సింహగిరి వచనములు/రెండవ అనుబంధము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సింహగిరి నరహరి వచనములు

రెండవ అనుబంధము

1

శ్రీపురుషోత్తమము, శ్రీకూర్మము, లో(బా?)లార్కము, శ్రీకాకుళము, పాలెంకయు, వైకుంఠగిరియు, అనంతరంగనాథుని కొండ, సర్పవరము, కనకగిరి, కనకాంబరగిరి, గోవర్ధనగిరి, అంజనగిరి, హస్తిగిరి, శేషాద్రి, ఆళ్వార్లగిరి, పండరంగగిరి, పసిండిగిరి, కోరుకొండగిరి, గరుడగిరి, శ్వేతాద్రి, హిరణ్యాద్రి, వృషభాద్రి, ఘటికాచలము, వారణాచలము, ఇంద్రాచలము, శ్రీరామము, శ్రీరంగము, ప్రమోదము, సత్యలోకము, శ్వేతద్వీపము, ఆకాశనగరము, కామతి ప్రయాణము, విభావము, పాతాళము, ఉత్తరాపథము, శ్వేతహృదయము, అగ్నిపూర్వము, శరణ్యము, క్షీరాబ్ధి, బదరికాశ్రమము, నారాయణాశ్రమము, నైమిశారణ్యము, బృందావనము, ఇచ్ఛారణ్యము, మహారణ్యము, భూతస్థానము, మేఘపటస్థలము, గజస్థలము, కటస్థలము, శ్రీనివాసస్థలము, పార్థివస్థలము, దర్భస్థలము, భ్రమరస్థలము, భక్తిశబము, భార్గవాక్య(ఖ్య?)ము, హనుమంతము, అనంతశయనము, కుంభకోణము, అయోధ్య, ప్రయాగ, మాధవ, ద్వారవతి, మాయ, కాశి, అవంతి, ప్రదంకాశి, గయ, గంగాసాగరము, చక్రతీర్థము, తులసీ హృదయము, ఘృతసరసి, ప్రభాసము, నందిగ్రామము, చిత్రకూటము మదీకూటము, ధర్మపురి, వ్యాఘ్రపురి, నందిపురి, కృష్ణపురి, కోష్టపురి, పృథివీపురి, దారణము, హరిపురాశ్రయము, కురుక్షేత్రము, హరిక్షేత్రము, గృధ్రసరసి, భక్తిసాగరము, పద్మనాభము, గోపతి భక్తినాభము, శ్రీముష్ణము, తుహేతము, స్వర్ణమందిరము, కృష్ణకోవిల, సంగమగ్రామము, మణిమంటపము, నిఖిలాకారము, మహురము, మధురాపురి, శ్రీమద్వారము, కురుకాయము, మంగళికము, అపూర్ణము, గ్రిద్దినందినము, బృందావనము, రవి మండలము, ప్రియమోచనము, గోమంతము, హరిద్వారము, అహోబిళము, వెంకటాచలము, అంతర్వేది, విష్ణుకంచి, సింహాద్రి మొదలయిన నూటయెనిమిది తిరుపతులను స్వామి తిరుమేను నందవ(ధ)తరించితిమి గాక! కావేరి రంగనాథుని అన్నిటను వహించి మిగిలిన శేషము స్వామి తిరుమేనునందు కలిసితిమి గాన ఈ సంకీర్తన యెవ్వరు పఠియించిన వారికి ఆయురారోగ్యము. ఈ గ్రంథస్వరూపము. ఇదియే వంశము. ఇదియే గోత్రము. ఇదియే నాకు పుత్రమిత్రకళత్రాదులు. ఇదియే నాకు బాంధవులు. ఓం నమోనారాయణ యని పఠియించిన పరమభాగవతోత్తములకు శుభం భవతు. చాతుర్లక్ష సంకీర్తన యిదియే. పంచమవేద మిదియే, దివ్యమంత్ర మిదియే. ఈ నూటయెనిమిది నామములను ఎవ్వరు స్తుతియించినరేని వారలకు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదవులు కృపజేసి రక్షింతువు గాన అనాది(థ?)పతి, సింహగిరి నరహరి!

2

ఓమ్ భృగునారసింహ! ఓం జయనారసింహ! ఓం భార్గవ నారసింహన ఓం జ్వాలా నారసింహ! ఓం పరమయోగానంద పావన నారసింహ! ఓం భయనివారణ నారసింహ! ఓం దుఃఖనివారణ నారసింహ! ఓం శ్రీమన్నారాయణ నారసింహ! ఓం లక్ష్మీపతి నారసింహ! ఓం వరాహ నారసింహ! యను మీ దివ్యనామసంకీర్తన సమర్పించిన భూతప్రేత పిశాచ శాకినీ ఢాకినీ చోర వ్యాఘ్రవరాహ భల్లూక సర్పవృశ్చిక సర్వజ్వరదోషాది భయంబులు తొలంగును. నరహరి! సింహగిరిపతీ! మీ దివ్యనామసంకీర్తన సర్వమైన పీడలను నివర్తించును. ఈ సంకీర్తన యే యింట నున్న నా యింటను ఏ ఆపదలు జొరవెరచును. ఎక్కడకైనను పయనమైపోవునపుడు ఈ సంకీర్తన వ్రాసి రక్షగా కట్టుకొనిన మోసకట్టు, దారికట్టు, వాకట్టు. ఈ సంకీర్తన పఠియించినవారిని జూచిన ఆవలవారికి అనేకంబై కనుపట్టును. అనేక భయంబులై తోచిఉండు. బ్రహ్మరక్షస్సు మొదలయిన భూతప్రేత పిశాచ గ్రహపీడలు చొరవెరచును. ఉగ్రహా! ఉగ్రనారసింహ స్తోత్రము పరమ మంత్రోచ్చారణంబు. అనాథపతి సింహగిరి నరహరీ నమో నమో! (దయానిధీ!)

