Jump to content

సింహాసనద్వాత్రింశిక/దశమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

సింహాసన ద్వాత్రింశిక

దశమాశ్వాసము

ఇరువదియైదవ బొమ్మకథ

క.

శ్రీదయితావదనచ్ఛా
యాదర్శీభూతకౌస్తుభారుణతేజో
మేదురవక్షఃస్థలు దా
మోదరుఁ గాకోదరేంద్రయోజితతల్పున్.

1


క.

నెమ్మనమునఁ దలఁపుచు మో
హమ్మున సింహాసనమున కరుదెంచినఁ జో
ద్యమ్ముగ నిరువదియేనవ
బొమ్మ వలికె [1]నడ్డపెట్టి భోజనృపాలున్.

2


క.

ఏమని చెప్పుదు నుజ్జయి
నీమనుజాధిపునిభంగి నియతంబుగ నో
భూమీశ్వర దివ్యంబగు
సామర్థ్యము లేక యెక్కఁ జన దెవ్వరికిన్.

3


మ.

అది యెట్లన్న నెఱుంగఁ[2]జెప్పెద నరివ్యాపాదనాపాదనో
న్మదబాహాయుగళుం డనంతధనదానప్రీణితక్ష్మాతల
త్రిదశస్తోమనిరంతరస్తుతిలసత్కీర్తిప్రియుం డంగనా
మదనాకారుఁ డవంతినాయకుఁడు సామ్రాజ్యంబుతో నొప్పుచున్.

4

శా

ప్రాతఃకాలమునందుఁ గొల్వున నయప్రఖ్యాతులౌ రాజులు
న్నీతిన్యస్తమనస్కులౌ సచివులు న్విద్వాంసులుం గొల్వఁగా
జ్యోతిర్మధ్యమున న్వెలింగెడు హిమాంశుంబోలి సొంపొందుచో
జ్యోతిశ్శాస్త్రవిదుం డొకండు ధరణీశుం గాంచి దీవించుచున్.

5


సర్వశుభంబులు నీకడ
నిర్వాహము గలిగియుండు నీ కేమని యా
శీర్వాదం బొసఁగుదు [3]నా
యుర్వృద్ధి దలంప నవియ యునికికిఁ గోరున్.

6


ధరణిమీఁద నధికదానధర్మక్రియా
పరున కాయు వది యపార మగుట
తెల్లమనుచుఁ బలికి తిథివారనక్షత్ర
యోగకరణములను నొప్పఁజెప్పె[4].

7


సీ

ఐదింటఁ దా నొప్పఁ డట నెన్మిదింటఁ దొ
        మ్మిదియింటఁ బండ్రెంట మేలు శుక్రుఁ
డిందుఁ డాఱింటను నేడింట మూఁటను
        బదిటఁ జేకొన్న శుభప్రదుండు
శనిరాహుకేతుభూతనయసూర్యులు మూఁట
        నాఱింట మేలర్కుఁ డట్ల పదిట
రెంట నైదింట నేడింటఁ దొమ్మిదిటను గు
        రుం డున్న నెల్లకోర్కులు ఫలించు


బుధుఁడు బేసిగానిపొందుల నిష్టుఁడౌ
వీని కెల్ల దుష్ట వేధ లేమి

ఫలము రొప్పు జననభవనంబు మొదలుగా
బదునొకంట నున్నఁ బరమసుఖము.

8


గీ.

[5]అందు రవితనుజాది మహాగ్రహంబు
లిప్పు డాఱింట నునికి నీయిష్ట మొనరు
గురుఁడు బుధుఁడును బై పయికొనుట మేలు
శుక్రచంద్రులు మూఁట నిల్పుట శుభంబు.

9


వ.

అనుచు శుభస్థానంబులు నతని గ్రహంబులునుం జెప్పి.

10


క.

“ధర్మే తిష్ఠతు తే బు
ద్ధిర్మనుజాధీశ" యనుచు దీవించిన ద
న్మర్మం బెఱింగి నృపుఁ డా
ధర్మముచొ ప్పెట్టి దనిన దైవజ్ఞుండున్.

11


క.

నీ వది యెఱుఁగవె ధర్మము
త్రోవం జనువాఁడు భక్తితోఁ దనశక్తిన్
దేవబ్రాహ్మణపూజలు
గావింపఁగవలయు విగతకల్మషుఁ డగుచున్.

12


క.

గురువును దేవరగా స
త్పురుషుని గురువుగ నిజాశ్రితుని ప్రాణముగా
బరవనితఁ గన్నతల్లిగ
బరధనము విషంబు గాఁగ భావింపఁదగున్.

13


గీ.

అన్నదానము దుర్భిక్ష మైనయప్పు
డంబుదానంబు నిర్ణలం బైనచోట
నభయదానంబు శరణార్థియైనవేళ
జేయు టుచితంబు ఘనదయాశీల మలర.

14

క.

కృత్యాకృత్యవిచారము
నిత్యోచితదాన మాత్మనియమము బుధసాం
గత్యము పరోపకారము
సత్యము వినయంబు నయము జరపఁగవలయున్.

15


ఉ.

ఈకొలఁదిం దదంగము లనేకవిధంబుల నుండు నన్నియు
న్నీకడ నొప్పుచున్న వవనీవర నావుడు విద్యలందుఁ బ్ర
త్యేకసమర్థుఁడైన నృపుఁ డిప్పటియేఁటి ఫలంబుఁ జెప్పుమా
నా కని యానతిచ్చిన మనంబున నాద్విజుఁ డుత్సహించుచున్.

16


మ.

మహిమాఖండలుఁ డంచు భూజనులు సంభావింప నీ వింపుతో
మహిఁ బాలించుచుఁ బుణ్యకృత్యముల ధర్మద్రవ్య మార్జింపఁగా
గ్రహదోషంబులు పుట్ట వట్లయిన నోరాజేంద్ర యీయేఁట దు
స్సహపాపగ్రహసంభవం బగునతిక్షామంబు వర్తిల్లెడిన్.

17


ఉ.

అక్రమ మాచరించి విను మర్కతనూజుఁడు తొల్లి యున్న యా
శుక్రునిరాశిఁ[6] దా విడుచుచు న్శకటాకృతి నున్న రోహిణీ
చక్రము దూఱి మంగళునిసద్మము చేరఁ గడంగి యేఁటిలో
వక్రగతిం జరింపఁగ నవర్షణమై చనుఁ గొన్నివర్షముల్.

18


క.

పఱిపఱి నిల పఱియలుగా
[7]నెఱిసిన వనపంక్తు లెండ నిరుపమమగు నా
వఱపునఁ బండ్రెండేడులు
కఱ విఁక నతిదుస్తరంబు గాగల దధిపా.

19


చ.

అనవుడు దీని కడ్డపడునట్టి యుపాయము గల్గెనేని నా
యను వెఱిఁగింపు మన్న వసుధామరతృప్తియె కారణంబుగా

నొనరిన దేవతార్చనల హోమములన్ గ్రహపూజ [8]మున్నుగా
జనవర [9]శక్తికిం దగినశాంతి యొనర్పుము వర్షణంబగున్.

20


క.

ఇనుమున నాశనిరూపం
బొనరించి వినీలవస్త్రయుక్తంబుగ న
ర్చనము రచియించి ఖది రేం
ధనమున హోమంబు సేయఁ దత్ప్రీతియగున్.

21


చ.

అనినఁ ద్రివిక్రముండు మొదలైన పురోహితులన్ గ్రహాదిపూ
జనములు సేయఁ బంచి మృదుశాలిమయాన్నముఁ బాయసంబులున్
మునుముగఁ బిండివంటలు సమూహముగా నొనగూర్చి యిష్టభో
జనముల [10]భూసురు ల్దనియ శాంతి దలంబుగఁ జేసి శక్తితోన్.

22


క.

దేశాధీశ్వరుఁ డర్థుల
కాశాపరిపూర్తి సేయ నారాధిత యౌ
నాశాపూరణి దేవి ని
వేశాంగణసీమ హోమవిధి గావించెన్.

23


ఉ.

ఈగతిఁ బెక్కుహోమములు నీగులు [11]బూజలుఁ జేసిచేసి వ
ర్షాగమ మేమియుం గనక యక్కట యాగము మీఱు నాశుభో
ద్యోగము వ్యర్థమయ్యె శివయోగినియుం గరుణింపఁ దంచుఁ జిం
తాగతుఁ డైనవేళ గగనస్థలి నయ్యశరీరి[12] యి ట్లనున్.

