సింహగిరి వచనములు/మొదటి అనుబంధము

వికీసోర్స్ నుండి

సింహగిరి వచనములు

మొదటి అనుబంధము

1

దేవా, ‘ఏకో విష్ణుర్మహద్భూత’ మ్మనియెడి మీ స్మృతులు సుర లెరుంగుదురు. మీ శూరత్వంబసురులెరుంగుదురు. మీమీది భక్తి తాత్పర్యంబు ప్రహ్లాదుడెరుంగును. మీ మూలంబు రుక్మిణీదేవి యెఱుంగును. మీకు గంధం బొసంగుట కుబ్జ యెఱుంగును. మీ పరమ దయాళుత్వంబు గజేంద్రుండెఱుంగును. మీ బాలప్రభావంబు యశోదాదేవి యెఱుంగును. మీ బాలస్నేహంబు కుచేలుండెఱుంగును. మీ కృప ఘంటకర్ణుడెఱుంగును. మీ మహత్వంబు విశ్వామిత్రుడెఱుంగును. మీ శాంతి శమదమాది గుణంబులు భృగుండెఱుంగును. మీరు కుంటెన నడచినతనంబు తొండరడిపొడి యాళ్వారెరుంగుదురు. మీ విలువిద్య యింద్రధనస్సు ఎరుంగును. మీ తెంపు వైనతేయుండెరుంగును. మీ (జి)హ్వ రుచి విదురుడెరుంగును. మీ పండు ఫలంబుల రుచి శబరి యెరుంగును. మీ పరాక్రమంబు రావణుడెరుంగును. మీ సత్యంబు విభీషణుండెరుంగును. మీ కిరనుకొన్న స్థలంబు వైకుంఠంబెరుంగును. మీరు శయనించిన స్థలంబు క్షీరాబ్దియెరుంగును. మీరు పోషించిన భావంబు శేషుండెఱుంగును. మీ హస్తంబుల రుచి యమృతంబెరుంగును. మీ వాక్కుల రుచి పురుషసూక్తంబెరుంగును. మీ కంఠంబుల రుచి కౌస్తుభమణి యెరుంగును. మీ నాసికంబుల రుచి పారిజాతంబెరుంగును. మీ కన్నుల రుచి పరమ భాగవత ప్రపత్తి యెరుంగును. మీ భుజఫరాక్రమంబు శంఖ చక్రమంబులెరుంగును. మీ లలాటంబు (రుచి?) తిరుమణి శ్రీ చూర్ణంబులెరుంగును. మీ నామరుచి పార్వతీ దేవి యెరుంగును. మీఋగ్యజుస్సామాధర్వణవేదంబులెరుంగును. సనక, సనందన సనత్కుమార యోగీశ్వరులెరుంగుదురు. మిమ్ము పూజసేయ నేనెంతటివాడ. అధమాధముడ. నరపశువును. అజ్ఞానిని. నీవాపదుద్ధారకుండవు అనాథపతీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

2

దేవా, మీ యవతార వినోదంబులు సహస్రంబులు. పంచశతకోటి భూమండలంబు జంతురాసులయందు జనియించి సన్యాసి శిరోమణి యైన సిరికృష్ణువలన మిమ్ము నెరింగితిని. నా కర్మంబులు విసర్జించితిని. దేవా, భూలోకంబునగల యవస్థలన్నియు జూచి నిర్దయాధికారినై పరమరహస్య పురాణేతిహాసాగమ మంత్రాక్షరంబులు పరివేష్టించి చూచిన మీదివ్యనామ సంకీర్తన గతిగాని మరి యితరంబులేదు. చాతుర్లక్ష గ్రంధ సంకీర్తన నామోచ్చారణంబులు పరిపూర్ణంబైన నాకు పరమపదంబు ప్రసాదించు మనిన, అట్టే కానిమ్మని యా సర్వేశ్వరుండు శంఖ చక్ర గదాధరుండై