Jump to content

సింహాసనద్వాత్రింశిక/ద్వాదశాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

సింహాసనద్వాత్రింశిక

ద్వాదశాశ్వాసము

క.

శ్రీపరిరంభణసమయ
ప్రాపితనవకుంకుమాంక భాసుర నిజదే
హోపమితసాంద్రనీరద
రూపు న్సురవిమతనిహితరోషాటోపున్.

1


చ.

హృదయమునం దలంచి ధరణీశుఁడు క్రమ్మఱ నొక్కవేళ నా
త్రిదశవరాసనంబున కతిప్రమదాస్పద మైనరాజ్యసం
పద నరుదేరఁగా నతని భావము గల్గొని యల్ల నవ్వుచుం
దదనుమతంబు మాన్పి విదితంబుగ నచ్చటి బొమ్మ యిట్లనున్.

2

ముప్పదియొకటవ బొమ్మకథ

క.

ముప్పదిమాఱులు క్రమ్మఱి
యప్పుడ చనుదెంచినాఁడ వాతనికథ లి
ట్లొప్పుగదా యిఁకనొకకథ
చెప్పెద నీచేఁత నీకుఁ జెల్లదు చుమ్మీ.

3


ఉ.

సజనరక్షణోన్నతవిశాలభుజాయుగళుండు సర్వసం
పజ్జితకిన్నరేశ్వరుఁ డపారభటోద్భటవైరిమేదినీ
భృజ్జలజక్షపాకరుఁడు భీమబలాడ్యుఁడు విక్రమార్కుఁ డా
యుజ్జయినీపురంబున గుణోర్జితుఁడై ధరయేలుచుండఁగన్.

4

క.

జననుతుఁడు క్షాంతిశీలుం
డనఁగా నొకభిక్షుకుండు హరిమూర్తికిఁ దా
నెనయగు భూవల్లభునిం
గనుఁగొనఁ జనుదెంచి ఫలము కానుక యిచ్చెన్.

5


క.

ఇచ్చినఁ గైకొని నృపుఁ డిటు
విచ్చేయుం డనుచు గారవించుచు నతనిన్
సచ్చరితుఁ డనుచు నాసన
మిచ్చి యుచితగోష్ఠి జరపి యెలమిని ననిపెన్.

6


వ.

ఇట్లనిపిన తదనంతరంబున.

7


ఆ.

ఆఫలంబు తనగృహాధ్యక్షు చేతికి
నిచ్చి లేచి లోనికేగె విభుఁడు
మఱియు నాతపస్వి మఱునాఁడు గ్రొత్తగా
నొక్కపండు దెచ్చియొసఁగెఁ బతికి.

8


శా.

ఆపండు న్నృపుఁ డట్లు పుచ్చుకొని భాండాగారిచే నిచ్చె ని
ట్లేపార న్ఫలహస్తుఁడై యవసరం బీక్షించుచు న్భిక్షుకుం
[1]డేప్రొద్దుం గవితావిలాసమున నర్కేందు ప్రతీకాశుఁడౌ
క్ష్మాపాలుం గొలువంగ నయ్యె దశవర్షంబు ల్వినోదంబుగఁన్.

9


చ.

అటు లొకనాఁడు క్రొత్తఫల మాతఁడు దెచ్చిన బెంచినట్టి మ
ర్కటమున కిచ్చె నాకపియుఁ గైకొని మూర్కొని చూచి మెచ్చుచుం
గటుకనఁ బండలం గొఱుకఁగా నొకరత్నము గింజమాడ్కి ముం
దటఁ బడియె న్నిజప్రభలఁ దద్గృహమండప మర్కువన్నె గాన్.

10


సీ.

ఆరత్న మీక్షించి యాశ్చర్యమున విభుఁ
        డట గృహాధ్యక్షుఁ డైనట్టి లెంకఁ

బిలిపించి యిన్నాళ్ళఫలములు దెమ్మన్న
        నరిగి మాణిక్యంబు లైనవాని
నన్నిటిఁ దెచ్చిన [2]నాదాఁపుటకు మెచ్చి
        వానికి నవి యిచ్చి వరుసఁ బిదప
క్షాంతిశీలుం డటు చనుదెంచుటయుఁ జూచి
        యనఘ నీవిట్టి యనర్ఘమణులు


ఆ.

నాకు నిచ్చి యేమి నాయెడఁ గైకొనఁ
దలఁచినాఁడ విపుడు విలువఁ జూడ
నొక్కరత్నమునకు నుర్వియంతయుఁ జాలు
దిన్నిరత్నములకు నెద్ది యిత్తు.

11


క.

అనవుఁడు నాభిక్షకుఁ డో
జననాయక దీనికంటె సమధికగుణమౌ
పనిగలదు గాన వచ్చితి
ననఘుఁడ వభయుఁడవు సాహసాంకుఁడ వగుటన్.

12


చ.

క్షితివర నాప్రియంబు విను కృష్ణచతుర్దశినాఁటిరాత్రి యు
న్నత మగు మఱ్ఱిక్రింద మసనంబున నున్న పిశాచపంక్తి స
న్నుతు లొనరించి హోమము మనోరథసిద్ధికిఁ జేయువాఁడ నే
కతమున నీవు నచ్చటికిఁ గ్రక్కున రమ్మటు నాకుఁ దోడ్పడన్.

13


చ.

అనవుడు నింతకాలము ప్రయాస మిదేటికి నాఁడె చెప్పినం
బనివిననే యడంచి యొక బ్రహ్మముఁ జేసితి నేఁడు నీవు చె
ప్పిన సమయంబు దప్పక యభీష్టము నీ కొనగూర్ప వచ్చెదం
జనుమని వీడుకొల్పి నృపచంద్రుఁడు మానస ముత్సహింపఁగన్.

14


వ.

అంతఁ గృష్ణచతుర్దశి వచ్చినం దద్రాత్రి సమయంబున.

15

క.

నీలాంకితభూషణములు
నీలాగురులేపనములు నీలాంబరముల్
నీలోత్పలములు నిజదే
హాలంకారములు గాఁగ నతఁ డొక్కండున్.

16


సీ.

కరవాలహస్తుఁ డై పురము వెల్వడి వీర
        భావంబుతోఁ బూర్వభాగమునను
డాకినీచండతాండవసముద్దండంబు
        ఘూకఘూత్కారాదిఘోరపదము
సంహృతశవదాహసమయసముజ్జ్వల
        చ్చటచటధ్వనివహ్నిసంకులంబు
సకుటుంబవృద్ధజంబుకభీషణాక్రోశ
        సంతతబధిరితాళాంతరంబు


ఆ.