3

దేవా! హరిశ్రీమన్నారాయణ, పరబ్రహ్మస్వరూపా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా, దేవా! తాటకి ప్రాణాపహారా, విశ్వామిత్ర యజ్ఞకర్తా, యజ్ఞభోక్తా, యజ్ఞస్వరూపా, సర్వం విష్ణుమయం జగ(త్తనుశ్రుతి నికరపరివేష్టితా), విలువిద్యా(దీక్షాగురూ), మారీచమృగ వేటకాడా, మహామాయా వినోదా, ఖరదూషణత్రిశిరఃఖండనా, అతికాయమహాకాయ కుంభ నికుంభ కుంభకర్ణ వజ్రదంష్ట్ర వజ్రకవచ మహోదర మహాపార్శ్వ కోలాహలాపహార, ఇంద్రజిత్తు తలగుండుగండా, రావణగిరి వజ్రాయుధా, సకల దేవతా మోక్షరక్షకా, విభీషణ ప్రతిష్ఠాపనాచార్యా, శ్రీ మద్ద్వారకాపురినిలయా, గోవర్ధన గిరిధరా, గోపీజన మనోవల్లభా, వేణునాదవినోదా, పారిజాతాపహారా, శిశుపాల శిరశ్ఛేదనా, కాళింగమర్దనా, కౌస్తుభాభరణా, శ్రీవత్సలాంఛిత కుచకుంకుమపంకిలా, యశోదానందనా, మధురానాయకా, మహామునిగణసేవితా, వాల్మీకి ప్రయోగసన్నుతా, ఓ గజేంద్రవరదా, ఓ ప్రహ్లాదవరదా, ఓ యక్రూరవరదా, ఓ యంబరీషవరదా, ఆపద్బాంధవా, ద్రౌపద్యభిమానరక్షకా, పాండవపక్ష ప్రతిపక్షపాలకా, విదురునింటివిందా, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సనకసనందన సనత్కుమారాది యోగీంద్ర బృందారక వంద్యా, ఆదిమధ్యాంతరహితా, అధోక్షజా, క్షీరాబ్ధిశయనా, వటపత్రశయనా, వారిజనాభా, భక్తి ముక్తి ప్రయోగ సన్నుతా, శ్రీ కృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరినరహరీ!

4

దేవా! మీ చరణారవింద సేవకు నే కులజుండైన మిమ్ము హృదయకమలకర్ణికా(ర)మధ్యమందు పరబ్రహ్మంబుగా భావించి రత్నసింహాసనాసీనునిగా చేసి పురుషసూక్తప్రకారమువలన ఆవాహనాసనార్ఘ్యపాద్యాచమనస్నాన వస్త్రయజ్ఞోపవీత గంధ పుష్ప ధూప దీప నైవేద్య తాంబూల నీరాజన ప్రదక్షిణ నమస్కారము (మొద)లైన షోడశోపచారంబుల నర్చించి, కంకణ కేయూర కౌస్తుభాభరణ మకరకుండల హార మణిమయ కిరీట విరాజితగాత్రునిగా, కిన్నర కింపురుష గరుడగంధర్వ యక్ష సుర సిద్ధ- అఖిల దేవతా సంసేవ్య పాదపద్మములు గలవానిగా, అనంత గరుడ విష్వక్సేనాది పరిజనపరివృతునిగా భావించి, (కమల?)శేషతల్పునిగాను, శంఖచక్ర గదా ఖడ్గకోదండ పద్మవనమాలికాధరునిగాను, పరబ్రహ్మస్వరూపునిగాను, ఆత్మజ్ఞానమునను శ్రీ అష్టాక్షరీ మంత్రంబుల నిత్యం దండప్రణామంబుల సేయుచుండునతండే పరమభాగవతుండు. అతనికి మీ పరమపదంబే గాని యితరంబులేదని శ్రుతిపురాణములు చాటుచున్నవి. అనాథపతి స్వామీ, సింహగిరి నరహరీ!

5

దేవా! శ్రీమన్నారాయణుండే సకలదేవతలకు, సకలజంతు జీవకోట్లకు జనకుండు. నారాయణ, నారాయణ యని శ్రుతులు పల్కుచున్నవి. గాన తప్పదు. ఇట్లని యెరుగక ఇతరదేవతల గొలిచేనేని వ్యభిచారికొడుకు తండ్రినెరుంగని క్రియను పరమాత్ముని యెరుగక జీవాత్మయే యనేకబ్రహ్మకల్పంబులు జన్మజరామరణాదులం బొందుచునుండును, అనాదిపతి సింహగిరి నరహరిని సర్వకార....మీ దాసులు మిమ్మే కొలుతురు. దయానిధీ!

6


దేవా! దేహంబు మృత్తిక జలంబులచే శుద్ధి చేసెద నంటినా? - మూత్రంబు మలభాండము. చిత్తశుద్ధి చేసెదనంటినా, విషయేంద్రియము లుండవు. దేహంబును, చిత్తంబును మా సింహగిరి నరహరిందలంచినగాని పవిత్రము గాదె, దేవా!

