Jump to content

సింహాసనద్వాత్రింశిక/ఏకాదశాశ్వాసము

వికీసోర్స్ నుండి
శ్రీరస్తు

సింహాసన ద్వాత్రింశిక

ఏకాదశాశ్వాసము

క.

శ్రీసహితకంఠభూషణ
వాసుకిఫణరత్నరుచిరవపురర్థకృతా
[1]వాసనిజతోషమయ గౌ
రీసఖ్యవిహారి నిందురేఖాధారిన్.

1

ఇరువదియెనిమిదవ బొమ్మకథ

మ.

కడుభ క్తి న్మదిలోన నిల్పుకొని లగ్నం బొప్పుగాఁ గూర్చి పెం
పడర న్విప్రులు తన్నుఁ జేరి కొలువన్ హర్షానుకర్షంబు లే
ర్పడ నాభోజమహీవరుండు మఱియు న్భద్రాసనం బెక్కున
య్యెడఁ బాంచాలిక యడ్డపెట్టి మఱి సభ్యేష్టంబుగా నిట్లనున్.

2


చ.

ప్రియమున నిల్వరింపక గభీరగుణం బిటు లుజ్జగించి సం
శయ మగునుద్యమంబునకుఁ జాగిన నేల ఫలించు నీకు ను
జ్జయినినృపాలుథంగీ నతిసాహసము న్సకలోపకారమున్
దయయును లేక యిచ్చటఁ బదం బిడవచ్చునె భోజభూవరా.

3


చ.

ఆతనిగుణంబు లెట్టివని యానతి యిచ్చెదవేని నిల్చి నీ
మతి నిఁక నాదరించి వినుమా వినిపించెదఁ గొంతకొంత యు
ద్ధతపరిపంథికుంజరవిదారణసింహపరాక్రము న్మత
[2]క్రతుసఖు నార్తలోకహితకారణు నెట్లు నుతింప నేరుతున్.

4

ఉ.

యాచకపారిజాత మని యర్థులు దన్ను నుతింపఁ ద్యాగభో
గాచరణంబునం బరఁగి యబ్ధులు మేరగ నుర్వియెల్ల సం
కోచము లేక యేలుచు నకుంఠితవిక్రముఁడై విదేశముల్
చూచుమనంబుతో నతఁడు జోగివిధంబున నేగి యొక్కఁడున్.

5


ఆ.

గురిజపేరు లఱుతఁ గొమరార ధరియించి
యడవిమొల్లలఁ గురులందుఁ జెరివి
పాఱుటాకులు మొలబాగుగాఁ గట్టి యే
తెంచుచెంచుసతులఁ గాంచి కాంచి.

6


క.

మాకందములును రక్తా
శోకములును జంపకములు సురపొన్నలు నా
లోకించుచుఁ బ్రియపడి నరఁ
లోకేశుం డొక్కవనములోఁ దిరుగంగన్.

7


సీ.

అతని ప్రతాపాగ్ని నవమానితంబైన
        పగిది బింబమునఁ దాపంబు వొదల
నంభోజహితుఁడు మధ్యాహ్నకాలంబున
        నిప్పులు వర్షించుచొప్పు దోఁప
సర్వజంతువుల కసహ్యంబుగా మహా
        నగము లెండఁగ నెండ నిగుడఁజేయఁ
బలుచనయ్యును జౌటిపట్టులు వేఁడిమిఁ
        గసవులు మొదలారఁ గమరఁజొచ్చె


ఆ.

విహగకులము తాము విహరించుతరువుల
కేగ కీరములను నీఁగఁదొడఁగె
వడ ఘనంబు గాఁగ వాయువు వీతేర
జగము శూన్యమైన చంద మొందె.

8

క.

ఆవేళఁ బేదచెంచుల
కావాసం బైన పల్లెప్రాంతంబున ఛా
యావితతము లగు సురిగల
క్రేవఁ బరిశ్రమము దీర్ప క్షితిపతి నిలిచెన్.

9


చ.

ఆట పరదేశికు ల్నలువు రధ్వపరిశ్రమఖేదఖిన్నులై
నిటలములందుఁ జెంజెమట [3]నిల్వక చెక్కులు జాఱ నెండచేఁ
గటముల రక్తకాంతి నధికంబుగ జొత్తిల దప్పి నోష్ఠసం
పుటములు వాడఁగా వగరుపుట్టఁగ వచ్చిరి వెచ్చనూర్చుచున్.

10


క.

వారం గైకొని శీతల
వారిం దృష దీర్చి గారవముతోడ ఫలా
హారంబు లొసఁగి క్షుత్పరి
హారం బొనరించి యలఁత యంతయుఁ దీర్చెన్.

11


క.

సమనంతరంబ మీ కీ
క్రమమున బెట్టలయనేల ఘర్మాంతపరి
భ్రమణమున నింత పుట్టునొ
విమతులు వధియింపఁగడఁగి వెనుదగిరొకో.

12


క.

నావుడు నొక్కరుఁ డాతని
భావజ్ఞుం డనుచు మిగులఁ బ్రణుతించి నిజం
బీవ యెఱింగితి వట్లౌ
నావిధ మేర్పడఁగ విను భయంకర మరయన్.

13


క.

ఈతల మూఁడామడలం
దాతతముగ మాల్యవంత మనుగిరి మెఱయున్
వేతాళనగర మనఁగఁ గి
రాతేశ్వరుఁ డేలునొకపురం బున్న దటన్.

14

చ.

దయ యొకయింత లే దచట ధర్మము పేర్కొనరాదు ప్రాణసం
శయము విదేశి కయ్యెడ రసాలవనాంతమునందు శోణిత
ప్రియ యను నొక్కదేవత యభీష్టవిధాయిని భీషణోన్నతా
లయమున నుండుఁ గొండరికులంబున కెప్పుడు నింటివేలుపై.

15


ఉ.

ఏము విదూరయానమున నెంతయుఁ జిక్కి యనంతరంబ వి
గ్రామపదంబు గోరుచు రసాలసుశీతలమైన దేవతా
ధామము చొచ్చి చండికకు దండనమస్కృతు లాచరించి యా
సీమనె యుంటి మొక్కవలచేరినపక్షులభంగి నజ్ఞతన్.

16


క.

ఆయెడ నగరము దెస న
న్యాయతఁ బోనీక పట్టుఁ డరికట్టుఁడు వే
డాయుచు మెడగట్టుం డని
కూయిడఁ బెను ఱంతు పుట్టె గుండియలదరన్.

17


చ.

చందనకుంకుమార్ద్రఘనసారనవాక్షతపాత్రహస్తయై
సుందరి యోర్తు భూషణరుచు ల్మెఱయ న్వనలక్ష్మి పోలిక
న్ముందఱ నేగుదెంచి గుడిమోసలఁ దూఱుచు మమ్ముఁ గాంచి చూ
డ్కిందయ దొంగలింపఁ బలికెం బలుకు ల్మది కింపుపుట్టఁగఁన్.

18


చ.

వెఱవక యున్నవార లిట వెఱ్ఱితనం బిది గాదె కొండరుల్
చుఱు కొకయింత లేక [4]మనుజుం దమదేవత కిందు నిత్యముం
జెఱు పొనరింతు రిప్పు డది [5]సేగి విదేశులఁ బట్టుచున్నవా
రెఱుఁగఁగ జెప్పితి న్వెడలి యేగుఁడు ప్రాణము సడ్డ గల్గినన్.

19


చ.

అనవుడు నేము నాత్మహృదయంబులు మిక్కిలి తల్లడింపఁ జ
య్యన వెలి కేగి వాకిట భయంకర మైనఁ దదీయపశ్చిమం
బునఁ గలుకోట యెక్కి సురపొన్నలు నేపెలు నున్నతోఁటలోఁ
గనుకని బాఱి వచ్చితిమి క్రమ్మఱి చూచుచు బమ్మరించుచున్.

20

మ.

నడుము న్నిల్వఁగనోడి యీరములలోన న్ముండ్ల గండ్లం దడం
బడుచు న్లేచుచు రెండుయోజనములుం బ్రాణాపదందాఁటి కా
ఱడవి న్నీరముపట్టు గానక నిరాహారవ్యథం జిక్కి యి
క్కడఁ బుణ్యాత్ముని నిన్నుఁ గాంచితిమి సౌఖ్యం బయ్యె భాగ్యంబునన్.

21


క.

పోయెద మిఁక నీవా
కోయల నగరంబు పొంతకుం జనవల ద
న్యాయులు వాండ్రని చెప్పుచుఁ
బోయిరి కుతుకమున జనవిభుం డిటకదలెన్.

22


ఉ.

అంతటఁ గాంచె నాతఁడు నిరంతరపర్ణఫలప్రసూనని
శ్చింతము రామపాదసరసీరుహచిహ్ననితాంతరమ్యప
ర్యంతము భూర్జపత్రలిఖితోపగతోత్సుకకిన్నరీప్రియో
దంతము పుండరీకహరిదంతదురంతము మాల్యవంతమున్.

