సింహగిరి వచనములు/వచనములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ

సింహగిరి వచనములు

1

దేవా. ఇంద్రాదిదేవతలు నూఱును, హిరణ్యగర్భు లిన్నూఱును, కాశ్మీరగిరులు మున్నూఱును, తిలదాంచనగిరులు నన్నూఱును, పతివ్రత లేనూఱును, అగ్రహారంబు లాఱునూఱ్లును శ్రీ మూర్తు లేడునూర్లును, ఉభయస్తోమకు లెనిమిదినూర్లును, హేమశ్రీగర్భంబులు తొమ్మిదినూర్లును, కపిలధేనువులు వేయిని, కాలచక్రంబులు లక్షయును, తులాపురుషంబులు కోటియును, కన్యకాదానంబులు పదికోట్లును, నివియన్నియుఁ గూడిన మీ దివ్యనామసంకీర్తన వినినందులకు వేయిలో నొక్కభాగంబునకు సరి గావు. ఈ సంకీర్తనఫలం బెవరు వ్రాసిరి, యెవరు చదివిరి, యెవరు వినిరి, వారి కాయురారోగ్యైశ్వర్యంబులు కృపచేతువు, అటుమీదట నా కిచ్చిన వైకుంఠంబు కృపచేతువు. మాయతి రామానుజమునివరము. దాతారు. అనాథపతీ స్వామీ, సింహగిరినరహరీ, నమో నమో దయానిధీ.

2

దేవా, వేయిపుణ్యంబులు సేసి నరుండై జన్మించును. దేవా, రెండువేలు పాపంబులు సేసి స్త్రీయై జన్మించును. దేవా, మూఁడు వేలు పాపంబులు సేసి యంగడివేశ్యయై జన్మించును. దేవా, నాలుగువేలు పాపంబులు సేసి యొకరింటిదాసియై జన్మించును. దేవా, అయిదువేలు పాపంబులు సేసి యాడుచు పాడుచు నగ్నిలో దుమికెడు కన్యయై జన్మించును. దేవా, ఆఱువేలు పాపంబులు సేసి సుంకరివాఁడై జన్మించును. దేవా, ఏడువేలు పాపంబులు సేసి మతచోరుండై జన్మించును. దేవా, ఎనిమిదివేలు పాపంబులు సేసి నట్టడవిలో చాఱపులియై జన్మించును. దేవా, తొమ్మిదివేలు పాపంబులు సేసి చోరుండై జన్మించి తలగొట్టఁబడును. దేవా, పదివేలు పాపంబులు సేసి పంచాంగము చెప్పెడు బ్రాహ్మణుండై జన్మించును. దేవా, పదునొకండువేలు పాపంబులు సేసి గురుద్రోహియై యంధుఁడై జన్మించును. దేవా, పండ్రెండువేలు పుణ్యంబులు సేసి శ్రీమద్భాగవతులై, శ్రీవైష్ణవులై జన్మింతురు. దేవా, ఇది కృష్ణమాచార్యులు చెప్పిన సంకీర్తనఫలంబు. ఇందుకుఁ దప్పదు. మాయతి రామానుజముని వరము. అనాథపతీ, స్వామి సింహగిరినరహరీ, నమో నమో దయానిధీ.

దేవా, మధ్యాహ్నకాలంబున జన్మించిన మనుజుండు కడుదుష్టుండై జన్మించును. దేవా, అస్తమానంబున జన్మించిన మనుజుండు క్షీణాయుష్కుం డగును. దేవా, తదుత్తరంబున జన్మించిన మనుజుండు సూతంపురోగి యగును. దేవా, ఆపిండంబును నొక్కొక్క పాపం బొక్కొక్క వ్యాధిగా సంక్రమించును. దేవా, పూర్వజన్మంబున గృహముల కగ్ని సంధించిన మనుజుండు వెనుకటి జన్మంబున కుష్ఠరోగియై జన్మించును. దేవా, జననీజనకులకన్నం బిడని మనుజుండు వెనకటి జన్మంబున గూబయై జన్మించును. దేవా, ఘనముగా గోవుల సంపాదించి వానికి మేపులు, నీళ్ళను పరామర్శింపకయున్న మనుజుండు వెనుకటి జన్మంబున పిరంగి వ్యాధివాఁడై జన్మించును. దేవా, ఘనమైన రొక్కంబు సంపాదించి తాను భుజింపక యొక్కరికి దానధర్మంబు, పరోపకారము సేయకుండినయతండు చచ్చి బ్రహ్మరాక్షసియై యాధనంబునకు కావలికాయుచుండును. దేవా, కూపంబుల పడవేసిన మనుజుండు వెనుకటి జన్మంబున భూతమై జన్మించును. దేవా, చాడిచెప్పిన మనుజుండు వెనుకటి జన్మంబున దానభ్రష్టుండగును. దేవా, తగవున కూర్చుండి పక్షపాతము లాడిన మనుజుండు వెనుకటి జన్మంబున బల్లియై జన్మించును. దేవా, ధాన్యంబు మీద కడు తత్పరత్వముండెనేని వెనుకటిజన్మంబున శోణకంబై జన్మించును. దేవా. వావివరుస నెఱిఁగియెఱుఁగ నడచిన మనుజుండు వెనుకటిజన్మంబున వారకాంతయై జన్మించును. దేవా, తనపురుషుండు దైవంబని యెఱిఁగి యెఱుఁగక యెదురుమాట లాడిన కాంత వెనుకటి జన్మంబున గ్రామసూకరంబై జన్మించును. దేవా, హరికీర్తన మరోచకం బని, పరదైవతము కీర్తనము వినిన మనుజుండు వెనుకటిజన్మంబున చెవిటివాఁడై జన్మించును. దేవా, వివాహంబులు చెఱిచిన మనుజుండు వెనుకటిజన్మంబున సంతానంబుఁ (బొంద) లేకపోవును. దేవా, కులమున నేనే ఘనుండనని గర్వించిన మనుజుండు వెనుకటిజన్మంబున కులహీనుండై జన్మించును. దేవా, చదువుల నేనే ఘనుండనని గర్వించిన మనుజుండు వెనుకటిజన్మంబున మతిహీనుండై జన్మించును. దేవా, రణమందున నేనే పరాక్రమశాలినని గర్వించిన మనుజుండు వెనుకటిజన్మంబున వైశ్యుండై జన్మించును. దేవా, రణమందు పారివచ్చిన మనుజుండు వెనుకటిజన్మంబున పిశాచంబై జన్మించును. దేవా, రణముపొడిచిన మనుజుండు వెనుకటిజన్మంబునరాజై జన్మించును. దేవా, రణమందు తన్నేలిన రాజుకొఱకై చచ్చిన మనుజుండు వెనుకటిజన్మంబున నారాజు కడుపుననే పుట్టి యాపట్టణం బేలును. దేవా, షోడశమహాదానంబులు హరికి పుణ్యంబని చేసిన మనుజుండు వెనుకటిజన్మంబున మోక్షమే పొందును. దేవా, తనకు పుణ్యంబని చేసిన మనుజుండు వెనుకటిజన్మంబున మాయల, నింద్రమాయల పదునారింటికి గురియై ముక్తికిం దెరువుచూడనేరడు. దేవా, మూలమంత్రమున తూలిన (మనుజుండు) తైలమందు వటపిటశాస్త్రమందణురేణువుపాటియగ్ని సంధించిన చందం బగును. దేవా, శ్రీవైష్ణవులే బ్రాహ్మణులు, శ్రీవైష్ణవులే పరమసాధకులు, శ్రీవైష్ణవులే శోభితశుభదాయకులు, మీకులగోత్రం బెన్న నేమిటికి ? మీదాస్యంబె కారణంబు. మీదాస్యంబె వివాహంబు. శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరినరహరీ, నమో నమో దయానిధీ!

4

దేవా, తనువులు మాయ, తలపోసి తలపోసి చెప్పెద నంటివా కఱకఱల మోహ మిది. ఆశలపాషాణం బిది. అతుకులజల్లెడ యిది. తన బ్రతుకుకొఱకు పోరాడి పోరాడి యొరులం జెఱచెడు దుర్గంధపు డొంక యిది. నీరుబుగ్గ, ఊటచెలమ. తూంట్లబాన. తొడరి దుర్గంధమునఁ బొలు(చు)ను. మాటలేకాని మఱియెందును బస లేదు. నోఁటను ముఱికి. దంతంబుల పాఁచి, నాసికంబున ఊళె. నయనంబున పీళె. చెవిలోని గుల్మి చెట్టలకొంప. మూటగట్టికొన్న మలమూత్రముల తిత్తి. చీమునెత్తుటి జడి పురుగుల జలదారి. చిచ్చుటి రోత. పైత్యపుగోళ. పైఁగలపంచారం బిది. తోలుగప్పిన డొలుసు మ్మిది. నమ్మికలేదు. నమ్మిక లేదు. ఇది నాటకములాడెడు బూటకముల బొమ్మ. అమ్మమ్మా! ఈబొమ్మయుత్తమ(గుణము) లెంచి చూచెదనంటినా, కామియై, పామై, గ్రామసూకరమై, యెలుకయై, ఊతయై ఊతలోని మ్రానై , కత్తికోతలం బడి, చచ్చి చచ్చి, పుట్టి పుట్టి, యీఁగయై, దోమయై, యెగిరెడు పక్షియై యనేకజీవజంతువుల యోనియందు బుట్టి, బండై, లండై, లండు పసరంబై, ఆలోనమీనై, మ్రానిమీద మర్కటంబై, వెక్కసంబు డేగయై, డేగకాలితొండయై, గండభేరుండ గజసింహశరభ శార్దూలంబులై, రాగియై, కంచి, యినుమై, యుక్కునై, పులినోటి రాయియై, చకచకలుగాను, పకపకలుగాను, చక్కిళ్ళంబడి, చక్కని కోటయై, గుడిగోపురంబై , కారమై, వికారమై, మధువై, చేదై , యతిమధురంబై, యలసి సొలసి యంగడిసరుకై యావెనుక శోణకంబై జన్మించును. దేవా, యదియు విడుపై నరుండై జన్మించును. దేవా, అప్పప్ప! ఇందో యందో యనుచు తప్పించుకపోను సందు లేక, ఎనుబదినాలుగులక్షలకోట్ల జీవజంతువుల బోనులో తగిలి, గంగలో నోడ పగిలినట్లు, మహాపాతకంబునం దగిలి, కుమ్మరిసానవలె, దిమ్మదిరుగుచు, ముణుంగుచు లేచుచు నీవిధంబై యున్నది, హరీ, నాథా నన్ను కావుమీ. ఈ దేహం బనెడులంకపై దండు దిగి, చి త్తమనెడు నింద్రజిత్తుపై రణించి, దుర్బుద్దులనెడు దుర్మార్గపురాక్షసుల హతము సేసి, యాశలనెడు రాక్షసుల పేరడంచి, మమతమండోదరని బట్టి దాసిగా నేలి, యాచార్యుండనెడు హనుమంతునిఁ బంపి, యాలంకఁ జొచ్చి, సాధించి, జీవుండనెడు సీతను దెచ్చి మీపాదారవిందముల భక్తికి హత్తించి దరిచేర్చుమీ, యతి రామానుజముని వరము, దాతారు. అనాథపతీ, స్వామీ. సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ.

5

దేవా, పెద్దతనంబు చేసి మిమ్ము మెప్పించెద నంటినా, జాంబవంతుడు మీసన్నిధినే యున్నాడే. దేవా, బుద్ధిని నే మెప్పించెద నంటినా, విభీషణుండు మీ సన్నిధినే యున్నాడే. దేవా, బంటుదనంబు సేసి మిమ్ము మెప్పించెద నంటినా, యంజనాసుతుండు హనుమంతుండు మీ సన్నిధినే యున్నాడే. దేవా, తీర్థంబు లాడి మిమ్ము మెప్పించెద నంటినా, గంగాభవాని మీ యంగుష్టంబు నందే యుద్భవించి యున్నదే. దేవా, ప్రదక్షిణములు చేసి మిమ్ము మెప్పించెద నంటినా, సూర్యచంద్రాదులు మీసన్నిధినే యున్నారే. దేవా, వేదవేద్యుండనై మిమ్ము మెప్పించెద నంటినా, బ్రహ్మ మీ నాభికమలమం దుద్భవించి యున్నాడే. దేవా, గీతప్రబంధముల చేత మిమ్ము మెప్పించెదనంటినా, కిన్నర కింపురుష గరుడ గంధర్వ సనక ససందన సనత్కుమార పరమ భాగవతులు, నారదాదులు మీ సన్నిధినే యున్నారే. దేవా, సత్యంబుల చేత మిమ్ము మెప్పించెద నంటినా, సత్య హరిశ్చంద్రుడు మీ సన్నిధి యున్నాడే. ధనధాన్యంబుల చేత మిమ్ము మెప్పించెద నంటినా, శ్రీ మహాలక్ష్మి మీ యురమందే యున్నదే. దేవా, శాంత శమదమాది గుణంబుల చేత నోర్పు గలిగి యుండెద నంటినా, భూదేవి మీ సన్నిధినే యున్నదే. దేవా, విందులు వెట్టి మిమ్ము మెప్పించెద నంటినా, విదుర భరద్వాజ శబరి మొదలైనవారు మీ సన్నిధినే యున్నారే. దేవా, ఏకాదశీ వ్రతాదుట మిమ్ము మెప్పించెద నంటినా, రుక్మాంగదుండు మీ సన్నిదినే యున్నవాఁడే, దేవా, భక్తి వైరాగ్యంబులఁ జేసి మిమ్ము మెప్పించెద నంటినా, ప్రహ్లాదుఁడు మీ సన్నిధినే యున్నవాఁడే. దేవా, వాహనరూండనై భరింతు నంటినా, గరుత్మంతుండు మీ సన్నిధినే యున్నాడే. దేవా, మీ పాదపద్మంబులు నా కన్నులఁ జూచుకొని మీ ద్వారంబు కాచుక యుండెద నంటినా, ద్వారపాలకులు మీ సన్నిధినే యున్నారే. దేవా, నేనా మిమ్ము నుతించగలవాఁడను! ఎనుబదినాలుగులక్షల కోట్ల జీవజంతువులలో నే నొక నర జీవుం డనే. దేవా, మిమ్ము వేయి శిరస్సులు, రెండువేల జిహ్వలుగల శేషాహి నుతియించి కొనియాడుకొనవలె నంతేగాక. యతిరామానుజా, అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ.

6

దేవా, పరమపదవాసా, మీ నాభికమలంబున నాదిభీకర నారాయణ బ్రహ్మ జనించెనే. ఆదిభీకర నారాయణ బ్రహ్మకు కశ్యప బ్రహ్మ జనించెనే. దేవా, ఆ కశ్యప బ్రహ్మకు సూర్యుండు జన్మించెనే. దేవా, ఆ సూర్యునకు రఘువు జన్మించెనే. దేవా, ఆ రఘువునకుఁ గాకుత్సుండు జన్మించెనే. దేవా, ఆ కాకుత్సునకు మరీచి జన్మించెనే. దేవా, ఆ మరీచికి విశ్వమావు జన్మించెనే. దేవా, ఆ విశ్వమావునకు వికుక్షి జన్మించెనే. దేవా, ఆవికుక్షికి కుక్షి జన్మించెనే. దేవా, ఆ కుక్షికి భానుండు జనించేనే. దేవా, ఆ భానునకు ననూరుండు జన్మించెనే. దేవా, ఆ యనూరునికి త్రిశంకుండు జన్మించెనే. దేవా, ఆ త్రిశంకునకు హరిశ్చంద్రుండు జన్మించెనే. దేవా, ఆ హరిశ్చంద్రునకు లోహితుండు జన్మించెనే. దేవా, ఆ లోహితునకు సుదంతి జన్మించెనే. దేవా, ఆ సుదంతికి దుర్వాసుండు జన్మించెనే. దేవా, ఆ దుర్వాసునకు విదురుండు జన్మించెనే. దేవా, ఆ విదురునకు చదురుండు జన్మించెనే. దేవా, ఆ చదురునకు దిలీపుండు, నాతనికి నజుండు జన్మించెనే. దేవా, ఆ యజునకు దశరథుండు జన్మించెనే. దేవా, ఆ దశరథునకు శ్రీరఘునాయకులు జన్మించెనే. దేవా, యా రఘునాయకులకుఁ గుశలవులు జన్మించిరే. ఆ కుశలవులకుఁ గుంచభోజుండు[1] జన్మించెనే. దేవా, ఆ కుంచభోజునకు శ్రీ గోపాలుండు జన్మించెనే. దేవా, శ్రీగోపాలునకు నంద గోపాలుండు జన్మించెనే. దేవా, ఆ నందగోపాలునకు వసుదేవుండు జన్మించెనే. దేవా, ఆ వసుదేవునకు శ్రీకృష్ణుండు జన్మించెనే. దేవా, శ్రీకృష్ణునకు మన్మథుండు జన్మించెనే. దేవా, ఆ మన్మథునకు ననిరుద్ధుండు జన్మించెనే. దేవా, ఆ యనిరుద్ధునకు వ్రతముని జన్మించెనే. దేవా, వ్రతమునికి నీ లోకమున నుండు ప్రజలు జన్మించిరే. దేవా, ఈ సంకీర్తన వినువారలకు వైకుంఠ పదవు లిచ్చి రక్షింపవే. శ్రీకృష్ణ కువ్వారు స్వామి, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ.

