సమాచార హక్కు చట్టం, 2005/ఛాప్టర్ V

వికీసోర్స్ నుండి

ఛాప్టర్ V

సమాచార కమిషన్ల అధికారాలు, విధులు అప్పీలు, జరిమానాలు

18. (1) ఈ చట్టంలోని నిబంధనలకు లోబడి ఏ వ్యక్తి నుంచి అయినా ఫిర్యాదు స్వీకరించి విచారణ జరపడం కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ర్టసమాచార కమిషన్ విధి. ఆ ఫిర్యాదుల సందర్భాలు :


(ఎ) కేంద్ర ప్రజా సమాచార అధికారి / రాష్ట్ర ప్రజా సమాచార అధికారి నియామకం జరగని కారణంగా సమాచారం కోసం అభ్యర్ధన అందించలేని పక్షంలో, కేంద్ర ప్రజా సమాచార సహాయ అధికారి లేక రాష్ట్ర ప్రజా సమాచార సహాయ అధికారి సమాచారం కోసం వచ్చిన దరఖాస్తునో, అప్పీలునో స్వీకరించకుండా, దీనిని కేంద్ర పౌర సమాచార అదికారి రాష్ట్ర పౌర సమాచార అధికారి సెక్షన్ 19 లోని సబ్సెక్షన్ (1) పేర్కొన్న సీనియర్ అదికారి కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్కు పంపిన పక్షంలో
(బి) ఈ చట్టం కింద అభ్యర్థించిన సమాచారాన్ని అందించేందుకు నిరాకరించిన పక్షంలో,
(సి) ఈ చట్టం కింద సమాచారం కోసం ఇచ్చిన అభ్యర్ధనకు నిర్దేశించిన కాలపరిమితిలొగా జవాబు రాని పక్షంలో,
(డి) సమాచారం కోసం చెల్లించాల్సి వచ్చిన రుసుము సహేతుకంగా లేదని దరఖాస్తుదారు భావించిన పక్షంలో,
(ఇ) ఈ చట్టం కింద తనకు అసంపూర్తిగా, తప్పుదోవ పట్టించే విధంగా, తప్పుడు సమాచారం అందించారని దరఖాస్తుదారు భావించిన పక్షంలో
(ఎఫ్) ఈ చట్టం కింద సమాచారాన్ని కోరడం, రికార్డులను అందుబాటులో ఉంచడానికి సంబంధించిన మరే ఇతర విషయాలలోనయినానా


(2) ఫిర్యాదును విచారించేందుకు తగిన కారణాలు ఉన్నాయని కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్ భావించిన పక్షంలోదానిపై విచారణకు ఆదేశించవచ్చు.


(3) ఈ సెక్షన్ కింద ఏ విషయంలోనైనా విచారణ జరిపేటప్పుడు కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్ కు సివిల్ ప్రొసిజర్ కోడ్, 1908 కింద ఏ దావానయినా విచారించేప్పుడు సివిల్ కోర్టుకు ఎలాంటి అధికారాలు ఉంటాయో ఈ కింది వాటికి సంబంధించి అలాంటి అధికారాలు ఉంటాయి.
(ఎ) వ్యక్తులకు సమన్లు జారీ చేసిన వారిు హాజరు అయ్యేటట్లు చేయడం, మౌఖికంగా లిఖిత పూర్వకంగా వారు సాక్ష్యం ఇచ్చేట్లు చేయడం, పత్రాలు ఇతర వస్తువులను సమర్పించేట్లు చేయడం.
(బి) పత్రాలు వెలికితీసీ తనిఖీ చేయడం
(సి) అఫిడవిట్ రూపంలో వాంగ్మూలం స్వీకరించడం
(డి) ఏ కోర్టు కార్యాలయం నుంచి అయినా ప్రభుత్వ రికార్డులు, లేక వాటి కాపీలను తెప్పించడం.
(ఇ) సాక్ష్యులను విచారించేందుకు పత్రాలు పరిశీలించేందుకు సమన్లు జారీ చేయడం

(ఎఫ్) నిర్ణయించిన విధంగా మరే ఇతర విషయమైనా
(4) పార్లమెంట్ లేక రాష్ట్ర శాసనసభలు చేసిన ఏ ఇతర చట్టంలోని నిబంధనలు అడ్డుగా ఉన్నప్పటికీ, కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ర్టసమాచార కమిషన్ ఈ చట్టం కింద ఒక ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న సందర్భంలో, అధికార యంత్రాంగం నియంత్రణలో ఉండి ఈచట్టం వర్తించే ఏ రికార్డునయినా పరిశీలించవచ్చు. అలాంటి రికార్డులను ఏ కారణంతోనయినా సమాచార కమిషన్ ముందు ఉంచకపోవడం కుదరదు.

