హంసవింశతి/ఎనిమిదవ రాత్రి కథ

వికీసోర్స్ నుండి

ఎనిమిదవ రాత్రి కథ

కోమటి దంపతులు సంకేతస్థలమునఁ బొరపాటునఁ గూడుట

మ. కల దుద్యర్ధ్వనజ శాటికా పటల జాగ్రద్వాత సంఘాత సం
చలనాభ్రస్థలి నిల్వ నల్కి తదవస్థం బాపఁ దద్భూమిరా
ట్కులమౌళిన్ శరణంబు వేఁడుటకుఁ దోడ్తో వచ్చెనో యంబుదం
బు లనన్ మత్తకరుల్ సెలంగ నొక ప్రోల్ పున్నాగపుంజంబనన్. 223

సీ. గోళ్లు రిక్కల జోళ్ల వేళ్లు మావి చిగుళ్లు
చెల్లు పొక్కి ళ్లుల్లసిల్లు సుళ్లు
తూండ్లు బాహులు గిండ్లు చెండ్లుబో! పాలిండ్లు
కండ్లు మీల్ సింగాణివిండ్లు బొమలు
చూపు మారునితూపుఁజోపు మోముల యేపు
బాపురే! శశిరూపు మాపనోపు
గప్పు పెన్నెఱికొప్పు లొప్పు చీఁకటి చొప్పు
గప్పు నవ్వులు విప్పు కప్పురములు
తే. పొంగు బంగారు రంగు లనం గడంగు
నంగలతల నెసంగు మెఱుంగు గుంపు
లనుచు నిజరూప వైభవం బఖిలజగము
లభినుతింపఁగ వెలయుదు రచటి సతులు. 224

వ. వెండియు నప్పురంబు సర్వమంగళాభ్యుదయనివాసంబై హిమమహీధరంబు పోలికిని సుధర్మాస్పదరూపరమ్యంబై మేరుశిఖరిభాతిని బురుషోత్తమశోభితంబై శ్వేతద్వీపంబు కరణిని బుణ్యజనానంద సమృద్ధిదంబై యలకాపురంబులీలను విబుధ మనోరంజకంబై యమరావతీ పట్టణంబు చాడ్పునను రాజహంసాభిశోభితంబై పద్మాకరంబు వైఖరిని జతురాస్యవాణీ ప్రచురంబై సత్యలోకంబు వీఁకను నొప్పు. 225

కోమటిల్లు-అంగడి దినుసులు

సీ. గొడియబీగము లాపుగొలుసు లోపలియడ్డ
మ్రాను బోర్తలుపులు మగులుగోడ
కాయధాన్యంబుల కణఁజముల్ బియ్యంపు
గరిసెలు దినుసులు గల కొటార్లు
మిద్దె చిల్లరల నమ్మెడు దుకాణము బచ్చు
మళిగె బొక్కసపిల్లు మచ్చులుఁ దుల
కషణముల్ నాణెముల్గల కట్లసంచి గో
తము లెక్కకడితెంబు దడము భరణి
తే. తక్కటి సమస్త వస్తువుల్ దనరు నటుక
బావి నుగ్గుల కుచ్చెల పాడిపసుల
గాఁడి జాలాది దివెగూఁడు గాబుతొట్టి
యొప్పు ధనచిత్తుఁ డను బేరి యుండు నచట. 226

సీ. జాజికాయలు రాస్న జాపత్రియు హరిద్ర
నాగర గంధక నాభి రసము
లతిమధురంబు తుత్థాభ్రకైలా శిలా
జిత్తులు మురుదారుసింగు హింగు
వన్నభేదియు వస యక్కలకర పంచ
లవణ చవ్యములు బోళము మణిశిల
పిప్పళ్లు కోష్టువు పిప్పలీమూలముల్
హరిదళ నాగకేసరము లింగి
తే. లీకము సదాపవేళ్లు ధాన్యాకములును
గటుకరోహిణి పటిక జంగాలపచ్చ
కర్పరియుఁ గారవియు రేణుక మతివసయుఁ
దాళకము మాంసి నఖము నేపాళములును. 227

