సింహాసనద్వాత్రింశిక/నవమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

సింహాసన ద్వాత్రింశిక

నవమాశ్వాసము

ఇరువది రెండవ బొమ్మకథ

క.

శ్రీరామావిహరణగృహి
నారాయణ నలినవికసన గ్రహారాజా
కారాయమానదివ్యశ
రీరాఢ్యు న్నుతిసనాథుఁ[1] ద్రిజగన్నాథున్.

1


శా.

భక్తిం గోరి తలంచి భోజనృపుఁ డాభద్రాసనం బెక్క ను
ద్యుక్తుండై యిరుదిక్కుల న్మెఱపుల ట్లొప్పారుపుణ్యాంగనల్
ముక్తాశేషలు మోళిపై నిడఁగ సమ్మోదంబుతోఁ జేరఁగా
వ్యక్తాలాపము బొమ్మ పేర్చి[2] పలికె న్వారించుచుం బెంపునన్.

2


క.

ఓరాజ యాస విడువఁగ
నేరవు మావిక్రమార్కనృపుమాడ్కి మహో
దారత్వముఁ దెగువయు నుప
కారంబును లేక యెక్కఁగాఁ దర మౌనే[3].

3


వ.

అది యెట్లన్నఁ దద్గుణంబు లాకర్ణింపుము.

4

సీ.

అష్టభోగంబుల నైశ్వర్యమునఁ గళ
        జలవైరిఁ బురవైరిఁ బద్మవైరి
నతిశక్తి నిలుకడ వితరణగుణమున
        నహిరాజు నగరాజు[4] నంగరాజు
నాహవోత్సవమున నభిమానమునఁ గీర్తిఁ
        గపికేతు ఫణికేతు గరుడకేతు
దృఢముష్టిఁ జేసూటి దివ్యాస్త్రసామగ్రి
        బలరాము రఘురాముఁ బరశురాముఁ


ఆ.

[5]బావనత్వమున ఘనసంపత్తి దీప్తి
ననిలమిత్రుని హరమిత్రు నబ్జమిత్రుఁ
బోలు నితఁడని జనులెల్లఁ బొగడుచుండ
నవనితల మేలె నావిక్రమార్కవిభుఁడు.

5


ఉ.

వాసవు మీఱి నిత్యవిభవంబునఁ బేదలఁ బ్రోచి వైరిసం
త్రాసవిహీనుఁడౌ నతఁడు రాజ్యము మంత్రుల కప్పగించి ష
డ్మాసముల న్విదేశగమనంబు చలించుచు నుండ నొక్కెడన్
వేసవి వచ్చెఁ బాంథులకు వేసట వుట్టఁగ వెట్ట గొట్టఁగన్[6].

6


ఉ.

ఎండకు లావు గల్గఁగ మహీరుహశాఖల నాకు లెల్లఁ బె
ల్లెండల వేఁగ నెందు జల మింకఁగ సుక్కఁగఁ బద్మషండ ము
ద్దండము గాఁగ లోకులు యథావిధి నీడలు గోరుచుండఁగా
రెండవసూర్యునట్లు ప్రసరించె నిదాఘము తద్గుణంబులన్.

7


క.

విరహులమనముల దినమును
బరితాపం బినుమడింపఁ బరిమళములచే

దిరిసెంబులఁ గలిగొట్లం
బరువం బేర్పడఁగ సుష్ఠపవనము వీచెన్.

8


క.

మండెడుమార్తాండద్యుతి
నెండను నొండొండ నెఱియ లేర్పడగా భూ
మండలము పూర్వమున నవ
ఖండము లయ్యును ననేకఖండము లయ్యెన్.

9


క.

ఉదకముఁ గసవును నీడలు
మొదలాఱఁగఁ దలకు మృగసమూహంబులయా
పద లెఱిఁగి యిఱ్ఱి యమృతా
స్పదమై కడుఁ జల్లనైన చంద్రునిఁ జేరెన్.

10


ఆ.

కార్య మయ్యెడునెడ గర్వంబు పూనక
కాలమహిమఁ దన్నుఁ గాచికొనుట
యుచిత మనుచు వెట్ట కోర్వక చలువకై
యత్తవారిఁ జేరె నచ్యుతుండు.

11


క.

తొడిగినపాముల విసమును
మెడవిసమును నొసలిచిచ్చు మెట్టులవడయున్
ముడివడఁగా వడకాలము
గడపుట కడుఁ గడిఁది యయ్యె గరకంఠునకున్.

12


క.

చల్లనిగంగాజలమును
జల్లనిచందురుని గూడ జడలం దిడి తాఁ
జల్లనికొండకు నాశివుఁ
డల్లుండై కొంత బ్రదికె నావేసవిలోన్.

13


ఆ.

అమృతశీతలాంశు వగువార్ధిలోనున్న
పద్మనాభునాభిపద్మగృహము

లోనఁ బుప్పొడియును దేనెయుఁ జల్లంగా
నెండకన్నెఱుంగకుండె నజుఁడు.

14


సీ.

విసనకఱ్ఱలు వట్టివేళ్ళచప్పరములుఁ
        జందనంబులు ఘనసారములును
జల్లనినీళ్ళు నిచ్ఛాభోజనంబులు
        గలవారి కిష్టసౌఖ్యంబు జరుగఁ
బని చేసి గంజి యైనను నంబ లైనను
        నెద చల్లఁగాఁ ద్రాగి యెచట నైనఁ
బడియుండి వెన్నెలగుడిపాట[7]
        పాడఁగా బేదల కాత్మసంప్రీతి గలుగు


ఆ.

మంచురొంపిముసురు లేక మార్గికులకుఁ
జల్లపాటునఁ[8] బయనంబు సాగుచుండు
నచ్చవెన్నెల సుఖనిద్ర యంబుకేలి
యమరు వేసవి కితరకొలములు సరియె.

15


క.

అమృతము రసమ్ముక్రియ వేఁ
డిమి నెగసి జలంబుకడకు డిగజాఱిన చం
దముగా నవ్వేసవి జల
మమృతంబై జీవములకు నది చవి కెక్కెన్.

16


వ.

అట్టి దివసంబుల.

17


శా.

గూఢంబౌ నిజవర్తనం బమర నాక్షోణీవరుం డంత నా
రూఢుండై పరభూములందుఁ గడపెం గ్రూరప్రవృద్ధాతపో
ద్గాఢాంభోరుహమిత్రదీప్తివిదళత్సర్వంసహామండల
వ్యూఢారణ్యవిదాహదావసముదగ్రోష్మంబునన్ గ్రీష్మమున్.

18

ఉ.

అంత విదర్భభూమిఁ బ్రియ మంది చరించి యవంతిరాజు వి
శ్రాంతి యొనర్పఁ గుండినపురంబున కేగి యనంతరంబ య
త్యంతమనోహరం బగు నుపాంతవనాంతము సొచ్చి రుక్ష్మిణీ
కాంతకుఁ దొల్లి తాపి యనఁగాఁ దగు దుర్గగృహంబుఁ జూచుచున్.

19


క.