కర్పరాస్థిశూలకంకాళనృకపాల
దారుణంబు భూతకారణంబు
నాగభయరసంబునకు నాస్పదంబైన
యాశ్మశానభూమి కరిగి యచట.

17


క.

వటతరువుక్రింద ననలో
త్కట మగు గుండంబుపొంతఁ దపసిం గని యే
మట పనివంపుము నావుడు
భటభావముఁ బొగడి కార్యపరుఁడై యతఁడున్.

18


వ.

ఇచటికిఁ గ్రోశమాత్రమున నొక్కశింశుపావృక్షం బున్నది యందు విలగ్నుండగు బేతాళుండున్నవాఁ డతనిం గొంచు ర మ్మతండు మౌనంబునం గానిరాఁ డని పంచిన నట చని యనేక విహంగభుజంగపిశాచబ్రహ్మరాక్షససతతనివాసం బగు నమ్మహామహీరుహంబు డగ్గఱి తదీయశాఖావ

సక్తావనతచరణుండు నవలంబమానహస్తుండును నధోముఖుండును నగు నా భూతప్రముఖుం జూచి.

19


సీ.

తరువెక్కి కాళులతగు లూడ్చునంతలో
        జేతులు పట్టినం జేతు లూడ్చి
మఱియుఁ గాళ్ళం బట్టి మొఱవెట్టునాతని
        మెడమీఁద నిడుకొని పుడమి కుఱికి
బంటున కుచిత మౌ పనికిఁ బంపక భిక్షు
        కుండు పీనుఁగు మోవఁగోరి పనిచె
ననిదూఱఁగా బిశాచాగ్రేసరుఁడు మీఁది
        కెగసి యెప్పటియట్ల తగిలియుండె


ఆ.

భూవరుండు మోసపోయితి నని తాను
మీఁది కేగి వీఁపుమీఁదఁ బెట్టి
కొనుచు డిగ్గి యేమియును బల్క నోడుచుఁ
గదలివచ్చెఁ గార్యగౌరవమున.

20


క.

ఆయెడ బేతాళుఁడు జన
నాయకుఁ బరికించి వేఁడి నరవర భార
వ్యాయామము మఱచి సుఖో
పాయంబునఁ దెరువు జరుగునని కథఁ జెప్పెన్.

21


వజ్రముకుటుని కథ

వ.

అది యెట్లనిన.

22


ఆ.

అఖిలలోకవిదిత మైన కాశీపురం
బునఁ బతాపముకుటుఁ డనఁగ రాజు
కలడు వాని కిష్టకాంత సోమప్రభ
యనఁగఁ గలదు పేరు సార్థముగను.

23

క.

ఆదంపతులకు సుతుఁడు ప్ర
మోదాకృతిఁ బుట్టి వజ్రముకుటుఁ డనంగా
మేదినిఁ బరఁగుచునెన్నఁగ
శ్రీదనరారంగ మరుని చెలువు వహించెన్.

24


క.

ఆరాజసుతుఁడు బుద్ధిశ
రీరుం డనుమంత్రిసుతుఁడు ప్రియసఖుఁడుగ నా
నారూపవినోదముల వి
హారంబులు సలుపుచు న్మహావ్యసనుండై.

25


ఉ.

ఇష్టసఖుండుఁ దా నడవికేగి మృగంబుల వేఁటలాడుచుం
గ్లిష్టశరీరుఁడై కొలని క్రేవ జలార్థము చేరి కన్యకా
సృష్టికి నాద్యలో యనెడు చెల్వలు [3]గొల్వఁగఁ దారకాంతర
స్పష్టహిమాంశురేఖ కిది సాటి యనం బొడఁగాంచె నొక్కతెన్.

26


చ.

అనువుగ బాహులోచనకుచాస్యకళ ల్గొనివచ్చినారు తెం
డని బిసమీనచక్రనలినౌఘము నీళ్ళను ముంచి వచ్చి శో
ధన మొనరించి చేకొను విధంబున నంబురుహాకరంబు పొం
[4]తను విహరించు బాలికయు ధారుణినాథుతనూజుఁ జూచినన్.

27


క.

ఇరువుర చూపుల మదనుఁడు
శరములుగాఁ జేసి పులకసముదయ మొదవన్
సరి నయ్యరువురమనములఁ
గరఁగించెం బ్రేమరసము గడలుకొనంగన్.

28


ఉ.

అంబురుహాక్షి యప్పుడు ప్రియంబున నౌఁదల గల్వపూవుఁ గ
ర్ణంబునఁ జేర్చి, దంతశిఖరంబుల ఘట్టన చేసి, పాదప

ద్మంబునఁ బెట్టి, వక్షమున దాపి, మనోగతి లక్షణంబు వ
క్తంబునఁ దోఁపకుండఁ, జెలిక తైలు గొల్వఁగ నేగె నూరికిన్.

29


క.

ఇట నాతురుఁడై వజ్రము
కుటుండు ప్రియసఖుఁడు దన్నుఁ గొల్వఁగఁ బురి కా
దట నరుదెంచియు నొకచెం
గట నుండెం దెలియరాని [5]కనుబేటమునన్.

30


వ.

ఇ ట్లాకన్నియ నామగ్రామజన్మప్రేమాతిశయంబు లెఱుంగమి మిగులఁ బొగులుచు దాని తగులు వగల నొగులుచున్న రాజకుమారుం దెలుపకుండుట బుద్ధిగా దని బుద్ధిశరీరుండు డగ్గఱి నీ కింత చింతయేల విను మాకోమలి తలమీఁది యుత్పలంబు కర్ణంబునుం జేర్చుకొనుట కర్ణోత్ఫలుం డనురాజుగలఁ, డది దంతఘట్టితంబు సేయుట దంతఘట్టకుం డనం దన్మంత్రి గల, డది పదపద్మంబున మోపుటం బేరు పద్మావతి యగు, నది హృదయంబున నత్తుట నీవ హృదయేశ్వరుండ, వని సూచించె నప్పుడే నిశ్చయించితి నాకర్ణోత్పలుండు [6]కుంతలదేశం బేలుచుండు నని విందుము.

