సమర్థ రామదాసు/పదియవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పదియవ ప్రకరణము

శివాజీ - రామదాసులు

బోధన ప్రచారము గొప్ప దశలో నున్న కాలమున రామదాసుడు మహారాష్ట్రదేశమున సంచారము చేయ నారంభించెను. మఠములన్నింటిని జూచి పరిశోధించుటకును, జనుల మనస్సులమీద మతబోధ యెంతవఱకు నాటు కొనినదో దెలిసికొనుటకును నతడీ సంచారము ప్రారంభించెను. జనులు గాడ నిద్రనుండి మేలుకొని స్వమతావిష్టులై దేశము కొఱకుదమ సర్వస్వమును ధారవోయుటకు సిద్ధముగ నుండిరని యతడు తెలిసి కొనెను. ప్రపంచములో దుర్జనులు లేకుండ బోవరు. రామదాసు శిష్యులు చేయుచున్న సత్కార్యమున కిష్టపడక విఘ్నములు కలిగించి వారికి గొందఱపకారము గూడ జేయదలంచిరి. అట్టి దుష్టులవల్ల గొందఱికి బ్రాణాపాయముగూడ గలుగునట్లు కనుపించెను. కాని యా శిష్యులు తమ గురువు పేరునకు భంగము కలుగుకుండ మెలకువతో వర్తించి ప్రాణాపాయములు దప్పించుకొనుచు వచ్చిరి. లంచములు నిరాకరించుచు సత్కార్య ధురంధరులైన యా శిష్యుల కార్యదీక్షవలన రామదాసుని పేరు మహారాష్త్ర దేశమున బ్రతి కుటీరమునందును, ప్రతి యంత:పురమునందును గూడ జెప్పుకొనబడుచుండెను. రామదాసుని పేరు చెప్పని వారు తలపనివారు లేరు. ఈ మత బోధల పర్యవసాన మెట్లుండునా యని ప్రతి వ్యక్తి విచారింపజొచ్చెను. ప్రస్తుతము రామదాసు సంకల్ప మటుండనిచ్చి శివాజీని గుఱించి కొంత విచారింతము. శివాజీ గర్భస్థుడై యున్నప్పుడు శివాజీ తండ్రి, షాజీ, శివాజీ తల్లిని నిరాదరణచేసి దు:ఖముల పాలుచేసెను. ఆమె తండ్రియైన యాదవరావు లుకజీ రాజకీయ సమస్యలలో నల్లుడైన షాజీతో నభిప్రాయభేదములు కలిగి యితనితో విరోధము పెట్టుకొనెను. షాజీ యింటిపట్టు విడిచి యొక స్థలము నుండి వేఱొక స్థలమునకు బాఱిపోజొచ్చెను. మామ యల్లుని వెంట నంటి తఱుమ జొచ్చెను. అట్టి పరిస్థితులలో షాజీ తన భార్యను షివనీర్ కోటలో నుంచెను. శివాజీతల్లియగు జిజియాబాయి మిగుల నాత్మగౌరవము గల స్త్రీ. గర్భభారముచేత గ్రుంగియున్న యామె మృదుమానసముమీద నీ దురవస్థయెంతో పనిచేసెను. అధికారములో నున్నవారు తన భర్తకు జేయుచున్న గౌరవము, పంపుచున్న బహుమానములు మొదలైన వన్నియు నీటి బుగ్గలవలె నస్థిరము లనియు హిందువులలో బ్రధాన పురుషులకు బరస్పర వైషమ్యములు కల్పించి స్వాధీనము చేసికొని యేలుటయే వారి యభిప్రాయమనియు నూహించెను. షాజీ మహారాష్ట్రమున మిక్కిలి పలుకుబడి గల పురుషుడు. బీజపూరు సుల్తానులను సింహాసన మెక్కించుట దింపించుట మొదలగు పనులలో నతడు మిక్కిలి గట్టివాడు. బీజపూరే గాక యహమద్ నగరు సుల్తానులు గూడ యాతని చేతిలోని కీలుబొమ్మలే. అతడెట్లాడించిన వా రట్లాడుచుండిరి. అతడు గొప్ప రాజ్యవ్యవహారవేత్త యని పేరు గలదు. అతడు పూనా జాగీరుదారు డయ్యెను. ఆమె యెక్కడనో యొకమూల నొకకోటలో బడియుండుట యెంతమాత్ర మిష్టము లేదు. మగపిల్లవాడు పుట్టినను, ఆడపిల్ల బుట్టినను స్వతంత్ర భావములతో నా బిడ్డను బెంచవలెనని యామె సంకల్పించెను. తరువాత స్వల్పకాలమునకే 1627 వ సంవత్సరమున ఏప్రియల్ 10 వ తేదీని నామె గర్భమున శివాజీ కుమారుడు జన్మించెను. ఆమె గర్భవతి యైనది మొదలు పలు కష్టములు పడెను.