19. (1) సెక్షన్ 7లోని సబ్ సెక్షన్ (1) లేక సబ్ సెక్షన్ (3) లోని క్లాజు (ఎ)లో నిర్దేశించిన కాలపరిమితిలోగా జవాబు దొరకని వ్యక్తిఎవరైనా, లేక కేంద్ర పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి తీసుకున్న నిర్ణయంతో అసంతృప్తి చెందిన వారైనా ఆకాలపరిమితి ముగింపు తరువాత లేక నిర్ణయం అందిన తరువాత 30 రోజులలోగా అప్పీలు చేసుకోవచ్చు. కేంద్ర పౌర సమాచారఅధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారికి, సంబంధిత అధికార యంత్రాంగంలో సీనియర్ హోదాలో ఉన్న అధికారికి ఆ అప్పీలునునివేదించాలి. 30 రోజుల గడువు ముగిసిన తర్వాత అప్పీలు వచ్చిన సందర్భంలో ఆ ఆలస్యానికి తగిన కారణాలు ఉన్నాయని ఆసీనియర్ అధికారి భావించిన పక్షంలో ఆ అప్పీలును స్వీకరించవచ్చు.

(2) కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి సెక్షన్ 11 కింద తృతీయ పక్షానికి చెందిన సమాచారాన్ని వెల్లడిచేయాలని నిర్ణయించిన సందర్భంలో ఆ నిర్ణయంపై అప్పీలు చేయాలని తృతీయ పక్షం భావించినట్లయితే ఆ నిర్ణయం వెలువడిన 30రోజులలోగా అప్పీలు చేయాలి.
(3) సబ్ సెక్షన్ (1) కింద వచ్చిన నిర్ణయంపై రెండవసారి అప్పీలు చేయదలిస్తే ఆ నిర్ణయం తీసుకుని ఉండాల్సిన తేదీ నుంచి కానీనిర్ణయం అందిన రోజు నుంచి కానీ 90 రోజులలోగా కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ ముందు అప్పీలుకువెళ్లవచ్చు. 90 రోజుల గడువు దాటి రెండవ అప్పీలు వచ్చిన సందర్భంలో ఆ ఆలస్యానికి తగిన కారణం ఉందని కేంద్ర సమాచారకమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ భావించిన పక్షంలో దానిని స్వీకరించవచ్చు.
(4) కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి నిర్ణయంపై వచ్చిన అప్పీలు తృతీయ పక్షానికి చెందినసమాచారానికి సంబంధించినదయితే కేంద్ర సమాచార కమిషన లేక రాష్ట్ర సమాచార కమిషన్ ఆ తృతీయ పక్షానికి తమ వాదనవినిపించుకునేందుకు తగిన అవకాశం ఇవ్వాలి.
(5) ఏ అప్పీలు విచారణలోనయినా అభ్యర్ధనను తిరస్కరించడం న్యాయబద్దమేనని నిరూపించాల్సిన బాధ్యత ఆ తిరస్కరించి అధికారయంత్రాంగంపైనే ఉంటుంది.
(6) సబ్ సెక్షన్ (1) లేక సబ్ సెక్షన్ (2) కింద వచ్చిన అప్పీళ్ళను అవి అందిన తర్వాత 30 రోజులలోగా పరిష్కరించాలి. ఈ కాలపరిమితి పొడిగించాల్సి వస్తే అప్పీలు దాఖలయిన నాటి నుంచి మొత్తం 45 రోజులలోగా అప్పీలును పరిష్కరించాలి. ఆ పొడిగింపునకు గలకారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాలి.
(7) కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్ వెలువరించిన నిర్ణయాలకు తప్పనిసరిగా అందరూ కట్టుబడాలి.
(8) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ కు ఈ కింది నిర్ణయాధికారాలు ఉన్నాయి :
(ఎ) ఈ చట్టంలోని నిబంధనలు అమలు జరిపేందుకు అవసరమైన ఏవైనా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికార యంత్రాగాన్ని అదేశించడం, ఆ చర్యలలో ఈకిందివి కూడా భాగాలు :
(i) ఎవరైనా కోరిన పక్షంలో ఒక ప్రత్యేకమైన రూపంలో సమాచారం అందుబాటులో ఉంచడం
(ii) కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారిని నియమించడం
(iii)) నిర్దిష్టమైన సమాచారాన్ని లేక కొన్ని విభాగాల సమాచారాన్ని ప్రచురించడం
(iv) రికార్డుల నిర్వహణ, మేనేజ్ మెంట్, విధ్వంసానికి సంబంధించి అనుసరిస్తున్న పద్ధతులలో కొన్ని అవసరమైన మార్పులుచేయడం.
(v) అధికార యంత్రాంగంలోని అధికారులకు సమాచార హక్కుపై శిక్షణ ఇచ్చే సదుపాయాలను హెచ్చించడం.
(vi) సెక్షన్ 4 లోని సబ్ సెక్షన్ ‘(1) క్లాజు (బి) అమలుపై వార్షక నివేదిక రూపొందించడం.
(బి) ఫిర్యాదులను కలిగిన నష్టాన్ని కానీ ఇతర కష్టాన్ని కానీ పరిహారం ద్వారా పూడ్చాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం.
(సి) ఈ చట్టంలో నిర్దేశించిన విధంగా జరిమానాలు విధించడం
(డి) దరఖాస్తును తిరస్కరించడం
(9) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ తన నిర్ణయాన్ని, అప్పీలు అవకాశం ఉంటే ఆ వివరాలతో సహాఫిర్యాదుదారుకూ, అధికార యంత్రాంగానికి నోటీసు ద్వారా తెలియపరచాలి.
(10) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ అప్పీలు విచారణను నిర్ణీత పద్ధతిలో జరపవచ్చు


