సమాచార హక్కు చట్టం, 2005/ఛాప్టర్ VI

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఛాప్టర్ VI

ఇతర నిబంధనలు

21. ఈ చట్టం కింద లేక ఈ చట్టం కింద రూపొందిన రూల్స్ కింద నుంచి చేస్తున్నానన్న నమ్మకంతో ఎవరేం చేసినా, చేసేందుకుఉద్దేశించినా అందుకు వారిపై ఎలాంటి దావాలు వేయడం, ప్రాసిక్యూట్ చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం కుదరదు.
22. అధికార రహస్యాల చట్టం, 1923 అమలులో ఉన్న మరేదైనా చట్టం, లేక మరేదైనా చట్టం వల్ల అమలులో ఉన్న పత్రంలో ఈచట్టంతో పొసగని అంశాలు ఎలాంటివి ఉన్నప్పటికీ ఈ చట్టంలోని నిబంధనలు అమలులో ఉంటాయి.
23. ఈ చట్టం కింద ఎలాంటి ఆదేశం జారీ అయినా దానిపై దావాను గానీ, దరఖాస్తును గానీ, ఇతర విచారణలను గానీ ఏ న్యాయస్థానం చేపట్టరాదు. ఈ చట్టం కింద అప్పీలు చేయడం మినహాయించి ఆ ఆదేశాలను ప్రశ్నించడం కుదరదు.

24. (1) రెండవ షెడ్యూల్లో పేర్కొన్న ఇంటిలిజెన్స్, భద్రతా సంస్థలకు, ఆ సంస్థలు ప్రభుత్వానికి సమర్పించే ఎలాంటి సమాచారానికీ ఈచట్టం వర్తించదు. అవినీతి ఆరోపణలు, మానవహక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం అయిన పక్షంలో ఈ సబ్ సెక్షన్ నుండి మినహాయింపు ఉంటుంది. మానవహక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం కోరినప్పుడు కేంద్ర సమాచారకమిషన్ ఆమోదం తర్వాత మాత్రమే అలాంటిఅభ్యర్ధన అందిన దగ్గర నుంచి 45 రోజులలోగా, సెక్షన్ 7 లోని నిబంధనలతో నిమిత్తం లేకుండా, సమాచారంఅందించాల్సి ఉంటుంది.

(2) కేంద్ర ప్రభుత్వం తాను నెలకొల్పిన మరో ఇంటిలిజెన్స్ లేక భద్రతా సంస్థను, అధికార గెజిట్లో ప్రచురించడం ద్వారా, రెండవ షెడ్యూల్లోచేర్చవచ్చు. అలాగే ఇప్పటికే అందులో ఉన్న ఏదైనా సంస్థను తొలగించవచ్చు. అలాంటి నోటిఫికేషన్ ప్రచురించగానే ఒక సంస్థ షెడ్యూలు లో చేరినట్టుగానో లేక తొలగిపోయినట్లుగానో లెక్క.
(3) సబ్ సెక్షన్ (2) కింద జారీ చేసిన ప్రతి నోటిఫికేషన్ నూ పార్లమెంటు ఉభయసభల ముందు ఉంచాలి.
(4) రాష్ర్టప్రభుత్వం నెలకొల్పిన ఇంటలజెన్స్, భద్రతాసంస్థలకు ఈ చట్టం వర్తించదు. ఆ ఇంటిలిజెన్స్, భద్రతాసంస్థలను రాష్ట్రప్రభుత్వం అధికార గెజిట్లో నోటిఫికేషన్ ద్వారాపేర్కొన వచ్చు. అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమాచారం అయినప్పుడు ఈ సబ్ సెక్షన్ నుంచి మినహాయింపు ఉంటుంది. మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం అయితే, రాష్ట్ర సమాచార కమిషన్ఆమోదం పొందిన తర్వాత, సెక్షన్ 7 లోని నిబంధనలతో నిమిత్తం లేకుండా, అభ్యర్థన అందిన నాటి నుంచి 45 రోజులలోగా ఆసమాచారం అందించాల్సి ఉంటుంది.
(5) సబ్ సెక్షన్ (4) కింద జారీచేసిన ప్రతి నోటిఫికేషన్ నూ రాష్ట్ర శాసనసభ ముందు ఉంచాలి.