23


క.

ఆపర్వతంబు చేరువఁ
బాపాత్ములకెల్ల నునికిప ట్టగుపుర మా
భూపాలుఁడు గాంచి తదీ
యోపాంతవనంబులోని కొయ్యన నేగెన్.

24


సీ.

ఆచ్చట నొకసరోజాకరంబునఁ గృత
        స్నానుఁడై దేవతార్చనకు నేగి
నిచ్చలుఁ గ్రొత్తమౌ నెత్తుట జొత్తిల్లు
        రంగంబు గల గుడి రాజు చొచ్చి
ఖడ్గంబు మాతులుంగ ఫలంబు నభయంబుఁ
        బునుకయు నంకుశమును వరంబు
సురియయు సూత్రంబుఁ గరముల ధరియించి
        శోణితప్రియ యున్న సొంపుచూచి

ఆ.

యుగ్రదేవత యని యూహించి తలఁకక
రక్తపుష్పము లనురక్తితోడ
నొనరఁ బూజచేసి వినుతించి ప్రణమిల్లి
యచట గొలిచియున్న యవసరమున.

25


వ.

ఆనగరంబుదెసనుండి దిమ్ము రేఁగినయట్లు [6]తూఁగొమ్ములుఁ బువ్వనంగ్రోవులునుం దప్పెటలును డక్కులును బెక్కువిధంబుల దిక్కులు చెవుడుపఱుపుచు మ్రోయ నవ్వాద్యరవంబునకు బాసటయై తమయార్పులుం
బెడబొబ్బలును గిరిగహ్వరంబుల నుపబృంహితంబులుగా గంధపుష్పార్చితుం డగు నొక్కదీనుని నడుమ నిడుకొని కుఱుచ [7]కాసకోఱలు మెఱయించుచు బరికెతలల కఱకుఁగొండరులు సనుదెంచిన నప్పరమకారుణికుండు.

26


ఉ.

దీనుని నేటి కిచ్చటికిఁ దెచ్చితి రింతట దేవి మెచ్చునే
హీనుఁడు దుర్బలుండు జడుఁ డేడ్చెడి వీఁ డవలక్షణుండు మీ
రీనరుఁ దెచ్చి చూపి జగదీశ్వరి ని ట్లడికింపఁ జూతు రే
యేనుఁగు చిక్కెనేని మఱి [8]యెంపలిచెట్టునఁ గట్టవచ్చునే.

27


క.

వీనిం బోవఁగనిం డిదె
నే నుత్తమకులుఁడ మాంసనిబిడుఁడఁ బ్రియస
స్మానసుఁడ నన్ను నరబలి
గానిచ్చిన దేవి మెచ్చుఁ గరుణం బ్రోచున్.

28


వ.

అని యద్దేవికి నుద్రేకంబు పుట్ట వాని నిరసించిన తాను మెయికొనిన నాబోయలు నీకొండీనినే చంపించుట మే లని వానిని విడిచిపుచ్చి యతనికి నట్ల

గంధపుష్పాక్షతాదు లిచ్చి దేవిచేరువ గమ్మని యతని ముందట నిడి తలంగిన.

29


ఆ.

మెచ్చుగాఁగ నిట్టి మెకము [9]సాళించెద
ననుచుఁ జండిమంత్ర మొనరఁజెప్పి
పూజకుం డొకండు భూమీశుతల ద్రుంప
బెడిదమైన వాఁడియడిద మెత్తె.

30


క.

ఆతని ప్రభావమునఁ బరా
హతయై తద్గుణము మెచ్చి యయ్యెడ నాదే
వత యడిదము గొని మతినా
తతమగు రోషమున వానితల దెగ నడిచెన్.

31


శా.

ఆపాపాత్ముని నట్లు ద్రుంచి నవరక్తాస్వాదనప్రీతయై
భూపాలోత్తముధర్మముం దయయుఁ దెంపు న్మెచ్చుచుం బ్రేతభూ
తోపేతంబుగ డాకినీసముదయం బుప్పొంగుచు న్నర్తన
వ్యాపారంబులఁ దోడుసూపఁ జెలఁగెన్ వ్యక్తస్వరూపంబునన్.

32


ఉ.

అంతఁ బ్రసన్నయై నిలిచి యార్తశరణ్యుని నిన్ను మెచ్చితిం
జింతిత మైన కార్య [10]మిదె చేకుఱ నిచ్చెద వేఁడు మన్న భూ
కాంతుఁడు మ్రొక్కి నీదుకృప గల్గిన నేమి కొఱంత నేఁడు నా
కింతియ చాలు మర్త్యబలి యెన్నఁడుఁ గోరక పూజ నొందుమా.

33


మ.

అని ప్రార్థింపఁగఁ బూజకుండు నట దివ్యాకారుఁడై యంబరం
బున భాసిల్లుచు నిల్చి ఖేచరుఁడఁ [11]గర్పూరాంగుఁడ న్నేఁ గుబే
రుని శాపంబున స్రుక్కి యీగతి నతిక్రూరుండనై యిప్పు డో
జననాథా భవదాగమంబు కలిమి న్శాపావధిం బొందితిన్.

34

క.

నావుడు వెఱఁ గందుచు నీ
కేవిధమున శాప[12] మొదవె నీకథ తెలియం
గా వినిపింపుము మాకని
భూవల్లభుఁ డడుగ దివ్యపురుషుఁడు వల్కెన్.

35


ఆ.

ధనదు దేవపూజ కనువగు క్రొవ్విరు
లెచట నైనఁ గోసి యేన తెత్తుఁ
[13]దెల్లవాఱ విరులు దేనొకనాఁ డేగి
మధువనమున నొక్కమగువఁ గంటి.

36


క.

అన్నెలఁతుక యెదురను సుర
పొన్నలు గోయంగ వచ్చి పుష్పాయుధుచే
నున్న నెఱవాదియమ్ములఁ
గన్నుల నగుచున్న చెలియకడకుం జనియెన్.

37


క.

అట చని మదిసమ్మద ము
త్కటముగ సఖిఁ గౌఁగిలించి కానగరా వో
విటవంచని [14]యిన్నిదినము
లెట పోయితివనిన నదియు నిట్లని పలికెన్.

38


క.

రతిలంపటుఁడును శృంగా
రతిలకుఁడు ననఁగ విటులు రసికత్వమునన్
క్షితిఁ దిరుగుచు [15]నావెర వ
ద్భుతముగ విని నన్నుఁ గెలువఁబూనికడంకన్.

39


క.

నాయింటికి నరుదెంచిన
నాయిద్దఱ కేను జందనాగురుకస్తూ

రీయుతముగ నుపచారము
సేయించితిఁ [16]దెక్కరముగఁ జిత్తము లలరన్.

40


వ.

తదనంతరంబ వారలు కుసుమంబులుం దాంబూలంబులుఁ బుచ్చుకొని యో విటవంచనీ నీ పేరు నిజంబుగ నెటువంటి విటుల నైన మోసపుత్తు వఁట నిక్కువంబే యని యడిగిన.

41


క.

కల్లలు నిజములు ధర్మము
మొల్లంబును బ్రియము మోహమును నలుకయు న
య్యుల్లసము నయము సరిగాఁ
జెల్లును వెలయాండ్రయందు క్షితిపతులందున్.

42


43-46 గ్రంథపాతం


సీ.

మఱియు నొక్కండు బ్రాహ్మణవిటుం డనువరి
        ననుఁగోరి చనుదెంచి నాకునైన
తగులెల్ల విని నన్ను దర్శింప మఱి యుపా
        యము లేక సుధ పొన్న లమరఁగట్టి
మూఁ డెత్తులుగఁ జేసి మును మాలకరి వోలె
        నేతెంచి నాచేతి కిచ్చినంత
నిరుదెసలం దున్న యిద్దఱ కొసఁగి యం
        దొక్కటి నేఁ గొన నుత్సహించి


ఆ.

యందుఁ దేనె గ్రోలు నళిఁ జూచి యిదియును
క్షణము సౌఖ్య మొందుఁగాక యంచు
ముడిచికొనక దండ దొడమీఁద నిడుకొంటిఁ
గ్రొత్తవాని కియ్యకోలు గాఁగ.

47

వ.

తరువాత వానికిఁ బసిండిటంకం బిప్పించి సంచిలోఁ బడినయప్పుడు గాని యిది దక్కదని పలికి యీతుమ్మెద ప్రియము చెడకుండు మాగవని యొద్ది సురపొన్నమీఁద విడిచిపొమ్మని వీడుకొలిపిన వాఁడును నట్లు చేయుచుం జని మత్సమాగమంబునకుఁ బెక్కువిచారంబులు సేయుచు నెఱజాణయగుటం జేసి.

48


ఉ.

