సమాచార హక్కు చట్టం, 2005/ఛాప్టర్ IV

వికీసోర్స్ నుండి

ఛాప్టర్ IV

రాష్ట్ర సమాచార కమిషన్

15. (1) ఈ చట్టం కింద సంక్రమించిన అధికారాలను వినియోగించేందుకు, అప్పగించిన బాధ్యతలను నిర్వహించేందుకు..... (రాష్ట్రం పేరు).సమాచార కమిషన్ అనే సంస్థను రాష్ట్రప్రభుత్వం అధికార గెజిట్లోనోటిఫికేషన్ ద్వారా స్థాపిస్తుంది.

(2) రాష్ట్ర సమాచార కమిషన్ లో కిందివారు ఉంటారు.
(ఎ) రాష్ట్రప్రధాన సమాచార కమిషనర్
(బి) పదిమందికి మించకుండా అవసరమైన సంఖ్యలో రాష్ట్ర సమాచార కమిషనర్లు
(3) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ను, రాష్ట్ర సమాచార కమిషనర్లను ఒక కమిటీ సిఫారసు మేరకు గవర్నర్ నియమిస్తారు. ఆకమిటీలో కిందివారు ఉంటారు.
(i) ముఖ్యమంత్రి, కమిటీకి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు.
(ii) శాసనసభలో ప్రతిపక్ష నేత
(iii) ముఖ్యమంత్రి నామినేట్ చేసే ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రి.
(వివరణ : శాసనసభలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ప్రతిపక్ష పార్టీలో అతి పెద్ద పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగాపరిగణిస్తారు.)

(4) రాష్ట్ర సమాచార కమిషన్ కార్యకలాపాల సాధారణ పర్యవేక్షణ, దిశానిర్దేశం, నిర్వహణ అధికారాలు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ కు సంక్రమిస్తాయి. ఈ అధికారాల వినియోగంలో ప్రధాన సమాచార కమిషనర్ కు రాష్ట్ర సమాచార కమిషనర్లు సాయపడతారు. ఈ చట్టంకింద స్వతంత్ర ప్రతిపత్తితో మరే అధికారానికి, ఆదేశాలకు లోబడకుండా వినియోగించే అన్ని అధికారాలనూ నిర్వహించే అన్ని పనులనూ రాష్ట్ర సమాచార కమిషనర్ వినియోగించవచ్చు, నిర్వహించవచ్చు.
(5) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్లు ప్రజా జీవనంలో సుప్రసిద్ధులై ఉండాలి. వారికి విశాలమైన విషయ పరిజ్ఞానం, చట్టం, శాస్త్రసాంకేతిక రంగాలు, సామాజిక సేవ, మేనేజ్ మెంట్, జర్నలిజం, ప్రసార మాధ్యమాలు, కార్యనిర్వహణ, పరిపాలనలో అనుభవం ఉండాలి.
(6) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషసర్, సమాచార కమిషనర్లు పార్లమెంట్ సభ్యులుగానీ రాష్ట్రాలు లేక కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభసభ్యులుగానీ అయి ఉండరాదు. ఆర్థికంగా లాభం చేకూరే ఏ ఇతర పదవిలోనూ ఉండరాదు. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం ఉండరాదు. ఏ ఇతర వ్యాపారాన్ని గానీ, ఇతర వృత్తిని కానీ నిర్వస్తూ ఉండకూడదు.
(7) రాష్ట్ర సమాచార కమిషన్ కేంద్ర కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వం అధికార గెజిట్లో ప్రకటించిన చోట ఏర్పాటవుతుంది. రాష్ట్రప్రభుత్వంనుంచి ముందుగా ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రసమాచార కమిషన్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కార్యాలయాలు నెలకొల్పవచ్చు.


16. (1)రాష్ట్ర ప్రధానసమాచార కమిషనర్ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి అయిదేళ్ల పాటు పదవిలో ఉంటారు. రాష్ట్ర ప్రధానసమాచార కమిషన్ పునర్నియామకానికి అవకాశం లేదు. 65 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత పదవిలో ఉండేందుకు వీలుకాదు.