7

దేవా! శ్రీమన్నారాయణ కథామృతము. పరమపదంబునకు సోపానముక్తి నెదర్పడి నడిపించెడిది. ఇదియే సత్యము. మనసా! నీ వనుమాన ముడిగి మా సింహగిరినరహరి నామమొక్కమారు దలంచినచాలును ఇదియే సత్యము, సత్యము. ఇదియె, నాకును జపము. ఇదియె, నాకును తపము. ఇదియె, నాకును నిత్యకర్మానుష్ఠానమయినది. ఇదియె, నాకును పరమ మంత్ర రహస్యము. ఇదియె, పరమ ధర్మము. ఇదియే, నాకును వేదశాస్త్రపఠనంబిదియె, సింహగిరి నరహరీ! మీ దివ్యనామము. ఇదియే నాకు జపము, దయానిధీ!

8

దేవా! వ్యాస పరాశర శుక శౌనకాదులైన ఋషులందరు గూడి వాసుదేవులచే పరతత్వమని వైకుంఠనివాసుం గాంచిరి. దైవమాయయో! నరులపాలిటి కర్మమో! పెక్కు దైవములు గలరని తిరిగిచెందెదరు. ఎక్కడగలడన్న, ఆక్కడనే హరి గలడను మాట నిక్కమో లోకములవారా! ఎక్కడ ద్రౌపది? ఎక్కడ ద్వారక! ఎక్కడికెక్కడ! శరణన్న గాచుట యెరుంగరా! జగములీరేడు గెల్వనోపిన మగలేగురు తలలెత్తి అలుగకుండంగ -ద్రౌపది తనమనంబున గదర, “కృష్ణా, నీవే గతి. నీ చెలియలింగావు" మనినం గాచెను. కరి మకరితో బోరుచు, కరి లావుతరగి మొర పెట్టుచో,గలరో దేవతలైనం గావవే హరి! యన్నను గాచుట యెరుంగరా! ఇట్టి సింహమందిరుం గొలిచి ఇంద్రాది దేవతలైరి. శ్రీ కృష్ణ కువ్వారు స్వామి, సింహగిరి నరహరీ!

9

దేవా! ఇతడే ఆఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండు. ఇతని నాభియందు బ్రహ్మాడంబు పుట్టె. బ్రహ్మాండము లోపల బ్రహ్మ పుట్టె. బ్రహ్మ లలాటంబున హరుండు పుట్టె. హరుని యుగ్రమున కూర్మము మోచిన కుంభినిధరణి ఊష్ణమున జలధి పుట్టె. జలధి కల్పమున మండలము పుట్టె. మండల సర్పమునందు వేదశాస్ర పురాణకల్పములు పుట్టె. వేదశాస్త్ర పురాణకల్పమున నీయల్పదైవములు పుట్టె, మీ కరుణానిధి మీ సమ్మతి కాలచక్రములు కర్మములు ద్రుంచి హతాహతంబు చేసియు మీరే పరబ్రహ్మమని తెలిసి తెలియరు, అనాదిపతి సింహగిరి నరహరీ!

10

దేవా! నరహరీ! మీ చరణారవిందము సేవించెడి మనస్సు నాకెన్నడు కలుగును? నరహరి: మీ నామము దర్శించి చూడనున్నాను. నయనానందకరము నాకెన్నడు కలుగును? నరహరీ, నీ నామకథాగుణములు వీనులకు వినంగ జిత్తము పల్లవించెడి తలంపు నాకెన్నడు కలుగును? నరహారీ, మీ నగరి కైంకర్యపరుండనై అంజలి చేసుకొని నమోనారాయణా యను బుద్ది నా కెన్నడు కలుగును? నరహరీ, మీ దాసుల దాసుండనై యుండెడి చిత్తంబు గాని, అన్యచిత్తము లేకుండ జేయుమయ్య. నరహారీ! సింహగిరిపతీ! అకారణసుకృతివై యీ జంతువు నీ కరుణాంబుధి దేలించి మీ దాసులదాసునిగా కరుణ జూచి కరుణింపుమయా. సింహగిరి నరహరీ, మీ చరణములకు శరణు, శరణు.

11

దేవా! జలచర కీటకము (క్రియం) జరియించిన విధమున నా జన్మమెరుంగక తిరుగుచునుండగ, నీ మంత్రరహస్యమను జీవనము దొరుకుట వివేకింపగాను, లోహము పరుసము సోకి కాంచనంబైన విధమున ఏమో మీ భావ మెరుంగలేను. అవియె నాకు మీ గుణాంబుధి గొనియాడ గోచరంబై నది. చాతుర్లక్ష గ్రంథసంకీర్తన నుతియింపగనది యతిరామానుజ ముని..... అనాదిపతీ, శ్రీ కృష్ణకువ్వారు. స్వామీ, సింహగిరి నరహరీ!

12

నరహరి! మీ నామసంకీర్తన చేయుచుండగను యెవ్వరు రామనేమి ఇది హీనంబని అధికంబని యిది వర్ణము గాదని హాస్యంబు చేసిన యతండు అరువది వేలేండ్లు నరకకూపంబున బడి పిశాచత్వమును బొంది అనేక వికారంబుల పొందు. నరహరీ! మీ నామసంకీర్తన నేర్చి చేసిననేమి, నేరక చేసిననేమి? నారాయణయను శబ్దమాత్రంబు దలంచినయతండే నిజదాసుండని అనేక స్మృతులు మొరయుచున్నవి. శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ!