24


ఉ.

భూపకులేంద్ర యింత దలపోయఁగ నేటికి యోగమాత యా
[13]శాపురి సంతసిల్లి యతిసత్త్వము నీకొసఁగెం బ్రభావసం

దీపితదివ్యశస్త్రనిహతిన్ దిననాథతనూజవక్ర మా
ర్గాపఘనోపరోధ మభయంబునఁ జేయుము వృష్టి గల్లెడున్.

25


ఉ.

పంటలు పెక్కుగల్గు నని పల్కిన నానృపుఁ డాత్మలోన ము
క్కంటి రఘూద్వహు న్విజయుఁ గైకొని మ్రొక్కుచు దివ్యబాణము
ల్వింట నమర్చి పంక్తిరథులీలఁ గడంగి ప్రతాపశక్తి మి
న్నంటి గ్రహంబు లెల్ల విరియంగ శనైశ్చరు నడ్డకట్టినన్.

26


ఉ.

ఆశని నిల్చి నీబలమహత్త్వము మెచ్చితిఁ దొల్లి నీవు గౌ
రీశునిచేఁ దపంబున నభీష్టము లందితి, నేఁడు శక్తి నా
[14]కాశము గట్టి నాదగుప్రకాశము ద్రుంచితి నేఁటినుండి నీ
దేశములోపలం గఱవు దీఱఁ బ్రజ ల్సుఖియింపఁజేసెదన్.

27


శా.

హర్షం బయ్యె భవత్కృతంబున నృపాలాగ్రేసరా కోరిన
న్వర్షంబు ల్గురియింతు నెప్పుడయిన న్వర్ధిల్లు పొమ్మన్న ను
త్కర్షంబంటిన శౌర్యమొప్పఁగ సుభిక్షం బుర్విఁ దోఁపంగ దు
ర్ధర్షుండై [15]చనుదెంచి భక్తిఁ గొలిచెన్ ధాత్రీశుఁ డాశాపురిన్.

28


వ.

అది గావున.

29


క.

ఈసామర్థ్యము [16]నీకడ
వీసంబును లేదు మగిడి వెసఁ జను మనినన్
వేసరినభంగి భోజుం
డాసింహాసనము డిగి గృహంబున కరిగెన్.

30


వ.

తదనంతరంబ కతిపయదినంబు లరిగిన షడ్వింశతితమద్వారంబునఁ బోవుచు.

31


ఇరువదియాఱవ బొమ్మ కథ

క.

తెల్లనికొండయు గుజ్జును
దెల్లనిపూఁతయును మేను దెల్లనిపాముం

దెల్లని చుక్కలఱేఁడును
దెల్లనిచదలేఱు గలుగు తెల్లనివేల్పున్.

32


శా.

చేతఃపద్మమునం దలంచి [17]విహితాశీర్వాదభూమీసుర
వ్రాతంబున్ హితవర్గముం [18]గొలువ సౌవర్ణోజ్జ్వలద్భూషణా
న్వీతుండై సుదినంబునం గదఁగి దేవేంద్రాసనాసక్తితో
నేతేరం గని బొమ్మ వల్కె వసుధాధీశు న్నివారించుచున్.

33


క.

కార్యంబు గాని చేతలు
మర్యాదలుగా వవంతిమనుజేంద్రుక్రియన్
ధైర్యమును సత్యమును నౌ
దార్యంబును లేక యెక్కఁదగ దన్యులకున్.

34


ఉ.

ఆతనిధర్మవర్తనకథామృతపానముఁ గోరుదేని పృ
థ్వీతలనాథ నిల్చి విను ధీరుఁ డుదారుఁడు శూరుఁ డాతఁ డ
త్యాతతకీర్తికాముఁడు [19]సదామితదానవినోది సాహస
ఖ్యాతచరిత్రుఁ డార్తహితకారణశీలుఁడు నేల యేలఁగన్.

35


మ.

గజవాజిప్రముఖంబులౌ బలములన్ గర్వంబు రెట్టింప న
క్కజమౌ రాజ్యము సేయురాజులు మదిం గంపించి సేవింపఁగాఁ
బ్రజలెల్లన్ ధన్యధాన్యపుత్రవనితాభాగ్యంబులం బొందియు
న్నిజధర్మంబులు దప్పకుండిరి [20]మహానిర్వాహులై యందఱున్.

36


శా.

ఆకాలంబున విక్రమార్కుఁడు విధేయం బైన దేశాంతరా
లోకాసక్తి మహిం జరింపఁ జని వాలుం జోగివేషంబు ని
త్యాకల్పంబుగ నంతటం దిరిగి ప్రత్యావృత్తుఁడై వచ్చుచో
నాకర్ణించె నతండు కాఱడవిలో [21]హంభాయనున్ ధేనువున్.

37

చ.

అట విని యిట్టి కాఱడవి నద్భుతమైనది ధేనుఘోష ము
త్కటమదపుండరీకహరిగండకసంకుల మైనచోటి క
క్కట పసు లెట్లు వచ్చె విధికల్పన చూచెద నంచు నేగి ముం
దట గిరిపొంతఁ గొంతయెడ దవ్వుల రేగడ వెంచలోపలన్.

38


ఆ.

నాల్గుకాళ్ళు రొంపి నాటిన నుంకించి
వెడలి రాఁగడంగి వెడల లేక
దీనవదన మైన ధేనువుఁబొడఁ గని
యతిదయాళుఁ డయ్యె నవనివిభుఁడు.

39


చ.

అనువగువేళ డగ్గఱన యాయతిథిం, జెఱనున్న భూమిదే
వునిఁ, గడురొంపిఁ బడ్డ పశువున్, వ్యసనాతురుఁ డైన యేలికం,
దన పగవారు గొన్న బిరుదంబున దుఃఖితుఁడైన మిత్రునిన్,
ఘనబలుఁ డయ్యుఁ గైకొన నికష్టునిఁ జూడఁగనోడుఁ గాలుఁడున్.

40


ఆ.

ఆనుచు వెంచ సొచ్చి తనకాళ్ళు గట్టిగాఁ
బెట్టి తోఁకమట్ట పట్టి యెత్త
జట్టుభంగి రొంపి పట్టును వీడక
మొదవు కొంతయైనఁ గదలకుండె.

41


క.

[22]ఆయవసరమున ఘన మగు
నాయావు నటెత్తలేక యలసగతుండౌ
నాయకుని జగము గని నగు
నోయని వెలుఁ గుడిగెనన నినుం డటఁ గ్రుంకెన్.

42


గీ.

మెట్టు గట్టుఁ జెట్టు మిఱ్ఱును బల్లము
బయలు ననుచు నేరుపఱుపరాక

మిన్ను వచ్చి నేలమీఁద వ్రాలిన యట్లు
దెసలఁ జీకువాలు దీటుకొనియె.

43


క.

పగలు బయలనుండక కొం
డగుహలలోఁ జొచ్చుకొని యడంగి దినాంతం
బగుదడవె వెడలె గూబలు
నిగుడం [23]జీఁకట్లు పోలె నీలాకృతులై.

44


సీ.

అప్పుడు చీఁకట్ల కుప్పలచొప్పున
        ఘుమఘుమధ్వనుల మేఘములు వొడమె
నందుల మెఱపు లయ్యంజనాచలభూమి
        దావాగ్నిశిఖల చందమున మెఱసెఁ
బెల్లుగాఁ బెటులు పెఠిల్లున మ్రోయుచుఁ
        బిడుగులు తొడితొడిఁ బడియెఁగడల
రువ్వున వడినెడ త్రెవ్వనిగాలితో
        గవుకులంతలు చిన్కు లవనిఁ దొరఁగెఁ


గీ.

బిదప నెత్తుగ బోరునఁ బెద్దవాన
కడవలను గ్రుమ్మరించిన వడుపు దోఁపఁ
గురియుచుండంగ వఱదలు గ్రుంత మిట్ట
లొక్కకొలఁదిగఁ బాఱె నీ ళ్ళక్కజముగ.

45


శా.

ధారాపాతజలాతిశీతఘనవాతక్లిష్టమౌ వృష్టిలో
నారాజన్యుఁడు [24]గోవుడించి చన నన్యాయం బటంచు న్మహా
ధీరుండై తనబొంత గప్పె నిజశస్త్రీదత్తసాహాయ్యుఁడై
యారే యెల్లను దానె మాటగుచు ధర్మాసక్తితో నిల్పఁగన్.