(2) ప్రతి రాష్ట్ర సమాచార కమిషనర్ పదవి చేపట్టిన నాటి నుంచి అయిదేళ్లపాటు లేక 65 ఏళ్ల వయస్సు వచ్చేవరకూ ఏది ముందయితేఅంతవరకూ పదవిలో ఉంటారు. పదవీ విరమణ తర్వాత పునర్నియామకానికి అవకాశం లేదు. ఈ సబ్ సెక్షన్ కింద పదవీ విరమణచేసే ఏ రాష్ట్ర సమాచార కమిషనర్ అయినా సెక్షన్ (3)లో నిర్దేశించిన విధంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ గా నియమితులయ్యేఅర్హత ఉంటుంది. అలా ప్రధాన సమాచార కమిషనర్ గా నియమితులైన రాష్ట్ర సమాచార కమిషనర్ ఈ రెండు పదవుల్లోనూ కలిపి అయిదేళ్లకు మించిపదవిలో ఉండరాదు.
(3) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ లేక సమాచార కమిషనర్ పదవిలో ప్రవేశించే ముందు గవర్నర్ ఎదుటగానీ, ఈ పని కోసం గవర్నర్ నియమించిన మరో వ్యక్తి ముందు గానీ మొదటి షెడ్యూలు లో తెలిపిన విధంగా ప్రమాణ స్వీకారం చేయాలి.
(4) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ లేక సమాచార కమిషనర్ ఎప్పుడైనా స్వదస్తూరితో గవర్నర్ కు లేఖ రాసి పదవికి రాజీనామా సమర్పించవచ్చు. సెక్షన్ 17లో నిర్దేశించిన రీతిలో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ను లేక రాష్ట్ర సమాచార కమిషనర్ ను పదవి నుంచితొలగింవచ్చు.
(5) వేతనాలు, అలవెన్సులు, ఇతర సర్వీసు నిబంధనలు :
(ఎ) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ కు ఎన్నికల కమిషనర్ తో సమానంగా ఉంటాయి.
(బి) రాష్ట్ర సమాచార కమిషనర్ కు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమానంగా ఉంటాయి. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ గా నియమితులైన సమయంలో, గతంలో కేంద్ర ప్రభుత్వం కింద లేక రాష్ట్ర ప్రభుత్వం కింద చేసిన సర్వీసుకు పెన్షన్ తీసుకుంటున్నట్లయితే
(వికలాంగులు, గాయపడిన వారి ఇచ్చే పింఛను కాకుండా) ఒకేసారి చెల్లింపు కోసం మార్పించుకున్న పెన్షను, గ్రాట్యుటీ మినహా ఇతర పదవీ విరమణ లాభాలతో సమానమైన పెన్షన్ సహా ఆ మొత్తాన్ని వేతనం నుండి మినహాయిస్తారు. రాష్ట్ర ప్రధానసమాచార కమిషనర్, సమాచార కమిషనర్ తమ నియామక సమయంలో, గతంలో కేంద్రం చట్టాలు లేక రాష్ర చట్టాల కింద ఏర్పాటైనకార్పొరేషన్లలో చేసిన సర్వీసుకూ లేక కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంలోని లేక నియంత్రణలోని ప్రభుత్వ కంపెనీలలో చేసినసర్వీసుకు పదవీ విరమణ లబ్ది పొందుతున్నట్లయితే, ఆ లబ్దికి సమానమైన పెన్షన్ మొత్తాన్ని మినహాయించి వేతనం చెల్లిస్తారు. రాష్ట్ర ప్రధానసమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల నియామకం తర్వాత వారి వేతనాలు, ఎలవెన్సులు, సర్వీసు నిబంధనలను వారికి నష్టం కలిగించే రీతిలో మార్చడం జరగదు.
(6) ఈ చట్టం కింద నిర్వహించాల్సిన కార్యాలను సమర్ధవంతంగా నిర్వహించడం కోసం అవసరమైన అధికారులనూ, ఉద్యోగులనూ రాష్ట్ర ప్రధానసమాచార కమిషనర్ కూ, సమాచార కమిషనర్ల కూ అందిస్తుంది. ఆ అధికారులకూ, ఉద్యోగులకూ చెల్లించాల్సిన వేతనాలు, ఎలవెన్సుల విషయంలో సర్వీసు నియమ నిబంధనల విషయంలో నిర్ణీతపద్ధతిలో వ్యవహరిస్తారు.