13

దేవా, గృహగతులైన ప్రపన్నులంగని వందనము చేయకుండుట, పురుషాకార ధర్మము విడుచుట, ఉపచరింపకుండుట, భగవద్వైభవము గొల్పడుట, గృహగతులైన మనోరథంబు నష్టి బొందుట, దేహాభిమానము విద్వేషించి యుండెనేని గృహగతులైన అనాదిపతి, సింహగిరి నరహరీ!

14

దేవా! శునకమునకు ఘృతము వోసిన, ఆ శునకము ఘృతపానము చేసి అదియింపుగాక మదియించినట్టువలె నధర్ములే మెరుంగుదురు? చిత్తధర్మస్వరూపులైన ధర్ములెరుంగుదురు గాక! అధర్ములే మేరుంగుదురు? ఇది పరతత్వంబని సింహగిరి నరహరి నామమెరింగి జరుగును..... గుదురు గాక! అజ్ఞానులెరుంగుదురే, దేవా!

15

15

దేవా! ఆచార్య పరమ భాగవత ప్రపన్నులైన వారి ఇతర దేవతాంతరంబులందగిన నరుండు దూషకనిందితుడైన కుమతికి స్వర్గతిలేదు. అది యెట్లనిన వినుడు—— తొల్లి భగవానుడు ద్వారపాలకులై జనియించి యున్న జయవిజయాదులు స్వామి చిత్తమునకు యెడయై అసురజన్మంబెత్తి శిశుపాల దంతవక్త్రులై , హిరణ్యాక్ష హిరణ్యకశిపులై, రావణకుంభకర్ణాదులై సమసిపోయిన విధమౌదురుగాన, సంభాషణ సేయవలదు. చేసినారేని వారున్ను హ........ బొందుదురు, అనుదినమును అగ్ని పైని ఆజ్యము చల్లిన అనలంబారునే? అధికంబౌగాక! వెనుతగిలి అవివేకిని బహుభంగుల బోధించిన మదిగొన........ దుండా గాక తాపజ్వరమునను శ్రీ గంధము పూసిన అప్పుడే మానునా? చరిగొని కాలుగాక. చెడ్డజ్ఞానికి శ్రీరంగేశ్వరు జూపిన దీవించనేర్చునచలమున నిర్భాగ్యుడౌగాక..... .యేదిగతి. అనాదిపతీ! సింహగిరి నరహరీ!

16

దేవా! తిరుమణి తిరుచూర్ణంబులు లేని యావిప్రుండు పతితుండు గాదా లోకము........లెవ్వడు. మీ.. .... గని విప్రులచె పంచమహాపాతకుండని వేదంబులు చెప్పుటగా విని భుజముల మీముద్రలు, లలాటమున తిరుమణి తిరుచూర్ణములై ని............గ్వుండుగాడు. ఇది యెరింగి యెరుంగకుండుట మిమ్మెరుంగకుండుట. ఇది సిద్ధాంతము. అది శాస్త్రసమ్మతము. పరమజ్ఞానము. మా రామా ..........నిది సమ్మతము. శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహాగిరి నరహరీ! మీ దివ్యనామసంకీర్తనలు సమ్మతము.

17

దేవా! పూర్వజన్మ పురాకృత ఫలము జంతురాసులయందు లక్షలయందు విరించికైనం గడుపరాదు. కర్మఫలంబనుభవింపకపోరాదు. రజోగుణంబున బ్రహ్మాండంబు స్తుతియింపుచునుండి లోకమాతయైన పార్వతిం జూచి మోహించి తస్థలితుండైన అరిని శివు డాగ్రహించక రక్షించండే! అనాదిపతీ, సింహగిరి నరహరీ!

18

దేవా! దశరథరాజనందనుండవై జనియించి మహత్వంబు వహించి పరబ్రహ్మస్వరూపుండవుగా నెరవైతివి. దేవా, నీవు అయోధ్యాపట్టణంబును సహోదరులకు నీ జననీజనకులు చేసిన దోషంబు నీకు అనుభవింప గారణమని శత్రువులను జంపెనని కారణములు లేవు. దేహి మధ్యరంగంబున తల్లిదండ్రాదులు చేసిన దోషంబు నీకు అనుభవింప గారణమని అరణ్యానకు యేగితివి. దేవా, మీకు యెవ్వరు తల్లి? యెవ్వరు తండ్రి? నీవు జగద్భరితుండవు. నీవు మహాత్ముండవని నీకు మ్రొక్కిన దోషంబు. నీవు నరుని కడుపునం జనియించి జగత్తులు నావని వహించనేరవై తివి. దేవా! కరుణానిధివి. ఆనాదిపతివి. శ్రీకృష్ణకువ్వారుస్వామి, సింహగిరి నరహరీ!

19

దేవా! పర్ణశాలల వసించినాడవు. నీకేల అరణ్యానకేగ? నీకేల ఉపవాసములుండ నీకేల నారచీరలు గట్ట? నీకేమి కారణము దేవా! నీకు కూరలు కాయలు అన్నంబు భుజియింప నేమి కారణము? దేవా! నీవు గతపూర్వంబున చేసిన కర్మంబు వదల్చుకోలేవు నిన్ను నుతియించిన కర్మంబులు పాయునని నరులు నీకు మొక్కుదురు గదవయ్యా! నీ కర్మంబులు నీవు వదుల్చుకోలేవుగాక, నీవు మానవుని యింటంబుట్టి యెరుంగవు గాక! మీ దాసులు వ్యాసపరాశర పుండరీకాంబరీష శుకశౌనక ప్రహ్లాదులు మీ దాసులు మీరు మ్రొక్కుదురు. నీవు చేసిన ద్రోహంబు లెరుంగుదురు. వీరికి భయస్థుండవై యుండుదువు గాన. దేవా! పరమరహస్యంబున నేను నితయించినాడను. నన్ను గావవే! శ్రీకృష్ణకువ్వారు స్వామీ! సింహగిరి నరహరీ!

