సమర్థ రామదాసు/పదునొకండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పదునొకండవ ప్రకరణము

చరమ ప్రకరణము

ఈ సంగ్రహ చరిత్రము మీద తెఱ పడవేయకమునుపు రాజకీయాందోళనమున రామదాసు డెంతవఱకు పనిచేసెనో సంగ్రహముగ తెలుపందగును. రామదాసశివాజీల సమావేశములకు మున్ను శివాజీయొక్క రాజకీయ వ్యవహారము కొంత వఱకు బ్రోత్సాహకరముగ నుండినను, తరువాత నా వ్యవహారములు తాల్చినంత వైశాల్యమును, బలమును నవి పొందియుండ లేదు. శివాజీ రామదాసులు చేతులు కలుపుగొనిన తరువాతను, రామదాసుని మతబోధకులు స్వరాజ్యసంస్థాపనకుకూడ పాటుపడజొచ్చిరి. మతబోధకులు స్వధర్మ సంరక్షణకై యొక మహావీరుడు దేశమున ప్రభవించినాడని బోధించి సిపాయీలను, గుమస్తాలను, రాయబారులను, వేగులవాండ్రను, శివాజీ కొలువులో జేర్ప జొచ్చిరి. రామదాసుడు మానవతత్వమును, జక్కగా విభాగించి పరిశోధింపగల ప్రజ్ఞావంతుడు గనుక గొలువుచేయుటకు దనకడ కెవ్వరు వచ్చినను, వాడెందుకు పనికివచ్చునో యావిషయమై యొక జాబు వ్రాసి శివాజీకడకు బంపుచుండును, ఇత్తెరంగున, వందలు, వేలు భటులు శివాజీ ధ్వజముక్రింద నిలిచి, మహమ్మదీయుల యొక్కయు, మహారాష్ట్రప్రభువుల యొక్కయు, సర్దారులయొక్కయు, నాటంకములను నొకమూలకు ద్రోసి, శివాజీని సింహాసన మెక్కించిరి. అందు చేతనే శివాజీ మొట్టమొదట రామదాసుని గద్దె నెక్కించి, పిమ్మట, నాతని యాజ్ఞప్రకారము సింహాసనమెక్కి, రాజయ్యెను. రామదాసునియొక్క, విశాల దృష్టి ఏజాతివానినైన విడువక, జాతి పునర్నిర్మాణమునకు, నెల్లవారి సానుభూతిని సంగ్రహించెను. రాజ్యాంగవ్యవహారములనేగాక, రామదాసుడు శివాజీకి శాసననిర్మాణమందుగూడ సహాయపడెను. దండయాత్రలు జరుపుటలో గూడ రామదాసుడు స్థిరమైన యాలోచనలు శిష్యునకు చెప్పుచుండెను. ఆపదలు తప్పించుకొను నుపాయములుగూడ జెప్పుచుండును. ఒకానొక సమయమున మహారాష్ట్ర సామ్రాజ్యము నేలమట్ట మగునట్టి మహాపత్తు వచ్చినప్పుడు రామదాసుడు చెప్పిన యుపాయమే శివాజినీ రక్షించెను. ఈనాటి పాశ్చాత్యశిల్పులుగూడ మెచ్చుకొని, నాశ్చర్యపడునట్లు, గొప్పగొప్ప కోటలు నిర్మించుటలో రామదాసు బుద్ధి యసమానమైనది. సున్నము తయారు చేయుట, తోటలు వేయుట, కోటలుకట్టుట మొదలయిన విషయములలో నప్పు డప్పూ డాశుధారగా కవిత్వముతో, నుపన్యాసము లిచ్చెడివాడు. మొక్క లెక్కడెక్కడ పాత వలెనో, యేయేవరుసలుగ నాటవలెనో యతనికి మిక్కిలి బాగుగా తెలియును. మహమ్మదీయులన్న రామదాసునకు, ద్వేషము లేదుగాని, వారి దండయాత్రలను, తిరుగుబాటులను నణచి ఎదిరించవలసినదని, రామదాసుడు ప్రజలను పురిగొల్పుచుండెను. హిందూమతధర్మరక్షణమే యతని ముఖ్యోద్దేశము. శిక్కుమతస్థాపకుడైన నానక్‌నందును, ఆతని మతమునందును రామదాసుడు చూపిన గౌరవము ఇంతింత యనరాదు. అత డితరమతములయందు ద్వేషము చూపగూడదని చెప్పునుగాని, హిందూమతసముద్ధరణ మనిన, నతనికి బ్రీతి. అయినను తన మతధర్మము నవలంబించునట్టివారిని బాధించువారిని జూచి, భరింప లేడు. మఠములలో జరుగునట్టి యుత్సవము లన్నిటికి, సర్వమతములవారిని, సర్వవర్ణములవారిని, నతడు చేర్చుకొనుచు వచ్చెను. ఈవిధముగ రామదాసుడు, సర్వజనులను తన మతబోధక్రిందకు దీసికొనివచ్చి, హిందువుల యార్థిక, నైతిక, సాంఘిక వ్యవహారస్థితిని వృద్ధిచేసెను. హిందువుల గౌరవము స్వాతంత్ర్యము నెక్కువయగునట్లతడు చేసెను. దాసబోధయను గ్రంథము రామదాసు రచించిన పుస్తకములలో, బహు వేదాంతవిషయములు గలిగియుడును. ఆకారణమున మహారాష్ట్రులు భగవద్గీత తరువాత దీనినే మహాగ్రంథముగ నెంచి, పూజింతురు. ఇది సకల విషయములు కలిగి గ్రంథకర్తయొక్క దివ్యజ్ఞానమును, జూబుచుండును. అది యొక్కసారి రచియింపబడలేదు. అప్పుడప్పుడతడు, పద్యరూపమున నాశుధారగా నిచ్చిన పద్యములందు గలవు. కాగితము, కలము, పుచ్చుకొని నిరంతరము గురు వుగారివెంట నుండు, "కళ్యాణస్వామి" యను శిష్యుడు, గురువునోటనుండి వెడలిన ప్రతిముక్క, నెప్పటికప్పు డెక్కించి దాచుచుండును. అందుచేత, నది పెద్ద సంపుట మయ్యెను. రామదాసుడు చనిపోవు రెండు మూడు దినములక్రిందవరకు, శిష్యునకు జెప్పి, యాగ్రంథము వ్రాయించు చుండెను. చివరదినములలో, నతడే యాగ్రంథమునందు కొన్నిమార్పులను తన స్వహస్తములతో జేసెను.

