హంసవింశతి/ఆఱవ రాత్రి కథ

వికీసోర్స్ నుండి


క. చూచి కలహంస మిట్లను
వాచావైచిత్రి మెఱయ వనితా! చోద్యం
బై చెలువొందిన యొక కథ
యాచించి నృపాలుకేళి కరుగు మటన్నన్. 134

క. ఆ మధురతరసుధారస
సీమాసామోక్తిధార చెవులకు నెంతో
యామోదము చేసిన విని
హేమావతి యడుగ హంస మిట్లని పలికెన్. 135

ఆఱవ రాత్రి కథ

చలిపందిరి బ్రాహ్మణసుందరి తెరువరిఁ గూడుట.

శా. జంబూద్వీపధరారవిందముఖి కంచద్భూషణప్రాయమై
సాంబప్రస్థ మనంగ నొక్కటి మహాస్థానీయ మొప్పారు, ర
మ్యంబై యప్పురిలోన నుండు హరిశర్మాఖ్యుండు విప్రాన్వవా
యంబున్ శోభిలఁజేయు కర్మఠుఁడు కల్యాణాంగి! యాలింపుమా! 136

సీ. బలుకంచు గుబ్బబోర్తలుపులు తీనెల
వాకిలి నడవ చావడియు మగులు
నఖిలవస్తువుల ధాన్యముల కణంజలు
దేవతార్చనమిద్దె తావి పడుక
టిలు వంటకొట్టంబు పలుగాఁడి పసిదొడ్డి
పసపాకుపందిరి బావితోఁట
మడిసంచి దోవతి మడతవ్రేల్దండెంబు
ధమనికుండంబు బృందావనంబు

తే. నక్షతలచిప్ప సాన చిత్రాసనమును
గిండి చిటిచాప పళ్లెంబు గిన్నె పెట్టె
కుశసమిత్పత్రములు పెట్టు గొప్పయటుక
యమరఁ గాఁపురముండు నయ్యగ్రజుండు. 137

చ. అతనికి హేమచిత్ర యను నంగన ద్రుంగినవెన్కఁ జారుభా
స్వతియను ముద్దుగుమ్మను వివాహ మొనర్చిన నింతియొప్పె న
య్యతనుని చేతికత్తి చివుకంతయుఁ బోయినఁ జేవఁజిక్కు స
మ్మతి నెలజవ్వనంబు పొడమన్ జిగిదేఱెడు దేహసంపదన్. 138

క. ఆ పటుకుచముల చందం
బా పెద్ద పిఱుందుమంద మా మోమందం
బా పొంకం బా బింకం
బా పంకజముఖికె కాక యన్యకుఁ గలదే. 139

ఉ. ఆ మధురోష్ఠి గుబ్బకవ నబ్బిన సిబ్బెపుఁదళ్కు లందమా
యా మృదులోరు కన్నుఁగవ నన్నువ వెన్నెలలొల్కు చందమా
యా మితమధ్య సోముకళ లానినమోము మెఱుంగు లందమా
యేమని చెప్పవచ్చు నళినేక్షణ! యా చెలిరూపసంపదల్. 140

తే. వక్రయానంబుతో నాగ చక్రకుచలు
నిలువుఁగన్నులతో దేవ నీలకచలు
నాతి మృదుగతి చపలేక్షణముల కలికి
క్రిందుమీఁ దైరి కాదె పూర్ణేందువదన! 141

సీ. నెఱిగొప్పు మేఘసందేశంబు కనుదోయి
యందమౌ కువలయానంద మరయఁ
బొంకపుమోము ప్రబోధచంద్రోదయం
బధరంబు మణిసార మౌర! చూడఁ

జెలువంపుఁజిఱునవ్వు సిద్ధాంతకౌముది
స్తనయుగంబు రసమంజరి నుతింపఁ
గరరుహంబులకాంతి కావ్యప్రకాశిక
ఘననితంబము రసాయనము తలఁపఁ
తే. దనువలంకార మతనుశాస్త్రములు చూపు
లహహ! మధ్యంబు నాటకం బవనిలోన
విద్యలకునెల్ల మూల మీ వెలఁదిఁ గనిన
విద్యలు పఠింపఁగానేల వేఱె బుధులు. 142