తే. కారపాషాణములు నభ్రకంబులైదు
గ్రంథి తగరంబును యవానికా ద్వయంబు
కచ్ఛురములు మరాటి మొగ్గలు కుళుత్థ
కుసుమములు కుందురుష్కము లెసఁగఁ గలవు. 228

సీ. గంటు బారంగియుఁ గంకుష్ఠమును మెంతి
మంజిష్ఠ జిలకఱ్ఱ మ్రానిపసపు
విషకంటకాలామ్ల వేతసంబును నీరు
చించలంబును బులిచించలంబు
జీరకంబును నల్లజిలకఱ్ఱ పుష్కర
మూలంబు కాంపిల్యమును సముద్ర
ఫేనంబు ధాతకీసూనంబు సాసువు
లుప్పళులును గజపిప్పలియును
తే. గాకమాచియు సౌజేయకంబు చిత్ర
మూల గోరోచనములుఁ గాపోతతార్క్ష్య
శైలసౌవీర రసముఖాంజనములు వెలి
గారమును గల్గియుండు నబ్బేరి యింట. 229

వ. మఱియును. 230

సీ. వింతగాఁ బుంజీభవించి నానాధాన్య
ముల రాసులుండెడి నిలయములును
సకల రత్నాకర స్థలములై యేకీభ
వించి విస్మయమిచ్చు వేశ్మతతులు
నఖిలదేశంబుల నమరు నాణెములఁ బుం
ఖీభవించిన చిత్ర గేహములును
జీని చీనాంబరానూన బృందంబుల
మందీభవించిన మందిరములు

తే. సర్వ రసవర్గములు టంకసాల వేయు
చావడి హమాదినుసు మేలు సరకుఁ గలిగి
నాల్గు దిక్కుల పేటల నగరజనుల
కలర నమ్ముచు ధనచిత్తుఁ డచట వెలయు. 231

క. వానికి వసుమతి యనఁగా
మానిని విలసిల్లు నొకతె మదనునిచే నా
నానవసుమపూజితమగు
చీనీజముదాళి యనఁగఁ జెలువు దలిర్పన్. 232

ఉ. ఆబిడ మోముగోముజిగి యాబిడ ముద్దుల కావిమోవిరం
గాబిడ కప్పుఁగొప్పుసొగ సాబిడ సూరెల కోపుచూపుజ
గ్గాబిడ గబ్బిగుబ్బసిరు లాబిడ లేదననైన కౌనుసొం
పాబిడ యారుతీరు చెలియా! వచియింపఁదరంబె యేరికిన్. 233

క. అలరుంబ్రాయపుఁజిన్నెల
కలిమిన్ రంజిల్లి, మెఱుఁగు కరుగునఁ బోయన్
విలసిల్లు నటన పుత్రిక
పొలుపున నవ్వీటిలోనఁ బొలఁతుక మెఱయున్. 234

చ. పొలతుకవేణి కృష్ణతను బూనినయంతనె మోము సూడుచేఁ
దలఁకి విధుస్థితిం దనరెఁ, దాళక చన్నులు నచ్యుతాకృతిం
బొలిచె, సహింపలేక నడుమున్ హరిరూపు వహించె, నిట్టి వా
ర్తలకు మధుద్విషత్వమును దాల్చెను జక్కెరలొల్కు మోవియున్. 235

సీ. కులగోత్రములవారి నిలిపి కట్టెలు నీళ్ళు
మోయించుచుండెడి ములుచఁదనము
తనుఁగన్నవారలఁ దన్ని తొక్కుకనిల్చి
చెలఁగి పంకావాప్తిచేర్చు సూడు



వినుతకళాఢ్యుఁడౌ ద్విజరాజు ననిశంబు
దోషాకరునిఁ జేయు దూషణంబు
ఘనరసస్థితిఁ జెంది తనరు మానససీమ
బహుభంగములఁ గూర్చి పడెడు నగడు
తే. బ్రహ్మ వారించి కొనియె నప్పద్మనేత్ర
కలరు కుచశైలములును హస్తాంబుజములు
నవ్యముఖ చంద్రబింబంబు నాభిసరసి
మెఱయఁ గౌశల్యశక్తి నిర్మించి మించి. 236