ప్రత్యక్షంబై వైకుంఠంబు సహస్రద్వారంబులు మీ దాసానుదాసులైన పరమభాగవతులకు వైకుంఠంబు ప్రసాదింపుము. ఇందు ఒక వాకిట పుణ్యతీర్థసారంబైన దేవసమూహంబులు శతసహస్రయుతసంఖ్యలు కాచుక యుందురు, ఒక వాకిట తిరుపల్లాండు మెదలైన యాళ్వారులు, హరిదాసులు అరువది వేలు లక్షలు గాచుకయుండురు. ఒక వాకిట గోవింద తొండరులు తొంబదిలక్షలు గాచుకయుందురు. ఒక వాకిట మణి మాధవులు మూడు లక్షలు గాచుకయుండురు. దేవా, ఒక వాకిట జయమణి విజయాదులు డెబ్బది లక్షసంఖ్యలు మిగిలి వేత్రదండహస్తధరులై సేవింప, ఒక వాకిట కుముదకుముదాక్షులు శతసహస్రంబులు గాచుక యుందురు. ఒక వాకిట ఋగ్వేదంబును, ఒక వాకిట యజుర్వేదంబును, ఒక వాకిట సామవేదంబును, ఇంకొక వాకిట అధర్వణవేదంబును, ఒకవాకిట నానాగమపురాణేతిహాస మంత్రాక్షరంబులును, ఒక వాకిట ఉపనిషద్వాక్యంబులును, ఇవ్విధంబున తమ తమ నిజాకారంబు గైకొని ఒక్కొక్క ద్వారంబున కోటి సంఖ్యలు గాచుకయుందురు. ఇటువంటి పరమ పదమునకు జనియెడి మార్గంబు - భూలోకంబుననుండి చరమదేహంబు దిగనాడించి నిర్మలంబైన దివ్యదేహంబు ధరియింపంబడి భూలోకంబునకు సూర్యమండలంబు లక్షయోజనంబులు గడచి, తారామండలంబునకు, ధృవమండలంబు డెబ్బది మూడు లక్షల యోజనంబులు గడచి, ధృవమండలంబునకు పితృలోకంబు మున్నూ టముప్పది లక్షల యోజనంబులు, పితృలోకంబునకు సత్యలోకంబు సహస్ర లక్షలు గడచి, సత్యలోకంబునకు సర్వేశ్వరుండున్న సన్నిధానంబునకు సహస్ర కోట్లు గడచి, యిటువంటి పరమ పదమునకు అనేక లక్ష యోజనంబులు చనుచుండంగాను, ముందరనొక తిల వృక్షంబు గలదు. ఆ తిల వృక్షంబు నలువది నాల్గు లక్షల యోజనంబుల పొడవును గల (తిల వృక్షంబు గల)దు. ఆ తిలవృక్షంబు తన మోక్షాపేక్షితులై త్రియంబక వాసు(మ?) దేవాదులు త్రింశత్కోట్లు గాచుక యుందురు. ఆ తిల వృక్షము ప్రదక్షిణముచేసి మరియు అనేక లక్షయోజనంబు(లు) చనుచుండగాను ఆముందర మద్ది వృక్షంబు గలదు. (ఆ మద్ది వృక్షంబు) అరువది యెనిమిది లక్షల యోజనములు విస్తారమును ముప్పది లక్షల యోజనముల పొడవునుంగల మద్దివృక్షంబు క్రింద భూలోక, భువర్లోక, సువర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకంబులనియెడు మీదేడు లోకంబులును; అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకంబులనియెడు క్రిందేడు భువనంబులును (మీదేడు భువనంబులును) గూడుకొని, యొక బ్రహ్మాండంబనిపించును. ఇట్టి బ్రహ్మాండంబులు