25. (1) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ ఆచరణలో ఎంత త్వరగా సాధ్యం అయితే అంత త్వరగా ప్రతి ఏడాదిఆఖరులో ఈ చట్టంలోని నిబంధనల అమలుపై ఒక నివేదిక రూపొందించి దాని కాపీని సముచిత ప్రభుత్వానికి పంపాలి.

(2) ఈ సెక్షన్ కింద నివేదిక రూపొందించడం కోసం ప్రతి మంత్రిత్వశాఖ లేక డిపార్ట్ మెంటు తమ పరిధిలోని అధికార యంత్రాంగాలకుసంబంధించిన సమాచారం సేకరించి కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ కు సమర్పించాలి. ఆ తరహా సమాచారంసమర్పించడం, రికార్డులను నిర్వహించడం కోసం అవసరమైన అన్ని అంశాలు పాటించాలి.
(3) ప్రతి నివేదికలో ఆ సంవత్సరానికి సంబంధించి ఈ కింది అంశాలు ఉండాలి :
(ఎ) ప్రతి అధికార యంత్రాంగానికి వచ్చిన అభ్యర్ధనల సంఖ్య
(బి) దరఖాస్తుదారులకు సమాచారం అందివ్వకూడదన్న నిర్ణయాల సంఖ్య .ఈ చట్టంలో ఆ నిర్ణయాలకు ప్రాతిపదికగా ఉన్న నిబంధనలవివరాలు, ఎన్నిసార్లు ఆ నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందీ.
(సి) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ కు అందిన అప్పీళ్ళ సంఖ్య ఆ అప్పీళ్ల వివరాలు, ఆ అప్పీళ్ల ఫలితాలు.
(డి) ఈ చట్టం అమలుకు సంబంధించి ఏ అధికారిపైన అయినా క్రమశిక్షణా చర్యలు తీసుకుని ఉంటే ఆ వివరాలు.
(ఇ) ఈ చట్టం కింద ప్రతి అధికార యంత్రాంగం వసూలు చేసిన రుసుముల వివరాలు.
(ఎఫ్) ఈ చట్టం స్ఫూర్తినీ , ఉద్దేశాలనూ అమలులో పెట్టేందుకు అధికార యంత్రాంగాల తరపున ఏదైనా కృషి జరిగి ఉంటే అందుకుసంబంధించిన వాస్తవ సమాచారం.
(జి) ఏదైనా ఒక ప్రత్యేకమైన అధికార యంత్రాంగానికి సంబంధించిన సిఫార్సులతో సహా సంస్కరణలకు సంబంధించిన సిఫారసులు, ఈచట్టం లేక సమాచార హక్కును అమలులోకి తీసుకురావడానికి ఉపకరించే మరే చట్టం అయినా, వాటి అభివృద్ధి, వికాసం, ఆధునీకరణ,సంస్కరణ, సవరణలకు సంబంధించిన సిఫార్సులు.
(4) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ర్ట సమాచార కమిషన్ రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆఖరులో ఆచరణలో ఎంత త్వరగా సాధ్యం అయితే అంత త్వరగాపార్లమెంటు ఉభయసభల ముందు లేక రాష్ట్రాలలో రెండు సభలు ఉంటే రెండు సభల ముందు, లేక విధానసభ ఒకటే ఉంటే ఆ సభముందు ఉంచాలి.
(5) ఒక అధికార యంత్రాంగం ఈ చట్టం కింద తన విధులు నిర్వహించడం ఈ చట్టం నిబంధనలకూ, స్ఫూర్తికీ అనుగుణంగా లేదని కేంద్రసమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ భావించిన పక్షంలో ఆ విధానాలు అందుకు అనుగుణంగా ఉండేందుకు తీసుకోవల్సిన చర్యలను ఆ అధికార యంత్రాంగానికి సిఫారసు చేయవచ్చు.