31


ఉ.

ఆతనిమంత్రికూఁతు భవదంగనగా నొనరించువాఁడ ర
మ్మా తలపోత లేల యని మానవనాథతనూజుఁ గొంచు న
న్వీతనిగూఢవేషముల [7]నేగుచుఁ గౌంతలకంబు చేరి మా
[8]ర్గాతిథివృత్తి నొక్కతె గృహంబున నిల్చి యనుక్రమంబునన్.

32


సీ.

ఈపురం బేలురా జెవ్వఁ డాతనిమంత్రి
        యెవ్వఁ డాతనికూఁతు రెవ్వరొక్కొ
యింతయు నెఱుఁగుదువే యని
        యడిగిన నుర్వీశ్వరుండు కర్ణోత్పలుండు

తన్మంత్రివర్యుండు దంతఘట్టకుఁడు త
        త్తనయ పద్మావతి యనఁగఁ గలదు
దానికి నే నిష్టదాసినై వర్తింతు
        నని యది చెప్పిన నాత్మఁ బొంగి


ఆ.

మంత్రిపుత్రుఁడు తనమాట నిక్కువమైన
నతని నూఱడించి యదియ యటకు
దూతిగాఁగ మొదలు దొరకొని తమరాక
చెప్పిపుచ్చి రపుడు చెలియకడకు.

33


క.

అది చని యొక రాకొమరుఁడు
సుదతీ నీతలఁ పెఱింగి [9]సుగుణత యొందం
గదియఁ జనుదెంచి సమ్మద
మొదవఁగ నాయింట విడిసియున్నాఁ డనినన్.

34


వ.

అది విని గూఢభావం బేర్పడకుండ దానిని భర్జించి రోషమిషంబునం గర్పూరమలయజసాంద్రంబు లగు రెండుచేతుల దాని రెండుచెక్కులం దనపదివ్రేళ్ళు నంటవేసిన నది ఖిన్నవదనయై తిరిగి చనుదెంచి తత్కృతావమానంబు సూపిన నారాకొమరుం డింక నాశ లేదని యుస్సురనినం దత్సహచరుం డగు బుద్ధిశరీరుం డట్లనియె.

35


సీ.

చింతింప కిఁక దీని చెక్కిళ్ళఁ దెల్లని
        పదిరేఖలుగ వ్రేసి పంపు టరయ
నిదిశుక్లపక్ష మీపదిదినంబులుఁ బుచ్చి
        రమ్మని చెప్పుట నమ్ము మనుచుఁ
దెలిపి యాపదిదినంబులుఁ బుచ్చి యాదాసి
        బ్రార్థించి యెప్పటియట్ల ననుప

నది తొంటిక్రియ మాటలాడఁగాఁ గుంకుమ
        నూఱెడి సఖిఁ బిల్చి నోరిమీఁద


ఆ.

దీని నడువు మనుచుఁదెగి మూఁడువ్రేళ్ళు వ్రే
యించి వెడలనడిచె వంచనమున
మగిడివచ్చి కుంకుమద్రవాంకితము లౌ
పెట్లు సూపె నది యభీష్టమమర.

36


గీ.

చూచి యాస లేమిఁ [10]జూకురుఁబొందుచు
చచ్చుటొప్పు ననుచు వెచ్చనూర్చు
వజ్రముకుటుఁ బొగల వల దని తత్సఖుఁ
డాస గలుగఁ దెలిపి దాసిఁ బిలిచి.

37


వ.

ఆకన్నియ రజస్వల యై యుండంబోలుఁ గావున నెఱ్ఱగా నీమూఁడువ్రేట్లు వేయించి త్రోలించె నీమూఁడుదినంబులుం గడపి యింక నొక్కతోయంబె యరుగవలయు నని వేఁడుకొనిన నదియుం గ్రమంబున నాలుగవనాఁడు కన్యకాసౌధంబునకుం జని మగిడి వచ్చి.

38


మ.

నగుమో మొప్పఁగ నేఁటిమాట వినుచు న్న న్నాదరింపంగ నే
నుఁగు తద్వేళ మదించి కంబము వెస న్నుగ్గాడి యేతెంచిన
న్మొగసాల న్వెడలంగరా దనుచు నంభోజాక్షి పీఠంబుపై
డిగజాఱ న్ననుఁ ద్రాటఁ గట్టి విడిచెన్ డెందంబు బిట్టుల్కఁగాన్.

39


క.

అనవుడు తన్మార్గంబునఁ
జనుదెమ్మను టయ్యె ననుచు జనపతిసుతునిం
గొనిచని యాపీఠముపై
ననిపె నతని మీఁదివార లటు చేఁదుకొనన్.

40

శా.

ఆసౌధాంతరసీమ రత్నమయపర్యంకంబుపై నుండి త
ద్దాసీలోకకృతోపచారుఁ డగుచుం దాంబూలపుష్పాదు లు
ల్లాసం బంది చెలంగి కైకొనుచు బాల న్సిగ్గుదేఱం బరీ
హాసోక్తిం బరికించి రాకొమరుఁ డేకాంతబునం బ్రోడయై.

41


క.

తలఁపునకంటెం గడు న
గ్గల మగుతమకమున బాలఁ గౌఁగిట నిడి మైఁ
బులకలు మొలవగఁ దలకొని
చులుకగ రతిసుఖము చవులుచూపుచుఁ గవసెన్.

42


ఉ.

ఈగతిఁ బెక్కునాళ్ళు సుఖియించుచు నుండి విదేశభూమిలో
నేగతి నున్నవాఁడొ తన యిష్టసఖుం డని యిచ్చలోనఁ జిం
తాగతుఁ డైన దీనికిఁ గతం బిట నేటిది చెప్పు మన్న నా
త్మాగమనంబుఁ దన్మతియు నాతని యున్కియుఁ జెప్పె నేర్పడన్.

43


క.

అది విని నీకాప్తుఁడు నా
హృదయస్థితి యెఱుఁగు జాణ డీక్రియ దాసీ
సదనమున నొగులుచుండఁగ
నది యేలా చెప్ప నాతఁ డాప్తుఁడు గాఁడా.

44


క.

అతనికి విం దొనరింపం
జతురుఁడు నను మెచ్చుఁ బాయసముఁ బక్వాన్నా
న్వితముగ ఘృతముం గొని చని
యతిముదమునఁ బెట్టి యింటి కరుదెమ్మనుచున్.