శివాజీ బాల్యకాలమున విద్యాభ్యాసము చేయునప్పుడు రామాయణ వీరులు భారతవీరులు మొదలగు మహాపురుషుల యద్భుత సాహసములు విని మెచ్చి తాను గూడ నట్టిచర్యలు చేయవలెనని యాశపడు చుండెడివాడు. ఒకసారి బీజపూరు సుల్తాను షహజీని బిలిచి యతని కుమారుని శివాజీని చూడ వలెనని కోరెను. అప్పటికి శివాజీ కెనిమిది సంవత్సరములు వయస్సు. షాజీ యందుకు సమ్మతించి సుల్తానువద్ద మిక్కిలి వినయ విధేయతలు గలిగి దర్బారు మర్యాదల ననుసరించి నడుచు కొనవలెనని బుద్ధులుచెప్పి కొడుకును దీసికొని పోయెను. ఆ నాడు సుల్తాను గొప్ప దర్బారు చేసెను. దర్బారులో బ్రతి మనుష్యుడు వంగి మోకాళ్ళమీద నిలువబడి సుల్తానుకు సలాము చేయవలెను. ఎన్నిబుద్ధులు చెప్పినను, ఎన్ని సంజ్ఞలు చేసినను దండ్రిచెప్పినట్లు చేయక శివాజీ నిర్భయముగ నిలువబడి తలవంచుకొనక కన్నులు తెఱచి సుల్తాను వంక చూచెను. దుర్వినయము గల యట్టి కొడుకువల్ల దనకెట్టి కీడు మూడునో యని షాజీ భయపడెను. దర్బారు ముగిసెను. శివాజీ సెలవుగైకొనకయే చివాలున కొలువునుండి లేచిపోయెను. కొడుకును మందలింపవలె నని షాజీ కూడ గొలువు విడచి యావలకు బోయెను. కాని యింతలో శివాజీ ఘోరకృత్యమొకటి చూచెను. రాచబాటకు బ్రక్కనే యొక కటికవాడు, గోవు నొకదానిని జంప సమకట్టి దానిని తెగవేయుటకు కత్తినెత్తెను. ఆ ఘోరకృత్యమును జూచి శివాజీ సహింపలేక కటిక వాని చేయి యెత్తిన దెత్తినట్లుండగానే శివాజీ యాహస్తమును దన ఖడ్గముతో నఱికి వేసెను. షాజీ యా వార్త సుల్తాను విన్నచో నేమి ప్రమాదము వాటిల్లునో యని శంకించి వెంటనే బాలుని పునహాకు పంపించివేసెను. పోవునప్పుడు బాలుడు తండ్రిపై గోపించి పట్టపగలు నడివీథిలో గోహత్యలు జరుగుచుండగా వారింపని ప్రభుత్వముకడ నేల యుద్యోగము చేయుచున్నా వని తండ్రిని మందలించెను. శివాజీ సాహస మట్టిది. అతడుపాధ్యాయుని శిక్షనుగాని తండ్రిశిక్షనుగాని బొందువాడుగాడు. శివాజీకి బదియాఱు సంవత్సరములు వచ్చునప్పటికి సాహసకృత్యములయందు నభిలాష గలిగి తనవలెనే సాహసికుల కొందఱు యువకుల జేర్చుకొని యాయుధముల ధరించి కొన్ని యూళ్ళపై దండు వెడలి కొన్ని చిన్న కోటలను బట్టుకొన నారంభించెను. క్రమక్రమముగ నతడు పెద్దవాడై పెద్దకోటలు పట్టుకొన నారంభించెను. బీజపూరు సుల్తాను వాని దుండగములు విని వాని సాహసము మాన్పించుటకై ఒక రిద్దరు సేనాపతులను బంపెను. కాని వారిని శివాజీ మాయోపాయము చేత గెలిచెను. వారిలో ముఖ్యుడు ఆఫ్‌జుల్‌ఖాన్ అను సేనాపతి. ఇతడు మిక్కిలి బలవంతుడు. శివాజీ సబబుగ వానిని రావించి తా నొక యినుప కవచము తొడుగుకొని కవచము చాటున నొక చిన్న యాయుధమును మఱగు పఱచి మహమ్మదీయ సేనాపతిని గౌగిలించుకొన్నట్లు నటించి తన చిన్న యాయుధముతో నతని గుండెలలో బొడిచి చంపెను. దానితో వానిసేవ చెల్లాచెదరై పాఱిపోయెను. ఈవిధముగ శివాజీ క్రమక్రమముగ బలవంతుడై 1664 వ సంవత్సరమున మహారాష్ట్రమునకు మహారాజై పట్టాభిషేకము చేసికొనెను. రామదాసుడు తన బోధనమను వల పన్నునప్పటికే శివాజీ రాజయ్యెను. రాజైనను శివాజీ గర్విష్ఠుడు గాక యేయోగి గనబడినను రాజ్యము వదలి వారివెంట బోవుచుండెడివాడు. భజనలు కీర్తనలు నెచ్చట జరుగుచుండినను నచ్చట కతడు బోవుచుండెడివాడు. దైవభక్తి యాత్మజ్ఞానము మఱచువాడుగాడు. రాజ్య మద మెంత మాత్రము నతనికి లేదు.

