సాధన పాదము

వికీసోర్స్ నుండి
పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (సాధన పాదము)
ఈ అభ్యాసాలను ఆచరించడంద్వారా ఇంద్రియములను సంపూర్ణంగా జయించగలడు. :



1. తపస్స్వాధ్యాయేశ్వరప్రణిధానాని క్రియాయోగః[మార్చు]

(తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని క్రియాయోగః) - యోగసాధన మూడు భాగాలు. అవి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరునియందు మనస్సును లగ్నము చేయడం.


2. సమాధిభావనార్థః క్లేశతనుకరణార్థశ్చ[మార్చు]

(సమాధి భావన అర్థః క్లేశ తను కరణ అర్థః చ) - ఈ క్రియాయోగం ఆచరించడం క్లేశములను నశింపజేసి సమాధిస్థితి పొందడానికి.


3. అవిద్యాఽస్మితారాగద్వేషాభినివేశాః పంచక్లేశాః[మార్చు]

(అవిద్యా అస్మితా రాగ ద్వేష అభినివేశాః పంచ క్లేశాః) - క్లేశములు ఐదు. అవి అజ్ఞానం, అస్మిత (అహమిక), రాగము, ద్వేషము, అభినివేశము (జీవితేచ్ఛ, మరణభయం).


4. అవిద్యాక్షేత్రముత్తరేషాం ప్రసుప్తతనువిచ్ఛిన్నోదారాణామ్[మార్చు]

(అవిద్యా క్షేత్రమ్ ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదారాణామ్) - అవిద్య మిగతా నాలుగు క్లేశములకు హేతువు. క్లేశములు అంతర్లీనమయి ఉంటాయి. లేదా క్షీణిస్తూనో వృద్ధి పొందుతూనో ఉంటాయి.


5. అనిత్యాశుచి దుఃఖానాత్మసు నిత్యశుచీ సుఖాఽత్మ ఖ్యాతిరవిద్యా[మార్చు]

(అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచీ సుఖ ఆత్మ ఖ్యాతిః అవిద్యా) - అనిత్యమైనదానిని నిత్యము అనీ, అశుద్ధమైనదానిని పరిశుద్ధమైనది అనీ, దుఃఖమును సుఖమనీ భ్రమించడమే అవిద్య.


6. దృగ్దర్శనశక్త్యోరేకాత్మతేవాస్మితా[మార్చు]

(దృక్ దర్శన శక్త్యోః ఏక ఆత్మతా ఇవ అస్మితా) - దృక్కుని (సాధారణ బుద్ధిని) దర్శనశక్తిగా గుర్తించడం అస్మిత.


7. సుఖానుశయీ రాగః[మార్చు]

(సుఖ అనుశయీ రాగః) - మమత్వము సుఖమును కలిగిస్తుంది.


8. దుఃఖానుశయీ ద్వేషః[మార్చు]

(దుఃఖ అనుశయీ ద్వేషః) - ద్వేషము దుఃఖమును కలిగిస్తుంది.


9. స్వరసవాహీ విదుషోఽపి తథాఽరూఢోఽభినివేశః[మార్చు]

(స్వరసవాహీ విదుషః అపి తథా ఆరూఢః అభినివేశః) - పండితులలో సైతం జీవితేచ్ఛ, మరణభయం అజ్ఞానమువల్లనే అభివృద్ధి చెందుతాయి.

10. తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః[మార్చు]

(తే ప్రతి ప్రసవ హేయాః సూక్ష్మాః) - ఈ విషయముల (రాగద్వేషాలు, అహం, అభినివేశం) మూలములను గుర్తించి, వాటిని ప్రతిఘటించి నివర్తింపచేయాలి.


11. ధ్యానహేయాస్తద్వృత్తయః[మార్చు]

(ధ్యాన హేయాః తత్ వృత్తయః) - క్లేశములను ధ్యానముతో నివర్తింపచేయాలి.

12. క్లేశమూలః కర్మాశయో దృష్టాదృష్టజన్మవేదనీయాః[మార్చు]

(క్లేశ మూలః కర్మ ఆశయః దృష్ట అదృష్ట జన్మ వేదనీయాః) - క్లేశములు (రాగద్వేషాలు, అభినివేశము) ప్రస్తుత జన్మలోనూ భావి జన్మలలోనూ కర్మలవలన కలుగుతాయి. కర్మలకు మూలము అస్మిత. క్లేశములవలన కర్మలూ, కర్మలవలన క్లేశములు పునరావృతము అవుతూ మళ్ళీ మళ్లీ జన్మించడానికి కారణం అవుతాయి.


13. సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః[మార్చు]

(సతి మూలే తత్ విపాకః జాతి ఆయుః భోగాః) - ఒక జన్మలో జీవి చేసిన కర్మలయొక్క ఫలములను అనుసరించి మరుజన్మలో జాతి, ఆయుష్షు, ఇతర భోగములు కలుగుతాయి.


14. తే హ్లాదపరితాపఫలాః పుణ్యాపుణ్య హేతుత్వాత్[మార్చు]

(తే హ్లాద పరితాప ఫలాః పుణ్య అపుణ్య హేతుత్వాత్) - ఒక జన్మలో చేసిన పుణ్యపాపాలను అనుసరించి మరుజన్మలో సుఖదుఃఖాలు అనుభవము అవుతాయి.


15. పరిణామతాప సంస్కార దుఃఖైర్గుణవృత్తి విరోధాచ్చ దుఃఖమేవ సర్వం వివేకినః[మార్చు]

(పరిణామ తాప సంస్కార దుఃఖైః గుణ వృత్తి విరోధాత్ చ దుఃఖమ్ ఏవ సర్వమ్ వివేకినః) - అనవరతమూ మారే పరిస్థితులు, భౌతిక సుఖాలు, సాత్త్విక తామస రాజస గుణాలు – వీటివలన కలిగే పరస్పర విరుద్ధ అనుభవాలూ - అన్నిటినీ వివేకవంతుడు దుఃఖభాజనముగా పరిగణిస్తాడు.

16. హేయం దుఃఖమనాగతమ్ .[మార్చు]

(హేయమ్ దుఃఖమ్ అనాగతమ్) - భావి జన్మలలో కలగనున్న దుఃఖములను ప్రస్తుత జన్మలో ఉపసంహరించుకోవాలి.

17. ద్రష్టృదృశ్యయోః సంయోగో హేయహేతుః[మార్చు]

(ద్రష్టృ దృశ్యయోః సంయోగః హేయ హేతుః) - ద్రష్ట (చూచేవాడు) తనకీ దృశ్యమునకూ (దృశ్యమాన ప్రపంచం) మధ్య విభేదము లేదన్న భావన ఉపసంహరించవలసి ఉంది.

18. ప్రకాశక్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యమ్.[మార్చు]

(ప్రకాశ క్రియా స్థితిశీలం భూత ఇంద్రియాత్మకం భోగ అపవర్గార్థం దృశ్యమ్) - దృశ్యముయొక్క గుణములు కాంతి, ఆచరణ (క్రియాశీలత), స్థిరత్వము. సాధకుడు ఇంద్రియములద్వారా కలిగిన అనుభవాలను గుర్తించి, వాటినుండి తన దృష్టిని యోగసాధనవైపు మళ్ళించడమే దృశ్యముయొక్క ప్రయోజనము.


19. విశేషావిశేష లింగమాత్రాలింగాని గుణపర్వాణి[మార్చు]

(విశేష అవిశేష లింగమాత్ర అలింగాని గుణ పర్వాణి) - ఈ గుణాలు నాలుగు విధాలుగా చెప్పుకోవచ్చు – ప్రత్యేకత కలిగినవి, సాధారణమైనవి, సూచనప్రాయమైనవి, సూచనప్రాయంగానైనా ఏమీ చెప్పనివి.


20. ద్రష్టా దృశిమాత్రః శుద్ధోఽపి ప్రత్యయానుపశ్యః[మార్చు]

(ద్రష్టా దృశి మాత్రః శుద్ధః అపి ప్రత్యయ అనుపశ్యః) ద్రష్ట (ఆత్మ) స్వతస్సిద్ధంగా పరిశుద్ధము అయినా దృశ్యమును ఇంద్రియాలద్వారా చూడడం జరుగుతుంది.


21. తదర్థ యేవ దృశ్యస్యాఽత్మా[మార్చు]

(తత్ అర్థః ఏవ దృశ్యస్య ఆత్మా) - ద్రష్ట ఏర్పడినది దృశ్యముయొక్క అనుభవంకోసం మాత్రమే.

22. కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం తదన్యసాధారణత్వాత్[మార్చు]

(కృత అర్థం ప్రతి నష్టమ్ అపి అనష్టమ్ తత్ అన్య సాధారణత్వాత్) - అది గ్రహించినవారికి దృశ్యము కనిపించకుండా పోతుంది. కానీ ఆ అవగాహన లేనివారికి మాత్రం ఆ దృశ్యం కనిపిస్తూనే ఉంటుంది.


