సూర్యశతకము (తెలుగు)/రథ వర్ణనము

వికీసోర్స్ నుండి

రథ వర్ణనము

ఉ. ఠీకుగఁ బ్రాగ్గిరి న్వెనుక డెక్కలయంచుల నిల్వ ఱొమ్ములన్
జౌకుమొయిళ్లు మేనులను సాచక యెత్తిన శబ్దహీనమై
ప్రాకెడి చక్రముం గలిగి పాఱ ననూరుఁడు లేచి మ్రొక్కినన్
వీకున సంతరిక్షమున వే జను సూర్యునితేరు మీకగున్

తా. బలిసిన ఱొమ్ములచే మేఘములను గ్రుమ్ముచు, గొరిజ లాధారముగా నిలువబడియున్న యశ్వము లొక్కమారు రథము కదలించుటచేత అనూరుడు వెల్లకిలబడి సూర్యునికి నమస్కారము గావించుచున్నాడు. అట్టి రథము మీకు మేలు చేయుగాత.[62]

ఉ. అంతొటి చిమ్మచీఁకటుల నార్చు కఠంబులు వేయి గల్గు భా
స్వంతుని మోయలేక శ్రమబట్టు మరుత్తుల నక్కడక్కడన్
వింతగ మేత్త లార్తురని వేఱుఁగ వేఱుఁగ నేర్పరించు న
త్యంత పటుప్రభావ జగదక్షరథంబు శుభంబు మీకిడున్.

తా చీకటిని నిశ్శేషముగా పోగొట్టటకు వేయికిరణములు ధరించిన సూర్యునికి స్థానమై, సప్త వాయుమండలముల నధిగమించిన సూర్యరథము మీ పాపముల బాపుగాత.[63]

మ. మరతాళ్ళైన మహాహులం బొడువ నాఁ బ్రక్క ల్విడం బ్రాఁకి వా
ర్ధరముల్ ఱిక్కలుగా ననూరుని వడిం బ్రప్రీతుఁ గావించి యా
హరి యేరీతిఁ దలంచు నట్ల చని తార్క్ష్య ప్రక్రియం బోవు భా
స్కరుతే రెప్పుడు మిమ్ము బాపచయముల్ చక్కాడి రక్షించుతన్.

తా. ఏది గమని వేగముచేత తన సారథికన్నయైన గరుత్మంతునివలె నొప్పి, అనూరునకు సంతోషము గలిగించుచున్నదో, ఏది మేఘమండలము చీల్చుకొని పోవునపుడు టెక్కలుగల గరుత్మంతునివలె నొప్పుచున్నదో, అట్టి రవిరథము మీకు కాంతి నొసగుగాత.[64]

చ. నడ చుఱుకుందనాన నొకనాఁటను దీర్ఘ జగఁబు చుట్టుచున్
గడు బరువై సుమేరువుశిఖన్ మణికోటుల నుగ్గునేయుచున్
బుడమికి మీఁదఁ గొంతవడి భూర్యపరాద్రిని కొంత సేపు దా
నడుగున మండు సూర్యరథ మాషద లెల్లెడ మీకుఁ బాపుతన్.

తా. ఏది ఒక్క పగటికాలమునందే మేరుగిరిని చుట్టి ముజ్జగములు నాక్రమించుచున్నదో, ఏది పూజ్యమైన దిక్కులతో సంబంధము గల్పించుచున్నదో, దేనినడక యింతమాత్రమని నిర్ణయించుటకు వీలులేదో, అట్టి సూర్యుని రథము మీ దోసగుల తొలగించుగాక.[65]

ఉ. దౌలకుఁ దూలుఁ గాంతి చెడీ తారు గ్రహంబులు కేతనాంబ రాం
దోళితుఁడై చనున్ శశి, విధుంతుఁడున్ గ్రసనేచ్ఛ వెంట రా
మూలుఁగు జక్రముల్ హరులు బుఱ్ఱన గాంగజలంబు వ్రీలు ని
ట్లోతి దలిర్చు భాస్కరరథోతమయానము లేలు మిమ్ములన్.

తా. ఏది తేరినొగ తాకటచే చీల జారి గ్రహమండలము చెల్లాచెదరు గావించుచున్నదో, ఏది రాహువునకు విష్ణుచక్రమను వేఱుపు గల్గించుచున్నదో, ఏది తను టెక్కెముల గాలిచే చంద్రుని గడగడ వడకించుచున్నదో- అట్టి రవి రథము మీకు సంతోషము గూర్చుగాక.[66]

ఉ. కాడిని జార మక్షమునఁ గంకణథోరముఁ గట్టి కంబమం
దోడక ధూప మిచ్చి విరు లొయ్యనఁ గూబరమం దమర్చి మే
ల్జాడఁ బటీరగంధమునఁ జక్రము మెత్తుచు సిద్ధభామినుల్
వేడుక మింట మ్రొక్కెడి రవిప్రభుతే రఘభేది మీకగున్.