రుక్మి యనుమతము లేకయు
రుక్మాంగదవరదుఁ[9] డగు వరుం డాగుడిలో
రుక్మాభరణాంచిత యగు
రుక్ష్మిణిఁ గొని చనియెఁ దొల్లి రూఢికి నెక్కన్.

20


ఆ.

అట్టిదేవతాలయము పొంతఁ గొలనిలో
జలకమాడి వెడలి జలజములను
భూవరుండు దుర్గఁ బూజించి ముందట
విశ్రమించియున్న వేళ నొకఁడు.

21


శా.

మార్గశ్రాంతి నొకింత డస్సి విలసన్మాకందసౌరభ్యమౌ
దుర్గారామము చొచ్చి వచ్చి నరనాథుం జేరి విప్రుండు నా
స్వర్గాచార్యుఁడు వోలె నావిభునిభావం బెల్ల నీక్షించి సం
[10]సర్గప్రస్తుతి వాక్యవృత్తి నెఱపన్ సంప్రీతితో నిట్లనున్.

22


క.

ఆజానుబాహుఁడవు రవి
తేజుఁడ వబ్జాదిచిహ్నధృతచరణుఁడ వం
భోజేక్షణుఁడవు భిక్షు
వ్యాజంబున నున్న చక్రవర్తివి చుమ్మీ.

23


చ.

కరులుఁ దురంగమంబులును గాలుబలంబులు నెవ్వి ఛత్రచా
మరములవారు లెంకలును మంత్రులు నయ్యడపంబువాండ్రు నెం

దరిగిరి రాజ్య మొల్లక మృషాకృతిఁ ద్రిమ్మరు టేమి నామతి
స్ఫురణము దప్పకుండ నిఁక బొంకక చెప్పుము నీవు నావుడున్.

24


ఉ.

సత్యము నీమతిస్ఫురణ క్షత్రియవంశకరుండ విక్రమా
దిత్యుఁడ నే నవంతినృపతిం బరదేశవిశేషదర్శనం
బత్యనురక్తిఁ జేయఁగ నయంబునఁ ద్రిమ్మరుచుండుదు న్సుఖౌ
చిత్యగుణంబు నా కిదియ చెప్పెడి దే మిఁక భూసురోత్తమా.

25


సీ.

అనవుడు నాశ్చర్యహర్షంబు లొందుచు
        భూసురోత్తముఁ డాత్మబుద్ధి మెఱసి
మృదులాంబరంబులు మేనఁ బూనక జోగి
        కైవడి నీకంథ [11]గప్ప నేల
హంసతూలికశయ్యయందు నిద్రింపక
        బూడిదలోఁ బడి పొరలనేల
ఘనమైసరాజ్య మేకచ్చత్రముగఁ గల్గఁ
        దిరిపెమై యూరూరుఁ దిరుగనేల


ఆ.

అష్టభోగములకు నాలయం బయ్యు నీ
వష్టకష్టములను నలయనేల
కుడువఁ గల్గి నీకుఁ గుడువలేకుండుట
యల్పతరముగాదె యవనినాథ.

26


క.

[12]ననుఁబోటి పేదయైనను
ధన మించుక కలిగెనేనిఁ దనమది స్రక్చం
దనవనితాదిసుఖంబుల
మనఁ గోరుం బసరమైన మరగదె సుఖముల్.

27

క.

వికటం బగుదారిద్ర్యము
నకుఁ గడపల లేక జీవనము బహుళకుటుం
బకుఁడం గావున జరగక
యొకచో రససిద్ది వడయ నూహించి మదిన్.

28


మ.

అలసత్వంబునఁ బ్రొద్దుపుచ్చక నిరాహారుండనై కంచిలో
పలఁ గామాక్షి గుఱించి యుగ్రతప మేఁ బండ్రెండుసంవత్సరం
బులు సేయంగఁ బ్రసన్న గామి పిదపన్ భూపాల నాయాత్మలోఁ
గలఁగంబాఱుచు దేవి దూఱుచును భిక్షావృత్తిమై[13] వచ్చితిన్.

29


ఉ.

నాకు మహాదరిద్రున కనాథునకు న్భువిఁ ద్రిమ్మరం దగుం
గాక ధనంబు రాజ్యమును గల్గఁగ జోగిక్రియం జరింపఁగా
లోకులు నవ్వరే నృపులలో నినుఁ బోలెడు నట్టివాని నే
నేకడఁ గానఁ జాలు నిఁక నేగుము నీపురికి న్సుఖింపఁగన్.

30


ఉ.

నావుడు లేచి యెండువచనమ్యులు [14]వోవఁగనిమ్ము కంచిలో
దేవత నీతపంబునకుఁ దేరకొనం గరుణింప దంటి భూ
దేవకులాగ్రగణ్య యరుదెంచి భవత్ప్రియ మాచరింపఁ ద
త్సేవ యొనర్చి యేను రససిద్ధి ప్రసిద్దికి నెక్కఁ గాంచెదన్.

31


మ.

పొద మాదేవత యున్నభూమి కని యాభూదేవునిం గూడి స
మ్మదలీలం జని రత్నహర్మ్యముల రమ్యంబౌచు సొంపారు సం
పదలం బొంపిరివోవుకంచి నయమొప్పం జూచి యచ్చోటఁ జ
క్కదమౌ భావనఁ జేరనేగె నృపుఁ డాకామాక్షి నీక్షింపగన్.

32


మ.

అచటం దీర్థములాడి శంభునకు దైత్యారాతికిన్ మ్రొక్కి పు
ణ్యచరిత్రుం డొకరేయిఁ బుచ్చి మఱునాఁ డారాధనారక్తి మై

నచలంబౌ మతి మూఁడురాత్రులు నిరాహారవ్రతుం డైనచో
నుచితస్వప్నమునందు దేవి వలికెన్ యోగప్రసన్నాత్మ యై.

33


చ.

కల యిది నిక్కువం బనుచుఁ గైకొని ముప్పది రెండులక్షణం
బులఁ జెలువారునట్టి నరపుంగవుకుత్తుక నెత్తు రిచ్చి ది
గ్బలి యొనరించినన్ ద్రవిణకారణమౌ రససిద్ధి చేకుఱు
న్వలవదు నీకు నీయనశనవ్రతఖేదము మేదినీశ్వరా.

34


చ.

అనవుడు మేలుకాంచి కడు నద్భుత మందుచు విక్రమార్కుఁ డా
గొనములవాని నింక సమకూర్పఁగ నొండెడ కేగనేల నా
కని మతిఁ దానె సర్వసుగుణాఢ్యుఁడు గావునఁ దెంపుత్రోడఁ గ్ర
క్కున నడిదంబు డుస్సి తనకుత్తుక నొత్తె[15] నుదాత్తచిత్తుఁడై.

35


క.

ఒత్తఁగఁ బ్రసన్నమతి యై
యత్తఱి నడిదంబు వట్టి యాదేవత లో
కోత్తమ నీతెంపున నా
చిత్తం బిగురొత్తె నిష్టసిద్ధి యొనర్తున్.

36


క.

అడుగుమ యనవుడు మది నా
యెడఁ గడుఁ గరుణించితేని నీవిప్రుఁడు దా
నిడుమలఁ బడి పొరలెడిఁ గృప
యెడపక రససిద్ది యితని కిమ్మని మ్రొక్కెన్.