45


సీ.

ఆపదార్థములు రయమ్మున సమకూర్చి
        యాత్రాడు వెంటనే యనుప నతఁడు
చని ద సిగృహమునఁ దనయిష్టసఖుఁ గాంచి
        బాలిక యిదె విందు పనిచె ననిన

నకట నాయున్కిఁ జెప్పక యుండనైతిని
        తమమీఁది చిత్తంబు దరలుఁ గాన
సతు లిష్టుచెలికాని సైతురె నాకును
        విషమువె ట్టిది దొడ్డ విందువనిచెఁ


ఆ.

జూడు మనుచు నతఁడు శునకంబునకుఁ బెట్టె
నదియుఁ దినుటతడవె యవనిఁ గూలె
నెదిరివారిచిత్త మెఱిఁగి వర్తించెడు
వారికేల కీడు వచ్చునురక.

46


వ.

ఇట్లు దృష్టాంతంబు చూపి నీవింక గూఢంబున నేగి యతనికి భోజనంబు వెట్టితి నని చెప్పి మధుపానమత్త యగు నమ్మత్తకాశినికి లోఁదొడ గోరునాట మూఁడుపోటులు వరుసం బొడిచి పాదభూషణమ్ము గొని రమ్మిటఁ గార్యంబు చూచుకొంద మని యనిపిన నతండు సని యాక్రమం బొనరించి యందియఁ గొని వచ్చిన.

47


ఉ.

అక్కడ మాని తత్పురి యుపాంతమున న్మసనంబులోన గో
రక్కుఁడు మీననాథుఁడు ధరం జరియించుచు విశ్రమార్థమై
యిక్కడ నిల్చినారొ యన నిద్దఱు నుధ్ధతి సిద్ధవేషులై
యొక్కమఠంబు గట్టుకొని యుండిరి శూలము కేలఁ గ్రాలఁగన్.

48


క.

ఒకనాఁ డటు కర్ణోత్సలు
నికొడుకు మృతుఁడైన నెఱిఁగి నీతివిదుఁడు మం
త్రికుమారుఁడు నృపసుతుచే
తికి నూపుర మిచ్చి సంతఁ ద్రిప్పఁగఁ బనిచెన్.

49


క.

అమ్మెద నని చూపుము తెగ
నమ్మకు మఱి దీనిజాడ లడిగిన నీచి

తమ్మునఁ గలఁగక నాకీ
సొమ్మి చ్చెను గురుఁ డటంచుఁ జూపుము నన్నున్.

50


సీ.

అనవుడు నౌఁగాక యని పురంబున కేగి
        యంగడి నమ్మఁజూపంగ నొకతె
మనపాప సొమ్మని మంత్రికిఁ జెప్పిన
        నాతఁడు సొమ్ముతో నతనిఁ బట్టి
పృథివీశుముందఱఁ బెట్టిన గలుషించి
        చెప్పరా యిది యెట్టు చేరెననిన
నే మ్రుచ్చుఁగాను మీ కీజాడఁ జెప్పెద
        బంటుల నావెంటఁ బనుపు మనుచుఁ


ఆ.

గొందఱారెకులను దోడుకొనుచు వచ్చి
నాకు సొ మ్మిచ్చె నీగురునాథుఁ డనుచుఁ
జూప వారలు మదిఁ గడుఁజోద్య మంది
యట్టివేషంబునకు సంశయంబు నొంది.

51


క.

ఓగురునాయక యీ సొ
మ్మేగతి నినుఁ జేరెఁ జెప్ప నే తెమ్మనినన్
జోగులము మేము మాకట
రాఁగూడదు గాన రాజు రమ్మనుఁ డిటకున్.

52


క.

అతనికిఁ జెప్పెద మనపుడు
నతివేగమ యేగి వార లటు వినిపింపన్
క్షితిపతియును మతి నతివి
స్మితుఁడై చనుదెంచి కపటసిద్ధుని మ్రోలన్.

53


క.

వినతుఁడై యున్న యాతని
గనుఁగొని నీవీట దంతఘట్టకుసుత డా

కినియై యీమసనములో
నను రాత్రులు దిరుగు నది దిగంబర యనుచున్.

54


క.

ఈ రాత్రి నీకుమారుని
మారిమసఁగినట్లు చంపి మలయఁగ నేనా
ఘోరాతిశూలనిహతిఁ ద
దూరుస్థలి నొంచి చరణ మొడియఁగ నెగసెన్.

55


క.

కాలు విదిర్చిన నందియ
కీలెడలినఁ బుచ్చుకొంటి క్షితినాయక యే
స్త్రీలను జంపరు గావున
నాలలనను వెడలననుపు మంతియ చాలున్.

56


క.

అనవుడు వెరఁగంది భయం
బున మంత్రితనూజసౌధమున కంగనలం
బనిచి తొడపైఁ ద్రిశూలం
బునఁ బొడిచిన యట్టులున్న [11]పోటులు దెలిసెన్.

57


ఆ.

తెలిసి శోకరోషకలుషుఁడై యారాజు
మగిడి పురికి నేగి మంత్రికూఁతు
దయ్య మనుచుఁ బ్రజలు దలఁకఁగా వెడలగొ
ట్టించెఁ జూడ నిది కడింది యనుచు.

58


శా.

ఆకన్యామణి దుఃఖమూలమునఁ బ్రాణాంత్యంబు చింతింపఁగా
నాకాశీపురరాజపుత్రకుఁడు వ్యక్తాకారుఁడై తన్మన
శ్శోకం బార్చుచు [12]వేడ్కజోగిఁ దనయిష్టంగా నెఱింగించి య
స్తోకం బౌ నిజరాజ్యముం దెలుపుచుం దోడ్కొంచు నేగెం బ్రియన్.

59

క.

తదనంతరంబ యొక నా
ల్గుదినములకు దంతఘట్టకుఁడు సతియును దా
మదిఁ [13]గూఁతుశోకదహనము
పొదివిన బరలోకమునకుఁ బోయెం బెలుచన్.

60


క.

ఆపాపము గడపటఁ గా
శీపతిపుత్రుండొ యతనిచెలికాఁడో యీ
భూపాలుఁడొ వీరలలో
నేపురుషుం డొందుఁ జెప్పు మెఱిఁగినకొలదిన్.

61


సీ.