46

ఆ.

మిత్రుఁ డరిగిన యెడ శత్రువునై యిట్లు
గాసి వెట్టిన మదిఁ గలఁగఁ డితఁడు
ధర్మశీలునెదురఁ దామసగుణములు
నిలువ వనుచు రజని తలఁగిపోయె.

47


శా.

ప్రత్యూషం బగునంత వాన వెలిసెం బ్రవ్యక్తమై దిక్కులం
దత్యాభాసము గల్లె జక్కవకవల్ హర్షించెఁ జీఁకట్లు దే
శత్యాగంబుగఁ బాసెఁ దమ్ములు వికాసం బొందఁ బూర్వాద్రి నా
దిత్యుం డుద్గతుఁ డయ్యెఁ గుంకుమగతిం దేజంబు రాజిల్లఁగన్.

48


క.

పక్షులు వలుకుచుఁ దమతమ
పక్షము లగువానిఁ గూడి బాలార్కురుచిం
బక్షంబులు కెంపడరఁగఁ
బక్షీంద్రునిపిల్ల లనఁగఁ బాఱం దొడఁగెన్.

49


ఉ.

అప్పుడు విక్రమార్కుడు ప్రయాసము వుట్టఁగఁ దోఁకవట్టి తా
నెప్పటి యట్ల పూనికొని యెత్తఁగ ధేనువు లేవకున్న నే
చొప్పు నెఱుంగలేక యిది చూడఁగ సన్నము చాల వ్రేఁగు నా
కప్పరమేశుఁ డిచ్చిన మహాబల [25]మెక్కడ స్రుక్కె నక్కటా.

50


ఉ.

కొమ్ములు పట్టి యెత్తఁ బథికుం డొకఁ డైనను గల్లఁ డిట్టి ఘో
రమ్మగుకానలోపల నరప్రసరం బది యెట్లు గల్గు నా
యిమ్ముల యత్న మేల ఫలియించుఁ బురాకృతవృత్తినైన భా
గ్యమ్మునఁ గాక యంచు మదిఁ గందుచు ముందఱఁ బాఱఁ జూచినన్.

51


సీ.

[26]గజములం తేసి మృగంబులఁ
        జెండాడుగోరు లంకుశముల కొలఁదిమీఱఁ
జాఱలు తనచేతఁ జచ్చినజీవుల
        లెక్కబొట్టులక్రియ నక్కజముగఁ

నొక్కపెట్టునఁ బ్రజ నుర్విఁ గూలఁగఁజేయు
        కాలదండాకృతి వాల మెసఁగ
మదిఁ గ్రోధవహ్నికి మొదలైన
        నిప్పులపెంపునఁ గన్నుల [27]కెంపు గదుర


ఆ.

బ్రణుతవీరరసము పట్టినకడవనా
దనరు రౌద్రరసము దాన యగుచు
[28]నవని మ్రింగుమాడ్కి నావులించెడు మహా
వ్యాఘ్రమొకటి కానవచ్చె నెదుట.

52


క.

కని దీని నెత్తఁ దోడ్పడు
మనుజుని దలఁపంగఁ బసులమారియె వచ్చె
న్మును గండమాలమీఁదను
మొనకురుపుం బుట్టె నన్న మోసంబాయెన్.

53


చ.

ఇది కడు దుస్తరం బనుచు నెంతయు నాతురుఁ డైన నంతలోఁ
జెదరక బంటుమీఁదఁ బరజించుచు డగ్గఱుశూరుకైవడిం
బదములచప్పు డేర్పడనిబాగునఁ బొంచి చలించి వాలమున్
వదనము చేయి నెత్తుకొని వ్యాఘ్రము పైఁబడియం గడిందిగన్.

54


క.

పడునెడ నడ్డముసొచ్చిన
పుడమివిభుం గదిమి యెడమభుజ మడిచెఁ ననుం
బొడగనియుఁ బొడుచు టెఱిఁగియు
జడియఁ డనుచుఁ బొగడి చేతఁజఱచినమాడ్కిన్.

55


ఆ.

పెడమరించి యతనిఁ దొడరక యాపులి
మిత్తిభంగిఁ గుఱ్ఱిమీఁది కుఱికి

మును దిలీపుఁ డిష్టముగఁ గాచునందిని
నెగసిపట్టు నామృగేంద్రుకరణి.

56


క.

ఉఱికిన నాపులితల దెగ
నఱికినఁ బులి మాయమైన నభమున సుర ల
త్తరి మెచ్చి పుష్పవర్షము
తఱచుగఁ [29]గురియించి రభయదాయకుమీఁదన్.

57


చ.

అవనివరుండు నెమ్మనమునం దతివిస్మయ మంద నొక్క లా
ఘవమున లేచి పల్వలము గ్రక్కున వెల్వడి కుఱ్ఱి లోచనో
త్సవమగు దివ్యభావమున సన్నిధి గైకొని యేను గామధే
నువ నిను మెచ్చితి న్మదికి నూల్కొనునిష్టము వేఁడు నావుడున్.

58


క.

తద్భాషణమున మదిఁ గడు
నద్భుతముఁ బ్రియంబు నిగుడ నాతఁడు సురసం
పద్భోగభాగ్యనిధి యని
సద్భావముతోడ మిగుల సన్నుతుఁ డగుచున్.

59


క.

అమృతాహారులు నసురులు
నమృతంబునకై మహాప్రయాసముతో న
య్యమృతాంభోనిధి దరువఁగ
నమృతము నీయంద కలుగ నటఁ బుట్టితివే.

60


క.

పుట్టినయి ల్లంబుధి తోఁ
బుట్టువు లమృతేందు[30]కల్పభూజము లవి య
ప్పట్టున నూరక మనఁగా
నిట్టి విరోధంబు నీకు నేలా కలిగెన్.

61

ఆ.

తల్లి యింతకును గతం బేమి తెలియఁగా
నానతీయవలయు ననుచు మ్రొక్కి
నిలిచి యున్న సురభి నృపవర్యుఁ దనపుత్రు
రీతి మిగుల నాదరించి పలికె.

62


సీ.

పురుహూతుఁ డొకనాడు గురువాదిగాఁగల
        విబుధసంఘంబు సేవింపుచుండ
నూర్వశియును రంభయును మంజుఘోషయు
        నా తిలోత్తమయును నాఘృతాచి
ప్రియదర్శనయు సుకేశియును మేనకయునా
        నెనమండ్రు దివ్యనాయికలు గొలువ
గరుడగంధర్వకిన్నరపన్నగేంద్రులు
        తమనియమంబులు తగభజింప


ఆ.

వసువులును రుద్రు లుభయపార్శ్వముల నుండ
సిద్ధు లెనిమిది తనపొంతఁ జేరి నిలువఁ
దుంబురుఁడు నారదుఁడును బ్రస్తుతులు సేయ
నధికసంపదఁ గొలువున్న యవసరమున.

63


శా.

పర్యాయప్రకృతప్రసంగముల సంభాషించుచో దేవతా
చార్యుం డోసకలజ్ఞ నారదమునీశా నేఁటికాలంబునం
గార్యాకార్యవిచారముం గృపణరక్షాదక్షకత్వంబు నౌ
దార్యంబున్ ఘనధైర్యముం గలిగి యేధాత్రీశుఁ డొప్పున్ భువిన్.

64


మ.

అనిన న్నారదుఁ డోసుపర్వకులవంద్యా యిప్పు డుర్వీస్థలి
న్మనుజాధీశులు లెక్కమీఱఁ గల రేక్ష్మాపాలురున్ దీనపా
లనధైర్యంబున లావున న్వితరణోత్సాహంబున న్విక్రమా
ర్కునిసాదృశ్యము నొంద లే రతనిఁ బేర్కొన్న న్శుభోధర్కముల్.

65

చ.

అని పలుకంగఁ దావిని మహాసనసంస్థితుఁ డైన పాకశా
సనుఁ డతివిస్మయంబుఁ గడుసంతసముం బొడమంగ సమ్ముఖం
బున నిలుచున్న నన్నుఁ గని పూని ధరిత్రికిఁ బొమ్ము విక్రమా
ర్కునిసుగుణమ్ము లేర్పఱుచురూపము గైకొనుమంచుఁ బంచినన్.

66


ఉ.