నిష్కము సంచిలోఁ బడుట నీరజమిత్రుఁడు గ్రుంకువేళఁ గాఁ
బుష్కరనేత్ర చెప్పె నళి పొన్నపయి న్విడుమంట లోనికిన్
దుష్కరవృత్తిగా దదియు త్రోవ చుమీ యని చూపు టయ్యె నే
శుష్కవిచారము ల్వలదు సూర్యుఁడు గ్రుంకిన నంద యేగెదన్.

49


క.

అని నిశ్చయించుకొనునెడ
వనజాప్తుఁడు నిప్పుమాడ్కి వారిధిలోన
న్మునుఁగఁగ నెగసిన పొగ క్రియ
ఘనముగఁ దిమిరంబు దిశలఁగనుకని పర్వెన్.

50


ఆ.

అంతఁ బ్రొద్దు వుచ్చి యంధకారంబులోఁ
బొన్న యెక్కి వచ్చి పొంచిపొంచి
జగతిమీఁద నొక్కశయ్యపైఁ బురుషుల
నడుమ నిద్రవోవు నన్ను లేపె.

51


52-54 గ్రంథపాతం

వ.

పిదప నయ్యిద్దఱం గదలించి యిప్పుడు నాతోడఁ గ్రీడసల్పినవాఁ డెవ్వండు చెప్పుఁడా యనిన వాండ్రు నొండొరులఁ జెప్పుకొని తారు గాకుండుట దెలిసికొని [17]కళవళపడి యిది యేమి చోద్య మని విచారించుచు నుండంగ, నేను, బగలు వచ్చిన మాలకరి యప్పుడు దెచ్చిన మూఁడెత్తులలో నీరు

దెసననున్న మీకు రెంటి నిచ్చి కడమ నాకొసంగిన దండయందుఁ దుమ్మెద సుఖియింప నిమ్మని తొడమీఁద నిడుకొనినభావంబు మీ రెఱుంగరైతిరి.

55


క.

ఆరసికుఁ డెఱిఁగి వచ్చిన
నీరీతుల నడుమఁ గలిసి యెఱుకపడఁగ మా
[18]చీరలు వీడ్వఱిచితిమి వి
చారింపఁగ నేల సాధు జయ మౌఁ గాదో.

56


క.

నావుడు వనితల నెవ్వఁడు
గావంగా నోపు మాప్రకార మొరులకు
న్నీ వెఱిఁగింపకు మని ల
జ్జావనతముఖాబ్జు లగుచు నరిగిరి చెలియా.

57


ఉ.

నిన్నటిరాత్రి యీతగులు నీగతి నిచ్చట విశ్రమించుచుం
బొన్నలు గోయవచ్చితి నపూర్వపుఁబంతము వింటివే యనం
బ్రన్నన నవ్వి యీకొలఁది పంతము లెవ్వరుఁ జేయ రుర్విలో
ని న్నికఁ గాముకు ల్గెలువనేర్తురె యండు నుతించె బోటియున్.

58


ఆ.

ఇట్టిగోష్ఠి వినుచు నేను గూఢంబుగాఁ
దరుపుమీఁదఁ బెద్దతడవు నిలిచి
విరులు గోసికొంచు నరిగెడునంతలో
విభునిదేవపూజవేళ దప్పె.

59


చ.

అలుకుచు నేగ నాతఁడు శివార్చనవంచక మాల్యవత్తటి
న్నిలిచి దినంబు మానవులనెత్తురు ద్రావెడి శోణితప్రియం
గొలిచి మనుష్యహంత వయి కోవెలలోపల నుండుమంచు న
న్నలిగి శపించె నీశ్వరనిరాకరణం బిది రిత్తవోవునే.

60

వ.

అపుడు వడవడ వడంకుచు నేనపరాధి నైతిని బుణ్యకార్యంబు వదలి దుర్గోష్ఠి విన్నదానికి ఫలం బిపు డిట్లయ్యె దేవరయానతి తప్పునా నా కెన్నండు శాపావధి యాన తిమ్మని మ్రొక్కిన భవసఖుండు గొంత ప్రసన్నుండై నీ వాదేవతం గొలిచి తత్క్రియ నుండంగ నెప్పుడే నొకవీరుండు నరబలి మానిపింపం దాఁ జేరువయ్యెడి నప్పు డాదేవిచేత శస్త్రహతిని శాపముక్తుండవు గమ్ము పొమ్మనిన.

61


క.

ఖేచరభావం బుడిగి వ
నేచరభావమున నిట్లు నిచ్చలు జనుల
న్నీచుఁడనై వధియించుచు
నీచేతం బూర్వపదము నేఁడిదే కంటిన్.

62


మ.

అనుచుం జెప్పి కుబేరకింకరుఁడు దా నాకాశమార్గంబునం
జనియెం గ్రమ్మఱ శోణితప్రియయు నాక్ష్మాపాలు నగ్గించి
మనమార న్మును గోరినట్టి కొలఁది న్మర్త్యోపహారంబు గై
కొను టే మానితి మారి కేగు మని వీడ్కొల్పెం బ్రసన్నాత్మయై.

63


వ.

తదనంతరంబ.

64


ఉ.

దేవతఁ జూచితిన్ జనులఁ దింటయు మాన్పితి యక్షభృత్యు స
ద్భావము నొందఁజేసితి ముదం బిట చేకుఱె నంచు వీటి కు
ర్వీవరుఁ డేగుదెంచె నిఁక వింటివె వేగమ నీవు నింటికిం
బోవుట మే లనంగ విని [19]భోజనృపాలుఁడు క్రమ్మఱె న్వెసన్.

65


ఇరువదితొమ్మిదవ బొమ్మకథ

క.

అంభోధిశయను గమలా
సంభోగప్రౌఢు నబ్జసంభవగురునిన్

జంఖారివినుతగుణసం
రంభాటోపాంధహర కరాళజ్వాలిన్.

66


మ.

తనచిత్తాబ్జములోఁ దలంచి మఱియున్ ధాత్రీశుఁ డా పాకశా
సనుసింహాసన మెక్కవచ్చిన సముత్సాహంబు వారించి కాం
చనపాంచాలిక వల్కె దానగుణవిస్తారంబున న్సాహసాం
కుని సాదృశ్యము నొందలేక యిది నీకుం జెల్లునే పార్థివా.

67


క.

అతనిదానము భువన
ఖ్యాతము సకలోపకారకారణము దయా
చాతుర్య[20]తుర్యవిధమ
త్యాతతధనకనకసముదయాకరము భువిన్.

68


క.

త్యాగంబున సత్కీర్తియు
యోగంబున ముక్తిసతియు నుచితం బగు ను
ద్యోగంబున సంపదయును
భోగంబున సుందరియునుఁ బొందినఁగూడున్.

69


క.

అనుచును ద్యాగము యోగం
బును నుద్యోగంబు నిష్టభోగంబును బెం
పొనగూడఁ దగినకాలం
బున జరపుచు నవ్విభుండు భువి యేలంగన్.

70


చ.

ఉరగము లెల్ల శేషులు పయోనిధు లెల్ల సుధాబ్ధు లేఱు లం
బరనదు లంద్రు లారజతపర్వతముల్ గ్రహము ల్సుధాకరు
ల్తరువులు కల్పవృక్షములు దైవతసంఘము లన్నియు న్మహే
శ్వరు లనఁ జెల్లె నెల్లెడల [21]సాహసభూషణుకీర్తివర్తనన్.

71

ఉ.

అట్టిదినంబుల న్నృపులు నాశ్రితులుం గవితారసజ్ఞులుం
జుట్టలు మంత్రులుం దొరలు శూరులు వీరులుఁ గొల్చియుండఁగా
దిట్టతనంపుఁబ్రోక యనఁ దేఁకువ కెక్కి విదేశవర్తి యౌ
బట్టొకఁ డేగుదెంచి జనపాలశిఖామణిఁ గాంచి పెల్లుగన్.

72


సీ.

బ్రహ్మాయు వని రాజుఁ బ్రస్తుతిచేసి త
        దాజ్ఞ సుఖాసీనుఁడై భజించి
కవితయు సర్వలక్షణపరిజ్ఞానంబు
        సత్యవాదమును ధీచాతురియును
జగంబు శౌర్యంబు సరసోక్తియును నా
        నియ్యేడుగుణముల నెన్నఁబడ్డ
చండపుత్రుండఁ బ్రచండవాచాలుండఁ
        జండపురాణదీక్షాగురుండ


ఆ.

నవనిపాలు రెల్ల నరిగాఁపులట్ల నా
కిచ్చుధనము లెల్ల నియ్యకొనుచు
నుత్సవమునఁ దిరుగుచుండి యీజగములో
నిను మహాప్రదాత యనఁగవింటి.

73


సీ.

సత్కీర్తి సతికిని సత్కుక్షిలోపల
        భువనత్రయంబును బొదలుచుండు
గావున నింతకు నీవే తండ్రివి నీదు
        ధనము యాచకులకుఁ దల్లి సుమ్ము
తమపితృధనము లేతఱి నైనఁగై కొన్న
        నిది భాగ మని భువి నెన్నఁ బడునె
తనకుటుంబముఁ బ్రోవఁ దా నెంత ప్రియపడ్డ
        నతఁడు మహోదారుఁ డనఁగఁదగునె

ఆ.

