సమర్థ రామదాసు/ఆఱవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆఱవ ప్రకరణము

అప్పటి దేశస్థితి

ఆ కాలమున మహారాష్ట్రదేశము మిక్కిలి దుస్థితిలో నుండెను. ప్రజలలో నైకమత్యము లేదు. దేశాభిమానమంతకుమున్నే లేదు. ఆత్మలాభపరాయణత్వమేగాని, స్వార్థత్యాగము లేదు. ఆత్మగౌరవ మంతరించెను. పరసేవాసక్తి క్షీణమయ్యెను. ఆ నాడు మహారాష్ట్రదేశములో దక్షిణమున బిజాపురసుల్తాను పాలించుచుండెను. కన్నడదేశమున గొంత భాగమును, మహారాష్ట్రమున గొంతభాగమును బిజాపూరు ప్రభువుల పాలనకు లోబడియుండెను. దేశమందలి సరదారులు వీరులు బిజాపూరు సుల్తానుల కొలువులో జేరి స్వదేశస్థుల మీద కత్తిగట్టి ప్రభువుల యనుగ్రహమునకు బాత్రులై వారిచేత బిరుదులు, ముఖాసాలు, జమీలు స్వీకరించి యధికారుల కనుసన్నల మెలగుచు దైవభక్తిగాని దేశభక్తిగాని లేక బానిస లట్లు మెలగుచుండిరి. కత్తిపట్టి పోరాడగల బంట్లు సయితము సుల్తానుల పటాలములలో జేరి పొట్ట బోసుకొనుచుండిరి. బిజాపూరు సుల్తానులు, అహమ్మదునగర సుల్తానులు, లేనిపోని వంకలు గల్పించుకొని యుద్ధములు చేయుచుండిరి. దేశస్థుల యర్థప్రాణములకు క్షేమము లేదు. స్త్రీలమాన ప్రాణములు దక్కించుకొనుట కష్టముగ నుండెను. అప్పుడప్పుడు మహమ్మదీయ ప్రభువుల సేనాపతులును సరదారులును దేవాలయములపై బడి దోచి నాశనము చేయుటయు గలదు. ఈస్థితి రామదాసుడు చక్కగ గ్రహించి స్వదేశమును నుద్ధరించుటకు సమకట్టెను. రామదాసుకంటె బూర్వము తుకారాము, ఏకనాథుడు, వామదేవుడు మొదలగు భక్తులు బయలుదేరి దేశస్థుల హృదయములలో నొక కొంత యాత్మ జ్ఞానమును దైవభక్తిని నెలకొల్పిరి. వా రాపని జేసియుండుట చేతనే రామదాసు పని సులభ మయ్యెను. యాత్మజ్ఞానము, దైవభక్తి కొంతయైనను గుదిరన గాని, నిజమయిన దేశాభిమానము కుదురదని రామదాసు యొక్క దృడవిశ్వాసము. రామదాసు బోధించిన ధర్మము పేరు మహారాష్ట్ర ధర్మము. ఇందు రాజకీయధర్మమును మతధర్మమును గూడ నిమిడి యున్నవి. ఈబోధకు రామదాసుడు చిరకాల తపస్సుచేతను, స్వార్థత్యాగముచేతను, దీర్ఘయాత్రచేతను తగినంత యనుభవము గలిగి కావలసిన సాధనసామగ్రి నంతయు జాగ్రత్త పెట్టుకొని పనిచేయుటకు నడుము గట్టికొనెను. వర్ణాశ్రమధర్మ భేధము వృద్ధికి గొంత యాటంకమయినను దానిని నాశనము చేసి సర్వజన సౌభ్రాతృత్వ మను పేర బూర్వపద్ధతులను కలగాపులగము జేయుట కతనికిష్టము లేదు. ఏ యభివృద్ధి కయినను మతమే మూలాధార మని యతడు నమ్మి యున్నందున జనుల హృదయములలో మతాభిమాన మహాగ్నిని బ్రజ్వలింపజేయ సమకట్టెను. నిరాశాతాపముచే వాడిపోయిన జనుల మనస్సుల మీద రామదాసుడు చల్లని ధర్మోదకముల జల్లి చిగురెత్త జేసెను. పనిని నతడు నిరాడంబరముగను, నిశ్శబ్దముగను బ్రారంభించెను.

