Jump to content

సూర్యశతకము (తెలుగు)/అనూరు వర్ణనము

వికీసోర్స్ నుండి

అనూరు వర్ణనము

చ. పొడుపుడుగొండ రంగమునఁ బొంకపు రేతేఱచొత్త లక్ష్మిక
న్పడ నుడుపంక్తి పేరిటి నవంబగు పూవుల దోయిలింత జొ
ప్పడ నిడి సూత్రధారత దివంబున నాలుగు జాల యంకముల్
నడపెడి లోకనాటిక ననం జను నయ్యరుణుండు మీ కగున్.

తా. తూర్పుకొండ అను రంగస్థలమున రాత్రి యనెడి తెర తొలగగా, నచ్చటచ్చట నున్న నక్షత్రములు పుష్పాంజలిగా, నాలుగు జాములనెడి నాలుగంకముల జగన్నాటకము ప్రారంభించు సూత్రధారుడైన అరుణుడు మీకు శుభంబు లిడుగాత.(50)

చ. హరులకు నగ్ర్యుఁ డన్, హరిన యాతఁడు మోచుఁ బళు క్రియం జరా
చర సమభావకర్మతతి సాక్షిని యాతఁడు పక్షపాత సం
చరణుఁ డటంచు నీడునను సామ్యము నొందియు దృక్రుతి ద్విషున్
దరిమెడి నేమ ధామములధామమనూరుఁడు వాపు మీ కొలల్.

తా. తాను సూరుని వాహనములగు గుఱ్ఱముల కగ్రేసరుడు. అతడు పశువువలె హరిని మోయుచుండును. తాను సర్వకర్మములకు సాక్షి. అతడు పక్షపాతము (ఱెక్కలతో ఎగురుట) కలవాడు. తాను జగమునంతను దీపింపజేయు సమరుచికల సర్వకర్మ సాక్షి. అతనికి బలమున్నను తాను వయస్సులో పెద్ద. ఈ విధముగా సోదరుడైన గరుత్మంతుని మించు స్థిరత్వము, ప్రకాశము గల అనూరుడు మీ కానంద మిచ్చుగాత.[51]

మ. వఱువాతన్ హిమముల్ స్రవించు శశిశోభల్ ద్రావ జబ్బెక్కి ముం
దఱఁ గాష్ఠోజ్జ్వలదీపనఁబు వెనుకన్ భానుండటంచు న్నతా
దరత న్సిద్ధులు సాధ్యు లంబరమునన్ దత్తార్ఘ్యులై చూడ భా
స్కరసారథ్యము సేయు వేల్పు మిము రక్షోదక్షుడై యేలుతన్.

తా. ప్రాతఃకాలమున దూరమునుండి సూర్యునిస్తోత్రము చేయువారును, ఆర్ఘ్యముల నిచ్చువారును వీక్షించుచుండగా, సిద్ధులు మొదలైనవారు ఆకాశమున చూచుచుండగా, చంద్రకిరణములయందు మంచుకణములనాని తూర్పు దిక్కున సూర్యుని గొల్చుచు నొప్పు సూర్యసారథి మీకు శోభ కలిగించుగాక.[52]

మ. వఱువాత న్విడ రశ్ములం దుదిపగల్ మానన్ స్వతంత్రుండుగాఁ
బరీషత్ స్తోత్రవిలాసుఁగా హరిపదవ్యాపారుఁగా నా ద్విజే
శ్వరునందున్ సమయప్రకర్ష లఘుతం జాటంగ సేవేచ్ఛమై
నరుణుండుం దనపాటి సేయు నరుణుం డంత మేలున్మిమున్.