వ. అది మఱియును. 143

చ. బుగడలు నానుతీఁగె మెఱుపుల్ కవకమ్మలు గుండ్లపేరు బ
ల్పగడపుఁజేకటుల్ రవల పల్లెరుపువ్వులు కుప్పెసౌరమున్
జిగికడియంబు లాణిమణి చెక్కిన ముక్కర గిల్కుమెట్టెలున్
సొగసుదలిర్ప నచ్చేలియ సొమ్ముల మెమ్మల నొప్పు నెంతయున్. 144

సీ. కప్పుఁగొప్పు బడావగలఁ జూడని ఘనుండు
వదనంబునకు వింతపడని జనుఁడుఁ
గన్నుల కాశ్చర్యగరిమఁ జెందని వాఁడు
సరసభాషలకు మెచ్చని నరుండు
గబ్బిగుబ్బల తీరుఁ గాంక్షింపని విటుండుఁ
గౌను నుతింపని కాముకుండుఁ
గటికి శిరఃకంప పటిమఁ జూనని మర్త్యుఁ
డంఘ్రులు బాపురే యనని విటుఁడు
తే. నాస్తి యనృతంబు దబ్బర నహి హుళిక్కి
కల్ల మఱియిల్ల లేఁడు భూగతులలోనఁ
గ్రమ్మి జిగిఁజిమ్ము నమ్ముద్దుగుమ్మ హొయలు
చెలువ మెటువంటిదోకాని చిగురుఁబోఁడి! 145

సీ. పాపట యిడి నూనె పంకెనతో నున్న
గా దువ్వి నెఱులు కీల్గంటు వైచు
నెఱ యొయారముతోడ నీటికాఁగుల నీడఁ
జూచి కుంకుమబొట్టు సొంపుఁదీర్చు
గందంబు పూసినగతి గబ్బి జిగిగుబ్బ
కవమీఁద గుంపు ఱవికఁ దొడుగు
నుమ్మెత్తపూ రీతిఁ గ్రమ్ము కుచ్చెల నేలఁ
జీరాడఁగాఁ జల్వచీరఁ గట్టు
తే. నీటు బెళుకువ దిగజాఱఁ బైఁట చెఱఁగు
జగ్గుతో దోపుఁ గాటుక నిగ్గు కనుల
మిక్కుటపుఁ జూపు మెఱుఁగు తళుక్కుమనఁగ
వెడలు నొకవేళ గృహము న వ్విప్రవనిత. 148

క. పతిరతిని దృప్తిఁబొందక
మతిఁ జపలత పుట్టి యన్యమానవు రతికిన్
హితముపడి మోహదశలన్
బతిమాలఁ గృశించుఁ జారుభాస్వతి యెపుడున్. 147

తే. పురములోఁ గల్గు మోహంపుఁబొగరుఁజిగురుఁ
గోడె నెఱజాణవిటులకుఁ గొంతకొంత
వింత రతితంత్రముల్ నేర్పి విడివడున్న
కంతు మదదంతి పంతంబు గదియఁ దిరుగు. 148

క. ఈలీలఁ గొంతకాలము
బాలామణి సంచరించు ప్రాయమునాఁడే .
కాలూఁదియున్న యిందిర
తాలిమిచెడి నిలువకచటు తలఁగిన యంతన్. 149

సీ. కులమహీరుహ మహాక్రూర కుఠారంబు
కోపాగ్ని వృద్ధి కృద్ఘోర నాడి
సంసార సుఖశైల శతకోటి పతనంబు
దేహవ్యథాలతా దోహదంబు
శశిముఖీ దృక్పాత సంరోథి జంబీర
ఫలరసం బతిధైర్యభర్మకషము
ప్రతిభాంబుహృద్రీష్మపవనంబు నిజవధూ
రచిత నిందాసార నిచయ ఘనము
తే. సంతతాన్న సంపాదన సంభ్రమప్ర
యత్న విఘ్నద మతనుక్షుధార్తిదాయి
యమితలఘుతాశ్రయస్థానమై కడంగు
భూరిదారిద్ర్య దోషంబు పొదలె నపుడు. 150