అనంతకోట్లు. ఆమద్ది వృక్షంబు క్రిందను మోక్షాపేక్షితులై తపంబొనర్చెడి మహాత్ములంబొడగని ఆ మద్ది వృక్షంబునకు ప్రదక్షిణంబుచేసి, మద్దిగడచి యనేక లక్షయోజనంబులు చనుచుండగాను, ముందరనొక అంధకారమైన నది కలదు. అంధకారమైన నదిని తీర్ధమాడెను. అక్కడనుండి అహంకార మమకార షడాకార (అరిషడ్వర్గ?) షడోన్మయ (షడూర్మిమయ?) శ్రీలింగ(?) ఈషణత్రయ, మఖత్రయ, అవస్థాత్రయ, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక సుఖదుఃఖ సముద్రములు గూడి వర్తించెడి మాయా పురుషుండు మరిచి చనుదెంచి మహ త్తనియెడి లోకంబు ప్రవేశించి యుండును. అంధకారమైన నదిగడచి మరియు ననేక లక్షల యోజనంబులు గడచి చనుచుండగాను ముందరనొక నిప్పులయేరు గలదు. ఆ నిప్పులయేరు సమీపమునకుంజని కృతాంజలియై యిమ్మహావైతరణి తరియింప నేదియుపాయ మని చింతించుచున్న సమయంబున వైశ్వానరుండును అగ్నిభట్టారకుండు ఎదురుగా జనుదెంచి ఆ భాగవతోత్తముకు సాష్టాంగదండప్రణామంబు లాచరించి అనేకకాలమునాటి బాంధవులు వేంచేసిరని(న) దివ్యవిమానారూఢులంజేసి యా నిప్పులయేరు ఈవలికి వెడలించెను. ఆ నిప్పులయేరు ఆవలికి వెడలి మరియు అనేకలక్షల యోజనంబులు చనుచుండగా ముందట నొక వృక్షంబు గలదు. ఆ వటవృక్షంబు ఇరువది తొమ్మిది లక్షల యోజనముల విస్తారమును,ఎనిమిది లక్షలయోజనంబుల పొడవుంగల (వటవృక్షంబుగల) దు. ఆవటవృక్షంబు క్రించ చతుర్భుజావతారులైనహరిదాసులు అనంతకోట్లు వేంచేసియుందురు. ఆవటవృక్షంబునకు ప్రదక్షిణాకారంబు (ప్రదక్షిణ నమస్కారంబు?) చేసి ఆవట వృక్షంబు తూర్పుభాగంబున విరజానది గలదు. ఆ శ్రీ విరజానది మున్నూటముప్పది మూడులక్షల యోజనంబులు విస్తారమును దశలక్షల యోజనముల పొడవును గల శ్రీవిరజానదితరియించెడిది యేది యుపాయమో దైవమా యని చింతించుచున్న సమయంబున భూలోకంబున తాజేయు ధర్మపరోపకార భగవద్బాగవతకైంకర్య(ములు), శ్రీయేకాదశి, శ్రీరామనవమి, శ్రీకృష్ణజయంతి మొదలైన(వి); అన్నదాన, గోదాన, భూదాన, హిరణ్యదాన, వస్త్రదాన, హిరణ్యగర్భరత్నదానాదులు మొదలైన మహాపుణ్యమార్గంబులన్నియుం గూడి యొకనావయై వర్తింపుచుండును. హరిపదధ్యాన, పురాణశ్రవణ, నక్షత్రహరిదర్శనంబనియెడు, ఆత్మజ్ఞానంబనియెడు పరమాత్మ పిపీలికాండై అ(ఆ?) ధర్మనావ చనుదెంచును. ఆనావయెక్కి చరమజ్ఞానంబనియెడి వాయువేగ మనోవేగంబున ఆశ్రీవిరజానదికిదరిని తీర్థంబొనరించిన ఆ శ్రీ విరజానదిని ఆతిరుమేను వైచి, పసిడి తిరుమేను