శివాజీకి శ్రీతుకారాంబావాజీ యనిన మిక్కిలి భక్తి. ఎంత దూరము నందుండియైన నతని భజనలకు గీర్తనలకు వెళ్లుచుండెడివాడు. ఆతడు భక్తిపారవశ్యమున నొకనాడు తుకారాము కడకు బోయి నిజమగు భక్తి నుపదేశింపు మని యతనిని బ్రార్థించెను. తుకారాంబావాజీ "నేను కాదు నీ కుపదేశించువాడను. మంచి యుపదేశము కావలసినయెడల నీవుపోయి సమర్థ రామదాసుని కాళ్లపై బడు" మని మృదుమధుర భాషణములతో నానతిచ్చెను. రామదాసు యొక్క మతబోధనంతయు శివాజీ యెఱిగినవా డగుటచే నతని దర్శనము చేయవలెనని యప్పుడప్పుడు తలపోయుచుండెను. కాని యవకాశము చిక్కలేదు. రామదాసుని యొక్క జాడలు తెలిసికొనవలెనని శివాజీ పలుమాఱు ప్రయత్నించెను. కాని రామదాసుని శిష్యులకే యతని జాడలు సరిగ దెలియవు. శివాజీకి రామదాసు నతని బోధకుల యెడల మిక్కిలి భక్తి గలదు. అందుచే నతడు బోధకుల గలసినప్పుడెల్ల వారికి గౌరవ ప్రపత్తులు జరుపు చుండెను. రామదాసుని యాత్మజ్ఞానమును నిండు పూనికను మహారాష్ట్ర దేశోద్ధరణ సంకల్పమును శివాజీ గురైఱిగి యుండెను. రామదాసుని యుద్యమమే మహారాష్ట్ర దేశమున వీలైనంతవఱకు నిజమైన యుద్యమము. అంతకుముం దిట్టి యుద్యమ మెందును లేదని శివాజీకి దెలియును. ఎట్లైన రామదాసుని జూచి తీరవలెనని శివాజీ యొకమాఱు నానా మఠములను నానారణ్యములను దిఱిగి వానిపొడ గానక రామదాసు దర్శన మగువఱకు నన్నము ముట్ట నని నీరు త్రాగ నని ప్రతిన బట్టెను. ఎట్టకేలకు శివాజీ యెట్టయెదుట నొక మహాపురుషుడు కనబడెను. మీరెవ రని యడుగగనే రామదాసుడ నని చెప్పెను. మరునా డుదయమున శివాజీ నిద్రమేల్కొనక మునుపే రామదాసు వద్దనుండి యొక సన్యాసి జాబుతెచ్చి వాకిట నిలిచియున్నాడని సేవకులు శివాజీకి జెప్పిరి. వెంటనే యతడు పానుపు దిగి యాసన్యాసికి నమస్కరించి గౌరవించి యా జాబు నందుకొని దానికి నమస్కరించెను. ఆ జాబులో నిట్లుండెను. "యాత్రకు బోవలసిన పుణ్యక్షేత్రములన్నియు నాశము చేయబడినవి. బ్రహ్మక్షేత్రము లపవిత్రము చేయబడినవి. ప్రపంచ మంతయు నల్లకల్లోలము జేయబడినది. ధర్మమెచ్చటను గానబడదు. ధర్మమును గాపాడుటకై భగవంతుడు నిన్నేర్పఱచినాడు. ఈ దేశమున ననేక మహారాజులు మంత్రులు రాజనీతికోవిదులు గొప్పపండితులు నున్నను ధర్మము రక్షించు వారెవ్వరును లేరు. మహారాష్ట్ర ధర్మమంతయు నీ మీదనే యాధారపడి యున్నది. నేను నీ రాజ్యములోనే యిన్నినాళ్ళున్నప్పటికి నన్ను నీవు కనుగొనుటయే లేదు. అందుకు గారణ మేమో నే జెప్పజాలను. నీ మంత్రులు బుద్దిమంతులే. నీవు ధర్మమూర్తివి. అందుచేత నీకు మాటిమాటికి హితోపదేశము చేయనక్కఱలేదు. ధర్మము పునరుద్ధరించుట యను ప్రతిష్ఠ నీకే దక్కవలెను. అది నీవు పోగొట్టుకొన గూడదు. అతి మాత్రములైన రాజకీయ విషయములపై నాశ్రద్ధ నిలిచి యున్నది. ఈ యుపదేశమునకు మనసున నాగ్రహింపక నన్ను క్షమింపుము." ఈజాబు మనస్సును గఱగించునట్టి జాలిమాటలతో