నే నిట వచ్చి యిచ్చటికి నీవును రాఁగల వంచు దుర్బలం
బైన గవాకృతి న్నిలుచునంతట వచ్చితి వింద్రుమాయ న
వ్వానయు గాలియుం గలిగె వ్యాఘ్రము పైఁబడుటయ్యె నన్నియు
[31]న్మానవనాథ యిన్నిటికి మానుగ నోర్చితి గాన మెచ్చితిన్.

67


ఉ.

నావుడు సమ్మదం బతిఘనంబుగఁ బొంగి యవంతినాథుఁ డో
దేవి భవద్విలోకనము దివ్యపదస్థితికారణంబు నా
దైవము గల్గెఁ జాలు వివిధంబగుసంపద నీశుభానుకం
పావిభవంబునం గలదు భవ్యుఁడ నైతి నటంచు మ్రొక్కినన్.

68


శా.

క్షోణీనాయక నేఁటి మెచ్చునకు నీ సొమ్మైతిఁ గైకొమ్ము గీ
ర్వాణాధీశుఁడుఁ బొందలేని శుభము ల్ప్రాపించు నీకంచు న
క్షీణోల్లాసముతోడ వచ్చు సురభిం జేపట్టి దీనాతుర
త్రాణసక్తుఁ డతండు క్రమ్మఱి మహోత్సాహంబుతో వచ్చుచున్.

69


ఉ.

అంపెలు గట్టి చేత నొకయష్టి ధరించుచు నెత్తివెండ్రుక
ల్చెంపల వ్రేలఁగా ముదిమి జీప నరంబులు తక్కి స్రుక్కి యా
కంపిత మైనవక్ష మనుకంపకు హేతువు గాఁగఁ బ్రార్థనా
లంపటుఁ డయ్యు మేనికి బలం బొడఁగూడమిఁ గుందువిప్రునిన్.

70


చ.

కనుఁగొని యేల కుందెదవు కారణ మే మిది చెప్పు మన్న నో
యనఘ మహాదరిద్రుఁడ ననల్పకుటుంబికుఁడ న్వినష్టజీ

ననుఁడను జావఁగోరి యిట వచ్చి తి దేమని చెప్ప నావుఁడు
న్మనమున నిట్టితెం పుడుగుమా యని రాజు కృపార్ద్రచిత్తుఁడై.

71


క.

నే వేఁడినకోరుకు లివి
గా వనఁగారాదు గానఁ గారుణ్యముతో
నీవిప్రుని రక్షింపను
దేవీ పొమ్మనుచుఁ గామధేనువు నిచ్చెన్.

72


ఉ.

ఇచ్చి నభఃస్థలంబున సురేశ్వరుఁ డాదిగ దేవసంఘము
ల్మెచ్చఁగఁ దొంటిమార్గమున మిక్కిలి వేడుకతో నవంతికి
న్వచ్చె నృపాలుఁ డిట్టి గుణవైభవ మింకిటఁ గల్గెనేని నీ
విచ్ఛట వచ్చు టొప్పు మనుజేశ్వర యుక్తము నీ వెఱుంగవే.

73


క.

నావుడు విని యుజ్జయినీ
భూవల్లభుసద్గుణములు పొగడుచు హితులన్
సేవకుల వీడుకొని భో
జావనివల్లభుఁడు నిజగృహంబున కరిగెన్.

74


వ.

మఱియును గతిపయదినంబులు జరిగిన.

75


ఇరువది యేడవ బొమ్మకథ

క.

అక్రూరవరదు రణరం
గక్రీడాశమితవిమతుఁ గమలారమణుం
జక్రీశ్వరపర్యంకుని
జక్రాయుధభరణు దుగ్ధసాగరశాయిన్.

76


మ.

అతితాత్పర్యమునం దలంచుచు నిలింపాధీశభద్రాసన
స్థితికై సంపద పెంపుమీఱఁగఁ గృతాశీర్వాదభూనిర్జరా
న్వితుఁడై భోజవిభుండు డగ్గఱునెడ న్వీక్షించుచున్న న్సప్తవిం
శతమద్వారము నొద్ద బొమ్మ సుజనాశ్చర్యంబుగా నిట్లనున్.

77

ఉ.

పూతచరిత్రు సాహసవిభూషణుఁ బోలఁ జరించుచోట దుః
ఖాతురుఁ డైనవాఁడు తనకబ్బినయీగికిఁ బాత్రుఁ డంచు నే
జాతివిభేదము న్గుణవిచారము సేయక యిచ్చునట్టి యా
దాతృగుణంబు లేక వసుధావర నీ కిది యెక్క శక్యమే.

78


శా.

పాత్రాపాత్రవివేక మంచు ధనలోభం బెక్కడంజేయు నీ
ధాత్రి న్నీతులు గల్గుఁ గాగ ఘనచింతాఖిన్నుఁ డౌవాఁడె స
త్పాత్రుం డంచు నెఱుంగు టొప్పు ననుచుం దత్కాలదానంబుల
న్మిత్రత్వంబు వహించు సర్వజనులు న్మెచ్చంగ వాఁ డెల్లెడన్.

79


మ.

వివరింతు న్విను తద్గుణంబు లఖీలోర్వీనాథసంసేవ్యుఁ డ
య్యవనీపాలకుఁ డొక్కరుండ పరదేశాలోకనాసక్తి యు
త్సవమై సొంపు నటింపఁ గ్రుమ్మరుచుఁ బ్రాసాదోజ్జ్వలం బైన చం
ద్రవతీదుర్గము గాంచెఁ [32]గాంచికి సమానంబై వెలుంగొందగన్.

80


ఉ.

ఆపుర మద్రిమీఁద వివిధావరణంబు ననేకలోకసం
దీపితమధ్యమం బనుగతిప్రకటికృతసోమసూర్యవీ
థీపరిణాహరమ్యము నతిస్థిరభూభృదుపాశ్రయంబునై
శ్రీపతియాజ్ఞనుండు నది రెండవయజ్ఞభవాండమో యనన్.

81


ఉ.

ఆనగరంబు సొచ్చి నవహర్మ్యనిరంతరరమ్యవాటికం
బైనవణిక్పథంబున ననంతసువస్తుసమూహదర్శనే
చ్ఛానిరతిం జరించి మణిసంఘటితంబగు నొక్కదేవతా
స్థానముఁ జేరి భిక్షుకువిధంబున నచ్చట విశ్రమింపఁగన్.

82


సీ.

చెంగావి వలిపెంబుఁ జెలువార ధరియించి
        చలముగా మేన గంధంబుఁ బూసి

తిలకంబు కస్తూరిఁ దీర్చి జాదులఁ గలి
        గొట్టులఁ బొడవుగాఁ గొప్పువెట్టి
కందుదుప్పటి గప్పి యందియ డాకాలఁ
        గీలించి పువ్వులకోల వట్టి
నిద్దమౌ కుచ్చుల [33]యుద్దాలు కిఱ్ఱని
        మ్రోయఁగా నుల్లాసమునఁ జెలంగి


ఆ.

నలుపు రేవురు సంగడీ లెలమితోడఁ
బోఁకలాకులు [34]నోటిలోఁ బోసికొనుచు
జాణతనమున నట్టహాసములు నొలయఁ
బెచ్చు రేగుచుఁ గొలువఁగా వచ్చె నొకఁడు.

83


క.

వచ్చి గుడి సొచ్చి యందఱు
దిచ్చులు తనతిం కొఱకు [35]దీపులువెట్టన్
మెచ్చుచు వేడుకయాటల
నచ్చోటం బ్రొద్దువుచ్చి యల్లన మగిడెన్.

84


క.

మఱునాఁడు పెదవు లెండఁగ
నెఱి చెడి వదనంబు వాడ [36]నిస్సత్వముతో
చిఱుగోఁచి గట్టుకొని క్ర
మ్మఱ వచ్చెన్వాఁడు దుఃఖమలినాకృతియై.

85


ఆ.

వచ్చి వెచ్చనూర్చి యచ్చోటఁ గూర్చున్న
వానిఁ జూచి మనుజవల్లభుండు
నీవు నిన్న రమ్య మౌవేషమున వచ్చి
నేఁడి టేల వచ్చినాఁడ వనిన.

86

సీ.

చెప్పిన దీన నే సిద్ధియౌ నట్లయ్యు
        నడిగిన నాకిది యడఁపనేల
మేటి జూదరి యన వాటమౌ తివుటమై
        నాడుచుండుదు నే నహర్నిశంబు
దృష్టియేమఱక [37]నందియు జోగరంబును
        దిగయును గాళనాఁ దేటపడిన
యచ్చులలోన నే యచ్చైనఁ గైకొని
        మాటలాడిన యట్ల వేటుగలుగఁ


ఆ.