7

దేవా, శ్రీమన్నారాయణా, పరబ్రహ్మస్వరూపా, అఖిలాండకోటిబ్రహ్మాండనాయకా, వేదవేదాంతవేద్యా, పురాణపురుషోత్తమా, పురందరవంద్యా, కపటనాటకసూత్రధారీ, మాయావినోదా, అగణితమహిమావతారా, సకలకళ్యాణగుణోన్నతా, సకలజగదంతర్యామీ, ఆశ్రితకల్పభూజా, శ్రీమదయోధ్యాపురవరాధీశ్వరా, దశరథరాజనందనా, కౌసల్యరత్నగర్భాకరా, సోమభువనతాగ్రజా[2] సౌమిత్రమిత్రా, శత్రుఘ్నవశీకరా, శరణాగతవజ్రపంజరా, కారుణ్యవారాన్నిధీ, భక్తిముక్తిఫలప్రదాయకా, శంఖచక్రగధాధరా, కోదండదీక్షాగురూ, తారాసేవితా, భక్తపరాదీనా, ఇక్ష్వాకుకులతిలకా, పక్షీంద్రవాహనా, దేవాదిదేవా, తాటకాప్రాణాపహారా, విశ్వామిత్ర యజ్ఞపరిపాలకా, యజ్ఞకర్తా, యజ్ఞస్వరూపా, యజ్ఞభోక్తా, “సర్వమ్ విష్ణుమయమ్ జగత్త'ను శ్రుతినికరపరివేష్టితా, అహల్యాశాపవిమోచనా, పురహరచాపఖండనా, సీతామనోహరా, పరశురామ బాహుబల పరాక్రమహరణా, అయోధ్యాప్రవేశా, కైకేయీ[విష్ను]కల్పిత పితృవాక్య సత్య ప్రతిపాలకా, చిత్రకూటాద్రి నిలయా, కాకాసురవిదళనా, దండకారణ్య ప్రవేశా, విరాధదైత్యహరణా, సుగ్రీవానుగ్రహా, మాల్యవంత ప్రవేశా, లవణాబ్ధి గర్వ హల్ల కల్లోలా, విభీషణ స్థాపనాచార్యా, దక్షిణ సింధురాజ బంధనా, సువేలాద్రి ప్రవేశా, రావణ సుగ్రీవ మల్లయుద్ధ వీక్షణ ప్రమోదా, మహోదర మహాపార్శ్వ కంపన వజ్రదంష్ట్ర వజ్ర మస్తక శూలా, కుంభ నికుంభ కుంభకర్ణ కరచణ శిరఃఖండనా, మకరాక్షధూమ్రాక్ష విరూపాక్షితికాయ మహాకాయ చండమదగర్వ సంహారా, ఇంద్రజిత్తు తలగుండు గండా, రావణ గిరివజ్రాయుధా, పంక్తి కంధర శిరఃపంక్తి ఖండనా, లంకా పరిపాలకా, విభీషణ రాజ్యసంస్థాపనాచార్యా, జానకీ సంయోగా, పుష్పకారూఢా, భరద్వాజ విందా, నందిగ్రామ ప్రవేశా, భరత శత్రుఘ్న లక్ష్మణ సమేతా, అయోధ్యా ప్రవేశా, పట్టాభిషేక లోకపావనా, మైథిలీసమేతా, ఆనంద జయ జయ రాఘవేశ్వరా, మాయతి రామానుజా, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

8

దేవా, మధుర నారాయణా, ద్వారవతీనిలయా, కాళింగమర్దనా, కంసాసురమర్దనా, కౌస్తుభాభరణా, శ్రీవత్సలాంఛనా, లక్ష్మీ కుచ కుంకుమ పంకిల వక్షస్థలా, శ్రీయశోదానందనందనా, చాణూరమల్ల ముష్టికాసుర ధేనుకాసుర వనకుఠారా, శకటాసుర ఘోటకాసుర కుక్కుటాసుర మదభంజనా, మహానాట్యవినోదా, మహామునిగణసేవితా, అనురూపా, (అక్షయరూపా), అక్రూర వరదా, గజేంద్ర వరదా, ప్రహ్లాదవరదా,అంబరీషవరదా, ఆపద్భాంధవా, ద్రౌపదీ మానరక్షణా, పాండవపక్షపరాయణా, విదురగృహ విమల భోజన గ్రహితా, ప్రణుత వాల్మీకిసనకసనందన సనత్సుజాత సనత్కుమార కపిల నారదాది పరమ యోగీంద్రవందితా, రాక్షస కుల ప్రళయాంతకా, గరుడధ్వజా, కమలాసన వంద్యా, బృందావన లీలావినోదా, వేణునాదప్రియా, శ్రీమదన గోపాలకా, అచలాచలాణురూపా, అనుపమా, అవ్యక్తగుణానందా, అభవస్వరూపా, ఆదిమధ్యాంతరహితా, అమృతాబ్ధిశయనా, అనంతశయానా, మకరకుండలాభరణా, కిరీటాలంకృతా, కనకపీతాంబరధరా, గరుడ గంధర్వ సమస్తదివ్యయుతా, దివ్యాయుధా, దివ్యమూర్తీ, దిక్పాలకులసేవితా, ప్రలంబాసుర భూతకి ప్రాణనిర్జితా, గాంధారీ పుత్రమిత్ర గహనదవానలా, పరమపురుషా, పరంధామా, పరమ పావనా, కనకాసురాంతకా, శిశుపాల దంతవక్త్ర బకాసుర కోలాహలా, బాణాసుర బాహుఖండనా, భవరోగ వైద్యా, భయనివారకా, షోడశసహస్ర స్త్రీ మనోహరా, గోవర్ధనగిరిధరా, మత్స్యకూర్మవరాహ నారసింహ వామన రామరామ రామ బౌద్ధకల్కి దశావతారా, లీలావినోదా, వేణునాదప్రియా, సర్వేశ్వరా, సర్వతోముఖా, సర్వజీవదయాపరా, విశ్వంభరా, విశ్వలోకేశా, త్రిభువనవంద్యా, త్రిగుణాత్మకా, త్రిలోకారాధ్యా, మధుకైటభా(ంబుద) మహాప్రళయ మరుతా, సోమకాసుర హిరణ్యాక్ష హిరణ్యకశిపు నిర్ధూమధామా, సకల దేవతామునిజన మోక్షరక్షకా, గురులఘు క్రమరూపా, కుటిల శిక్షా[3]కారణరూపా, ఓంకారప్రదీపా, అనంతనామకీర్తనా, నాదబిందు కళాతీరా, చరణారవింద గంగోద్బవా, ధ్రువ రోమశవ్యాస మార్కండేయ గౌతమ హృదయ జగజ్జ్యోతి ప్రకాశా, జగదేకవీరా, అమిత రవికోటి తేజా, భాగవత కల్పభూజా, అజామీళ ఘంటాకర్ణ దశధ్వజాళ్వారులకు సాలోక్య, సారూప్య, సాయుజ్య సామీప్య కృపాకటాక్షా, పరమానంద భరితా, అనాథనాథా, దేవతాసార్వభౌమా, అపరిమిత బ్రహ్మాండ రోమకూపా, దుష్టనిగ్రహా, శిష్టప్రతిపాలకా, దేవవేశ్యాభుజంగా, అభయాఽప్రమేయ కృపాంతరంగా, ఓం విశ్వంబులు సృజియించి, బ్రహ్మను అనుభవకర్తనుంజేసి మీ రంతర్యాములై యందుల నుండుదురు. సూక్ష్మచరాచరంబైన మీ దాసులం గాచెచరు. కరుణాజలనిధీ! భూకాంతా! లక్ష్మీసమేతా, సురగణవందితా, (మా) యతి రామానుజ మునివరము, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ.

9

దేవా, శ్రీరామానుజ సిద్ధాంతంబునకు దేవతాంతరమే హాని, చిత్[4] స్వరూపంబునకు కావ్యమే[5](?) హాని, పదభక్తికి మోహ విడంబమే హాని. మనస్సునకు చలనమేహాని, వితత వ్యుత్పన్నత్వమునకు (స్వర)కళంకమే హాని, స్వామీ, సింహగిరి నరహరీ, మీ దాసుల కాచార్యకటాక్షము లేకుండుటయే హాని. ప్రాణహాని సమయ మందు భగవద్భక్తి మఱువక విష్ణుపురాణములు, హరికథలు దలంచి, యితరముఁదలంచక సంసార మోహభ్రాంతి విడిచి సింహగిరిం దలంచి పరమ పదమున కేగుమా చిత్తమా, స్వామీ సింహగిరి నరహరీ,నమో నమో దయానిధీ!

10

దేవా, శమదమాది గుణంబులు గలిగిన బ్రాహ్మణుం డుత్తముఁడు. శమదమాది గుణంబులు గలిగిన క్షత్రియుం డుత్తముండు. శమదమాది గుణంబులు గలిగిన వైశ్యుం డుత్తముండు. శమదమాది గుణంబులు గలిగిన శూద్రుం డుత్తముండు. అతండే ముఖ్యుండు. ఎట్టి పురాణవాదనలు విన్న నేమి? సకల మెఱిఁగి యెఱుఁగక మార్గమునందు సందుగలిగి యితరముగా నాచరించెడు జంతువున కేది గతి? అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

11

దేవా, విష్ణుభక్తి లేని విద్వాంసుని కంటే హరికీర్తనము సేయునతండె కులజుండు. శ్వపచుండైన నేమి? ఏ వర్ణంబైన నేమి? ద్విజునికంటె నతఁడె కులజుండు. దృష్టిం జూడగా విద్వజ్జన దివ్యభూషణము, సింహగిరిం దలంచిన యాతండె కులజుండు. సంధ్యాది నిత్యకర్మానుష్ఠానంబులు దప్పక నడిపిన నేమి? చతుర్వేద షట్ శాస్త్రముల్ సదివిన నేమి? శతక్రతువు లాచరించిన నేమి? సకలధర్మంబులు సేసిన నేమి? మా సింహగిరి నరహరిదాసులకు దాసు లైనం గాని లేదుగతి, స్వామీ సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

12

దేవా, నిర్గుణ వస్తువైన మీ మహత్వంబెన్న నగోచరంబు. శతబ్రహ్మ కల్పంబులు చనిన మీఁదటఁగదా రోమజుని కొక్కరోమంబు ఛేదంబగుట! ఇట్టి రోమజులు నూటెనమండ్రు చనిన మీఁదటఁగదా మీనజుని కొక్క యహంబు గడచుట! అట్టి మీనజులు నూటెనమండ్రు చనిన మీఁదటఁగదా, పాదమహాముని కొక్కపాదంబు విమృష్టం బగుట! ఆట్టి పాదమహామునులు నూటెనమండ్రు చనిన మీఁదటఁగదా, మహాప్రళయంబగుట! అట్టిమహాప్రళయంబులు చనిన మీఁదటఁగదా, రుద్రుండు తాండవంబు నటియించుట! అట్టిరుద్రులు చనిన మీఁదట గదా, ఏకార్జవోదకమై వటపత్రశయనుండై కృష్ణ కృష్ణావతార లీలలం జీఁకటియౌనఁట! అట్టి చీఁకటిచనిన మీఁదటగదా, యష్టభుజ నారాయణావతార మనంతకోటి రవి ప్రకాశమై వెలుంగు చుండునఁట! అట్టి యాదిదేవుండవు నీవఁట! అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

13

దేవా, (నిన్ను) నెఱుంగని వాని వ్రతోపవాస వర్ణాచారములు విఫలములు. జ్ఞానరహితుండైన నరుండు దా కర్మియైన నేమి ఫలము? మా సింహగిరి నరహరి నెఱుంగని వారి జ్ఞాన మజ్ఞానమగును. ఎఱుకచే మరపుచే మీ మూర్తి ధ్యానవిశేషంబునకు సోపానంబులు. ప్రథమ మన్యదేవతానిరసనము. ద్వితీయము విషయరాహిత్యము. తృతీయము భగవద్దాసుల కైంకర్యము. చతుర్థము మీ మీఁది విశ్వాసము. పంచమము సత్యము. షష్ఠ మాశానిర్ముక్తి. సప్తమము రహస్యము. పరమాణువు రాఘవభాష్య భావవిశేష సుధామృత సంజీవ నిష్ఠ పరమ విభూతి విశ్వమై జయాధికారంబు గలిగి, 'యహింసా పరమోధర్మ' యనెడు నర్థంబు దెలసి, సర్వజీవ దయాపరుండై, చిత్తములోని జీవుండు చక్రాంకితుండై (యుండ వలయు), వ్రతోపవాసంబులు సేసిన నేమి? షోడశ మహాదానంబులు సేసిన నేమి? దేహత్రయ గుణంబులు వదలక కులాభిమాన విద్యాగర్వంబులు కుదురుకొనక, యింద్రియ మోహాంధకారంబు నివారించకయున్న దేహి దుర్మతి. ద్వయము బ్రహ్మజ్ఞానమూర్తిలోను, మా సింహగిరి నరహరి పదధ్యానమందును దొరకును. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ.

14

దేవా, “ఆకాశాత్పతితమ్ తోయమ్, యథాగచ్ఛతిసాగరమ్' అందుల కపోహ యనియెడు జలంబు నంటియు నంటనటులుండవలెను. 'సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి' అనియెడు స్మృతులుండగా దైవతాంతర మంత్రాంతర సాధకాంతర ప్రయోజనాంతరముల భజింపనేటికి? సంధ్యాంతమందే, దేవుని జపసమాధ్యానాత్మలోను బరతత్త్వము నింపి పరమ రహస్యమైన మార్గమున జగదీశ్వరునిం జేరి, జరామరణాదులకు లోను గాక జయమందరే? 'శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే' అనియెడు స్మృతుల శివమనియెడు మంగళవ్రతములు శ్రీహరియందు సర్వపరిపూర్ణమై యుండగాను, ప్రకృతిం బొందక ప్రపన్నులైన పరమభాగవతులం గని, 'సర్వం విష్ణుమయం జగత్త'ని శ్రుతిస్మ్రుతులు మొర పెట్టుచున్నవి. 'నారాయణా ద్బ్రహ్మా జాయతే, నారాయణా ద్రుద్రో జాయతే' యని సర్వలోకరక్షకుఁడని, త్రిమూర్త్యాత్మకమని, సూత్రగుణధారి, యేకస్వరూపంబని, యేకైక స్థితి లయ కారణంబని, యేకమేవా ద్వితీయంబనియెడి వేదశాస్త్రపురాణంబులు సత్యస్వరూపంబులు నిలుపుచున్నవి. ఓ వేదోద్ధారా...............................[6] ఓంకార స్యరూపా, ఓ విశ్వరూపా, అజ్ఞానమనెడు నంధకారమును బాపి, జ్ఞానమనియెడు సులోచనములను ధరింపజేసి 'తద్విష్ణోః పరమంపదమ్మ'ను వారంలంగనుగొనఁ(జేయవే) శ్రీ రామానుజా, దాతారు, సింహగిరినరహరీ, నమో నమో దయానిధీ!

15

దేవా, మీ దివ్యజ్ఞాన మెఱుఁగువారు పరమజ్ఞానులు. పరమానందస్వరూపులు, వైకుంఠపుర నివాసులు. వారే పరమపావనులు.కోటి యజ్ఞకర్తలు. సర్వదర్శనంబుల, సకల శాస్రములఁ జదివిన ఫల మదియే. ఆనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, మీ కైంకర్యపరులకు వందనము చేయుటయే పదివేలు. అనంతములైన ఫలములు కలుగును. ఆచార్యహీనుండై ద్విజుండు కులాచారము విడిచి యునామకురాలి వలన సుఖమంది నట్టిదే, యితర దేవతాప్రపత్తి చేసినవారు, యతి రామానుజ మునివరము దాతారు, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

16

దేవా, అనంతపద్మనాభ, వాసుదేవా, నారాయణా, గోవిందా, ముకుందా యనియెడు నిఱువది మూడక్షరము లెఱిఁగిన మహాత్ములు కలరొకో భూముపైని? సర్వాంతర్యామి సాక్షి యని శ్రుతి చాటుచున్నది. బ్రహ్మాండము మీ యందున్నది. 'ఏకో విష్ణుర్నారాయణః' అను నక్షరములు సహస్రముఖములై, చాటుచున్నవి. యతిరామానుజ మునివరము దాతారు, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

17

దేవా, శ్రీరామానుజ సిద్ధాంతమును బోలు మఱి సిద్ధాంతము లేదు. పరమాచార్యులం బోలు మఱి యాచార్యులు లేరు. పరమ భాగవతులం బోలు మఱి సమ్మోదపరులు లేరు. వారి కైంకర్యపరులంబోలు మఱి కైంకర్యపరులు లేరు. "అస్మద్గురుభ్యోనమః" అను మంత్రమునకు సరి మఱి మంత్రంబు లేదు. పరమ రహస్యంబునుంటబోలు రహస్యంబు లేదు. పరమద్వయాధికారిఁబోలు మఱి యధికారిలేడు.పరమ నాంచారి బోలు మఱి జవని లేదు. ఆనాథపతి స్వామి నరహరిఁ బోలు మఱి దైవంబులేదు. స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ!


18

దేవా, పరమ రహస్యకారియగు పురుషాకార ప్రసన్నుని ద్రష్ట లెన్నుదురు. లౌకికు రెఱుఁగరు. అజ్ఞానులై రౌరవాది నరకమునుండి సంచరించుటయే దీనికి కారణము. నరహరీ. పావనుఁడైన యగ్నిదేవతను ముట్టినం గాలదే? ఆ యపచారము క్షమపెట్టినంగాని పాయదు. అఖిలాండకోటి సర్వము సర్వేశ్వరు మాయాకల్పితమేమి చేయుదును? నిరపరాధిని. జంతువు లఖిలాండ పూరితము లైనవి. జరామరణ వ్యాధులచేత నక్కటా యనుచున్నవి. ఈర్ష్యతగదు. (నైర్మల్యా)స్పదము లయిన యాత్మలందు గుణావగుణములు చింతించుట యవినీతి. సర్వభూత దయావ్యపగత రాగద్వేష మత్సర శమ దమాది గుణము లెన్నండు గలుగునో! స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

19

దేవా, మీ పాదతులసియందుఁ జవినెఱిఁగినవా రమృతాది రుచులఁ దృణీకరింతురు. దేవా, మీ పాదయుగళ పరిమళ మెఱిఁగిన వారికి, చందన ఘనసార పరిమళము లసహ్యములు. దేవా, మీసౌందర్యము దర్శించిన కన్నుల కితరములైన రూపములు చూడఁ బాపములు. దేవా, మీ యసంఖ్యాక పరిమళ కథామృతము ఘనతరముగా గ్రోలిన జను లితర కథల నెరుంగరు. దేవా, సర్వగంధా, సకల బాంధవుండవై యిటువలె నిఖిలేంద్రియ భోగ్యమై రక్షింపవే. స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

20

దేవా, అంతట నంధుడైన బాలుండు కులాధారుండాయెనని తన జననీజనకులు, తన బాంధవులును, గోత్రాదివరులును, సహోదరులును, పితృపితామహ ప్రపితామహులును జనుదెంచి యాశ్చర్యపడి కువ్వారుం జూచి యప్పుడిట్లనిరి. ఓ మహాత్మా! యీ బాలుని భవిష్యద్వర్తనంబు లెఱింగి రక్షించి దివ్యదృష్టి నొసంగి పరమభాగవతోత్తమునిగాఁ జేసితిరని యానందబాష్పములు గురియుచు, తమ కుమారుండగు కృష్ణమాచార్యుని కౌఁగిటఁ జేర్చికొని పునఃపునరాలింగనము జేసి, యచటనున్న మహాత్ముల గనుంగొని, ఓమహాత్ములారా, ఈ బాలునికి జాతకర్మాన్నప్రాశనచౌలోపనయనాదులైన బ్రాహ్మణకర్మములు చేయవలెనని కుప్వారు సన్నిధిని సకలముం జేసి, ఆత్మావై పుత్రనామాసి'యన్న శ్రుతి చాటంగాను, నావిధంబున దలంచి లౌకిక కర్మము లాచరించిరి. దేవా, యీ వ్యామోహ మేల కల్పించితివి? దేవా, యీ చాతుర్లక్ష గ్రంథము నేవిఘ్నము చేయక నీడేర్చుము. దేవా, యాచారంబెరుంగ, ఆనాచారంబుగాఁ దిరుగాడు చుండుదును. జ్ఞానములేని పంచేంద్రియ వ్యవహారిని. దేవా, మీ నామావళి నుచ్చరించు భాగవతులు ధన్యాత్ములు, సంయమీశస్వరూపులు. మూఢాత్ముం డైనను నిలిచి వినెనేని దేవా! దురితసమూహము లెల్లం దొలంగును. శాంతులైన మహాత్ములు వినిరేని సకల కోరికలు సిద్ధించును. సాలోక్యము కలుగును. ఏకచిత్తంబున వినువారు యమద్వారంబుఁ జూడక వైకుంఠంబు చేరుదురు. నమో నారాయణా, నీ ప్రభావంబున నీ పంచమవేదంబయిన యీ సంకీర్తనము నంతఃకరణంబున వినువారు సాయుజ్యంబు చేరుదురు. అనంతంబులు మీ నామంబులు. తెలిసియుఁ దెలియరావు, దేవా, 'ఓం, తచ్ఛమ్ యోరావృణీ మహే! గాతుమ్ యజ్ఞాయ! గాతుంయజ్ఞపతయే!' అని పురుషసూక్తంబున నభిషేకంబులు చేసి మిమ్ము గానలేరు. పురాణంబులు, శాస్త్రంబులు చదివిన నేమి? మీ గుణంబులు తెలియక, మీ దాసుండుగాక మిమ్ము గానలేఁడు, దేవా, జననీ జనకుండవు నీవే. కులగురుండవు నీవె. ఆచార్యుండవు నీవె. ఆప్తజనబాంధవా, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