26. (1) ఆర్థిక వనరులు, ఇతర వనరులు అందుబాటులో ఉన్నంతమేరకు సముచిత ప్రభుత్వం కింది చర్యలు చేపట్టాలి:

(ఎ) ఈ చట్టంలో నిర్దేశించిన హక్కులను వినియోగించుకునే విషయంలో ప్రజలు, ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజల అవగాహననుపెంపొందించడం కోసం కార్యక్రమాలను రూపొందించి నిర్వహించడం.
(బి) క్లాజ్ (ఎ)లో పేర్కొన్న కార్యక్రమంలో పాలుపంచుకోవడం, అలాంటి కార్యక్రమాలు తామే చేపట్టడం కోసం అధికార యంత్రాంగాలనుప్రోత్సహించడం.
(సి) తమ కార్యకలాపాల గురించి అదికార యంత్రాంగాలు సరైన సమయంలో, సమర్థవంతంగా, ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకుఅందించేట్లు చూడడం.
(డి) కేంద్ర పౌర సమాచార అధికారులు లేక రాష్ట్ర పౌర సమాచార అధికారులకు శిక్షణ ఇవ్వడం, అధికార యంత్రాంగాలు ఉపయోగించుకోవడం కోసం శిక్షణా సామాగ్రిని రూపొందించడం.
(2) ఈ చట్టం కింద సంక్రమించిన హక్కులను వినియోగించుకోదలచిన ఏ వ్యక్తికి అయినా అవసరమయ్యే సమాచారంతో, తేలికగాఅర్థం అయ్యే రీతిలో ఒక గైడ్ ను సముచిత ప్రభుత్వం, ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 18 నెలలులోగా అధికార భాషలోముద్రించాలి.
(3) సముచిత ప్రభుత్వం, అవసరమైన పక్షంలో, సబ్ సెక్షన్ (2) లో సూచించిన మార్గదర్శక సూత్రాలను ఎప్పటికప్పుడు సవరించిప్రచురించవచ్చు. సబ్ సెక్షన్ (2) సాధారణ లక్షణాలకు భంగం వాటిల్లని రీతిలో ఈ కింది విషయాలపై మార్గదర్శక సూత్రాలనుప్రచురించవచ్చు.
(ఎ) ఈ చట్టం లక్ష్యాలు,
(బి) సెక్షన్ 5 లోని సబ్ సెక్షన్ (1) కింద ప్రతి అధికార యంత్రాంగంలో నియమితులైన కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌరసమాచార అధికారి చిరునామా, ఫోన్ నంబరు, ఫ్యాక్స్ నంబరు, దొరికిన పక్షంలో ఇ-మెయిల్ అడ్రస్,
(సి) కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారికి సమాచారం కోసం అభ్యర్ధన అందించే విధానం, రూపం,
(డి) ఈ చట్టం ప్రకారం ఒక అధికార యంత్రాంగంలోని కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర అధికారి నుంచి దరఖాస్తుదారుకుఅందే సహాయం, ఆ అధికారుల విధులు.
(ఇ) కేంద్ర సమాచారం కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ నుంచి అందగల సహాయం
(ఎఫ్) ఈ చట్టం ద్వారా సంక్రమించిన హక్కులు, ఈ చట్టం నిర్దేశిస్తున్న విధులకు సంబంధించి ఏదన్నా జరిగినా, ఏదన్నాజరగకపోయినా, సమాచార కమిషన్ కు అప్పీలు చేసుకోవడంతో సహా చట్టంలో ఉన్న అన్ని పరిష్కార మార్గాలు,
(జి) సెక్షన్ 4 ప్రకారం వివిధ విభాగాల రికార్డులను స్వచ్ఛందంగా వెల్లడి చేయడానికి సంబంధించిన నిబంధనలు,
(హెచ్) సమాచారం అందుబాటు కోసం చెల్లించాల్సిన రుసుము నోటీసులు,
(ఐ) ఈ చట్టం ప్రకారం సమాచారం అందుబాటు కోసం ఏవైనా రూల్స్ రూపొందించినా, సర్క్యులర్లు జారీ చేసినా వాటి వివరాలు,
(4) సముచిత ప్రభుత్వం, అవసరం అయిన పక్షంలో, తప్ననిసరిగా మార్గదర్శక సూత్రాలను ఎప్పటికప్పుడు సవరించి ప్రచురించాలి.


27. (1) ఈ చట్టంలోని నిబంధనలు అమలు చేయడం కోసం కేంద్రప్రభుత్వం అధికార గెజిట్ లో ప్రచురించడం ద్వారా రూల్స్ రూపొందించవచ్చు.