క. అట్టి మహాదారిద్ర్యము
దొట్టిన హరిశర్మ ధృతియుఁ దూలక తృష్టం
గొట్టు పడకుండఁగాఁ దన
పట్టపు టిల్లాలిఁ గష్టపడి పోషించెన్. 151

సీ. పంచాంగములు సెప్పి బాజారులోపల
రంజిల్ల యాయవారంబు లెత్తి
తలమీఁద మంత్రాక్షతములుంచి కలకాపు
టిండ్ల నుపాదాన మెత్తి తెచ్చి
గ్రహణ సంక్రమణాది కాలంబులను రాచ
నగరాశ్రయించి దానములు పట్టి
లలు దర్భలుపూని తీర్థసన్నిధి మంత్ర
ములు సెప్పి నీరుకాసులు గడించి

తే. జన్నిదము లమ్మి గ్రహశాంతి జపముఁ జేసి
శవములను మోచి దుర్దానసమితికొగ్గి
వచ్చునాదాయములు గ్రాసవాసములకు
గాఁగ దినములు గడపె నక్కాలమునను. 152

శా. అంభోజప్రియ తిగ్మదీధితిచయ వ్యాఘాత నిర్భిన్న భూ
గంభీరోరు బిబోద్గతాధరజగ త్కద్రూజరాడ్ఫోగ భా
కుంభ ద్రత్నఘృణీభ్రమప్రదకనత్సూర్యోపలజ్వాలికా
జృంభ త్సావక మొక్క వేసవి జనించెం గాలకూటాభమై. 159

చ. శరచర సాధ్వసప్రదము సర్వబకౌఘ మదప్రదాయకం
బురుజల హైన్యకారము సముజ్జ్యలసాంద్రమరిచికా సము
త్కర వనరూపకారకము గాఢపయోధివియోగకార్శ్య
కర తటినీతనుహ్రదము కాసరభీష్మము గ్రీష్మ మెచ్చినన్. 164

చ. పవలను వర్తకాగ్రణి నభశ్చలసాగరమధ్యమంబులో
రవియను నోడమీఁద నపరక్షితిధృత్పురిఁ జేరరా మరు
జ్జవగతి సుళ్ళఁబెట్టు నదిసాగక చిక్కినమాడ్కి సూర్యుఁ డ
య్యవసరమందు మందగతులానిన దీర్ఘములయ్యె ఘస్రముల్. 155

తే. మల్లికాకుంజ పుంజాబ్ధి మధ్యమున మ
రీచికాస్వాతివృష్టి గురియ జనించి
పత్రపుట శుక్తు లెండలఁబగుల బయలు
పడిన ముత్తెములన మొగ్గ లడరఁ దొడగె. 156

సీ. దేహంబు బలువెట్టదీఱి సిస్తుగనుండఁ
జలువగాఁ బన్నీట జలకమాడి
మనసౌరయుక్తమై తనరారు పాటీర
పంకంబు తనువున నింకఁ బూసి



విమల నాగరచూర్ణ విహితమౌ మాహిష
దధ్యోదనము ప్రొద్దుతఱి భుజించి
బహుళ లామజ్జక ప్రసవసౌరభ మిశ్ర
శీతల జలముల సేవ గలిగి
తే. కప్పురపుఁ దిన్నె లమరఁ బూఁ జప్పరములఁ
జిగురుఁ బాన్పున వసియించి శీతవాత
జాత కరతాళవృంతముల్ సతులు వీవఁ
బ్రొద్దువుచ్చిరి కొందఱు భోగులపుడు. 157

తే. అట్టి వేసవి వేళ ధనాఢ్యుఁడైన
యచ్చటి నియోగి చలివెంద్ర లాది యందుఁ
బెట్టఁ గట్టడిఁ జేసినఁ బేదలగుటఁ
జారు భాస్వతి హరిశర్మ చేరి రపుడు. 158