ఎఱిఁగి చెప్పకయున్న నిప్పుడే నీతల
        పదివ్రక్కలై పడు నిది నిజంబు
కావునఁ జెప్పుమా నావుడు నిఁక నూర
        కుంట మోసం బని యుర్వివిభుఁడు
కామాతురుం డౌచుఁ బ్రేమ రాకొమరుండు
        [14]తనదానిఁగాఁ జేసికొనుట తగవు
సచివసూనుఁడు నిజస్వామికార్యమునకు
        మర్మంబు సేయుట ధర్మపథము


ఆ.

తలవరులచేత వానివర్తనము లెల్ల
మొదలఁ దెలియక యది నిజంబుగఁ దలంచి
చేసెఁ గావున దురితంబు చెందుఁ బ్రభుని
రాష్ట్రకృతమైనపాపంబు రాజుఁ బొందు.

62


క.

అనవుడు బేతాళుఁడు నె
మ్మనమునఁ గొనియాడి యతని మౌనత్యాగం

బున నిలువక యెగసి రయం
బునఁ జని తరుశాఖఁ దగిలెఁ బూర్వస్థితితోన్.

63


వ.

ఇట్లు విడిపించుకొని పోయిన.

64


క.

ఆనరపతి క్రమ్మఱఁ జని
పీనుఁగు క్రియ వీపుమీఁదఁ బెట్టుకొని చనం
గా నొకకథనెపమున న
మ్మౌనము విడిపించి యతఁడు మగుడం బాఱెన్.

65


వ.

ఇట్లు మొదలికథంబోలె సారిసారెకుం గథలు చెప్పి మఱుఁగులైన సదుత్తరంబు లందుచుం బరికించుచు నిరువదియేనుమాఱులుదాఁక రాకపోకల నలయించి యతనివివేకంబునకు స్థిరోద్యోగంబునకుం బరిణమించి బేతాళుండు మే లొనగూర్పం దలంచి.

66


క.

నరనాథ సర్వలక్షణ
పరిపూర్ణుఁడ వంచు నిన్ను బలిసేయ మదిం
బరికించి కపటభిక్షుకుఁ
డరుదుగ ననుఁ దోడితేర ననుపుట గంటే.

67


ఆ.

నన్నుఁ గొంచు నేగ నిన్నును సాష్టాంగ
మెఱుఁగు మనిన మ్రొక్క నెఱుఁగఁ దొల్లి
నేడు నిన్ను జూచి నేర్చెద నిప్పుడు
మ్రొక్కి చూపు మనుము మోసపోక.

68


క.

ఇటు మ్రొక్కు మనుచుఁ జాఁగినఁ
దటుకున నడిదమున వానితల ద్రెంచి సము
త్కట మగు ననలములో నొ
క్కట వైవుము సిద్ధులెల్ల [15]గతిపడు నీకున్.

69

చ.

అనవుడు నట్ల యియ్యకొని యాతని మూఁపునఁ బెట్టుకొంచు దె
చ్చిన మది మెచ్చి వాఁడు మునుసెప్పినరీతిని మ్రొక్కుమన్న నే
గనిక్రియఁ బల్కిన న్మఱి ధరం బ్రణమిల్లిన వానిమస్తకం
బనువునఁ ద్రెంచి పావకున కాహుతిగా నొనరించి సిద్ధుఁ డై.

70


ఆ.

ఆత్మరక్షణాఢ్యుఁ డగువాని నటు వేల్చు
నంత భూతనాథుఁ డతని మెచ్చి
యెప్పుడైనఁ దలఁపు మేవచ్చి నిల్చెద
సిద్ధు లెనిమిదియును జెందుననియె.

71


క.

సుర లటు పేర్కొని విద్యా
ధరరాజ్యము గలుగ నొసఁగి తద్గుణముల క
చ్చెరు వందుచు నేగిరి భూ
వరుఁడును బేతాళు ననిపి వచ్చెం బురికిన్.[16]

72


శా.

ఈ సామర్థ్యము నేర్పుఁ దెంపు నణిమాధీశత్వము న్లేక నీ
కీసింహాసన మెక్కు టౌనె మదిలో నీక్షింపుమా యన్న ను
ల్లాసం బెల్లఁ దొఱంగి తద్గుణగణశ్లాఘాపరుం డౌచు ల
జ్జాసంగవ్యథఁ గ్రమ్మఱం జనియె భోజుక్ష్మావిభుం డింటికిన్.

73

ముప్పది రెండవ బొమ్మకథ

క.

తదనంతరంబ యాము
ప్పదిరెండవబొమ్మయైనఁ బద మిడు తరి స
మ్మదమున నిఁకఁ బల్కెడునని
మదిలోపలఁ దలఁచి యతడు మఱునాఁ డెలమిన్.

74

క.

సన్మునిహృదయారాధితుఁ
జిన్మూర్తిఁ గృపావిశేష శేషాభరణు
న్మన్మథమదగజకేసరి
జన్మజరామృత్యురహితు సర్వేశ్వరునిన్.

75


క.

డెందంబునఁ దలపుచు సం
క్రందనమణిపీఠ మెక్కఁ గడఁగెడునెడ నా
కందువ నిలిచిన బొమ్మ వె
సం దిన్ననినగవుతోడ జనపతిఁ బలికెన్.

76


చ.

వలదన నేల యిట్టి దురవస్థలఁ బొందఁగ నేల నీకు భూ
తలమున విక్రమార్కుగతి ధర్మము సత్యము సాహసంబు ని
శ్చలముగ నిల్పలేని మనుజప్రభుఁ డీదెస మెట్టఁజూచినం
దలఁపులు నిష్ఫలంబు లగుఁ దత్త్వ మెఱుంగని బుద్ధి నిన్నిటన్.

77


చ.

అతని గుణక్రమం బెఱుఁగు మయ్య భుజాబలభీమసేనుఁ డా
తతరణకౌశలార్జునుఁడు ధర్మయుధిష్ఠిరుఁ డార్తరక్షణా
చ్యుతుఁడు కృపాదిలీపుఁ డరిసూదనభార్గవుఁ డర్థబోధవా
క్పతి విభవామరేంద్రుఁ డనఁగా నఁత డుజ్జయినీపురంబునన్.

78


చ.

క్రతువు లనేకము ల్నడిపి గౌరవ మేర్పడ నుర్వి సప్తసం
తతులును నిల్పి వేదనినదంబులు విప్రగృహంబులందు సం
తతముఁ జెలంగ దీను లతిదానముల న్నెగడంగ ధర్మసం
గతి మెఱయించె రాజసవికారము లెవ్వియుఁ జెందకుండఁగన్.