మహారాజు గౌరవమునకు దగినట్లు వ్రాయబదినది. ఆ రాయబారము తెచ్చిన సన్యాసిని శివాజీ మన్నించి పూజించి విలువగల వస్త్రముల బహుమాన మిచ్చి పంపెను. వెంటనే రామదాసుని యొక్క పాదపద్మములయొద్ద బడుటకు దాను బయలుదేరి వచ్చుచున్న ట్లొక ప్రత్యుత్తరము వ్రాసి యా సన్యాసి కిచ్చి పంపెను. ఆ దినముననే శివాజీ స్వల్ప పరివారముతో నిద్దఱు ముఖ్యమిత్రుల వెంట బెట్టుకొని రామదాసును గలిసికొనుటకు బయలుదేరి ఛాఫల్ మఠమునకు బోయెను.

అంతకుముందే రామదాసు డా మఠమును విడిచి షైగాన్ వాడీకి వెళ్ళిరని శిష్యులు చెప్పిరి. ఆ మఠమున అక్క యను నొక యువతీమణి మఠాధికారిణియై పెత్తనము చేయుచుండెను. రామదాసుడు వచ్చువఱకు నచటనుండి భోజనము చేయుమని యామె ప్రార్థించెను. శ్రీరామదాసుని యాశీర్వచనము బడయువఱకు దా నన్న పానాదులు ముట్టనని ప్రతిజ్ఞ చేసినట్లు శివాజీ యామెతో జెప్పెను. సరిగ దారిచూపుట కొక శిష్యుని వెంట బెట్టుకొని షైగాన్‌వాడి మఠమునకు బొమ్మనియు నచ్చట రామదాసుని దర్శనము తప్పక దొఱకు ననియు నామె చెప్పెను. శివాజీ షైగాన్‌వాడీ వెళ్లుసరికి రామదాసుడు కొండక్రింద నొక లోయలోనున్న యొక తోటను జూడబోయెను. కళ్యాణస్వామి యను శిష్యుడు శివాజీ రామదాసునకు వ్రాసిన జాబు నప్పుడు చదువుచుండెను. కళ్యాణస్వామి శివాజీ చెయ్యిపట్టుకొని గురువు నొద్దకు తీసికొని పోయెను. శివాజీ వినయముతో నమస్కరించి చేతులు జోడించుకొని వాని యెదుట నిలిచెను. "ఆహా! నీవు నీ జాబు నొక్కసారియే వచ్చినవని" రామదాసు వానిని బలకరించెను. "నేను జిరకాలమునుండి నీ దేశములో నివసించుచున్నాను. నీవు నా యోగక్షేమము లరయుచున్నందులకు నేను చాల సంతోషించు చున్నాను." తన్ను గుఱించి శివాజీ యే మాత్రము కనుగొనుట లేదని యతనిని దెప్పుటకై యీ మాట రామదాసు పలికెను. శివాజీ తలవంచుకొని పశ్చాత్తాపపడుచు నిట్లనియె. "స్వామీ! నేను మిక్కిలి పాపాత్ముడను. నే జేసిన తప్పులన్నిటిని మీకృపాతిరేకమున క్షమింపుడు." శివాజీయొక్క వినయ విధేయతాదులను గనుగొని యుపదేశము పొందుటకు సిద్ధముగ నుండుమని రామదాసు యాజ్ఞాపించెను. శివాజీ వెంటనే తన వెంట వచ్చిన బాలాజీకిని నీలవంతునకును బూజా ద్రవ్యములు తీసికొని రమ్మని వర్తమాన మంపి తాను స్నానమునకై పోయెను. పూజాద్రవ్యములు రాగానే రామదాసుడు శివాజీని గొండశిఖరముమీద నొక మూలకు దీసికొనిపోయి యుపదేశము చేసెను. ఈ యుపదేశ కార్యమెన్నడు బహిరంగముగ జరుపబడలేదు. రామదాసు శిష్యులలో నొక డగు దివాకర్‌భట్ శివాజీ రామదాసునకు జేసిన పూజాసమయమున బురోహితుడై పూజామంత్రముల జదివెను. శివాజీ పూజాకాలమున గురువర్యు డగు రామదాసునకు విలువగల జరీబట్టలు, పట్టుబట్టలు, నగలు, రత్నములు, ముత్యములు, మొహిరీలు విశేషముగ సమర్పించెను. అభిషేక విధి సమయమున శివాజీ యొక లక్షరూపాయల విలువగల వెండి బంగారు నాణెములను గురువు శిరస్సున నభిషేకము