సమర్థ రామదాసు/తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

తొమ్మిదవ ప్రకరణము

బోధకులు - బోధకధర్మములు

ఒకజాతి పదభ్రష్ట మైనప్పుడు జనులు దేశలాభము చూడక స్వలాభపరాయణులై ధర్మ హీనులై వర్తింతురు. దేశమట్లు పాడైనప్పుడు దైవానుగ్రహముచేత నెవరో కొందరు స్వార్థత్యాగులు బయలుదేరి దేశసముద్ధరణమునకై పాటుపడుదురు. అట్టి స్వార్థత్యాగులు మానవ సేవ జేసి లోకముద్ధరించుటకై ప్రయత్నముజేసి తమ ప్రాణములనైన ధారవోయుదురు. స్వదేశమును నెండియు నుద్ధరించుటకు రామదాసుడు స్వార్థవిహీనులైన యువకు లనేకుల జేరదీసి వారిని శిష్యులుగా స్వీకరించెను. పడుచువాండ్రు లోకసేవ జేయుటకై ముఖ్యమైన యాటంక మొకటి గలదు. ప్రతి మనుష్యుడు తనపొట్ట బోసికొనుచు యాలుబిడ్డల బోషించుకొనవలసిన భారమొకటి యున్నది గదా? మానవు డూరకుండినను బొట్ట యూరకుండదు. ఆకలిచే భాధ పడుచున్న వాడును కుటుంబ సంరక్షణ చేసికొనలేనివాడును లోకమున కేమిమేలు చేయగలడు? సర్వధర్మములను బరిత్యజించి తన్నొక్కనినే నమ్మిన వానిని సకల కష్టములనుండియు సకల పాపముల నుండియు విముక్తుని జేయుదు నని శ్రీకృష్ణ భగవానుడు గీతలో జెప్పియున్నాడు గదా! గొప్ప మనోదార్డ్యము గల మహాత్ములు దప్ప సామాన్య జను లా వాక్యము ననుసరించి నడువలేరు గదా! శిష్యులకు నిత్యభుక్తి గడచుటకు రామదాసుడు మతబోధకు లందఱు బిక్షావృత్తిచేత జీవింపవలె నని శాసించెను. ఈ యుపాయముచేత మతబోధకు లొకరి యండ నుండకుండ యొకరికి విధేయులై యుండకుండ యథేచ్ఛముగా సర్వతంత్ర స్వతంత్రులై వ్యవహరించుటకు వీలుకలిగెను. ఈ భిక్షావృత్తి మతబోధకుల యాకలి దీర్చుటకు మాత్రమే యుద్దేశింపబడెను. గాని వారు దాని నొక జీవనాధారముగ జేకొని ధన కనక వస్తు వాహనములు సంపాదించుకొనుటకు గాదు. ఈ వృత్తి వలన స్వార్థత్యాగులైన యువకులు పొట్టకై ననవసరములైన వ్యవహారములలో దిగకుండ తన కృత్యము తాను నిర్విఘ్నముగ జేసికొనుట కవకాశము గలిగెను. పూర్వకాలమున భిక్ష మెత్తు సన్యాసులు లోకానుగ్రహార్థమై పాటుపడెడి వారని వారిని జనులు గౌరవించెడివారు. భిక్షాటనము నేటికాలమున సోమరిపోతులకు శ్రమలేనిదియు, లేశము పెట్టుబడి లేనిదియునైన యొక వ్యాపారమైనది. ఇది దేశముయొక్క దురదృష్టము. పనిచేయగలవాండ్రు పనిచేయక సంసారయాత్ర నేదోవిధముగ గడుపుకొను లోకులను బీడించుట శోచనీయము. రామదాసుడీ భిక్షావృత్తిని గుఱించి దాసబోధ యను గ్రంథములో సకల సందేహములు నివేదించెను. తన మహారాష్ట్ర ధర్మము నవలంబించిన ప్రతి బ్రాహ్మణునకు బ్రతి మానవునకు విద్యుక్తధర్మమని విధించెను. బ్రాహ్మణు డనగా బ్రాహ్మణ జన్మము నెత్తినవాడు కాదు. బ్రహ్మజ్ఞానము కలవాడు మాత్రమే బ్రాహ్మణుడు. దేశ సేవా పరాయణుడే బ్రాహ్మణుడు. ఈ యభిప్రాయము మనసులో బెట్టుకొనియే రామదాసుడు