79


చ.

కఱవులపే రడంచి యుదకంబుల నెప్పుడు నర్ణవాకృతిం
జెఱువులు నిండియుండఁ దమసీమలఁ దప్పక నాల్గుజాతులుం
దఱచుగ ధర్మము ల్నెఱపఁ [17]దస్కరజారుల నప్రమత్తత
న్మెఱయఁగనీక సజ్జనులు మెచ్చఁగ శాశ్వతకీర్తికాముఁడై.

80

ఉ.

అంబుజమిత్రు నంశ మని యార్యులు సన్నుతి సేయఁగా సము
ద్రంబులు నాల్గుమేర లగు ధారుణి యంతయు నేలుచుం బ్రతా
పంబున రాజు లెల్లఁ దన పంపు చరింపుచుఁ గొల్వఁ గార్యఖ
డ్గంబుల వైరులం దునిమె గట్టిగ సత్యము నిల్పుకోరికిన్.

81


సీ.

సత్త్వంబుననె మహాశ్చర్యంబుగా గెల్చి
        వసుధేశులను నాత్మవశులఁ జేసి
వరరత్నకనకాది వస్తువు లన్నియుఁ
        దనసొమ్ముగాఁ జేసికొని యతండు
హయమేధములు మొదలైన యాగములందు
        గూడి దేవతలెల్లఁ దోడుపడఁగ
బడుగులు వేఁడినఁ బ్రాణంబు లైనను
        వంచింప కొసఁగెడు వ్రతము వట్టి


ఆ.

సర్వదిక్కులందుఁ జాటించి యర్థులఁ
గూడఁ దిగిచి వారు గోరినట్ల
యూళ్ళు నర్థమును యథోచితంబుగ నిచ్చి
శాసనంబుగాఁగ శక మొనర్చె.

82


వ.

భువిలో నభూతపూర్వంబు నద్భుతంబు నగుకృత్యంబు శకం బనంబడుఁ. దొల్లి జరుగు శ్రీరామశకంబు యుధిష్ఠిరశకంబు నణంచి నిజశకంబు నిల్పిన నందానందాది సంవత్సరాద్యమ్మున విక్రమార్కశకంబై చతుర్లక్షజ్యోతిశ్శాస్త్రగతి ప్రవర్తకం బయ్యె.

83


ఆ.

నడుమ శాలివాహనశకంబు గలిగియుఁ
జెడక యుత్తరమునఁ బుడమిలోన
నెన్ని చూడఁ బదియు నెనిమిది వేలేఁడు
లతనిశకము రూఢి నలరఁగలదు.

84

క.

ఈపాటి మహిమ గుణములు
నీపాలం గలిగెనేని నేఁ డెక్కు వృథా
టోపంబులు వలదని యో
క్ష్మాపాలక నిన్ను మాన్పఁ జలమో ఫలమో.

85


క.

అని చెప్పి మఱియు నాతని
మన మలరఁగఁ బలికె నిన్నిమాటులు మానే
ర్పున నతనిమహిమ కొలఁది
[18]న్వినిపించితి మింతెకాక నీ వల్పుఁడవా.

86


క.

నరనారాయణు లనఁగాఁ
బరఁగెడు హరిమూర్తు లుర్వి ఫల్గున దామో
దరులై పుట్టిరి నాఁ డా
నరుఁ డతఁడై పుట్టినాఁడు నరవరతిలకా.

87


క.

ఈకలియుగమున విద్యల
కేకడఁ జేపట్టు లేమి యెఱిఁగి పలికి వా
ణీకామిని వినిపించిన
నాకమలభవుండు సెప్పె నచ్యుతుతోడన్.

88


ఆ.

[19]అచ్యుతుండు విద్యలైశ్వర్యమునఁగాని
మెఱయవనుచుఁజెప్పి యెఱుక గలుగ
నరునిఁ బుట్టఁ బంచె నరపతిత్వము గోరి
యతఁడు నవని నీవయై జనించె.

89


క.

నరునకు నారాయణునకు
నరయఁగ భేదంబు లేదు హరి యొక్కడు న

య్యిరువుర రూపగుఁ గావున
వెరవుగఁ బరికింప నీవ విష్ణుఁడ వనఘా.

90


క.

ఈపుణ్యుని నినుఁ జూచిన
శాపావధి గలిగెఁ గల్మషం బడఁగెఁ గులో
ద్దీపక! “నావిష్ణుః పృథి
వీపతి" యనుకీర్తి నీకు విహితం బయ్యెన్.

91


చ.

అన విని చోద్యమంది వసుధాధిపుఁ డప్పటి శాపకారణం
బొనరఁగఁ జెప్పు మెవ్వ రని యుత్సుకుఁడై తను వేఁడినం గ్రమం
బున నది క్రమ్మఱం బలికె భోజనృపాలక! పార్వతీసఖీ
జనులము నేము దేవి కనుసన్నల దగ్గఱి కొల్తు మెప్పుడున్.

92


క.

ఒకనాఁ డేమును నయ్యం
బికయును విశ్రాంతి కేగి శుకపికభృంగ
ప్రకరపరితోషకర మగు
నొకవనమున విరులు గోయుచున్నెడ వేడ్కన్.

93


సీ.

కన్నుల విని గాఁలి జెన్నొందు నందియ
        యడుగుఁదమ్మికి బెడఁగడరఁజేయ
నందిని నులికించు పెందోలు హొంబట్టు
        కైవడి నునుపారఁ గాసెవోసి
తలఁచినయంతనే వలపులఁ దలకొల్పు
        వెలిపూఁత మేనెల్ల గలయఁబూసి
జక్కవకవ కెదురెక్కుడౌ రేవెలుఁ
        గెలమితో జడలపై వెలుఁగుచుండ


ఆ.

విసము మెడ నుండియును దీపి[20] వెలికిఁదోఁపఁ
గేలశూలంబు ఫణిపతి లీల మెఱయ

మిండజంగమై యామంచుఁగొండకూఁతు
నెదుటికరుదెంచె ముక్కంటిచదురులాఁడు.

94


క.

ఆచందము గనుపట్టం
జూచిన యావేళ మనసిజుఁడు మమ్ముఁ దెగం
జూచి తన కమ్మఁదూపుల
మచిత్తములెల్లఁ గరఁచె మానము లెడలన్.