21

దేవా, మీరు జగదంతర్యాములై మీ గుణంబులు భూలోకంబునఁ బ్రసిద్ధిముఁ జేసితిరి. దేవా ఈ లోకంబున, శేషాచలంబున వేంకటనామధేయుండ వైతివి. ధనాపేక్షాపరుండవై విహరించితివి. భోగంబునకు పురుషోత్తముండవై జగత్తు(లకు) నాథుండవై మహాభోగంబు లారగించితివి. దేవా, లోకంబులోని ధర్మాధర్మంబులకుఁ బరమ భాగవతోత్తములపాలికి సింహాచలంబున నిలిచితిని. దేవా, భూలోకంబున వైకుంఠంబను నుభయ కావేరీమధ్యంబునను, విభీషణవరదుండవై, శ్రీరంగశాయి వైతివి. ఈ విధంబున జగంబునఁ జతుర్విధ రూపంబులఁ దాల్చి విహరించు చున్నాఁడవు. మీ మహిమ పరబ్రహ్మమని తెలిసితిని. నాభయంబు లడంగెను. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

22

దేవా, విశ్వంభరా, విశ్వపతీ, విశ్వమయా, విశ్వరూపా, విశ్వాత్మకా, విశ్వజనకా, శాశ్వతైశ్వర్యా, కలావతంసా, త్రిమూర్తీ, మత్స్య కచ్ఛప వరాహ నరమృగ విప్ర భూపతిరామ రామ కృష్ణ బౌద్ధతురగ సమారంభ సహస్ర లీలా విలాసా. అనంతనామా. స్తోత్రాతీతా. దైవదాసప్రియ ధర్మోపదేశా. నిర్మల తీర్థ స్వరూపా, దుర్మద దానవ విదారణా, భానుకోటి ప్రకాశా. పరమపదనివాసా, భాసుర సమ్మదప్రపూర్ణా. సకలభువనాద్యక్షా, నిత్యస్వరూపా. సత్యవాక్య స్థాపనాచార్యా, శరణు శరణు, సింహగిరి నరహరీ. నమో నమో దయానిధే!

23

దేవా, శ్రీమన్నారాయణా. పరబ్రహ్మ స్వరూపా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా. వేదవేదాంతవేద్యా, చతుర్దశ భువనాధీశ్వరా, పురాణ పురుషోత్తమా. పుండరీకాక్షా, పురందరవంద్యా. సకల కళ్యాణ గుణోన్నతా. పక్షీంద్రవాహనా. శంఖ చక్ర గదా శార్జ్గ ఖడ్గాద్యనేక దివ్యాయుధధరా. మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ రామకృష్ణ బుద్ధ కల్కి సర్వేశ్వరా. సర్వాంతర్యామీ. సకలభూతాత్మకా. సనామాంతకా. సంసారాంతకా. ప్రేతమస్తక ప్రతాపా. (?) చాణూర మల్ల యుద్ధకారీ. రాక్షసగిరి వజ్రాయుధా. కుక్కుటాసుర బకాసుర శకట ధేనుకాసుర విదళనా. భూతకీ ప్రాణాపహారా. శ్రీలక్ష్మీకుచ కుంకుమాంకితా, గోపీజనప్రియా, గోవర్ధనగిరిధరా, వేణునాదవినోదా, శిశుపాల శిరశ్చేదనా. కాళియ మర్దనా. కౌస్తుభాభరణా. శరణాగతవజ్రపంజరా. యశోదానందవర్ధనా. పక్షీంద్రవరదా, ప్రహ్లాదవరదా. ధ్రువవరదా. అక్రూరవరదా. గజేంద్రవరదా. అంబరీషవరదా. ద్రౌపదిమానాభిరక్షకా. పాండవపక్షపాతీ. అక్షయసంపన్నా. విశాలపక్షా. పురందరవంద్యా, విదురునింటవిందా. ప్రణుత వాల్మీకి వరధ్యానా, అప్రమేయా. ఆదిమూర్తి. ఉరగశయనా, ఈషణత్రయ భువనత్రయ. భక్తి ముక్తి ఫలదాయకా. శ్రీ వైకుంఠనాయకా. శ్రీ రాఘవేశ్వరా. శ్రీకృష్ణకువ్వారుస్వామీ. సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

24

దేవా, తొల్లి రత్నబేహారులు బావలు మఱఁదులు సముద్రతీరమునందుండిరి. అందు కొందఱు రుద్రభక్తులు. ఒక్కడే మీ దాసుఁడు. అతఁ డన్నోదక తాంబూల గంధానులేపన వస్త్రములు మీకు సమర్పణ సేయక తాను నొల్లండు. అధ్వానమందు విడువని వర్షముచేత నష్టదినంబులు మీ కోవెల లేకుండగాను ఉపవాసమే యుండెను. ఆ బావమఱఁదులు హాస్యము చేయఁదలఁచి, గుడారు కంబము తుండించి, యాతుండు కొంతదవ్వు కొనిపోయి యచట ప్రతిష్ఠ చేసి తిరుమణి తిరుచూర్ణములు పెట్టి, గంధ పుష్పధూప దీపము లిచ్చి, మీదాసునికడకు వచ్చి యష్టదినంబులనుండి యెట్లుపవాసమున్నా' వనినను. మీ దాసుండేమనుచున్నాఁడు—— ఈయధ్వానమందు పెరుమాళ్ళకోవెల లేకుండగాను నా కన్న పానాదులుగా 'వనెను. 'మే మొక పెరుమాళ్ళకోవెల చూచి వచ్చితి' మని తాము చేసిన గుడారుకంబముఁ జూపిన మీ దాసుండు చూచి, మీ భావ మెఱింగి యీతండె భావనారాయణుండని దండము సమర్పించెను. తళిగ వడ్డించెను. మీకు సమర్పించి తాను ప్రసాదపడ్డ వెనుకను నా బావమఱఁదు లేమనుచున్నారు.—— మేము గుడారుకంబము నాటి ప్రతిష్ఠ చేసి వచ్చితిమి. అది మీ పెరుమాళ్ళు కాదు. గుడారుకంబ మింతే యని హాస్యముచేసినను నాదాసుండు తత్తరపడక 'యాతఁడు భావనారాయణుఁడు, మీరు భావముచేసి నిలిపితిరి. మీరే తిరిగి తెచ్చిన నేను చక్రహస్తుండఁ గాక పోయెద' ననిన నా సమయమున రుద్రభక్తు లుప్పొంగి తాము స్థాపితముచేసిన గుడారుకొయ్య తిగిచి చూచినను, రాకున్నను, యోజనములోతు త్రవ్వి తిగిచి, ఖండించబోయినను, (దానిని) తాము కన్నులఁగానక, భ్రమించి, తమ గుడారమునకు వచ్చి యా దాసునితో నేమనుచున్నారు.— 'నీవు పరమాత్ముండవు. నీ హృదయమున నాతఁడున్నాడు. మేము పోయి గుడారు కంబము దిగిచినను, దానిని నారాయణుఁడు కూర్మరూపమున మోసియున్నాడు. నీవే మా యాచార్యుఁడ' వని దండము సమర్పించి కడకుఁ జనిరి. సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

25

దేవా, ఒక బోరుండు బ్రాహ్మణుల కనేకహింసలు చేయుచుండెను. కొంతకాలమునకు జ్ఞానము వొడమి యాతఁడు బ్రాహ్మణసభకుఁ బోయి యనేకహింసలు చేసిన పాతకుండను. నాకు ప్రాయశ్చిత్తము జేయుఁ'డన్న బ్రాహ్మణు లేమనుచున్నారు.—— నీవు తొల్లి, దొమ్మిదినూట తొంబదితొమ్మిది విప్రవధలు చేసిన పాతకుండవు. నీకు ప్రాయశ్చిత్తము లేదు పొ’మ్మనిన చోరుఁ డప్పుడు మహోగ్రుండై మండి, గృహంబు వెలుపట నిలిచి తన (భార్యతో) నేమనుచున్నాఁడు.— ‘నేను విప్రవధఁ జేయు తుమ్మదుడ్డు తె' మ్మనిన నప్పుడా యింతి యేమనుచున్నది. 'నీవు నా పతివి. నేను నీ సతిని, దాన మెఱుఁగవు, ధర్మ మెఱుఁగవు. మనకు ప్రాయశ్చిత్తమెట్లు కలుగును? మన మిక హింసలు మాని గృహంబునం గల ధనద్రవ్యాదులు దానధర్మంబులు సేసి, మనము సప్తసంతానములఁ బడయుదము. ఆట్లుగాక ప్రాయశ్చిత్తము లే'దని యా యింతి హరుసించినను, చోరుం డంతే కానిమ్మని, 'నీవును, నేనును గూరుకొని బ్రాహ్మణసభయున్న స్థలమునకుఁ బోయి, యా బ్రాహ్మణు లేక్రమమున జెప్పిన నా క్రమమునఁ జేయుద’మని, యిద్దరును బ్రాహ్మణసభయున్న స్థలమునకుఁ బోయి దండంబు పెట్టి 'మే మనేక హింసలు చేసిన పాపాత్ములము, మాకుఁ బ్రాయశ్చిత్తముఁ జేయుఁడనిన నా బ్రాహ్మ ణోత్తము లేమనుచున్నారు. ‘వినుము చోరా, నీచేత దానము పట్టరాదు.మీకుఁ బ్రాయశ్చిత్తములేదు నీవు సహస్ర విప్రుల వధచేసినాడవు, నీచేత సప్తవర్షములనుండి రక్తమున దోగిన తుమ్మదుడ్డు మూఁడుశాఖలు మొలిచిన నీకుఁ బ్రాయశ్చిత్తము చేసెదము పొ’మ్మనిన, నా చోరుం డప్పు డాగ్రహముతో 'నరువదియేండ్ల బట్టి రక్తమున దోగినను తుమ్మదుడ్డునకు త్రిశాఖలు మొలుచునా' యని తన యింతిఁగూడి సంభాషించి తాను విప్రవధ చేయు నరణ్యమునకుఁ బోయె. దేవా, ఆ యరణ్యమందొక సుంకరి కలఁడు. అందొక శ్రీవైష్ణవుడు తన తిరుకల్యాణ మాప్రొద్దెయని లగ్నము నిశ్చయించుకొనిరాగా, నా సుంకరి 'శోభన ద్రవ్యాదులకు సుంకము వచ్చును,పెట్టిపొ'మ్మనిన, నా వైష్ణవుడప్పు డేమనుచున్నాఁడు,- 'ఓయీ, సుంకరీ, ఇంతకాలమునకు వివాహము గలిగినది. ఆలకిలి సేయకోయీ. నీకు పుణ్యమగును. లగ్నము తప్పిన వారాకన్యనీయరు.' అని మహాదైన్యపడినను, మఱియును బోనీయక ఆ సుంకరి నిర్బంధము సేయగాను, వారిద్దరి మాటలు విన్న చోరుండు దగ్గరకు వచ్చి, 'ఓయీ సుంకరీ, వేయికల్ల లాడి వాచాదుర్భాషలు పలికి యొక వివాహము చేయవలె'ననినను, 'నీవైష్ణవుని సుంకము పెట్టక పోనీయను. ఇందుకు నీకేమిపని? నీవే మెఱుంగుదువు? పొ'మ్మనిన, నాచోరుఁడు సుంకరితల సెలగి వధచేసి యూవైష్ణవుని తిరుకల్యాణమున కంపెను, అప్పుడు చేసినధర్మమున క్రితముచేసిన యధర్మములు పరిహృతమాయెను. దేవదుందుభులు మ్రోసెను. పుష్పంబులు గురిసెను. ఆ దుడ్డునకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిశాఖలై మొలిచిరి.ఆశాఖ లేమనుచున్నవి—— ఓం చక్రో చక్రః , ఓం అచక్రో చక్రః జితక్షితివై వేదానామ్:' అని ఋగ్వేదమందలి పలుకులు పలుకంగాఁ జూచియా చోరుండాశ్చర్యపడెను. ఆ సభనున్న బ్రాహ్మణ సమూహంబులును, తుమ్మదుడ్డుంజూచి, యాశాఖలు వేదము పలుకఁగా విని మహాశ్చర్యపడి, యోరి చోరుఁడా, నీవు సహస్ర విప్రవధ చేసినవాఁడవు. నీ కీపుణ్య మెందువలన కలిగె'నని యడిగినను, నాతఁ 'డయ్యా, షోడశమహాదానంబులు చేసినవాఁడఁగాను. విద్వహింసాపరుఁడను. ఒక వైష్ణవుఁడు తిరుకల్యాణము నకుఁబోగా, శోభన ద్రవ్యాదులకు సుంకము పెట్టుమని సుంకరి నిర్బంధము చేయగా, (నేను) వారిద్దరి మాటలు విని దగ్గరకుఁబోయి, 'యోయి పుణ్యాత్మా, వేయికల్లలాడి యొక వివాహము చేయుమని రన్నను, నన్ను దుర్భాషలాడెను. ఆ సుంకరి తల (సెలగి) వధచేసి యావైష్ణవుని తిరుకల్యాణమున కంపిన ఫలము కలిగిన పుణ్యంబునను మీకు షోడశమహాదానంబులు చేసెదను. నాకుఁ బ్రాయశ్చిత్తము చేయుఁ డన్నను, నా బ్రాహ్మణులా చోరునియింటికి బోయి దానములు పట్టి ప్రాయశ్చిత్తముచేసిరి. అటువలె బ్రహ్మహత్యాది పాతకంబులు నాశనమాయెను. దేవా, ఇది మీ మహిమకాదా! మీ దాసుల కెవరికయిననేమి? తిరుకల్యాణము చేసినవారల కనంతములైన పుణ్యములు కలుగునయ్యా! ఇది పూర్వభాగవత సంకీర్తన. ఇందు యజుర్వేద సామవేద ఋగ్వేదాధర్వణ వేదము లున్నవయ్యా. ఇది మహారహస్యమే దేవా. ఇది మహాప్రమాణమే దేవా! శ్రీకృష్ణా! సింహగిరి నరహరీ నమో నమో దయానిధీ!

26

దేవా, ఆదిదేవుండవు, సకల బ్రహ్మాండ నాయకుండవు నీవని “ఏకో విష్ణుర్మహద్భూతం" బనిరే, దేవా, సమస్త విస్తారమూర్తి వని భావ మందెఱింగిన వారైరి, జాతివర్ణములతోఁ బనిలేదు. మీ భక్తుండైనఁ జాలునవి "శ్వపచో౽సి మహీపాల" అంటిరి. దేవా, సకలజీవులకు జతుర్వేదధర్మము లంటిరి. దేవా, ఆత్మజ్ఞానములేవి యాత్మలకు “ఆత్మజ్ఞానం జాయతే" యని తెలిపితిరి. దేవా, వేషధారణమే చాలదు. ఆత్మభక్తియే చాలదు. జ్ఞాన మాత్మభక్తి వంటిదని తెలిసి యందుకు "వేషాన్న విశ్వాసః ప్రజానామ్" అంటిరి. దేవా, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులందు పురుషసూక్తం బుండునని తెలిపితిరి. దేవా, కేవల జ్ఞానము తెలిసి, దూషణము కూడదని యందుకు దూషణయంటిరి. దేవా, మీ భక్తుండై యుండి రుద్రభక్తుల దూషించుట దోషంబని తెలిసి యందుకు “మద్భక్త శ్శంకరద్వేషీ. మద్ద్వేషీ శంకరప్రియః లావుభౌ పరోక్షం యాతః యావచ్చంద్ర దివాకరౌ" అనియెడు వాక్యప్రమాణంబులు తెలిసి యందు కుచ్చారణ తారక వేషములకు శూద్రుండైనను జాలుసని "శూద్రాశ్చ భగవద్భక్తా విప్రా భాగవతాః స్మృతా" అంటిరి. దేవా, దూషకానుష్ఠాన దూషక రహితుం డుత్తముండు. నిరపేక్ష నిశాంతంబంటిరి, దేవా, సకలజగదంతర్యామివి సకలభూతాంతర్యామి వగుదువు. "సిద్ధం కేశవా, పురుషలోకేశమ్"అంటిరి. దేవా, మీ భక్తులు మిమ్మెచ్చటఁ గొనియాడుదురో యచ్చట (మీరు)వసించి యుందురని తెలిసెను. అందులకు “నాహం వసామి వైకుంఠే" అంటిరి. దేవా, మీ భక్తులు ఎక్కడ స్థిరమై వసించిన అక్కడ స్థిరమై యుందు రనుటకు "తులసీకాననంయత్ర" అంటిరే.[7] దేవా, “సదాచార్య కటాక్షేణ భజసిద్దిమ్". ఆచార్యులే నరహరి. (మీ) సాక్షాత్కార మెందున్న నందుల ప్రేమఁజూచిన బీజాక్షులు, సతులవలస ప్రేమఁజూచి రక్తమాంస క్రిమికీటక శల్యాదులఁ గానరు. ఇవియన్నియు నెఱింగిన మహాత్ములకు సర్వము హేయము. ఎఱుంగని తామసులకు సర్వము భోగము. అనాథపతీ, స్వామీ సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ.