దలఁపుగతి వచ్చుఁగోరినదాయ మనఁగ[38]
శకునిజూదము వీనియచ్చొకటి యనఁగ
గెలుపునాదిగ నొడ్డుచు గిలుబనేర్చి
యెల్లపిడికిళ్ళు విడిపించి యేనకొందు.

87


ఆ.

ధనము గలుగఁ జూచి తమకంబు పుట్టించి
మొదల గెల్వనిచ్చి పిదప గెలిచి
నలువు రౌననంగ బలవంతు నైనను
నిలువనాఁగికొందు[39] నిమిషమునను.

88


క.

చతురంగంబున నే నతి
చతురుఁడఁ గరితురగమంత్రిశకటకటప్ర
[40]స్థితి పరహస్తము సేయుదు
క్షితి మెచ్చఁగ రాజు బంటుచేఁ గట్టింతున్.

89

క.

ఎక్కడఁ గోరిన దాయము
లెక్కువతక్కువలు గాక యేతేరంగా
నెక్కటి నెత్తమ్మున గొ
మ్మెక్కటియును నాడ నేన యెక్కటిఁ జుమ్మా.

90


క.

తగులు విరియైనఁ గడు మె
చ్చుగ నాడుదుఁ బులుల మూఁటజూదంబులలో
మిగులఁగ నేర్పరిబాగిడి
తిగుటన్ సొగటాల నే నతిప్రౌఢుండన్.

91


ఉ.

మేదిని నిట్లు జాణలకు మెచ్చగు నాటలు నేర్చువారికే
నాది యనంగ నొప్పుచు నహంకృతి నిప్పుడు దప్పనాడి యా
జూదమునందుఁ జిక్కి విరసు ల్నను నవ్వఁగ మేనివజ్రభూ
షాదిసువస్తువు ల్గెలిచినాతని కిచ్చి వివర్ణ మొందితిన్.

92


ఉ.

దైవబలంబు లేమి గతి దప్పిన నర్థము గోలుపోయితి
న్నావుడు బుద్ధిగా దని మనంబున కింపు జనింపఁజేయ ను
ర్వీవరుఁ డిట్లను న్వినుము వీఱిఁడిచేఁతలు మాను మేదినిన్
దేవతల న్భజింపు సుగతిస్థితులొక్కట నీకుఁ జేకుఱున్.

93


క.

[41]ధనమును సత్యము శౌచం
బును నాదిగఁ గోలుపోవు భువి దుర్వ్యసనం
బని యెన్నఁబడ్డ జూద
మ్మున బ్రుంగుడు వంగుడౌటఁ బొందిది యగునే.

94


క.

జూదమున నలుఁడు చెడియెను
జూదంబున నట్టిధర్మజుండును జెడియెన్

[42]జూదమున ధాతువాదము
వాదంబునఁ దొడరఁ జే టవశ్యము గలుగున్.

95


ఉ.

హితుని తెఱంగునన్ హితము నిష్టముఁ జేకుఱ బుద్ధి చెప్పితి
న్మతిఁ బరికించి దుర్వ్యసనమగ్నుఁడవై చెడకుంటివేని సు
స్థితి యొనగూడు లోకమునఁ దేఁకువయుం జెడకుండు నన్న నా
[43]కితవవరుండు నవ్వి యదిగేలిగఁ జేయుచు బల్కెఁ బ్రౌఢుఁడై.

96


ఆ.

ద్యూతకేళిరసము త్రోవ యెఱుంగక
పలికె దీవు వెడఁగుభావమునను
[44]వలనుగల్గి వాడఁ జెలమనీరము మాడ్కి
దీన నర్థ మొదవు తెరువు పుట్టు.

97


క.

ధనలాభంబు బురాణము
వినికియు వాద్యంబు యోగవిద్యయు శాస్త్రం
బును సంగీతముఁ గావ్యం
బును నాటకములును జూదమున కెనయగునే.

98


క.

గెలుపుతమకమునఁ జిత్తం
బలరంగాఁ గపటజూద మాడక యెవ్వం
డలసుఁ డయి చనియె భువి ని
ష్ఫలజన్ముఁడు వాఁడె కాఁడె పసరముభంగిన్.

99


క.

[45]ఒక రూక వట్టి పది వే
లకు నొడ్డుచు నాడినట్టిలాభము గరద

ప్పకయిత్తురుఁ గొంద్రనువరు.
లకటా జూదంబులోన ననృతము గలదే.

100


ఉ.

ఆట జయంబుఁ జేకొనిన నర్థము చేకుఱు దాన మేటిగా[46]
నోటమిఁ జిక్కి ద్రవ్య మిడనోపని పేదల కడ్డమౌచు మా
ఱాట భజింప ధర్మ మగు నంతన మోక్షము గల్గుఁ గావునం
దోటికిఁ జూచువార లిది దుర్వ్యసనం బన నమ్మవచ్చునే.

101


ఉ.

హితభావంబున బుద్ధి చెప్పితివి నాకిష్టంబుగా దాట సం
తతము న్సంతస మందఁజేయు నొకచో దైవంబు దప్పించినన్
మతి వేఱొండుల కెక్కునే ధనము సంపాదించెఁ బూర్వంబున
న్మతిమంతుం డను రాజు బుద్ధిఁ జని సన్మానంబుతో నుండెనే.

102


మతిమంతుని కథ

ఉ.

నావుడుఁ దత్కథావివరణంబునకుం జెవి యాని భూవరుం
డావిధ మేర్పడం దెలుపుమన్న దురోదరశీలుఁ డిట్లనున్
దేవసమానుఁడైన జయదేవుఁడు నా ధర యేలుచుండె ర
త్నావళిసంజ్ఞ నొప్పిన మహానగరంబున ధర్మశాలియై.

103


చ.

అతనికిఁ గాంతిరేఖ యనునంగనకుం బ్రథమాంశగణ్యుఁ డౌ
సుతుఁ డుదయించి బాలుఁ డగుచు న్నయశాస్త్రము లాగమంబులుం
గృతులుఁ బఠించి యోగములకీ లొకయింత యెఱింగి సర్వస
మ్మతమగు నేర్పుకల్మి మతిమంతుఁడునాఁ బరఁగెం బురంబునన్.

104


మ.

అతికాలంబునఁ బెద్దయై నృపుఁడు పుణ్యారణ్యవాసంబు ప్ర
స్తుతమైన న్నయభూషణుం డను నమాత్యుం బిల్చి తత్సమ్మతి
న్సుతునిం బట్టము గట్టి యేగె నట నస్తోకప్రభావాఢ్యుఁ డౌ
మతిమంతుం డిట యేలుచుండెఁ దనసామ్రాజ్యంబు పూజ్యంబుగన్.

105

క.

రత్నాకరమేఖలఁ దన
పత్నిగఁ జేపట్టి సుగుణబంధురుఁ డనఁగా
రత్నావళిలో నాయక
రత్నంబై తేజరిల్లెఁ బ్రజ రంజిల్లన్.

106


క.

రేలు నిగూఢాకృతితో
వాలు సహాయముగ లోకవార్తలుఁ గీడు
న్మేలును నరయుచుఁ దిరుగఁగ
బాలుని నొకనాఁడు మంత్రి ప్రార్థనచేసెన్.

107


క.

మేదినిలో నీనడవడి
యాదినృపాలకులచరిత మైనది నాకుం
గాదనరా దొకగతి నిది
గాదనియెద నాత్మ నొండుగాఁ దలపకుమీ.

108


ఆ.

నేఁడు చెప్పవలసె నృపుఁడు నీజాతక
మడుగునాఁడు బుధుల కడను వింటి
వినుము మొదలియంశమునఁ బుట్టినాఁడవు
చోరశిక్ష నిన్ను సోఁకు ననిరి.

109


క.

రజనిసమయములం దిరుగకు
సుజనులతోఁ బొత్తుసేయు సోమకళాంకు
న్భజియింపుము హితులను మముఁ
బ్రజలను జేపట్టు మిదియ ప్రార్థన మాకున్.

110


ఆ.

అనుడు బాలనృపతి యౌఁగాకయని యొండు
బుద్ధిఁ జూచి బ్రదుకు పొందు గాదు

గామకోపలోభగర్వమత్సరమాహ
ములనె కాని [47]రాజ్యబలముగొనదు.