23. స్వస్వామిశక్త్యోః స్వరూపోపలబ్ధిహేతుస్సంయోగః[మార్చు]

(స్వ స్వామి శక్త్యోః స్వరూప ఉపలబ్ధి హేతుః సంయోగః) - ఆత్మ ప్రకృతి, దృశ్యము పురుషుడు. ప్రకృతి ధ్యేయము ఆత్మజ్ఞానం. పురుషుని ధ్యేయం సంయోగముద్వారా ఆ రెంటి స్వరూపాలను తెలివిడి చేయడం.

24. తస్య హేతురవిద్యా[మార్చు]

(తస్య హేతుః అవిద్యా) - ప్రకృతి పురుషుల సంయోగానికి కారణం అవిద్య.


25. తదభావాత్సంయోగాభావో హానం తద్దృశేః కైవల్యమ్[మార్చు]

(తత్ అభావాత్ సంయోగ అభావః హానమ్ తత్ దృశేః కైవల్యమ్) - అవిద్య నశించినతరవాత సంయోగం అంతమవుతుంది. అదే విముక్తి. దృశ్యమాన ప్రపంచంనుండి విడివడగలగడమే కైవల్యము. (నాల్గవ అధ్యాయములో విపులముగా వివరించబడింది).

26. వివేకఖ్యాతిరవిప్లవా హానోపాయః[మార్చు]

(వివేక ఖ్యాతిః అతిః అవిప్లవా హాన ఉపాయః) - అవిద్యను తొలగించగల సాధనము విచారణ. దానిని నిరవధికంగా స్పష్టంగా నిర్దుష్టంగా కొనసాగించాలి.


27. తస్య సప్తధా ప్రాంతభూమిః ప్రజ్ఞా[మార్చు]

- అవిద్యను నాశనము చేసి ప్రజ్ఞ సాధించడానికి ఏడు పద్ధతులు ఉన్నాయి. (ఆ ఏడు పద్ధతులు - నిత్యానిత్య వస్తు వివేకజ్ఞానం, సమస్త దుఃఖనివారణ, పరిపూర్ణజ్ఞానప్రాప్తి, కర్తవ్య త్యాగబుద్ధి, స్వాతంత్ర్యం, చిత్తస్వాధీనం, నిరాశ్రయమైన జ్ఞానం.)


28. యోగాంగానుష్ఠానాదశుద్ధిక్షయే జ్ఞానదీప్తిరవివేకఖ్యాతేః[మార్చు]

(యోగ అంగ అనుష్ఠానాత్ అశుద్ధి క్షయే జ్ఞాన దీప్తిః అవివేక ఖ్యాతేః) - యోగాంగములు అనుష్ఠించడంవల్ల అవిద్య నశించి జ్ఞానదీపం ప్రకాశిస్తుంది.


29. యమ నియమాఽసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయోఽష్టావంగాని[మార్చు]

(యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయః అష్టౌ అంగాని) - యోగసాధనలో ఎనిమిది అంగములు ఉన్నాయి. అవి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, నిశ్చల ధ్యానము, అనవరత ధ్యానము, సమాధి.

30. అహింసా సత్యమస్తేయ బ్రహ్మచర్యాపరిగ్రహా యమాః[మార్చు]

(అహింసా సత్యమ్ అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహా యమాః) - యమములు ఐదు. అవి అహింస, సత్యము, చోరబుద్ధి లేకుండుట, బ్రహ్మచర్యం, పరుల సొమ్ము స్వీకరించకుండుట.

31. జాతి దేశ కాల సమయానవచ్ఛిన్నాః సార్వభౌమా మహావ్రతమ్[మార్చు]

(జాతి దేశ కాల సమయ అనవచ్ఛిన్నాః సార్వభౌమః మహా వ్రతమ్) - కులం, స్థలం, కాలం, పరిస్థితులవల్ల కలిగే అవధులను లెక్క చేయకుండా నియమాలను ఆచరించడమే మహా వ్రతము.

32. శౌచ సంతోష తపః స్వాధ్యాయేశ్వరప్రణిధానాని నియమాః[మార్చు]

(శౌచ సంతోష తపః స్వాధ్యాయ ఈశ్వరప్రణిధానాని నియమాః) - నియమములు ఐదు. అవి పరిశుభ్రత (మనస్సు, శరీరము), ఆనందము, తపస్సు, స్వాధ్యాయము, భగవంతునియందు చిత్తము లగ్నము చేయడం.

33. వితర్కబాధనే ప్రతిపక్ష భావనమ్[మార్చు]

(వితర్క బాధనే ప్రతి పక్ష భావనమ్) - బాధించే తలపులను వాటికి వ్యతిరేకమైన భావాలతో తొలగించుకోవాలి.

