సమర్థ రామదాసు/ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఏడవ ప్రకరణము

--వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీమ్‌
--దుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ||

--సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ
--యుద్ధాయ యుజ్యస్వ నైనం పాప మవాప్స్యపి ||
                                                                     -- భగవద్గీత. అ. 2.

--తివా స్వర్గమును బొందుదువు. గెలిచితివా భూమి ననుభవిం-- చేత నో యర్జునా ! యుద్ధము చేయసిద్ధమై లెమ్ము.

-- దుఃఖములను లాభాలాభములను జయాజయములను సమముగా --- సిద్ధము గమ్ము ! పాపము చెందవు."

-- యా శ్లోకముల యర్థము.


--భ్రాతృ సందర్శనమైన తరువాత రామదాసుడు స్వగ్రామము --కొండలో నొక గుహ జేరెను. అచ్చట నత డున్నాడని --రెఱుగకపోయినను నా మహాత్ముడా జనుల నెట్టు లభ్యుద్ధ -- నను విచారమున నిరంతరము నిమగ్నుడై యుపాయముల -- నుండెను. అట్లనేక మాసములు రామదాసుడు నిర్జనమైన యా ---మిత్రహీనుడై యేకాకియై ధర్మభ్రష్టమైన స్వీయమహారాష్ట్ర --రించుటకు మార్గములు రేయింబవళ్లు దలపోయ జొజ్జెను. --ని కాత్మబలము పరమేశ్వరుని యందలి విశ్వాసమే. అతని --మతనియాత్మ విశ్వాసమే అతని యైశ్వర్యము ప్రపంచజ్ఞానమే. -- సాధనములతో మహారాష్ట్ర దేశమును బునస్సృష్టి చేసినట్లు మార్చి, ధర్మసంస్థాపనముచేసి జాతీయ స్వాతంత్ర్యము సమకూర్చవలె నని యతడు సంకల్పించెను.

ఇట్లతడు ప్రయత్నములు చేయుచుండ నతని ప్రభావమునుగూర్చి విని మాహులీనివాసి యగు నారాయణబువాయు, వడగాన్ నివాసి యగు జయరామస్వామియు శ్రమపడి యెట్టెటో యతని జాడలు గనుగొని యతనిని దర్శింపవచ్చిరి. యోగి మహిమ పరమయోగి యెఱుగుననట్లు మహానీయులు మహనీయుల మహిమ లెఱుంగుదురు. రామదాసుడు వారిని సగౌరవముగ నాదరించి వారి స్వస్థానములగు మాహులి, వడగాన్ మొదలగు ప్రదేశములకు దాను నడుమనడుమ నరుగుచుండును. అనంతర మతడు రంగనాథస్వామి, తుకారాంబువాను, చించివాడ నివాసియైన మోర్యాదేవుడు తక్కిన మహారాష్ట్ర భక్తులను గూడ దర్శించెను. వారును మిక్కిలి సంతసించి మరల నతని నివాసమునకు బోవుచుండిరి. ఈ యన్యోన్యదర్శనముల వలన రామదాసు పేరు దేశ మందంతట వ్యాపించెను. మతము నందాసక్తి గల జనులు రామదాసు డెక్కడ నుండునో వాని దర్శన మెట్లుగునో యని విచారింప దొడగిరి. తన కడకు వచ్చిన భక్తులను, యోగులను, మిక్కిలి గౌరవించి, వేదాంత చర్చలు మున్నగునని సమర్థతతో జేయుచుండుటచే వారు తన స్వభావ మెఱిగి యతడు సమర్థు డని చెప్పజొచ్చిరి. పైన నుదహరింపబడిన భక్తులు రామదాసున కంటె ముందుగా దేశములో గొంతపనిచేసిరని యిదివఱకే చెప్పబడినది. ఇప్పుడు వా రందరు రామదాసు యొక్క యుద్యమమును ఘోషించుటకు సాధనములైరి. ఇది క్రీ.శ. 1644 సం.రమున జరిగెను.