95


క.

పులకించెఁ జెక్కు లలికం
బుల లేఁజెమ రొత్తె నధరముల నద రొదవెన్
వలువల గనయము లూడెం
బలుకమఱచియుంటిమేము ప్రతిమల మాడ్కిన్.

96


క.

ఆతఱి నయ్యంబిక మా
చేతోగతు లెఱిఁగి కనలి చెలిమికి వెలిగా
భూతలమునఁ బుత్తళు లై
చైతన్యము లుడుగుఁ డనుచు శాపం బిచ్చన్.

97


ఉ.

ఆక్రియ శాప మిచ్చిన భయంబున నందఱ మాత్మ లజ్జ ర
క్షాక్రియసన్నిపాత ముడుగంబడు కైవడిఁ గామవిక్రియో
పక్రమ మౌనెడం దెలిసి పార్వతికిం బ్రణమిల్లి తల్లి మా
కేక్రియ శాపమోక్ష మగు నింత దలంచుట మాతృకృత్యమే?

98


మ.

అనుచుం బ్రార్థన చేసిన న్విని కృపాయత్తాత్మయై మీరు కాం
చనపాంచాలికలై జనించుఁ డొక ప్రస్తావంబునం బుణ్యవ
ర్తనునిం జెప్పఁగ వాక్యసిద్ధి యగుఁ దత్కాలంబు మీశాపమో
చనమౌఁ బొండని వీడుకొల్పిన మనస్తాపంబునం బిమ్మటన్.

99


వ.

ఒక్కమాఱే భూలోకంబునకు రానోడి, మాసంప్రార్థన విశ్వకర్మనిర్మితం బగు నయ్యింద్రసింహాసనంబున నట్లుండి పదంపడి భూమికి వచ్చి యాయు

త్తమనాయకు గుణకథనార్థమై ని న్నిన్నిమాఱులు వారించితిమి. నాపేరు శృంగారతిలక యనం బరఁగు, వీరలు జయయును, విజయయు, మలయావతియు, ననంగసంజీవనియును, గంధర్వసేనయుఁ, బ్రభావతియు, సుప్రభయు, సంభోగనిధియు, సుభద్రయు, జంద్రికయు, గురంగనయనయు, ననంగధ్వజయు, నిందువదనయు, విలాసరసికయుఁ, గోమలియు, సౌందర్యవతియు, లావణ్యవతియు, లజ్జావతియు, నిందుమతియు, జనమోహినియును, విద్యాధరియు, హరిమధ్యయు, సుఖప్రదాయినియుఁ, బ్రబోధవతియు, మలయవతియు, హంసగమనయు, నంగసుందరియు, సుకేశియుఁ, జతురికయు, వామాంగియుఁ, దలోదరియు, [21]నను పేరులు గలవారని యెఱుంగు మిట్టి మేమును.

100


క.

బొమ్మల మై యామణిపీ
ఠమ్మున బహుకాలముండి డస్సితి మని చి
త్తమ్ములఁ బొగులఁగ మాభా
గ్యమ్మున నీతోడ మాట లాడంగలిగెన్.

101


క.

కష్టంబు వీడె నీకే
యిష్టం బది వేఁడు మిప్పు డిచ్చెద మనినన్
సాష్టాంగ మెరఁగి భోజుఁడు
హృష్టుండై పలికె వారిహృదయము లలరన్.

102


క.

మీకృప సంపద లన్నియు
నా కుండగ నేమి ప్రార్థనము భవదీయా
లోకము గలిగెను బుణ్య
శ్లోకుఁడ నై యుండఁ గంటి లోకులు వొగడన్.

103

క.

అని వినయోక్తులు వలికినఁ
గొనియాడుచు నిలిచి రాజకుంజర నీచే
సిన యుపకారమునకు నే
మని ప్రత్యుపకృతి యొనర్చ నర్హము మాకున్.

104


చ.

సకలకళాప్రవీణుఁడవు సజ్జనరక్షణదక్షిణుండ వం
ధకరిపుభక్తిశీలుఁడవు దానవినోదివి సర్వభావభా
వకుఁడవు విష్ణుమూర్తివి దివానిశముం గవిపాఠకార్థిగా
యకనుతిశాలి వుర్వీపతి వల్పుఁడవా భువి భోజభూవరా!

105


శా.

నీ కేవాంఛయు లేకయున్న వినుమా నిన్నెవ్వఁ డీక్షించినన్
మాకిష్టంబు సరస్వతీవిభవ మామర్త్యుండు వేపొందు, వా
క్ప్రౌఢుండై విలసిల్లఁజేసెదము భూపాలాగ్రణీ నీయశం
బాకల్పంబుగ నొప్పుఁగాత జనలోకానంద మై సాంద్ర మై.

106


సీ.

కన్ను లయ్యును బండికన్ను లయ్యును జంద్ర
        సూర్యు లెవ్వనికడ సొంపు గనిరి
సుతుఁ డయ్యు రథముపై సూతుఁ డయ్యును సుర
        జ్యేష్ఠుఁ డెవ్వనికడ శ్రేష్టుఁ డయ్యెఁ
దల్పంబు నయ్యు నాకల్పంబు నయ్యు నా
        గేంద్రుఁ డెవ్వనికడ నెన్నఁబడియెఁ
బద మయ్యు మస్తకాస్పద మయ్యు నిరాశ
        మధ్య మెవ్వనికడ మహిమ కెక్కె


ఆ.

నట్టి యుభయమూర్తి హరిహరనాథుండు
దేవదేవుఁ డిష్టదైవ మగుచు
నెరయఁ బ్రోచుఁగాత నీకొల్వువారల
భూజనేంద్రభూజ భోజరాజ.

107

క.

పర్యాప్తంబుగఁ గథ లీ
మర్యాద న్విన్నయట్టి మానవునకు నౌ
ధార్యంబును దెగువయు గాం
భీర్యమ్మును బ్రియము నయముఁ బెంపు వహించున్.

108


మ.

అని దీవించి యుమాసఖీజనులు దివ్యాకారసంపత్తి సౌం
పున నాకాశమున న్మెఱుంగులక్రియం బొల్పారునుల్లాససం
జనితప్రౌఢచోవిలాసముల నాశ్చర్యంబు రెట్టింప నా
జనులెల్లం దముఁ జూడఁగాఁ జనిరి భోజశ్రేష్ఠు నగ్గించుచున్.