34. వితర్కా హింసాదయః కృతకారితానుమోదితా లోభ క్రోధ మోహపూర్వకా[మార్చు]

మృదుమధ్యాధిమాత్రాదుఃఖాజ్ఞానానంతఫలా యితి ప్రతిపక్షభావనమ్.[మార్చు]

(వితర్కా హింస ఆదయః కృత కారిత అనుమోదితః లోభ క్రోధ మోహ పూర్వకః మృదు మధ్య అధిమాత్రః దుఃఖ అజ్ఞాన అనంత ఫల ఇతి ప్రతిపక్ష భావనమ్) - యోగసాధనకి ప్రతిబంధకమైన హింసవంటి చర్యలు – స్వయంకృతం గానీ ఇతరుల చర్యలవల్ల గానీ సంభవిస్తాయి. కోపము, లోభము లేదా మోహము ఇత్యాదులవల్ల కలుగవచ్చు. అవి ఏ స్థాయిలోనైనా - మహోధృతంగానో, ఓ మోస్తరుగానో, సాధారణస్థాయిలో -సాధకునిచర్యగా పరిణమించవచ్చు. అందుచేత ఆ యా ప్రవృత్తులను వాటికి తగిన వ్యతిరేక భావనలతో అరికట్టాలి.

35. అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః[మార్చు]

(అహింస అప్రతిష్ఠాయాం తత్ సన్నిధౌ వైర త్యాగః) అహింసాప్రవృత్తిని గట్టి పట్టుదలతో నిలకడగా పాటించినవాని సమీపంలో వైరభావాలు నిలువవు.

36. సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్[మార్చు]

(సత్య ప్రతిష్ఠాయాం క్రియాఫల ఆశ్రయత్వమ్) నిత్య సత్యవ్రతుని కర్మలు సత్ఫలితాలను ఇస్తాయి.


37. అస్తేయప్రతిష్ఠాయాం సర్వరత్నోపస్థానమ్.[మార్చు]

(అస్తేయ ప్రతిష్ఠాయాం సర్వ రత్న ఉపస్థానమ్) చోరబుద్ధిని జయించినవానికి సకల సంపదలు సమకూరుతాయి.


38. బ్రహ్మచర్యప్రతిష్ఠాయాం వీర్యలాభః[మార్చు]

(బ్రహ్మచర్య ప్రతిష్ఠాయాం వీర్య లాభః) దృఢచిత్తంతో బ్రహ్మచర్యదీక్ష పూనినవానికి శారీరక, మానసిక దారుఢ్యము కలుగుతుంది.



39. అపరిగ్రహస్థైర్యే జన్మకథంతాసంబోధః[మార్చు]

(అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంతా సంబోధః) పరులసొమ్ము స్థిరచిత్తముతో తిరస్కరించినవాడు జన్మవృత్తాంతమునుగురించి తెలుసుకొనగలడు.


40. శౌచాత్స్వాంగ జుగుప్సా పరైరసంసర్గః[మార్చు]

(శౌచాత్ స్వ అంగ జుగుప్సా పరైః అసంసర్గః) పరిశుభ్రతను పాటించడంవలన తన శరీరము అంటే రోత, ఇతరులతో సంపర్కము విషయంలో వైముఖ్యం సిద్ధిస్తాయి.

41. సత్త్వశుద్ధిసౌమనస్యైకాగ్రేంద్రియజయాత్సమదర్శనయోగ్యత్వాని చ[మార్చు]

(సత్త్వ శుద్ధి సౌమనస్య ఏకాగ్ర ఇంద్రియ జయాత్ సమ దర్శన యోగ్యత్వాని చ) మనసు నిర్మలముగా ఉంచుకున్న సాధకుడు సాత్వికగుణము, మంచితనము, ఏకాగ్రత, ఇంద్రియనిగ్రహము, ఆత్మదర్శనము పొందగలడు.

42. సంతోషాదనుత్తమసుఖలాభః[మార్చు]

(సంతోషాత్ అనుత్తమ సుఖ లాభః) - నిత్య సంతుష్టునికి అత్యుత్తమైన ఆనందము సిద్ధిస్తుంది.


43. కాయేంద్రియసిద్ధిరశుద్ధిక్షయాత్తపసః[మార్చు]

(కాయ ఇంద్రియ సిద్ధిః క్షయాత్ తపసః) - తపోనిష్ఠ శరీరాన్నీ ఇంద్రియములనూ అంటి ఉన్న మాలిన్యమును తొలగిస్తుంది.