ఎత్తి, నిలువంబడియున్నంత శ్రీవిరజానది ఆవలిదరి వెంట అరువదికోట్ల హరిదాసులు ఎదురుగా వేంచేసిరి. ఆ భాగవతోత్తములను గాఢాలింగనంబు చేసిన మేనునిమిరి, అనేకకాలమునాడు బంధువులు వేంచేసిరని మహావైభవంబుతోడను శ్రీవిరజానది దరివెంట మరియు అనేకలక్షల యోజనంబుల పొడవుంగల అశ్వత్థనారాయణుండు గలడు. ఆయశ్వత్ధమునకు ప్రదక్షిణాకారముచేసి, అక్కడకు లక్షయోజనంబులు చనుచుండగా ముందర దివ్యపదంబై న పరమపదంబు గానుపించెను. ఆపరమపదము మున్నూట ముప్పదికోట్ల విస్తారముసు, ఏడుకోటున్నర (ఏడున్నరకోట్లు?) పొడవుం గల దివ్యపదంబై న పరమపదంబు బొడగని, అనంతములైన సాష్టాంగములు చేయుచున్న, అనంతకోటి సూర్యప్రకాశంబున ప్రజ్వరిల్లెడు పొడ గనిన నన్ను త్రింశత్కోటి ద్వారపాలకుల సేవించిన, ఆ త్రింశత్కోటి ద్వారపాలకులు ఎదురుగా జనుదెంచిన ఆ భాగవతులకు దండప్రణామంబు లాచరించి అనేకకాలమునాటి బంధువులు వేంచేసిరని, మహావైభవంబులతోను పరమపదములోపలికి వేంచేయుడన్న ఆ పరమపదములోపలి మణిగోపురము, మణిధ్వజమణిప్ర(ప్రా)కారము జేగీయమానంబులైన చిత్రజాలకంబులైన తిరువీథులు, అనంతకోట్లు తిరువీథులవెంట చనుదెంచెడి సమయంబున అధ్యాంతరారంబున (ఆభ్యంతరంబున?) రత్నాలసావడి గలదు. ఆసావడి మీదను సాలోక్య, సామీప్య, సారూప్యధారులు సహస్రకోట్లు వేంచేసియుందురు. ఆరత్నాలసావడికి ప్రదక్షిణాకారంబు చేసివారల యనుమతిని మూడు ముహూర్తంబులు ఆ రత్నాలసావడింగూర్చున్న సమయంబున అక్కడ సర్వేశ్వరుని శ్రీనగరిలోపల వేంచేసియున్న దివ్యపురుషులు సహస్రంబులు ఆ రత్నాలసావడి జనుదెంచ అందున్న భాగవతులం బొడగని సర్వాభరణభూషితులుంగా నలంకరించి దివ్యవిమానారూఢులం జేసి ఓం.............పరమపదమనియెడి వైకుంఠంబు తిరువీథులయందు చనుచుండగా పుష్పవృష్టి సాంద్రమై వర్షింపగా వైకుంఠ తిరువీథులయందు ఏగుదెంచెడి సమయంబున ఆ పరమపదమందున్న నిత్యముక్తులు ఎదురుగా జనుదెంచి తమతమ తిరుమాళిగకు తోడ్కొనిపోయి ముత్యాలగద్దియపై గూర్చుండబెట్టి పసిండిచెంబుల తిరుమంజనంబులు తెచ్చి ఆభాగవతోత్తముల శ్రీపాదతీర్థంబుల జేర్చుకొనియున్నంత అక్కడికి జగదీశ్వర సన్నిహిత దాసులు సహస్రకోట్లు ఎదురుగా జనుదెంచి దివ్యవిమానంబులెక్కించి ఆపరమపదరాజులనగరి ద్వారంబున నిలువుంబి(లిచి?) నిలిపి యా నగరి ద్వారంబుముందరను తిరువాయిముడిమండపంబుగలదు. ఆ తిరువాయిముడిమండపంబు అయిదు లక్షల యోజనంబుల విస్తారమును, మూడు