకుఁ గృష్ణాతీరములోని బొడ్డుపల్లె యనునొక గ్రామమును గుత్తచేసి నదీప్రవాహమునఁ బైరుగొట్టుకొనిపోఁగా రాజునకు గుత్తధనముఁ జెల్లింపలేక వారిచేఁ బలుబాధల నొంది యవసానకాలమున మిక్కిలి బీదతన మనుభవించెనని మెకన్జీదొర యుదాహరించిన స్థానికచరిత్రలోని శ్రీనాథకృతము లగు నీరెండు పద్యములవలనఁ దెల్లమగుచున్నది.

సీ. “కవిరాజుకంఠంబుఁ గౌఁగిలించెను గదా పురవీథి నెదురెండఁ పొగడదండ
    సార్వభౌమునిభుజాస్తంభ మెక్కెను గదా నగరివాకిటనుండు నల్లగుండు
    ఆంధ్రనైషధకర్తయంఘ్రియుగ్మమ్మునఁ దగిలి యుండెను గదా నిగళయుగము
    వీరభద్రారెడ్డివిద్వాంసుముంజేత వియ్యమందెను గదా వెదురుగొడియ

తే. కృష్ణవేణమ్మ కొనిపోయె నింతఫలము, బిల బిలాక్షులు దినిపోయెఁ దిలలు పెసలు
   బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి, నెట్లు చెల్లింతు టంకంబు లేడునూర్లు.

సీ. కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి రత్నాంబరంబు లేరాయఁ డిచ్చుఁ
   గైలాసగిరిఁ బండె మైలారువిభుఁ డేగి దినవెచ్చ మేరాజు తీర్పఁగలఁడు
   రంభఁ గూడెఁ దెనుంగురాయరాహుత్తుండు కస్తురి కేరాజుఁ బ్రస్తుతింతు
   స్వర్గస్థుఁ డయ్యె విస్సనమంత్రి మఱి హేమపాత్రాన్న మెవ్వనిపంక్తిఁ గలదు

తే. భాస్కరుఁడు మున్నె దేవునిపాలి కరిగెఁ, గలియుగంబున నిఁకనుండఁ గష్టమనుచు
   దివిజకవివరుగుండియల్ దిగ్గురనఁగ, నరుగుచున్నాఁడు శ్రీనాథుఁ డమరపురికి.

పైకారణములఁబట్టి శ్రీనాథుఁడు క్రీ. శ. 1384 సం. ప్రాంతమున జన్మించి 1455 సం ప్రాంతమువఱకు 70 సంవత్సరములు జీవించియుండవచ్చునని యూహింపవలసియున్నది.

మహారాజాస్థానముల గవిసార్వభౌముఁడై మహాభోగముల ననుభవించినవాఁడయ్యును నవసానదశయందు బలుకష్టములపా లగుట యౌవనదశలో శృంగారనాయకుఁ డయి స్త్రీలోలుడై విశృంఖలప్రవృత్తిచే ధనమెల్ల వెచ్చవెట్టి దేహమును సైతము చెఱచుకొన్న పాపపుఫలముగాని యన్యముగాదని కొంద ఱందురు.

శ్రీనాథుఁడు లాక్షణికోత్తముఁ డగుమహాకవి. ఈకవిబ్రహ్మ కావ్యప్రపంచకల్పనాచాతుర్య మవాఙ్మానసగోచరము. వర్ణనాసందర్భముల నర్థగంభీరము లగుమృదుపదముల బొందుపఱచి రసమును విడనాడక మనోహరంబుగఁ గవనమల్లు ననల్పకౌశల మీతని కలవడినట్లు మఱియొక్కకవి కలవడలేదు. "కాశీఖండ మయఃపిండం నైషధం విద్వ దౌషధమ్' అని కొనియాడఁబడు నీ రెండుగ్రంథముల భాషాంతరీకరణములవలననే యీ కవిపాండిత్య మనర్గళ మని తెల్లము గాఁగలదు. ఈతనికవిత్వము మొత్తముమీఁద సంస్కృతపదభూయిష్ఠమై మనోహరమైయుండును. లోకములో నాంధ్రభాషాసాహితిఁ బడయఁగోరు విద్యార్థులు శ్రీనాథుని గ్రంథములఁ జక్కఁగఁ జదివిన మఱియొక గ్రంథముఁ జదువవలసిన పనియుండదనియే నానమ్మకము.

ఇతడు మహాకవియై యుండియుఁ బారలౌకికచింతమై భగవంతున కొక కృతియైన నీక తనగ్రంథములన్నియు నర్థలోభమున మనుజుల కిచ్చుట చూడ నెంతయు విచిత్రముగ నున్నది.