ఇది జరిగిన కొలది కాలములోనే రామదాసుడు సతారా మండలములోని చఫాల్ కొండలోయకు బోయి యచ్చట నివాసమేర్పఱుచు కొనెను. ఈక్రొత్తచోటు జరాండా కొండగుహకంటె నిర్జనమై ప్రశాంతమై బాహ్యప్రపంచ సంబంధము లేక యుండేను. ఆతడెంత బాహ్యప్రపంచ సంబంధమును విడిచి రహస్యస్థలములలో దాగినను వానిపేరు లోకమున విశేషముగా మ్రోగుచుండుటచే మహనీయుడైన యాతని దర్శనము చేసి కృతార్థులు గావలెనని కోరి జనులు బహువిధ ప్రయత్నములుచేసి, వాని జాడలు తీసి గుంపులు గుంపులుగా నా వివిక్షస్థలమునకు బోయి కన్నులార నతని జూచి చేతులార ననస్కరించి యేదే నుపదేశమును బడసి మఱలిపోవుచుందురు. రామదాసునకు వివిక్షస్థల నివాసము మిక్కిలి ప్రియము. దానిం గూర్చి యత డొకచో నిట్లు చెప్పెను.

సత్యాన్వేషణము తఱచుగా వివిక్త స్థలములలోనే చక్కగా జరుగును. కావున బ్రతిమనుష్యు డెల్లప్పు డట్లు చేయదగును. ఈ వివిక్త నివాస మలవరించుకొన్న యతడు కాలక్రమమున సర్వమనోరథసిద్ధి బొందును.

సివాజీ మహారాజు యొక్క మామ్లతదారుడై యా మండలమును బరిపాలించుచున్న నర్సోమాల్ నాదుడును, చాఫల్ నివాసియు, భాగ్యవంతుడు నైన యానందరావు దేశపాండ్యయును రామదాసుకడకు బోయి తమ శరీరమును, తమ సర్వస్వమును వారికి సమర్పించి, సంసారతరణోపాయ మంత్రముపదేశించి శిష్యులుగా జేకొమ్మని ప్రార్థించిరి. రామదాసుడందు కంగీకరించి వారిని శిష్యులుగా బరిగ్రహించెను. అది మొదలుకొని వారు రామదాసు డెప్పు డే పని చెప్పిన నప్పుడది వారు తప్పక మిక్కిలి వినయముతోడను, భక్తితోడను జేయుచు వచ్చిరి. 1648 సం.రమున రామదాసుడు చాఫలు వద్ద శ్రీరామ దేవాలయ మొకటి నిర్మించి నిరంతరాయముగ నా రామదేవునకు బూజానమస్కారములు నిత్యసేవలు జరుగునట్టు యేర్పాటును జేయమని వారి కానతిచ్చెను.

ఆ యేకాంతస్థలమున నివసించుచున్న కాలముననే తన యుద్యమ రథమును సురక్షితముగా దేశమున నడుపునట్టి యుపాయముల నన్నిటిని జింతించి నిశ్చయించెను. అతడు పట్టణములకుగాని, గ్రామములకుగాని తఱచుగా బోయెడువాడుగాడు. ఒకవేళ బోయిన నిరాడంబర జీవితము గల యా మహాత్ముని జూచి జనులు పిచ్చివా డని భావించుచుండిరి.

ఆతడు కొన్ని మహిమలు చేసినట్లు జనులలో గొప్ప వాడుక పుట్టెను. అతని పిచ్చివాలకము జూచిన వారటువంటి మహామహిమలు చేసిన యోగీశ్వరుం డితడా యని యక్కజంపడి యా మాట విశ్వసింప జాలక చిత్తమున గలత నొందుచు వచ్చిరి. ఆడంబర శూన్యమై వెడగుదనమును సూచించుచున్న యా శరీరములో దేశము నందలి యజ్ఞా నాంధకారమును బటాపంచలుగ విఱియ జేయునట్టి తేజోరాసి యున్నదని సామాన్యు లూహింప లేకపోయిరి. కాని, యతని ముఖమందలి తేజస్సును జూచిన వారును, వానితో నొక్కసారి మాటలాడునట్టి భాగ్యము గలిగిన వారును, సామాన్యు లట్లు గాకా వాని మహత్ప్రభావమును గుర్తెఱింగిరి. బాహ్యమైన యా నిరాడంబర జీవితమును గుఱించి రామదాసుడు డిట్లు చెప్పుచుండెను.