శివాజీ యంతకుమున్నె స్వరాజ్యసంస్థాపన ప్రారంభించెను. ఆతని సాహసములవల్లను, విజయములవల్లను నతనికి గోబ్రాహ్మణ పరిపాలకుడని పేరు వచ్చెను. సాధుజంతువు లయిన గోవులను మిక్కిలి పవిత్రులయిన బ్రాహ్మణులను రక్షించుటకు శివాజీ కంకణము గట్టికొన్నా డని జనులు చెప్పుకొనుట కారంభించిరి. ఈ విషయములను రామదాసుడు వినకపోలేదు. రామదాసునకు గావలసిన బనులు గూడ నట్టివే. కాని శివాజీ యొక్క సాహసములు మహారాష్ట్ర సామంతులలో గొందఱికి వానియెడ ద్వేషము గలిగించెనే గాని, విశ్వాసము గలిగింపలేదు. శివాజీ కంటె ముందుండిన మహారాష్ట్ర ప్రభువులు స్వతంత్ర మహారాష్ట్రము బ్రతిష్ఠించుటకు బ్రయత్నింపరైరి. ఇట్టి యుదారభావము మొట్టమొదట శివాజీకే కలిగెను. మహారాష్ట్ర సామంతులు మహమ్మదీయ ప్రభువు లను గ్రహించి తమకిచ్చెడు బిరుదములతోను, గౌరవములతోను, జాగీరులతోను, సంతుష్టులై మిన్నకుండిరిగాని, మాతృదాస్య విమోచనమునకునై పాటుపడిన వారొక్కరును లేరు. అట్టి స్వతంత్ర మహారాష్ట్ర సాంరాజ్యసంస్థాపన గౌర నము శివాజీకే దక్కెను. అందుచేతనే దేశస్థు లందఱు శివాజీని మిక్కిలి గౌరవించి పూజించుచున్నారు.

గట్టిస్వతంత్ర సామ్రాజ్యస్థాపనము మత మనియెడు గట్టి పునాదిమీదనే గాని నిలువబడ దని రామదాసు యొక్క నమ్మకము. అందుచేత రామదాసుడు జనులకు దేశాభిమాన మంత్రము, మతాభిమానమంత్రము జోడించి ప్రయోగించెను. ఆ కారణమున జనులకు బరసేవాసన్నిపాత జ్వరము కొంత తగ్గెను. ఈ క్రింది పద్యము రామదాసు యొక్క సంకల్పమును సంగ్రహముగ దెలియ జేయును.

తే.గీ. మొట్టమొదటను శ్రీహరి పూజనంబు
     దేవసేవకు వెన్కను దేశసేవ
     తక్కిన విషయములయందు దగిన శ్రద్ధ
     పూనవలయును మానక మానవుండు.