చేసెను. ఈ గురుసందర్శనము 1649 సం. ఏప్రియల్ 12 వ తేదీని జరిగెను. తెలుగు తేదీ ప్రకారము విరోధినామ సం. వైశాఖ శుద్ధ నవమి గురువారమునాడు జరిగెను. గురుపూజా నంతరమున శివాజీ చేతులు జోడించుకొని నిలువబడి తన్ను దీవించి పరమార్థ విషయముల నుపదేశింపు మని గురువును వేడుకొనెను. శివాజీ నోట వెడలిన మాట లన్నియు వ్రాసియుంచుమని రామదాసు శిష్యు డైన కళ్యాణస్వామిని నాజ్ఞాపించెను. కళ్యాణస్వామి వ్రాయుటకు సిద్ధమైన తరువాత రామదాసుడుపదేశమును జెప్పి వ్రాయించెను. రామదాసుడు శివాజీని దీవించి యతనికి నొక కొబ్బరికాయయు గుఱ్ఱపులద్దెయు విభూతియు కొన్ని గులకరాళ్ళను ఇచ్చెను. ఈ విపరీత బహుమానముల యొక్క అర్థము సామాన్యముగ నెవరికి దెలియలేదు. ఆ బహుమానములను శివాజీ తన తల్లికి జూపినప్పు డామెయు వాని యర్థమును దెలియక పోయెను. అప్పుడు శివాజీ యా సమస్య నిట్లు విప్పి చెప్పెను. "గుఱ్ఱపులద్దె వలన గుఱ్ఱపుదళము వృద్ధియగుగాక యనియు విభూతివలన భూమి చాల జయింతువుగాక యనియు గులకరాళ్లవలన బలుకోటలు నిర్మింతువుగాక యనియు నర్థము" అని చెప్పెను. రామదాసుడు చేసిన యాత్మ జ్ఞానోపదేశము శివాజీ హృదయమున వైరాగ్య మహాగ్నిని రగులు కొలిపెను. సహజముగనే యాత్మజ్ఞాన శక్తి గల చిత్తము ప్రబుద్ధమై యప్పుడు శివాజీ యిట్లనియెను. "స్వామీ! తేజోమయములైన మీవాక్యములు వర్ణనాతీతమైనవి. వినశ్వరములైన యీ భౌతిక విషయములను విడచుటకు నే నాతురపడుచున్నాను. మీప్రియశిష్యుల వలెనే నేను గూడ నొక సన్యాసిని గావలెనని యున్నది అట్లనుగ్రహింపుడు. ఈ రాజ్యాంగవిషయసంకటము లికజాలును. నేను జేయవలసిన దేదో చేసియుంటిని. రాజ్యవిషయములం దాసక్తి గలవారు దానిని బూని తక్కిన పని చేయుదురుగాక!" ఆ మాటలు విని రామదాసుడు నవ్వి యిట్లనియె "శివబాబా, నీవు క్షత్రియుడవు. రాజ్యపాలనము, ప్రజారక్షణము, ఈశ్వరసేవయు నీ ధర్మములు. కావున నీవు సన్యసింపగూడదు. ఈ ధర్మములు వదలినయెడల నీకు మహాపాపము సంక్రమించును. నీవింకను జేయవలసిన మహాకార్యములు పెక్కులున్నవి. ఈ మ్లేచ్ఛులచేత జగ మెట్లాక్రమింపబడినదో నీవు చూచుట లేదా? మహామహు డైన రఘురాముడు భూమినంతను మ్లేచ్ఛులనుండి విడిపింప గోరుచున్నాడు. ఈ ధర్మమును నిర్వర్తించితివా, కఠినతపస్సు చేసిన వారికంటె నెక్కువగా నీకు ముక్తి కరతలామలక మగును. రాముడు, హనుమంతుడు, పాండవులు మొదలగు మహాపురుషులు చరిత్రములు నీ వెఱుగుదువు. వారు ధర్మము నిమిత్తము తమ సర్వస్వము ధారపోసిరి. ఎంత గొప్ప వంశమునుండి నీ వుద్భవించితివో యదియు నీ వెఱుగుదువు. నీ పూర్వులైన సిసాద్‌సింగ్, పృథ్వీపాల్‌సింగ్, లక్ష్మణసింగ్ మొదలగువారి చరిత్రలు జ్ఞప్తికి దెచ్చుకొనుము. వారి యడుగుల జాడనే వర్తింపుము. నీకు దారి చూపుటకే వారి చరిత్రలు వ్రాయబడియున్నవి" యని రామదాసుడు శివాజీకి క్షత్రియ ధర్మమును, రాజధర్మము