(2) పైన చెప్పిన అధికారం సాధారణతకు భంగం కలగని రీతిలో ఈ కింది విషయాలన్నింటికీ లేక వాటిలో కొన్నిటికి సంబంధించి రూల్స్ రూపొందించవచ్చు.
(ఎ) సెక్షన్ 4 లోని సబ్ సెక్షన్ (4) కింద వ్యాప్తి చేయాల్సిన విషయాల మాధ్యమానికి లేక ముద్రణకూఅయ్యే ఖర్చు ధర,
(బి) సెక్షన్ 6 లోని సబ్ సెక్షన్ (1) కింద చెల్లించాల్సిన రుసుము,
(సి) సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) , (5) కింద చెల్లించాల్సిన రుసుము,
(డి) సెక్షన్ 13 లోని సబ్ సెక్షన్ (7) ప్రకారం, సెక్షన్ 16 లోని సబ్ సెక్షన్ (6) ప్రకారం అధికారులకూ, ఇతర ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలు, అలవెన్సులు, వారి సర్వీసు నిబంధనలు,
(ఇ) సెక్షన్ 19 లోని సబ్ సెక్షన్ (10) ప్రకారం అప్పీళ్లపై విచారణకు కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ అవలంబించవలసిన పద్ధతి.
(ఎఫ్) నిర్ణీత పద్ధతిలో నిర్ణయించవలసిన మరే విషయమయినా.

28. (1) ఈ చట్టంలోని నిబంధనలను అమలు చేయడం కోసం అధికార గెజిట్ లో ప్రచురించడం ద్వారా సమర్థ అధికారి నియమాలు రూపొందించవచ్చు.

(2) పైన చెప్పిన అధికారం సాధారణతకు భంగం కలగని రీతిలో ఈ కింది విషయాలన్నింటికీ, లేక వాటిలో కొన్నిటికి సంబంధించి రూల్స్ రూపొందించవచ్చు :
(ఎ) సెక్షన్ 4 లోని సబ్ సెక్షన్ (4) కింద వ్యాప్తి చేయాల్సిన విషయాల మాధ్యమానికి లేక ముద్రణకు అయ్యే ఖర్చు ధర,
(బి) సెక్షన్ 6 లోని సబ్ సెక్షన్ (1) కింద చెల్లించాల్సిన రుసుము,
(సి) సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) కింద చెల్లించాల్సిన రుసుము,
(డి) నిర్ణీత పద్దతిలో నిర్ణయించవలసిన మరే విషయంలో.

29. (1) ఈ చట్టం కింద చేసిన ప్రతి రూల్ నూ ఆ వెంటనే కేంద్రప్రభుత్వం పార్లమెంటు ఉభయసభల ముందు, 30 రోజులపాటు ఒకే సమావేశం లోగాని లేక రెండు అంతకు మించిన సమావేశాలలో గాని ఉంచాలి. ఒక సమావేశం తర్వాత రెండవ సమావేశం ముగిసే ముందు, లేక ముందు చెప్పిన వరుస సమావేశాలు ముగిసే ముందు ఉభయసభలు ఒక రూల్ ను సవరించాలని గాని, లేక అసలు ఆ రూల్ ఉండకూడదని కానీ నిర్ణయించిన పక్షంలో ఆ రూల్ ఆ నిర్ణయం ప్రకారం సవరించినరూపంలో అమలవుతుంది, లేక రద్దయిపోతుంది. అయితే ఆ విధమైన సవరణగానీ, రద్దు గానీ ఆ రూల్ కింద అంతకుముందు చేసినపనులపై ప్రభావం చూపించరాదు.

(2) ఈ చట్టం కింద చేసిన ప్రతి నిబంధనను, నోటిఫై చేసిన వెంటనే రాష్ట్రప్రభుత్వం విధానసభ ముందు ఉంచాలి.

30. (1) ఈ చట్టంలోని నిబంధనల అమలుకు ఎలాంటి అవరోధం ఎదురయినా కేంద్రప్రభుత్వం ఈ చట్టంలోని నిబంధనలకు విరుద్ధం కానిరీతిలో ఆ అవరోధాలను తొలగించేందుకు అవసరమనిపించిన రీతిలో అధికార గెజిట్ లో ఉత్తర్వులను ప్రచురించడం ద్వారా తగిన నిబంధనలను రూపొందించవచ్చు. ఈ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచీ రెండేళ్ల తర్వాత ఈ రకమైన ఉత్తర్వులను ప్రచురించేందుకు వీలులేదు.

(2) ఈ సెక్షన్ కింద ప్రచురించిన ప్రతి ఉత్తర్వును పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచాలి.

31. సమాచార స్వేచ్ఛ చట్టం, 2002 దీనితో రద్దయిపోయింది.