బ్రాహ్మణులనే గాక యర్హులని తోచిన వారిని నాలుగువర్ణములనుండి శిష్యులుగ గ్రహించెను. అందు బురుషులేగాక స్త్రీలుగూడ నుండిరి. పవిత్రవర్తనము వైరాగ్యభావము గల వారిని మాత్రమే యతడు చేరదీసెను. రామదాసుడు శిష్యులే విధముగ ధర్మముల నవలంబించవలె నని విధించెనో విచారింతము. ఇందుకై యత డెన్నో మఠముల స్థాపించెను. ప్రతి మఠమునకు నొక్క శిష్యుని, మఠాధిపతిగా నియమించెను. ప్రతి మఠాధిపతియు దన మండలములో మిక్కిలి శ్రద్ధతో జనులకు బోధింపవలెను. ఈ యుద్యమమునకై యా బోధకు డేదో యొక గ్రామమున పెక్కునాళ్లుండక బోధించుచు నొక పల్లెనుండి మరియొకపల్లెకు సంచారము చేయుచుండవలెను. రామదాసుడు తాను తీర్థ యాత్రలు చేసిన పండ్రెండు సంవత్సరములలోను జ్ఞానసంపాదన చేసినట్లే బోధకులు గూడ సంచార సమయమున బహు విషయపరిజ్ఞాన మార్జింపవలెనని యతని కోరిక. కాని యతడు మఠమును విడిచి సంచరించరాదు. తన మఠ మే మండలములో నున్నదో యా మండలములో మాత్రమే యతడు సంచరింపవలెను. ఈ విధముగ రామదాసుడు లెక్కలేనన్ని మఠములు స్థాపించి లెక్కలేనంతమంది శిష్యుల నేర్పఱచి వారిని సంచార కార్యమున సంచరించు చుండవలెనని యాజ్ఞాపించుటచేత నతడెంత దూరముగ నాలోచింప గలవాడో తెలుసుకొన వచ్చును. మతబోధకు డెట్లు జనుల హృదయముల నాకర్షింపవలెనో వారి నెట్లు రంజింపచేయవలెనో యా విషయమై యత డిచ్చిన యుపదేశములు శ్లాఘాపాత్రములు. ప్రతి గ్రామము పోకముందు బోధకుడు గ్రామముయొక్క పరిస్థితులు చక్కగా విచారించి ప్రవేశింపవలెను. ఈ విచారణమువలన గ్రామవాసులలో నెవ్వరు సాధుజనులో, ఎవ్వరు ధర్మపరాయణులో, ఎవ్వరు వట్టి ప్రేలరులో, ఎవ్వరు వట్టి స్తోత్రపాఠకులో, ఎవ్వరు స్వార్థపరులో తెలిసికొని తన వల పన్ని పనిచేయుటకు నవకాశము కలుగును. ఆ బోధకుడు దుర్జనులను, ద్రోహులను బహిరంగముగ ఖండించి దూషించ గూడదు. దుర్జనులను కనుగొన వలసినదేగాని వారిని దూషించి వారితో విరోధము దెచ్చుకొన గూడదు. తక్కిన జనులకంటె వారిని మిక్కిలిగా భూషింపవలెను. ఈ విధముగ నేర్పఱుప బడిన మతబోధకులు మహారాష్ట్ర దేశమున గల నగరములలోను, బట్టణములలోను, బల్లెలలోను సంచారముచేసిరి. మానవుల సమస్త విషయములలోను రామదాసీ శిష్యవర్గము వలన సకల జ్ఞానమును సంపాదించెను. నీవు భిక్షుకుడవుగ సంచరించినప్పుడు "గొప్ప గ్రామమైనను కుగ్రామమైనను బేదయూరైనను, సంపదగల గ్రామమైనను, వెళ్లి గుడిసె గుడిసెకు దిరిగి సమాచారము సంగ్రహించుకొని రమ్మని యత డాజ్ఞాపించెను. అటువంటి భిక్షకుడు స్వార్థపరుడని యెవడన గలడు. ధనముగాని వస్త్రములుగాని గ్రహింపక వారు బిచ్చ మెత్తినపుడు గుప్పెడు ధాన్యము తప్ప మరి యే వస్తువు పుచ్చుకొన కూడదని యతడు కఠినముగ శాసించెను. బోధకుడు సంతుష్టి గలిగి యుండవలయును గాని యాశాపాతకుడు కాగూడదు.