నుపదేశించెను. ఈ యుపదేశవాక్యములు శివాజీని స్వధర్మమువైపు ద్రిప్పెను. తన కభిషేకించినసొమ్ము ప్రోగుచేసి పేదగొల్లపిల్లలు గ్రహించి సుఖించుటకై యడవిలో నన్నిప్రక్కల వెదజల్లు మని చెప్పెను. మఱునాడు నీలవంతు మొదలయిన శివాజీ యనుచరులకు గూడ రామదాసు డుపదేశించెను. ఆయుత్సవము ఛాఫల్ మఠములో మహావైభవముతో జరిగెను. శివాజీయొక్క యుద్యోగస్థులకును రామదాసుయొక్క శిష్యులకును సంతర్పణలు జరిగెను. శివాజీ బ్రాహ్మణులకు నన్నవస్త్రము లిచ్చి గురుదక్షిణగా రామదాసుని పాదములపై నపారధనరాసులు పోసెను. అప్పుడు గొప్పసభ జరిగెను. రామదాసుడు శివాజీ యనుచరులలో గొందఱ కుపదేశము చేసెను. అత్తఱి బాలాజీ నీలవంతుల విశ్వాసమును రాజభక్తిని రామదాసున కెఱుక పఱచి కొని యాడెను. రామదాసు డదివఱకే వారి సౌశీల్యమెఱిగినవా డగుటచే వారికిగూడ నుపదేశము చేసెను. ఉపదేశానంతరమున రామదాసుడు సేవకధర్మమునుగుఱించి ప్రసంగించెను. ఈ సేవకధర్మము వాని గ్రంథములలో గూడ గలదు. అంతవఱకు బాలాజీ శివాజీకి మిత్రుడై పనిచేసెను. అంతటినుండి యత డతనిగురుబంధు డయ్యెను. శివాజీ చాఫల్ మఠములో నొక వారము దినము లుండి యాదినములలో రామదాసుని శిష్యులలో ననేకులకు బట్టాలనిచ్చి యాతనికార్యము తుద నెగ్గుటకు ధనసహాయముగూడ జేసెను. శివాజీ నిరంతరము రామదాసుని సన్నిధానమున నుండగోరెను. కాని రామదాసు దానికి గట్టిగ నిరాకరించెను. "నేను సన్యాసిని గావున నేనెల్లప్పుడు వనములలో నుందును. నీవు నాతో నుండగూడదు. నీవు క్షత్రియుడవై పుట్టినందులకు దేశపరిపాలన చేసి ధర్మము కాపాడవలెను" అని యతడు బదులుచెప్పెను. ఉపదేశము నాటికి శివాజీ వయస్సిరువది రెండు సంవత్సరములు. అది మొదలుకొని శివాజీ ప్రతివారము రామదాసుని దర్శనము చేయుచు వెనుకటివారమున జరిగిన సంగతుల నన్నియు వానికి జెప్పుచు ముందువారము జరుపవలసిన కార్యములగుఱించి యతని నాలోచన లడుగజొచ్చెను. కాలక్రమమున శివాజీ యొక్క రాజకీయ వ్యవహారములు మితిమీఱిపోయినందున మునుపటివలె నతడు ప్రతివారము గురుదర్శనము చేయలేకపోయెను. తఱచుగా రామదాసుని దర్శన భాగ్యము లభించుటకై రాయఘడ్ కోటకుగాని ప్రతాప్‌ఘడ్ కోటాకుగాని షాజ్జాన్ కోటకు గాని బస మార్పు మని శివాజీ రామదాసును వేడుకొనెను. అందుకు రామదా సిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. "శివబాబా, నేను వనసంచారిని. నా కీ చోటు, ఆ చోటు అన్న మాటలేదు. అటువంటివాడను నేను స్థిరముగా నొక చోట నెట్లుండగలను? అదిగాక నీవు రాజువు. సముద్రమును, నిప్పును, రాజును నమ్మగూడ దని శాస్త్రములు చెప్పు చున్నవి. మా వంటివారికి రాజసహవాస మెన్నడు క్షేమకరముగాదు. నా ప్రస్తుతస్థితి నాకు సుఖకరముగానే యున్నది. నాక్షేమము విషయమై నీకుగల శ్రద్ధకు జాల సంతోషించుచున్నాను. నిరంతర సహవాసము మన కనవసరము." ఈమాటలు శివాజీ హృదయమున వ్రణముగా నాటెను. అందుచే నతడు విచారమగ్ను డయ్యెను. ఈ విచార మతని రాజ్యాంగ విషయములను గొంత పాడుచేయునేమో యని సందేహము కలిగెను. ఆ మాటలు విని రామదాసుడు తాను పరాలీకోటలో నుండ నిశ్చయించితినని శివాజీకి వర్తమాన మంపెను. వెంటనే శివాజీ పరాలీవద్ద గొప్ప కోటను, మఠమును, రామదాసుని కిష్టమగున ట్లతని యాలోచన ప్రకారము కట్టుడని యాజ్ఞ యిచ్చెను. 