37


ఉ.

మ్రొక్కిన నద్భుతంబును బ్రమోదము నొందుచు యోగమాత దా
నక్కఱ దీర్చునట్టి రస మాతని కిచ్చి యవంతినాయకున్
మిక్కిలి యింపునం బరిణమించి యదృశ్యత నొందె విప్రుఁ డిం
పెక్కి తదీయవర్తన మనేక విధంబులఁ బ్రస్తుతింపఁగన్.

38

ఉ.

ఆనరనాథుఁ డంత వసుధామరు వీడ్కొని వేడ్కతోడ ను
జ్జేనికి వచ్చెఁ గావునఁ బ్రసిద్ధగుణాఢ్యుని వానిఁ బోలలే
వీనగుఁబాటుచేత లిఁక నేటికిఁ గ్రమ్మఱు మన్న నాత్మ[16] ధా
రానర నాయకుం డతనిఁ బ్రస్తుతి సేయుచు నేఁగె నింటికిన్.

39


ఇరువదిమూఁడవ బొమ్మకథ

వ.

మఱియుం ద్రయోవింశద్వారప్రవేశోన్ముఖుండై .

40


క.

ఏవేళనైనఁ బొక్కిటి
[17]యా వెల్లని తమ్మిమొగ్గ యరవిరి గాఁగన్
రేవెలుఁగుఁ బ్రొద్దుఁ గన్నులు
గా వెలిఁగెడివేల్పు కరుణఁ గావుత మమ్మున్.

41


మ.

అనుచు న్భోజవసుంధరాధిపుఁడు పుణ్యాహంబునం జందనా
ద్యనులేపాంబరమాలికాకనకభూషాలంకృతుం డై మహా
సన మెక్కం జనుచోట బొమ్మ వలికెన్ క్ష్మానాథ యావిక్రమా
ర్కునిచందంబున దానవైభవము నీకుం జాల దట్లుండుమా.

42


ఉ.

అతనిదానవైభవమహత్త్వముఁ జెప్పెద భాస్కరాంశసం
[18]జాతుఁడు వాఁడు విక్రమవిశాలభుజాయుగదుర్మదాహిత
వ్రాతవిఘాతడక్షిణుఁ డవంతిమహీశుఁడు తొల్లి చన్న యా
దాతలలోనఁ గర్ణునికిఁ దండ్రిసుమీ తలపోసి చూచినన్.

43


శా.

ఆరాజన్యునిపట్టణంబు విబుధేంద్రాకల్పితం బై సుధ
ర్మారూఢంబును భాస్వదీశ్వరవసువ్యాప్తంబునై పుణ్యవి
స్తారంబై యమరావతీపురవిలాసం బంది నిత్యోత్సవా
దారంబై పరఁగున్ దురంతదురీతోదారవ్యథాదూర మై.

44

సీ.

అట్టిపట్టణ మేలు నమ్మహీకాంతుఁడు
        దేశాంతరాసక్తిఁ దిరుగుచుండు
నెలమితో షణ్మానములు పుచ్చి మగిడిన
        నప్పుడు మంత్రులు నాప్తజనులుఁ
బౌరు లుదారులుం బరివారమును గూడి
        పీలికూటంబులు మేలికట్లు
తలిరుఁదోరణములు నలరుపందిరులును
        మొకరతో రణములు మున్ను గాఁగఁ


ఆ.

బురి యలంకరించి కరిరాజు మున్నిడి
కదలి పంచవాద్యఘనరవముల
నెసఁగు దర్సెనంబు లిచ్చి యెదుర్కొని
తెచ్చి రుత్సవంబు పిచ్చలింప.

45


ఉ.

ఆజననాయకుడు జవనాశ్వము లెక్కి చెలంగి ముందటన్
రాజులు భృత్యులై కొలువ రత్నవిభూషితమూర్తులైన యం
భోజదళాక్షు లారతులు మున్నుగఁ దన్నుఁ బురస్కరింపఁగా
రాజగృహంబు సొచ్చెఁ గవిరాజనవామరరాజభూజమై.

46


ఉ.

ఈపగిదిన్ గృహంబునకు నేఁగిన యాతఁడు తొల్లి యోగని
ద్రాపరిశీలియయ్యు నుచితంబుగ రాజ్యము చేసె నేర్పునం
దాపసవేషియై జవపదంబులు గ్రుమ్మరి క్రమ్మఱన్ ధరి
త్రీపరిపాలనాభిరతి దేఁకువకెక్కిన రాముకైవడిన్.

47


ఉ.

పెక్కుదినంబు లక్కడ నభీష్టవధూజనమందిరంబులం
దొక్కొకనాఁడు రేయి మదనోత్సవలీలలఁ దేలుచు న్విభుం
డక్కఱ దీఱఁ దొంటి విరహవ్యథ నెక్కుడు స్రుక్కి మిక్కిలి
న్మక్కువ కెక్కువైన [19]మగనాలి గృహంబున రాత్రిపుచ్చుచున్.

48

శా.

అంతర్గేహములందుఁ గ్రొవ్విరులపర్యంకంబుపై వేడ్కతో
గాంతారత్నముతోడఁ గూడి పిదపం గందర్పకేలీపరి
శ్రాంతుండై శయనంబు రెండుదెసలన్ రత్నంపుదీపంబు ల
త్యంతంబు న్వెలుఁగొందఁ గామసుఖనిద్రాసక్తుడై యుండుచున్.

49


చ.

బలబలఁ దెల్లవాఱునెడఁ బార్థివశేఖరుఁ రత్యరిష్టమౌ
కలఁగని మేలుకాంచి యధికం బగువిస్మయ మంది లేచి తా
జలకము దీర్చి సంధ్యపరిచర్య యొనర్చి యనేక భూషణో
జ్జ్వలనిజమూర్తియై కొలువుసాలకు వచ్చి కవు ల్నుతింపఁగన్.

50


ఆ.

వచ్చి దొరలు గొలువ వజ్రసింహాసనా
రూఢుఁడై ముఖాబ్దరుచి యెలర్పఁ
దన్నుఁ గొలుచువారిఁ దగురీతి మన్నించి
తేరకొనఁగ హితులదిక్కు చూచి.

51


క.

వినుఁ డేను రక్తచందన
మున నంగము దోఁగ మేఘమున కెనయను కా
రెనుబోతు నెక్కి యామ్యము
[20]చనుచుంటినొకండ నంచు స్వప్నముగంటిన్.

52


క.

ఈకల శుభమో యశుభమొ
నా కనవుడు నందఱు న్మనంబుల భీతి
వ్యాకులులై వదనము లా
లోకింపఁగ దృష్టకౌశలుం డొకఁ డనియెన్.

53


క.

ధాతుగుణంబులఁ గల లుప
జాతములౌ[21] వినికి జూడ్కి సంస్మరణమునన్

రీతి యెఱిఁగి కల విఱుచుట
నీతి చుమీ విఱుపుకొలది నిజమౌ నదియున్.

54


ఆ.

