హంసవింశతి/ఏడవరాత్రి కథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తద్దయుఁగల్గు సొమ్ములు గళమ్మునఁ జొక్కపుఁజుక్క యొప్పఁగా
ముద్దియవచ్చి హంసమణి ముందర నిల్చె, నృపాభిలాషయై. 175

క. నిలిచిన యా హేమావతి
బొలిచిన కరుణామృతంపు భూవితరోక్తుల్
పొలయఁగ దృష్టిఁ గనుంగొని
తలచిన పని కపుడు హంసధరణిపుఁ డనియెన్. 176

ఏడవరాత్రి కథ

కంసాలి కోమలి ధూర్తుఁడను శిష్యునిఁ గూడుట.

క. “మున్నొక్క పట్టణమ్మున
సొన్నారి మిటారి నేర్పు శూరత్వముఁ గై
కొన్నదియై నడచిన కథ
చెన్నుగ విని పొమ్ము, కడు విచిత్రము కొమ్మా!" 177

తే. అనినఁ జిఱునవ్వు నవ్వి యయ్యంబుజాక్షి
“యేమి చిత్రంబుఁ గల్పించి తింతలోన
శీఘ్రముగఁజెప్పి దయచేసి సెల వొసంగు
మరిగెదను రాజుపొందున" కనిన నపుడు. 178

క. కాదంబవంశ వల్లభుఁ
“డాదృతిని బరాకులేక , యక్కరొ! వినవే!
మోదముతో "నని చెప్పెను
మేదుర మాధుర్యసాధు మేధాఫణితిన్. 179

క. విను మనఁగాననఁగా నిల
ఘనమణివర మనెడు పురము గలదొకటి వినూ
తనకేతన పట జాత ప
వనహత సురసురత ఘర్మవన వారంబై. 180

చ. కమటము కట్లసంచి యొరగల్లును గత్తెర సుత్తె చీర్ణముల్
ధమనియు శ్రావణంబు మొలత్రాసును బట్టెడ నీరుకారు శా
ణము పటకారు మూస బలునాణె పరీక్షలమచ్చు లాదిగా
నమరఁగ భద్రకారక సమాహ్వయుఁ డొండొకఁ డుండు నప్పురిన్. 181

చ. కరఁగను బోఁతఁజోయఁగను గ్రాఁచి కదించను గమ్మిఁ దీయఁగా
నొరయఁగ వన్నియల్ మిగులనుండఁగఁ జూపఁగఁ బూదెగట్ట రే
కఱుఁగఁగఁ దీయఁ జెక్కఁగను నచ్చున వ్రేయఁగ సుద్దగించఁగా
సొరిది విచిత్ర చిత్రములు సొమ్ములు సేయ నతండు నేరిచెన్. 182

క. కంతు వసంత జయంతుల
సంతసమున గెలువఁజాలు సౌందర్యమునన్
సంతత సంపద్గరిమఁ గృ
తాంత జిదాప్తుని జయించు నతఁడు శుభాంగీ! 183

వ. మఱియు నా భద్రకారకు దుకాణంబు నాడీ ప్రచురంబు గావున శరీరంబును, శుక్రాంగారప్రశస్తంబు గావున నక్షత్రమండలంబును, గుంభతులాదిసహితంబు గావున రాశికూటంబును, గాంగేయశిక్ష గలిగినది గావున శిఖండిభండనంబును, మధూచ్ఛిష్టసంయోగంబు గావున యవననివాసంబును, వప్రోన్నతంబు గావున మహాపురంబును, మూషికావృతంబు గావున శూన్యాలయంబును, దీక్షసాధనయుక్తంబు గావున యుద్ధరంగంబును, శ్రావణయోగంబు గావున వర్షాకాలంబు ననుకరించు. 184

తే. ఆతని వధూటి శుకఘోటి నలరుమేటి
యొడయఁ డేలేటి సీమాటి యొఱపు గోటి
కొన నెగయ మీటి యిదియేటి కులు కనేటి
పోటి కెదిరేటి శుభవాడి నీటు మెఱయు. 185