20

దేవా! నీవు అశ్వమేధ యాగాధికారుండవై యాగము చేసితివే. దేవా, నీ కర్మంబులు చూడనె దోషంబు ధర్మకర్మములు పాలించవైతివి. అధర్మివి నీవు. సుకృతా ధర్మంబులు లేవుకదా! నీ వలను. నీవు నరుని కడుపునంబుట్టిన జ్ఞానముదప్పెగాక! నీకు శిరిశానవేల్పులు. నీకుటమి కారణమున వారధి గట్టెదవు. నీవు విష్ణుమాయ ప్రపంచకము చేసి వడినేడు సముద్రంబు లేకమైయున్ననాడు ఏకస్వరూపంబున నుండవా. నీవు! రఘుకులోద్భవుండవై అంబుధి యెరుంగవు గాక! ఆదినారాయణ మహత్వంబు దహించినపుడె నీకు యెదురెవ్వరె, దేవా! నీవు మనుష్యుని కడుపునంబుట్టి నీ సత్యంబు నీ వెరుంగవు గాక! నీవు అయోధ్యలోనుండి ఒక బాణము సంధించిన రావణాసురు సంహరించి, వాని మీ శ్రీపాదములకు మ్రొక్కినంతనే వాడు చేసిన దోషంబులెల్ల విరుగడాయ వాడు ముక్తింబొందడా! వాని దేహతేజంబు జూచి లక్ష్మణు బిలిచి సీతామహాదేవిని ప్రమాణము పరికించుకొమ్మని యాడితిరి. ఆలాగె లక్ష్మణుండు సీతామహాదేవిని ప్రమాణంబు పలికించిరి. ఆ మహాత్మురాలు అన్యథా యెరుంగదు గనుక ప్రమాణంబు గెలిచెను. ఆ ప్రమాణంబు గెల్చిన దోషంబు నీకు యెన్ని యుగంబులం దొలంగునే, దేవా! చాతుర్లక్ష గ్రంధసంకీర్తనము వలన దశావతారుండవై చేసిన దోషంబులెల్ల బాసెను. రఘునాథుండవై చేసిన దోషము లెల్లంబాసెను. నా వలన నీకు ముక్తి కలిగెను. నీవలన నాకు ముక్తి కలిగెను. నీవు దశావతారుండవు. నేను పదునొకండవ యవతారుండను. నీవు నరమృగమవు! నేను నరకేసరిని! నీవలన నాకు కైవల్యంబవుట. అనాది పూర్వకృతఫలమేగదా! శ్రీకృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ!

21

దేవా! ఏమని నుతియింతు మిమ్ము? కులపర్వతము లేడుదీవులతో ధరయెత్తిన మీరు గోవర్ధగిరి నెత్తితిరని యేమని నుతియింతు? కాల సంహారుండవై, జగత్తు లయంబు జేసి మీరు కంస కాళింగమర్దన నరకాసురుండాదిగా గల రాక్షసుల హతంబు చేసితివని యేమని నుతియింతు, సప్తసాగరములు మీ రోమకూపముల సరిలేవు, నీవు జలధి నిందించితివని యేమని నుతియింతు? మీ సతికరుణాలేశమున సకలదేవతలు రాజ్యవిభవ సంపన్ను లైనారు. బలి నడిగితిరని యేమని నుతియింతు? మీ దాసులు జన్మ మరణాదిభయరహితులైనారు. మీరు దశావతారమున తిరువ నవధరించితిరిగాన యేమని సుతియింతు? శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ!

22

దేవా! అకారణ సుకృతివై రక్షింతువు గావున దేవా! జపతపధ్యానాదితంబులు మొదలైనవి. అశ్వమేధంబులు మొదలైనవి యాగంబులు షోడశమహాదానంబులు గంగానదీస్నానంబులు పితృదేవతాతర్పణంబులు ఇవి యిన్నిన్నీ మీ దివ్యనామసంకీర్తన భూతాంతర్యామిగాన శిరిసుజన్మకర్మంబు శ్రీ కృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ!

23

దేవా, భాగవతులసేవ, ఆచార్యులకైంకర్యము —— ఇదియేమరియున్న నరుండు సారమేయ గ్రామసూకరములట! ప్రధారియై యొనరించును. సదాధగవత్సేవా సత్క్రియలొనరించుచుండి మా సింహగిరి నరహరికి.......కతంబడడు.

24

దేవా! అభ్యసింపగా రానివి రెండు, సదాచార్యుల కటాక్షంబొకటియు మీ దాసుండై యుండుటొకటియు. అవిగాన అభ్యసింపగా రానివి రెండున్ను. అదిగనక యెరింగి నడుచుకొనవలయును. శ్రీకృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ!

25

దేవా! పతి తనమీదను కరుణగలండని సతియానందించినట్లే మీ దయావిశేషము నామీద గలదని యానందించి యున్నాడను. ఈ యానందింపు తుదిముట్టించుమీ. నన్ను మీ దాసానుదాసునిగా జేయవే. సింహగిరి నరహరీ!