మనప్రాణము లితర ప్రాణములతో గలుపవలెను. మన యాత్మ యితరుల యాత్మలతో మైత్రిచెందవలెను. ఆహా! యిది యెంత యమూల్యమైన యుపదేశము. ఆ యుపదేశము ననుసరించినవారు మహారాష్ట్ర జాతికి నిర్మాతలైరనుట ఆశ్చర్యముగాదు. దేశముద్ధరింప దలచినవారు జనులను బీడింపగూడదు.వారు నడచిన త్రోవలనే నడచుచు వారి సంభాషణాను సారముగానే భాషించుచు వారి హృదయముల జూఱ గొనవలెను. పిల్లలకు బోధింపవలసినప్పుడు వారి గ్రహణశక్తిని జ్ఞానమునుబట్టి బోధింపవలెను. ఎవరికి బోధించినను వారి జ్ఞానమును బట్టియే బోధనము చేయవలయును. మీరేమి చేయదలచినను జనహృదయములను రంజింపుచునే చేయవలెను. వారి నెప్పుడు పీడింపగూడదు. ఈ విధముగ రామదాసుని శిష్యులు జన సామాన్యముతో గలసిపోయి వారి విశ్వాసమునకు బాత్రులై రామదాసు యొక్క సంకల్పము నెఱవేర్చిరి. శిష్యులు సంచారము చేయుచు నీ క్రింది పద్ధతులను శ్రద్ధగా నాచరించుచుండిరి. 1. వైరాగ్యము. మూడు లోకముల సామ్రాజ్యము వారి కర్పించినను వారు దానిని గడ్డి పరకగ జూడ నారంభించిరి. 2. వేద శాస్త్ర పఠనమును, స్నాన సంధ్యా ద్యనుష్ఠాన నిర్వహణమును వారికి ముఖ్యములు. 3. ప్రతి గ్రామము నందును శిష్యులు భజన కీర్తనలు తప్పక చేయుచుండవలెను. శిష్యుడొక గ్రామమున గొన్ని గంటల కన్న నెక్కువగ నుండగూడదు. ఏ విధమగు బహుమానమును స్వీకరింపగూడదు. 4. పరోపకారము తప్పక చేయుచుండవలెను. శిష్యులు మతబోధయందేగాక వైద్యము మంత్రశాస్త్రము గూడ నేర్చుకొని చేతనైనంత సాహాయ్యము జనులకు జేయుచుండెడివారు. ఈ శరీరము పరులమేలు కొఱకే యుపయోగింపవలెను.పరోపకారార్థ మిదం శరీరమ్," అను మాటను జ్ఞప్తిలో నుంచుకొనవలెను. కాని శిష్యులు "శరీర మాద్యం బలుధర్మసాధనమ్" అను మాట గుఱిజేసికొని తమ శరీరములను సంరక్షించుకొనుట మానరాదు. ఆరోగ్యము చెడగొట్టుకొన గూడదు. శిష్యులు జనుల హృదయముల యొక్క లోతు తెలిసి కొనవలెను. ఇది స్వకార్యనిర్వహణమున నతని కెంతో సాయపడుచు వచ్చెను. జనులయొక్క హృదయముల నెఱిగినవాడు దేశకాల పరిస్థితులను గ్రహించి తన ధర్మమును సంతుష్టికరముగ నెఱవేర్చుకొన వచ్చును. తన సంచారములో లభించిన సమాచార లేశములను సంచారాంతమున నెమరు వేసికొని శిష్యుడు కార్యసాధనమునకు వినియోగించుకొనవలెను. ఈ పరిశోధనమున నెవరు తనకార్యమునకు ననుకూలురో యెవరు ప్రతికూలురో యేవిధముగ వారిని సమీపింపవలెనో యెత్తెఱంగున దన విధి నెఱవేర్చవలెనో శిష్యుడు తెలిసికొనదగిన యవకాశము గలుగును. ఏ కార్యమైనను నా దినమున జేయదగినది మరునాటివఱకు నిలుపు చేయగూడదు. గురువుగారి మార్గమునే శిష్యుల ననుసరించుట చేత శరీరము నీటిబుగ్గవలె క్షణభంగుర మని తెలిసికొని యెప్పటికార్య మప్పుడు చేయుచుండిరి. ముందు నిముషము నందేమి సంభవించునో మన మెఱుగము గాన నిరంతరము రామనామ స్మరణము చేయుచు శిష్యులు స్వకార్యదీక్షాపరతంత్రులై యుండిరి. ఏకాంత స్థలమున కరిగి ధ్యానము