27

దేవా, అకార ఉకార మకారములుం గూడఁగా ప్రణవము. ఇందు బీజాక్షరి గాయత్రి. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తుల మహామహిమను నరుడెరుంగ వశమె? 'ఆనంతావై వేదాః' యని శ్రుతి పలుకుచున్నది. శాస్త్రములు లోకోపవాదములు. అడియేని దాసిన్ తొండండను శబ్దములు మీ దాసానుదాసులకు కారణమైనవి. మీపాదములాన, ఈ యర్థము తప్పదు. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

28

దేవా, మీచరణయుగళ సేవకే కులజుండైననేమి? హృదయకమల కర్ణికా(ర) మధ్యమందు రత్నసింహాసనస్థునింగాఁ జేసి, పురుషసూక్త ప్రకారంబున నావాహనార్ఘ్యపాద్యాచమనస్నానవస్త్రోపవీతసుగంధపుష్పాక్షత ధూపదీప పరిమళ నైవేద్య తాంబూలాది షోడశోపచారముల నర్చన చేసి కంకణకేయూర కౌస్తుభాభరణాలంకృతునిగాఁ జేసి, మకరకుండల మణిమయకిరీటహార ఝణఝణాత్కార నూపురాది భూషితునింగా వామాంకస్థితకమల ముఖావలోకన కుతుహల తుష్టమానసునిగా ధ్యానం చేసి, ఓంనమో నారాయణాయేతి వాక్యములచేత వందనము చేయునతండు పరమభాగవతోత్తముఁడని శ్రుతివాక్యములు చెప్పెడుంగావున నట్టివానికి మీరు, మీకతండు దక్క నితరులు గలరె? కృపాంబుధీ. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

29

దేవా, మీయురంబున నిరవై వెలింగెడు శ్రీమహాలక్ష్మియు, కౌస్తుభమాణిక్యము, మీనాభి కమలమందున నవబ్రహ్మలు నింద్రాగ్నియమ నైరృతి వరుణ వాయు కుబేరేశానులైన యష్టదిక్పాలకులుసు, నష్టదిగ్గజంబులును, భుజంగంబులు, సప్తకులపర్వతంబులు, సప్తమహర్షులు, సప్తజలనిధులు, సప్తవాయువులు, ధరణియు, గగనంబును, దీపంబును, నురుములు మెరుములు, మేఘంబులు దివి భువి పాతాళ దేవదానవ లోకములయందున్న చరాచరాద్యఖిల జంతుజాలములు మీ నాభికమలోద్భూతునివలన లిఖితంబు గావే. శ్రీకృష్ణకువ్వారుస్వామి, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

30

దేవా, ధాత్రి ఉదక మనలము, మారుత మాకాశము, జీవాత్మ, భూతాత్మ, యనియేడు భేదస్వరూపంబు లేక త్రిగుణానందమైన యిట్టి యాలయమై, జీవుండవై , దశప్రాణుండవై, దేహమునకు, మనసునకు మానసోల్లాస మైన మునిజననాథుల మనంబులఁ జేరుదువు, జిహ్వచాపలంబునకు మదన మాయాంధకారమునకు సుజ్ఞాన దీపమన నారాయణపదమ స్థిరమ్' అనియెడు దానంబును గొంటిని. రోగ దారిద్య్రంబుల చెంపలు గొట్టితిని. ఈ యపకారాదుల మనిచి, చంద్రకాంత పర్వతముమీద నీలపు సింహాసనమట్లు నీవు నాలోపలం బాయకుండవే! అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

31

దేవా, నిర్మలమైన మీకృతుల నెఱుంగక కర్మాదులం బొందెదరు. ఇతర దైవాదుల శ్రుతులందులఁ దగిలి నిషేధమును బొందెదరు. నారాయణుండే పరబ్రహ్మమని తర్కవాదములయందు దలంచి చూచిన దైవాదులు మఱిలేరు. ఏకస్వరూపం బైననాఁడు, ఏకోదకంబైనఁనాడు, బలిని మెట్టిననాఁడు, వటురూపమునుమాని త్రివిక్రమావతారమున నవతరించిననాఁ డా బ్రహ్మాండములు తానే యగునట. ఒక పాదంబున భువనంబులెల్ల గొనునట. మూఁడు మూర్తు లేకమూర్తియైననాఁడు నడుగులో రుద్రాదు లడఁగిరో, దైవాదులు మునిగిరో, పాతాళముఁ జొచ్చిరో, భస్మమైపోయిరో జయవిజయులు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్త్రులు శ్రీవల్లభుని చక్రముచేత హతమగుట నెఱుంగరా. ఇతర దైవాదులిచ్చిన పదవులు నిత్యమగునా! శ్రీనాథుం డియ్యఁడా పదవులు? బలి విభీషణులకు, నంబరీష ధ్రువాక్రూరులకుఁ, బ్రహ్లాద నారదులకు, నహల్య, ద్రౌపది మొదలైన పుణ్యకాంతల కిచ్చిన పదవు లభివృద్ధిఁ బొందుచున్నవి. శ్రీకృష్ణ కువ్వారుస్వామీ. సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