111


క.

కామక్రోధాదులు ని
స్సీమముగా విడువకున్నఁ జేటగు నొకచో
నే మునినై యుండఁగ మఱి
నామీఁదను జోరదండనం బేల యగున్.

112


మ.

ఇది తప్పం జను టొప్పు నంచు నడురే యేకాకియై యేగి భూ
తదయాళుం డనుమౌనిచేత శుభతత్త్వజ్ఞానుఁడై యంబికా
స్పదమధ్యంబునఁ బెక్కునాళ్ళు పవనాభ్యాసంబుతో నుండె ను
న్మదసారంగకురంగసంమపరిగణ్యంబౌ నరణ్యంబులోన్.

113


క.

పోఁడిమి చెడియును దనమది
వాఁడిమి చెడనీక లబ్ధవైరాగ్యుండై
వాఁ డతినియమంబునఁ బదు
[48]మూఁడేఁడులదాఁక ధ్యానమున నుండంగన్.

114


మ.

ఒకనాఁ డేగురుదొంగ లంతికమునం దొప్పారు మందారనా
మకమౌ దుర్గము లీల నేలుచు మహాక్ష్మాపాలుఁడౌ జీవర
క్షకుకన్యాసదనంబు కన్న మిడువాంఛన్ వచ్చి యద్దేవి క
త్యకలంకం బగుభక్తిభావమున సాష్టాంగంబుగా మ్రొక్కుచున్.

115


క.

లోకేశ్వరి నీకృప నీ
క్ష్మాాంతుని కూఁతురగు ప్రకాశినిసొమ్ము
ల్మా కబ్బిన నం దలరెడు
నాకల్పము నీకు నిచ్చి యరిగెదము చుమీ.

116

క.

అని కానికె మైకొని చన
దిననాథుఁడు గ్రుంకెఁ దమము దిక్కుల నిండెన్
జనులు పనులుడిగి రారెకు
రనువరులై తిరుగఁ జొచ్చి రానగరములోన్.

117


మత్తకోకిల.

గాలిచీరయు నొల్కిబూడిద గ్రద్దగోరును గొంకియుం
గోలయు న్వెలుగార్చుపుర్వులక్రోవి ముండుల బంతియున్
మైలమందుల కొయ్యకత్తెర మాఱుగన్నపుఁగత్తియు
న్నీలిదండులు నల్లపూతయు నేర్పుతోడుగ మ్రుచ్చులున్.

118


క.

చప్పు ళ్ళాలించుచుఁ దమ
చప్పు ళ్ళడఁచుచును జొచ్చి సందులలోనం
జొప్పెఱుఁగకుండ [49]నేగుచు
ఱెప్పలుమాటైన డాఁగురింపుచుఁ బురిలోన్.

119


ఆ.

ఉలుకు మ్రగ్గునంత నొకచోట మొద్దుల
యట్ల మెదలకుండి [50]యన్నకరువు
కొదవియంతనంత గొదుగుచు లోపలి
మెలఁకు వరసి [51]కోటమలుకదాఁటి.

120


ఆ.

పాలె మున్న వారిపై నొల్కిబూడిద
మందు చల్లి పెద్ద మగులు కొంత
కూలఁ ద్రవ్వి రాచకూఁతు రుండెడిమేడ
కత్తిరించినట్లు గంటువెట్టి.

121


క.

తొడిదొడిఁ గ్రోవులపుర్వుల
విడిచి దివియ లార్చి గంటి వెలుఁ గాలోనం

బడకుండ [52]జెలులు మాటఁగ
నొరయనిక్రియ నులుకులేక యొకరుఁడు సొచ్చెన్.

122


ఆ.

అచట నూర్పు లరసి యాబాల నిద్రించు
టెఱిఁగి యొయ్య డాయనేగి వాఁగు
మీలఁ బుడికిపట్టు జాలరికైవడిఁ
బుడికి పుచ్చుకొనియెఁ దొడవులెల్ల.

123


సీ.

అన్నియు నౌలకు నందిచ్చునప్పుడు
        మును స్వయంవరమున కనుచు డాఁచి
దండియపై నిడ్డ తపనీయమాలిక
        భుజము సోఁకిన దానిఁ బుచ్చుకొనుచుఁ
గన్నంబు వెడలి సంగడికాండ్రఁ గూడిన
        నందఱు నుల్లాస మతిశయిల్ల
దుర్గంబు వెలువడి దూరస్థలంబున
        సొమ్ముల తరబడి చూచునపుడు


ఆ.

వెనుకఁ బురములోన ఘనముగా ఱంతయ్యె
నారెకులును దివియ లందికొనుచుఁ
గల్లపుట్టె ననుచు నెల్లదిక్కుల జాడ
లరయఁ జొచ్చి [53]రప్రమత్తు లగుచు.

124


క.

ఆకలకలమున నిలువక
యాకులులై పసిఁడిపేరె యధికం బనుచున్
లోకేశ్వరికై గుడియా
వాకిటఁ బాఱుచును లోన వైచిరి మ్రుచ్చుల్.

125

క.

ఆపసిఁడిపేరు గుడిలో
దాపసుఁడై నిష్ఠ నున్న ధరణీపతికం
ఠోపాంతంబునఁ దగిలెం
బాపంగారానికర్మబంధముభంగిన్.

126


చ.

తలవరు లంతలోఁ బ్రతిపదంబును జాడలు వట్టి వచ్చుచున్
బలబలఁ దెల్లవాఱ గుడిప్రాంతము డగ్గఱి యంతలోన ని
[54]శ్చలనిజగాత్రుఁడై నియమసంస్థితుఁడౌ మతిమంతుఁ జేరి త
ద్గళమున వ్రేలుచున్న నవకాంచనమాలికఁ గాంచి యుగ్రులై.

127


ఉ.

మ్రుచ్చిలి రాచసొమ్ము లివి మున్నుగ నన్నియుఁ దెచ్చి మౌనివై
యిచ్చట నున్నఁ బోవిడుతుమె వెసఁ జెప్పుము తోడిదొంగ లిం
కెచ్చట నున్నవార లని యీడిచి చేతులు గట్టి మోఁదుచుం
దెచ్చి కళంకతో వసుమతీపతిముందఱఁ బెట్టి రాతనిన్.

128


సీ.

జీవరక్షకుఁ డను నీవు జీవంబు వో
        నాడక చెప్పరా తోడివారి
నెక్కడ నుంచితి తక్కినసొమ్ములు
        తెమ్మని కొట్టించి ధృతి యడంచి
యొకయుత్తరంబు నీయక యున్నఁ జంపింపఁ
        గడఁగియుఁ దనపేరికడిమి దలఁచి
[55]కోపించి కాల్సేయి గోయించి వెడలించె
        నాలోన నొకవైశ్యుఁ డతని బ్రోవఁ


ఆ.

గరుణ నుడుకునూనె గాపించి వగయార్చి
కూడునీళ్ళు నొసఁగి వాడుఁ దేర్చి

పాటిగుడిసె యొక్కచోటఁ గట్టించి యం
దునిచి దినము నరయుచున్న నతఁడు.

129


క.

[56]తనజన్మ ఫలము దప్పునె
తను వెడలినమీఁదనైనఁ దప్పదు నేఁ డీ
యనుభవమునఁ దీర్చెదనని
మనమునఁ దలపోసి యాత్మమరణం బుడిగెన్.

130


శా.

ఆవైశ్యోత్తము ప్రోపునన్ బ్రదికి పుష్టాకారుఁడై రాత్రి నా
నావైచిత్రి ననేకరాగముల గానం బింపుగాఁ జేయఁగా
దేవస్త్రీక్రియ మేడనున్న నృపపుత్రీరత్న మాలించి కా
మావేశంబు భజించి దాది నటకుం [57]బ్రార్థింపఁ బుత్తెంచినన్.

131


సీ.

అది వచ్చి యాతనియాకార మీక్షించి
        మది రోసి క్రమ్మఱ సుదతిఁ జేరి
యిలఁగల రాజపుత్రుల నెల్ల మెచ్చక
        యుండి నీ నిప్పు డామొండివానిఁ
దెమ్మని పుచ్చితి కొమ్మ నీ వెఱుఁగవు
        నగుఁబాటు గాకున్నె జగములోన
ననవుడు నమ్మక యాబాల తానభి
        సారికాకృతి గూఢచారి యగుచు


ఆ.