వినుము ధరణినాథ విన్నప మియ్యెడఁ
దొల్లి యొక్క మనుజవల్లభుండు
దేవుఁ డుదయమైన యావేళఁ గలగని
లేచి యొద్ది వనితఁ జూచి పలికె.

55


క.

సన్నపుగట్టుననుండి స
మున్నత మగుకొండమీఁది కుఱికితి నని నే
జిన్నకలఁ గంటి నీఫల
మొన్నఁగ నీమదికిఁ జూడ నెట్లగుఁ జెపుమా.

56


వ.

[22]నావుడు నది ప్రేమపాత్రం బగుభోగస్త్రీ గావున బరిహాసరూపంబుగా నగుచు దిబ్బనుంటి కొండ కుఱుకబోయిన నడుముం గాలు విఱుగంబడియెద వనిన.

57


క.

నగుచుం గేహము వెలువడి
జగతీపతి జలకమాడి సంధ్యార్చన యొ
ప్పుగఁ దీర్చి యేగి కొలువునఁ
దగువారలవంకఁ జూచి తనకలఁ జెప్పెన్.

58


క.

చెప్పిన [23]నతనికిఁ గలలో
నప్పర్వత మెక్కుడిది మహాశుభ మగు నే
చొప్పున ఫల మొనగూడునొ
తప్పక వినిపింతుమనుచుఁ దలపోసి యటన్.

59

క.

నీరాజ్య మల్ప మిది యిఁక
నేరీతులఁ జూడ నీకు నింకన్నధిక
శ్రీరమ్య మైన రాజ్యము
చేరంగల దనుచు వారు చెప్పిరి పతికిన్.

60


ఉ.

అత్తఱి వచ్చి యొక్కఁడు రయంబున మ్రొక్కి నృపాలశేఖరా
యుత్తరదేశ మేలెడు నృపోత్తముఁ డీల్గిన మంత్రు లన్యులం
జిత్తములందు మెచ్చక విశిష్టగుణాఢ్యుఁడ వంచు రాజ్యము
న్విత్తముఁ గూడ నీ కొసఁగు వేడుకఁ [24]బుచ్చినఁ గానవచ్చితిన్.

61


చ.

అనవుడుఁ జోద్యమంది యతఁ డాప్తులమాటలు నిక్కమైన నె
మ్మనమునఁ బొంగి వారికిఁ గ్రమంబునఁ గోరిన వాని నెల్ల మె
చ్చున కొనఁగూడ నిచ్చి తగుశూరులు వీరులుఁ గొల్వ నుత్తరం
బున కధికప్రతాపమునఁ బోయె నరాతికులంబు బెగ్గిలన్.

62


వ.

అంత నద్దేశంబుఁ బ్రవేశించుచు మనోల్లాసంబున.

63


క.

తఱచైన మంది ముందఱఁ
[25]బరువడిఁ జని తలఁగ ధరణిపతి తురగంబుం
బఱపుచు [26]ముందలఁ దనకల
విఱిచినక్రియ గ్రుంతఁ గాలు విఱుగంబడియెన్.

64


వ.

అప్పు డందఱును హాహాకారంబుల గుంపులు గూడుకొని పలువరింపంగ వారిలో [27]సద్యస్సంధాననిపుణుం డగుజెట్టి ఫట్టి దట్టి గట్టిగాఁ గట్టి మంత్రించి [28]సుఖితుం జేసిన సుఖాసనంబుపై నాసీనుండై చనంగ.

65

శా.

ఆదేశంబున మూలదుర్గమగు ప్రోలావాసమై యున్న ధా
త్రీదేవప్రకరంబుఁ దత్ప్రజలు మంత్రిస్తోమముం బూజితం
బౌ దంతావళముం బురస్సరముగా నంకించి యేతెంచి యా
హ్లాదం బొప్పఁగ రాజుఁ గూడుకొని వాద్యంబు ల్వడిన్ మ్రోయఁగన్.

66


ఉ.

వచ్చినవారికెల్లఁ బతి వైభవ మేర్పడ నల్లపట్టులుం
బచ్చనిపట్టు కెంపు గల పట్టులు సొమ్ములు నాదరంబుతో
నిచ్చి గజంబు నెక్కి తరళేక్షణ లాడుచుఁ బాడ వీటిలోఁ
జొచ్చి యమాత్యు లౌననఁగ సుస్థిరుఁడై ధరయేలెఁ గావునన్.

67


క.

తెలియక పలుకుట యుచితమె
జలజభవుం బోలునట్టి సచివుని భట్టిం
బలిపింపు మాతఁ డెఱుఁగని
కల లెవ్వియు లేవు పొందుగా నది చెప్పున్.

68


చ.

అనునెడ భట్టి వచ్చినఁ గృతాదరుఁడై తనపొంత నాసనం
బునఁ దగ నుంచి విక్రమవిభూషణుఁ డా కలఁ జెప్పి యే విధం
బున నిది యున్న దీవు తలపోసి నిజంబుగ నాకుఁ జెప్పుమా
యనవుడు నయ్యమాత్యవరుఁ డాత్మఁ గలంగి కలంగ కిట్లనున్.

69


మ.

ధరణీనాయక వీ రెఱుంగరే నిషేధం బంచుఁ జెప్ప న్భయా
తురచిత్తంబుల నున్నవార లిచటన్ దోషంబు నిర్దోషము
న్వెరవారం దలపోసి చెప్పఁదగు నుర్వీభర్తకు న్మేలుగాఁ
బరిశీలించు నిజాప్తవర్గమున కీభంగి న్భయం బేటికిన్.

70


ఆ.

కలకు మొదలిజాము ఫల మొక యేఁటిలో
నందుకొను ద్వితీయయామఫలము
అష్టమాసములకు నబ్బు మూఁడవజాము
ఫలము చూడ మూఁడు నెలలఁ గలుగు.

71

క.

తొలివేకువగాఁ దూర్పునఁ
దెలు పెక్కఁగఁ గన్నకలలు దినదశకమునన్
ఫలియించుఁ [29]బసులవిడువం
దలఁకొనుకల సిద్ధిఁ బొందుఁ దద్దివసమునన్.

72


క.

ఏనుఁగు గుఱ్ఱముఁ బచ్చని
మ్రానును మేడయును మెట్టు మగపసరంబుం
బూని కలలోన నెక్కిన
మానవునకు సుఖము రాజ్యమహిమయుఁ గలుగున్.

73


క.

కలలోఁ బాములుఁ దేళ్ళును
జెలగలు గఱచుటయుఁ [30]జావుఁ జెప్పెడుఁ బొరిమై
మలమంటుట పొందందగు
లలనలఁ బొందుట సుతార్థలాభము చుమ్మీ.

74


క.

[31]తలఁ బేను దినుటయును బ్రే
వులఁ జుట్టఁగఁబడుట మానవుల నెత్తురుఁ గం
డలుఁ బెరుఁగుఁ బాలు మద్యం
బులు [32]నెయ్యిని ద్రావుటయును ముదమగుఁ గలలన్.

75


ఆ.

నీరు నెత్తురుఁ గనిన [33]నిడుదగు నాయువు
మంట గంట పసిఁడిపంట గంట
తెలుపు లెల్ల మేలు కలలోన వెలిమిడి
యెముక ప్రత్తి లవణముముకదక్క.

