సూర్యశతకము (తెలుగు)/మండల వర్ణనము

వికీసోర్స్ నుండి

మండల వర్ణనము

చ. పగటికి బీజమున్ తిమిర బాధక మక్షికి నంజనంబు ము
క్తిగవిని, ముజ్జగాలఁ దగు దీపము లొక్కటియైన ముద్ద వా
న గురియు హేతు వబ్ధి రశనారసపానము పెద్దచెంబు పే
ర్మి గలుగు సూర్యమండలము మీకునుఁ గోరిక లిచ్చుగావుతన్.

తా. ఏది చీకటిని పోగొట్టి లోకమునకంతకు దృష్టి ప్రసాదించునో ఏది నేత్రములకు ప్రకాశమిచ్చునో, ఏది యోగులు ప్రవేశించుటకు ద్వార మో,ఏది భూమియందలి జలముల గ్రోలు పాత్రమో అట్టి అతులమై, ఆమేయమై, తేజస్సులకు తేజస్సైన మండలము మీకు కల్యాణముల నిచ్చుగాక. [73]

చ. చెలియలికట్ట మీఱి పడు సింధువునీటియలై సగంబు ము
న్నలమిన పెద్దచుక్కలకు ద్వార నభ౦బయి కొంచె కొంచెమై
పొలుచు వసంతు మోమునను బొట్టయి చీఁకటిగొట్టి ప్రాగ్గిరిన్
గలికితురాయి యైన దిననాథుని బింబము మీకు మేలిడున్.

తా. సముద్రమునకు వేలవలె, అనగా హద్దువలె నుండి శుక్రాది యితర గ్రహములను మినుకుమినుకు మనునట్లు చేయుచు, ఉదయాచల శిఖరమునకు,

శిరోమణివలె, సత్యధిక ప్రభతో ప్రకాశించు సూర్యమండలము మీ దురితములను పోగొట్టుగాక.[74]

ఉ. మేలిమికొండకుందనము మీఁదను జెక్కిన కెంపు నీలిమం
దేలిన నల్వకల్వలకు దిమ్మెకుఁ జుట్టును వీలు జూలునుం
గాలము పేరి వ్యాళము ఫణామణియై, ఘనమై, సదా జగ
జ్జాలము మండనంబగు త్విషాంపతిమండల మేలు మిమ్ములన్.

తా. ఏది తామరపూవు కాంతులతో పుటమార్చిన యట్లు ఉదయ శైలము కాంతులను వెలార్చుచున్నదో. తామరలయందుండెడి తుమ్మెదలవలె ఏది నల్లకలువల దాయలను విస్తరింప జేయుచున్నదో, ఏది దినముఖమున పూజింపదగిన దొడ్డమాణిక్యమైనదో, ఏది విశ్వమునకు నేకైకముగా సంపూర్ణభూషణ మగుచున్నదో, అట్టి సూర్యమండలము మీ పాపములను ఖండించుగాక.[75]

ఉ. రేదొరరూపు సున్నయగు రిక్కల కేరును దిక్కులేరు దా
మోదర కౌస్తుభంబు చెడు నోటమిపాలగు నగ్గి కల్ల లం
బోదరుతండ్రి చూ పడఁగు నొప్పుగ దీనిప్రభల్ తమంబులన్
భేదిలఁ జేయునట్టి రవిబింబము సేయు మిముం బునీతులన్.

తా. దేని యుదయమువలన చుక్కలకు రాజైన చంద్రుడు కాంతిహీనుడగుచున్నాడో, శివుని శిరస్సునందున్న చంద్రుడు ప్రకాశింపడో, విష్ణువు వక్షస్థలమున కొస్తుభము కాంతి నీయదో అగ్నిహోత్రము తేజస్సుతో మండదో అట్టి సూర్యమండలము మీ కభ్యుదయము ప్రసాదించుగాత.[76]

చ. తొలుతను తూర్పునం బొడిచి తూరుపు పే ర్దిశ కిచ్చు రెండు జా
ములతరి బగ్గనం దివసముం బొనరించుఁ గ్రామమ్ముగం జగ
మ్ములఁ దపియింపఁ జేయు మది ప్రోచును జీవన మౌచుపుట్టువున్
గలుగఁగఁజేయు నిట్టి దిననాథునిబింబము ముక్తి మీ కిడున్.

తా. ఏది ఇంద్రునిదైన తూర్పుదిక్కున తొలుత ప్రకాశించుచున్నదో దేనివలన ప్రాగ్దిశ ఆను నామము సార్థకమగుచున్నదో, ఏది విస్తరించిన దినము

తేజముచే కాంతిమంతమగుచున్నదో, ఏది జగమునకు ప్రాణమైయున్నదో, ఏది జగత్సృష్టికి హేతువును రక్షణయు, పోషణయు నగుచున్నదో అట్టి రవి మండలము మీకు మోక్షము నొసంగుగాక.[77]

చ. గలగల యెండునేలల యగుం జలధుల్ కులపర్వతంబులున్
దిలతులనంబులై నలుగు దిట్టపుఁ గాఁక యుగావసానవే
శల నని లోకరక్షణపరాయణత న్నిఖిల ప్రభావళుల్
మెలపక వెల్గుమాత్ర మిడు మిత్రునిబింబము మీ ముదంబిడున్.

తా. ప్రళయకాలమున సముద్రము లింకపోవును. కులపర్వతములు పెట్లి పోయి తిలప్రమాణము లగును. అట్లు కాకుండ ప్రతిదినమును జగమును రక్షించు రవిమండలము మీకు శ్రేయము లిచ్చుగాక.[78]

చ. చెరువు వియత్తలం బడుసు చీఁకటి తృప్తికి వచ్చునట్టి బం
భరములపాళి రాహువునుఁ బత్రము పత్ర మితారుణాభలా
యరుణునిశోభ లిట్టి దగునట్టి సహస్రదళంబుగాదే భా
స్కరు ఘనమండలం బిది సుసంగతి మీకును మంగళం బిడున్.

తా. ఆకాశ మను బావిలో చీకటి యను బురద చీల్చుకొని ఱేకులచే వికాసము చెంది, మూగిన తుమ్మెదలు రాహువువలె నొప్పగా నుండు రవి మండలము మీకు కల్యాణముల నిచ్చుగాత.[79]

చ. పురహరునేత్ర మయ్యు నెఱపు న్నిరవద్యతఁ గామపూర్తి సం
సరణ సముద్రనావ యయి జౌకదు గాలికి నెల్ల వేళలం
దిరిగియు నభ్రమంబు జగతిం భ్రమనాశి విరుద్ధకార్యమై
సరసము సూర్యమండలము శాశ్వతసౌఖ్యము మీకు నిచ్చుతన్.

తా. శివుని మూడవనేత్రమయ్యు మన్మథుని దహింపదు సరిగదా కామము నభివృద్ధి చేయును. సంసార సముద్రము దాటించు ఓడయయ్యు గాలికి చెదరిపోదు. తిరుగుచున్నట్లు కనబడుచున్నను, స్థిరముగా నుండును. ధ్వంస క్రియ చేసినను నూతన సృష్టి చేయును. అట్టి సూర్యమండలము మీకు శోభాయమాన మగుగాక [80]