తే. దాని కచ కుచ గళ లక్ష్మిఁ బూనఁ దలఁచి
నీల శైలాబ్దములు మ్రోల నిలిచి నపుడె

కసవు కట్టెలు నీళ్లును గడఁగి మోయఁ
జేసె నేమనవచ్చు నచ్చలువ చెలువు. 136

క. కుందనపు రవలు గుప్పెడు
తుందిలపుం జన్నుఁ గవయుఁదొల (?) తేనెలకున్
విందు లొనరించు పలుకులు
జందురునిం బోలు మోము సకియకె యమరున్. 187

క. కువలయ మా కనుఁగవ జిగి
కువలయ మా వలుఁద పిఱుఁదు కుచకాఠిన్యం
బవలయ మా మోహన తా
ర వలయ మా నఖము లనఁగ రమణి రహించున్. 188

మ. కచశోభా గరిమంబు నెన్నడుము సైకంబున్ మధుప్రాయమౌ
వచన వ్యూహము లోచనాబ్జముల ధావళ్యంబు శృంగార వ
త్కుచకుంభమ్ముల పొంకమున్ ముఖకళాంకూర ప్రభావంబు న
య్యచలశ్రోణికిఁ గాక, యే సకియలం దైనం బ్రవరిల్లునే! 189

సీ. కుప్పె రాగిడిబిళ్ల కుంకుమరేఖ పా
పటబొట్టు కమ్మలు బావిలీలు
లలి సూర్య చంద్రవంకలు సూసకము కెంపు
రవల పల్లెరుఁబూవు రావిరేక
బుగడలు నానుఁగ్రోవులు దీఁగ మెడనూలు
కుతికంటు సరిపెణ గుండ్లపేరు
సరిగె ముక్కర బన్నసరము నుత్తండాలు
కంకణంబులు కట్లు కడియములును
తే. సందిదండలు నొడ్డాణ మందమైన
ముద్రికలు హంసకంబులు మ్రోయుగజ్జె
లలరు బొబ్బిలికాయలు గిలుకు మట్టె
లాది యగు సొమ్ముఁ దాల్చి య య్యబల మెఱయు. 190క. దాని నెగాదిగఁ జూడని
మానవునిన్ దాని పొందు మదిలో నెపుడుం
బూని తలంపని పురుషునిఁ
గానము త్రిభువనములందుఁ గలవారలలోన్. 191

క. ఆ శుభవాటి మనోహర
పేశల తర మృదుల వాక్య పృథు మాధురికై
యాశపడి మార భూతా
వేశమునఁ జరించు వీటి విటయూథమ్ముల్. 192

శా. నీవీబంధముఁ జక్కదిద్దు? నెఱివేణిన్ లెస్సఁ గైసేయుఁ గె
మ్మోవిన్ జిల్కు దరస్మితంబు, జిగిచూపు ల్వాఱఁగాఁ జూచుచుం
గ్రేవల్ గన్పడఁ జేయు, నెచ్చెలియతోఁ గేల్కేల దట్టించి, వా
చావైచిత్రిని ముచ్చటాడు సకి, తన జారుల్ విలోకింపఁగన్. 193

తే. ఇటుల మదమెత్తి తమిచేత నేపురేఁగి
తిరుగు నవ్వీటఁ గల్గిన ధీర విటుల
పొందునకు నాసపడి పోవ సందులేక
కుందుచుండును విరహార్తిఁ జెంది యెపుడు. 194

వ. అంత. 195

మ. చిగురుంగత్తి వజీరు మాఱుపఱుపన్ జెన్నొందు నొయ్యారపున్
సొగసుంబ్రాయము గల్గువాఁ డొకఁడు మేల్సొన్నారి ధూర్తాఖ్యచేఁ
దగఁ బెంపొందినవాఁడు శిల్పఘనశాస్త్రప్రక్రియ న్నేర్వఁగాఁ
దెగువ న్నిల్చెను భద్రకారునకు నంతేవాసియై వేడుకన్. 196