"మన పై వాలకము పిచ్చివానివలె నుండవలెను; కాని మన హృదయములు బహువిధ ధర్మమార్గములతో నిండి యుండవలెను. కాని మనతో గలసి మెలసి యుండు జనుల యొక్క మైత్రి మాత్రము చెడకుండునట్లు జాగ్రత్తపడవలెను."

ఆతడు పైకి దిగులు జెందినట్లు, విచారపడుచున్నట్లు గనబడు చున్నను లోలో నతడు మహానందమున నోలలాడుచు నిరంతరము పరమేశ్వరపాదధ్యానము చేయుచుండుటచే సుఖపడుచునే యుండెను.

అతనినోట వెడలిన ప్రతియొక్కమాట యమృతపు సోనవలె జనులను సంతోష సముద్రమున దేల్చును. అందుచే జనులు తమ కెట్టిట్టి పనులున్నను వాటిని విడిచియైన వారి దర్శన మొకసారి చేసి వారి పలుకులు వినవలెనని కోరుచుందురు.

కాని, యత డెక్కడను గనబడడు, కనబడెనాయెంతో దు:ఖమున మునుగినవానివలె గనబడుచుండును. ఈ వర్ణనలనుబట్టి యీనాటి మనవారు మంచిపాఠము నేర్చుకొనవచ్చును. మనుష్యులు తాము గొప్పవారు గాక సామాన్య మనిష్యులయి యున్నప్పడే మిక్కిలి గొప్పవారనిపించు కొనవలెనని యొక దురుద్దేశ్యమునకు లోనై యున్నారు. అట్టి దురభిప్రాయమును వారు రామదాసుని చరిత్రము జదువుకొన్న తరువాత నైనను వదలవలెను. మంచిమంచి దుస్తులు మనుష్యునకు గొప్పతనమును, గౌరవమును దీసికొని రావని రామదాసుని యభిప్రాయము. ఇది నిజమే, ఏ చాకలివానినొ యాశ్రయించి కాసునకైన గతిలేని నిర్భాగ్యుడో, గుణహీను డైన బాలిశుడో, వెలగల దుస్తులు దెచ్చుకొని వానిని ధరించి పురమున సంచరించినంత మాత్రమున వానిని గొప్పవానిగ నెవ్వరు భావింతురు? తెలియని వారొక వేళ నతడు ఘనుడని గౌరవించినను గౌరవము క్షణభంగురమే యగును. మనుష్యున కుండవలసినది విజ్ఞానము. భర్తృహరి తన సుభాషిత రత్నావళిలో జెప్పిన పద్యమిచ్చట ననువదించుట సముచితము.

ఉ. భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగదతారహారముల్
   భూషిత కేశపాశమృదుపుష్ప సుగంధజలాభిషేకముల్
   భూషలుగావు పూరుషునిభూషితు జేయు పవిత్రవాణి వాక్
   భూషణమే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్.

కాలక్రమమున నతనిప్రభావము దేశమందంతట నలము కొనుటచే జనులాసక్తితో నతని దర్శనమెప్పుడగునా, మనమెప్పుడు తగిన సపర్యలుచేసి కృతకృత్యుల మగుదమా యని యతని రాకల కువ్విళ్లూరుచుచుందురు.

రామదాసుడు గొప్ప కర్మవాది. అతనికంటె గర్మవాది యీ నవీన యుగములో లేడు. అతడు స్వార్థము నంతయు బరిత్యజించిన సన్యాసి. విశుద్ధుడైన విరక్తుడు. అతడు కర్మను వదలివేయలేదు. తన శిష్యులను గూడ గర్మను వదలివేయ వలదని యాజ్ఞాపించెను. శ్రీకృష్ణునివలెనే యంతర్జీవితము, బాహ్యజీవితము గూడ కర్మబద్ధమైన దని యతడు వాదించెను. ఈ మహాప్రపంచము యొక్క చక్రములు నిరంతరము కదలుచుండునట్లు మన మెల్లప్పు డేదో పనిచేయుచుండవలయుననియు, నూరకుండిన నా చక్రములు మన మీదుగ బోయి మనల నాశనము చేయుననియు నతడు చెప్పుచుండెడువాడు, కాని యెట్లయిన నేదో కర్మము జరుగుచుండుననియే యాతని యాశయము. తన దాసబోధలో సన్యాసియు, విరక్తుడు చేయవలసిన కృత్యముల నీ క్రింది విధముగ వివరించెను.