క. అంబుజముల బింకంబులఁ
గంబులను నయనయుగళము గళముఁ గుచంబుల్
చెంబులఁ గ్రొంబగడంబుల
డంబుల మోవి నగుననఁ బడంతి యెసంగున్. 237

క. డాలా మెఱుఁగులు గ్రొంబగ
డాలా నెత్తావిమోవిడంబులు కోదం
డాలా కనుబొమ లతనుని
డాలా వాల్చూపులన మిటారి రహించున్. 238

ఉ. గుబ్బలనీటు మోముపస కుంతలబృందమునిగ్గుఁ గౌనులో
జబ్బుఁదనంబు కన్నుఁగవచందము చెక్కులతేట మోవి నున్
గబ్బిచకచ్చకల్, రచనకాంతి కటిస్థలియుబ్బు కంధరం
బబ్బుర మారుతీరు దరహాసవిలాసము వింత చూడఁగన్. 239

తే. దాని సొగసాత్మలో మెచ్చి తలఁ గదల్చి
కేరి మీసంబుపై ముద్దుఁగేలు వైచి
యడరి నిట్టూర్పువుచ్చి, యయారె!
యనని మానవుఁడు లేడు ధారుణిలోనఁ జాన! 240

క. అటువంటి రూపరేఖా
పటిమన్ దనరారియుండు భామిని రతులన్
ఘటియింపక పరతరుణీ
విటుఁడై ధనచిత్తుఁ డెపుడు వెలయుం జెలియా! 241

తే. అటువలె నిజాధీనాయకుఁ డన్యమృగదృ
గనుభవాసక్తచిత్తుఁడై యహరహంబుఁ
దిరుగఁ దనమీఁదఁ బసలేని తెఱఁగుఁ జూచి
వసుమతియుఁ గాంచె జారాంకవాహనంబు. 242

క. పతినడచునట్ల నడచెడు
సతియ పతివ్రతయటండ్రు సజ్జను లనుచున్
బతి పరదారలఁ గూడఁగ
సతి జారులఁ గూడఁదొడఁగె సతతము వేడ్కన్. 243

తే. ఇటుల నా వైశ్యదంపతు లేపురేఁగి
మనసు లెచ్చోటఁగల్గిన మరులుకొల్పి
నెఱి మరునితూపు తమచూపు నిర్గమంబు
వెట్టి మరుచివ్వ కేఁగుదు రెట్టులైన. 244

క. ఈతీరు కొంతకాలము
నాతియుఁ దానును బరేచ్ఛ నడచుచు నొకనాఁ
డాతతమదనశరాహత
చేతఃకంజాతుఁడై నిశీథిని వేడ్కన్. 245

క. అత్తింటి కోడలికిఁగా
హత్తుక నతఁడుండె, నొక యువాగ్రణికొఱకై
యత్తన్వి యటకె పోయినఁ
జిత్తజుఁ డెసకొల్పె వారి చిత్తము లలరన్. 246



తే. తాను గోరిన కన్య యీ తరుణి యనుచుఁ
జేరె నాసక్తిచే ధనచిత్తుఁ డపుడు!
ఆ యువాగ్రేసరుం డీతఁ డౌనటంచుఁ
గదిసె వసుమతి యత్యంతకాంక్షతోడ. 247

వ. అయ్యవసరంబున. 248

మ. సహసాసంఘటిత స్తనగ్రహణ సంజాతాంగ రోమోద్గమం
బు, హఠాచ్చుంబిత పాటలాధర ముఖాంభోజాక్షిగండంబు, దు
సృహ నీవీచ్యుతి కంచుకాహృతి నఖాంచద్దంతగాఢక్షతా
వహనం బిర్వుర కయ్యె సంగమము దిగ్వారార్చితేక్షాళియై. 249

మ. కలయికల యారజంబులఁ
గులసతిగా నతఁ డెఱింగె గోమలి మగఁ డీ
యలఘుఁడని తెలిసె నపుడెటు
వలె నచ్చెలి బొంకవలయు? వనితా! చెపుమా! 250