రామదాసుడు తీర్థయాత్రా సమయమున హిందూదేశమునందు నానాభాగములలో గల యాత్మజ్ఞానులను బ్రహ్మవేత్తలను దేశప్రఖ్యాతి గల సన్యాసులను యోగులను సందర్శించి వారితో వివిధ విషయములను బ్రసంగించి వారికి దన పూనికను దెలియబఱచెను. వారాతని వృత్తాంతమును విని యతని బ్రహ్మచర్య దీక్షకును దైవభక్తికిని దేశాభిమానమునకును, యాతని నీమములకును నివ్వెఱపడి యాసేతుహిమాచల మగు భరతఖండమున నటువంటి యోగి లేడని నొక్కి చెప్పి వానిని దీవించి పంపిరి. రామదాసుడు మహారాష్ట్ర దేశమున స్థిరపడి ధర్మబోధ నారంభించిన తరువాత నాతని పరిచయము గల యోగులు సన్యాసులు పెక్కుండ్రు వచ్చి వానిని సందర్శించి వేదాంతవిషయములను జర్చించి ధన్యులయి పోవుచుండిరి. నారాయణబువా, మాహులి నివాసియైన జయరామస్వామి, ప్రసిద్ధరాజయోగియైన రంగనాథస్వామి, తుకారాము మహారాజ్, చించివాడవాసియైన మొరయదియొ, రఘునాథస్వామి, ఆనందమూర్తి, రామదాసుని తఱచు సందర్శించు వారిలో ముఖ్యులు రామదాసుడు దేశసేవాపరాయణు డయి తద్వృద్ధికై నిరంతరాలోచనా మగ్ను డయినను నారీమతల్లియైన తన తల్లిని గాని సోదరునిగాని మఱువలేదు. ఆహా! తల్లి దండ్రులను సోదరులను ఎవడు మఱువగలడు. రామదాసు తన మాతృ దేవతను స్మరియింపని దినమే లేదు. పెండ్లిపందిరిలో నుండి హఠాత్తుగ రామదాసు పాఱిపోయినది మొదలు ప్రేమకు నిలయమైన యా మాతృదేవి యిరువది నాలుగు సంవత్సరముల దీర్ఘకాలము దారుణమైన యా పుత్రువియోగదు:ఖము నెట్లు వహించినో మాటలలో వర్ణించుట మిక్కిలి కష్టము. ముడుతలుపడిన యామె చెక్కులు పుత్రునికై యామె విడిచిన బాష్ప బిందుధారలచే దఱచుగ దడియుచుండెను. నారాయణ నారాయణ యను నామము నిరంతరము నామెనోట నాడుచుండెను. రామదాసుని ప్రఖ్యాతిని వాని తల్లియు సోదరు డయిన శ్రేష్ఠుడును విని యుండిరిగాని తమ నారాయణుడే రామదాసని వా రెఱుగరు. ఎఱిగియున్న యెడల వాని యసమాన కీర్తి వారికి గొంత మనశ్శాంతిని, సంతుష్టిని గలిగించియుండెడిది. నిరంతర పుత్రశోక జ్వరముచేత నెల్లప్పుడు కన్నీరు గార్చినందున "రాణూబాయి" యొక్క దేహారోగ్యము చెడి యెట్టకేలకు నామె కన్నులు పోయెను. ఈ యిరువది నాలుగు సంవత్సరములలోను, రామదాసుని సోదరుడయిన శ్రేష్ఠుడు తగినంత యాత్మజ్ఞానము సంపాదించి వేదాంతియై గొప్ప గృహస్థుడై మాతృవాక్య పరిపాలకుడై భార్యానురాగియై యతిథులకు నభ్యాగతులకు నన్నోదకములిచ్చి వారి నాదరించుచు బేరుప్రతిష్ఠల గాంచుచుండెను. అంతతో బోక ఆతడు "భక్తి రహస్య" మను నొక మహాగ్రంథమును మహారాష్ట్ర భాషలో రచించెను.