76


క.

వినుమిఁక [34]మొద్దును గాడిద
నెనుపోతును లొట్టిపిట్ట నెక్కిన నన్నం

బును బిండియు నువ్వులు గలఁ
[35]దినఁగన నగుఁ గీడు వసుమతీవరతిలకా.

77


క.

నూనెయుఁ గలియును గ్రొవ్వును
దేనెయుఁ గలఁ ద్రావెనే నతివ్యాధియగున్
వానరము బొగయుఁ గాకియుఁ
గానంబడెనేని గీడు గానఁగవచ్చున్.

78


క.

మదగజము దేవరయు మృగ
మదమును గోపురము నీలమణులు న్నవనీ
రదములు ధరణియు యమునయు
నుదకుంభము దక్క నలుపు లొప్పవు గలలన్.

79


చ.

జనవర నల్పులందు మహిషం బతినింద్యము దాని నెక్కిన
ఘనమగుకీడు గాన నధికం బగుశాంతి యొనర్చి యాకృతాం
తునకు మహోపచారములఁ దుష్టి జనింపఁగఁ జేయ మేలగు
న్నినుఁ బనివంప నిట్లొరులు నేర్తురె రాజవు నీవు నావుడున్.

80


మ.

ధరణీశుం డిది యెంతకార్య మని యుత్సాహంబుతో శాంతి చె
చ్చెరఁ గావించి కృతాంతుఁ బూజల నతిక్షేమంకరుం జేసి స
ద్గురులం బేదల విప్రుల న్వరుసతో గోభూతిలార్థంబులం
బరమప్రీతులఁగా నొనర్చి పిదప న్బండారితో నిట్లనున్.

81


క.

భాండాగారములందుఁ బ
సిండియు రత్నములుఁ బట్టుఁజీరలు ధనము
న్నిండ నిడి తలుపు లెవ్వియు
నుండఁగనీయకుము నీవు నుండకు మచటన్.

82

వ.

నీ విప్పుడు పెద్దతలవరికి రాజు బండారంబు చూఱవిడిచె నేఁడు మొదలుగా నేడుదినంబులుదాఁక జను లెల్ల నిచ్చకు వచ్చువానిం గొనిపొండని చాటించి దేశంబువారి నెల్లఁ జూఱకు రండని యీప్రొద్దె బంట్ల నూరూరికి బంచుమని చెప్పు మనవుడు భాండాగారికుం డతివిస్మితుండయి ధనకనకాదివస్తువులం గోశగృహంబులు నించి విఘటితకవాటంబులుగఁ జేసి తలవరికిం దత్క్రమం బెఱింగించిన.

83


క.

జనపతి యేడుదినంబులు
తనబండారంబు వస్తుతతి చూఱలుగా
నొనరించు వలయునది కొని
చనరో యని యతఁడు వీటఁ జాటఁగఁబంచన్.

84


క.

ఊరూరికిఁ జెప్పఁగఁ దన
వారిని బనుచుటయు నెల్లవారును గుంత
న్వారింపఁబడక చేరెడు
వారిక్రియ న్వచ్చి రయ్యవంతీపురికిన్.

85


ఆ.

వచ్చి వీరువారుఁ జొచ్చి విచ్చలవిడి
బుడమతోఁట వీటిఁబుచ్చునట్లు
నేడుదినము లం దనేకవస్తువులను
గొనుచు నేగి రింపు గొనబుసాఁగ.

86


క.

తనిసి ప్రజ చనిన నష్టమ
దినమున బండారి వసుమతీరమణునకున్
వినిపించెఁ బూని చూచిన
ధనసంఖ్య త్రయోదశార్బుదము లయ్యె జుమీ.

87


ఉ.

ఈగతిఁ జన్న యీగి ధరణీశ్వర నీకడలేదు గావునన్
వేగమె క్రమ్మఱం జనుము వీఱిఁడిచేఁతలు మాను మన్న సా

త్యాగ నిరూఢికి న్మిగుల నచ్చెరువందుచు భోజుఁ డాత్మ ని
త్యాగమనంబు రోసి తనయంతిపురంబున కేగె సిగ్గునన్.

88


ఇరువదినాలుగవ బొమ్మ కథ

వ.

మఱియు నొక్కదినంబునఁ జతుర్వింశద్వారంబునం గడంగి.

89


క.

శీతగిరిబంధు [36]నూతన
శీతకరాభరణు సింధుశీతలమౌళిం
జేతో జాతవిఘాతి
న్భూతివిభూషణుని సర్వభూతాధ్యక్షున్.

90


చ.

తలఁపుచు విక్రమార్కుని కథాశ్రవణంబున కిచ్చగించి యు
జ్జ్వలమణికిలితం బగు దివస్పతియాసన మెక్కవచ్చుచోఁ
బలికెఁ బసిండిబొమ్మ జనపాలక నీదు తలం పెఱింగితి
న్వలదననేల మేలు వినవచ్చినవారల మాన్పవచ్చునే.

91


శా.

ఓ భోజక్షితిపాల! నిల్చి వినుమా యుర్వీశుఁ డీశార్చనా
లాభాసక్తుఁడు శక్తుఁ డింద్రసమలీలాచారి యాచారి యా
శాభాగప్రవికీర్ణమౌ యశమున న్సర్వార్థి దారిద్ర్యము
ద్రాభంగక్షమదృష్టదృష్టికరుణోదారుండు ధీరుం డిలన్.

92


శా.

ఆ రాజన్యుఁడు నేల యేలునెడ నత్యాశ్చర్యమౌ నేఱులై
క్షీరంబు ల్ప్రవహించు మ్రాఁకుల మధుశ్రేణు ల్మహావృష్టిసం
ధారాపాతములై స్రవించు ధరణిన్ ధాన్యంబులుం బర్వతా
కారత్వంబునఁ బండుచుండు నరలోకం బొప్పుఁ దత్సంపదన్.

93


ఆ.

అట్టి దివసముల జనాధీశ్వరుండు దే
శాంతరములు చూడ నరుగువేళఁ

[37]ప్రబలమైనధనవిభాగముల్ దీఱక
వైశ్యసుతులు కోరి వచ్చి రటకు.

94


ఆ.

వచ్చి సాగి మ్రొక్కి వసుమతీనాయక
నలుపురమును సోదరులము మేము
విన్నవింతు మొకట వినుము 'పురందర
పుర' మనంగ నొక్కపురము గలదు.

95


క.

సుందరులు మేనకొదులఁ
గ్రిందుపఱుపఁ బురుషు లమరకిన్నరులను లీ
లం దెగడఁగ నాపురికిఁ బు
రందరపుర మనఁగఁ జేరు రమణీయ మగున్.

96


ఉ.

ఆపురమధ్యమంబున మహారజతాంచితకుంభదీప్తి సం
దీపిత మైన మేడ హిమదీధితిబింబము మీఱు నందు [38]సు
స్థాపితవైభవుండు ధనదత్తుఁడు మజ్జనకుండు వైశ్యము
ద్రాపరిపాలకుండు ధనదప్రతిరూపకుఁ డుండుఁ బెంపునన్.