లక్షల యోజనంబుల పొడవును గలదు. ఆ తిరువాయిముడిమండపంబు (వాకిట?), ఋగ్యజుస్సామాధర్వణ అనుత్తలైన (వేత్తలైన?) వేదార్ధంబులు ప్రసంగించెడు హరిదాసులు అనంతకోట్లు ఉందురు. ఆ తిరువాయిముడిమండపంబునకు ప్రదక్షిణాకారంబు చేసి నిలువంబడి యున్నంత ఆ భాగవతులు శ్రీనగరి లోపలికి వేంచేయుడని యానతిచ్చిరి. ఆముందరనొక భద్రపీఠంబు గలదు. ఆ భద్రపీఠంబునకు దండము సమర్పించిన ఆభద్రపీఠంబునకు తూర్పుభాగంబున సహస్ర జిహ్వలుగల శేషుండుగలడు, ఆ శేషుని మధ్యాంతరాళంబునందు రత్నసింహాసనంబు గలదు. ఆ యనంతకోటి సూర్యప్రకాశంబు (న) ప్రజ్వరిల్లెడు రత్నసింహాసనంబుమీదను అప్రమేయు(డగు) ఆదినారాయణమూర్తి వేంచేసియుండును. ఆ జగదీశ్వరుని యుభయపార్శ్వంబుల అజభవరుద్రాదులు అనంత కోట్లు సూర్యచంద్రాదులు సహస్రకోట్ల కరయుగంబులు చనిన మనుష్యులు వేలసంఖ్యలు వేత్రదండహస్తులై సేవింప పరమపదనివాసులు పరివేష్టించియున్న ఆ పరమపదరాజులంబొడగని అనంతములైన సాష్టాంగములు సమర్పించి కృతాంజలియై గజగజవణకుచు నిలువంబడియున్న యాదాసునింజూచి ఆ జగదీశ్వరుండు ఏమనిబుషించెను. 'ఇంతకాలంబు ఏల ఆలస్యమాయె' నని ఆనతిచ్చిన 'స్వామీ! యింతకాలంబు భూలోకంబున సంసారంబనియెడు నరకకూపమునంబడి మునుగుచుందేలుచునున్నారమని, రక్షింపవేస్వామీ' యని పలికిన 'ఈ (ది)వ్యపదంబునకు ఎవ్వరియుప దేశంబు వల్లను వచ్చితి' వనిన 'స్వామీ మీదాసుండైన కృష్ణమాచార్యులు కలియుగ మందు నానాగమశ్రుతి పురాణేతిహాస మంత్రాక్ష(ర)రహస్యంబులు దెలిపె, చరమదేహంబు దిగనాడించి నిర్మలమైన దేహంబు (దిగనాడి!) అవధరింపంబడి మీదివ్యపదంబు గానుపించె'నని పలికిన ఆ సర్వేశ్వరుండు గాఢాలింగనంబు చేసి మేను నిమిరి పరమ(పద)నాంచారు దిక్కు చూచి యనేక కాలంబునాటికి 'కొమాళ్ళు' కలిగిరని పరమపదనాంచారు శ్రీహస్తమునకిచ్చిన ఆ పరమనాంచారు ఎత్తుకొని స్తన్యపానాదులచేత అమృతపాలంబు సేవింపజేసి వీరల నప్పటప్పటికి మనకొలువు కూటంబునకు తోడుకరమ్మని యానతిచ్చిన శ్రీనగరిలోపల ఉండుమని యొప్పగించిన అంతట నా నర్విరుండు(నారాయణుండు?) శ్రీ కృష్ణమాచార్యులకు సాలోక్యసారూప్య కైంకర్యము దయ చేసితిమి తోడుకొనుచు రమ్మని(న) భాగవతులంబనిచి (బిలచి) తమ చేతి పారిజాతంబు గురుతిచ్చిన ఆ పరమభాగవతులు పారిజాతపుష్పంబు గురుతు గొంచు విమానారూఢులై పరమపదంబు వెడలి ఆ క్రిందట బ్రహ్మలోకంబు దాటి ఆక్రిందట ఈశాన్యంబు కైలాసము గడచి