తా. ప్రొద్దుటనే సూర్యునివలె కిరణములను వ్యాపింపజేసి, స్వతంత్రుడై లాఘనముతో వానిని వ్యాపింపజేసి బుధులు ప్రశంసించుచుండగా బ్రాహ్మణులకు విలాసము గల్పించి, రెండవ సూర్యునివలె నొప్పు ననూరుడు మీ కనూన సుఖముల నిచ్చుగాక.[53]

ఉ. రేయను తీగకుం బరశురీతిఁ దమోఒటవి కర్చిభాతిఁ బ్రా
క్తోయజనేత్ర కల్వలనుఁ గోయు కరాగ్రగతిం జగత్సుబో

ధాయతి ధాతపద్ధతి వియద్భువు లేర్పడఁ దొల్చునట్టి మేల్
ఱాయిస్ధితిన్ దలిర్చెడు ద్యురత్నముసారథి మీ కొలార్చుతన్.

తా. చీకటి యను అత్తను ద్రె౦చు గండ్రగొడ్డలియై, చీకటి యను నరణ్యమును దహించు గార్చిచ్చై, తూర్పు దిక్కనెడు వనితి కష్టములను తొలగించు హస్తమై, ఆకాశమును భూమిని నైక్యముసేయు బ్రహ్మ వలె నొప్పి, దివి భుషి వేఱుచేయు దివ్యరత్నమౌ సూర్యపారథి మీకు మేలుచేయుగావుత.[54]

ఉ. వానకుఁ దూర్పుగాలివలెఁ బావకకీలకు ధూమమట్లు లో
కానకు నాదిసృష్టిగతిగా ప్రతిరాశికి నోంకృతి స్థితిన్
భానుని గ్రుంకునందు నటనం బిడు శూలికి నంది నాందిలా
గై నవి నాప్తుతే ర్నడపు నవ్వినఱాత్మజుఁ డేలు మిమ్ములన్.

తా. వానకు తూర్పుగాలి రీతి, అగ్నికి పొగ యట్లు, లోకమునకు మొదటి సృష్టివలె వేదమునకు నోంకారమైన కరణి సంధ్యాకాలమున, శివుని నాట్యారంభమున నాండ్భితి సూర్యునితేరు నడపు ననూరుడు మిమ్మేలుసు గాక.[55]

ఉ. మేలిమిబండలం గలసి మించిన సూర్యుగుఱాల చాలునుం
బోలెడు పచ్చలం గొలికిపూసకు మేల్కురువిందమై స్వకీ
యాలఘుదీప్తి మేరుకుభృదాభరణం బొనరించు నమ్మహా
వ్యాళ విరోధి యన్న దవులం దిడి మీ యఘపంక్తి నెట్టుతన్.

తా. మేరువుపై రథము నడపునపుడు బంగరువన్నె గాంచి, ఆ వెనుక గుఱ్ఱములు ఆకుపచ్చని కాంతిచే నచటి బండలు ఆకుపచ్చరంగుతో నొప్పగా, తనయొక్క స్వకీయమగు కాంతిచేత మేరు పర్వతమునకు నా భరణాయమానమైన అనూరుడు మీ పాపములను బాపుగాత.[56]

చ. చిఱుతెనఁగోల బెత్తమును చేతను బట్టి గుణాల పేరి స
ప్త రుచిర కక్ష్యలం గడపి ధ్వాంతపదావళి తొప్పి తేరి ముం
దిఱపుగ నుండి నేర్పున ధరేశులఁ జూపు జగత్పభా మనో
హర దినరాజు పెద్దప్రతిహారి సదా మిముఁ బ్రోచుఁగావుతన్.

తా. జగమనెడు మహాసభకుగల ఏడు కక్ష్యలను ఏడు గుఱ్ఱములచే దాటించి, చీకటిని తరుముచు, ఏడు కులపర్వతములను లోకమునకు కన్పింప జేయుచు, కసగోల యనెడు బెత్తముతో సూర్యునిరాక తెలుపు ప్రతిహారియైన యనూరుడు మీ యఘముల దొలగించుత.[57]


ఉ. పగ్గము లొ నటం చరుణ వారుణపాశము లంటఁబోకుమా
యెగ్గిడి యేకచక్రమని కృష్ణునిచక్రము ముట్టఁబోకుమా
దిగ్గున నెన్మిదౌ తగును దేవహయం బనఁబోకుమా యటం
చగ్గముగాఁ బరోపకృతి కర్కుఁడు దిద్దినవాఁడు మీ కగున్.

