సమర్థ రామదాసు/ఐదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఐదవ ప్రకరణము

హిందూదేశ సంచారము

అతడు మహారాష్ట్ర దేశము విడచి యుత్తర హిందూ స్థానమునకు బోయి గయాక్షేత్రముచేరి యచ్చట పూర్వము బుద్ధదేవుడు తపస్సు చేసిన మఱ్ఱిచెట్టు క్రిందనే కూర్చుండి పండ్రెండు సంవత్సరములు ఘోరతపస్సు చేసి సాటిలేని యింద్రియ నిగ్రహమును, యసమానమైన యాత్మజ్ఞానమును సంపాదించెను. అత డంతతో దనివి నొందక భరతఖండమున గల నానా భాగములకు బోయి యచ్చటి జనుల వేషభాషలను వివిధాచారములను గ్రహించి, సమస్త పుణ్యస్థలములను జూచి, తీర్థయాత్రలు సేవించి లోకానుభవము నార్జించి, పిదప స్వదేశమునకు బోవలె నని సంకల్పించెను. తాను లే నప్పుడు తకిలీ గ్రామములో స్థాపించిన మారుతీ దేవాలయమునకు నిత్యపూజా కైంకర్యములు నీమముతో నడుపుటకు సర్వవిధముల నుద్ధవుడే యర్హుడని వాని నా యాలయమున నుంచి పోయెను. కాలినడకను కాశీపట్టణమునకు పోయెను. అచ్చట నతడు శ్రీవిశ్వేశ్వరస్వామివారి యాలయము ప్రవేశింప బోవుచుండ నచ్చటి బ్రాహ్మణులు వాని నడ్డుపెట్టిరి. ఆతని లంగోటీ చూచియు జడలు చూచియు మలినమైన బట్టలను జూచియు నత డెవడో తక్కువజాతి వాడని వారు భావించి యట్లు చేసిరి. అడ్డు పెట్టగానే యతడు వారితో వివాదపడక తిన్నగా నత డటనుండి వెడలి పోయెను. రామదాసు డట్లు వెడలి పోగానే విశ్వేశ్వరాలయములో నున్న శివలింగమదృశ్య మయ్యెనట. అర్చకులు ధర్మకర్తలు మొదలయినవారు మిక్కిలి యాశ్చర్యపడి కళవళపడి యా వింతకు గారణము రామదాసుని రానీక వెడల గొట్టుటయే యని నిశ్చయించిరి. వారు తొట్రుపడి వానివెంట పరుగులెత్తి వానిని గలసికొని, తమ్ము క్షమించి యాలయమునకు దయచేయు మని ప్రార్థించిరి. రామదాసుడు మారు మాటాడక మౌనముతో వారివెంట విశ్వేశ్వరాలయమునకు బోయెను. పోయిన తోడనే లింగమెప్పటియట్ల గుడిలో గనబడెనట. అడ్డుపెట్టిన వారి గర్వభంగ మయ్యెనట. కాశినగరములో నున్న దివ్యస్థలము లన్నియు నతడు సేవించెను. అన్నిటికేమి గాని యచ్చట హనుమాన్ ఘట్టమని యొక ఘట్టము గలదు. పేరు హనుమాన్ ఘట్టమేగాని యచ్చట హనుమంతుని యాలయము లేదు. రామదాసుడు మారుతి దేవాలయము గట్టించి, యందు హనుమంతుని విగ్రహము నెలకొల్పి పూజా నమస్కారములు ప్రతి దినము చేయు మని బ్రాహ్మణులకు జెప్పెను. కాశీపురి నుండి రామదాసు డయోధ్యాపురి కేగెను. అయోధ్యాపుర దర్శనము కాగానే యతని యానందము మితిమీఱెను. సూర్యవంశ ప్రదీపకుడు, పితృవాక్య పరిపాలకుడు, పరమదైవతము నైన శ్రీరాముడు పుట్టిన చోటును, ఆ మహానుభావుడు రాజ్యమేలిన చోటును గనుగొను భాగ్యము తన కబ్బిన దని యత డానంద పరవశు డయ్యెను. అతడక్కడ గొన్నిదినములు గడపి పిమ్మట మధురాపురము, గోకులము, బృందావనము, మొదలైన దివ్యక్షేత్రముల సేవించెను. ఆతని రాక విని జనులు మహానుభావుడగు నతని దర్శనము చేసి యాశీర్వచనము పొంద జనులు గుంపులు గుంపులుగ జేరిరి. ఏలయన నతని కీర్తి యతనికంటె ముందే యచ్చటికి జేరెను. రామదాసుడు తనకు జిక్కిన యవకాశములను