1. విరక్తుడు ధర్మము నుద్ధరింపవలయును. నీతిని నిర్వహింపవలయును. మిక్కిలి గౌరవముతో దోషులను క్షమియింప వలయును.
2. విరక్తుడు విద్యావ్యాసంగములం దుండవలెను. అత డెప్పుడు బాటుపడుచు, క్షీణించి చెదరిపోయిన పరమార్థమును దన వాక్పటిమచే జనులకు బోధించి పునరుద్ధరింపవలెను.
3. విరక్తుడు ప్రపంచవ్యవహారములలో బ్రవేశింపవచ్చును. కాని వైరాగ్యమును మాత్రము లవమైన విడువగూడదు. దురాశలకు దుస్తంత్రములకు నెఱగాకూడదు.
4. విరక్తుడు దృడమనస్కుడై కష్టముల నోర్చునట్టి ధైర్యముగల వాడై యుండవలెను. ఈ ప్రపంచ మంతయు మాయ యనియు వినశ్వర మనియు భావించి తన సత్ప్రవర్తనముచేతను దన సాహచర్యముచేతను ధర్మము క్రమముగా వికాసము నొందునట్లు చేయవలయును.
5. విరక్తు డొక్క పక్షము మాత్రమే వహింపగూడదు. ఒక్క శాస్త్రము మాత్రమే చదువగూడదు. అన్ని శాస్త్రములు జదివి వానిలో బాండిత్యము సంపాదింపవలెను.
6. విరక్తుడు గొప్ప తపస్సులను జేయవలెను. బహువిధములైన పూజలను నిర్మింపవలెను. భగవంతుని గ్రంథములను బఠించుచు గీర్తనలు భజనలు చేయచుండవలయును. దుర్మార్గులయొక్క నోళ్లు మూతలుపడునట్లు పరిహసించువారు సిగ్గున దలవంచుకొనునట్లు కీర్తనలలోను భజనలలోను నిరుపమానమైన యుత్సాహము కనబరుపవలెను. ఇవి రామదాసుని దాసబోధలో నక్కడక్కడనుండి యెత్తి వ్రాయబడిన విడి వాక్యములు.

తన గ్రంథములో రామదాసు డుపయోగించిన మహారాష్ట్రభాష యతిమనోహరమై లలితమై గంభీరభావ సమన్వితమై యుండును. దాని యర్థగౌరవము మృదుత్వము చెడకుండ భాషాంతరీకరించుట యసాధ్యము. కాని దాని భావము మాత్ర మెట్లో తీసికొని రావచ్చును. రామదాసుడు ధర్మసంస్థాపనమునకై పని యీ క్రింది విధముగ నారంభించెను. చాఫల్ గ్రామములో గట్టిన రామదేవాలయములో శ్రీ రామజన్మోత్సములు, మారుతిజన్మోత్సవములు ప్రతి సంవత్సరము జరుప నారంభించెను. ఇవియే గాక నింక ననేకోత్సవములుగూడ నతడు చేయజొచ్చెను. ఈ యుత్సవములు హిందువులలో నదివఱకే యుండినను రామదాసుడు వానికిం గ్రొత్తస్వరూప మిచ్చి దేశస్థులందఱు నచటికి జేరునట్లు చేసెను. ప్రతిసంవత్సరము వేనవేలు జనులక్కడికి జేరుచుండిరి. అట్టి సమయములలో బురాణములు జదివించును. భజనలు జేయించును. కీర్తనలు జరిపించును. ఇంకనెన్నో విచిత్రములైన సేవా విధానములు గలిపించును. అవి అన్నియు మహావైభవముతో జూపఱకు నయనానందకరము గాను, హృదయానందకరముగాను నుండునట్లు చేయించును. మొదటి సంవత్సరము ముగిసినతోడనే యీ యుత్సవముల వార్త మహారాష్ట్ర దేశమం దంతట వ్యాపించెను. అతిదూరము ప్రవహించి వెళ్లినకొలది వెడలుపై పలు పొలములకు నీ రొసంగి సస్యవృద్ధిని చేయునట్టి మహానదివలె మహోత్సాహము పెచ్చుపెరిగి దుర్భరమయ్యెను. అందుచే గొందఱక్కడికి బోవుట మిక్కిలి కష్టముగా భావించి తమ గ్రామములలోను, తమ యిండ్లలోను నట్టి యుత్సవముల జేయనారంభించిరి. ఈ యుత్సవప్రతిష్ఠానములు కారుచిచ్చువలె దేశమంతట వ్యాపించునని రామదాసుడు ముందే యెఱుంగును. వెంటనే యతడు దేశమందు నానాభాగములలో గొన్ని మఠముల స్థాపించి యా చుట్టుప్రక్కల నున్నజను లక్కడ జరుగునట్టి యుత్సవములకు బోవున ట్లేర్పాటులు చేసెను. ఈ విధముగా ననేకోత్సవముల శిష్యులచేత నతడు శ్రద్ధతో జరిపించుచున్నను నతడుమాత్ర మెక్కడ గనబడువాడుగాడు. నూతనములైన యీ మహోత్సవముల నెలకొల్పిన మూలకారణము తానే యని ప్రకటించుకొనుట యతని కిష్టము లేదు. అందుచే నత డా యుత్సవములకు బోక తన గుహలో నేకాంతముగ నుండుచు వచ్చెను. ఈ సందర్భములో నత డిట్లు చెప్పెను. విరక్తుడు ప్రతిస్థలమునందు నుపాసనలు జరుగునట్లు చేయింపవలెను. కాని యతడు స్వయముగా నెచ్చట నుండడు. అతడు తెరచాటున నుండవలెను. అట్లుండిన ప్రజల దురభిప్రాయము లనెడు బాణముల కతడు గుఱిగాక యుండును.

దీనింబట్టి రామదాసుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టి ఫలాపేక్ష లేని నిష్కామకర్మమం దభిలాషగలవాడని నిశ్చయింపవచ్చును. "నేను ప్రపంచమునం దున్నాను. కాని, నాకు బ్రపంచసంబంధము లేదు." యని యా మహాయోగి యను చుండును.

ఈ కాలముననే రామదాసుడు మనాచీ శ్లోకములు రచియించెను. మనాచీశ్లోకము లనగా మానసబోధశ్లోకములు. ఈ పద్యకావ్యమునందు 205 చిన్న శ్లోకము లున్నవి. శ్లోకమునకు నాలుగేసి చరణములు గలవు. ఇందు గుప్తవేదాంతమున్నది. అదిగాక మనుష్యులు ప్రతిదినము చేయవలసిన పవిత్రజీవనమును గుఱించి కొన్ని సూచనలును గలవు. మరియు శ్రీరామునిపై దృడతరముగా మనస్సును నిలిపి భజింపవలయుననిగూడ నాగ్రంథములో నున్నది.

నిజ మారయ జనసామాన్యమునకు ధర్మోపదేశము జేయుట కా కాలమున రామదాసు డొక్కడే నిజమైన సమర్థుడు. అట్లయిన నతడు తన మనస్సున కేల బోధించుకొనవలయును? మనాచీ శ్లోకములలో దన మనస్సునకు దానే బోధించుకొని నట్లున్నది. అందుచేత నీ సందేహము గలుగుచున్నది. తా నాచరింపకుండ ధర్మమునైన నితరులకు బోధించుట యప్రశస్తము. కావున దన మనస్సునకు ముందుగా దానే బోధించుకొన్నట్లతడు చెప్పినాడు. నిజముగా నతని మనస్సునకు బోధ మవసరములేదు. ఈ విషయమై యత డిట్లు చెప్పెను.