20. (1) ఫిర్యాదుపై లేక అప్పీలుపై కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ నిర్ణయం తీసుకునే సమయంలో, కేంద్రపౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి సరైన కారణం లేకుండా దరఖాస్తును స్వీకరించలేదని భావించినా, తగినకారణం లేకుండా సెక్షన్ 7లోని సబ్ సెక్షన్ (1) కింద నిర్దేశించిన కాలపరిమితిలోపు సమాచారం అందించలేదని భావించినా,సమాచారం కోసం అభ్యర్ధనను దురుద్దేశంతో తిరస్కరించారని భావించినా, లేక తెలిసి కూడా తప్పుడు, అసంపూర్తి తప్పుదోవబట్టించేసమాచారం అందించారని భావించినా, అభ్యర్ధనలో కోరిన సమాచారాన్ని ధ్వంసం చేశారని భావించినా, మరే విధంగానయినాసమాచారం అందకుండా అడ్డుపడ్డారని భావించినా దరఖాస్తును స్వీకరించేంతవరకు లేక సమాచారం అందించేంతవరకు రోజుకు 250రూపాయలు చొప్పున జరిమానా విధించే ముందు కేంద్ర పౌర సమాచార అధికారికి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారిపైనే ఉంటుంది.

(2) ఫిర్యాదుపై లేక అప్పీలుపై నిర్ణయం తీసుకునే సమయంలో, కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి సరైనకారణం లేకుండా పదే పదే దరఖాస్తును స్వీకరించలేదని, లేక సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) కింద నిర్దేశించిన కాలపరిమితిలోపుసమాచారాన్ని అందించలేదని కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట సమాచార కమిషన్ భావించిన పక్షంలో, లేక సమాచారం కోసంఅభ్యర్ధనను దురుద్దేశంతో తిరస్కరించారని భావించినా, లేక తెలిసికూడా తప్పుడు, అసంపూర్తి , తప్పుదోవ పట్టించే సమాచారంఅందించారని భావించినా, అభ్యర్ధనలో కోరిన సమాచారాన్ని ధ్వంసం చేశారని భావించినా, మరే విధంగా నయినా సమాచారం అందకుండా అడ్డుపడ్డారని భావించినా ఆ కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారిపై వారికి వర్తించే సర్వీసునిబంధనల కింద క్రమశిక్షణా చర్య తీసుకోవల్సిందిగా సిఫారసు చేయాలి.