ఎట్టకేలకు రామదాసు డిరువది నాలుగు సంవత్సరముల తరువాత జన్మస్థాన మగు జాంబుగ్రామమునకు జేరెను. చేరి మొట్టమొదట మారుతి దేవాలయమునకు బోయి యా దేవుని సేవించి, తనయింటి ముంగిలి వాకిటికిం బోయి, తాను బిచ్చమునకు బోవునపుడు పలికెడి పలుకులే "జయజయ రఘువీరసమర్థ" యని గట్టిగ బలికెను. మన దేశమున బిచ్చగాండ్రు "సీతారామాభ్యాం నమ:" యను నట్లే యా దేశమున యాయ వారమునకు బోవువారు జయజయ రఘువీర సమర్థ యనుట వాడుక, అప్పుడు రామదాసుని తల్లి ముందఱి వాకిటలో వసారా మీద గుర్చుండెను. ఎవడో బిచ్చగా డనుకొని బిచ్చము బెట్టు మని తన కోడలిని అనగ శ్రేష్ఠుని భార్యను బిలిచెను. అప్పలుకులు విని రామదాసుడు తల్లి నానవాలు పట్టి మెట్లెక్కి వసారామీదికి బోయి "అమ్మా యీ బిచ్చగాడు సామాన్యముష్టితో దనివి నొందడుసుమీ" యనుచు జడలు గట్టిన తన తల యామె పాదములపై బడవైచి నమస్కరించెను. ఆ స్పర్శవల్లనే యా తల్లి విషయము గ్రహియించి 'నాయనా! నా ప్రియపుత్రుడైన నారోబ మరల వచ్చెనా!' యని గట్టిగ నఱచెను. నారోబ యనగ నారాయణుని ముద్దుపేరు. "తల్లీ యతడే యితడు!" అని రామదాసుడు బదులు చెప్పెను. ఆ మాతాపుత్రసమాగమమందు దల్లికిం గొడుకునకుం గలిగిన పారవశ్యమును ఎవడు వర్ణింప గలడు. ఆమె కన్నులనుండి బాష్పములు దొడదొడ గారెను. శరీరము వడకెను. కంఠధ్వని గద్గద మయ్యెను. ఆమె కుమారుని గట్టిగ గౌగలించుకొనెను. 'నాయన, నారాయణ, నా కన్నులతో నే నిప్పుడు నిన్ను జూడలేను. మందభాగ్యురాలను' "అమ్మా మనము శ్రీరామచంద్రుని భక్తితో గొలుచు చున్నప్పు డా మహాత్ముడు మన కోర్కెలను దీర్పడా," యని పలికి రామదాసుడు తన చేతితో దల్లి కన్నులను నిమిరెను. అంతట శ్రీకృష్ణ వరప్రసాదమున దృతరాష్ట్రునకు దృష్టి వచ్చినట్లు నామెకు నద్భుతముగ దృష్టి వచ్చెను. రాణూబాయి కన్నులు విప్పి బిచ్చపు జోలితో, జడలు గట్టిన తలతో మొగమునుండి వెలువడు బ్రహ్మతేజస్సుతో, దండముతో మాఱిపోయిన రూపుతో దన యెట్టయెదుట నున్న కుమారుని గని తల్లి సంతసించెను. ఆతని యన్నగారైన శ్రేష్ఠుడు లోపల సంధ్యావందనము జేసికొనుచు దమ్ముని కంఠధ్వని విని పఱుగున వచ్చి తమ్ముని జూచి మహానందభరితు డయ్యెను.

రామదాసుడు వచ్చినా డని విని గ్రామవాసు లందఱు గుంపులు గుంపులుగ నచ్చటకు వచ్చిరి. తమ పూర్వ మిత్రుడైన నారాయణుడు రామదాసు డను పేర గొప్ప యోగీశ్వరు డయినందుకు వానిరూపు జూచి యాశ్చర్యము నానందము బొందిరి. చూడగనే వా రప్రయత్న ముగ దలలు వంచి యా యోగికి నమస్కరించిరి. ఆతని బాల్యస్నేహితులు తమ పిల్లను వెంట బెట్టుకొని రామదాసుని జూడవచ్చిరి. పూర్వ---వారు రామదాసుని మిక్కిలి చనువుతో బిలిచి సమీపింపకుండ శిరసు వంచి చేతులు జోడించి దూరమున భయభక్తులతో నిలిచిరి.

రామదాసుడు కొన్ని దినములు తన తల్లితోను, సోదరునితోను వారి యాజ్ఞను దీవనలను బొంది, తాను దలపెట్టిన మహత్కార్య:ము వారికి దెలిపి. మహారాష్ట్ర ధర్మమును జనులకు బోధించుటకు నిల్లు వదలి కృష్ణానదీతీరమునకు బోయెను.


_______