యాక్రింద ధ్రువమండలంబు భేదించి ఆక్రిందట నక్షత్ర మండలము ప్రవేశించి, ఆక్రింద చంద్రమండలంబు గడచి, ఆక్రిందట సూర్యమండలంబు గడచి, ఆక్రిందట మేఘమండలంబు దాటి ఆక్రిందట భూలోకంబున సింహాకారంబై యున్న సింహాచలంబునకు చనుదెంచి కృష్ణమాచార్యులను పొడగని తద్వృత్తాంతం బెరిగించి, పారిజాతపుష్పంబులు గురుతు ఇచ్చిన మహాప్రసాదంబని, సింహాచలంబునకు దశయోజనంబులునుగల వైష్ణవులను ఆచార్యులను, గల వైష్ణవులను,పరమభాగవతులను, వైఖానసులను, కాంతలను, బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రజాతి సంఘముల రప్పించి, దివ్యమంత్రోపదేశంబువలన చరమ దేహంబు దిగనాడించి నిర్మలంబైన దివ్యదేహంబు ధరియించి, దివ్యవిమానారూఢులై పరమపదంబునకుం జనుదెంచెను. ఇందఱిం గృతార్థుల జెసెను, అందఱికి దివ్యమంత్రోపదేశంబు ప్రసాదించెను. అని దివ్యదేశంబుల జనులు ప్రసంగింతురు. మీరును నవమాసంబులు వేంచేసియుండి యీ భూమినేలు రాజునకు జ్ఞానోపదేశంబు చేసి మహాప్రసారంబును ఉభయకావేరిమధ్యంబున రంగనాథుల సన్నిధియందు తిరువధ్యయనంబొనరించి ఆ మీదట సాలోక్య సామీప్య సారూప్య కైంకర్యపరులై పరమపదంబునకు రమ్మని గడియలు పదునాలుగింటను ఒక్కముహూర్తంబున సాలోక్య సామీప్య సారూప్య కైంకర్యపరులై పరమపదంబునకు జనుదెంచిరి. అంతట పొతకమూరి లక్ష్మయ్యగారు మరలి వేంచేసి యా భూమి నేలెడు రాజుకుం చెప్పిన ఆనందబాష్పపూరితనయనుండై తన భృత్యులం బిలిచి, కృష్ణమాచార్యులు తమ దాసులు, దాను సాలోక్య సామీప్య కైంకర్యపరులై శ్రీ పురుషోత్తమము మొదలైన నూట ఎనిమిది దివ్యతిరుపతులకు జనుదెంచి వైకుంఠవాసులగుట సత్యం బని పలికిన ఆ రాజు విరక్తుండై తన యింటగల ధనద్రవ్యాదులు భాగవతార్పితంబు చేసి కాషాయవస్త్ర కమండలధారులై పొతకమూరి లక్ష్మయ్య నుం గూడుకొని దివ్యదేశంబులయందు స్వామి ప్రభావంబు గోనియాడుచు ఉభయకావేరిమధ్యంబునందు రంగనాయకుల సన్నిధియందు కృష్ణమాచార్యులకు తిరువధ్యయనం బొనరించి, ఆ మీదట సాలోక్య సామీప్య సారూప్య కైంకర్యపరులై పరమపదంబునకు జనుదెంచిరి. ఇది ఉత్తరభాగ సంకీర్తన. అనుదినంబును మీ దివ్యనామసంకీర్తన యెవ్వరు పఠించిరేని, ఎవ్వరు వినిరేని, ఎవ్వరు వ్రాసిరేని ఆయురారోగ్యైశ్వర్యపదవులు దయచేసి ఆమీదట కాలాంత్యంబున పరమపదంబు ప్రసాదింతుమని(న) జగదీశ్వరుండు ఆనతిచ్చెను. యతిరామానుజ మునివరం (దా) రారు. అనాదిపతీ సింహగిరి నరహరి, నమో నమో దయానిధీ!