సీ. లవణ శుంఠీ జంభల రసానుయుక్తమౌ
నీరుమజ్జిగ కుండ బారు లలర
లఘులయైలానూన లలిత సౌరభమిశ్ర
శీతల జలకుంభ జాత మమర
తీరక కైడర్యచారుగంధము లొల్కు
పలుచని యంబళ్ళ పంట్లు దనర
రవయుప్పు నీరుల్లిరసము నించిన చోళ్ల
గంజికాఁగుల గుంపు కడు రహింప
తే. గంధ బర్హిష్ఠ లామజ్జక ప్రశస్త
కాయమాన ముహుర్ముహరాయమాన
మంద పవమాన ఘనసారబృంద వేది
కాలయ విశాల పానీయశాల యొప్పె. 159



వ. మఱియు నచ్చలిపందిరి గవాక్షాదిసమాకలితవాయుజాతసంచారంబు గావున రఘురామమనోరంజకంబును, భాంథజనసంతాపహరణంబు గావున సత్కృతసంగమంబును, గబంధప్రచురంబు గావున దండకావనంబును, సితాభ్రసంచయకలితంబు గావున శరత్కాలంబును, నమృతసంపూర్ణకుంభంబు గావున సురేంద్రనివాసంబును, ఛాయాసమేతంబు గావున దపననిలయంబును, వివిధకుసుమసుగంధబంధురంబు గావున నారామంబును బురుడించు నప్పుడు. 160

క. అచ్చలిపందిరి లోపల
వచ్చుచుఁ బొయ్యేటి పరసవారికి జలమం
దిచ్చుచును జారుభాస్వతి
యచ్చట హరిశర్మ యుండు నా సమయమునన్. 161

చ. ఉపమరి బుద్ధిశాలి వినయోత్తముఁ డప్రతిమప్రభావళీ
తపనుఁ డవార్యధైర్యుఁడు నుదారచరిత్రుఁడు సర్వసత్కళా
నిపుణుఁడు రూపనిర్జితవనేరుహసాయకుఁ డొక్కవిప్రుఁ డా
తపపరితప్తుఁడై జలముఁ ద్రావఁ బ్రపాస్థలిఁ జేరి వేడినన్. 162

తే. చారుభాస్వతి శీతలజలము లపుడు
గిండితోఁ దెచ్చి యిచ్చి వీక్షించి, వాని
చక్కఁదనమున కలరారి సరసకేఁగి
యలఘుసాహసమునఁ దమి నిలుపలేక. 163

క. ప్రక్క లెగఁబొడువ మన్మథుఁ
డక్కోమలి పతికి వెఱవ కానందముతో
నక్కునఁ జేర్చుక పాంథునిఁ
జొక్కుచునుండంగ మగఁడు చూచె లతాంగీ! 164

తే. ఎట్లు బొంకంగవలె నిప్పు డిందువదన
నేర్పు గలిగినదానవు నృపతిమౌళి



కేళి కైతేను నీకిది కేవలంబు
దొడ్డగాదు విచారించి తోనే చెపుమ! 165

క. అనినఁ గలహంస పలుకులు
విని హేమావతి విచార విపులాబ్ధి మునిం
గినమది నాకిది తెలియదు
వినిపింపుము నీవె యనిన విధహరి యనియెన్. 166

చ. అటువలెఁ జారుభాస్వతి ధరామరుఁ గౌఁగిఁటఁ జేర్పఁజూచి, తాఁ
జటులతరోగ్రభాష హరిశర్మ యదల్చినఁ దొట్రుపాటునం
బెట్టిలక "యీతనిన్ వినుము పిన్నతనంబున దేశచారియై
పటుగతిఁ బోయె మాతులునిపట్టి సుమీ” యని లేని దీనతన్. 167

తే. కాంతునకుఁదెల్పి మఱమఱి కౌఁగిలించి
చెమటకణములు తనపైఁట చెఱఁగుచేతఁ
దుడిచి యాతని కేల్వట్టి తోడి తెచ్చి
మేలమాడుచుఁ బానీయశాల కపుడు. 168

సీ. “గొనబుతో నెన్నాళ్లకో సెల్వుగా నేటి
కైన నిన్నెనయ నాకబ్బె"ననుచు
“నీకు నామీదాన నిజముగాఁ జెప్పుమా
నాయందుఁ బ్రేమకద్దా?" యటంచుఁ
“బదిదినా లుండక, పాఱిపోయెదనన్నఁ
బోనిచ్చునా? వెఱ్ఱదైన” ననుచు
“నీప్రొద్దు సుదివసం బే నోముఫలమొ! నా
మనసులో నెంజిలి మానె"ననుచుఁ
తే. జేరిక లొనర్చి తేనియల్ చిలుకఁబలికి
మోహమూరించి తరిదీపు మోపుకొల్పి