32

దేవా, మీకు మొఱపెట్టి విన్నపము చేయుచున్నాఁడను. సంసార మోహబంధములఁ దగులుపడితిని. కర్మానుకూలంబులం బెనగొంటిని. కాంతలమీఁది కోరిక కడవదాయెను, కామాంధకారము కన్నులగప్పెను. కర్మవారిది గడువదయ్యెను. అపరకర్మములకు లోనైతిని అజ్ఞాన జడుండ నైతిని. ఆధమాధముండనైతిని. అందని ఫలముల కఱ్ఱులుసాచితిని. దుష్ట దురాచారుండనైతిని. మూఢుండనైతిని. చపలుండ నతిపాతకుండను. మహాపాతక విశ్వాసఘాతుక పంచమహాపాతకుండను. అరణ్యమున దిరిగెడు మృగంబువలె తన నీడకుఁ దా నదరిపడుచు, నజ్ఞానంబనియెడు చీకటిం దప్పుకొనుచు నాచార్యకృపకుఁ జేరనీయక, భాగవత కైంకర్యమున కీడేరక, మోక్షార్తుండ గానేరనైతిని, కామాతురుండనైతిని. కూపములో బడిన శిశువువలెఁ గూయుచున్నాఁడను. తల్లి లేని బిడ్డవలె కలవరిఁచుచున్నాఁడను, తైలములోని మక్షికముచందం బాయెను. ఉరిఁబడ్డ మెకంబువలె నుపాయ మెఱుగక యున్నవాఁడను. పసిరిక కాయ పురుగువలె తేలలేక సంసారబంధములఁ దగులువడి, వికల్పగుణాదుల కెదురు గాననేరక వితరణ చెడి విరజానది దాట నుపాయంబు చాలక వారకాంతల రుచులందగులుచు, ప్రాకృతముచెలిమి విడువలేక లజ్జాభిమాన కులాభిమాన దేహాభిమానంబులు ఖండించనేరక వారకాంతలవలనం జిక్కువడితిని. నా కేది యుపాయము చెప్పవే దైవమా! నీ వుత్తమసాత్త్వికుండవు. సకలాచార్యుండవు, జగదీశ్వరుండవు, సర్వజీవ దయాళుండవు. పవిత్రుండవు, వాలినిగ్రహుండవు. విభీషణ ప్రతిష్ఠాపనాచార్యుండవు, రావణగిరి వజ్రాయుధండవు. ద్రౌపదీమానరక్షకుండవు. పదునారువేల గోపస్త్రీ ప్రియుండవు. తాటకాప్రాణాపహారా! లక్ష్మీమనోహరా!అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా! ఆదిపురుషా! పురాణపురుషోత్తమా! వేదవేదాంతస్వరూపా! పరబ్రహ్మస్వరూపా! పరతత్త్వపరమప్రకాశా! పరమపదనివాసా! శరణాగత రక్షామణీ! శరణాగత చింతామణీ! పరంజ్యోతీ! సింహాచలనాథా! నీకు విన్నపము చేయుచున్నాఁడను. ఎనుబదినాలుగు లక్షల జంతురాసుల దొంతులను అనేక యోనిముఖముల వెడలితిని. ఆ కర్మలను సుఖదుఃఖచరితుండనై యనుభవించితిని. యముని వశంబున నెంతకాలము వృధయాయెను జన్మము! తర్కవాదంబు లనెడు కూపంబుల మునుగుచుం దేలుచు, మగుడ జన్మాదుల జన్మించుచు నూరికిం బాటకుం జోటికి వెడతాకుచును, నంత్యమున నరజన్మమున జనియించి యంధుండనై కొన్నివర్షంబు లనుభవించితిని. కొన్ని దినంబులు కామక్రోధ లోభమోహ మదమత్సరంబుల నభిమానహీనుండనై (యుంటిని) కొన్నినా ళ్ళెదుటివాని నెఱుంగనేరక తన్ను దా నెఱుంగక, నిన్ను నెఱుంగక, నీ మతం బెఱుంగనేఱక, భాగవత ద్రోపహుండనయి, పరమాచార్య కృపచేర నేర్పులేక, యాచార్య శేషముదొరుకక, యజ్ఞానజంతువునై యగోచరంబైన పాపంబుల విహారవ్యాపారచిత్తుండనై, పంచేంద్రియాదుల బంధించ నేరక, పంచతురగంబులఁ బట్టనేరక, నైదుభూతంబులకు నొడంబడికగా, నవద్వారంబులు బంధించనేరక,(యుంటిని). (అప్పుడు) జన్మాంతర కర్మాంతర పవిత్ర పరమవంద్యులైన మీ స్వరూపులైన పొతకమూరి భాగవతులు, నారాయణయ్య, యౌబళయ్య, యచ్యుతయ్య, యనంతయ్య, శ్రీ చెన్నమయ్యంగారలు, శ్రీకృష్ణమాచార్యు లేకాదశావతారంబైన మహామహుఁడుగాను, చాతుర్లక్ష గ్రంథస్వరూపుండనం గాను, నతని సందర్శనసేవ దొరకునో యని యపేక్షించి, ఎంబెరుమానార్ల స్వరూపులైన తదీయులు నడబెరుమాళ్ళస్వరూపులైన స్వాములు, పరమపదనివాసులు పరమపదరాజులు, కాషాయవస్త్రములు ధరియించి, కమండలబులతోడ, దండెయుఁ దాళంబులతోడ, భాస్వరనామంబులఁతోడ, లలాటంబుల తిరుమణి శ్రీ చూర్ణంబులు ధరియించి, యాదివ్యస్వరూపులు సింహాచలమున కేతెంచిరి. ఆ సింహాద్రి జగదీశ్వరుం డంగరంగ వైభోగదాయకుండు, శ్రీరంగశాయి, శ్రీపరమపదనివాసుండు. శ్రీ జగన్నాధుండు సింహాద్రియప్ప తిరుపట్టణమందు సూర్య సోమవీధుల శ్రీపొతకమూరి భాగవతులు కృష్ణమాచార్యుల తిరుమాళిగనుఁ గానలేక నెమకులాడుచున్న సమయమం దా పదునొకండవ యవతారుండు లేడొకో! దశావతారుండైన మహాత్ముండు లేడొకో! చాతుర్లక్ష గ్రంథస్వరూపుని సందర్శనము తమ కేవేళ దొరకునొక్కో! ఆ మహాత్ముని తిరువడిగళ్ళెచట నుండునొక్కో! అతని తిరువడిగళ్ళు సేవించుభాగ్యము తమ కెప్పుడు దొరుకునోక్కో! తమ కగోచరంబై న కన్నుల కరవెప్పుడు తీరునొక్కో! తమ జన్మంబు అపునర్జన్మంబుగా నెన్న డీడేరగలుగునొక్కో! అని తమలోతాము సంభాషణ చేసి, అన్వయింపగాను, నా సమయమందున కృష్ణమాచార్యులు తనకు ప్రియకాంత యైన జగన్మోహనాంగి యను వారకాంత కుచభరంబులమీఁద హస్తంబులు వహించి, తను వేఱుఁగక, నవరత్నఖచితకంకణము (ధరించి), పసిడి కుందనపు[8]పావాలు పాదంబుల మెట్టికొని, క్రొన్నెల నామంబు కొసర కస్తూరిబొట్టు దీర్చికొని, యుదయకాలమందుచెక్కిళ్లవెంట చెమటకారంగా, కనకపీతాంబరంబైన పచ్చడపుచెరగు తిరుముఖారవిందమునకు మఱుగు చేసికొని, నఖములు చెక్కిళ్ళ సందడింపుచు, నాతుల బింబాధరముల రుచులు గొన్న యధరములు కెంపులై కనపడంగా, నొకరూపున నరకేసరియై, యొకరూపున నాదివరాహంబై , యొకరూపున కూర్మావతారుండై , యొకరూపంబున కృష్ణమాచార్యులుగానే జనియించి, చాతుర్లక్షగ్రంథ సంకీర్తనలు సేయుచున్న కృష్ణమాచార్యులు, చీనిచీనాంబరములు ధరియించిన యనేక చెలికత్తెలైన వారకాంత లిరుపార్శ్వంబుల కైదండ నీయఁగా, నా కాంతావైభవంబులకుఁ జొక్కుచు, నా మహాత్ముండు మదోన్మత్తుండై నవ్వుచు, నా సల్లాపంబులకు సంతోషచిత్తుండై తామసగుణంబుల వేంచేసిన సమయమున, పొతకమూరి భాగవతులు పొడగని, కృష్ణమాచార్యులంగూడి సంభాషణ చేయ దొడంగిరి 'ఓ మహాత్మా! కృష్ణమాచార్యుల తిరుమాళిగ యెచట నున్నది మాకుం జెప్పు' మనిరి. అప్పుడు కృష్ణమాచార్యులు విభ్రాంతుఁడై కడు నింద్య (మయ్యె) నని తనలో తలపోసి తలపోసి, చింతాక్రాంతుండై, యడియని యజ్ఞానగుణకథ లడుగుచున్నారు. ఈ మహామహులతో నెటువలె సంభాషణ చేయుదును? ఎటువలె బొంకుదును? ఎటువలె విన్నపము సేయుదును! నే నజ్ఞానచిత్తుండను. నాకేది యుపాయము? దేవా, వీరిస్వరూపములఁ జూచిన నాళ్వారులస్వరూపులై యున్నారు. నేనేమి సేయుదును? చెప్పవే దైవమా!' అని యప్పుడు కృష్ణమాచార్యులు దుఃఖజీవుండై, కన్నుల జలంబులు భూకాంతమీదఁ బడంగాను, దనహస్తంబులఁ దనచెక్కిళ్లు తటతటఁ దాటించుకొని, మూర్ఛాక్రాంతుండై, కొంతవడిం జింతిల్లి, తెలివిగాంచి యంతటను బొతకమూరి భాగవతులగూడి సంభాషణ సేయ దొడంగెను. ‘ఓ మహాత్ములారా, (మీరు) కృష్ణమార్యుల తిరుమాళిగ నడుగుచు న్నారు. (ఆ) యాచార్యుని శ్రీ పాదసేవకుండ నేను. మీకా మహాత్ముని సందర్శనము శీఘ్రమే దొరికింతును. మీ మహత్త్వ మాతనితో నానతీయుఁడు. ఆ యాచార్యునకు నమ్మిన హితుండ. మీ రెచటనుండి వేంచేసితిరి? మీ యాచార్యులెవ్వరు? మీ దైవంబెవ్వరు? మీ నామధేయంబు లేవి? ఆనతీయుండు. ఆ మహాత్ముడున్న తావునకు పనివినియెదను. అప్పుడు పొతకమూరి భాగవతులన్వయించి (యిట్లనిరి.) 'పదునొకండవ యవతారుండగు కృష్ణమాచార్యుల సందర్శనము మాకేవేళ దొరకునో! మా పూర్వాచార్యుల నామములు విన్నపము సేయుదుము. ఓ మహాత్మా! వినుము. మా పూర్వాచార్యు లుత్తమసాత్త్వికులు. సప్తసాగరములకును, స్థావరజంగమాదులకును, సకలాచార్యులకును, పదునాల్గుభువనములకును, పదుగురాళ్వారులకును, పదముగ్గురు భాగవతులకును, పరమపదనివాసుని పరంజ్యోతియైన స్వామికి పట్టు, ప్రమాణస్వరూపజ్ఞాని తిరుమలాచార్యులు, మాకు పరమాచార్యులైన మహాత్ముండు. జన్మాదులు మగుడరాకుండను మంత్రోపదేశం బానతిచ్చిరి. ఆ యాచార్యులు పరమపదముఁ గనిరి. శ్రీ రామానుజుల శ్రీపాదసేవకులము, శ్రీయౌబళ నారసింహుని నాట్యవినోదులము. పొతకమూరి భాగవతులము. నారాయణయ్య, యౌబళయ్య, యచ్యుతయ్య, యనంతయ్య, లక్ష్మయ్య, శ్రీ చెన్నమయ్య, మా నామధేయములు. కృష్ణమాచార్యు లేకాదశావతారంబైన మహాత్ముఁడనంగాను, చాతుర్లక్ష గ్రంథస్వరూపుఁడనంగాను, నా యాచార్యుల సందర్శనము మాకు దొరకునో దొరకదోయని, శ్రీ యహోబిలమునుండి సింహాచలమున కేతెంచితిమి. అనినవిని కృష్ణమాచార్యులు సంతోషమున లెరగంది, 'యీ పొతకమూరి మహాత్ముల మహత్త్వము వినియుంటిమి. పటము పన్నించి, శ్రీ యహోబిలేశుని పటముచాటున నాట్యమాడింతురఁట. అట్లుగనుక, వీరి తిరువడిగళ్ళు సేవింపవలయునని యపేక్షించి యుంటిమి. నా భాగ్యవశంబున నిచ్చటికి వేంచేసిరి. కృతార్ధుండనైతిని. నా జన్మము సాఫల్యమాయెను. కాలము కడఁగంటిని. మా పరమాచార్యులైన పొతకమూరి మహాత్ములవలన విరక్తిని బొందవలయు' నని (యెంచి) యంతట వారకామినులమీది మోహము విడిచి, “వైష్ణవదాసులతోడి సరసజ్ఞత చాలించవలయును. ప్రాకృతపుచెలిమిని పరిహరించవలెను. సంసారము నిస్సారము. [9] 'తల మీసములు వపనక్రియ చేయించి, యాడుకట్టుకట్టి, యహంకారమమకారంబులు వీడి, యుత్తమసాత్త్వికంబుఁ గైకొనెదను. నరహరిదాసానుదాసులకు దాసుఁడను. తొత్తును. తొండఁడను. బంటును స్వామి శ్రీపాదసేవకుండ' నని కృష్ణమాచార్యులు దృఢచిత్తుండై, శుచిర్భూతుండు గావలెనని యెంచి యప్పుడు, పొతకమూరిభాగవతులను దోడ్కొనివచ్చి, 'యిదిగో కృష్ణమాచార్యుల ద్వార వాకిళ్ళు. ఇచట మీరు వేంచేసి కూర్చుండుడు. ఆ మహాత్ముం డీ సమయమున,సంధ్యానుష్ఠానజపతపాది నిత్యకర్మముల ననుసరించునో తెలిసి విన్నపము చేసెద' నని, పోవునట్లే పోయి, తా పెడద్వారంబున వెడలి, క్షవరకునిం బిలిపించుకొని, తల మీసములు బోడించుకొని, స్నాన మాచరించి, శిఖాయజ్ఞోపవీతములు ధరించి, కటిసూత్రమున కాషాయవస్త్ర మాడుగట్టుగా ధరియించి, లలాటంబున తిరుమణి తిరుచూర్ణములు ధరియించి, దండెయుఁ జిటితాళంబులు సంధించుకొని, సంకీర్తనవాక్పూజలు సేయునంతట, పొతకమూరి భాగవతులఁ బిలువనంప నవధరించిన సన్నిహిత కైంకర్యపరులు పోయి “పొతకమూరి మహాత్ములారా, కృష్ణమాచార్య సందర్శనము మీకు శీఘ్రమున దొరుకును. ఈవేళ వేంచేయుం' డని పిలిచిన సంతోషచిత్తులై యంతఃపురమునకు వేంచేసి కృష్ణమాచార్యుల తిరువడిగళ్ళు సేవించి యడియేని దాసులమని యాచార్యుని శ్రీపాదయుగళమునకు సాష్టాంగదండప్రణామములు సమర్పించిరి. తమ ఫాలప్రదేశమునఁ గృష్ణమాచార్యుల తిరువడిగ ళ్ళద్దుకొని, యో మహాత్మా, మా జన్మంబులు పునర్జన్మంబులుగా నీడేర్చితిరి. అడియేలకు జన్మపవిత్రం బాయేను. మీసేవ ప్రసాదించితిరి. మిమ్ముగనెడు భాగ్యము చేసితి'మని కృష్ణమాచార్యులఁ బొతకమూరి భాగవతులు స్తోత్రము చేయగా నపుడు కృష్ణమాచార్యు "లడియేని తొత్తును. తొండఁడను. జీలంబెడును. అపచారద్రవ్యము మూటఁ గట్టవద్దు. ఓ మహాత్ములారా, మీవలన నడియెడు పర్వవిరక్తిం బొందఁగలిగెను. అడియేని జన్మంబు పునర్జన్మం బాయెను. మీదాస్యము నాకు దొరకెను. ఓ మహాత్ములారా, లెండు.' అని పొతకమూరి భాగవతులను కృష్ణమాచార్యులు లేవనెత్తి స్తోత్రము చేసెను. అంతట బొతకమూరి భాగవతులు లేచి, కృష్ణమాచార్యుల సందర్శనము చేసి నిలుచుండి,వారి ముఖారవిందంబు బొడగని, తమలో తా మొండొరులఁ జూచికొని, పరమరహస్యముగా భాషించి, 'యితండే (యాతఁ) డౌ'ననియుఁ దప్పదనియు నిశ్చయించి, 'మనవలనంగదా యీతనిభోగములు వికల్పమైన'వని తమలో దాము నిశ్చయించి, 'మనము కృష్ణమాచార్యుల సేవింపవచ్చిన ఫలమింతకు వచ్చెఁగదా! ఇతని శృంగారవైభవములు మనవలన విఘ్నంబాయె'నని పొతకమూరి భాగవతులు తమ దవడలు తటతటఁ దాటించుకొని, యీ యపచారద్రోహము లెన్నడు తొలంగునో యని దుఃఖించుచుఁ, గృష్ణమాచార్యులతో సంభాషణలు సేయఁదొడంగిరి. 'ఓ మహాత్మా! ఇటువంటి వికల్పము నీవేటికి. నీవు మహాత్ముండవు. నీవు పదనొకండవ యవతారుండవై చాతుర్లక్షగ్రంథనామసంకీర్తనలతో వాక్పూజలు సేయగా గృష్ణమాచార్యులై యవతరించినావు' అనగా "నడియని భాగ్యవశమున నిచ్చటికి వేంచేసితిరి. కనుక నేను గృతార్థుండనైతిని. మీ రిచ్చట సింహాద్రినాథుని సన్నిధిని స్వామిని తాండవమాడించవలెను. మీ మహత్త్వము సింహాద్రి యప్పడు వినవలెను" అనినఁ బొతకమూరి భాగవతు లంజలిచేసి “యడియేల కధికారంబులేదు. మీ యానతిక్రమమున నటులే విన్నపము చేయుదు” మని, జగదీశ్వరునిపటము గట్టించి, శ్రీ యౌబళనాథుని సంకీర్తన వలన స్వామికి తాండవవినోదుండై, నాట్యప్రమోదుండైన శ్రీ యౌబళనాథునిఁ బొతకమూరి భాగవతులు తెరచాటునఁ దాండవ మాడించినప్పుడు కృష్ణమాచార్యులు భీతిఁ జెంది, “మిమ్ము నెఱుంగలేక మీతో సంభాషణచేసితిని. నేను మూడుఁడను. కఠినచిత్తుండను. ప్రహ్లాద నారదాదులైన పరమభాగవతులు మీతో సంభాషణ చేయవలె. నేను నరజంతుఁడను. సర్వాపరాధంబులు క్షమించు”డని పొతకమూరి భాగవతులకు కృష్ణమాచార్యు లంజలి చేసి, వాక్పూజలచే దండంబు సమర్పించెను.మీ సంకీర్తన పూజలు చాలింపుఁ" డని పొతకమూరి భాగవతులను కృష్ణమాచార్యులను చరించెను. పొతకమూరి వైష్ణవులు దండెలు తాళంబులు ధరణిపై దించిరి. "అయినను మా నేరుపులు నేరములు, మీ తిరువుళ్ళమున చేపట్టుఁ"డని పొతకమూరి భాగవతులు కృష్ణమాచార్యులకు దండము సమర్పించిరి. అప్పుడు కృష్ణమాచార్యులు దండెయుఁ జిటితాళములు సంధించుకొని, పొతకమూరి భాగవతుల సన్నిధిని యడియేని విన్నవింతునని, యాలాప వర్ణనలతో “నమోనారాయణా" యని (మీ) నామగుణకథలు వచనభావంబునఁ గీర్తించను, ఘుమఘుమధ్వనులు మ్రోయఁగాను దండె మీటుచుఁ దాళంబు లుగ్గడించుచు, పంచమవేదస్మృతులుసు, చాతుర్లక్షగ్రంథసంకీర్తన వాక్పూజలును చేయంగాను, సింహాద్రినాథుండు నిజరూపంబున లీలావినోదుండై బాలత్వంబునఁ బురబాలురలోన బాలుండై , కృష్ణమాచార్యుల తిరుమాళిగ సన్నిధినుండి యాడుచుఁ బాడుచు వచ్చి కృష్ణమాచార్యుల తొడలమీదఁ గూర్చుండెను. ఆ శిశువుం జూచి పోతకమూరి భాగవతులు వితాశులై లేచి మెలమెల్లన సంభాషణ సేయం దొడంగిరి. “కృష్ణమాచార్యులకు సంతానప్రీతి కలదనివిందుము. ఆ బాలుఁడు గాబోలు"నని కడువేడ్కతోఁ దమలోఁ దా మన్వయించిరి. ఆ సమయమున గృష్ణమాచార్యులు "తిరువళి యందున్న యీ బాలుం డెవ్వఁడొకో! నిత్యకృత్యంబుగా స్వామిద్వారసన్నిధిని సంకీర్తన విన్నపము చేతును. ఈ బాలుని స్వరూప మెన్నడును సేవింపలేదు." అని యా పొతకమూరి భాగవతులు వేంచేసిన సమయమందు సింహాద్రి యప్పని సంకీర్తన చేయుచున్నప్పుడు నవరత్న పంచరత్న సంకీర్తనలఁ జెప్పగాఁ, దొడలమీదఁ గూర్చుండియున్న బాలుండు గంటమును, నాకులుసు జేతఁబట్టుకుని వ్రాయఁ దొడంగెను. అంతటఁ బొతకమూరి వైష్ణవుల యనుజ్ఞను గృష్ణమాచార్యులు సింహగిరి నరహరీ సంకీర్తన పూజలు చాలించి స్వామికి దండప్రణామములు సమర్పించి, పొతకమూరి వైష్ణవుల సమీపించి, “పెద్దలు బడలితిరి. అడియని గుడిసెకు వేంచేయుఁడు. మీ "సేవ యడియనికి ప్రసా దింతురు గాని, మీ శ్రీపాదతీర్థము, తళియ ప్రసాదము నడియనికిఁ గృప సేతురుగాని, శీఘ్రమే వేంచేయుఁ"డని పొతకమూరి వైష్ణవుల వెంటఁబెట్టుకొని తిరుమాళిగకు వేంచేసి బాహ్యరంగమునఁ బటము గట్టించి, పటము చాటున ఫొతకమూరి భాగవతులను బంతిగట్టుఁడని, యంతరంగమునకు వేంచేసిరి. అంతరంగమునఁ బటముపన్నించి, పటముచాటున సింహాద్రి జగదీశ్వరుని తిరువారాధన, యారగింపుతళియ నిడి, భగవానుఁ డారగించినమీదటఁ బొతకమూరి భాగవతులకు తళియప్రసాదమును శ్రీపాదతీర్థమును (నిచ్చి) “స్వాములారా, యడియని కైంకర్యమును గైకొనుఁడని," కృష్ణమాచార్యులు పొతకమూరి భాగవతులకు దండము సమర్పించెను. పొతకమూరి భాగవతులు లేచి, కృష్ణమాచార్యుల కినుమడి ముమ్మడిగా దండములు సమర్పించిరి. తిరుగ బంతిగట్టిరి. తిరువాయిముడి చదివిరి. అష్టాక్షరి నుచ్చరించిరి. ద్వయమును బఠించిరి. తిరుమంత్రమును విన్నపము సేసిరి. కృష్ణమాచార్యులు కృపచేసిన శ్రీపాదతీర్థ తలియప్రసాదము లడియేలకు మహాప్రసాదమాయెనని తెరలెత్తి తమకించిరి. అంతట బాలుని సందేహము కలిగి తమలోఁ దాము తెరలెత్తక నిలుమనిరి. అప్పుడు కృష్ణమాచార్యుల చేరంబిలిచి, “యో మహాత్మా! సింహాద్రినాధుని ద్వారసన్నిధిని మీరు సంకీర్తనపూజ లానతీయు సమయమున మీ శిశువు తిరుమాళిగయొద్ద నుండి యాడుచును బాడుచును మీదరికి శీఘ్రమే వేంచేసి మీ తొడలమీద నెక్కి కూర్చుండెను. ఆబాలుని సల్లాపంబుల సద్దు తిరుమాళిగలో వినరాదు. అతఁ డెచ్చటికి వేంచేసినాఁడు?అతని నిచ్చటికి వేంచేయుమనుడు. అతని శ్రీపాదములకు దండము సమర్పించవలయునని యపేక్షించియున్నారమ" ని కృష్ణమాచార్యులంగూడి విన్నపము చేసిరి. అప్పుడు కృష్ణమాచార్యులు పొతకమూరి భాగవతుల సందేహమును దెలిసి “యాతండు మా శిశువు కాఁదు. మీ శిశువుం డని యుంటిమి. అడియనికి నటువంటి యధికారము లేదు. అడియనికి మీరు శిశువును గృప సేసి యేడవవర్షంబు వెడలు సమయమందే మీ సాయుజ్యమున కీడేర్చుకొంటిరి. ఆ బాలునికిని మాకును బనిలేదు, మీ రహోబలేశుని పటముచాటునఁ దాండవ మాడించఁగాను మీ నాట్యవినోదమున నుదయించెను. ఆ పరమపదనివాసుఁడు వేంచేయఁబోలును. భగవానుని మీవలన నీవిధముగాఁ గంటిని. భాగవతకృపఁ గానము. భగవానునికృప గానము. మీరు మా పరమాచార్యులై యన్నియుఁ దెలిపితిరి. తెరలెత్తుఁడు స్వాములారా", యని కృష్ణమాచార్యులు దండము సమర్పించెను. అప్పుడు పొతకమూరి వైష్ణవులు గడుసంతుష్టిఁ బొంది యుప్పొంగి కృష్ణమాచార్యులం గొనియాడిరి. ఓ మహాత్మా, నీవు దక్క దైవములేదు. నీవే కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగ కలియుగములకు కృష్ణావతారుండవై జనియించినాఁడవు. నీవు మహాత్ముండ వగుదువు. మీ మాహాత్మ్యమును మేము గనుగొంటిమి. మీయనుజ్ఞవలన శ్రీపాదతీర్థ తళియప్రసాదములను బ్రసాదించుఁడని యా యాచార్యుని తిరువడిగళ్ళకు నొరగి యంగుష్టప్రమాణంబు పట్టుకొని దండప్రణామంబు సమర్పించిరి. “మీ శ్రీపాదతీర్థమును, తళియప్రసాదమును మా జన్మవిమోచనముగా భుజించితిమి. అడియేలకు నె ట్లానతిచ్చెదరు? మగుడ శ్రీ యహోబలమునకు పనివినవలెను. అంపకమవధరించుఁ'డని యాచార్యులకు విన్నపము సేసిరి. అప్పుడు కృష్ణమాచార్యులు వైష్ణవులతో, " వో మహాత్ములారా! చాతుర్లక్షగ్రంథసంకీర్తనలకు కొదువ లక్షయేబదివేలు విన్నపము సేయవలెను. ఆనాటికి మీ సేవ దొరకునో దొరకదో యని చింతించగాను, నీసమయమందు మీరు వేంచేసితిరి. మీ సేవకలిగెను, గనుక నెవ్వరికి వెరవను. యమునకు వెరవను, కొదవ గాకుండను చాతుర్లక్షగ్రంథసంకీర్తన వాక్పూజలు మీవలన మీభండారమునకు (?) విన్నపము సేతును. మా పితృపితామహులు ప్రపితామహులు నరకమునుం గొంత గాంచిరి, మీ(వంటి) దయాళులవలననే నరకహేతువు వీడ్కొని సాయుజ్యమును బొందిరి. మీద్వారముల సన్నిధిని యధికారము నాకుఁ (గలదు.) అదే నిత్యనివాసముగాను మఱి మఱవకుండను పరమపదము కృపసేయుఁడు, పరమపదమునకు సాలోక్య సామీప్య సాయుజ్యములు మాకుండును.ఆంతరంగ బాహ్యరంగములకు మీయనుజ్ఞ ప్రసాదించుఁడు. నూటయెనిమిది తిరుపతులును మీ లీలావినోదములు. ఇఁకమీదట మీ తిరునాళ్ళను మీతిరుమేనను మీ తిరువక్తృమునను నన్ననుగ్రహించుఁడు. ఇంతే నా విన్నప" మని, పొతకమూరి భాగవతులకు సాష్టాంగదండప్రణామంబు సమర్పించి, “యో మహాత్ములారా, వేంచేయుం"డని యనినప్పుడు పొతకమూరి వైష్ణవులు హస్తంబులఁ దమదవడలు వాయించుకొనుచు, 'మాకాచార్యాపచారంబు లేల మోపుగట్టెదవు? ఓ మహాత్మా' యని, కృష్ణమాచార్యుల కినుమడి ముమ్మడి దండములు సమర్పించి, యాతని యానతి యుంచుకొని మగుడ శ్రీయహోబలమునకు వేంచేసిరి. పొతకమూరి వైష్ణవుల వీడ్కొని సింహాద్రినాథుని నగరికి నేతెంచి, సింహాద్రినాథుని సందర్శించి దండప్రణామంబు సమర్పించి, 'యీ మాయా ప్రపంచం బెఱుంగలేను. పుట్టించుచు గిట్టించుచు యమునిచేత దెబ్బలకు లోనుజేతువు. యమునిచేత నన్ని(బాధల) నేకవేలేండ్ల నుభవించితిని. నాడు మీరు లేరో! నేను లేనో? సుఖదుఃఖంబుల బొంది, దుఃఖజీవుండనై మీ దయకు లోనై మిమ్ము గానలేక, పంచమహాపాతకంబులలో మునుఁగుచుండఁగాను, మా పరమాచార్యులైన పొతకమూరి భాగవతులు వేంచేసి మిమ్ముం గనిపించిరి. వారి మహత్త్వమువలననే వెనుకటి కర్మములు వీడ్కొంటిని. నీవు బొంకుల కంచమవు. లంకచెఱుపు మర్కటుండవు. నిన్ను నమ్మలేను. నీ చాతుర్లక్షగ్రంథసంకీర్తన పూజలకు లక్షయేబదివేలు కొదువ. ఆ సమయమందు మీఋణం బెట్లుండునో? మీయనుజ్ఞ యెట్లుండునో? ఇప్పుడే నాకు సాయుజ్యము గృప సేయుఁడు. సర్వాపరాధములు, పొతకమూరి పరమాచార్యుల కృపవలననే మీ తిరువుళ్ళమున ననుగ్రహింపుడు. ఇంతే నావిన్నపము. విన నవధరింపుఁడ'ని క్షీరాబ్ధిశయనుని వీడ్కొనెను. క్షీరాబ్ధివటపత్రశయనుండు భూకాంతసమయవశస్తుండై సింహాద్రిజగదీశ్వరునకు విన్నవించె. పొతకమూరి భాగవతులయనుజ్ఞ వలననే యీ యపచారానపచారములు — మాతిరువుళ్ళమున కొలిపిన మీకు సాయుజ్యమిత్తును. సర్వమునకును, సర్వమైన యెందులకును నవధరించి నట్టి నాయురమున వెలింగెడు (శ్రీకాంతకును) భూకాంతకును దప్పుదును. సాలోక్యసామీప్యసారూప్య పదవులిత్తును. సమయ మొనరింతును. ఇందుకుఁ దప్పితినా, పదుగురాళ్వారులకును, పదముగ్గురు భాగవతులకును దప్పుదును. (మీకు) పదవిగనిపింతును. ఇందుకు దప్పితినా పొతకమూరి భాగవతులకుఁ దప్పుదును. ద్వారవాకిళ్ళసన్నిధిని జతుర్భుజంబులును శంఖచక్రగదాశార్ఙ్గఖడ్గాద్యధికారం బిత్తును. సర్వమును తిరునాళ్ళను తిరుమేనను దిరువక్త్రంబు దెరిచి యవధరింతును. ఇందుకు దప్పితినా, పరమపదనివాసుని పరంజ్యోతియైన స్వామికిఁ దప్పుదును. సర్వమునకును దప్ప’ నని సింహగిరినాథుఁడు శ్రీకృష్ణమాచార్యులకు నభయహస్తము గృపఁ సేసెను. అనుజ్ఞ ప్రసాదించెను. అప్పుడు కృష్ణమాచార్యుల విన్నపము నవధరించెను. ‘నేడు గదా, నేను భాగ్యము చేసితి’న(ని) వారిసాగరము లుబ్బినట్టివిధ మనుభవించెను. మహామేరువు శతయోజనములు పెరిగినట్లు కృష్ణమాచార్యులు పొంగెను. “నేడుగదా, పరమాచార్యులైన పొతకమూరి నారాయణయ్య యౌబళయ్య, యచ్యుతయ్య, యనంతయ్య, లక్ష్మయ్య, శ్రీచెన్నమయ్య గారల వలన పితృపితామహులకును, వైఖానసులకును, బ్రాకృతులకును, కనుగొని సేవించిన యార్య పెరియలకును[10], శత్రుమిత్రులకును, పరమపద మిప్పించి(తి)రి. కనుక వారి మాహాత్మ్యమువలన పరమపద మొకవరము జేసితిని. పరమపదనివాసుని గడు గుత్తఁగొంటిని. పరంజ్యోతి నామనంబున నిలిచెను. నేడుగదా పరమభాగవతుల శ్రీ పాదపద్మంబులు సేవింపగలుగుట! నేడుగదా, దాసానుదాసులకు దాసుఁడ ననగలుగుట! నేడుగదా, సింహాద్రినాథుని వాకిళ్ళు గాచెడు భాగ్యము గలుగుట! నేడుగదా, యతిరామానుజముని వరదస్వామి సింహగిరి యనియెడు దివ్యౌషధము నా హృదయమునకు దొరకుట! నేడుగదా నూటయెనిమిది తిరుపతులను వెలయంగలుగట! నేడు గదా, మీ తిరుమేను నవధరింప గలుగుట! నేడుగదా, కృష్ణమాచార్యుల గాచి రక్షింపగలుగుట! ఆర్తజనబాంధవా, అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, ఇంతే నా విన్నపము.