తగదు గాని నీయుదారత్వ మేమని
పొగడవచ్చుఁ [22]దొంటిరంతు పొంటెఁదలఁప
శమితకుజనతర్క జయరమాసంపర్క
విమతకైరవార్క విక్రమార్క.

74


క.

జలములు పైఁబడక మహా
నల మాఱదు శౌర్యభూషణా నీకోపా
నలము రిపుసతులకన్నుల
జలములు గని యాఱు నెంత సత్త్వం బిచటన్.

75


క.

కావున యశముఁ బ్రతాపము
నేవెరవునఁ బొగడఁ జెల్లు నెవ్వరి సరిగాఁ
గావింపవచ్చు దీనులఁ
గావం బ్రోవంగ నీవె కారణ మగుటన్.

76


ఉ.

దేవసమాన నిన్ను వినుతించుట వాంఛితసిద్ధి భూమిలో
నేవసుధేశు నీయెదుట నెన్నఁగవచ్చు మదీయజిహ్వ ల
జ్జావశయై చలింప దిఁక సద్గుణుముందఱ సద్గుణాఢ్యుఁ బ్ర
సావన చేయనేరనియతం డతిమూఢుఁడు గానఁ జెప్పెదన్.

77


ఆ.

విపులదుర్గ మైన వింధ్యపర్వతసీమఁ
జంద్రకాంతసౌధజాలరుచుల
రాజపురముతోడ రాయుచు మించిన
రత్నపురము నాఁ బురంబు గలదు.

78


క.

ఒకటొకటికంటెఁ బొడవనఁ
బ్రకటముగా నచటి హర్మ్యపంక్తులు దివి ము
ట్టి కలశభవుచే వింధ్యా
ద్రికిఁ గృతముననైన కొఱఁతఁ దీర్చుచునుండున్.

79

క.

అందు జయసేనుఁ డనఁగఁ బు
రందరవై భవుఁడు [23]రాజరాజధనాఢ్యుం
డిందుధరభక్తినిరతుఁడు
వందిజనప్రియుఁడు మనుజవల్లభుఁ డుండున్.

80


క.

ఆనరనాయకు వేఁడిన
దీనులు ధనవంతు లగుచు దేశములోన
న్మానవనాథులక్రియ నతి
దానంబులఁ బరగుదురు ప్రదాత లనంగన్.

81


సీ.

అట్టివిజయసేనుఁ డధికసంపత్తితో
        నొకనాఁడు నవవసంతోత్సవంబు
సేయ నుద్యోగించె నాయవసరమునఁ
        గవులును బట్లును గాయకులును
నర్తకులును నిజకీర్తి నుతించుచు
        సరసభావంబున సరస నడువఁ
జెలువార వారకాంతలు సుగంధద్రవ్య
        హస్తలై కెలఁకుల నరుగుదేర


ఆ.

దొరలు లెంకలు హితులు మంత్రులును గొలువ
నశ్వరత్నము నెక్కి యుద్యానభూమి
కేగి యచ్చట నొకపొదరింటిక్రేవ
సురుచిరంబుగ మాకందతరువుక్రింద.

82


శా.

అర్పింపందగు పూజలెల్లఁ దగుమర్యాద న్సమర్పించి కం
దర్పుం దత్ప్రియమిత్రుని న్సముచితోత్సాహంబునం గొల్చి యే
కార్పణ్యంబును లేక యిం పెనయఁగాఁ గాశ్మీరకస్తూరికా
కర్పూరాదివసంతఖేలనములుం గావించె నుల్లాసియై.

83

క.

జనవరుఁ డయ్యుత్సవమున
మన మలరఁగ యాచకులకు మాడలు పదివే
లును దొమ్మిదిలక్షలు గ్ర
క్కున నిచ్చెం గీర్తి దిశలఁ గొనసాగంగన్.

84


వ.

ఆసమయంబున.

85


ఉ.

యాచకకల్పభూజ మగు నానరనాథు మహావదాన్యునిం
జూచితి వానిచేత నిలు చూఱలు గొన్నగతి న్సువస్తువు
ల్నాచతురత్వచిహ్నములునాఁ గయికొంటి నతండు ధాత్రిలో
రాచగొనంబులం బరఁగురా జవుఁ గావున నెన్న నొప్పగున్.

86


ఉ.

అంచు నతండు రత్నపురియందలి మండలనాథచంద్రు వ
ర్ణించిన నయ్యవంతిధరణీధరుఁ డాతని చాగ మాత్మలోఁ
గొంచెమకాఁ దలంచి [24]నిజకోశగృహాధిపుఁ డైన లెంక నీ
క్షించి యనంతదానగుణశీలసమగ్రత [25]నత్యుదారుఁడై.

87


చ.

ఇతని కనర్ఘరత్నములయిండులుఁ గాంచనమందిరంబులుం
జతురతురంగసద్మములు సామజశాలలు నూపురాద్యలం
కృతిసదనంబులు న్వసనగేహములుం బరిపాటిఁజూపు స
మ్మత మగువస్తుజాతము సమస్తమునుం గొనిపోవని మ్మటన్.

88


క.

అనవుఁడు భాండాగారికుఁ
డును విస్మయమందుచుం గడుంబ్రియ మడరం
దనలోన వెఱఁగుపడ నా
కనిఁ దోడ్కొని యరిగి వరుసఁ దగ్గృహములలోన్.

89


వ.

మదశుకానుకృతంబు లగు మరకతంబులును, బరిపుష్పరాగంబు లగు పుష్పరాగంబులును, ధామాధికంబు లగు గోమేధికంబులును, బ్రభాసఫ

లంబు లగు ముక్తాఫలంబులును, విడంబితబాలప్రవాళంబు లగు ప్రవాళంబులును, నదృష్టవైదూర్యంబు లగు వైదూర్యంబులును, యమునానీరనీలంబు లగు నీలంబులును, రుచివిజితవజ్రంబు లగు వజ్రంబులును, గల్పితపద్మరాగంబులగు పద్మరాగంబులును, నవధిరితమేరుశిఖరంబు లగు కనకశిఖరంబులును, నగరీకృతార్ణవాజు లగు తేజులును, నుపమితదిగ్గజంబు లగు మత్తగజంబులును, గర్ణికారసువర్ణాకారంబు లగు సువర్ణాలంకారంబులును, నానాంశుకంబు లగు చీనాంశుకంబులును, గనుపట్టం జూపిన నవ్వందివరుండు నివ్వెఱఁగంది తత్త్యాగసంపదలకుం గంపితశిరస్కుండై యందుం దన కావటం బగువానిం గొనిపోవం దలంచి.

90


క.

అనుచరులచేత మణులును
గనకము మూటలుగఁ దృష్టఁ గట్టించి నృపా
లుని గర్ణుని మీఱితి వని
కొనియాడుచు నర్థ మట్లు గొనుచుం జనియెన్.

91


ఉ.

ఆతఁడు చన్నపిమ్మటఁ దదర్థగృహస్థితుఁ డైన లెంక సం
ప్రేతమనస్కుఁడై నృపుని పెంపు మనంబున సన్నుతించుచు
న్నీతియు భీతియుం గలుగ నేరుపు చొప్పడ విన్నవించె న
త్యాతత మైన యాజ్ఞ వినయంబునఁ జేతులు మోడ్చి నమ్రుఁడై.

92


క.

తనియంగఁ బట్టుకొనిపో
యినయర్థము కొలఁది మీకు నెఱుఁగఁగవలయు
న్వినిపించెద ననవుడు న
మ్మనుజేంద్రుఁడు చులుకఁ జూచి మందస్మితుఁడై.

93


క.

చనువాఁ డని నే నిచ్చిన
చనవునఁ గొనిచన్నధనము సంఖ్య యెఱుంగం
బనిలే దిఁక నాయర్థము
కొనియేగినవాఁడె యెఱిఁగికొన్నం జాలున్.

94

సీ.

అనుడు నాలెంకయు నాశ్చర్యమందుచు
        ధరణీశ నీకు నుదారమతికి
నిప్పటియానతి యొప్పు నట్లయ్యును
        బలికెద నావిన్నపంబు వినుము
పయిలెక్కకాండ్రను గయికొల్పి వెఱపించి
        లెంక విశ్వాసంబు బొంకు చేసి
ధన మెంత గల్గినఁ దాఁ జుల్కఁజూడక
        యాయవ్యయంబుల నడుగవలయు


ఆ.

వాని వివరమెల్ల వర్గువుగాఁ గూర్చి
నెఱయఁదెలుపులెక్క నెఱుఁగుకొనుచు
వ్యయము పుచ్చి నిలువ వ్రాయించి కైకొంట
ప్రభుల కిదియ నీతివిభవ మండ్రు.

95


ఆ.