ఈయన పండితారాధ్యచరిత్ర, మరుత్తరాడ్చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగారనైషధము, భీమఖండము, కాశీఖండము, హరవిలాసము, నంధనందనశతకము - అనుగ్రంథముల రచించి జగద్విఖ్యాతిఁ బడసెను. పల్నాటివీరచరిత్రమునుగూడ రచించినట్లు చెప్పఁబడియున్నది. కాని ప్రాసము లేనియట్టి తక్కిరిబిక్కిరి ద్విపదకవిత్వ మల్లియుండునా యని సంశయము ఉండిన నుండుగాక వీథినాటకము గూడ నీకక్ష్యలోనిదే.

ఈగ్రంథములలో బండితారాధ్యచరిత్రమును వేమారెడ్డిసేనానాయకుఁడగు మామిడి ప్రెగడయ్యకును, నైషధము నాతనితమ్ముఁడగు సింగనమంత్రికిని, భీమేశ్వరఖండమును వీరభద్రారెడ్డి మంత్రియగు బెండపూడి యన్నయ్యకును, కాశీఖండమును వీరభద్రారెడ్డికి నంకితము చేసెను ఈ గ్రంథముల పౌర్వాపర్యములను విచారింప కాశీఖండములోని

‘చిన్నారిపొన్నారిచిఱుతకూఁకటినాఁడు రచియించితిని మరుద్రాట్చరిత్ర’

అను పద్యమువలనను, శృంగారనైషధములోని---

“క. జగము నుతింపఁగఁ జెప్పితి, ప్రెగడయ్యకు, నాయనుంగుఁ బెద్దనకుఁ, గృతుల్
నిగమార్థసారసంగ్రహ, మగు నా యారాధ్యచరిత మాదిగఁ బెక్కుల్.”

అను పద్యమువలనను. జిన్ననాఁటినుండి మహాకవియై 18 సం. వయస్సున మరుత్తరాట్చరిత్రయు, 20 సం. న శాలివాహనసప్తశతియు, 21 సం. న పండితారాధ్యచరిత్రయు, 30-31 సం.ల శృంగారనైషధమును, 40 సం. న భీమఖండమును, 44 సం. న కాశికాఖండమును రచించియుండునని తోఁచుచున్నది.

హరవిలాసము.

ఇది 7 ఆశ్వాసముల ప్రబంధము. పైగ్రంథములలో నెయ్యెడ నిది పేర్కొనబడనందున గాశికాఖండమునకు బిదప రచించె ననవలసియున్నది. అన్ని గ్రంథములకన్న స్వాభావికమగుకవితాశైలియు నీవిషయమునే బలపఱుచుచున్నది. ఇయ్యది క్రీ. శ. 1370 సం. మొ 1391 సం. వఱకుఁ గొండవీటిసీమఁ బాలించిన వేమారెడ్డి కాలములో బాలుఁడై వేమారెడ్డిపుత్రుం డనపోతరెడ్డి సేనాధిపతియై యుద్ధములో మడియుటచే నాతనియనంతరముననే రాజ్యమునకు వచ్చిన కొమరగిరి భూపాలుని సుగంధద్రవ్యభాండాగారాధ్యక్షుఁడైన యవచి తిప్పసెట్టి కంకిత మీఁబడినది. హరవిలాసములో నీతడు 'మంటి బహువత్సరంబులు’ అని చెప్పుకొనుటచేఁ గృతినందునాఁటికి 65 సం. వయసువాఁడైయుం డును. ఇతనికి బాల్యసఖుఁడగు శ్రీనాథుఁడును 50 సం. వయసువాఁడై యుండును.

తిప్పసెట్టి వైశ్యుఁడు (బేరిసెట్టి) తండ్రి దేవయసెట్టి. తల్లి మాచమ్మ. జామిసెట్టి, తిరుమలనాథసెట్టియుఁ దమ్ములు. భార్య అన్నమ్మ, మాచన, విశ్వనాథుఁడు, చినమల్లన కుమారులు. ఇతనికిఁ ద్రిపురారియను సంస్కృతనామము గలదు. ఈతనివంశచరిత్రమంతయు హరవిలాసపీఠికవలనం దేటపడుచున్నది.

ఈ కావ్యమునందు 1,2 ఆశ్వాసముల సిరియాళచరిత్రమును, 3, 4 ఆ గౌరీకల్యాణమును, 5-వ ఆ. పార్వతీపరమేశ్వరులదారుకావిహారంబును, 6-వ ఆ. హాలాహలభక్షణంబును, 7-వ ఆ. కిరాతార్జునీయమును వర్ణింబడినవి. 5-వ యాశ్వాసముతుదిఁ గొన్నిపద్యము లశ్లీలములుగ నుండుటచే విడువంబడినవి. పూర్వకవిసంప్రదాయానుసారముగ నితరగ్రంథముల నుభయభాషాకవిస్తుతి చేయఁబడియున్నను నిందు కవిస్తుతి కాని కుకువినింద గాని చేయఁబడమికి కారణము దెలియదు. ఇయ్యది నైషధాదులవలె సంస్కృతపదప్రచురము గాక సమసంస్కృతాంధ్రపదవిలసితమై రసభావాలంకృతంబై యలరారుచున్నది. నైషధకాశీఖండములవలె సంపూర్ణసంస్కృతగ్రంథభాషాంతరీకరణము గాదుకాని యిందలిగౌరీకల్యాణము కాళిదాసకుమారసంభవమున కాంధ్రీకరణముగానే యున్నది స్థాలీపులాకన్యాయంబుగ నుదాహరించెద.