1650 సం. మొదలుకొని పరాలీ మఠము నందును., షాజ్జాన్‌ఘడ్ నందును రామదాసుడు నివసింపజొచ్చెను. వాని పోషణ నిమిత్తము కొన్ని భూములుగూడ నిచ్చెను. రామదాసుని మఠ వ్యవహారముల నన్నిటిని కనుగొనుటకును, దేవతోత్సవముల నన్నింటిని సరిగ జరిపించుటకును శివాజీ కొంతమంది బెద్ద యుద్యోగస్థులను, కొందఱ జిన్న యుద్యోగస్థులను నియమించెను. 1652 సం. రామదాసుడు తన తల్లిని సోదరుని జూచుటకు జాంబ్ గ్రామమునకు వెళ్లెను. అక్కడనుండి యతడు మాళవ దేశమునకు బోయి యుద్ధవు డను నొక శిష్యుని బ్రధాన మఠాధిపతిగా నియమించి 1654 సంవత్సరమున మఱల దన స్థానమునకు బోయెను. ఆతని తల్లి రాణూభాయి 1655 సం. నను, తమ్ముడు శ్రేష్ఠుడు 1657 సంవత్సరమునను గ్రమముగ మరణ మందిరి.

శివాజీ మఠములకు జేసిన దానములి వేఱ్వేఱ బేర్కొన నక్కఱ లేదు. కాని శివాజీ రామదాసుయొక్క బోధనావ్యాపారమును దనపరిపాలనావిషయములో నొక భాగముగ స్వీకరించె నని చెప్పిన జాలును. ఈశ్వరధర్మ స్వరాజ్యముల సమ్మేళనము మహారాష్ట్ర కర్ణాట మాళవ దేశములలో నద్భుత మైన మార్పు కలుగజేసెను. ఈ విధముగ మతబోధనము మహారాజుయొక్క ప్రాపు గాంచిన తోడనే దేశమునందలి ప్రతివ్యక్తియు దన ధర్మము నెడలను రాజ్యము నెడలను నెట్లు నడచుకొనవలెనో తెలిసికొనెను. వ్యవసాయము వృద్ధిచెందెను. పంటలు పుష్కలముగ బండెను. పశుసమూహము బాడియు వృద్ధిపొందెను. సాంఘిక వ్యవహారములు బలమైన పద్ధతులమీద నడచెను. వేయేల పరస్పర సహకారము జనసామాన్యముయొక్క మనస్సుల నుత్సాహ పఱచెను. మొట్టమొదట శివాజీయొక్క సంకల్పములలో నడుగడుగునకు నాటంకము గల్పించిన స్వదేశ జనులే యిప్పుడతనికి దోడుగ వచ్చిరి. రామదాసునియొక్క సహాయ సహకారములు లేకపోయిన పక్షమున శివాజీ ప్రతిష్ఠాకర మైన స్వతంత్ర స్వరాజ్యమును స్థాపింపలేకుండును. రామదాసుయొక్క సహకార మను విద్యుచ్ఛక్తిచేత బ్రదీప్త మైన శివాజీ రాజదండము నాలుగు ప్రక్కలనుండి. శౌర్యసాహసములు గల పరాక్రమవంతు లగు గుంపులను దీసికొనివచ్చి శివాజీచుట్టు జేర్చెను. సామాన్య పురుషులయొక్కయు, స్త్రీలయొక్కయు హృదయములుకూడ శౌర్యోత్సాహములతో నిండి తటటట గొట్టుకొనెను. శివాజీ తలపెట్తిన యీమహాకార్యమునకు దన సర్వస్వము ధారపోయుట యుక్త మని ప్రతి మనుష్యుడు తలంచెను. శివాజీ యొక్క రణ దుందుభి మ్రోగినతోడనే ప్రతిమనుష్యుని హృదయమందును దేశాభిమాన మను మహాగ్ని ప్రజ్వలింపజొచ్చెను. కొన్ని సంవత్సరములలోనే మహారాష్ట్రు డను శబ్దము విదేశకులకు గర్భనిర్భేదక మయ్యెను.