వ్రాఁతకాని నమ్మరా దర్థగృహముల
నుంచకున్న నేమి యొక్కనాఁడె
వెరసు గూడుమనినఁ గరణము పండిత
న్యాయ మనఁగ నర్థ మచటఁ దెచ్చు.

96


క.

ఒకదెసఁ దెచ్చిన యాయం
బొకదిక్కునఁ జెల్లు వ్రాసి యొకదెస వ్యయ మ
ట్లొకదిక్కునఁ జనవ్రాసిన
బ్రకటంబుగ వాఁడు మిగులఁ బాపాత్ముఁ డగుఁన్.

97


క.

వహి వారణాసి యనఁగా
మహిఁ బరఁగివ దిందుఁ గవటమార్గంబుగ నా
గ్రహమున వ్రాసినవానికి
నిహపరములు లేవు నరక మెదురై యుండున్.

98

గీ.

రానిపైఁడి చెల్లు వ్రాయుట యాయంబు
తక్కువై వ్యయం బదెక్కుడౌట
లెక్క తుడుపువడుట లిపి సందియం బౌట
చెల్లు మఱచుటయును గల్లపనులు.

99


క.

కరణము తనయేలిక కుప
కరణము నిర్ణయగుణాధికరణము ప్రజకు
న్శరణము పగవారలకును
మరణము నాఁ జెల్లు నీతిమంతుం డైనన్.

99


ఉ.

వ్రాలకు సందియంబువడ వ్రాయక మోసము పుట్టనీక గ
ర్వాలసుఁడై సుడిం బడక యప్పటికప్పటి కిష్టబుద్ధితో
నేలిక చిత్తవృత్తిఁ జరియించుచు నుండియు నెద్దియైనఁ ద
త్కాల మెఱింగి చేయునది కార్యము రాజహితాధికారికిన్.

100


క.

అధికారము గైకొని బహు
విధముల నాయమును వ్యయము వినిపింపక యే
యధికారి యడఁచె మఱి వాఁ
డధికారియ కాక పతికి నాప్తుం డగునా.

101


క.

కావున నియ్యెడ నను హిత
సేవకునింగాఁ దలంచి చిత్తములోనన్
భావించిన యట్లైనను
నావిన్నప మవధరింపు నరలోకేంద్రా.

102


వ.

అట్లు కాదేని యెత్తువెరసైన నవధరింపు మని మ్రొక్కి యోవదాన్యశిరోమణి బట్టు పట్టుకొనిచన్న రత్నధనస్వర్ణసంఖ్య చూచిన నేఁబదికోట్లు నలునదిలక్ష లయ్యె ననిన నుల్లంబున సంతసిల్లి.

103

క.

తెలియఁగల దొకటి విను నా
సెలవున నతఁ డర్థ మట్లు చేకొని చనియె
న్వల దనుచు నడ్డపెట్టక
నిలుపక పంపినదిచాలు నీపని యొప్పున్.

104


మ.

అనినం గ్రమ్మఱ మ్రొక్కి వాఁడు నరలోకాధీశ నీయాజ్ఞఁ గాం
చనరత్నాంచితశేఖరంబు కరణి న్సర్వక్షమాధీశులు
న్వినయానమ్రశిరస్కులై శిరముల న్విఖ్యాతిగాఁ దాల్చి నీ
పనివారై నెగడంగ నీ సెలవుఁ దప్పంజేయ నే నెవ్వఁడన్.

105


క.

ఎత్తఱినైనను బతి దన
చిత్తగతిం దగవు మీఱి చెప్పిన పని మా
ఱుత్తర మీయక చేసిన
నుత్తమసేవకుఁడు వాఁడె యుర్వీరమణా.

106


చ.

పనిచినఁ [26]బోనివాఁ డొకఁడు పంచినఁ దా నొరుఁ బంచు నొక్కరుం
[27]డను విది గా దటంచు నెదురాడు నొకం డొకఁ డొంటిఁ బోవరా
దను నొకఁ డప్డు రోగినను నాపని గాదను నొక్కరుండు పొ
మ్మనఁగఁ జలించు నొక్కఁడు జనాధిప [28]యేడ్వురుఁ గష్టసేవకుల్.

107


ఆ.

ఆజ్ఞ దప్పుట పతి యాయువు దరపుట
కాన నర్థ మెంత యైన నేఁడు
వోవుఁగాక యేను దేవరయానతి
దప్పఁజేయుదునె హితత్వ మేది.

108


వ.

దేవ నీయానతి కనుగుణంబుగ నమూల్యరత్నాది సువస్తువు లెల్లను దాఁపురంబు చేయక చూపిన నతండు తన యిచ్చకొలందినె యవారితంబుగా

నింతధనంబు గొని చనియె ననిన మిక్కిలి సంతసిల్లి నవ్వుచు నాలెంకకు లక్షధనంబు పసదనం బొసంగెఁ గావున.

109


క.

నీకంత యీవి గలుగక
యీకడ నడు గిడ దరంబె యేగు మనిన నా
భూకాంతునిగుణము లుప
శ్లోకించుచు నృపుఁడు మగిడి లోనికిఁ జనియెన్.

110


ముప్పదియవ బొమ్మకథ

వ.

మఱియు నొక్కశుభావసరంబున.

111


క.

నెఱయ మగతనము గలిగియు
నొఱపుగ జగములకు దల్లియం దండ్రియునా
నెఱుకపడనొప్పుమేనను
దెఱవయు మగవాఁడునైన దేవరఁ దలఁతున్.

112


మ.

అనుచు న్భోజనరేశ్వరుండు మఱియు న్యత్నంబున న్రత్నకీ
లనరమ్యం దిగు నమ్మహాసనముపై లక్ష్మీకళాసుందరా
ననుఁడై పాదసరోరుహం బిడునెడ న్వారించి యాపొంతకాం
చనపాంచాలిక యిట్లను న్సరసవాచాలత్వ మేపారఁగన్.

113


ఉ.

భోజనరేశ్వరా మగిడి పోయెద వెప్పటి యట్ల క్రమ్మఱన్
రాజసవృత్తి నెక్క ననురాగము గైకొని వచ్చె దింతటం
దేజము గల్గునే వసుమతిం బ్రతిలేని వదాన్యవృత్తి మా
రా జగు విక్రమార్కు సరిగాక పదం బిడఁ జెల్ల దేరికిన్.

114


క.

అతని వదాన్యత్వము విన
మతిఁ బ్రియ మగునేని వినుము [29]మందారము సం

తతదానశాలియనఁ దగు
నతనికి సరిరాక వెలుకనై తలవాంచెన్.

116


ఉ.

దండితశత్రుమండలుఁడు దానగుణార్కసుతుండు వైభవా
ఖండలుఁ డార్తరక్షణనికామసముద్యతమానసుండు మా
ర్తాండసమానతేజుఁడు ప్రతాపసమగ్రభుజుండు మేదినీ
మండల మెల్ల నేలె గరిమంబున నబ్ధులు నాల్గు మేరగన్.

116


క.

సాహసభూషణుఁ డొకనాఁ
డీహితమునఁ దలఁచి నిశ్చయించి కలిమిచే
నైహికసుఖమగు ధర్మో
త్సాహమునఁ బరోక్షసుఖము సమకూరఁదగున్.

117


క.

ఈరాజ్యంబున కిటు సం
సారసుఖం బొదవె జన్మసాఫల్యముగా
నేరీతినైన ధర్మా
చారంబున నొందవలయు స్వర్గసుఖంబున్.

118


మ.

అనుచుం గల్పితనిశ్చయుం డగు నరేంద్రాధీశుచిత్తంబు వ
ర్తన మూహించి తదీయసమ్మతికి నుత్సాహంబు రెట్టింప నొ
య్యనఁ దన్మంత్రివరుండు వల్కె నిరపాయస్వర్గసౌఖ్యంబు నీ
కనుమానం బగునే యనంతసుకృతవ్యాపారసంచారికిన్.

119


సీ.

అతిథిసత్కారంబు నార్తరక్షణమును
        దానంబు దయయు సత్యవ్రతంబు
తఱచుగాఁ జేసినధర్మంబు తనతోడి
        నీడయై చనుదెంచుఁ దోడుగాఁగఁ
జిత్తంబు నానాఁటి చింతగూరకమున్న
        యాత్మసంపదలు పెంపఱకమున్న

ముదిమిచే సంధులు వదలకమున్న రో
        గంబున నొకకీడుఁ గాకమున్న


ఆ.

పుణ్య మార్జింపు డవసరంబునకు మొదల
గట్టియౌధనములు గూడఁబెట్టు టండ్రు
జీవ మెడలంగ సుకృత మార్జింపఁజనుట
నిల్లు గాలంగ నుయి ద్రవ్వనేగు టండ్రు.

120


క.

ఈవచనం బితరులకొఱ
కై వినిపింపంగవలయు నది నీకడ స్వా
భావిక మైనది గావున
నీ వెఱుఁగనియట్టి ధర్మనిరతులు గలవే.