వచ్చి చూచి దుఃఖవహ్నిచేఁ గ్రాఁగుచు
దెలివి సెడక దేహదీప్తి మెఱయ
నఱకఁబడిన పసిఁడితెఱఁగున నున్న యా
ధీరచిత్తుని జయదేవసుతుని.

132

క.

చూచి తను మఱచి పైబడఁ
జూచిన నాదాది నిలిపి క్షోణీపతికిన్
నీచందము చెప్పి తదా
జ్ఞోచితగతి నితనిఁ గూడు టొప్పుఁ గృశాంగీ.

133


వ.

అదియునుం గాక.

134


క.

మును నీవు స్వయంవరమున
కని డాచిన కనకమాలికాభరణం బీ
తని ముట్టి వచ్చెఁ గావున
నొనరినపతి యితడె కాఁగ నొప్పుం బదమా.

135


చ.

అని మగిడించినం దిరిగి యంతిపురంబు కేగి మీనకే
తనుఁ డభిమానముం దగవుఁ దాల్మియు సిగ్గు నడంపఁ దెంపునన్
జనకుని వేడి నీవు ననుఁ జంపినపాపము నొందువాఁడ వీ
పని కెడచేసితే ననుచుఁ [58]బ్రార్థన యేర్పడఁ జేసి మ్రొక్కినన్.

136


మ.

అకటా పేరును బెంపు సొంపు నతిరమ్యాకారముం గల్గువా
నికి నే నిచ్చెద నంచు గారవముతో నిన్నుంప నీ విట్లు వం
శకళంకం బొనరించి తీవు మొద లెంచం గోర వీమొండివా
నికి మోహించితి మాకుఁ జిచ్చిడితివో నీవేల మేమేటికిన్.

137


క.

అని పదరు టియ్యకోలుగఁ
జని సఖులును దాను వెఱపు సమయించి ప్రకా
శని మతిమంతుని దోడ్కొని
తనమేడకుఁ [59]దెచ్చెఁ బ్రజలు దను నవ్వంగన్.

138


ఆ.

తెచ్చి జలకమార్చి దివ్యాంబరంబులు
గట్టనిచ్చి మంచిగంద మలఁది

యిష్టభోజనమునఁ దుష్టి గావించి యా
కొమ్మ తన్ను నతనిసొమ్ముఁ జేసె.

139


వ.

అంత.

140


క.

వెఱ పుడిగి యతఁడు రతికళ
లెఱుపడంబొదలుతివుట హృదయము గరఁగన్
నరకంబడియును జవిగల
చెఱకుక్రియం దీపులుట్టఁ జెలువం గలసెన్.

141


వ.

ఇట్లు కలసి సతిపతు లుండునంత.

142


క.

ఒకనాఁటిరాత్రి తేజ
ప్రకటాకృతు లిద్ద రనిలపథమున డిగి మే
డకు వచ్చి నిలిచి రాబా
లిక పతిపానుపుననుండి లేచి తలంగన్.

143


సీ.

నిలిచిన వారి యుజ్జ్వలదివ్యతేజంబు
        చూచి దిగ్గనఁ దాను లేచి యచట
నిద్దఱఁ గూర్చుండ నిడి యర్చనము లిచ్చి
        యేల విచ్చేసితి [60]రెవ్వ రనుడుఁ
గార్యంబు నాచేత ఘటియించు విఘటించు
        నీ వెంత తా నెంత నిలువుమనుచుఁ
గలహంబు బుద్ధికి గర్మంబునకు నైన
        నింద్రుండు మాన్పించి యిటకుఁ బుచ్చె


ఆ.

నీవు నిర్ణయింపు దేవేంద్రునానతిం
ద్రోవరాదు శిక్షితుండ వీవు

బుద్ది ఘనమొ కర్మము ఘనంబొ చెప్పుమా
యేను బుద్ధిఁ గర్మ మీతఁ డనిన.

144


వ.

అతఁడు విని బుద్ధికర్మంబుల కిట్లనియె.

145


ఉ.

ఎంతటివాఁడ నేను దివిజేంద్రునియానతి నన్నుఁ గూర్చి మీ
యంతటివారు వచ్చినఁ గృతార్థుఁడ నైతి ఫలానువృత్తి మీ
పంతము మీ రెఱుంగరె శుభం బశుభంబును గూడి చేయుచోఁ
గొంతయుఁ గీడు లే దుభయకూటము గాదె ఫలంబు పట్టునన్.

146


ఆ.

బుద్ధిదేవి నీవు పొందుగా [61]నిలువక
కర్మఫలము లెట్లు గదియు నైనఁ
దండ్రి కర్మ మీవు తనయవు మీతండ్రి
యెక్కు డైన నీకు నేమికొఱఁత.

147


క.

దుర్మార్గునకును బుద్ది స
ధర్మునకును విధికృతంబు తప్పదు “బుద్ధిః
కర్మానుసారిణీ" యను
మర్మము చెప్పుదురు నీకు మఱి యొక తెరువా?

148


క.

మును బుద్ది ద్రోవఁజాలని
నను దృష్టాంతముగ నమరనాయకుఁ డిటకుం
బనిచే ననుఁ జూడ జగడము
పనిలే దని యొడఁబడంగఁ బలికి వినతుఁడై.

149


ఉ.

చే టటుదప్ప లక్ష్మి నిరసించి వనంబున మౌనినైనచో
నాటునఁ గాలుఁ జేయిఁ జనునాపదఁ బ్రాణము తీపినుంట నీ
జోటియు వెంట వచ్చుటయుఁ జూడ నయుక్తము లైన వింక నే
పాటులఁ బెట్టఁ జూచెదవొ. బాపు, విధీ! నిను మీఱవచ్చునే.

150

చ.

అని వినయోక్తిగాఁ బలికినంతనె కర్మము బుద్ధియుం గడం
కను దెరు వేది మాకనుచుఁ గైకొని యొక్కటి యౌచు నిర్ణయం
బునకుఁ బణంబుగాఁ గడుఁ బ్రమోదముతో నమృతంబు దెచ్చి పో
సిన నతికాంతిగా నతని చేయును గాలును వచ్చెఁ జెచ్చెరన్.

151


ఉ.

ఈగతి బ్రోచి వారు సన నీవల బాలిక యేగి హస్తపా
దాగమనప్రకారము ప్రియంబుగఁ దండ్రికిఁ జెప్పె నాతఁడు
న్వేగమ వచ్చి యల్లుని నవీనరతిప్రియుఁ జూచి యాత్మపు
త్రీగుణభాగ్యసంపద నుతించుచుఁ గౌఁగిటఁ [62]జేర్చె నాతనిన్.

152


చ.

అతనిచరిత్రముం దెలిసి యత్యనురాగముతో నతండు దా
సుతరహితుండు గానఁ దనక్షోణికి నాతని రాజుఁ జేసిన
న్మతి నతిహృష్టుఁ డౌచు మతిమంతుఁడు తత్పురి యేలుచు న్నిజ
క్షితి కరుదెంచి మంత్రికులసేవితుఁడై సిరు లొందెఁ గావునన్.

153


క.

నీవెరవును నావెరవును
దైవగతిం గాని కొనదు దయ గలిగిన నా
త్రోవల నాడుచు నుండఁగ
నీ వర్థముప్రాపు గమ్ము హితభావమునన్.

154


సీ.

నావుడు నట్లకాఁ గావింతు నూఱడు
        మని వాని ననిపిన యవసరమునఁ
బరదేశు లిద్దఱు భాషించుచో నొకఁ
        డిల యెల్లఁ గ్రుమ్మరి యింద్రకీల
నగముపై నున్న మనస్సిద్ధి యనుదేవిఁ
        జూడ మైతిమి విశస్తులము మనము
అష్టదిక్కుల నున్న యష్టభైరవులకు
        నష్టాంగరుధిరంబు లర్చనముగఁ

ఆ.

జేసి కంఠరక్తసిక్తంబు బలియిచ్చు
జనులకోర్కు లెల్ల శక్తి యిచ్చు
నమ్ముఁడనుచు శాసనము వ్రాసియున్నది
[63]యచటియాత్ర సేయ నరుగ మకట.

155


క.

అని పలుకఁగ వృత్తాంతము
విని విక్రమభూషణుండు విస్మితుఁడై వా
లును మగతనముం దోడుగఁ
జనియె న్మునుచనిన సవ్యసాచికి నెనయై.

156


చ.