33

విష్ణూ, ముకుందా, ఆనంతా, భగవాన్, అచ్యుతా, నారాయణా, హరీ, మురారీ, శ్రీరామా, నిరంజనా, పరమా, పరిపూర్ణా, పరమేశ్వరా, వరవాసుదేవా, నిర్మలస్వరూపా, పరమపురుషా, పరంతపా, పరంధామా, పరబ్రహ్మా, అను మీనామంబులుగల యష్టోత్తరశతనామంబులు శ్రియఃపతి ముఖ్యనామంబులు. కేశవా, నారాయణ, మాధవా, గోవిందా, విష్ణూ, వాసుదేవా, అనిరుద్ధా, సంకర్షణా, హృషీకేశా, విశ్వంభరా, వైకుంఠవాసా, వేదాంగా, వామనా, అహల్యశాపవిమోచనా, చక్రధరా, జనార్దనా, పరంధామా, వేదాత్మకా, కపిరాజా, యజ్ఞపురుషా, అను మొదలుగాఁగల నామంబులు శ్రీ కేశవుని యుపనామంబులు. శ్రీకృష్ణా, త్రివిక్రమా, పుండరీకాక్షా, ఉపేంద్రా, నారసింహా, పీతాంబరా, శార్ఙ్గధరా, శౌరీ, దైత్యారీ, వనమాలీ, విష్వక్సేనా, మధుసూదనా, తీర్థనాథా, శేషశయనా, అంభోనిధీ, వేదోద్ధారా, యజ్ఞవరాహా, ఆదికూర్మా, లంకేశ్వరా, హంసనయనా, సప్తాంగా, అను మీ యిరువదియొక్క నామంబులు మొదలుగాఁగల క్రియానామంబు లనంతములు. ‘అకారార్థో విష్ణు’ వనెను. ‘వేదాక్షరం శివయంతి’ యనెను, ‘సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి’ యనెను. ఆ శ్రుతివలన ఇతిహాసపురాణరహస్యములు చెప్పిరి. అకారాది సర్వవర్ణముల కర్థములు (మీ) నామములే. రాజస తామస దైవములకుఁ గలిగెనేని, యర్థాంతర రూపవర్ణము లంతర్యామి ప్రతిపాదకములు. ఇతరదేవతలయందు వేదార్థములుగావు. అది యెట్లన్న శంఖంబింద్రజితేంద్రచంద్ర కౌమండూక రూపములందున్నను నర్థములు వేరైనట్లు, ‘బ్రహ్మ[11] విష్ణు మయం జగత్.’ శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ. [12]

34

దేవా, ద్వయమున కధికారి యెంతటివాఁడు? కోపము, శాంతము, నిర్లజ్జయు నింద్రియజయపరుండు గావలెఁగాక ద్వయాధికారి తన్ను దానెఱుంగక దూషించు కపటాచార డాంబికపరుండు ద్వయాధికారియగునె? వికార దూషణరహిత హృదయాభిమాన పరుండు దాఁ గాక, కీటకాంకుర జన్మంబున హతుండు దాఁ గాక? భాగవతాపచారంబును దాఁ బొందక అనాథపతి, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

35

దేవా, శ్రీరామమంత్రోచ్చారణంబున వాల్మీకి పురాణపురుషోత్తము డైన యాదినారాయణమూర్తి దివ్య శ్రీపాదపద్మంబులంజూచి యపేక్షించి నప్పుడే రామమంత్ర రహస్యమునఁ గృతార్థుండయ్యె. అదిగాక శ్రీ జగద్భరితుండైన దేవుం డొకండేయని వ్యాసులు[13] "సత్యం సత్యాత్మకమ్ దైవమ్! సత్యవాక్య దృఢవ్రతమ్౹ సత్యం సత్యంపున స్పత్య ముద్దృత్య భజ ముచ్యతే౹ వేదశాస్త్రాత్పరం నాస్తి నదైవం కేశవా త్పరమ్౹౹ "అనిన శ్రుతి వలన భాష్యకారులు విజ్ఞానులు. అత్యంతవిభవమున పరాశరపుత్రుండు చాటిన లక్షణములు బ్రహ్మంబని వశిష్టుడు తాత్పర్యంబునఁ బరగె. దూర్వాసుండు మాధవ శ్రీధరములను, వామదేవుండు హృషీ కేశమును, బ్రహ్మ రుద్రాదులు సంకర్షణ గోవింద మంత్రములను, విశ్వామిత్రుండు పురాణపురుషోత్తమమును, శ్రీకశ్యపాదులు దామోదరమును, శాండిల్యుఁడు శ్రీనాభమును, గౌతముం డనిరుద్ధత్రితయమును, నారదుండు శ్రీనారాయణమంత్రమును, పుండరీక కణ్వాదులు త్రివిక్రమమును, మాండవ్యుఁడు జనార్దనమును, నాత్రేయుండు శ్రీకృష్ణమంత్రమును, సనకసనందనసనత్సుజాతులు వామనమంత్రమును, జమదగ్ని శ్రీరామమంత్రమును, శుక్రుండు శ్రీనారసింహమును, బృహస్పతి నమోనారాయణమును (నుపాసించిరి.) వీరు మొదలైన పుణ్యులు సహస్రనామంబులను, మఱియును మహాత్ము లనంతంబులు గూడి యనంతవేదములనియెడు వేదవేద్యుం డనంతంబులం బ్రబలియుండునని యనంతకోటిరవిప్రకాశంబైన దేవుని యనంతనామంబులఁ గొనియాడిరి. వాల్మీకిఋషిపుంగవుండు భరద్వాజున కెఱింగించె. నీవు నృసింహమంత్రంబు పఠించి పరమపుణ్యుండవైతి వనెను. భరద్వాజుండును నుత్తరవిహారమున కుతూహలుఁడై ఋష్యశృంగుని సేవించి యతనిచే సకలపుణ్యంబులు విన బోయి"[14] శ్రీవత్సమహాఋషీశ్వరుండును, భృగుండును (?) నగు (నాతనికి) నేత్రమున తారకు(నకు) దండప్రణామంబు సేసి మునీశ్వరునితో, 'భృగు వెవ్వఁడు? ఆది మూలం బేది? అతఁడు దేనికొఱకు భూలోక భువర్లోక సువర్లోక (ంబులదిరిగె?) కైలాసవాసుని నేల శపించె? బ్రహ్మ నేల శపించె [15].......... వాసుదేవుని శరీరంబున కెరిగిన శిశుపాల దంతవక్త్రుల......[16] స్వామి నిజమంటపంబున కేగి దేవదేవుని భావించి పరిపరిగుణంబుల సేవించి, సకలలోకవృత్తాంతంబును విన్నవించి, జగద్భరితుని నామామృతరసమును సేవించినవాఁడై, యాత్మసంతోషంబున వారిమీద పాదంబులు చాచిమఱచి నిద్రించిన, పాదంబున నమరిన నయనపంక్తిసహస్రముల (హరి) నీరుగావించె. భృగుఁడు నిద్రమేల్కొని నివ్వెరగంది, చిక్కితినని, శ్రీకాంతుని శరణుజొచ్చినఁగాని పనులు తీరవని తెలిసి యాదేవు పాదపద్మంబుల కొరిగి, భీరుండై 'పరమాత్మా, నిన్ను బాధించి తన్నితి. లోపమూలంబని నానేర మెంచకు. నన్ను గృపఁజూడు. నీబంటునైన నేను నీచమతులైన మునులకెల్ల నాత్మలోపల మూలంబు నీవని మీచరిత్రము జెప్పి, కన్నులఁ గప్పిన కర్మపాశము లూడను స్తోత్రంబు లుర్విం జేసెద. అచ్యుతానంతుని దివ్య శ్రీపాదపద్మంబుల నమరిన తీర్థప్రసాదంబుల భువిధారుల కెల్లఁబుణ్యంబుల నీయ దనుపు(ము). అమరేంద్రవంద్యా, అని యాదిమూ ర్తిచే నలరిన వేడ్కలెల్ల సమకూడ నానంద మంది, జిహ్వశుచిగా శ్రీ జగన్నాథుని పాదతీర్థములఁగాని పాపములు వీడరావని మునులకెల్ల నెఱిఁగించి పుణ్యులంజేసె, ఇదియుత్తర[17] ... యతి రామానుజా, అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

36

దేవా, (ఏక)శిలానగరంబనియెడు నొకపట్టణమందు నగసాల పరమసేవ్యుం డుత్తముండు. (అతఁడు జీవయాత్ర)ను సమాప్తంబు సేసె. అంతట నాతని ప్రియపత్నియైన సతి శవంబునకు విమానంబు గావించి, చిత్రవిస్తారముగా శృంగారములు తన ప్రాణవిభుని దేహంబున నొనరించి కనకమయప్రాకారపట్టణమధ్యవీథియందు[18] సమాధి కెక్కించుకొని, సమాధిక్రియలకుఁ బోయెడు కామిని, శ్రీకృష్ణమాచార్యులఁ గనుగొని సాష్టాంగదండప్రణామంబు సేయఁగాను. నంత నేను 'దీర్ఘాయుష్మంతు రాలవై యుండు'మని యాశీర్వాదము సేసితిని. ఆయింతి 'నాకెక్కడి దీర్ఘాయుష్యము? ఓ మహాత్మా! నాపతి కైలాసమున కేఁగెను. నేను సమాధికిఁ బోవుచున్న దానను.' అనిన నేను మహాశ్చర్యమంది, మీ దాసుని వాక్యము వృధాపోవచ్చునా యని. 'ఓన్నమోనారాయణా, శ్రీమన్నారాయణా, యని దండెయుఁ జిటితాళంబుల ఘుమఘుమధ్వనులతో మీ దివ్యనామసంకీర్తన చేయగాను, గొంతతడవునకు శవమునకుఁ బ్రాణము వచ్చి దిగ్గన లేచి శ్రీ కృష్ణమాచార్యులకు దండము పెట్టి, యోమహాత్మా, మీ మాహాత్మ్యంబునను కైలాసవాసుఁడు (కరుణించె). నీ నిమిత్తంబున శ్రీకృష్ణమాచార్యులు. వైకుంఠపతినిఁ దారుచున్నాడు. నీవు శతవర్షంబులు లోకమందు భోగభాగ్యము లనుభవించుమని యానతిచ్చి శివకింకరులచేత మఱల ద్రోయించగా వచ్చితినని విన్నవించెను. శ్రీకృష్ణమాచార్యులు కరుణించిన కరుణాకటాక్షవీక్షణంబుల నో దేవా, యీజీవిని రక్షింపఁజేసితిరి. మీ మహత్వంబు నుతింప నేనెంతవాఁడను? ఆశ్రితరక్షకుండవు. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

37

దేవా, అన్నమయంబుల వలనఁ ద్రిగుణాత్మకంబైన పంచేంద్రి యంబు లుదయించు. పంచేంద్రియంబుల కాలయంబై సప్త[19] హితవుల నివాసంబై విషయాతుర మమతలఁ దగిలి జీవుండు సకలాశాబంధకరుండై యుండు గావున పుత్రేషణ దారేషణ ధనేషణం బనియెడు మాయయాత్మ తిరుమంత్రాపేక్షలను, నరిషడ్వర్గంబులను జేజిక్కించుకొని బడలెడు జీవున కెక్కడికులము? తనువుచే మనము, మనముచే ధనము, ధనముచే గనకము; ఇట్లు జనులకు దమోగుణం బుదయించుఁగాన ననుదినము మీ పదధ్యానమునం దగిలి యుండఁదగును. మీ మాయ నిర్మలోదకంబునఁ బ్రతిబింబంబు గానవచ్చిన క్రియ మనంబునఁ గానవచ్చును. దేవా, ఘనతరంబగు నాచార్యకరుణావిశేషంబువలన నష్టాక్షరి మంత్రోపదేశము చేసినను సూర్యప్రకాశంబుచేతఁ జీకటిబాసినక్రియ నాసంసారార్జవము గడచితిని. శ్రీకృష్ణ కువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

38

దేవా, ఇక నేనేమి చేయుదు? దైవమా, నా పూర్వకర్మంబులన్నియుం గూడుకొని సతులై , సుతులై, సహోదరులై, బంధువులై, హితశత్రువులై, యనేకతెఱంగుల నన్ను బెనఁగొని పోనీయక వేపుచున్నవి. నే నేమి చేయుదునో దైవమా? కామములై, క్రోధములై, లోభములై, మోహములై, మదములై, మాత్సర్యములై, చలములై, విద్యావిడంబంబులై, త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణంబులై, యనేకతెఱుంగుల నన్ను బోనీయక వేపుచున్నవి. దైవమా, ఇట్టి నాదుష్కర్మంబులన్నియుం బెడఁబాపి, మీ దాసానుదాసునింగాఁ జేసి రక్షింపవే. అఖిలజగన్నాథా, అఖిలజగదానందమూర్తీ, జగజ్జీవనా, జగన్నివాసా, అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

39

దేవా, ఘనత్రిమూర్తులాదిగా నీవిశ్వ మజాండము లోపలిది. ఈరీతి ననంతములైన బ్రహ్మాండకటాహములే నీ మేనియణువులు. ఇవియే దిగ్వ లయంబులై యిన్నిటిలోపల వెలుగొందు. ఓ సింహగిరి నరహరీ, తేజోమహితమై మీమహిమలిట్లు బ్రహ్మాండములై పరగుచు నాదిమబ్రహ్మమై రంజిల్లు. పరబ్రహ్మమై శోభిల్లు, తారక బ్రహ్మమై వర్ధిల్లు, ఇదినిర్గుణమై పరమాత్మమున నణగు. ఇది సగుణమై విరాట్పురుషరూపంబుతో నుండు. ఇది గుణసంయుక్తమై త్రిమూర్త్యాత్మకము దానగు. అట్టి నారాయణమూర్తియై యఖిలాత్మ తానగు. అట్టియనంత వేదాగమముల కునికి. ఇట్టి యపవర్గ మోక్షమునకు ముముక్షుముక్తి. కైలాస వైకుంఠ బ్రహ్మలోక గీర్వాణములు మా సింహగిరి నరహరి యిచ్ఛా విహారములు. స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

40

దేవా, నిత్యపదంబైన మీ దివ్యనామ సంకీర్తనఁ బఠియింపనేరక (సర్వదేవతలు సాక్షియైన) భర్తను విడచి పరపురుషుంగోరు వ్యభిచారిణి విధంబున నున్నవాఁడను. నన్ను గృతార్థుఁజేయవే! అనాథపతీ స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

41

దేవా, స్వస్తి, సమస్తలోక నిస్తారకా, శ్రీపురాణ పురుషోత్తమా, శ్రీలక్ష్మీకుచ కుంకుమాంకిత వక్షఃస్థలా, గాంభీర్యధైర్యా, సనకసనందన సనత్కుమార కపిల నారద మునీంద్రవందితా, విభీషణ ప్రహ్లాదార్జునాంబరీషప్రియా, రుక్మాంగద గజేంద్ర సేవాలాలితా, భృగుభరద్వాజ మాండవ్య మార్కండేయ గౌతమ శౌనకాదిముని గణసేవితా, శ్రుతిప్రియపూజితా, బ్రహ్మాదిసురముని హృదయస్థితా, త్రిమూర్త్యాత్మకా, నైరృతవరుణ వాయుకుబేరేశానాది దిక్పాలేశ్వరా, లక్ష్మీనారాయణా, యమునోత్పల లోకసాకారా, బింబాసమ నవరత్నఖచిత పాంచజన్య భవ్యజ్వాలాభిరామా, బాలార్కమణి గణాంకితసందర్శన గరుడధ్వజా, అనంతశయనా, క్షీరాబ్ధిశయనా, అనేక దైత్యనిర్జిత దోర్దండా, మత్స్యకమఠ వరాహ నారసింహమూర్తివామన జామదగ్నిరామ దశరథరామ రామకృష్ణ బుద్ధ కల్క్యవతారా, కార్త్యవీర్యసహస్రబాహుఖండనా, విలువిద్యా విక్రమ ప్రియానుగ్రహణోత్తరణా, గంగాప్రవాహోద్బాధిత [20]లోకజాతశ్రేష్ఠా, జ్వరాకరాళ వైశ్రవణ తదీయ రచితార్థరాక్షస ప్రళయాంతకా, హేమసుచరిత్రాసమేతా, సకల (ల?) రక్షణ సంపూర్ణా, హలాయుధధరా, దేవకీవసుదేవప్రియాత్మజా, యశోదా నందవర్ధనా, కుక్కుటాసుర భస్మాసుర శకటాసుర ధేనుకాసుర ప్రలంబాసుర గర్వమదదర్వీకరా, బలభద్రానుజా, బృందావన లీలావినోదాబ్ధి రామాభిరామా, సకలాంధకారమార్తాండా, (రుక్మిణీ ) మనోవల్లభా! సత్యభామా మనస్సరోవర రాజహంసా, జాంబవతీముఖ సంపూర్ణచంద్ర చంద్రికాచకోరా, మిత్రవిందా ప్రమేయా, భద్రాప్రాణనాయకా, సుదంతీమనోరంజకా. కాళిందీకందర్ప స్వరూపా, లక్షణాసకల కళాప్రమేయా, షోడశసహస్ర (గోప)స్త్రీ హృదయానుకూలా, అనాదిబ్రహ్మచారీ, పాండవపక్షపాతీ, గాంధారీ పుత్రమిత్రదవానలా, సకలసన్నుతా, ఆపదుద్ధారకా. శ్రీకృష్ణా, శరణాగత వజ్రపంజరా, దివిజబ్రహ్మాదివంద్యా, ఉగ్రనఖత్రిపుర భేతాళా, కరినిర్వాపణా, దుష్టనిగ్రహా, శిష్టప్రతిపాలకా, ధర్మరక్షకా, అశ్వపురఘట్టన నిపుణా, అనంతావతార లీలావినోదా, శంఖచక్రగదాశార్ఙ కోదండ సకలాయుధప్రచండా, పద్మవనమాలికాధరా, వేదవేదాంతవేద్యా, కుసుమిత మకరతోరణాలంకారా, శ్రీపుండరీకాక్షా, శ్రీనృసింహమూర్తీ, శ్రీసహస్రనామా, శ్రీయనంతనామప్రసన్నా, శ్రీమద్భగవాన్, శ్రీనివాస, సర్వేశ్వర, శ్రీలక్ష్మీసమేత, శ్రీకృష్ణ కువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

42

దేవా, జయజయ, పరమపురుషా, పరమపదనివాసా, పరంధామా, పరతత్త్వప్రకాశా, అచలాచలా, అనుపమా, ఆదిపురుషా, అపరంపరా, అవ్యక్తా, అగణితగుణానందా, అమరేంద్రవంద్యా, అభయస్వరూపా, అఖిల బ్రహ్మాదిజనకా, విశ్వంభరా, విశ్వతోముఖా, శాశ్వతసచ్చిదానందా, ఏకరూపా, త్రయరూపా, పంచరూపా, అష్టరూపా, దశరూపా, శతరూపా, సహస్రరూపా, అక్షయలక్ష విచక్షణ ప్రమోదా, విచక్షణాలంకారా, నమో విభీషణ మోక్షకారణాయ. శ్రీకృష్ణ కువ్వారుస్వామీ, నమో నమో దయానిధీ!