యతనిమీఁదను బతికి నింపితము వొడమ
మున్నె యొనరించి వానితో మురియఁదొడఁగె. 169

క. ఈకరణిఁ జారుభాస్వతి
యాకాంక్షలు దీఱ నాఁ డహర్నిశ మతనిన్
డీకొల్పి రతులఁ, జివురుం
జేకత్తి వజీరు సడ్డసేయక యుండెన్. 170

క. అటువలెఁ గాలోచితసం
ఘటితోక్తి స్ఫూర్తి నీకుఁ గల్గిన భూభృ
న్నిటలాక్షుఁ గదియఁ జిటిపొటి
నటనలఁ బోవమ్మ! కుందనపు జిగిబొమ్మా! 171

చ. అన విని మందహాసము ముఖాబ్దమునన్ జిగురొత్తఁ గర్ణవే
ష్టనమణికాంతి చెక్కుల హుటాహుటి నాట్యము సల్ప, “నౌర" యం
చును దలయూఁచి వేఁకువగుచోఁ, జెలి కేళిగృహాంతరంబునం
దెనసి నృపార్పితేచ్ఛఁ బవలెల్లను ద్రోయుచునుండె నంతటన్. 172

చ. సమయ మహేంద్రజాలకుఁడు సారసమిత్రుఁ డనేటి పద్మరా
గము వెస మాయఁజేసి కుతుకంబున “హా" యని నీలపంక్తులన్
భ్రమపడఁజూచి "ఝా" యనుచుఁ బల్కి సుపాణులఁ జేసి చూపెఁ జి
త్రమనఁగఁ బొద్దుగ్రుంకెఁ దిమిరం బెసఁగెన్ దివినొప్పెఁ దారకల్. 173

క. ఆవేళను గృహకృత్యము
తా వేగమే దీర్చి పేర్చు తమకంబున రా
డ్దేవేంద్రునిఁ జేరఁగ హే
మావతి నెమ్మదిఁ దలంచి మహితోత్సుకతన్. 174

ఉ. దిద్దిన నాభినామము కదించిన మేల్మడి చాఱచీర మై
నిద్దపుఁబూఁత పుష్పములు నించి ముడించిన కొప్పు రత్నముల్



తద్దయుఁగల్గు సొమ్ములు గళమ్మునఁ జొక్కపుఁజుక్క యొప్పఁగా
ముద్దియవచ్చి హంసమణి ముందర నిల్చె, నృపాభిలాషయై. 175

క. నిలిచిన యా హేమావతి
బొలిచిన కరుణామృతంపు భూవితరోక్తుల్
పొలయఁగ దృష్టిఁ గనుంగొని
తలచిన పని కపుడు హంసధరణిపుఁ డనియెన్. 176

ఏడవరాత్రి కథ

కంసాలి కోమలి ధూర్తుఁడను శిష్యునిఁ గూడుట.

క. “మున్నొక్క పట్టణమ్మున
సొన్నారి మిటారి నేర్పు శూరత్వముఁ గై
కొన్నదియై నడచిన కథ
చెన్నుగ విని పొమ్ము, కడు విచిత్రము కొమ్మా!" 177

తే. అనినఁ జిఱునవ్వు నవ్వి యయ్యంబుజాక్షి
“యేమి చిత్రంబుఁ గల్పించి తింతలోన
శీఘ్రముగఁజెప్పి దయచేసి సెల వొసంగు
మరిగెదను రాజుపొందున" కనిన నపుడు. 178

క. కాదంబవంశ వల్లభుఁ
“డాదృతిని బరాకులేక , యక్కరొ! వినవే!
మోదముతో "నని చెప్పెను
మేదుర మాధుర్యసాధు మేధాఫణితిన్. 179

క. విను మనఁగాననఁగా నిల
ఘనమణివర మనెడు పురము గలదొకటి వినూ
తనకేతన పట జాత ప
వనహత సురసురత ఘర్మవన వారంబై. 180