3

హరిః ఓం. దేవా, మీరు తిరువవతరించిరి. మత్యావతారమునకు పూర్వఋషి తండ్రి, శంభావతి తల్లి, మహిందగురువు, ద్వారకాపట్టణము, సోమకాసురుని వధించుట, బ్రహ్మకు వేదంబు లొసంగుట. 1. కూర్మావతారంబునకు డంబకాఋషి తండ్రి, కన్యకాపతి తల్లి, నంజనందనుండు గురువు, మధురాపట్టణము, సముద్రము తరచుట, దేవతాసమూహమునకు ఆమృతము పంచి పెట్టుట. 2. వరహావతారమునకు దిక్కుమాఋషి తండ్రి, పద్మావతి తల్లి. తర్కవాసనుండు గురువు, గుహిడంగరా పట్టణము, హిరణ్యాక్షు వధించుట, భూమిపాలనము చేయుట, 3. నరసింహావతారమునకు అతిదావదన తండ్రి, చంద్రావతి తల్లి, ఫాలలోచనుడు గురువు జంబఋషిపట్టణము, హిరణ్యకశిపుని వధియించుట, ప్రహ్లాదునికి ప్రసన్న మగుట, 4. వామనావతారమునకు అండమాఋషి తండ్రి, నీలావతి తల్లి, ఆకాశఋషి గురువు, ఆకాశమే పట్టణము. బలివధించుట, ప్రజారక్షణము సేయుట. 5. పరశురామావతారమునకు జమదగ్ని తండ్రి, (జమః) రేణుక తల్లి, మహిందవుండు గురువు, కొల్లాపురి పట్టణము, కార్తవీర్యుల వధించుట, రేణుక శోకవిలాస(ప)ము జూ(బా)పుట. 6. రామా వతారమునకు దశరథుడు తండ్రి, కౌసల్య తల్లి, వసిష్ఠు గురువు, అయోధ్యా పురి పట్టణము, రావణ కుంభకర్ణాదుల వధించుట, విభీషణునికి పట్టము గట్టుట.7. కృష్ణావతారమునకు వసుదేవుడు తండ్రి, రేవతి తల్లి, గాంగేయ(గార్గేయ?) మహర్షి గురువు, ద్వారకపట్టణము, నరకాసురుని వధించుట, నూటపదియారువేల గోపికాస్రీల సంభోగము జేయుట, 8. బుద్ధావతారమునకు అమృతజీవుండు తండ్రి, మాతంగావతి తల్లి. ఆకాశధృవుండు గురువు, త్రిపురాపురి పట్టణము, అంధకా దారకాసురుల వధించుట, స్త్రీల వ్రతమాన భంగము సేయుట. కలికావతారమునకు హిందావతి తండ్రి, హేమావతి తల్లి, అయోధనుండు గురువు, జంబావతిపట్టణము, భస్మాసురుని వధించుట, శంకరుని అభిమానము రక్ష సేయుట (10), (కృతయు)గ త్రేతాయుగ, ద్వాపరయుగంబుల, కలియుగంబుల బుట్టుచు, చేసిన దోషంబులు, స్త్రీహత్యలు, బ్రహ్మహత్యలు, భ్రూణహత్యలు, సహోదరగమనంబున మాతృగమనంబున, సురాపానంబున, బ్రాహ్మణోత్తముండు చండాలయోనియందు ఇంద్రియాదులు విడచిన దోషంబులు, తొలంగునె దేవా! ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మ, దాల్ఫ్య, రుక్మాంగదార్జున, వశిష్ట, బలి, విభీషణ, భృగు, గాంగేయ, అక్రూర, విదురాదులును పరమభాగవతోత్తములు నారాయణస్మరణ వలన కృతార్థులైరి. కాన ఏడురామాయణంబులు, పదునెనిమిది పురాణంబులు, ద్వాదశస్కంధములు, భగవద్గీతలు, సహస్రనామంబులు మొదలైనవి చదివిరేమి, వినిరేమి, వ్రాసిరేమి సంకీర్తనకు వెయ్యిపాలింటికి సరిరావు. కడమసంకీర్తనలు అనేకులు (అనేకములు?) వినినారు. ఇందుకు తప్పరాదు. మీచరణ(పాద)పద్మంబులాన.[1] యతిరామానుజముని వరందాతారు. స్వామీ సింహగిరినరహరీ, నమోనమో దయానిధే.