తే. అనిన హేమావతీభామ హంసదిక్కు
చూచి యది యెటు బొంకెనో చోద్య మహహ!
తెలియఁగాఁజాల నిది నీవె తేటపడఁగఁ
దెలుపుమని పల్క రాయంచ తెఱవ కనియె. 251

క. ఆవేళ నాయకుఁడు కో
పావేశహృదంబుజాతుఁడై, "యీ నిశితో
నీవిటకు నొంటి నేటికిఁ
గా వచ్చితి?" వనుచుఁ గినియఁ గామిని యనియెన్. 252

తే. మగఁడ! నామీఁద నీకింత మమత లేని
తెఱఁగుఁ గన్గొని కాళికాదేవి కేను
బడుగుఁదనమున మొక్కి, “నా పతిని రతికిఁ
గూర్పు నీ సేవ సేయింతుఁ గోర్కి మీఱ. 253

క. అని వేఁడుకొనిన యప్పుడె
ఘనకరుణామృతకటాక్షగరిమను గాళీ
జనని ననుఁజూచి, “పో!
పతి నెనసెద" వను నింతలోన నిట నెఱిఁగితి నిన్. 254

ఉ. వింతలు కాళికాజనని విశ్రుతసత్యము" లంచుఁ బల్కఁగా
నంతకుమున్నె యచ్చెలియకై చనుదెంచిన జారుఁ డొక్క కుం
జాంతర సీమనుండి, “యిది యౌనిజ" మంచు వచింప వర్తకుం
డెంతయు విస్మయాకులితహృత్పుటుఁడై నిజభార్య నున్నతిన్. 255

తే. స్తుతులఁ గరఁగించి సాష్టాంగనతు లొనర్చి
క్రుచ్చి కౌఁగిఁటఁ జేర్చి నీకోర్కు లలరఁ
జేసెద నటంచు బాసలు చేసి సతిని
దొడరి ధనచిత్తుఁ డింటికిఁ దోడి తెచ్చె. 256

క. అది మొదలుగఁ బరభామలఁ
గదియక ధనచిత్తుఁ డెపుడుఁ గాంతామణికిన్
ముదమలర వశ్యుఁడై తగఁ
బొదివెను, నీ కట్టినేర్పు పొసఁగినఁ బొమ్మా! 257

క. అన విని నాసికఁ దర్జని
యునిచి కడుశిరంబుఁ ద్రిప్పి "యోహో! చిత్రం"
బని తెల్లవాఱుచుండుటఁ
గని హేమావతి వియోగకలనన్ జనియెన్. 258

వ. అని ప్రత్యుత్పన్నమతి చెప్పిన విని, సంతోషించి, నలుం డా తరువాతి వృత్తాంతంబుఁ జెప్పుమని ప్రార్థించిన. 259

మ. స్మరవాత్సల్యవిశేషరక్షిత వనీమాతంగ! మాతంగసం
హర యోషిన్నుతపాదపంకరుహ శోభాభంగ! భాభంగభా
స్వర సర్వామర మౌని చిత్తజలరుట్సారంగ! సారంగరా
ణ్ణిరవద్య స్తుతిజాత ముత్పులకవన్నీలాంగ! నీలాంగదా! 260

క. సవనాసన జగదవనా!
దవనామ విషాగ్నిహరణ దారుణభువనా!
భువనాధిప నుతసవనా!
సవనాభ్ర ద్యుతిజితార్క జాసరసవనా! 261

పృథ్వీవృత్తము.
కులాచల కులాచలావలయ కూట ఘోణీట్ఫణీ
ట్తలాతల తలాతలాది జగదభ్రదిగ్దార్ఢ్య హృ
త్కళాధర కళాధర ప్రబలకార్ముకారోప కృ
త్కళాధర! యిలాధరప్రతిమ ధైర్యచర్యాకరా! 262

గద్యము.
ఇది శ్రీమత్కౌండిన్యసగోత్ర పవిత్రాయ్యలరాజాన్వయసుధావార్ధి పూర్తిమాచంద్ర నిస్సహాయకవిత్వ నిర్మాణ చాతుర్యనిస్తంద్ర శ్రీరామనామపారాచుణ నారాయణామాత్య ప్రణీతంబైన హంసవింశతి యను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.


——: O :——