44. స్వాధ్యాయాదిష్టదేవతా సంప్రయోగః[మార్చు]

(స్వాధ్యాయాత్ ఇష్ట దేవతా సంప్రయోగః) - స్వాధ్యాయమువలన ఇష్టదేవతలను చేరగలుగుతాడు.


45. సమాధిసిద్ధిరీశ్వరప్రణిధానాత్[మార్చు]

ఈశ్వరునియందు చిత్తము లగ్నము చేయడంవలన సమాధి సిద్ధిస్తుంది.

46. స్థిరసుఖామాసనం[మార్చు]

(స్థిర సుఖమ్ ఆసనమ్) - స్థిరంగానూ ఇబ్బంది కాని విధంగానూ కూర్చోడం ముఖ్యం.


47. ప్రయత్నశైథిల్యానంతసమాపత్తిభ్యామ్[మార్చు]

(ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యామ్) - అది సమాధిస్థితి చేరుకోడానికి సహాయకారి అవుతుంది.


48. తతో ద్వంద్వానభిఘాతః[మార్చు]

(తతః ద్వంద్వ అనభిఘాతః) - ఆ పైన సుఖదుఃఖాలు, శీతోష్ణాలవంటి ద్వంద్వములు బాధించవు.


49. తస్మిన్ సతి శ్వాసప్రశ్వాసయోర్గతివిచ్ఛేదః ప్రాణాయామః[మార్చు]

(తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోః గతి విచ్ఛేదః ప్రాణాయామః) - ఊపిరి పీల్చి ఉంచడం, వదలి ఉంచడం (పూరక, రేచక క్రియలు) యోగసాధనకు నిర్ణీతమైన పద్ధతిలో చేయడం ప్రాణాయామము.


50. బాహ్యాభ్యంతరస్తంభవృత్తిః దేశకాలసంఖ్యాభిః పరిదృష్టో దీర్ఘసూక్ష్మః[మార్చు]

(బాహ్య అభ్యంతర స్తంభ వృత్తిః దేశ కాల సంఖ్యాభిః పరిదృష్టః దీర్ఘ సూక్ష్మః) - ఊపిరి పీల్చి ఆస్థితిలో ఉండడం (పూరక),ఊపిరి వదలి ఆ స్థితిలో ఉండడం (రేచక) రెండు పద్ధతులు. అలా ఊపిరి బిగబట్టి గానీ బయటికి వదలి గానీ ఎంతసేపు నిలపడం అన్నది సాధకుని సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అలాగే రోజుకి ఎన్నిసార్లు చేయడం అన్నది కూడా సాధకుడు నిర్ణయించుకోవాలి.


51. బాహ్యాంతరవిషయాఽక్షేపీ చతుర్థః[మార్చు]

(బాహ్య అంతర విషయ ఆక్షేపీ చతుర్థః) - ఈ ప్రాణాయామము నాలుగు స్థాయిలలో ఉంటుంది.


52. తతః క్షీయతే ప్రకాశాఽవరణమ్[మార్చు]

(తతః క్షీయతే ప్రకాశ ఆవరణమ్) - అది అంతర్జ్యోతిని ఆవరించిన అంధకారాన్ని నశింపచేస్తుంది.

53. ధారణాసు చ యోగ్యతా మనసః[మార్చు]

- ఈ అష్టాంగములను ఆచరించడంద్వారా సాధకుడు పరమపురుషుని చేరడానికి తగిన యోగ్యత, సామర్ధ్యము పొందగలడు.


54. స్వవిషయాసంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార యివేంద్రియాణాం ప్రత్యాహారః[మార్చు]

(స్వవిషయ అసంప్రయోగే చిత్తస్య స్వరూప అనుకారః ఇవ ఇంద్రియాణాం ప్రత్యాహరః) - ఇంద్రియప్రవృత్తులను (చూడడం, వినడం వంటివి) వాటికి లక్ష్యాలు అయిన వస్తువులనుండి నివర్తింపజేయడమే ప్రత్యాహారం.

55. తతః పరమా వశ్యతేంద్రియాణాం[మార్చు]

(తతః పరమా వశ్యతా ఇంద్రియాణామ్) - ఈ అభ్యాసాలను ఆచరించడంద్వారా ఇంద్రియములను సంపూర్ణంగా జయించగలడు.



పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (సాధన పాదము)
ఈ అభ్యాసాలను ఆచరించడంద్వారా ఇంద్రియములను సంపూర్ణంగా జయించగలడు. :


మూస:పతంజలి యోగ సూత్రములు