తా. ఏ రథము చీలను సిద్ధస్త్రీలు, పసుపుతోరములతో ప్రొద్దుట నర్చింతురో, ఏ రథచక్రములను వారు గంధముతో నలంకరింతురో, అట్టి అఁశుమాలి రథము మీ కనంత సౌఖ్యముల నిచ్చుగాత.[67]

ఉ. ప్రక్కల నెక్కుడై తురగపద్ధతి లేచు పసిండిదుమ్ముతోఁ
జక్కఁగ నెప్పుడుం దిరుగు చక్రము నేములలోఁతు పాఱుచున్
నిక్కిన మేరువందుఁ దనవేఁడిమి నింకిన దిన్నెలౌ సుధా
భుక్కులయేఱు నాఁ దగిన పూషునిరథ్య యొకండు మీ కగున్.

తా. ఏది వెడలునప్పు డిరుప్రక్కలను బంగారురజము చల్లుచుండునో ఏది తన వేడిమిచే మేరుగిరిపై దీపించు ఆకాశ గంగాజలములను చల్లుచు, ఆ శిఖరమును తెల్లగా చేయుచున్నదో, అట్టి సూర్యరథమార్గము మీకు శోభనము లిచ్చుగాత.[68]

ఉ. మొక్కఁగవచ్చు దేవగణముఖ్యుల చాలది త్రోవగాఁగ నా
చుక్కలు చక్రఘట్టనను జూర్ణముగా నది దుమ్ముగాఁగ బల్

నెక్కొను వాజిహేష దివి నిండిన నేమిరవంబుగాఁగ మీ
న్న క్కుతలంబుఁ బోలఁగ నొనర్చిన యర్కు రథంబు మీ కగున్.

తా. ప్రాతఃకాలమున నమస్కరించుచున్న దేవతలశ్రేణి మార్గము చూపగా రథవేగమున పొడియైన నక్షత్రముల ధూళితో, చక్రము చుట్టునున్న పట్టాధ్వనితో భూమియందువలె ఆకాశమునందును సంచరించు నరుణుని యదరము మీకానందము. గల్గించుగాక.[69]

ఉ. జానగు దేవయానముల చాలున వచ్చి ద్యుషద్వితానముల్
పూని, నమో యన న్వడినిఁ బోవుచుఁ గానక సైకతంబులన్
మానగు గంగ మెల్ల జన మంథనమందిరమందుఁ బారిజా
తా నుపమానసూనములు నావిన భానురథంబు మీ కగున్.

తా. వందనము చేయుటకు వచ్చిన బృందారకశ్రేణులు సమర్పించు పూవులు, ఆకులు గలదియై, ఆకాశ గంగాతీరమున నతి త్వరిగతి గలదియై సుందరనగరముల బోలిన మందర శైలముల మందమందగతి నడచు సూర్య స్యందనము, మీకు శుభములను చేకూర్చుగాక.[70]

చ. హరిహరులన్ సదృక్షపతి యక్షములన్ మఱి చక్రి చక్రమున్
సురలు సురంహ మల్ల యరుణు స్వరుణుండును స్థాణు స్థాణుఁడున్
విరివిగఁ గూబరంబునఁ గుబేరుఁడు గొల్వఁగ నిత్యయుక్తి మై
పరహితవృత్తి మెచ్చు ఖరభానునిస్యందన మేలు మిమ్ములన్.

తా, దేని చక్రమును విష్ణువు స్తుతించుచున్నాడో, దేని యశ్వములను చంద్రుడు శ్లాఘించుచున్నాడో, దేని టెక్కెమును శివుడు పొగడుచున్నాడో, దేని యిరుసును చంద్రుడు స్మరించుచున్నాడో, దేని నొగను కుబేరుడు స్తుతించుచున్నాడో, సురసమూహము దేనిని స్తోత్రము చేయుచున్నదో అట్టి సూర్యరథము మీకు నుల్లాసము గల్పించుగాక.[71]

మ. నయనాహీనుఁడు మూలమం దలరఁ గా నాకౌకసుల్ పాదముల్
నియతిం గొల్వఁగ నెంతయున్ బలి హరుల్ శీఘ్రంబ లాగన్ మహా
వియదంభోనిథిలోన మంథరము నా వింతై కడుం బొల్చు న
వ్యయ రత్నంబు రథంబు తుల్యమగు భాగ్యం బిచ్చి మీమ్మేలుతన్.

తా. ఏది మందరనగమవలె ఆకాశమను సంభోధియందు దిరుగుచున్నదో, ఇంద్రుడును బలి చక్రవర్తియు దేని నెల్లప్పుడు పొగడుచుందురో - అట్టి మందరాద్రివలె నుండు నంశుమాలి రథము మీకు సకలసంపదల నొసంగు గాత. [72]