4

దేవా! పదికోట్లయజ్ఞాదిక్రతువులు నడపంగా నేమి? తొమ్మిదికోట్లు తులాభారంబులు తూగంగానేమి, యెనిమిదికోట్ల సువర్ణదానంబులు సేయంగా నేమి, యేడుకోట్ల గోదానంబులు సేయంగానేమి, ఆరుకోట్ల భూదానంబు లు సేయంగానేమి, అయిదుకోట్ల కన్యాదానంబులు సేయంగానేమి, నాలుగు కోట్ల వస్త్రదానంబులు సేయంగా నేమి, మూడుకోట్ల సత్యాది వ్రతంబులు నడుపంగా నేమి, రెండుకోట్ల అన్నదానంబులు సేయంగానేమి. కోటి స్నానంబులు సేయంగానేమి.

దేవా, మీనామోచ్చారణంబు సేయక పదికోట్ల యజ్ఞాదిక్రతువులు నడిపిన దేవేంద్రుండు నిలువల్లాయోనులయ్యెను. దేవా, మీనామోచ్చారణంబు సేయక తొమ్మిదికోట్ల తులాభారంబులు తూగిన దుర్యోధనుండు యమ పురికేగెను. దేవా, మీనామోచ్చారణంబు సేయక యెనిమిదికోట్ల సువర్ణదానంబులు చేసిన కర్ణుడు పసిమి కొండమీది అన్నంబులకు అపేక్షించెను. దేవా, మీనామోచ్చారణంబు సేయక యేడు కోట్ల గోదానంబులు సేసిన కార్తవీర్యుండు గోహత్య బ్రహ్మహత్య పాతకములు బొందెను. దేవా, మీనామోచ్చారణంబు సేయక ఆరుకోట్ల భూదానంబులు చేసిన బలుండు(బలి?) విష్ణుపాదంబున పాతాళంబున కేగెను. దేవా, మీనామోచ్చారణంబు సేయగ అయిదుకోట్ల కన్యాదానంబులు చేసిన ధ్రువుండు కాశీక్షేత్రంబున పండ్రెండువేల యేండ్లు భిక్షం బెత్తెను. దేవా, మీనామోచ్చారణ సేయక నాలుగుకోట్ల వస్త్రదానంబు సేసిన మార్కండేయుండు మతిహీనుండయ్యెను. దేవా, మీనామోచ్చారణంబు సేయక మూడుకోట్ల సత్యాదివ్రతంబులు నడపిన వా.......రివుండు (హరిశ్చంద్రుండు?) కులహీనునియింట కాడుగాంచెను. దేవా, మీనామోచ్చారణంబు సేయక రెండుకోట్లన్నదానంబులు సేసిన ధర్మజుండు యమపురి తొంగిచూచెను. దేవా, మీనామోచ్చారణంబు సేయక కోటిస్నానంబులు సేసిన కుమారస్వామి కోరిక సిద్ధించదాయెను. దేవా, మీనామోచ్చారణంబు సేసిన ప్రహ్లాద, నారద, పుండరీక, వ్యాస, శుక, శౌనక, భీష్మ, దాల్ఖ్య, రుక్మాంగద, అర్జున, బలి, విభీషణ, భృగు, (గాంగేయ?), అక్రూర, విదురాదులును పరమభాగవతోత్తములు (నారాయణస్మరణ వలన) కృతార్ధులైరి గావున యతి రామానుజముని వరం దాతారు. అనాది(థ)పతియైన స్వామి సింహగిరి నరహరి, నమో నమో దయానిధీ.

  1. కలికావతారమునకు ....'అనునది లిఖిత ప్రతిలో ఇచట కలదు.