క. వాని కుశలత్వ సంపద
వాని మనోహారి రూప వర వైభవమున్
వాని ఘన బుద్ధిఁ జూచి య
హీనకరుణ నింటనిల్పి హిత మలరారన్. 197తే. కీర్తికై భద్రకారుఁ డా ధూర్తునకుఁ ద
నింటనే యన్నవస్త్రాదు లిడుచుఁ గల్గు
పనులు నేర్పుచు నుండంగ భక్తి మీఱ
నలఘుశుశ్రూష సేయుచు నాతఁ డుండె. 198

క. కందువ మాటల బెళుకుల
మందస్మిత రుచిర వచన మాధురి చేతన్
దుందుడుకుఁ జెంద ధూర్తుని
డెందముఁ గరఁగించి చెలి ఘటించెను రతికిన్. 199

తే. ఎడతెగని మోహ మూరించి యేపు రేఁపి,
వేశ్మమున నొంటిపాటైన వేళలందు
మదన కదనంబునకుఁ జాల మరులు కొనఁగఁ
జేసె శుభవాటి ధూర్తుని చిత్తమలర. 200

చ. అలయక భద్రకారుఁడు గృహంబున నుండిన యప్పుడెల్ల వే
డ్కలఁ బను లభ్యసించుచుఁ దడంబడ కాతఁడు లేనివేళలం
జెలఁగుచు వాని భార్యకడఁ జేరి మనోభవకేళికాక్రియల్
తొలఁగక యభ్యసించు శశితుల్యుఁడు ధూర్తసమాఖ్యుఁ డున్నతిన్. 201

తే. స్నానపానాన్నవస్త్రాదిసంగ్రహంబు
భద్రకారుఁడు సెలవిచ్చెఁ బనికి మెచ్చి
వాని చెలువంబునకు మెచ్చి వలచినపుడు
చాల శుభవాటి సెలవిచ్చె సంగమంబు. 202

క. ఈ తీరు సకలభోగము
లాతతగతి నడచుచుండ నా ధూరాఖ్యుం డా
తలిరుఁగత్తి గల దొర
చేతి కటారికిని సడ్డ సేయక యుండెన్. 203వ. అయ్యవసరంబున. 204

ఉ. ఆదర మొప్ప నొక్క దివసాంతమునందు దుకాణమున్ బహి
ర్వేదిని భద్రకారుఁ డమరించుక ధూర్తునిఁ జూచి మిద్దెలో
బోదియమీఁద నున్న తుల పొందుగ వే కొని రమ్మటంచు స
మ్మోదముతోడ నంపఁగ సముద్రగభీరుఁడు పోయి చూడఁగన్. 205

తే. వాని యొయ్యార మొక వింత యైన నపుడు
చూచి వలరాజు రాజ్యంబు చూఱఁ గొనఁగఁ
దలచి శుభవాటి ధూర్తుతోఁ దారసిల్లి
తలుపు గదియించి రతికేళి సలుపుచుండె. 206

క. చెన్నారి చుంబనంబులఁ
జిన్నారివగల్ వినోదచేష్టలుఁ జిన్నెల్
గన్నారఁ జూపి యపుడా
సొన్నారి మిటారి ధూర్తు సురతులఁ గరఁచెన్. 207

క. ఈ లీల మదనకదనా
లోలత్వముఁ బూని యింటిలోపల ధూర్తుం
డాలస్యం బొనరించిన
దాలిమి చెడి భద్రకారధన్యుఁడు చింతన్. 208

చ. తడసె నదేమొ ధూర్తుఁ డల దర్పకుఁ బోలినవాఁడు భార్యయుం
గడు రతిఁబోలు రూపుసిరి గల్గిన జవ్వని యేమి ద్రోహమున్
గడిమి నొనర్చిరో యనుచుఁ గాలటు నిల్వక వచ్చి గట్టిగా
గడెనిడు తల్పుఁ జూచి ఘనగర్జితభాషలఁ బిల్చె శిష్యునిన్. 209

తే. అప్పు డాజాయ యేచాయ నధిపు మదికి
హితముగా బొంకవలయునో యెఱుఁగు మనుచు
హంస మడిగిన దరహాస మలర మోము
వంచి హేమవతీ సాధ్వి యంచ కనియె. 210క. ఒకరొకరి బుద్ధి యెట్లో
యకటా! తెలియంగ బ్రహ్మకైనను వశమా?
కికురించక యిది నీవే
యకుటిలగతి నుడువు మనిన హంసం బనియెన్. 211