అట చని కాంచె భూమివరుఁ డర్జునసిద్ధితపోనుకూలముం
గుటిలకిటిద్విపారిమదకుంజరసేవితసానుమూలముం
జటులగుణచ్ఛటారటితసంయమిరక్షణపుణ్యశీలముం
గటకమణిద్యుతిప్రకటకందరకూలము నింద్రకీలమున్.

157


చ.

కని గిరిమీఁద నున్న గుడికందువకుం జని యందుఁ దీర్ఘమ
జ్జన మొనరించి వచ్చి కొనసాగఁగ దేవికి భైరవాదికం
బునకుఁ బ్రియంబు సేయఁ దనమూర్తి వధింపను వేడ్క ఖడ్గ మె
త్తినఁ గరుణాప్రసన్న యయి దేవత యాతని నడ్డపెట్టుచున్.

158


ఉ.

ఇచ్చకు వచ్చినట్టివర మేమట వేఁడుము కా దనాక నీ
కిచ్చెద నన్న [64]భూమివరుఁ డీవు ననుం గరుణించితేని యే
యొచ్చెముఁ జూడ కాడుచును నోడుచు నిర్ధనుఁ డౌచునున్న యా
దిచ్చున కెల్లకాలము నతిద్రవిణం బొసఁగం దలంపుమా.

159


క.

అని వేఁడి యతని కర్థము
తనియఁగ నిప్పించి సమ్మదంబునఁ బురికిం

జనుదెంచె విక్రమార్కుఁడు
తనతిరుగుడు సర్వజనహితంబై నెగడన్.

160


ఉ.

వెంచలఁ జెర్వులన్ బయల వెన్నెల రేగటఁజౌట నైన వం
చించక యొక్కచందమునఁ జిన్కులు మున్నడఁ బంచినట్లు వ
ర్షించు నవాంబుదంబుక్రియ జీవనకారణ మౌచు లక్ష్మి ప్రా
పించిన నెల్లవారలకుఁ బెట్టినయాతఁడె దాత గావునన్.

161


క.

నీ కింత దానచతురత
లేకునికిని దీని నెక్కలే వనవుడు న
ట్లాకర్ణించి యతఁడు హిత
లోకము గొల్వంగ మగిడి లోనికిఁ జనియెన్.

162


శా.

దుర్గానాయకమానసాంబురుహసంతోషక్రియాహంసు నం
తర్గూఢస్థితవైరిదానవవిభేదక్రీడనాప్రౌఢు స
స్మార్గారూఢమునీంద్రచింత్యనిజనామస్తోముని న్రక్షిత
స్వర్గౌకఃపతి నిందిరారమణుఁ గంసధ్వంసిఁ దార్క్ష్యధ్వజున్.

163


శా.

హస్తన్యస్తసువర్ణభూధరధనుర్జ్యాపన్నగాకర్షణో
దస్తాంభోనిధికన్యకారమణబాణాగ్రానలాఫ్లుష్టదై
త్యసోమాశ్రయదుర్గనిర్గతకురంగాక్షీగణాగణ్యచ
క్షుస్తీర్ణోదకశాంతకోపదహనున్ సోమార్కవహ్నీక్షణున్.

164


మాలిని.

దురితహరచరిత్రా తోషితాత్మీయమిత్రా
పరుషజనవిదూరా భక్తరక్షావిహారా
స్థిరతరనిజకీర్తీ దేవతాచక్రవర్తీ
పురహరహరిరూపా బుద్ధసిద్ధస్వరూపా.

165


గద్యము.

ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళ కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహా

రాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదపోలిపురవరాధీశ్వర వెలనాఁటిపృథ్వీశ్వర రాజ్యసముద్ధరణ కొఱవి వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసువరాజతనూజ గోపరాజప్రణీతం బైన సింహాసనద్వాత్రింశిక యనుకావ్యంబునందు విక్రమార్కునిదివ్యసామర్థ్యంబును సర్వదాతృత్వంబును మతిమంతోపాఖ్యానంబును సాహసాంకు సర్వోపకారత్వంబు నన్నది దశమాశ్వాసము.

  1. నడ్డు పెట్టి
  2. జెప్పెదను సువ్యాపారశౌర్యోదయోన్మద
  3. నాయుర్వర్ధన మదియె తనకు నునికిం గోరున్ - నాయుర్వృద్ధి దలంప నలవి యున్నది మీకున్
  4. సయుక్తిఁ జెప్పె
  5. అందు రవిదనుజమంత్రి ముఖ్యగ్రహమ్ము
  6. శుక్రుని డాసి
  7. నిరిసిన వనపంక్తు లెండనెడ త్రెవ్వని (నెడతప్పని)
  8. మున్నొనర్చను
  9. శక్తికిం దగిన శాంతి యొనర్పును వర్షణం బగున్. యొనర్పుమతర్షణంబులన్
  10. భూజనుల్దనియ
  11. నింపుగ బూజలు నీగులు శాంతిఁ జేసి
  12. గగనాంతమునందశరీరి
  13. శాపురి శక్తి సంతసిలి సత్వము
  14. కాశము ముట్టి నాకడఁ బ్రకాశభజించితి
  15. చనుదెంచె వేగ నెలమిన్ ధాత్రీశుఁ డుజ్జేనికిన్
  16. నీ కరవీసంబును లేదు
  17. విహితాశీర్వాదమౌ భూసుర
  18. గొలువ నాస్వర్ణోజ్వలద్భూషణా
  19. సుధాకరదానవినోది; నుదారసదానవినోది
  20. మహానిర్వాణులై యుర్వరన్
  21. నంభారవం బారగన్
  22. ఆయవసరమున నాఘనుఁ, డాయావును— ఘనుఁడై యాయావును
  23. జీఁకట్లయట్లు
  24. కుఱ్ఱిడించి, ధేనుడించి
  25. మిక్కడ
  26. గజములయంతమృగ
  27. కెంపు దేర
  28. నవని బీటవెట్టి యావులించెడు
  29. గురియంజేసి రభయదాయకునిపై వేడ్కన్
  30. కల్పభూజాదులచే, పట్టుసురలోకమనఁగా
  31. న్మానవనాథ సైచి యభిమానము దాల్చితి గాన
  32. గాంచి కెనయై రాజిల్లుచు న్నుండగన్
  33. ఉద్దాలు = చెప్పులు. ఉద్దాలుఁ మ్రోయఁగా నుల్లాసమున జొక్కి యొయ్య జేరి
  34. నొడిలోనఁ బోసికొనుచు
  35. దీపులువుట్టన్
  36. నీచత్వముతో
  37. సందియు జాగరంబును దిగయునుగరయునా-నంటయు జాగరంబును
    దీగయుగరము నైదింటబడిన
  38. దాయమేసి
  39. నాచికొందు
  40. స్థితవరహస్తము
  41. ధనము యశమును సత్యంబును ... బ్రుంగుడు బ్రుంగుడౌట-బ్రుంగుడు మగ్గు డౌట
  42. జూదమునం జాంబూనదవాదంబున
  43. కితవరుఁ డల్లనవ్వి
  44. వలను గల్గియాడ
  45. ఒకమాడపట్టి .. . నెర రప్పక-గొండ్రందఱు, గాండ్రనుడుకు
  46. దానగామమా- దానదానగాదు పేరోటమి
  47. ములనెకాదు రాజుబలముచనదు
  48. మూఁడేఁడులదనుక. మూఁడేండ్లందాక
  49. నీగుచు
  50. యన్నకదవుకోదివి-యంతలేచి
  51. కోటచలుకదాటి
  52. శాలమాటుగ-చెయ్యిమాటిడి
  53. రతిభయార్తు లగుచు-రతివిహస్తు లగుచు
  54. శ్చలమునవేషయోగమున సంస్థితు
  55. గొంచుచు నతనికాలుంజేయు గోయించ - రోజుచు నతనికాలుంజేయి
  56. జననఫలముదప్పునె యీ
  57. బ్రార్థించి-న్నర్ధించి
  58. బ్రార్థన నేర్పడఁ జెప్పి మ్రొక్కినన్
  59. నేగె
  60. రెవ్వ రేమి, కార్యంబు నాచేత ఘటియింపఁగా మదిఁదలఁచి వచ్చితి రది తెలుపుమనిన
  61. విడ్వడ, విడ్వక
  62. జేర్చెఁ జచ్చెరన్
  63. యచటఁ జూడఁబోద మనుచు నిట్లు
  64. నాకువలయేశ్వరుఁడుం గరుణించితేని