"ఏ పనియైన ముందుగా మన మాచరించి పిమ్మట నితరులచేత నాచరింప జేయవలెను. ఏ పనినైన జేయుటకు మనమే ముందుగా నాలోచించి చేయవలయును. అట్లు చేయు మని పిమ్మట నితరులను బ్రోత్సాహము చేయవలయును." "మొదట జేయుము. తరువాత జేయింపుము." ఇదే రామదాసు విజయమునకు నుత్తమ కీలకము. ఇందుచేతనే దేశస్థు లందఱు నతడు చూపిన మార్గము నందు మాఱు మాటాడక నడచిరి.

ఏ కార్యముం జేయని వట్టి ప్రేలరిమూకను రామదాసుడు పనికిమాలిన దుర్జను లని నిర్భయముగా బలుకుచుండును. తమ రెన్నో ధర్మోపదేశములు పరులకు జేయుచు దాము స్వయముగా నాచరింపజాలని శూరమ్మన్యుల నెందఱనో మనము గూడ జూచుచుందుము. మాటలు కోటలు దాటునట్లు చప్పువా రనేకు లుందురు. కాని కార్యరంగమున దిగి ఫల మపేక్షింపక ధర్మకార్యములం జేసి కృతకృత్యులగువార లరుదు. ఆచరణము లేక వట్టి మాటలు చెప్పు బోధకులు చాలమంది యుండవచ్చును. కాని వారిగంభీరోపన్యాసములు గౌరవముతో వినువారు తక్కువగా నుందురు. తన శిష్యులు భిక్షములకు బోయినప్పుడు, వల్లించు కొనుటకై "మానాచీ శ్లోకములు" ముఖ్యముగ రామదాసుడు రచియించెను. పరమార్థమునకు రాచబాటను లోకులకు జూపుటకును స్వమతములో నున్న ప్రాశస్త్యమును మధురములై సహేతుకములైన వాక్యములతో నరటి పండొలిచి చేతికిచ్చి తెలుపుటకును "మానాచీ" శ్లోకములు రామదాసునిచే నుద్దేశింపబడినవి. గ్రంథకర్త సంకల్పము సంపూర్ణముగ నెరవేరెను. హృదయోత్సాహకరములైన యాశ్లోకములు జనులయొక్క శ్రద్ధ నాకర్షించి తమతమ కృత్యముల యందు వారు స్థిరముగ నిలుచు నట్లు చేసి విద్యుచ్చక్తి వలె వారి తత్త్వముల మార్చెను. పరమార్థమునకు దాను జూపిన రాచ బాట తప్ప మరియొక రాజవీధి లేదనియు, సనాతన మహర్షులు మున్నగు వారా పుంతనే నడచి ముక్తులైరనియు, మతావేశము గలిగించు నీశ్లోకములనే హిందువు లందఱు వల్లించి సారము గ్రహించి తత్ప్రకారము నడుచుకొనవలయు ననియు రామదాసుడు దేశమంతకును సందేశము నంపెను. అవి జనుల యుద్దేశములకు సరిపోయినందున వారందఱు నిద్రలోనుండి మేలుకొని నట్లొక్క మాఱు తెలివి తెచ్చుకొని పరమప్రీతితో నా శ్లోకముల జదువుకొనిరి. ఉపాసకుడు మొట్ట మొదట కర్మము చేయవలెను. పిదప నుపాసన చేయవలెను. అటుపిమ్మట నతనికి జ్ఞానము గలుగును. జ్ఞానము వలన ముక్తి సంప్రాప్తించును. ఇది రామదాసుని బోధామృతసారము.