26

దేవా, మీ దాసుల యనుగ్రహంబులేక మీదివ్య పదాధికారంబులేదు. మీ దాసుల యనుగ్రహంబు లేక యీ కర్మ సాగరంబు గడపరాదు. సూర్యరశ్మి హస్తంబున ధరియింప వశమా! ఈ లోకంబు మనుజులకును శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ! మీ దాసులు సర్వమాన్యులౌట గాన నే నెరింగితిని దేవా.

27

దేవా! భిన్నప్రకృతి వికాస జీవుండు అవి యెరింగిన కదా హాని బొందకుండుట. అనాదిపతి సింహగిరి నరహరీ! ఆయురన్న ప్రయ స్వామి[1] యనియెడి శ్రుతివాక్య మెరింగినకదా హానిబొందకుండుట, నరహరీ, దయానిధీ!

28

దేవా! అన్యదేవతాభజనంబు దోషంబు. ఆన్యదేవతానిందయు దోషంబు. అన్ని మతములా నడువంగ దోషంబు. ఆన్యులదోషంబు లెంచగా దోషంబు. ఆన్యులనంగా నెవ్వరులేరు. అన్న తనంబుననున్న భూతకి జంపిన వెన్నుండగు మా సింహగిరి నరహరి అన్ని చోటలంగలడని తెలియండి, దేవా!

29

దేవా| చతుర్వేద పఠనాది(భి?)ముఖుండైన నేమి? ఆచార్యకృపతో పంచ సంస్కార పరుండైన నేమి? తత్త్వత్రయ రహస్యత్రయ నిరతుండైన నేమి? శాంతశమదమాది గుణంబులు రావంబందున బొడమంగ వలయును. పరధన పరస్త్రీ పరహింప పరనిందా నివర్తకులు కలిగిరేని మా సింహగిరి నరహరికి యని తలంచవలయునే, దేవా!

30

దేవా! కరతరామలకంబైన మీ కథామృతపానము చేసి శునక జ్ఞాన మయ్యెడినో కదా ఆతమనస్సు గతింజెందనొల్లక మనసంతే విస్తారం మీ మాయారూపణం నీరుకొలది తామరవలె జగతియందు యద్బావం తద్భవతి అనియెడి యిహమందుల వచనములు చదివి హితు మొరుల నేను వాదింపగనేలా! ఆతురజనవాంధవా! సింహగిరినరహరీ!

31

దేవా, మనుజుండు పెద్దలైనవారల ఆచార్యుల మేదినీసురుల మాతృపితృ దేవతల హుంకారతిరస్కారంబులు చేసెనేని అనంతకోటికల్పంబులు రౌరవాది నరకంబులంబడి క్రిమికీటకాదులతోటి సంగతిని ఒకటియై జనియించును. అది యెట్లనిన చెప్పెద వినుండు. తొల్లి ఇంద్రద్యుమ్నుండను మహారాజు మహాత్ముల తిరస్కరించి కరియోనింబుట్టి కడపట మహాత్ముని కరస్పర్శనమున ముక్తుడాయెను. అది మీ రెరుంగరా, దేహంబు నీచుండైన నరుండు నిరంతరము శ్రీకృష్ణ కువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ!

32

దేవా! మీదివ్యమంగళాది చారిత్రంబైన ద్వయతిరుమంత్రము పరమరహస్యము. అచార్యకృపాకటాక్షము దొరికిన మనుజుండు క్రితంబున సుజనుండైననేమి, దుర్జనుండైననేమి. అతండు మీదివ్యపదంబును బొందు. సకలజీవహింసలు చేసి మాంసము బం(ఖం?)డించేటి లోహము, వేదశాస్త్రపురాణంబులు వ్రాసేటి లోహములున్ను పరుసము సోకిన శుద్దసువర్ణముగదా! అనాదిపతీ, సింహగిరి నరహరీ!

33

దేవా, నేను ప్రభాతకాలమున లేచి తిరుమణి తిరుచూర్ణంబులు ధరియించి దండెయు తాళంబులు పూని, పరమభాగవతులున్ను దాసున్ను స్వామికోవెలకుంజని మిమ్ము స్రోత్రము సేయందోడంగిన, ద్రౌపదీమనోద్దారకా, పాండవపక్షపాతీ, సర్వసమా, మాధవా, గోవర్ధనగిరిధరా, నీవే దప్పనితఃపరం బెరుగనని స్వామి ప్రసన్నవదనుండై అప్పుడిట్లనియె. నీకు నింతవిచారంబేలా? నా నామోచ్చారణంబులు యెవ్వరేని పఠియించిరేని, చాతుర్లక్ష గ్రంథంబైననేమి, సహస్రంబైననేమి, అష్టోత్తరశతంబైననేమి, అంతకరణశుద్దిగాను ప్రభాతమందు లేచి తిరుమణియు తిరుచూర్ణంబులు ధరియించి యేకనామోచ్చారణంబులు చేసిన అతనికి పుత్రమిత్ర పౌత్రాభివృద్ధియు, ధనధాన్యసమృద్ధియు, కామితైశ్వర్యంబు లిచ్చి అంత్యమున అతనికి నాలోకంబు విత్తునని శంఖంబుపూరించి వేంచేసి(న?) కృతార్థుండనైతినని పరమభాగవతులున్ను, దాసులున్ను తనపురంబునకేగి, శ్రీకృష్ణకువ్వారు, సింహగిరి నరహరీ!