చేయుచుండవలెను. ఆ ధ్యానమువలన మనశ్శాంతియు నసాధారణ ధైర్యము కలుగును. మహారాష్ట్ర దేశ మంతయు నధోగతిలో పడిపోయినప్పుడు రామదాసు సింహమువలె గర్జించి బలిష్టమైన తన హస్తమును వారికందించి వారి నా బురదనుండి లేవనెత్తెను. కష్టము లేకుండ ఫలము లభింపదు. పరిశ్రమ లేకుండ స్వరాజ్యము చేకూరదు. కార్యశూరత్వము లేక నే లాభము గలుగదు. కర్మము విషయమై శ్రీకృష్ణ భగవాను డేమి చెప్పెనో మన మెఱుగుదుము. పనికే కర్మ యని పేరు. కర్మ చేయక నెవడును నుండలేడు. ఏలయన వినుట కర్మ, చూచుట కర్మ, నడచుట కర్మ ఏ పనిని జేయక యుండుట స్వలాభ విరుద్ధము. తాను స్వయముగ బని చేయక యితరుల నమ్ముకొన్నవాడు పరమ మూర్ఖుడు అని చెప్పెను. రామదాసుడు శ్రీకృష్ణభగవానుని వాక్యములే నొక్కివక్కాణించి శిష్యులను బనికై పురికొల్పెను. కార్యదీక్ష లేకుండ నెట్టి కార్యములు నెఱవేరలే దని చరిత్రయే సాక్ష్యమిచ్చుచున్నది. పరోపకారము నీతియు బ్రధానముగా నుంచుకొన వలసిన దని రామదాసు తన శిష్యులకు పలుమారు బోధించుచు వచ్చెను. శరీరమును నీతిమార్గమునకు ద్రిప్పినవాడును, నాత్మ నశింపక శాశ్వతముగ నుండునని నమ్మినవాడును మరణ మన్న లేశము భయపడడు. పేరు ప్రతిష్ఠలకొఱ కేపనిని చేయవద్దని రామదాసుడు తన శిష్యులను గఠినముగ శాసించెను. మనుష్యుడు ఫలాపేక్ష లేక నిష్కామకర్మ చేయవలెను. కష్టపడి పనిచేసిన వారికి సుప్రతిష్ఠ దా నంతట యదే వచ్చును. మానవుడు తన దారాపుత్రాదులను భరించుటే గాక లోకమునకు గూడ గొంత సేవ చేయవలెను. మఠాధిపతియైన మహంతు లోకారాధనమే చేయవలెను. అతని హృదయము స్వార్థపరత్వమునకు జోటీయ గూడదు. అట్లెడ మిచ్చినవాడు మహంతు శబ్దమునకు దగడు. స్వార్థపరు లెన్నడును, దమకును నితరులకును గూడ మేలు చేయ జాలరు. జనరంజకముగ బనిచేయ దలచిన వాడు జనరంజకముగ మాటలాడవలెను. జన వశీకరణ శక్తి జిహ్వకే కలదు. ఇతరుల సౌఖ్యమే తన సౌఖ్యముగాను, ఇతరుల బాధలే తన బాధలుగాను బోధకుడు భావింపవలెను. సత్యము నతిక్రమింపని స్వాదు సంభాషణ వలన నితరులు వశంవదు లగుదురుగాని కఠినోక్తుల వలన లొంగరు. పిచ్చివానిని పిచ్చివా డన గూడదు. ఏ రహస్యము బయలు పెట్టరాదు. సానుభూతియు, శాంతియు, తప్పును క్షమించు స్వభావమును ప్రాముఖ్యములు, కోపము మిత్రులను శత్రువుల జేయును. మధుర సంభాషణము శత్రువులను మిత్రులుగ జేయును. కొంటెవాండ్రు గాని దుర్జనులు గాని తమ వాదముల ఖండించి యెదురు తిరిగి కార్యవిఘ్నము చేయదలచినప్పుడు వారిని జయించుటకు శాంతవచన ప్రయోగములే మహాయుధములని యతడు బోధించెను. వేయేల; బోధకుడు పరిపూర్ణుడుగ నుండవలె నని రామదాసుని యభిప్రాయము. అన్ని విద్యలలో గొంచెము కొంచెము వ్రేలుపెట్టక యేదో విద్యలో పరిపూర్ణడై యుండుట మంచిదని రామదాసుని యభిప్రాయము. ఈ పై బోధలను జూడ రామదాసు డెంత ప్రజ్ఞావంతుడో, యెంత కార్యసాధకుడో సులభముగ దెలిసికొన వచ్చును.


_______