121


క.

నావుడుఁ గడు మది నుత్సుకుఁ
డై విప్రులయిండ్లు గృతులు నర్థము వనముల్
బావులు నూతులుఁ జెఱువులు
దేవస్థానములు నిలిపెఁ దేఁకువకెక్కన్.

122


ఉ.

ఎక్కడ జూచినన్ సుకృత మెన్నిక కెక్కఁగఁ గీర్తిసంపద
ల్పెక్కువిధంబులన్ ధరణిఁ బెంపు వహింపఁగ నానరేశ్వరుం
డొక్కఁడె తీర్థసేవనసముత్సుకుఁడై పరివార మెల్ల న
ల్దిక్కులయందుఁ గొల్చి చనుదేరఁగ నర్మద కేగె సొంపుగన్.

123


చ.

కరితురగాదిసైన్యపరికల్పితమార్గనివేశుఁ డౌచు ద
వ్వరిగి యవంతినాథుఁడు నిరంతరవారివిహారశీలసుం
దరతరరాజహంససముదాయసమాహితశర్మదన్నిజ
స్మరణనివారితోన్మదభుజంగమదుర్మదఁ గాంచె నర్మదన్.

124


క.

కనుఁగొని కడుఁ బ్రియమున నె
మ్మనమునఁ బ్రణమిల్లి యచటి మాంధాతృపురం

బున విడిసి యనుచరులుఁ దా
నును నదికిం జనియె నిజమనోరథ మలరన్.

125


మ.

చని యాతీర్థములో సచేలముగ సుస్నానంబు గావించి నూ
తనవస్త్రాభరణానులేపముల గాత్రం బుజ్జ్వలస్ఫూర్తి గై
కొని రాజిల్లఁగ నిల్చి విప్రపరులన్ గోభూతిలార్థాదిదా
ననిరూఢం దనిపె న్రవిగ్రహణపుణ్యంబైన కాలంబునన్.

126


క.

కొంకక యిచ్చుచు వెలువడి
శంకరుఁ గింకరమనోవశంకరు నురగా
లంకారు నచట నిలిచిన
యోంకారేశ్వరుని గొలిచె నుచితార్చనలన్.

127


మ.

భువనాధీశ్వరు నిట్లు తత్పరమతిం బూజించి సేవించి త
ద్భవనప్రాంగణరత్నమండపములోఁ బర్యంతభూమీశులుం
గవులు న్బట్టులు గానవేత్తలు నలంకారజ్ఞులు న్మంత్రులు
న్యువతీస్తోమము లెంకలుం గొలువఁగా నుల్లాసియై యుండఁగన్.

128


మ.

ఒకవైతాళికుఁ డేగుదెంచి సభలో నుక్షిప్రహస్తాగ్రుఁడై
ప్రకటాశీర్వచనక్రమంబున నిజప్రౌఢత్వ మేపార గా
నకళాభిజ్ఞత చూపఁ బూని పలికెన్ క్ష్మాకాంత నీకీర్తికాం
తరు నీరేడుజగంబు లొక్కమణిసౌధంబై వెలుంగుంగదా.

129


ఉ.

ఓనరనాథచంద్ర సుగుణోత్తమ యిచ్చట నాప్తవర్గమున్
దీనుల బట్లను న్ధరణిదేవతలం గవులం బ్రియోక్తి స
న్మానము లేర్పడంగ ననుమానము సేయక యాదరించు నీ
దానమహోత్సవంబు విని దవ్వులనుం డిదె చూడవచ్చితిన్.

130


ఆ.

అర్థినన్న మెత్తు వటుగాక నేర్పరి
నన్న మెచ్చువడయు టదియ కడిఁది

నేటి కొక్కవిద్య నే మెఱయించెద
నవసరంబు నాకు నానతిమ్ము.

131


క.

అనుడుఁ దదీయకళాద
ర్శనలాలసుఁ డగుచు నవసరం బిచ్చినఁ గై
కొని నామేళము గూడ్కొని
పనివినియెద నంచు వెడలి పాఠకుఁ డేగెన్.

132


సీ.

అయ్యెడ నొకక్రొత్తయైనమహావీరుఁ
        డందియ డాకాల నమరఁ బూని
బాగుగాఁ బులిగోరు పట్టు దిండుగఁగట్టి
        నునుపార మేనఁ జందన మలంది
తిలకంబు కస్తూరిఁ దిలకించి చొళ్లెంబు
        చెంగులపాగతోఁ జెన్ను మీఱ
హనుమంతు వ్రాసిన యరిగెబిళ్ళయు వాలుఁ
        గరముల జయలక్ష్మి గడలుకొనఁగ


ఆ.

నొకఁడు వచ్చె వెనుక నొక్కబింబాధరి
యంచుదుప్పటిముసుఁ గమరఁబెట్టి
మేనికాంతి కప్పులోనఁ గ్రిక్కిఱియంగ
హంసయానయగుచు నరుగుదేర.

133


క.

[30]వచ్చి నృపుం గని మ్రొక్కిన
నచ్చో నొకమంత్రి యోమహావీరుఁడ నీ
వెచ్చోటనుండి సతితో
నిచ్చటి కరుదెంచినాఁడ వెవ్వఁడ వన్నన్.

134

శా.

[31]ఆవీరుండు వినీతుఁడై మనుజలోకాధీశుతో ని ట్లనున్
దేవాధీశునిబంట నొక్కెడ బలోదీర్ణుండనై తప్పొగిం
గావింపం గని నన్ను హీనపదునిం గాఁజేసిన న్వచ్చినా
[32]నీవామేక్షణ నాదుభార్య యిట నా కిష్టంబుగా వచ్చితిన్.

135


క.

క్రమ్మఱ నింద్రుఁడు రిపుసై
న్యమ్ములు పోరాడ వచ్చునవసర మని యు
ద్ధమ్మునకుఁ దోడుపడ నను
రమ్మని పుత్తెంచె నిపుడు రాజవరేణ్యా.

136


క.

నే నరుగఁగ నక్కడ నా
దానవయుద్ధమున సుదతి దలఁకెడు నిట నే
మానవుఁడు హితుఁడు లేఁ డటు
గాన సతికి నీవె ప్రాపుగాఁ దగు దధిపా.

137


ఆ.

[33]పాలనంబు సేయుప్రభుఁడవు నీకంటె
నొండుచోట నుంచు టురవుగాదు
దిక్కులేనిప్రజకు దిక్కు నీ వటుగానఁ
దరుణి నరసికొమ్ము తండ్రికరణి.

138


క.

అని యప్పగించి సభలో
వినువారలుఁ జూచువారు విస్మయమందన్
హనుమంతునొడ్డనముతో
హనుమంతుని పగిది నెగసె నాకసమునకున్.

139

క.

మిన్నంట నెగసి నరులకు
గన్నంటిన యంతదవ్వుఁ గానంబడి య
తున్నతగతిఁ గనుపట్టక
చన్నం గని చోద్య మందె జనపాలుండున్.

140


సీ.

ఆమీఁద దేవాసురాహవం బైనట్లు
        పంచమహావాద్యఫణితు లెసఁగెఁ
బొడుపుఁడు తల ద్రెంచుఁ డడువుఁడు నా నిట్లు
        పెడబొబ్బ లార్పులు ముడులు వడియె
నంతలోపల హనుమంతునొడ్డనముతోఁ
        గూడ నాతని చేయి గూలె ధరణిఁ
దరువాత వాలుతో దక్షిణహస్తంబు
        నందియతోఁ గాలునట్లు వడియెఁ


ఆ.

దోడికాలును దెగి తొఱఁగెఁ జెంగులపాగ
బొల్లియంబుతోన ద్రెళ్ళెఁ దలయు
ద్రిండుతోడఁగూడ [34]మొండెము దిగదొర్లె
గొలువులోనఁ జూడ ఘోర మయ్యె.

141


ఉ.

ఎక్కడినుండి వచ్చె నితఁ డెవ్వఁడొ యింద్రునిబంట నంచుఁ దా
నిక్కమలాక్షి నుంచి దివి కేగి సురాసురసంగరంబునం
గ్రక్కున నొక్కఁ డిట్లు కడికండలు నయ్యె నటంచుఁ గొల్వులోఁ
బెక్కువిధంబుల న్భటునిఁ బేర్కొని విస్మయమంది రందఱున్.

142


ఆ.

మీఁది ముసుగు వుచ్చి మెలఁతుక యలకలు
చక్కదువ్వి యప్పు డక్కజముగ

నధిపునవయవంబు లాయొడ్డనంబుతో
గూడఁ దిగిచి బెగడుగొనక పలికె.

143


క.

ఓనరనాయక యిం కిట
నే నుండుట తగదు సమరనిహతుని వీరు
న్నానాథుఁగూడ నేగెద
నానతి యీవలయు నాకు నగ్గి సొరంగన్.

144


క.