దాసబోధలో నిరువది దశకములు గలవు. దశకమునకు పదేసి శ్లోకములుండును. కొన్ని చోట్ల గుర్ఫుశిష్యులకు సంవాదము జరిగినట్లుగ వ్రాయబడెను. ఆ గ్రంథములో నత డనేక ప్రపంచసమస్యలను విప్పెను. అతని శైలి ఖడ్గధారవలె, నిశితమై, పరవాదములను ఖండించుకొని పోవుచుండును. కఠినమై చిక్కులుగల సమస్యలను విప్పుటలో దాసబోధవంటి మహాగ్రంథ మింకొకటి లేదనియే చెప్పవచ్చును. మహారాష్ట్రదేశము స్వాతంత్ర్యమను యమృతము చవిచూచుచు, మహోత్కృష్టదశను బొందుచుండగ శివాజీ 1680 సం. రాయఖడ్ కోటలో మృతినొందెను. చనిపోవునప్పటికి, నతనికి వేబది మూడు సంవత్సరములు, అందుచే నతనిని అల్పాయుష్మంతుడనియే జెప్పవచ్చును. ఆయన మరణము రామదాసునకు పిడుగుపాటు వంటిది. ఆవార్త వినగానే మొగము దిగాలు వేసుకొని నిశ్శబ్దముగ తన గదిలోనికి బోయెను. శివాజీ తరువాత, సింహాసన మెక్కిన యతనికొడుకు శంభాజీ తండ్రివలెనే, శౌర్యవంతుడు, బలవంతుడునై, రాజ్యము వృద్ధిచేయు తలంపుగలవాడే కాని ఔరంగజీబు యొక్క కుతంత్రములవలన, నాతని చారుల చేతులలో బడెను. చారులు మిత్రులవలె నటించి, శంభాజీని జారునిగను, త్రాగుబోతుగను, జేసిరి. పూర్వపు మంత్రులు, శత్రువుల చారుల బారినుండి తొలగించుటకు బహుప్రయత్నములు చేసిరిగాని, యవి నిష్పలము లయ్యెను. శంభాజీ కన్యాకుబ్జబ్రాహ్మణుడైన "కలుషు" డను నొక బ్రాహ్మణుని వశములో నుండెను. వాడు తక్కిన చారులతో గలిసి, శంభాజీ మెడకు దుస్తంత్రములను నురిత్రాళ్ళను గట్టిగ బిగించెను. గొఱ్ఱె కటికవానిని నమ్మినట్లు, శంభాజీ వాడేదిచెప్పిన, నజ్ది చేయుచుండెను. "కలుషు"డు శంభాజీని వశవర్తుని జేసికొని, సవతితల్లియగు "తారాబాయిని" బ్రతికి యుండగనే, గోడలోబెట్టి కట్టించునట్లు చేసెను. అదిగాక, శంభాజీ వాని సలహాప్రకారము భక్తివిశ్వాసములు గలిగి మహారాష్ట్ర సామ్రాజ్యసౌధమునకు నిత్మాతలైన ప్రధాన మంత్రులను, ముఖ్యపురుషులను, నేనుగుకాళ్ళచే ద్రొక్కించి, చంపించెను. ఈ దౌర్జన్యములు రామదాసుని హృదయమును మండజేసెను. మహారాష్ట్ర సామ్రాజ్యము చాలకాలము నిలువదని, యతడు భయపడెను. శంభాజీ యప్పుడప్పుడు, రామదాసుని నిలయమైన, పైజాన్‌ఖాడ్‌నకు బోవుచుండెను గాని, రామదాసు డతనిని గలుసుకొనుట కిష్టపడడయ్యెను. ఒకానొకప్పుడు శంభాజీ రామదాసుని దర్శనము చేసినప్పుడు శంభాజీని రామదాసుడు, వాని దుర్నయమునకై కఠినముగ, జీవాట్లు పెట్టెను. శంభాజీ తన తండ్రి మార్గము ననుసరించి, వర్తింతునని నొక్కి చెప్పి, వెడలిపోయెను. రామదాసుని యొక్క హితోపదేశములకంటె దనచుట్టు జేరిన, దురాచారుల మాటలే యెక్కువ ప్రియములుగ నుండెను. ఎట్టకేలకు రామదాసుడు కడపటి ప్రయత్నముగ నొక జాబు వ్రాసెను. అదియు నిష్ప్రయోజనమే యయ్యెను. 