ఈ వరుస ననుసరించి నడువవలయునని మహారాష్ట్రుల కెల్ల రామదాసు డాదేశ మిచ్చెను. శ్రీరామునిపై నిశ్చలముగ మనసు నిలిపి ధ్యానింపదలచు వారు తమకు ఏయే కర్మలు విధింప బడినవో యా కర్మలు తప్పక చేయవలెను. అప్పు డతడు సద్గురుని యాశీర్వచనములు బడయుట కర్హుడగును. అంతట గార్యక్రమమును బట్టి జ్ఞానము పిత్రార్జితమువలె నతని కప్రయత్నముగ సంక్రమించును. అట్లు కృషి చేసిన యతడు తప్పక ముక్తిని బడయగలడు. ఇదియే "మనాచీ" శ్లోకములలో నున్న సారము. మహారాష్ట్ర వేదాంత గ్రంథములలో నేదియు రచనావిధానమునకు విషయబోధమునను, హేతుకల్పనమునను, విశేషించి గొప్ప యర్థమును జిన్న మాటలతో నిముడ్చునట్టి శక్తిలోను, "మనాచీ" శ్లోక గ్రంథమును బోలదని చెప్పుట యతిశయోక్తి గాదు. అందుచేతనే తత్కాలపుభక్తులు, పండితులు నైకకంఠ్యముగా నేతద్గ్రంథము వేదములకు దాళముచెవి యనియు, శాస్త్రముల సారమనియు వచించిరి. ఆ గ్రంథ మంతయు నీక్రింది ముఖ్యభాగములుగా విభజింప బడవచ్చును.

1. ఉపాసన యొక్క ప్రాశస్త్యము, వెల.
2. రామనామస్మరణ యొక్క ప్రాధాన్యము.
3. సాధు సజ్జన సాంగత్యము యొక్క యావశ్యకత.
4. మనో వాక్కాయ కర్మముల యేకీభావము.
5. ఇంద్రియ నిగ్రహముయొక్క యవసరము.
6. పరోపకారమునకై యుద్యమించుట.
7. పనికి మాలిన చర్యలు, సోమరితనములు పరిత్యజించుట.
8. వివేకము యొక్క ప్రాశస్త్యము.
9. సద్గురు సేవ.
10. రాముడు పరమేశ్వరుం డని నమ్ముట.
11. నిగ్రహ రూపములో రాముని జూచుట.

ఈ యంశములే గ్రంథ మందంతట పడుగు పేక వలె నల్లు కొని యున్నవి. భాషా మాధుర్యము, భావగౌరవము, మనోహరశైలియు వానికి వన్నె వెట్టుచున్నవి.

మహారాష్ట్ర దేశమందు బలుతావుల యందు రామదాసుడు నెలకొల్పిన యుత్సవములు మొదలగునవి జనుల సోమరితనమును దవ్వుగ దోలెను. వారు రామదాసుని వలన నుపదేశము బడయుటకై యెంతో యుబలాటపడుచు వచ్చిరి. శివాజీ మహారాజు యొక్క కొలువుకాండ్రు మున్నగు నుద్యోగస్థులు సైతము రామదాసుని శిష్యవర్గములలో జేరిరి. అందుచే శిష్యసంఖ్య మఱింత యెక్కువయ్యెను. ఆత్మలాభమే చూచుకొనుచు దక్కిన వారిగతి చూడక యెవరి కర్మములకు వారిని వదలి వేయునట్టి యీక్రొత్త శిష్యులకొఱకు రామదాసు డంతగా శ్రద్ధ చేయలేదు. అతడు సార్థత్యాగము, మనోనిశ్చలత గల యువకులను జాలమందిని జేరదీసి వారికా బోధలు చేసి, తయారు చేసి, దూరమునందు నెలకొల్పబడిన మఠములలో ధర్మ వ్యాపనము జేయుటకై వారిని నియోగించెను. మొత్తము మీద రామదాసుడు దేశమున నూట యేబది మఠముల స్థాపించెను. వానిమీద డెబ్బది యిద్దరు ముఖ్యశిష్యులు పరామరిక చేసెడు నుపద్రష్టలై యుండిరి. వారి చేతిక్రింద నింక దక్కువ తరగతిలోని యుద్యోగు లనేకులుండిరి.

మహంతులు క్రొత్త మహంతులను నిర్మించి, వారికి దెలివి తేటలు, నైపుణ్యము గలిగించి ప్రతి విషయమున వారి ననుభవ శాలురగ జేసి దేశ మందంతట వారిం బ్రతిష్ఠింప వలయునని యాతని యాజ్ఞ. ఆ సూత్రముల నతని శిష్యులెల్లప్పుడు ననుసరించుచుండిరి.