97


చ.

సదమలచిత్తుఁడౌ నతని సద్మమునన్ ఘటసన్నిభంబులౌ
పొదుగులపాలు క్రిక్కిఱిసి భూమి తదీయయశస్వరూపమై
చెదరఁగ మందయానములఁ జెన్ను వహించుచు వేలసంఖ్యల
న్మొదవులు కామధేను నిజమూర్తు లన న్విలసిల్లె నయ్యెడన్.

98


క.

కలలోనై నను గఱవును
దలయెత్తఁగనీక జహువిధంబులధాన్యం
బులరాసులు తద్గృహములఁ
గొలఁది యెఱుఁగరాకయుండుఁ గొండలభంగిన్.

99

క.

అనిలునితోడి వివాదం
బున డొల్లిన మేరుశిఖరముల కెన యనఁగా
దినకరున కెదురు [39]వెలుఁగుచుఁ
గనకంబులప్రోవు లతనిగాదెల నొప్పున్.

100


క.

ఓమనుజాధిప యతనికిఁ
దూమెం డల్కినను బుట్లు తొంబది పండం
గామెఱయు పొలముగల స
ద్గ్రామంబులు నూఱు గలవు కంచికి నెనయై.

101


ఉ.

ఈగతిఁ బెక్కుసంపదల నెన్నిక కెక్కిన మద్గురుండు నీ
రోగశరీరుఁడై బ్రదికి రుద్రసఖుం డనఁ గీర్తి దాల్చుచుం
ద్యాగము భోగము జరపి దైవగతిం గడకాలమైన ఖ
ట్వాగతుఁడై తనూభవుల వద్దికి నల్వురఁ బిల్చి యిట్లనెన్.

102


సీ.

ధరణిపై నిడుఁడు ముందటిక్రియ సాగించు
        డర్థంబునకుఁ గాటులాడవలదు
క్రమమున నాల్గుమంచముకోళ్ళక్రింద నేఁ
        బాతినయవి మీకుఁ బాళ్ళు గాఁగఁ
గైకొనుం డాప్తవర్గంబును బెద్దల
        వైశ్యధర్మంబుల వదలవలదు
సంతసంబును బుద్ధిమంతులై [40]పెద్దలఁ
        బోలి బ్రతుకుఁ డంచు బుద్ధి సెప్పి


ఆ.

మిగుల నడలి నేము దిగువకు డించిన
యంత గురుఁడు శివునియందుఁ గలిసె

నాత్మజాతి కుచితమైన సంస్కారంబు
నడపి తద్దినములు గడపి పిదప.

103


క.

సుముహూర్తంబున నామం
చముకోడులక్రిందఁ ద్రవ్వి చరువులలోఁ జి
ట్టుముకయు మన్నును బొగ్గులు
నెముకలు వేర్వేఱఁ జూచి హృదయము లులికెన్.

104


మ.

భువిలో డాగఁగఁ జేసి రాగిచరువు ల్పూరించి యీతుచ్ఛవ
స్తువు లేలా మనయయ్య డాఁచె ధన మిచ్చోఁ బెట్టఁడో కాక బు
ద్ధివినాశం బతఁ డొందె నొక్కొ మనలో దృష్టించి యెవ్వాఁడొ దొం
గవిధం బచ్చుగఁ ద్రవ్వి చేకొనియెనో కా కంచుఁ దర్కించుచున్.

105


ఇచ్చోట రెండు పద్యము లర్థము కాకున్నవి.


క.

అయ్య పనిగాదు దాసులు
నియ్యెడ దృష్టింపనేర రెవరుం జొరలే
దయ్యముగా నా కెంపులు
దయ్యము గొఱయించెననుచుఁ దలపోఁతలతోన్.

106


క.

మాలో నమ్మకయును నొక
పాలుం దేలకయు బహుసభాస్థలముల నీ
మూలములు చెప్పి విసిగితి
మేలాగున నైన నిర్ణయించు నృపాలా.

107


వ.

అని విన్నవించిన సుముహూర్తమాత్రప్రయాణోన్ముఖుండు గావున ధర్మాధికారులను మంత్రులను బిలిపించి దీని నిర్ణయింపుఁ డని యప్పగించి విక్రమార్కుండు కొన్నిపయనంబులు భట్టి సహాయుండుగాఁ జనిన.

108

శా.

ధర్మాధ్యక్షులు మంత్రులుం బిదపఁ దద్వాదంబు దీర్ప న్వణి
ఙ్మర్మం బేమియుఁ గానలేక నగుచు న్మాకేల కల్లాడ నం
తర్మాయపరుఁడైన మీజనకుఁ డర్థం బుండఁగాఁ బాళ్ళుగా
నిర్మించె న్మును బొగ్గు లాది యగువానిం బంచికొం డిమ్ములన్.

109


మ.

అని హాస్యంబుగఁ జేసి పుచ్చినను నర్థాసక్తులై[41] వైశ్యనం
దను లూరూరికి నేగి చెప్పికొనుచున్ ధాత్రిం బ్రతిష్ఠాననా
మనిరూఢం బగు వీడు చొచ్చి చని తన్మధ్యంబునన్ శాలివా
హనునిం గాంచిరి దివ్యతేజుఁ డయి బాల్యక్రీడఁ గ్రీడింపఁగన్.

110


చ.

కనుఁగొని దివ్యమూర్తి యని గౌరవ మెంతయుఁ దోఁప మ్రొక్కి యో
దినకరతేజ మాతగవు దీర్పుము ధారుణి నెల్లచోటులం
గనికని చెప్పి నిర్ణయము గానక వచ్చితి మంచుఁ దండ్రి చే
సిన నియమంబు మున్నుగ నశేషముఁ జెప్పిన నక్కుమారుఁడున్.

111


క.

మీతండ్రియ పాళ్ళులు ని
ర్ణీతములుగఁ జేసి చనియె నేరక మీ రీ
భూతలమునఁ దిరుగఁగ నొక
చాతుర్యము గలుగునట్టి జనుఁడును లేఁడే[42].

112


వ.

అయిన నేమి యయ్యెఁ దెలియ విండు.

113


ఆ.

ఉముక ధాన్యరాసు లెముకలు పశువులు
మన్ను పొలముగలిగియున్నయూళ్ళు
బొగ్గులును బసిండిప్రోవులు పాళ్ళుగా
నిచ్చినాఁడు వానిఁ బుచ్చికొనుఁడు.

114

ఆ.

పాదరనము పసులు పసిఁడి యర్థధనంబు
పావుగొఱఁత ధనము పండుభూమి
ధరణి నధికధనము ధాన్యంబు గావున
వాని గొనుఁడు పెద్దవానివరుస.[43]

115


చ.

అనవుడుఁ జోద్యమంది కొనియాడుచుఁ గ్రమ్మఱ మ్రొక్కి వైశ్యనందనులు కృతార్థులై మగిడి తండ్రిగృహంబున నున్న సొమ్ము లాతనివచనస్థితిం గొని ముదంబున నుండఁగ విక్రమార్కుఁ డొయ్యనఁ బరదేశముల్టిరిగి యాత్మపురంబున కేగి యిమ్ములన్.