1674 సం.న శివాజీ శాస్త్రయుక్తముగ బట్టాభిషేకము చేసికొనెను. అతని బిరుదు "గోబ్రాహ్మణ పరిపాలక ఛత్రపతి శివాజి మహారాజ్" అని యుండెను. చిరకాలము తనహృదయమున నెలకొని యుండిన తన కోరిక ఫలించుటచే రామదాసుని యొక్క యానంద మెంతో మనమూహించు కొనవచ్చును. రామదాసు ముందుగ బవిత్రస్నానము చేసెను. శివాజీ సింహాసన మెక్కక మునుపు రామదాసునకు రాజాలంకారము చేసిరి. అతని తల మీద రాజలాంఛన మైన శ్వేతచ్ఛత్రమునుబట్టిరి. ఆయన మొట్టమొదట సింహాసన మెక్కెను. పిదప గద్దె శివాజీ యెక్కెను. తాను సింహాసన మెక్కుటకు రామదాసు చేసిన ప్రయత్న మంతకు శివాజీ తన కృతజ్ఞత నెట్లు తెలుపుకొనెనో దీనివలన మనము గ్రహింపవచ్చును. అప్పుడు రామదాసు యొక్క యాజ్ఞప్రకారమే శివాజీ రాజ్యమును స్వీకరించి యభిషేకము జేసికొని గద్దె నెక్కెను.

ఒకానొకనాడు రామదాసుడు హఠాత్తుగా రాయఘడ్ కోటకు బోయి శివాజీని దర్శించెను. అప్పుడు శివాజీ తన రాజ్యమంతయు గురుదక్షిణగ రామదాసున కర్పించెను. గురుశిష్యు లిద్దఱును మహాశ్చర్య నిమగ్నులై యొకరివంకనొకరు చూడ నారంభించిరి. గురువు శిష్యునియొక్క స్వార్థత్యాగమునకు నక్కజపడి నిశ్చేష్టు డయ్యెను. శివాజీ గురువుగారి నోటనుండి యే యాజ్ఞవెడలునో యని యెదురు చూచుచు నిలువబడెను. శివాజీయొక్క మనస్సు రాజ్యతంత్ర నిమగ్నమయ్యు నెంత భక్తిప్రపత్తులతో గూడ నిండియుండెనో యీ విషయమును బట్టి తెలిసికొనవచ్చును. రామదాసుడు తన శిష్యు డెంత యాత్మజ్ఞానముకలవాడయ్యెనో తెలిసికొని సంతోషించి రాజ్యము మఱల నతని కిచ్చివేసెను. "శివబాబా! నన్ను గుఱించి నీ వేమనుకొనుచున్నావు? నేను వట్టి సన్యాసిని. నే నీ ధరాభారము వహింపగలవా? నీవంటి క్షత్రియులు మాత్రమే యీ రాజ్యధర్మము సమర్థముగ నిర్వహింపగలరు. నాయనా! వెనుకటి వలెనే స్వార్థత్యాగ పరతంత్రుడవై రాజ్యపాలనము చేయుము. అట్లు చేసిన ముక్తి నీకు సన్నిధాన వర్తినియై యుండును. నీవు నాకిచ్చిన రాజ్యము మఱల గ్రహించుట నీ కిష్టము లేదు గనుక నాపక్షమున నీవు ప్రతినిధివై యుండి భూమండలపరిపాలనము చేయుమని నే నిప్పుడు నిన్నాజ్ఞాపించు చున్నాను. ఇందుకు నిదర్శనముగ నీ ధ్వజమునకు నా శాటిగుడ్డరంగు గల కాషాయవస్త్రము గట్టుకొని వ్యవహరింపుము. శివాజీ గురువాజ్ఞ శిరసావహించెను. నాటంగోలె మహారాష్ట్ర హిందువుల జండా "భగవత్ జండా" యని పేరు పడెను.


________