ప్రతి మఠమునందు మారుతి విగ్రహము స్థాపింపబడెను. మఠాధిపతులు దినమునకును ముమ్మారు సేవలు కైంకర్యములు మొదల గునవి చేయుచుండవలెనని యాజ్ఞాపింపబడిరి. శిష్యులందఱు సన్యాసులు, అందుచేత గురువువలెనే వారును విరాగులు, బిచ్చమెత్తుట, కీర్తనలు భజనలు చేయించుట తప్ప మఱి యే యితర లోకసంబంధములను వారు పెట్టుకొనగూడదు. ప్రతి శిష్యుడు తన మఠము చుట్టునున్న కొన్ని యిండ్లకు బ్రతి దినము పోయి బిచ్చ మెత్తుకొనవలయును, బిచ్చమునకై యే యింటికి బోవ దలచునో యా యిల్లు చేరగానే యాతడొక శ్లోకమును చదువ వలెను. అక్కడ బిచ్చము నిమిత్తము కొన్ని నిమిషములు మాత్రమే యుండవలెను. అంతలో బిచ్చము దొరికినను, దొరకకున్నను గిరుక్కున మరలి మఱియొక యింటికి బోవలెను. సంపూర్ణ స్వార్థత్యాగ దీక్షయే రామదాసుని మతమునకు గీటురాయి. శిష్యులు దినమున కొక్క పూటమాత్రమే కొంచెము పప్పు, అన్నము దిని రాత్రి నిరాహారులై యుండవలయును. తక్కిన కాలము వారు తమతమ మఠములలో మతబోధలు చేయుట, నుపాసనలు, జరిపించుట మొదలగు కార్యములను జేయుచుండ వలెను. ఆ బోధనలు వినుటకు జను లనేకు లక్కడికి జేరుచుందురు. ప్రధాను లగు యీ శిష్యులు సమస్త మత రహస్యముల యందు బోధితులై యాఱితేరిన వారగుటచే వారియొక్క వాగమృతమును గ్రోలి జను లానందించు చుండిరి.

కొన్ని సంవత్సరములలోనే రామదాసుడు తన మఠముల వలను దేశమందంతట బన్ని వ్యాపింప జేసెను. శిథిలమైన హిందూమతము నుద్దరించుట యపారమైన యాత్మజ్ఞానము, నాత్మవిశ్వాసము గల రామదాసుని వంటి మహాధీరులకు సైతము దుష్కర మని యా కాలపు చరిత్ర నెఱిగిన వారి కందఱకు దోచకపోదు. క్రమ క్రమముగా శిష్యులకు శిష్యులు, వారికి బ్రతిశిష్యులు బయలుదేరి మహారాష్ట్ర దేశమునం గల ప్రతి గ్రామమునకు బ్రతి పల్లియకు బోయి యెల్లచోట్ల రామదాసుని ధర్మములు, మతము బోధించుచు "మనాచీ శ్లోకములు" జదువుచు సూర్యరశ్మివలె నది ఎల్లయెడల వ్యాపించునటుల జేసిరి. ఆయన శిష్యులు దేశస్వాతంత్ర్యము నిరసింపకుండ మతబోధకు దోడు స్వేచ్ఛను గూడ బోధించిరి. తమ మాతృభాష యగు మహారాష్ట్ర భాష యెంతో యద్భు తముగా, రుచిగా నున్న దనియు, మరాఠీ భాషలోని పద్యకావ్యములు, గద్యకావ్యములు, మిక్కిలి ప్రభావవంతములై జ్ఞానదాయకములై యున్నవనియు, దమ సనాతన ధర్మము పరమపావన మగుటచే దాని ననుసరించిన వారికి మోక్ష పదమెంతో సులభ మనియు దమ భాషలోనే మతము, విద్య నేర్చుట సర్వోత్తమమనియు గూడ వారు బోధించిరి. అది విని జనులాయన పద్యములు జదువుకొని ధన్యులైరి. ఆ పఠనముతో నదివఱకు వారి హృదయముల నెలకొని యున్న నిరాశ నిర్మూల మయ్యెను. తమ దేశమునకు మేలైన కాలము వచ్చుచున్నదని మహారాష్ట్రు లందఱి హృదయములలో నాశాంకురములు మొలక లెత్తెను.


_______