116


చ.

వలనుగ నొక్కబాలకుఁడు వైశ్యులపాళులఁ దీర్చెనంచు మం
త్రులు వినిపించిన న్విని విరుద్ధము బాలున కివ్విశేషకౌ
శల మని చోద్యమంది నిజశత్రునిగా మది నిశ్చయించి భృ
త్యులదెసఁ జూచి వాని నిట దోడ్కొనిరం డని పంచెఁ బంచినన్.

117


ఉ.

ఆనరనాథుభృత్యులు మహాబలు లేగి రయంబునం బ్రతి
ష్ఠానపురంబు సొచ్చి శిశుసంగతి నాడెడు శాలివాహు ను
జ్జేనికి విక్రమార్కుని భజింపఁగ రమ్మని పల్కునంత వై
శ్వానరుమీఁద నెయ్యొలుకుచందము గానఁగ నయ్యె నయ్యెడన్.

118


ఆ.

వెఱ్ఱిజోగిఁ జూపి విక్రమార్కుం డని
వెఱపువెట్టి విఱ్ఱవీఁగవలదు
మీనృపాలకుండు తానె రా జౌనేని
నిటకువచ్చి బ్రతికి యేగు మనుఁడు.

119

క.

మీరుం బొలియక పొండని
వీరుండై పలికె నంత వీరుం దమయు
ర్వీరమణునకుం జెప్పఁగ
వైరం బిఁకఁ బుట్టు ననుచు వచ్చిరి మగుడన్.

120


వ.

అంతకుము న్నొకదినాధికవర్ష యగుకన్యకకుం బుట్టినవాని నరయం బోయిన బేతాళుండు నతనియునికి వినిపింపంగ నతని భృత్యులుం జని యోమహారాజ నీయాజ్ఞతోడంగూడ మమ్ముఁ బాఱఁ ద్రోపించె నబ్బాలుండు బాలార్కులీలం గ్రాలుచుండు నని చెప్పి [44]తద్ధీరోక్తు లెఱింగించిన.

121


క.

కలఁగియుఁ గలగక యాతఁడు
బలములు గొలుపంగ నేగి పైఠాణము ద
వ్వుల విడిసినఁ గొందఱు భృ
త్యులు ముందఱఁబాఱి గవనిదూఱిరి పెలుచన్.

122


సీ.

తూఱి తోరణములు ద్రుంపఁగాఁ బ్రజ లెల్ల
        నడలిన వారిభయంబు లుడిపి
తండ్రియౌ నాగేంద్రుఁ దలఁచి తచ్ఛక్తిఁ గృ
        త్రిమరూపములకుఁ బ్రాణములు వడసి
కదలుచో నిండ్లు వృక్షంబులు గోటలు
        జంగమత్వము నొంది సరస నడచె
నొకశాల నెక్కి బాలకుఁ డది యాదిగా
        శాలివాహనుఁ డను సంజ్ఞఁ దాల్చె


ఆ.

సేన లట్లు వెడలి భూనాథుభృత్యులఁ
బఱపి మొదలిదండుపైఁ గడంగి

పోరునప్పు డురగములు శేషుపంపున
వచ్చి విక్రమార్కువారి నడఁచె.

123


మ.

తన సైన్యంబులు ఘోరసర్పవిషనిర్దగ్ధంబు లైన న్మనం
బునఁ జింతించి యతండు వాసుకి మహాభోగేంద్రు సేవించి యా
తనిచేత న్సుధఁ దెచ్చి సేనలకుఁ జైతన్యంబు రప్పింతు నే
నని యేగె న్నిజభృత్యరక్షణగుణాయత్తుండు మంథాద్రికిన్.

124


క.

ఆ మందరగిరితటమున
భూమీశుఁడు భక్తినిష్ఠ భుజగేంద్రకుల
స్వామికిఁ దపమొనరింపఁగ
నామహనీయుఁడు ప్రసన్నుఁడై వేఁడు మనన్.

125


క.

నీరూపం బమృతోద్భవ
కారణ మటు గాన నీవె కర్తవు నాసే
నారక్షణమునకు సుధా
పూరిత మగుకలశ మిచ్చి పుచ్చు మహీంద్రా.

126


చ.

అని ప్రణమిల్లిన న్ఫణికులాధిపుఁ డయ్యమృతంబు కుండలో
నినిచి ప్రియంబుతో నొసఁగి నీ విఁక నేగుము నావుడు న్రయం
బునఁ దమతల్లి దాస్యము విముక్తము సేయ సుధారసంబు నే
ర్పునఁ గొనివచ్చు పక్షిపతిపోలికతో నృపుఁ డేగుదేరఁగాన్.

127


ఉ.

దీప్రముఖప్రసన్నుతు లతిప్రమదప్రకృతిప్రశస్తలో
కప్రియవాదు లప్రకటకార్యులు సుప్రభలందు సూర్యచం
ద్రప్రతిమాను లప్రతిహతప్రతిభాగతి నప్రమేయులౌ
విప్రకుమారు లంతఁ బృథివీపతిఁ జేరి నుతిప్రవీణులై.

128


సీ.

శివుఁ డిచ్చ మెచ్చి యిచ్చిన దివ్యఫలముఁ గా
        రుణ్యంబుతోఁ గుష్టరోగి కిచ్చి

యవధూతుఁ డిచ్చిన యాసిద్ధలింగంబు
        నాహార మడిగిన యతని కిచ్చి
కంబ మెక్కిననాఁడు కమలాప్తుఁ డిచ్చిన
        కుండలంబులు యాచకునకు నిచ్చి
యసురేంద్రుఁ డిచ్చిన రసరసాయనములు
        కలహించు నిద్ద రర్థులకు నిచ్చి


ఆ.

నయముతోఁ ద్రిగాలనాథుఁ డిచ్చినబొంత
యాదిగాఁగ రాచపేద కిచ్చి
వీరవిక్రమార్క ధారుణిఁ జరియించు
పారిజాత మనఁగఁ బరఁగి తీవు.

129


క.

ఖేచరపతిశిబికర్ణద
ధీచుల నినుఁ బోల్పరాదు దీనుల కర్థం
బేచోట నిచ్చి రుర్విని
నీచాగము సర్వవస్తునివహము గాదే.

130


క.

అర్థం బన్యుల నడిగిన
యర్థులు వ్యర్థులును గడు నిరర్థులు నట యో
పార్థివ నినుఁ బ్రార్థించిన
యర్థులు సార్థులుఁ గృతార్థు లధికసమర్థుల్.

131


మ.

అనుచుం బెక్కువిధంబులం బొగడఁగా నాబాలవిప్రద్వయం
బును వారించుచు నింత యేల హృదయాంభోజంబులో నున్న ప్రా
ర్థన మీకే మది వేఁడుఁ డిత్తు ననినఁ ధాత్రీశ్వరా నీవు ద
ప్పనిరాజేంద్రుఁడ వేని యాయమృతకుంభం బిమ్ము మా కింపగున్.

132

క.

అనుచు న్వాలాయంబుగఁ
దను వేఁడిన మనములోనఁ [45]దత్తఱవడ కే
మనవచ్చు మీరు నావ
ర్తన మెఱుఁగుదు రెవ్వరొక్కొ దైవతమూర్తుల్.