34

దేవా! మీతిరుమణి నాకొక్క దైవంబు. మీతిరుచూర్ణము నాకొక్క శృంగారంబు. మీ వనమాలిక నాకొక్క నవరత్నపుసొమ్ము(లు). ఈ జన్మమున నా కిటవలె జేస్తిరి, ఇంకొక జన్మంబుననైన నన్నుం గృతార్ధునింజేయవే. నన్ను రక్షింపవే. శ్రీకృష్ణ కువ్వారుస్వామీ. సింహగిరి నరహరీ!

35

దేవా! మహాప్రళయకాలమునాడు క్షీరాంబుధిమీద మాయావటపత్రశయనుండవై లక్ష్మీభూకాంతలతో నన్ను మరచితివో, దేవా! విళంబుస సంవత్సర ఆషాఢశుద్ధ ఏకాదశి ఈశ్వర సంవత్సరాలు మూటను, నా పుత్రమిత్రకళత్రాదులు అన్నబాంధవులు అన్నపానాదులు లేక క్షుత్పిపాసలు చెతనున్ను ఉన్నారు. గనుక, నే నీదాసుండను, నీవు నాపతివి, నన్నేల మాయాంధకారునిం జేసితివి? ఇహమందు సౌఖ్యభోగము కృపజేసి నన్ను రక్షింపవే. అనాదిపతీ సింహగిరి నరహరీ!

36

దేవా! నాలుగు వేదములు నవబ్రహ్మలు ఒకకొమ్మట! అందేయు చిటితాళము మీ దివ్యనామసంకీర్తనపరుండును ఒక కొమ్మట! వ్యాసపరాశరశౌనకాదులు ఋషులందరును గూ తులాభారము దూచిననాడు సంకీర్తనపరునికి సరితూగవాయెనట! అనేక జన్మజన్మాంతరముల నే బుట్టి సంకీర్తనపరుండే కావలయును, శ్రీకృష్ణకువ్వారుస్వామి, సింహగిరి నరహరీ!

37

దేవా, భగవద్భాగవతులకు సమర్పింపక, తాననుభవించక కూర్చిన యర్థము ఇహపర, ఉభయభ్రష్టంబౌను. అది యెట్లనిన, మధువుగూర్చిన మక్షికరీతియౌను. అటుగాన మా సింహగిరి నరహరికి తళిఘలు సమర్పించుక తళిఘల తచ్చేషం తాననుభవించవలెను. శ్రీకృష్ణ కువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ!

38

దేవా, యీ భూలోకంబున మనుజులై దుర్మదాంధులు అన్యాయార్జితంబైన ధనంబులన్ని సకలంబులను యిల్లు చూరగొని 'మోక్షార్థులంజేయ శేషాచలంబున తిరువేంకటనామంబులు సకలదేవతామూర్తులు రుద్రుండును బ్రహ్మయును స్థావరజంగముంబుల భోగంబులం బొరలక బొందక కలియుగంబునపడి ఆరగింపులకు పరంజ్యోతి మహామహిమ తృప్తి బొంద శ్రీపురుషోత్తమంబున ప్రథమ తిరుపతిని శానారూపంబున నిలిచితివి దేవా, నీవు పుష్పాంజలి యవసరంబున మహామహోత్సవంబువలన ధర్మాధర్మంబులకు చాతుర్లక్షగ్రంథంబున వరాహరూపంబున నిలిచితివి. దేవా, నీవు ఉభయకావేరీమధ్యంబున వైష్ణవరామానుజమతమున కాటపట్టై, విభీషణవరదుండవై, శేషశయనుండవై, దక్షిణాభిముఖండవై, లక్ష్మీసమేతుండవై భాగవతులగు వైష్ణవులకు ప్రసన్నుండవై, అనంతదివ్యనామతేజుండవై, పరంజ్యోతి తత్ప్రకాశుండవై, అనంతనాముండవై, వైకుంఠంబనం బరగె శ్రీరంగంబున శేషశయనుండవై భూలోకంబున విహరించి నాడని మా యాచార్యు లీవిధంబున తెలిపినారని నమోనారాయణాయని మీ ప్రభావంబు నారదుండు దేవతలకు జెప్పిన వాక్యంబు నాకుంజెప్పినాడవు గాన నాకు సకలంబును మీ మహిమ వలనం గానంబడె. ఓం సదా పశ్యంతి సూరయ, యని, యద్భావం తద్భవతి యని మిమ్ముంగనుగొంటి. యతిరామానుజ మునిదాతారు. అనాదిపతి. సింహగిరి నరహరీ!