109


శా.

భోజేంద్రుండును నెక్కరామి హృదయాంభోజంబులోఁ గాంచి ని
ర్వాణం బై విలసిల్లు యత్నమున విద్వత్సన్నిధిన్ దానిపై
దేజోమూర్తిఁ ద్రిలోకవంద్యుని [22]మహాదేవున్ శివు న్నిల్పి త
త్పూజాలబ్ధవరప్రసాదమహిమన్ భూమండలం బేలగన్.

110


శా.

సద్యోనిర్ణయవాదులు న్సరసులు [23]న్సంగీతకావ్యక్రియా
విద్యావంతు లనంతశిల్పరచనావిజ్ఞానులు న్సర్వసం
పద్యోగప్రథమానకీర్తియుతులు న్ఫామామనోరంజనా
హృద్యాకారులుఁ బుణ్యవర్తనులు నై యేపారి రుర్వీజనుల్.

111


మ.

అనుచుం జెప్పిన నద్రిజాత మిగులన్ హర్షించి యోదేవ యే
నును బూర్వంబునఁ గొంత వింటిఁ బిదప న్నూత్నప్రసంగంబున
న్విననింపౌగతి నేఁడు విస్తరముగా వింటి న్మహావీరుఁ డా
తనిసామర్థ్యము నీప్రసాదమునఁ జిత్రం బయ్యె మృత్యుంజయా.

112


క.

[24]నాకోరిన కథలెల్లను
నేకతమునఁ దెలియ నానతిచ్చితి దేవా

యీకలియుగపర్యంతం
బీకథలు ప్రసిద్ధి కెక్కు నిట నీకరుణన్.

113


మ.

[25]అని యీరీతి నుమామహేశులకు సాంద్రానందసంధానమై
విననింపై కవిసమ్మతప్రకృత మై విద్యన్మనఃసద్మజీ
వన మై పావన మై మహాసనకథాద్వాత్రింశి కర్ణామృతం
బన నెల్లప్పుడుఁ జెల్లుఁగాత భువిలో నాచంద్రతారార్క మై.

114


శా.

అంభోరాశిజలప్రపూర్ణవిహృతివ్యాసక్తచిత్తాంబుజుం
గుంభసంభవముఖ్యసర్వమునివాగ్గుంభస్తుతారంభునిన్
జంభారాతిసమీహితాయనమహాస్తంభాంతసంభూత సం
రంభాటోపవిదారితారివరుఁ బ్రహ్లాదప్రతిష్టాపరున్.

115


శా.

బాణాగారముఖాభిరక్షణగుణప్రారబ్ధు యుద్ధక్రియా
క్షీణోపేంద్రసుహృత్వకృత్యుని దృఢాంగీకారసన్మౌనిగీ
ర్వాణాధీశసమర్చితాంఘ్రియుగళు న్వామాంగవిన్యస్తశ
ర్వాణీమగ్నమనోంబుజుం [26]ద్రిభువనావష్టంభునిన్ శంభునిన్.

118


మాలిని.

నవహిమకరజూటా నందితామర్త్యకూటా
జవనవృషభవాహా శంఖచక్రాంకదేహా
ధవళనిజశరీరా దానవధ్వంసకారా
శివమురరిపురూపా శిష్టదృష్టస్వరూపా.

117


గద్యము.

ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళ కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదప్రోలిపురవ

రాధీశ్వర వెలనాఁటిపృథ్వీశ్వర రాజ్యసముద్ధరణ శ్రీ కొఱవి వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్ర సకలసుకవిమిత్ర కసవరాజతనూజ గోపరాజవిరచితం బయిన సింహాసనద్వాత్రింశిక యను కావ్యంబునందు బేతాళహరణంబును, బద్మావతి యితిహాసంబును, విక్రమార్కుని యష్టప్రసిద్ది సంసిద్ధియుఁ దన్మహాసామర్థ్యంబును , బొమ్మల శాపాగమనమోక్షప్రకారంబును దదీయ నిజస్వరూపప్రాప్తియు నన్నది సర్వంబును ద్వాదశాశ్వాసము.

  1. డేపారం గనరానివేషమున లంకేశప్రతీకాశుఁడై
  2. నాడాఁపురమునకు మెచ్చినదానికి నవియిచ్చి, పిదప
  3. గొల్వగ నొప్పుచుం గళా
    స్పష్టహిమాంశురేఖ కిది సాటి యనందగు కొమ్మఁ గన్గొనెన్.
  4. త నిలిచియున్న బాలకియు
  5. కనుజతనమునన్
  6. కళింగదేశం
  7. నేగి కళింగపురంబు సొచ్చి
  8. ర్గాతురవృత్తి
  9. సుందర మొదవన్; సుగుణతనమునన్
  10. స్రుక్కుచుఁ బొక్కుచు
  11. భూపతి దెలిసెన్
  12. వెడ్డుజోగి
  13. గూరుశోకదహనంబున
  14. తనపనిఁగా
  15. గనఁబడు
  16. ఈకందమునకు మాఱుగా, వ. అనిన నట్ల విక్రమార్కుడు సంకల్పసిద్ధుండయ్యెఁ గావున- అని యొక ప్రతిలోఁ గలదు.
  17. దస్కరజాతుల
  18. వినిపించిన నింతనేమి
  19. అచ్యుతుండ విద్యలైశ్వర్యమునఁగాని
    మెఱయవనుచుఁ జెప్పి యెఱుక గలిగి
    యవని బుట్టఁ బంచె నాహరి యిపుడు నీ
    వై జనించినాఁడ వవనిపాల.
  20. దీప్తి
  21. మనోహరియు, మానవతియు, పద్మపాణియు, నీలవేణియు, శుకవాణియు, పులినశ్రోణియు, నిరుపమయు నను పేరులు ప్రత్యంతరములలో నున్నవి. వీనింజేర్చిన 32 నకు మించినవి.
  22. మహాదేవు న్నను న్నిల్పి, మహాదేవుం దగ న్నిల్పి
  23. సంగీతవాద్యక్రియా
  24. నాకోరినకొలఁదినియీ
  25. అనుచుంబ్రార్థనచేసెఁ గావున నరేంద్రానందసంధానమై
  26. ద్రిభువనవ్యాపారపారీణునిన్