[35]నా విని మొదలనె యాతని
చావున కతిఖిన్నుఁడైన జనపతి కృపతో
నోవీరపత్ని జనకుని
కైవడి నినుఁ బ్రోతు నిట్లు గడఁగకు మనియెన్.

145


క.

ఇది చాగెడుకొఱకై నీ
పదములకడ నుంచె నిట్లు పతిపోయిన స
త్పదమున కేగెద ననుపుట
మదిఁ జూడఁగ నిదియె తండ్రిమన్నన గాదే.

146


ఉ.

ఆకులపాటుతోడ నశుభాకృతియై యొకవేళనైనఁ బోఁ
కాకును లేక సొమ్ములకు నఱ్ఱులు సాఁపక పేరఁటంబులం
బోక తొఱంగి పూఁతలును బువ్వులు దూరముగాఁగ ముండయై
యేకడఁ జేరిన న్విధవ కెగ్గులె కాక [36]భరింపవచ్చునే.

147


క.

చచ్చియుఁ జావక తనలో
వెచ్చుచు నియమముల నింక విధవాత్వమున
న్నిచ్చలు మాఁడుటకంటెను
జిచ్చుఱుకుట మేలు సతికి క్షితి మెచ్చంగన్.

148

క.

పతి దుఃఖితుఁ డైనను దా
నతిదుఃఖిత యగుచు నూరి కతఁ డరిగిన బీ
డిత యగుచు నతఁడు సచ్చిన
ధృతితోడన సచ్చునది పతివ్రత చుమ్మీ.

149


ఆ.

పుట్టలోనిపాముఁ బట్టు గారడికుండు
బలిమి వెడలఁ దిగియు పగిది నింతి
తోడఁ జచ్చి పతి యధోగతుఁ డైనఁ దా
నుద్ధరించి సౌఖ్య మొందుచుండు.

150


ఆ.

అతని కేమి కొఱఁత పతిహితంబునఁ బ్రాణ
మిచ్చినాఁడు దివికి నేగినాఁడు
రమణుఁ డగుచు నచట [37]రంభాదిసతుల గూ
డ్కొనకమున్న నన్ను గూడ ననుపు.

151


ఆ.

ఉరక మాన్పితేని నురి వెట్టుకొని యొండె
గుండు గట్టి నీళ్ళఁ గూలి యొండె
విషము ద్రావి యొండె విడుతుఁ బ్రాణంబు లా
తగనిచావు కీడు దగులు నిన్ను.

152


సీ.

[38]అటుగాక పుణ్యమౌ నగ్నిప్రవేశంబు
        చేయింపు మాకీడు చెంద దిందు
నెన్న ముక్కోటియు నేఁబదిలక్షలు
        మానవు మేన రోమంబు లుండు
నన్ని యేఁడులు స్వర్గ మాత్మనాయకుతోడ
        ననుగతయౌ సతి యనుభవించు

వీరునియాలనై విధవనై యుండుట
        సముచితం బదిగాదు చాగనిమ్ము


ఆ.

తడయనేల యనుచుఁ దరుణి ప్రార్థించిన
మాఱు వలుకలేక మనుజవిభుఁడు
కొంత యనుమతింప నంతలోఁ దజ్జను
లాయితంబు చేసి రార్తు లగుచు.

153


చ.

ధృతి మతిఁ బొంగి రాజునకు దీవన లిచ్చి నిజాధినాథు మే
నితునుకలుం దదస్త్రములు నించి ఘృతప్లుతచందనేంధనా
న్విత మగు నగ్నికుండమున నింతి వెస న్నవనీతపుత్రికా
కృతిఁ బడి యంతలోనఁ గరఁగెన్ జనులందఱుఁ బ్రస్తుతింపఁగాన్.

154


వ.

తదనంతరంబ.

155


క.

వసుధేశుఁడు వెఱుఁ గందగ
వెస నరిగయు వాలు ద్రిండు విలసిల్లఁగ నా
కసమున డిగి యవ్వీరుఁడు
కసుగందక వచ్చి తొంటికైవడి నిలిచెన్.

156


ఉ.

ఒక్కఁడు నిట్లు వచ్చి వినయోక్తులు మున్నుగ మన్నుఱేనికిన్
మ్రొక్కి సురప్రసూనముల మోహనమౌ నొకదండ యిచ్చి నే
నక్కడ కేగి దానవుల నందఱఁ ద్రోలినఁ జూచి మెచ్చుగా
నిక్కుసుమస్రజంబు దివిజేంద్రుఁడు నా కొసఁగెం బ్రియంబునన్.

157


క.

క్రమమున నయ్యింద్రుఁడు నా
కమరపదం బొసఁగి నిజసభాంతరమున ని
త్యము నుండఁగవలయుఁ గుటుం
బముఁ దోడ్కొనిర మ్మటంచుఁ బనిచె న్మగుడన్.

158

క.

ఆకారణమునఁ గ్రమ్మఱ
నీకడ కరుదెంచినాఁడ నిఁక నేగెద నే
నీ కప్పగించి పోయిన
నాకోమలి నిచ్చి మగుడ న న్ననుపు నృపా.

159


చ.

అనవుడుఁ గొల్వులోనిజను లందఱు మిక్కిలి చోద్యమందఁగా
మనుజవరుండు వాని కొకమాటయు నాడఁగ ఠావు లేక వి
న్నన యగుచున్న మంత్రులు మనంబున విస్మితులయ్యు వీరుఁడా
యనిమొన నీవు దీఱిన మృగాక్షియుఁ జిచ్చుఱికెం బ్రియంబునన్.

160


మ.

అనిన న్వారలఁ జూచి వాఁడు దివి నే నాదేవసంఘమ్ములు
న్ననుఁ జూడ న్రిపుసేనలం బఱపి మందారస్రజం బింద్రుమ
న్ననగాఁ గైకొని వచ్చినాఁడ నిట నున్నాఁడ న్ననుం దీఱినాఁ
డనిన న్మెత్తురె రాచవారలకు గల్లాడ న్మనం బొందునే.

161


క.

ప్రత్యక్షముగా నెదురను
సత్యము వలుకుదురు గాక చనువారు హితా
మాత్యులునై మీ రీతని
కృత్యము నడుపుదురు మిమ్ము గెలువం దరమే.

162


చ.

అనుడు నిరుత్తరుం డగుచు నవ్వసుధేశుఁడు వానికంత నా
యనిమిషనాథునొండె మఱి యంతకునైనఁ గలంచి తెత్తు నేఁ
డని మది నిశ్చయించుకొని యాత్మహితుం డగు లెంకచేత కాం
చనమయముష్టిరమ్య మగు శస్త్రీక యల్లన యందె నందినన్.

163


క.

ఆవీరుం డప్పుడె నిజ
భావము ప్రకటముగ నాత్మభామినితోడం
దా వైతాళికుఁ డగుచుం
గైవారము సేసె జనులు గడు వెఱఁగందన్.

164

క.

నరనాథ నిన్ను నపు డవ
సర మడిగినవాఁడ నైంద్రజాలికురీతి
న్నరుల నణకించి నీచే
సిరి వొందం జోద్య మిట్లు చేసితి ననియెన్.

165


ఆ.

అనుడు వెఱఁగువడుచు నవనీశుఁ డంతయు
నింద్రజాల మగుట యెఱిఁగి యతని
గారవించి యెన్నికళ లభ్యసించితి
వన్ని నాకుఁ జెప్పు మనుడు నతఁడు.

166


ఆ.

పెక్కువిద్య లెఱుఁగఁ బృథ్వీశ నినుఁ గొల్వ
నేర్తుఁ గొన్నికళలు నేర్తుఁ దొల్లి
వానిపేళ్ళు విన(గవలయును జెప్పెద
దాననైన నన్నుఁ దద్జ్ఞుఁ డనరె.

167


వ.