శ్లో."కా మేకపత్నీవ్రతదుఃఖశీలాం లోలం మనశ్చారుతయా ప్రవిష్టామ్,
నితంబినీ మిచ్ఛపి ముక్తలజ్జాం కంఠేస్వయంగ్రాహవిషక్బాతబాహుం. కుమా. సర్గ 3 శ్లో.7.

తే. ఏకభర్తృవ్రతస్థయై యేలతాంగి, నీకుఁ జేయాడుధర్మంబు నిలువరించె
నది వినిర్ముక్తలజ్జయై యమరరాజుఁ, జేయుఁ గాత స్వయంగ్రహాశ్లేషణంబ. హర. ఆ-3. ప-45.

శ్లో. కయా౽పి కామిన్ సురతాపరాధా త్పాదానతః కోపనయా౽వధూతః,
తస్యాం కరిష్యామి దృఢానుతాపం ప్రవాళళయ్యాశరణం శరీరం. కుమా. సర్గ-3. శ్లో-8

ఆ. ప్రణయకోపప్రశాంతికై పాదపతితు, నిన్ను నేపువుఁబోఁడి మన్నింపదయ్యె
నాలతాంగిఁ బ్రవాళశయ్యాశరణ్య, దేహఁ గావింతు విడువు సందేహ మింద్ర. హర. ఆ-3. ప-46

శ్లో. స్థితాః క్షణం పక్ష్మసు తాడితాధరాః పయోధరోత్సేధనిపాతచూర్ణితాః,
   వలీషు తస్యాః స్ఖలితాః ప్రపేదిరే చిరేణ నాభిం ప్రథమోదబిందవః. - కుమార. సర్గ-5. శ్లో.21,

వ.వర్షాకాలంబునఁ బక్ష్మపాళీక్షణస్థితంబులును దాడితాధరంబులును బయోధరోత్సేధనిపాతచూర్ణితంబులును, ద్రివళీక్షణస్ఖలితంబులును, నాభిగహ్వరప్రవిష్టంబులునగు జలధరజలబిందుధారలం దోఁగియు.- హర. ఆ-4 ప-14

శ్లో. దివం యది ప్రార్థయసే వృథా శ్రమః వితుః ప్రదేశాస్తవ దేవభూమయః,
అథోపయంతార మలం సమాధినా న రత్న మన్విష్యతి మృగ్యతే హి తత్ - కుమార. సర్గ. 3. శ్లో. 45.

వ. దేవలోకనివాసంబున కాసపడెదేని నది వృథాశ్రమంబు. నీ పుట్టినిల్లు దేవభూమియకదా? తగినవరునిం గామించి సమాధి వహించితి వేని నదియు నీకుం దగదు రత్నం బొరునిచే నన్వేషింపఁబడుఁగాని యొరు నన్వేషించునే? - హర. ఆ-5. ప.25.

ఇట్లే దారుకావనవిహారము, హాలాహలభక్షణము, కిరాతార్జునీయము ప్రాయికముగా భారవికృతినుండియుఁ దక్కినకథలు పురాణములనుండియు గ్రహింపఁబడినవి. అచ్చటచ్చట నౌచితికిఁ దగినట్లు చంకదుడ్డును శరణార్జి, (ఆ-6. ప-1) మున్నగులోకోక్తుల నిమిడ్చి యున్నాఁడు. చాగు, ఉక్కెవడి, గగ్గోడువడు, చాయగోసులు, కుండవర్ధనములు, తోరహత్తము, గజ్జులాఁడు మున్నగు క్రొత్త పదములఁ బెక్కింటిఁ బ్రయోగించి యున్నాడు. 'వాగ్వీవాదము. (ఆ. 4.ప 70.) అంతర్వాణీసంస్తూయమాన, (పీఠిక. ప. 34)'యనుప్రామాదిక ప్రయోగములు గనఁబడుచున్నవి. 6-వ యాశ్వాసము 5,6 పద్యము లేకార్థబోధకములై పునరుక్తములుగ నున్నవి.

ఇ ట్లేదోషములున్నను నల్పజ్ఞు లగులేఖకులవియై యుండును గాని సకలశాస్త్రపారంగతుఁడును మహాకవిసార్వభౌముఁ డగు శ్రీనాథునివై యుండవు. ఇట్టి జగత్ప్రసిద్ధంబగు ప్రౌఢపండితకవికవితామతల్లిం గుఱించి శాఖాచంక్రమణ మనవసరంబ కాఁ దలంచి యింతటితో విరమించుచున్నాఁడను.

శ్రీమా౯, ఉత్పల వేంకటనరసింహాచార్యః.