1681 సంవత్సరమున అనగా శివాజీపోయిన సంవత్సరమునకే రామదాసుడు తన దాసబోధ యను గ్రంథమును బూర్తి జేసెను. అది మొదలుకొని, రామదాసునకు దేహారోగ్యము చెడెను. అందుచేత, నత డెవరికి, దర్శనమీయక యొక గదిలో కూర్చుండెను. రోగసంబంధమైన బాధలు నివారణజేసి కొనుటకు గొన్ని గ్రహశాంతులు మొదలయినవి చేసికొమ్మని, కొందఱు శిష్యులు చెప్పి శంభాజీమహారాజుయొక్క యాస్థానవైద్యుని, బిలిపింపుమని, కోరినప్పుడు రామదాసుడు, కఠినముగ నిట్లు చెప్పెను. "ఇది యెంత పరిహాసాస్పద్ఫ మయినపని, అది మన విశ్వాసమును, వైరాగ్యమును భంగపఱుపదా? ఈ భౌతిక శరీరము క్షణభంగురమని, బోధించునట్టి మనమే, దీనికొరకింత, విశ్వప్రయత్నము చేయదగునా? ఈ శరీరము మనదిగాదు, ఇది యొక చొక్కావంటిది. ప్రాతగలిగినప్పుడు, దానిని త్రోసి పారవేయవలసినదే! ఈ సంగతి భగవద్గీతలో చెప్పలేదా? ఈ శరీరము పంచభూతములలో గలిసిపోవువఱకు విధి దాని కేమివిధించెనో యవియన్నియు యనుభవించితీరవలసినదే! గ్రహశాంతులు నవసరము లేదు; వైద్యుని యవసరము లేదు" రోగము క్రమక్రమముగ వృద్ధిబొందెను. చరమదశ వచ్చెను. అన్ని మఠములనుండి శిష్యులందఱు చేరిరి. ఈ మఠములయొక్క యధికారము, తన యన్నగారైన శ్రేష్ఠుని కొమరునకు నప్పగించెను. తన మరణానంతరమున తనతో, మాటలాడదలచినవారు దాసబోధలో జెప్పబడిన ప్రకారము నడచుకొనవలెనని, యానతిచ్చెను. అతడు రెండురోజులకు చనిపోవుననగా దేశమంతటినుండి భక్తులు, శిష్యులు, కొన్ని లక్షలమంది వచ్చి, మఠమును జూట్టవేసిరి. ఆకసము మాఱు మ్రోగునట్లు, రామభజనలు జరిగెను. రామదాసుడును, తన యిష్టదైవతమగు రామనామము స్మరించుచుండెను. పదునొకండుసారులు రామ, రామ యనుచు, రామదాసుడు, ప్రాణములు విడిచెను.

ఆతని మరణముచేత, మహారాష్ట్ర మంధకారబంధుర మయ్యెను. మహారాష్ట్రుల పాలిటి కోహినూర్ రత్మము పోయెను. ఇతడు 1681 సంవత్సరమున మాఘమాసమున శుద్ధ నవమినా డస్తమించెను. అది మహారాష్ట్ర శకము ప్రకారము 1603 వ సంవత్సర మయ్యెను. ఈ దినము, మనదేశము భీష్ముని యేకాదశివలె మహారాష్ట్ర దేశ మంతటను దాసనవమి పేరిట బరగుచుండును. ఆదినమున, నేటేట నుత్సవములు, నుపవాసములు, భజనలు జరుగుచుండును.


చరమ ప్రకరణము సమాప్తము.