కావున నవధరింపుము నాలుగు వేదంబులును శిక్షాదిషడంగంబులును స్మృతులును బురాణంబులును బూర్వోత్తరమీమాంసలును న్యాయనిస్తారంబులును నితిహాసంబులును వాస్తుశాస్త్రంబును శ్రౌతతంత్రంబును నాయుర్వేదంబును ధనుర్వేదంబును విషప్రతీకారంబును మంత్రప్రతీకారంబును గణితంబును మాంత్రికత్వంబును జలసూత్రంబును సంగీతంబును సాహిత్యంబును నుచితకృత్యంబును నాటకంబులుఁ గావ్యంబులు నలంకారంబులు నానాదేశభాషలును సకలలిపిపరిచయంబును దూరగమనంబును దూరశ్రవణంబును ధురంధరత్వంబును వశ్యాకర్షణాది షట్కర్మంబులును వాహనారోహణచాతురియు జలస్తంభన, శిలాస్తంభన, స్థలస్తంభన , అగ్నిస్తంథన, ఖడ్గస్తంభన, వాయుస్తంభన, రసస్తంభన, శుక్లస్తంభన, రక్తస్తంభనాదులును మహేంద్రజాలంబును నష్టవస్తుసముద్ధరణంబును జింతితార్థదానముష్టీకరణంబును బ్రియభాషణంబును నదృశ్యకరణంబును నదృశ్యాకర్షణంబును గృషివాణిజ్యాదులును శక్తిత్రయం

బును రత్నగర్భాదిపరీక్షణంబును మనుష్యాదిజీవపరిరక్షణంబును ద్యూతాదిఖేలనంబును యమనియమాద్యష్టాంగయోగంబును అష్టావధానంబును వైదికంబును లోకాచారంబును రతిరహస్యంబును వాద్యకౌశలంబును నాట్యంబును బరకాయప్రవేశంబును బరవంచనంబును ఉపాయాపాయవివేకంబును వీరత్వంబును వాచకంబును గందుక కుక్కుటాండ
జలపూర్ణభాండ చక్రభ్రమణంబును బహురూపనటనత్వంబును వేణుదండభ్రమణంబును రాజముఖ మృగముఖ స్త్రీముఖ చోరముఖ దిఙ్ముఖబంధనంబును హాలికప్రయోగంబు నాకారగుప్తియు భావజ్ఞానంబును గ్రామణికత్వంబును లేఖకత్వంబును బరిహాసంబును వాచాలకత్వంబు నిష్కంపవృత్తియు సర్వజాతిశిల్పపరిశీలనంబును నా నీచతుష్షష్టికళలయందును దేవరసాన్నిధ్యంబునం గొంత పరిచితుండ ననిన.[39]

168


క.

భూవల్లభుఁ డాతని వి
ద్యావిజ్ఞానంబు మెచ్చి తనలోపల సం
భావింపఁ దలంచునెడన్
దౌవారికుఁ డేగు దెంచి తగ నిట్లనియెన్.

169


క.

ఓనరనాయక తమకుం
బూనిక ఫలియింపఁ బాండ్యభూపతిమంత్రుల్
కానుకలు గొంచు దేవర
గానం జనుదెంచినారు కడు వినయమునన్.

170


ఆ.

అనిన వారిఁ దోడికొనిరమ్ము నావుడు
మగిడి యేగి యచటిమంత్రివరుల
వాఁడు దోడుకొనుచువచ్చి దర్సింపించె
గనకరత్నచయము మునుముగాఁగ.

171

సీ.

ఆమంత్రివరులు సాష్టాంగంబుగా మ్రొక్కి
        నిలిచి ముందరఁ గరంబులు మొగిడ్బి
జనలోకనాయక యెనిమిదికోట్లు దీ
        నారముల్ [40]నూర్వురు వారసతులు
తొంబదిమూఁడు ముత్యంబుల[41]కావళ్ళు
        నేఁబది మత్తకరీంద్రములును
మున్నూఱు జవనాశ్వములును గప్పంబుగాఁ
        బాండ్యభూపాలుండు పంపె నీకు


ఆ.

నవధరించి దండయాత్ర యక్కడమాని
యతని గావవలయు ననుచు మ్రొక్కి
[42]యున్నఁ గరుణఁ జూచి యుర్వీశ్వరుండును
మోద మడర వారి నాదరించి.

172


ఉ.

అర్థులు గోష్టి [43]చేయు సమయంబున వచ్చిన దర్సనంబు న
య్యర్థుల కిచ్చెనేని ప్రభు వాతఁడె కావున విద్యవాని కా
య్యర్థము ముత్తియంబులు నవాంగనలుం గరులున్ హయంబులుం
బార్థివుఁ డిచ్చి పుచ్చెఁ దను బాండ్యునిమంత్రులు ప్రస్తుతింపఁగన్.

173


క.

అట్టి మహోదారుఁడు తన
పట్టణమున కేగి రాయబారులఁ గృపఁ జే
పట్టి సిరి నెగడెఁ గావున
నిట్టిగుణము లేక యెక్క నితరులతరమే.

174


క.

అనవుడు భోజుండును నె
మ్మనమున నవ్విక్రమార్కు మహనీయము లౌ

గొనములు గొనియాడుడు సి
గ్గెనయఁగ నాసొంపుదక్కి యింటికిఁబోయెన్.

175


శా.

శృంగారాధిపతిత్వసంజనితలక్ష్మీసంగతాంగు న్వియ
ద్గంగాకారణపాదపద్మునిఁ ద్రిలోకవ్యాపకుం గోపరూ
పాంగీకారకృతార్థితవ్రజకురంగాక్షీమనోరంగునిన్
సంగీతప్రియు సామవేదమయుఁ గంసధ్వంసి విశ్వంభరున్.

176


శా.

గంగాతుంగతరంగసంగతజటాకల్పాయమానాకృతిం
ద్వంగద్భోగభుజంగరాజఫణరత్నజ్యోతిరుద్దీప్త సా
రంగాంకద్యుతిధౌతరాజతగి ద్రస్థానరంగస్థలీ
రంగద్భృంగిరిటిప్రసంగసుఖపారంపర్యధుర్యున్ శివున్.

177


మాలిని.

శశధరశకలాంకా సన్మనోనిష్కళంకా
విశదగిరినివాసీ [44]విశ్వబాధానిరాసీ
దశముఖవరదాతా దైత్యహింసావిధాతా
పశుపతిహరిరూపా ప్రాజ్యపూజ్యస్వరూపా!

178


గద్యము.

ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళ కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదప్రోలిపురవరాధీశ్వర వెలనాఁటిపృథ్వీశ్వర రాజ్యసముద్దరణ శ్రీకొఱవి వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసువరాజతనూజ గోపరాజప్రణితంబైన సింహాసనద్వాత్రింశికయను కావ్యంబునందు సాహసాంకుని సాహసోపకారంబులును విటవంచని వంచకత్వంబును గర్పూరాంగుని శాపమోక్షణంబును విక్రమార్కునౌదార్యంబు నన్నది యేకాదశాశ్వాసము.

  1. వాసమయతోషనిజగౌ
  2. క్రతుసుఖసభ్యునార్తహిత-నార్తమర్త్యహిత
  3. నీళులు మేనుల జాఱ
  4. మనుచుం
  5. జోగివిదేశులఁ
  6. తూగొమ్మలునుం బువ్వనగ్రోవులునుం దప్పెట్లుం దింట్లును ఢక్కలును (దింట్లును అనుటకు, నుంట్లును అనియు)
  7. కాసలతో గొఱకలు మెరయిం
  8. వెంపలిచెట్టు అని వాడుక, యెంపలి యని యిందు ప్రయోగము
  9. సాధించెద
  10. మిటు
  11. గర్పూరాఖ్యుఁడన్
  12. శాపమబ్బె శాపమయ్యె
  13. కానకరిగి విరులు దేనొకనాఁడిచ్చ
  14. యిన్నాళ్ళీ
  15. నా పేరద్భుత
  16. తేకరముగ
  17. తక్కలపడి
  18. చీరలు వీడ్వడఁగట్టిన, సారస్యం బిదియ నాదుజయ
  19. భోజుఁడు క్రమ్మఱ నేగె లోనికిన్
  20. చాతుర్యవిదితమదియ
  21. సాహసభూషణుఁ డుర్వి యేలఁగన్
  22. తొంటిపొందెతలప
  23. రాజరాజౌదార్యుం
  24. నిజకోశగృహస్థితుఁడైన
  25. నత్యుదగ్రుఁడై
  26. బోయిరాఁ డొకఁడు
  27. డను నిది గా దటంచు
  28. యార్వురు అని మూ.
  29. మందారము సం, తతమును సంతానము దా, నతనికి
  30. వచ్చి ప్రణమిల్లి నిల్చిన
  31. ఆవీరుఁడు వినతుండై
    భూవరుతో నిట్లు పలికెఁ బొలు పలరంగా
    దేవతలు దానవాదుల
    తో వైరము పూని నన్నుఁ దోడ్పడఁదలఁచిర్.
  32. ఈవామేక్షణ భార్యగా క్షితితలం బిష్టంబుగా వచ్చితిన్
  33. భారమెల్ల మాన్పుప్రభుఁడవు
    నొండుచోటఁగార్య మొండుపుట్టు
    పాపమెల్లమాన్పు-
  34. గుండములు ద్రెళ్ళె - నెడమకాలును దెగి పుడమి బడియె
    గుండలములు ద్రెళ్ళె
  35. ఆవీరభటుని చావునకై
  36. చరింపవచ్చునే, తరింపవచ్చునే, ధరింపవచ్చునే
  37. రంభాదిసతులను గూడకుండ - రంభాదులను గూడుకొనక మున్న
  38. అటుగాన యుక్తమౌ
  39. ఈవచనంబులోని చతుష్షష్టికళలును బ్రతికొక విధముగా మార్పఁబడినవి, సంఖ్య హెచ్చినది.
  40. యువతులు నూఱువురును
  41. క్రోవలు
  42. విన్నవించుటయును విని యవనీపతి
  43. చేయునెడలందున- చేయునెడ నప్పని
  44. విశ్వబోధానురాశీ