మ. విను హేమావతి! భద్రకారుఁ డటకున్ వేగంబుగా వచ్చి శి
ష్యునిఁ బిల్వన్ భయమంది వాఁడు జనితాస్తోకవ్యథన్ గుంద నా
తని భీతిల్లకు మంచుఁ జెప్పి తుల సూత్రంబుల్ వడిన్ ద్రెంచి వై
చి నిరాఘాటత నేఁగి వాకిలి సడల్చెన్ నాయకున్ దూఱుచున్. 212

వ. అట్లు వాకిలిఁ దీసి భర్తతో మఱియు నిట్లనియె. 218

చ. "తులఁ గొని తేను మంచి గుణధుర్యునిఁ బంపితి రౌను మీరలుం
బిలిచినఁ జూడవత్తుఁగద! భీతిని దారములన్ని త్రెంచి యీ
తలుపు గదించి సూత్రములు త్రాసునఁ గూర్చుచునున్న వాఁ డిసీ!
పలువ మఱెంత నేర్ప" రని భర్తకుఁ జూపి దురుక్తు లాడినన్. 214

తే. "ఎంత లే దింతె కద! దీని కిట్టు లనకు
తానె పోయెను గాక చేఁ దప్పి పోవ
నేమి సేయుదు?" మని ధూర్తు నితర మనక
డెందమున సందియ మొకింత చెంద కపుడు. 215

క. ఎప్పటివలె నుండి విభుం
డప్పగిదిన సూక్ష్మబుద్ధి నారయవలె నో
యొప్పులకుప్పా! నీ వని
చెప్పఁగ హాసంబు ముదముఁ జెలువము దోపన్. 216

క. ఆవేళ శిరఃకంపము
గావించి యయారె! యని చొకాటంబగు కే
ళీవాసముఁ జేరెను హే
మావతి, నపమోహమగ్నమానస యగుచున్. 217

మ. కనదృక్షాలయమౌ మహాబిలమునన్ గన్పట్టు భాస్వచ్ఛమం
త నవానర్ఘమణిం దటిన్యధిప సత్రాజిత్తునిం జేర్చెనో
మును దాఁ గైకొని కాల కృష్ణుఁడన నంభోజాప్తుఁ డప్పశ్చిమాం
బునిధిం జేరెఁ దదబ్జనాభరుచినాఁ బొల్పొందెఁ గ్రొంజీఁకటుల్. 218

వ. అయ్యవసరంబున. 219

సీ. విటమనోధృతి శిలావిచ్ఛేదతాటంక
తాటంకమణికాంతితతులు వెలుఁగఁ
బల్లవమానసపటుధైర్యహారక
హారకళాస్తోమ మౌఘళింపఁ
గమనహృద్దార్థ్యాబ్జగణశీతకంకణ
కంకణాంగదములు ఘల్లు రనఁగ
జారాత్మదృఢతాసమీరాహిసంతాన
సంతానకుసుమవాసనలు వొలయ
తే. యువజనస్వాంతకాఠిన్యదవసమీర
బంధుఘనసారఘనసారగంధసార
సౌరభోదారకుంకుమస్థాసకంబు
దనర రాయంచకడకు నత్తరుణి వచ్చె. 220

ఉ. వచ్చినఁ గాంచి హంసకులవల్లభుఁ డా తలిరాకుఁబోఁడి మై
లచ్చికి నిచ్చగించి యనులాపకలాపకళారసజ్ఞతన్
మెచ్చి, “నృపాలుపాలికిని మేకొని పోయెదవేమొ పొమ్ము! నా
ముచ్చట లాలకించి కడు ముద్దులు గుల్కెడు ముద్దియా!" యనన్. 221

క. అని పల్కు నంచ వాచా౽
తమమాధుర్యమునఁ జొక్కి తత్కథ యేమీ
వినియెద నన హేమావతి
కనురాగం బొప్ప రాజహంసం బనియెన్. 222