43

దేవా, మీ దివ్యమంగళంబైన ద్వయతిరుమంత్రాచార్య కృపా కటాక్షములవలనఁ బుట్టిన మనుజుండు క్రితమున సుజనుండయిననేమి దుర్జనుండయిననేమి? అతండె మీదివ్యపదంబును బొందును. అదియెట్లన్నను, సకలలోహముల ఖండించెడు లోహమును, వేదశాస్త్రపురాణములు వ్రాసెడు లోహమును పరుసవేది సోకిన సువర్ణమైనట్లు పెద్దలైన ప్రపన్నుల మేదినీసురుల నాచార్యులఁ దల్లిదండ్రుల నవమానముజేసి తిరస్కారము లొనరించిన దుర్మార్గుండనంతకోటి బ్రహ్మకల్పంబులందు క్రిమికీటకాదుల సంగతి నొక్కఁడే చరించుచుండు. ఆదియెటులన్న వినుఁడు. తొల్లి యింద్ర(ద్యుమ్న?) మహరాజు మహాత్ముల తిరస్కార రూపంబునఁజేసి కుంజరయోనియందు జనియించి మహాకుటిలపడి మఱియెట్లు ఖర (మకర) వంశంబున ముక్తుండాయెను. ఇది మీరెఱుఁగరా? సకలజగద్విదితము. శ్రీకృష్ణ కువ్వారుస్వామీ. సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

44

దేవా, మీ ముారవిందంబున వెలసిన బ్రహ్మ లోకాధి(కార)పరుండై యనంతకోటి వేదశాస్త్ర, పురాణేతిహాస వర్ణంబులు వర్ణించి యూహించి యనేకయిడుములఁ బొరలుచుండె. మీమాయ దలంప నెవ్వరి వశము? దేవా, నిత్యవినోదా, నిత్యకళ్యాణా, భోగభాగ్య సంపన్న దేవతామూర్తివి. దేవదేవోత్తముండవు, నిధానకల్పుఁడవు, దేవకీపుత్రుఁడవు. నిర్మల చరితుండవు. పారిజాతాపహార పరమపురుషుండవు. పరంజ్యోతి పరబ్రహ్మరుద్రాదులు మీపాద యుగళంబులు, కానంగలేని మాయాప్రకాశంబవై విహరింతువు. దేవా, కాశిలోన, తారకబ్రహ్మ రామమంత్రముల రుద్రుండు మిమ్ము నుతియింప దొడంగె. ఆకాశిలోన పార్వతీదేవి సహస్ర నామములొనర్చి భక్తిఁజిత్తమునఁజేర్చి గ్రక్కునమోదాటె.[21] ఓం రామ రామ రామ రామా, అనాద్యఖిలలోకారాధ్యా, నిత్యజగత్త్రాణా, నిత్య నిర్వాణా, సత్యవ్రతాధీశా, ఆత్మబంధుజనరక్షకా, పరమాత్మా, వినుము. తల్లివి తండ్రివి ధాతవు నీవు. భ్రాతవు నీవు. నీవంటి తేజోమణి నాకు గలుగంగా పాశబంధములూడెను. మోక్షసాధనంబులు మునిగణవర్గజాలంబుల కుపదేశించిన నుపనిషద్వాక్యంబుల మిమ్ము గానంగలేరు. మీకథ లెల్ల(?) మీ నయనంబులు. సూర్యచంద్రమండలంబులఁ బ్రకోశంబులై యుండును, మీ తిరుమేనిదీప్తుల, ఋషులు, ద్వాదశాదిత్యులు, నవబ్రహ్మలు, నేకాదశరుద్రులు,చతుర్దశ భువనంబులు, నింద్రాదిదేవతలు ననేకముఖంబులై యుందురు. దేవా, మీతిరుమేన గలిగిన దివిజులకు మాయ మహాముఖంబులై తోఁచు. దేవా, మీ మాయా దివ్య స్వరూపంబులై నట్టి తేజోమణి రవిప్రకాశంబున రవి నిద్రమేల్కనం దివిజులకు గనిపించె. మీమాయలుగానక దేవా, తిరుగుచుందురు. ఇంద్రాది దేవతలు తిరిగి మీయందు గలిగిరి. శ్రీకృష్ణాయని స్తోత్రము జేయఁగలిగిన మఱి తక్కిన దైవతంబుల మీదంగానరు. బ్రహ్మరుద్రాదులు మిమ్ము వర్ణించలేరు. ఆనాథనాథాయని స్తోత్రంబు సేయ నీ జన్మంబుగలిగెను. మీ నామసంకీర్తనము వలన మిమ్ము గంటిని. మీ దాసులఁగంటిని. చాతుర్లక్షగ్రంథసంకీర్తనములలో నొక్కసంకీర్తన పలికినవారికి, పలికించినవారికి, విన్నవించినవారికి, లిఖించినవారికి సాలోక్య సామీప్య సారూప్య పదపు లిత్తురు. దేవా, మీరు నాకిచ్చిన వైకుంఠం బిత్తురు. మీయాస. మీచరణంబులాన. తప్పదు తప్పదు. సుకృతమే సాక్షి. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

45

దేవా, నేను భూప్రదక్షిణంబు సేసి లోకములు సూచి, మాతా పితామహులకు పుణ్యక్షేత్రంబులఁ గృష్ణార్పణబుద్ధిగాను దానధర్మంబులు సేసి, శ్రీ యహోబిలమును, శ్రీరంగంబును, వేంకటాచలంబును, కాశీక్షేత్రంబును, ద్వారకంబును, నయోధ్యయును, శ్రీపురుషోత్తమమును జూచి, దేవా, మీ గృహంబున కరుగుదెంచిన కవాటంబులుమూయ మీకుఁదగునా? అజ్ఞానిని, యపరాధిని, సర్వేశ్వరా, నీవేతప్ప నితఃపరంబెఱుఁగననిన, గవాటంబులు దెఱచిన, స్వామి సన్నిధికింజని స్తోత్రంబు సేయందొడంగిన స్వామి ప్రత్యక్షమై, నీవు నా సన్నిధిని దాసుఁడవలెంగాక పొడగనవాయని యానతిచ్చిన, దేవా (నీవు) జననీజనకుండకు, దేవా, శిశువునంతటి తప్పుచేసినాను. తెగనాజ్ఞ చేయవచ్చునా యనిన స్వామి తిరోహితుం డాయెను. కృష్ణమాచార్యులు తన గృహంబునకుం బోయెను. కృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ నమో నమో దయానిధీ!

46

దేవా, మీదివ్యనామ సంకీర్తన మెవ్వండాయెనేమి, చేయగా విని యిది హీనము. ఇది హెచ్చు. వర్ణంబులుగావని నిషేధించినవారరువది వేలేండ్లు నరక గోళంబునుం బొందుచుండి యటమీద పిశాచత్వము బొందుచుందురు. దేవా, మీదివ్యనామ సంకీర్తనమెవ్వరు నుతియించిరి, వారెపో మీపరమభాగవతులు. వారెపో యనేక శ్రుతులు పలుకుచుందురు. దేవా, అభ్యసింపరానివి రెండు. ఆచార్య కటాక్షంబొకటి. అటుమీద (మీ) దాసుం డగుటొకటి. దేవా, బహుచింతా సంతతమై చరియించెడు వాయువువలెనే యొకమార్గమనక నీమనసు బహురతింబొందు. అనేక వికృతులం బొందు. చిత్తమా, కైవల్యమునకై నుతింపవే, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

47

దేవా, పర్వతంబునకుఁబోయి శైవులగుదురు. తిరుపతులఁ జూచి వైష్ణవులగుదురు. శక్తిమతంబును జూచి కుశాలులగుదురు. ఇటువంటి మనస్సంచలనమునఁగదా రౌరవాది నరకగతియై యిహపరములు లేకుఁడుట. ఆత్మజ్ఞానులైన జనులే మతాభిమానులు. శాస్త్ర, వైరాగ్యములతో బాధలు చెప్పంబడు, వానినే యవలంబము చేయుదురు. ఈమత మామతమన దిరిగెడు నట్టి కుమతుల నేనేమందు. సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

48

దేవా, కోశమున నొంటరిగాఁజిక్కి యాక్రోశముఁజేసిన కోకిలం జూచి, కాకులు దాని నటునిటుఁ జననీకఁ జిక్కింపజేసిన క్రియను జిక్కు పడి యున్నాడఁను. సంసారతరంగములు మునుఁగు పడనడచిన తెలివిఁ బొందని జంతువును [22]ఝషాది నానావిధముల (జంతువులు) నారపీచువలె నన్నలమిపట్టియున్నవి. ఆకర్మ లనవరతము హరిభక్తిందేలనీయవు. ఈ జంతువునకు, గర్మములనణంచి సుకర్మిని జేయుమయా, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

49

దేవా, బహువిద్యలు (గల)వారినిగాఁజేసి బహురూపంబులఁ బొందజేయకు. ఏవర్ణమైననేమి? మీదివ్యనామ గుణసంగతి గలుగఁజేసి, మీ దాసానుదాసునిగాఁ జేయవే. కరుణాంబుధీ, శ్రీకృష్ణకువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

50

దేవా, గరుడని చేతఁబడియున్న భుజంగముక్రియను, కర్మముల నగపడియున్నాఁడను. నిరంతరము దుర్విషయాటవిలోఁబడి వెలువడుత్రోవంగానక చిక్కియున్నాడను. దేవా, సుజ్ఞానంబను, తెలివినిఁబొందక (యున్న) యీ దుష్టునకు నజ్ఞానంబను నడవిని ఛేదించి పరమ జ్ఞాన మార్గము కరుణించవే. సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

51

దేవా, ఎనుబదినాలుగులక్షల జీవరాసుల యోని ముఖములందు జనియించిన యాదిజీవుండవట! ఆమీద మీగుణకథనము తెలిసికొనుట, నా మీదట నాచార్యుల కృపఁజేరుట, నాసుదర్శన పాంచజన్యంబులు ధరించుట, నా శ్వేతమృత్తికాచూర్ణ ధారణంబగుట, నావిరజానదిందాటఁజింతఁజేయుట, నా చరమార్థంబనియెడు తెప్పఁగట్టి యాద్వయమనవతరంబు సంధించుచు, నంబుజావతారుండగుట, నామీద నిజపుర ప్రవేశంబగుట, మీ సందర్శనంబు గలుగుట, మీరును తానైక్యంబగుట, నాయనంతకోటి సూర్యప్రకాశముతో ప్రజ్వరిల్లెడు (మూర్తి దొరకుట) నిట్టిఫలంబు లొకటొకటియై తోచెడుదేవా, అఖిలాత్మకర్తవై, సింహగిరిపతివై, యనేకజన్మార్జితమైన పాపిని కరుణించవే, పరమమందెన్నడు దొరకునో మీచరణారవింద మకరందము! దీనబాంధవా, సింహగిరి నరహరీ, నన్నవలోకింపు దయానిధీ!

52

దేవా, దేహయాత్రకు మిగిలిన యర్థసమర్పణ ముఖ్యముగాదు. తన్నుడిగిచేయు సమర్పణం బుత్తమాధికారంబు. అనాథపతి సింహగిరీ(నరహరీ)శుండటుగొని అవలోకింపఁడు దేవా, జగదీశ్వరుండితఁడేయని నిగమములెల్లను నాయనంతకోటి సూర్యప్రకాశముతో (బ్ర)జ్వరిల్లెడు (మిమ్ము గుఱించి) చెప్పగా నెఱుంగక, దేవతాంతర మంత్రాంతర సాధనాంతర ప్రయోజనాంతరంబులం గోరెడువాఁడు ద్విజుండుగాడు. శ్రుతి ప్రమాణము చాటించుచున్నది. అటుగాన, ననాథపతిస్వామీ, సింహగిరి నరహరీ, మిమ్ము నెఱుంగని ద్విజున కేది గతి? ఎఱింగింపవే దేవా, ప్రాణము లిహమునఁ జరియింపుచు, దేహాత్మ డెందముల వసియించి, భుజియించి [నవనిపూత] భువనపాలనరక్షకుం డయిన పురుషోత్తముని కృపకు దూరమగుటఁగాన నిహమున కర్హుండుగాడు. మాంసభక్షకులే రాక్షసులు. అటుగాన హింస చేయరాదు. ఇందుకు సాక్షి యేద న్నాయన మా సింహగిరి నరహరి సకలాంతర్యామి యగుట, సకలభూతాత్మకుం డగుట, సకలపరిపూర్ణుం డగుట, సకలజీవదయాపరుం డగుట, సత్యమే సాక్షి. అనాధపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

53

దేవా, మమపురుషాం దేవా, దయాపదా, పరమధర్మనికరా, దుఃఖవిమోచనా, మంగాళాకారా, దోషనిర్హరణా, వినవద్యా, నిరవధికా, నిత్యనిరంజనా, నిర్వికల్పా, నిరాలంబా, నిరాశ్రయా, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

54

దేవా, సద్విజుండు చండాలసతివలన సంగతిఁబడసి నటువలెను, ద్వమైకనిష్టుండు ప్రసన్నురాలిగాని భార్య నేలందలంచిన, యట్టివారెల్ల ననాథపతీ,స్వామీ, సింహగిరి నరహారీ, పరో.... ........రు.[23] కాన సింహగిరి దేవా, పరమపదనివాసుని దయను, భూలోకంబునఁ బుట్టవలసి సంతూరను జనియించి, (దుష్ట)నక్షత్రమున వ్యతీపాతయోగంబున జనియించియుండెనని, తన్ను రోసి తన జననీజనకు లంధకారంబైన కూపములో వైచిన, రోదనము చేయుచుండగాను, నొకసన్యాసిశిరోమణియైన కువ్వా రేతెంచి యద్భుతంబని నన్ను దిగిచి మఠములోఁబెట్టి, యీ బాలుండు పురుషాకారము గలవాఁడు. ఇతని నేవిధమున నైనను బోషింపవలయునని తలంచి కొన్ని వర్షంబులు పెంచి, యంతట సంతూరు విడిచి సింహాద్రి స్వామి సన్నిధికిఁ జనునప్పుడు నన్ను మఱవకుమని పలికిన కువ్వా రప్పుడు స్వామిసన్నిధికిఁ జనెను. త్రిరాత్రంబులు శిశువు చూచి సింహగిరీశుండైనస్వామి తనమీద దయదప్పెనోయని యున్న సమయంబున, బాలరూపంబున వచ్చినస్వామి క్షీరంబులు దెచ్చి యుపయోగింపుమనినఁ బుచ్చుకొని లోపలికేగి హస్తముల నయనములు దుడుచుకొన్న సమయంబున నంధత్వముమాసె. (అతడా)శ్చర్యపడి నిద్రించు సమయంబున స్వామి తన స్వప్నంబున వరాహరూపంబునఁ బ్రత్యక్షంబై , నాసన్నిధిని సంకీర్తన నామోచ్చరణంబులు, నుపనిషద్వాక్యంబులును, పరమ(భక్తి భరిత)చాతుర్లక్షగ్రంథసంకీర్తనములు చెప్పుమనెను. 'నేనెక్కడ? నామోచ్చారణం బెక్కడ? జదుండను, మూడుండను. అనిన స్వామి యుపదేశము జేసిరి. తాను పురోహితుని గృహంబునకుం జని తనకు సంకీర్తననామోచ్చారణం బుచ్చరింప ముహూర్తము బెట్టుమనిన విప్రుడు హాస్యముచేసె. స్వామి తన వాక్యములు నిలుపుకొని వికృతిసంవత్సరంబున జన్మంబును(బొందుటయు), పరాభవ సంవత్సర ఆషాఢ శుద్ధ ద్వాదశినాడు చిటితాళంబులను బూని సంకీర్తన చేయుచుండగాను, నంతట కువ్వా రేతెంచి, యాశ్చర్యపడెను 'మీ సందర్శనంబున, గృతార్థుండనైతి' ననిన కువ్వారు 'నామోచ్చారణంబు సత్యంబు'ననగా, నన్నేలినస్వామి నన్ను రక్షించుగాక. శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