వ్యర్థముగ బోనిచ్చువాడు గాదు. అందుచే నతడు అచ్చట కొందఱి కుపదేశములు చేసి మఠములు స్థాపించి తన బదులుగా బనిచేయుమని వారిని నియోగించెను. అతని పనికి నదే ప్రారంభము. కాని యతడుత్తర హిందూస్థానమున నధికముగ మతవ్యాప్తి చేయదలచుకొనలేదు. తన యావచ్ఛక్తిని దనకాలమును దన జ్ఞానమును మాతృదేశమైన మహారాష్ట్రమునకే సమర్పింపవలె నని యతని నిశ్చయము. అత డంతట శ్రీకృష్ణునకు మున్ను నివాసమైన ద్వారకానగరమునకు పోయి యచ్చట నొక శ్రీరామాలయము స్థాపించి సంప్రోక్షణాది కర్మలు గావించి యచ్చట నుండి కాశ్మీరమునకు రాజధానియైన శ్రీనగరమునకు బోయెను. అచ్చట శిక్కుమత స్థాపకుడైన నానక్ గురువుచేత స్థాపింపబడిన మఠము కలదు. యది పరమ పవిత్రమైనదని యా మతస్థులంద ఱచ్చటికి యాత్ర జేయుచుందురు. రామదాసుడు వచ్చినా డని విని యా మతస్థులు తక్కిన శ్రీనగరవాసులు వానితో వేదాంత చర్చలు చేయదలచి వాని నాహ్వానించిరి. ఆహ్వాన మంగీకరించి రామదాసు డక్కడకు బోయెను. వారు రామదాసుని క్లిష్టములైన వేదాంత సమస్యా సముద్రమున ముంచివైచిరి. ఆత డవి లెక్క సేయక సమస్యలన్నిటికి సమయస్ఫూర్తిగ యుక్తితోను నేర్పుతోను సమాధానము లిచ్చి వారిని జయించెను. వేదాంత శాస్త్రము యొక్క గుట్టు మట్టు తెలియక లోతు నందలేక పైపైనే వారీదులాడుచున్నా రని స్పష్టముగా నతడు వారికి దెలియ జెప్పెను. నానకు మతస్థులు వాదములో పరాజయము పొందితి మని యొప్పుకొని యంతటినుండి రామదాసును దమకు బరమ గురువుగా నంగీకరించితి మని చెప్పిరి. వా రందఱు తమ కుపదేశము చేయుమని ప్రార్థించిరి. అందు కతడు సమ్మతింపక వారితో నిట్లనియె. "మహాపురుషుడైన నానకు మత బోధ కత్తియంచువలె పదునైనది. మహమ్మదీయులుగూడ "రామ రామ" యనుచుందురు. దానికి గారణము నానకు నందు గల జ్ఞానజ్యోతియే కారణము. మీ రాయనకు నమ్మిన శిష్యులు. మీగురువైన నాన కే ధర్మముల నుపదేశించెనో నా యుపదేశములు నట్టివే. మతము మార్చుకొనుట మిక్కిలి యాక్షేపణీయమని నా యభిప్రాయము. నానకునే యనుసరింపుడు. అందుచేతనే మీకు శాశ్వతానందము కలుగును." అనంతరము రామదాసుడు బదరీ నారాయణమును, కేదారేశ్వరమును, హిమాలయపర్వత శిఖరముమీద నున్న మానస సరోవరమును గాంచెను. ఆ పర్వతముమీదనే శ్వేతమారుత విగ్రహము గలదని వినెను. మనుష్యమాత్రు డచ్చటికి బోలేడని కూడ నతడు వినెను. అక్కడకు వెళ్ళసాహసించిన మహానుభావుడు శ్రీ శంకరాచార్యుల వా రొక్కరు మాత్రమే యని యచ్చటి వారు చెప్పిరి. రామదాసు డా క్షేత్రమునకు బోయి మహాత్ముని దర్శించి వర్షకాలము నాలుగు నెలలు గడగడ వడకించు చలిలోను మంచులోను గడపెను. హిమాలయ పర్వతములు దిగి శ్రీ జగన్నాథ క్షేత్రమునకు బోయి యచ్చటి నుండి తూర్పుసముద్రతీరమున బ్రయాణముచేసి రామేశ్వరము పోయి యచ్చటనుండి లంకకు బోయెను. లంకద్వీపము విడిచి రామదాసుడు పశ్చిమ సముద్రతీరమున బ్రయాణముచేసి త్రోవలో నున్న పుణ్యక్షేత్రముల నన్నింటిని దర్శనము చేసి క్రమముగ మహాబలేశ్వరము చేరెను. ఈ మధ్యకాలమున నక్కడక్కడ మారుతి మఠముల స్థాపించి వానియందు బూజా పురస్కారములు జరుగునట్లు చేసెను. ఇట్లు, పండ్రెండు సంవత్సరము లాసేతుహిమాచల పర్యంతమైన భరతఖండమంతయు యాత్రలు సలిపి సలిపి యెట్టకేలకు నాసిక జేరెను. అక్కడదన ప్రియశిష్యుడైన యుద్ధవుని గలిసికొని యతడు తన కృత్యములను శ్రద్ధాభక్తులతో జేయుచున్నట్లు విని సంతోషించెను. పిమ్మట బవిత్ర మగు గొదావరి జలమున స్నానముచేసి యతడు రామదేవుని యాలయమున కరిగి నమస్కరించి యిట్లనియెను. "భగవంతుడా! శ్రీరామా! మీ యనుగ్రహము చేత నీ పండ్రెండు సంవత్సరములు పుణ్యక్షేత్రముల సేవించి యాత్ర సలిపితిని. ఈ యాత్రలో నే పుణ్యము సంపాదించితినో యది యెల్ల శ్రీరామార్పణ మని మీకర్పించెదను. కరుణించి స్వీకరింపుము" అని పలికి శ్రీరాముని హస్తములలో జలము ధారబోసెను. ఈ యాత్ర యంతయు రామదాసుడు జీవనాధారము లేక, చేత ధన మేమియు లేక కాలినడకనే జరిపె నని పాఠకులు గ్రహింతురుగాక. రామదాసుడు పాదచారియై పోవుటచేత భరత ఖండమున గల మండలము లన్నిటిలో జనుల యాచార వ్యవహారములను గ్రహించుట కవకాశము గలిగెను. ఈనాటి యాత్రలకు, రామదాసుడు పదునేడవ శతాబ్దమున జేసిన యాత్రలకు జాల భేదము గలదు. ఈ నాటివారు. ఓడలలోను, ధూమ శకటములలోను నెక్కి పయనములు చేయుదురు. ఆంగ్లేయ కనియైన 'రస్కిను' అను నతడు "రైలు ప్రయాణము నిజమైన ప్రయాణము కాదు" అని వక్కాణించెను. ఏలయన నొక బంగీ పొగబండిలో బడవైచి యొక చోటనుండి మరియొక చోటికి బంపినట్లే మనుష్యుని గూడ నొకచోట బొగబండిలో నెక్కించి మరియొకచోట దింపుదురు. కాన నది నిజ మయిన ప్రయాణము కా దని యతడు పలికెను. నిజముగ రామదాసుని మతసంబంధమైన తీర్థయాత్రయైనను, నత డేగిన చోట నెల్ల నక్కడి స్థితిగతు లన్నిటిని దన భవిషత్కార్యమునకు ననుకూలముగ జేసికొనునట్లు గ్రహించెను. ఒక స్థలమందు నతడిట్లు చెప్పెను. "ఈ ప్రపంచ మనేక విధములైన మనుష్యులతో నిండియున్నది. వారినడుమ సంచరించుటవలన మన కెంతో జ్ఞానము కలుగును. అదిమన కాశ్చర్యము గొలిపి యెన్నో జీవిత సమస్యలను సాధించును. కనుక మనము నిరంతరము ప్రయాణము చేయవలెను. నూతన ప్రదేశములను దర్శింపవలెను. దానివలన ననేక దేశముల పరిచయము మనకు గలుగును. అనేక తపస్సులు చేయవలెను. అనేక పుణ్యక్షేత్రముల సేవింప వలెను. వైరాగ్యము కలిగి యుండవలెను. స్వార్థత్యాగముచేత నూతన శక్తులెన్నో ప్రభవించును." ఈ శక్తివల్లనే యతడు శివాజీకి సాయము చేయకలిగెను. తాను స్వయముగ బాదచారియై యాత్ర సల్పి రామదాసుడు తక్కినవారికి మార్గదర్శకుడయ్యెను. ఈనాడు లోకసేవజేయ బ్రయత్నించువారు విఫలప్రయత్ను లగుటకు ముఖ్యకారణము జన సామాన్యముతో సంబంధము లేకపోవుటయే. జనులతో గలసి మెలసి యుండని వాడు జనులపక్షమున గట్టిగ బని జేయలేడు. కావున రామదాసుడు నానావిధములైన జనులతో మనము సంబంధము కలిగి యుండవలెనని బోధించుచుండును. కూపస్థమండూకము వలె నొకచో గూర్చుండెడివాడు సకల వ్యవహారములు చెడగొట్టుకొనును. కావున దేశాటనము చేసి యనేకులతో సంభాషింపవలెను.


________