17. (1)సబ్ సెక్షన్ (3)లోని నిబంధనలకు లోబడి, రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్ ను , లేక ఏ రాష్ట్ర సమాచార కమిషనర్ నయినా నిరూపిత అనుచిత ప్రవర్తన, అశక్తత కారణాలతో ఒక్క గవర్నర్ ఉత్తర్వు ద్వారా మాత్రమే పదవి నుంచి తొలగించవచ్చు. గవర్నర్ సూచన మేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి అనుచిత ప్రవర్తన లేక అశక్తత కారణంతో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ లేక రాష్ట్ర సమాచారకమిషనర్ ను పదవి నుంచి తొలగించవచ్చని నివేదించిన తర్వాత గవర్నర్ ఆ ఉత్తర్వు జారీ చేయాలి.

(2) సబ్ సెక్షన్ (1) కింద రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్ లేక రాష్ట్ర సమాచార కమిషనర్ పై విచారణకు సుప్రీంకోర్టుకు కోరిన తర్వాత, ఆ విచారణ జరుగుతున్న సమయంలో సదరు రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్ లేక రాష్ట్ర సమాచార కమిషనర్ ను సుప్రీంకోర్టు నివేదిక అంది ఉత్తర్వు జారీ చేసేంతవరకు గవర్నర్ సస్పెండ్ చేయవచ్చు. అవసరం అనుకున్న పక్షంలో కార్యాలయంలోకి ప్రవేశించకుండా నిషేధించవచ్చు.
(3) సబ్ సెక్షన్ (1) లోని నిబంధనలతో సంబంధం లేకుండా రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్ ను లేక సమాచార కమిషనర్ ను గవర్నర్ తన ఉత్తర్వులు ద్వారా ఈ కింది కారణాలతో పదవి నుండి తొలగించవచ్చు.
(ఎ) దివాలా తీసినట్లు నిర్ణయమైనప్పుడు,
(బి) ఏదైనా నేర నిరూపణ జరిగి, ఆ నేరం నీతి బాహ్యమని గవర్నర్ భావించినప్పుడు,
(సి) పదవీకాలంలో తన విధి నిర్వహణతో సంబంధం లేని ఇతర పనులు ఆర్థిక లాభం కోసం చేసినపుడు,
(డి) శారీరకంగా లేక మానసికంగా దుర్భలులై పదవిలో కొనసాగేందుకు పనికిరాకుండా పోయారని గవర్నర్ భావించినపుడు,
(ఇ) రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్ ను లేక సమాచార కమిషనర్ తమ విధి నిర్వహణకు నష్టం చేకూర్చే అవకాశం ఉన్న ఆర్థిక ప్రయోజనాలనూ, ఇతరత్రా ప్రయోజనాలను పొందినప్పుడు.

(4) కేంద్ర ప్రభుత్వం లేక దాని తరపున చేసుకున్న ఏ ఒప్పందం, కాంట్రాక్టులోనయినా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ లేక రాష్ట్ర సమాచారకమిషనర్ అయినా ఏ తరహాలోనయినా ఆసక్తి చూపించినా, సంబంధం కల్పించుకున్నా సబ్ సెక్షన్ (1) లో పేర్కొన్న అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్లు లెక్క. ఏదయినా ఇన్ కార్పొరేటెడ్ కంపెనీ లాభాలు, ఆదాయాలు, రాబడులలో సభ్యుడిగా కాక మరోవిధంగా పాలుపంచుకున్న సందర్భంలో కూడా అనుచిత ప్రవర్తన కిందకు వస్తుంది.