133


క.

తెలిసెద నని నృపుఁ డావి
పుల సంబోధించి యిచటఁ బొంకకుఁ డధికో
జ్జ్వలము లగునర్థిరూపం
బుల మీ రెవ్వరు సమస్తముం జెప్పుఁ డనన్.

134


ఆ.

[46]శాలివాహు నట్లు చంపఁ గడంగు నీ
బలము ఫణులచేతఁ బొలిసినంత
వాసుకికిఁ దపంబు సేసి నీ వమృతము
వడయు టెఱిఁగి మమ్ముఁ నినిచె నతఁడు.

135


క.

వడుగు లయి విక్రమార్కుని
కడకుం జని వేఁడి యమృతకలశము మీచే
పడఁ జేసికొనుఁడు యాచకు
లడిగిన వంచింప కిచ్చు నతఁ డని చెప్పెన్.

136


క.

తప్పక చెప్చితి మేమును
దప్పక నీవును యథోచితము సేయుము నీ
చొప్పు వొగడ వేజిహ్వల
యప్పన్నగవిభున కైన నలవియె భూపా.

137


వ.

అని నిజరూపంబులు చూపినం గొంత చింతించి విక్రమార్కుం డర్థు లడిగినం దనకు మోచినపని గాన నీక తలంగె నను నపకీర్తి వచ్చు దీనిమీఁద

నఖిలజగదాధారస్తంభం బగుకుంభీనసేంద్రుండును దన్నింతవానిఁగా దలంచి వీరలం బంచినచోట వృథపుచ్చుట నాదొడ్డతనంబునకు మిగులం గొఱంత గావున వైరిమనోరథంబులతోడం గూడ నాయశంబు వర్ధిల్లుంగాక యనుచు నిశ్చయించి.

138


క.

కుండలిబాలకులకు నధి
కుండగు భుజగేంద్రనాయకుం డటు మెచ్చం
గుండ యమృతంబు నేఁ డీ
కుండఁగఁ దగ దనుచుఁ దప్పకుండఁగ నిచ్చెన్.

139


ఉ.

ఈ వెరవొప్ప నర్థులకు నిచ్చి యతం డరుదెంచెఁ గ్రమ్మఱం
గావున నీకు నీగుణము గల్గిన గ్రక్కున దీని నెక్కుమా
నావుడుఁ దద్గుణశ్రవణనందితచిత్తసరోజుఁడైన భో
జావనివల్లభుండును గృహంబున కేగి మతి న్నుతింపుచున్.

140


శా.

సారాచారవిచారచారుచరితక్ష్మానిర్జరవ్రాతచే
తోరాజీవనిరంతరోల్లసితవిద్యోతప్రభాధామునిం
బారావారపయోవిహారభువనప్రారంభనిద్రాఖ్యమా
యరామాహతకైటభాదిఘనదైత్యస్తోము దామోదరున్.

141


శా.

శర్వాణీహృదయాంబుజాహిమరుచి న్సర్వంసహాభృద్ధను
ర్మౌర్వీభూతమహాభుజంగమపతిన్ మందాకినీజూటునిన్
సర్వజ్ఞు న్సకలేశ్వరు న్భువనరక్షాదక్షిణప్రాభవున్
గీర్వాణవ్రజసంతతాభిలషితక్షేమంకరు న్శంకరున్.

142


మాలిని.

విధురజనశరణ్యా వేదశాస్త్రాద్యగణ్యా
బుధహితనరవేషా భూషణీభూతశేషా
మధుకరనిభతేజా మౌక్తికాళీసమౌజా
మధురిపుహరిరూపా మర్మకర్మస్వరూపా.

143

గద్యము.

ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళ కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిలాంధ్రమహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదప్రోలిపురవరాధీశ్వర వెలనాఁటిపృథ్వీశ్వరరాజ్యసముద్ధరణ కొఱవి వెన్నయామాత్య పౌత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసువరాజతనూజ గోపరాజప్రణీతంబైన సింహాసనద్వాత్రింశిక యనుకావ్యంబునందు విక్రమార్కుసాహసపరోపకారస్వప్నశాంతివైభవదానశూరత్వప్రశంసనం బన్నది నవమాశ్వాసము.

  1. దివ్యశరీరార్ధసతీసనాథు - శరీరార్ధసనాథుశర్వు
  2. లిచ్చి- గాఁగ
  3. యెక్క దరమే నీకున్
  4. గిరిరాజు
  5. చాపనైపుణీసంపద సారశక్తి నచ్యుతునిమిత్రు
  6. వెట్ట లంటగన్
  7. గడుబొట్టవాడగా
  8. చల్లబూటల
  9. రుక్మాంబరధారి
  10. సద్భర్గం బ్రస్తుతవాక్యవృత్తి విలసింపన్ నేర్పుతో నిట్లనున్, సర్గప్రస్తుత ......విలసించన్
  11. నీగంత-నీబొంత
  12. ననుబోటియంతయైనను
  13. భిక్షావృత్తినై
  14. లటుండఁగ నిమ్ము కంచిలో
  15. నొత్తెడు నంతలోపల
  16. నాత్మలో, నానరనాయకుం డతని నర్థి నుతింపుచు
  17. యావెలినెత్తమ్మిమొగ్గ
  18. జాతుఁడు విక్రమార్కుఁడు విశాల
  19. మృగనాభిగృహంబున-అని యన్నిప్రతులలోను
  20. చనియెద నేనొకఁడ
  21. జాతంబులు
  22. క. నావుడునది భోగస్త్రీ
    గావునఁ బరియాఛకంబుగా గుబ్బలినుం
    దావలికొండకు నుఱకం
    బోవుటఁ యటఁ గాలు విఱుఁగబొరిబడె దనినన్ (ఒక్క ప్రతి)
  23. నందఱు
  24. బంచిరి
  25. బరిపిరి
  26. మోదల
  27. శల్యసంధాననిపుణు
  28. నుచిత్తుం జేసి
  29. బసులఁ బిదుకఁదలకొను
  30. జావుచే టొదవును మై
  31. తలబేనుతీట
  32. నెరయద్రావుట
  33. నిడివగు, నిగుడనౌ
  34. యెద్దును, మ్రోడును
  35. దినగోరంగాదు
  36. దినమణి, శీతకరాంబకుని గగనసింధుశశిధరున్
  37. ప్రజలవలన దమ విభాగముల్ - ప్రజలవలవధర్మ భాగముల్
  38. సంప్రాపితవైభవుండు ధనవంతుఁడు
  39. మెలఁగుచు
  40. పెద్దల బ్రోచి
  41. ననర్థాయాసులై
  42. వినఁడే
  43. గీ. పాదధనము పసులు పసిఁడిపాదధనంబు, పాదధనము పొలము పంటయూళ్ళు, ధరణిపాదధనము ధాన్యంబు గావున, వాని గొనుడు పెద్దవాని వరుస.
  44. తద్విరోధోక్తులు
  45. దక్కలవడి దక్కలవిడియే
  46. శాలివాహు మీరు నాలంబు సేయు నీ-బలము