తా. తనకు రథము తోలుటకు తగిన సాధనసామగ్రి యితరులనుండి గ్రహింపకుండ సూర్యుడు తన సారథియైన యరుణుని వారించుచున్నాడు. పగ్గములు సరిగా లేవని వరుణుని పాఠములను గ్రహింపకుము. నీ రథమున కొకటే చక్రము గలదని విష్ణుమూర్తి చక్రము నడుగకుము. నీ రథమున కేడు గుఱ్ఱములున్నవని ఎనిమిదవ గుఱ్ఱముకొఱకు ఇంద్రుని యుచ్ఛైశ్వవము కోరకుము" అని వారించు సూర్యుడు మీకు శుభముల నొసగుగాక.[58]

మ. పురుహూతా! కనుదమ్ము లొప్పే శిఖిదీప్తుల్లేవె యిచ్చోటఁ గా
సరము న్నిల్పుము తాతపాదనతికై సౌరీసరే నిరృతీః
వరుణా ! చూడుము, మారుతాఝడితి తెల్పంబడ్డదో శ్రీదయీ
శ్వరమీళే యని వైపుణేండ్ల నను భాస్వత్సూతుఁ డేలున్ మిమున్.

తా. ఇంద్రుడా! నీ వేయికనుదమ్ములు క్షణమాత్రము వికసింపగలవు. అగ్నీ! నీ కాంతి యిక తగ్గును. యముడా! నీవు నీ వాహనమును కొంచెము మరల్పుము. నైరుతీ! నీ వట్లే చూచుచుండుము. వరుణుడా! ఈ గుఱ్ఱములను నీటిచే తడుపుము. వాయుదేవుడా! గుఱ్ఱమునకు జవసత్వముల నిమ్ము. కుబేరా శివునకు నమస్కరింపుము-అని అష్టదిక్పాలకులను హెచ్చరించు అనూరుడు మీకు మేలు చేకూర్చుగాక.[59]

చ. బడలఁడు డప్పి లే దలఁత బట్టదు మై మఱువండు పాంథుడై
మిడిమిడి యెండ బగ్గుమని మీఁదఁబడం జగమెల్లఁ గ్రుమ్మఱన్
సడలఁడు పచ్చగుఱ్ఱముల చాలను రమ్యవనంబు పట్టి యీ
తఁడు రవిసూతుఁ డీప్సిత పదార్థములం గృప మీకునిచ్చుతన్.

తా.తీవ్రములైన సూర్యకిరణములు దాకియు నెవడు బాటసారివలె మూర్చ జెందడో, ఎవడు డస్సినను తన దేహము సరిగా నుంచుకొనునో, ఎవడు వాడికిగణములచేత నోరెండకుండ నుండునో, అట్టి సూర్య సారథి మిమ్మ బ్రోచుగాత.(సూర్యకిరణముల వేడికి మానవులకు పై యనుభవములు గలుగును)[60]

ఉ.తీరిన గంగలో నిసుకతిన్నెల దూరిన డెక్కెలాడ క
మ్మేరుపుకందరంబు లను మెట్టుల మ్రొగ్గినఁ గాళ్లు తొట్రిలన్
మీరిన పచ్చరాగరిక మేయఁగ సూర్యుగుఱాలు నిల్వ సాం
పూనఁ జలోచలోజవిది హుమ్మను నగ్రగుఁ డేలు మిమ్ములన్.

తా. ఆకాశ గంగాతీరపుటిసుకలో గుఱ్ఱముల డెక్కులు కూరుకుపోవుచున్నవి. మేరుపర్వత శిఖరముల కాళ్లు జాఱుచున్నవి. దూర్వాంకురములు గల స్థలములోయని మరకతములుగల స్థలముల నాగుచున్నవి. అట్లు గుఱ్ఱముల వేగపు నడకను నదలించుచు, హుంకారము సేయు ననూరుడు మీకు శ్రేయము చేయుగాత. [61]