Jump to content

స్వీయ చరిత్రము - ప్రథమ భాగము/ఈశ్వర ప్రార్థనము

వికీసోర్స్ నుండి

శ్రీపరబ్రహ్మణేనమః

ఈశ్వర ప్రార్థనము.

ఓ పరమేశ్వరా ! ఓ దయాసత్యధర్మస్వరూప! ఓ సుజనహృదయప్రమోద సంధాయకా! నీకు నమస్కారము. మిత్రు లనేకుల ప్రోత్సాహముచేత నే నిప్పు డొక్కదుష్కరకార్యమును బైని వేసికొని, ఏతత్కార్యసమంజస నిర్వహణశక్తికొఱకు నిన్ను హృదయమునందు నిలుపుకొని వినయపూర్వకముగా నొక్కప్రార్థనమును జేయుచున్నాను. దీనుఁడ నైననాయెడలఁ గరుణించి నాయభీష్టసిద్ధిని గావింపుము. లోకములో నెవ్వని దైన నొకచరిత్రమును వ్రాయఁబూనుకొనుటయే యెంతోకష్టము. ఆవ్రాయఁబూనుకొన్న దన్యులది గాక స్వీయచరిత్ర మయినచో నప్పటికష్ట మింతంత యనిచెప్పుటకు శక్యముకాదు. మొట్టమొదట నెవ్వఁడైనఁ దనచరిత్రమును జెప్పుకొనుట కుపక్రమింపఁగానే లోకు లాతనిని గర్వియనియు నాత్మశ్లాఘాప్రియుఁడనియుఁ బ్రఖ్యాతికాముఁడనియు నానావిధముల భావింతురు. ఈ చరిత్రమును వ్రాయఁ బూనుకొనుటలో నాయంతరంగమునం దిట్టి నీచోద్దేశము లేవియుఁ జొరకుండును గాక! ఓ భక్తవరదా! ఆత్మశ్లాఘాపరత్వమును నామనస్సునుండి దూరము చేయుము. నాహృదయమునందు సదా సత్యమును వినయమును నెలకొలుపుము. భవత్ప్రీత్యర్థమ యిపరమార్థచింతతోఁ దప్పఁ బ్రసిద్ధికయి నే నేపనిని జేయకుండునట్లు నా చిత్తమును శాసింపుము. దేహవిద్యాబుద్ధులయం దత్యంతదుర్బలుఁడ నైన నాజీవనచరితము బహుజనాదర పాత్రమయి విశేషోపయుక్తమగునది కాకపోయినను, ఘనుల మహాకార్యప్రకటనమువలెనే సామాన్యుల యల్పకార్యప్రకాశనము కూడ నభివృద్ధికి సహకారియగు నన్న యార్యోక్తి నిజమయ్యె నేని యీయవిశ్రుతచరితము సహితము కొందఱికిఁ గొంత ప్రయోజనకర మగును గాక!