55

దేవా, (యమునా) గోదావరి యావల శ్వేతద్వీపమందు మా మేనమామ శ్రీరంగాచార్యులు గలరు. వారి (కుమార్తె) యందు తిరుకల్యాణము గాబోవుచున్నాఁడను. ఇది మీకు విన్నపము సేయుచున్నాఁడను తిరుకల్యాణమునకు పనివినవే దేవా, యని మీరు విన్నపము సేసిన 'నేను వేంచేసెదనోయి కృష్ణమాచార్య'యని యానతిచ్చిన 'ఓం నమోనారాయణాయ, మీరేల వేంచేసెదరు! ప్రహ్లాదవరదా,' యటంచు మీకు విన్నపము సేసిన 'నట్లు గాదోయి, కృష్ణమాచార్యా, నీవు పదునొకండవ యవతారుండవు. లీలావినోదముతో నీ తిరుకల్యాణము చూడ వేడుకయ్యెను. నేనును వేంచేసెదను.' అని యానతిచ్చిన 'నట్లే కానిండు. ఓం నమో నారాయణాయ. ఇది మీరెఱుంగుదురో యెఱుంగరో, మిమ్మెవ్వండు నమ్మవచ్చునా? ఓం నమోనారాయణాయ. జగన్నాటక సూత్రధారివి గావా! సుగ్రీవుని చేపట్టి వాలిని మర్దించిన వాఁడపు గావా! మిమ్మెవ్వండు నమ్మునే? నమోనారాయణాయ. మిమ్మునమ్మరాదు,' అనిన, 'రావోయీ, నేవచ్చెదను, లక్షి తిరుకల్యాణమునాడు సురాసుర యుద్ధమాయెను. వేదశాస్త్రఘోషంబై యుండెను. రుక్మిణి తిరుకళ్యాణమునకు శిశుపాల యుద్ధమయ్యెను. ఏతిరుకల్యాణమునకు వేడుక చాలదాయెను. నీ తిరుకల్యాణము చూడవచ్చెదనోయీ, కృష్ణమాచార్యా'. ఆ క్షీరసాగరమధ్యమందున్న వైనతేయుని నీ విధమున స్తోత్రము సేసితిని. “భద్రబదంతే జవ్వలతో దృపాఅపస్సమాః! మద్యమకేశవా ఓం హవాం! పాత తపోమధ్యానాత! అఖిలాండజారజాం" ఆక్షీరసాగరమధ్యమందున్న వైనతేయుండు పనివినియెను. దేవా, వైనతేయునెక్కి మీరును వేంచేసితిరి. దేవా, మామామ శ్రీరంగాచార్యులు నాతిరుకల్యాణ మేవిధమునఁ జేయుచున్నాఁడు విన నవధరింపుము. కృష్ణార్పణముగా దానములు గావించెను. వైష్ణవులకు మధుపర్కములు సమర్పించెను. నాయింతికి నాకును నిష్ణాన్నమును భుజింపఁజేయునప్పుడు మీరు వేంచేసి, 'యిదియేమి? కృష్ణమాచార్యా, మీరే భుజించుచున్నారు? నేను మహాయలపై యున్నాఁడను. తళియవడ్డించవోయి, కృష్ణమాచార్యా'. యని యానతిచ్చిన మీకును తళియ వచ్చెను. (మీరును) నేనును భుజియింపంగాను నచ్చటికి శ్రీరంగాచార్యులు వేంచేసి, 'యదేమి కృష్ణమాచార్యా, ఇతడు చరముండై యున్నాడు. మీకును యజ్ఞోపవీతములులేవు. ఇతఁడు వైష్ణవుడని తళియవడ్డించితివి. వైష్ణవులకు మధుపర్కము లిప్పించితివి. శూద్రునకు నిష్టాన్నమును భుజింపఁబెట్టితివి. నీవు వెలి'యని మామామ వెలివెట్టి నన్ను తిరుమాళిగనుండి వెళ్ళం ద్రోచెను. దేవా! మిమ్ము నెవ్వండు నమ్మును? దేవా, ఓం నమో నారాయణాయ, తిరుకల్యాణము విఘ్నముచేయవలసి వేంచేసినారుగాన మిమ్మెవ్వండు నమ్మును? ఓం నమోనారాయణాయ. ఆచార్యులే గతి నిన్ను మేమొల్లమనిన విని, 'ఓయీ, కృష్ణమాచార్యా, నీకింత ప్రలాపంబేమిటికి? మానుమనిన నట్టిదే కానిమ్మని ఓం నమోనారాయణాయ యంటిని. ఆ రాతిరి (మీరు) శ్రీ రంగాచార్యుల స్వప్నమందుబోయి, కృష్ణమాచార్యులయింతిని యాయన తిరుమాళిగకు వెంటఁబెట్టుకొనివచ్చి దిగవిడువుమన్న మాటకు (నాతఁడు) దండము సమర్పించెను. శ్రీ రంగాచార్యులు తమ తిరుమాళిగకు వేంచెసిరి. ఇదియే నా విన్నపము. ఓం నమోనారాయణాయ. ప్రహ్లాదవరదా, మీకన్న నధికులు లేరు. నాకన్న నధములు లేరు. నాయింతిని నాకు నంపించితిరి. వెలియన్న మాటకు దండము సమర్పింపజేసితిరి. మీకగపడి యున్నాఁడను. నాకంత మెన్నడు! విషయాటవిలోఁ బడి, వెడలెడు త్రోవఁగానక చిక్కియున్నాఁడను. సంకీర్తనమిది. (ఇందు) పరమ రహస్యమున్నది. ఇందు ఋగ్వేద మున్నది. యతిరామానుజముని వరము, దాతారు, అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

56

దేవా, విప్రగోవధ లనేకంబు లొనర్చి సురాపానసువర్ణఘాతుకాది మహాపాతకంబులు చేసినయతండైనఁగాని, యేకనిమిషంబున మీ దివ్యనామసంకీర్తన చేసినతండే నారాయణశ్రేష్ఠుండు కాకుండునా? ఇతరులు మెచ్చవలెనని మనస్సు వేఱోక్కచో నిలిపి మిమ్ము నుతిచేసెనేని జారిణిని పతివ్రతయని నమ్మవచ్చునా? అట్లేయిట్టివారు. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

57

దేవా, నేను చిన్ననాడు చేసిన యఘాయిత్యము జెప్పుచున్నాఁడను. దేవా, ఒక కోమటి పిన్నవాఁడును, నేనును కోటి కోడిపుంజుల జూదమాడగాను నా కోమటిపిన్నవాఁడు తొంబదిలక్షల పైకాలకు పందెమొడ్డెను. నేనును, మీ తళియప్రసాదములపై పందెమొడ్డితిని (!) ఇట్లు నా కోమటి పిన్నవాని కోడియు, నా కోడి యు నేవిధమున యుద్ధము చేయుచున్నవి. దేవా, “ఘటితముఖవరదధిత సంధిత కౌస్తుభాంశు .... మకుట కఠోరవందిత కుంభినీజయ శోభితమ్! కనకఘనపీతాంబరాచ్యుత కౌస్తుభాజయశోభితమ్ గీతడోలక ఆదిజం! కిణికిణింకిణి! కిణికిణింకిణి! కిణికిణింకిణి! కణికిణింకిణి! దేవా, అనాథపతీ స్వామీ, సింహగిరి నరహరీ, ఈ గీతమువిధంబున యుద్ధము సేయుచుండగాను, నా కోమటిచిన్నవానికోడి తన్నెను. నా కోడి మృతమాయెను. కోమటి చిన్నవాఁడు తనకోడి గెల్చెనటంచు తిరువీథులను పౌరుషంబులాడగాను నేను కామక్రోధలోభమోహమదమాత్సర్యంబుల తొంటి మదోన్మత్తుండనై యా కోమటిచిన్నవాని తిరుకుచ్చుపట్టి[24] మాఱితిని. (?) ఆ కోమటి చిన్నవాఁడు మృతుండాయెను. దేవా, వాని ప్రాణవాయువులు వాని కిచ్చెదవా యియ్యవా యనిన నతని ప్రాణవాయువు లీయకున్నను జూచి, దేవా, మీరు శబరి ఎంగిలి తిన్నది చెప్పుదునా, యతని ప్రాణవాయువు లిచ్చెదవా యియ్యవా యనిన నతని ప్రాణవాయువు లీయకున్నను జూచి, దేవా, మీ రంధకాసుర తాటకాసుర విదళితాసుర ధేనుకాసుర సోమకాసుర కంసాసుర (వధల) లోపల నపశబ్దంబులు భాషించినవి చెప్పుదునా, యితని ప్రాణవాయువు లిచ్చెదవా యీయవా యనిన నతని ప్రాణవాయువులీయకున్నంజూచి, 'నీకు చాతుర్లక్షగ్రంథసంకీర్తన కాయను మాతల్లి కడవాడవా? నీవు మా కెన్నాళ్ళ ఋణస్థుండవో! నీకు నే నెన్నాళ్ళ ఋణస్థుండనో!' యటంచు మీకు విన్నపము చేసిన నాకోమటి పిన్నవాఁడు దిగ్గనలేచి కూర్చుండి యందెలు మువ్వలు మ్రోయగాను తన గృహంబునకుఁ బనివినియెను. దేవా, నీ వాకారసుకృతివి. ఇది పూర్వ భాగసంకీర్తన (!) ఇది దానసంకీర్తన ఇది (?) పరమరహస్యము. శ్రీకృష్ణకువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

58

దేవా, దినదినంబులు దుర్భాషలాడిన నాదు జిహ్వకు మీ దివ్యనామసంకీర్తనం బొకటి చాలదా? పంచమహాపాతకశతకోటి హతము చేయను, దూదికొండకు సహస్రభాగ మనలము చాలదా దహింప? శ్రీకృష్ణకువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

59

దేవా, పరంజ్యోతిపరతత్త్వంబైన యాది నారాయణశ్రేష్ఠుండు లోకంబుల విహరించుచు నుత్పత్తిస్థితిలయంబులు సేయుచుండి యొకనాడు లక్ష్మీభూకాంత నీళలతో వినోదించుచుఁ, దారకబ్రహ్మంబైన రహస్యంబులు దెలుపుచు సుఖగోష్ఠిని వైకుంఠవాసుండై యున్న సమయంబున భూలోకంబున ధర్మాధర్మంబులు లేక ననేకజనులు దేవతానమస్కారంబు లుడిగి రాక్షసకృత్యంబులు గైకొని దుర్బలులై, వర్ణాశ్రమంబులు లేక చండాలగోష్ఠిం జరియించుచు, గోవధయు, విప్రవధయు ధనచోరత్వంబునను, మద్యపానంబులను, దెగించి శక్తిమయంబైన వివిధభంగుల విహరించుచున్న యాగడంబుజూచి, యింద్రుండును, దేవతాసమూహంబులను, యక్షులను, గంధర్వులను, పన్నగులను, వాసుకి (?) పుండరీక యాజ్ఞ్యవల్కులను, భరద్వాజ గౌతమ వశిష్ఠ గార్గ్య దీప్తిమంత నారదాదులైన మునిగణంబులఁ జూచి, 'యుగధర్మము విపరీతమాయెను. రక్షకుండును, శిక్షకుండును నైన పుండరీకాక్షుఁడున్న యెడకుఁ బోదము రమ్మ'నుచు, నజాండంబునకుఁ జని బ్రహ్మను గూర్చుకొని, కైలాసంబునకుఁ జని, శంకర ద్వారంబునకు వచ్చి కమలజుండు శంకరునితో నిట్లనియె. 'యుగయుగంబుల స్వామి యవతారంబు లెత్తి యోంకార రూపంబునఁ జరియించెడు గానఁ బుణ్యం బిది, పాపం బిది, యని యెఱుంగక జను లధోగతిం బడుచున్నారు. ఇందులకుఁ గర్తయు భోక్తయునైన పురుషోత్తమునికి విన్నపము చేయుదము, రండ'నుచు బ్రహ్మయు, శంకరుండును వైకుంఠంబునకుఁ జని, చక్రధారులును, ఫాలప్రదేశంబున తిరుమణి శ్రీచూర్ణములును జపమాలికాశోభితులైన పుణ్యులును, వేద శాస్త్ర పురాణ నామోచ్చారణంబులం బొదలెడు వారలును, శమదమాది గుణంబులఁ బ్రీతింబొందియున్న వారలును, విష్వక్సేన గరుడ జయ విజయ కుముద కుముదాక్షులును జేరి యుభయపార్శ్వంబుల సేవ చేసి విహరించుచున్న వైకుంఠపురంబు చేరిరి. శ్రీకృష్ణకువ్వారుస్వామి, దేవా, ఓంనమోనరహరీ, యనుచు పరంధాముని నగరివాకిటికిఁ జను దెంచి, నారదుఁడు వీణియ మీటి యాలాపనచేసి యాడుచుఁ బాడుచు నున్న సమయంబున నాదిశేషశయనుండై యుండి లక్ష్మిని జూచి యిట్లనియె, నాదాసులైన వారలు నన్ను బేర్కొనుచున్నారు. శ్రీవైష్ణవులను మన్నన చేయవలె. పోదమురమ్మ 'నుచు దేవ సంఘంబులున్న కడకు చనుదెంచెను. శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

60

దేవా, ఒకపరి మిమ్ము నెఱుంగుదుమయ్యా. ఒక పరిమిమ్ము నెఱుంగమయ్యా, జ్ఞానిని చేయుమయ్యా. అజ్ఞానిని జేయకుమయ్యా. పుణ్యం బిది, పాపం బిది, స్వర్గం బిది,నరకం బిది, యాచారం బిది, యనాచారం బిది, నిషేధం బిది, యనిషేధం బిది, వావియు నిది, వరుసయు నిది, వర్తనం బిది, వివేకం బిది, యవివేకం బిదియని యనేక కర్మతంత్రంబులు ఘటించి యసంఖ్యజీవకోట్లం బుట్టింపుచు, పెరిగింపుచు, నణగింపుచు, బహుమాయల బహునాటకసూత్రధారివై యాశాపరుండవై, కులజుండవై, నిర్జీవుండవై, జీవంబులన్నియు నీవై, యేకమై, యనేకమై, యాకాశంబై, యనాకాశంబై, నిలకడయై, బయలై, వినోదించుచు, నింద్రజాల మహేంద్రజాల విద్యలం బచరింపుచు, పశుపక్షి నరమృగ క్రిమికీటక పిపీలికాదుల ప్రాణంబులు నీవై యున్న, నీ మహత్త్వము దెలియ బ్రహ్మ రుద్రాదులును, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్య రుక్మాంగద విభీషణాది పరమభాగవతులు మిమ్ము నుతియింపలేరు. మిమ్ము నుతియించ నేనెంతవాడను? అధమాధముఁడను, నరపశుఁడను, నీవు గాచి రక్షింపవే. ఆనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

61

దేవా, ఆకలు యనియెడు తెవులింటింటికి దిప్పు. అసత్యకృతమే ముప్పు. తగవు. ధర్మము నడిపినదే యొప్పు. అనాథపతీ, నరహరీ, మిమ్ముఁ దలంపనిదే తప్పు, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

62

దేవా, హిరణ్యనాభికమలంబునఁ దామసగుణంబుస సరస్వతీ(పతియు) నేనును (?) బుట్టితిమి, ఈ విధంబునఁ గారణకర్తలైన మా యందు విశ్వప్రపంచంబు పుట్టింపఁదలంచి, పంచశతకోటియోజన పరిమాణంబును, కోటియోజనంబుల యౌన్నత్యమునుం గలిగి హిరణ్యమయంబుగా నొక్క యండంబు గల్పించె. అయ్యండంబు బ్రహ్మాండం బనంబరగె, అం దాకాశంబు కల్పించె, ఆకాశంబువలన వాయువు, వాయువు వలన నగ్నియు, నగ్నివలన జలంబును, జలంబువలనఁ బంచమహాభూతంబులును గల్పించె. అందాకాశంబునకు శబ్దంబొకటి గుణంబయ్యె. వాయు తేజములను గుణద్వయంబు పుట్టె. తేజంబునకు శబ్దస్పర్శ రూపంబులను గుణత్రయంబు కల్పించె. జలంబువలన శబ్దస్పర్శ రూపరసంబులను నాలుగు గుణంబు లుద్బవించె. పృధ్వివలన శబ్ద స్పర్శ రూపరస గంధంబు లేనునుం గలిగె. ఇట్టి పంచమహాభూతంబులకు సావధానంబులుగా స్వర్గ మర్త్య పాతాళంబులను జగత్రయంబుల నిర్మించె. స్వర్గంబున దేవతలును, మర్త్యంబున మనుష్యులును, పాతాళంబున రాక్షసులును నుండ నియమించె. తదీయాంతర్గతంబులయిన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకంబు లనియెడు నేడు లోకంబులను, నతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాళలోకంబులనియెడు నేడులోకంబులును, చతుర్దశభువనంబులును బ్రవరిల్లుచుండె. ఆ చతుర్ముఖునకు నాల్గువదనంబుల యందును ఋగ్యజుస్సామాధర్వణంబులను నాల్గు వేదంబులు ప్రవర్తిల్లుచుండె. వానియం దనంతంబులై వేదంబులు ప్రభవించె. అంత నయ్యజునకుఁ బ్రపంచనిర్మాణసహాయులై మరీచ్యత్రి భృగువిశ్వావస్వంగీరస పులస్త్య పులహ క్రతు దక్ష వశిష్ట నవబ్రహ్మ లుదయించిరి. మఱియు విశ్వదేవతలను, విశ్వకర్మ నారద సనకసనందన సనత్సుజాతాశ్విన్యాది దేవత లుదయించిరి. మఱియు వరుణుండును, ధ్రువుండును, సోముండును, నహుషుండును, నజయుండును, మృగుండును,మృగవ్యాహుండును, ననిలుండును నను నెనమండ్రు వసువు లుద్భవించిరి. స్వాయంభువ, స్వారోచిషోత్తమ తామసరైవత చాక్షుషవైవస్వత సూర్యసావర్ణి దక్షసావర్ణి బ్రహ్మసావర్ణి రుద్రసావర్ణి ధర్మసావర్ణి దేవసావర్ణి ఇంద్రసావర్ణి యను పదునలుగురు మనువు లుదయించిరి. అందొక్కని మన్వంతరంబునకు మనుపదంబున నుండ నియమించి మనుసహాయులైన ధాతయు విధాతయు నుద్భవించిరి. మఱియు శంకరుండును, స్థాణుండును, శర్వుండును, మృగవ్యాధుండును, నేకపాదుండును, జక్షకుండును, నహర్భధ్యుండును, పినాకియుఁ, బావకేశ్వరుండును, గపాలుండును, ననపేతుండును ననురుద్రు లుదయించిరి. వానియందు గణపతియు, షణ్ముఖుండును, నుదయించిరి. శ్రీమహావిష్ణువునకు మన్మథుండును, మోహ(న) స్తంభన వశీకరణ సంతాప నాకర్షణోచ్చాటన ప్రపంచ పంచబాణ నిరంచిత సకల ప్రపంచితులు దయించిరి. అంత మరీచీ పుత్రుండైన కశ్యపప్రజాపతికి దక్షపుత్రియైన యదితికి సూర్య ఖగ త్వష్ట వివస్వత మిత్ర వింధ్యాంశుమతి గభస్తిపద్మ విష్వ్ణింద్రవరుణులను ద్వాదశాదిత్యు లుదయించిరి. తదనంతరంబు నత్రికి ననసూయకు చంద్రుం డుదయించె (దక్షప్రజాపతికిఁ) గూతురైన యశ్వని భరణి కృత్తిక మొదలైన యిరువదియేడు తారలు చంద్రునికి భార్యలైరి. మఱియును నింద్రాగ్ని యమ నైరృతి వరుణవాయు కుబేరేశాన్యులను అష్టదిక్పాలురను సృజించి, వారిని యష్టదిక్కులను నియమించి సరస్వతి సభాపతి రయమతి గాసతి దాంతి దాంతియును (?) నలకయును నీశాన్యయును నష్టపురంబులు వా(రికి ప్రసాదించితివి). అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ.

 1. కుంతిభోజుండు ?
 2. భరతాగ్రజా
 3. విక్షేప
 4. సిద్ధ
 5. స్వాన్వయమే?
 6. ఇచట నాలుగు పంక్తు లస్పష్టముగా నున్నవి.
 7. తులసి కాననం యత్ర, యత్ర పద్మవనానిచ, యత్ర భాగవతాస్సంతి తత్ర సన్నిహితోహరిః
 8. కుండల?
 9. ఇచ్చట కొద్ది గ్రంథపాతము.
 10. శ్రీకార్యపరులకు?
 11. సర్వం
 12. ఈ వచనము సర్వశబ్దములు విష్ణువాచకములు — అన్నయర్థమును ప్రతిపాదించునదిగా నున్నది.
 13. ఇచట "దక్షాధ్వరం బెక్కి" అని కలదు. కాని యర్థము పొసగదు.
 14. "వినఁదలచి" యను నర్థమున ప్రయుక్తము
 15. ఇచట గ్రంథపాతము, కొన్ని వాక్యములు పోయినవి.
 16. ఇచట గ్రంథపాతము, కొన్ని వాక్యములు పోయినవి.
 17. ఇచ్చట కొద్ది గ్రంథపాతము.
 18. "కనకమయిపట్టణప్రాకారగగనమధ్యవీథియందు" అని కలదు.
 19. ధాతువుల
 20. హాచ్చాదిత?
 21. "మోదాటు" దీనియర్థము కాన్నించదు. "ముక్తిఁ జెందు" కావచ్చును.
 22. ఈషణాది
 23. కొద్ది గ్రంథపాతము.
 24. పరిమాఱితిని (?)