39

దేవా, గార్దభంబునకు ఘంటానినాదంబులున్నె పక్కెన పల్లంబులు పూని దానికనేక తూర్యనాదభక్తిసములతో వచ్చిననేమి? కడుహీనముగా జూతురుగాని ఉత్తమాశ్వంబునకు సరివచ్చునా, దేవా, గార్దభంబు ......పల్యములతో స్మశానభూమిలోను పొరలాడజూచుగాని, అశ్వశాలాభ్యంతరమందు కరంబు అనాద్యంతపరిపూర్ణముగా మేపిన నేమి? అదియు దుర్గంధంబునంబడి ఘోటారంబు చేసును గాని. ఇటువలెనె గార్ధభజ్ఞానియైన మనుజుండు సుఖభోగ్యం బెరుగడు అల్పభోగమునకై అనేక అలమట మొందును, దాని గార్దభస్వరంబు మాన్పరాదు. దేవా, దుర్గంధహేతువైన కిరి పంకమధ్యంబున బొరలాడం జూచును. గ్రామ సూకరము దెచ్చి దానికి పన్నీటి అభిషేకంబు చేసి, కస్తూరి గంధలేపనంబు మెత్తి యెనెకరచుట వెట్టిచేందిచిన బృంహితంబు చేయుకాని, తన పూర్వస్థితి నరకరూపంబున నెప్పుడు బోయి ఉండును. వాని స్వభావత మాన్పరాదు. దేవా! ఉగ్రమదాంధకారుండైన మనుజుండు సదిరివల్న తనవద్దనున్న సమ్మోహంబెరుగడు. తన్ను నెరగడు. సర్వభోగసాయుజ్యంబులు విసర్జించును. ఆ కర్మములో మెలంగినప్పుడే లేమివల్ల వ్రయంబు చెప్పును. ఆ మనుజుండు మత్తగజంబై జనియించును. ఆ మనుష్యప్రకృతి యెరుంగక సూకరంబు మత్తగజంబునకు సరివచ్చునా! దేవా, స్నానంబును పంచభక్ష్యంబులు దెచ్చి భుజియింపపెట్టి పానుపుమీద శయనింపజేసిన జీవహింస కొరంబుమానునా? దేవా, మధువు గ్రహించు వాడొకడు, క్షౌరకుండొకడు, రజకుండొకడు, పూర్జుండైన దుష్టజంతువుండొకడు, పక్కెరపల్లంబు చేసెడి చర్మవైరి యొకడు, వెలిచండాలు లిద్దరు, వీరేడ్వురున్ను వారి సమానం సమకూర్పరాదు. జనులలో అంటముట్టరాని వారైనా గాక మీ నిజదాసుండయిన వారిని దూషించరాదు. జలములన్నియు నొక్కటి, దుగ్ధ.......... అన్ని కులంబులనొక్కటై సంతోషము నొక్కటె. కలిమిలేములు ఇవి రెండు కలియుగమున యేది నీతి. కలిమివలనంగాదా యీ చండాలాదులకు పదవులు కలుగుట. కులవర్ణాశ్రమధర్మంబు కులముగాదందురు, కులహీనులమందురు. కలిమివలన గాదా చండాలాదులకు పదవులు కలుగుట, యిది నీతిజగతికి జీవహింసకారుండైన మనుజుండు దానికి ఏకయత్నముగా బోషించును. తటుకున లేచును. పదతాళన చేసును, విడువకున్న వూలిగించం జూచుగాని ఆ భోగస్థితి యెరుంగడు. అశూన్యంబైన జంతువు ఆ విధంబుననే తిరుగుచుండును. కామాంధుడై , గర్వియై, నిర్వికారియై, మహాత్ముల గుణంబెరుంగక దూషింతురు. గాన, యతిరామానుజ మునివరందాతారు. అనాదిపతి, శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ!

40

దేవా! ప్రాకృత జ్ఞానసుదర్శన పాంచజన్యంబులు శాంతశమదమాది గుణంబులు గాంభీర్యమునకు సరవి పల్ల రాదు. వాని స్వభావము మాన్పరాదు. ఆతండాడినట్లాడును. వారకాంత దెచ్చి యిల్లాలిగా నేలి, దానికి భారకంబు యిచ్చి మత్తుండై సంతతి వడసినన్నేమి, కులగోత్రము బంధువర్గంబులు సహోదరులు శోభన క్రతువులకు బిలువరు. ఆ వారకాంత స్వభావంబు మానుపరాదు, తా నడచే నడకలు నడవం జూచును. మరి జనము జూచును. ఉత్తమగుణంబులు దొరకవు. పుణ్యభార్యాంగనకు సరివచ్చునా? దేవా, భక్తులు నిని రక్తమాంసాదులు. అడిగెదిని నిర్బంధపు దైవములు గొందరింబట్టి లీలావినోదంబులు ఆడించుచు వారికి భయపడి మిమ్ము గొలువ నెరుంగని నీచగుణంబులవారు నీ మహత్త్వంబెరుంగరు. ఏకోవిష్ణు(ర్) మహద్బూతం బనియెడి సింహాద్రప్పను పూజింప నెరుంగరు. అజ్ఞానులకు సుజ్ఞానము దయ చేసి రక్షింపవే! ఆతుర జనబాంధవా!' శ్రీకృష్ణకువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ!

41

దేవా, శాంత శమదమాది గుణంబులులేని శ్రీ వైష్ణవునికంటె శాంత శమదమాది గుణంబులుగల తిరునామ దారియె ప్రపన్నుండు. అటుగాన సాత్వికమె ప్రమాణము, శ్రీకృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ! తైలములేని జ్యోతిక్రియను.

42

దేవా, సుజ్ఞానమను విత్తు, వివేకమను మొలక సద్వైష్ణవముచే బొదలి సదాచార్యకటాక్షముచే తిరిగెవారి తిరుమంత్రములనెడి పువ్వుపూచి ద్వయమనెడి పిందెదిగి అందుల చరమార్థములను తెరుగుచుండెనయ్యా! శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ! మీ కృపను.

43

దేవా, అతిమధురం, అనేక మధురం, హరిసత్కీర్తన. పుణ్యమోక్షనారాయం సింహగిరినాథుపాదకమల చింత తద్గుణరస మోక్షసారము. నమో నమో (దయానిధీ!)

  1. ఆయురన్నం ప్రయచ్చామి?