Jump to content

సత్యశోధన/రెండవభాగం/8. ప్రిటోరియా వెళ్ళేదారిలో

వికీసోర్స్ నుండి

8. ప్రిటోరియా వెళ్ళేదారిలో

దర్బనులో నివసిస్తున్న భారతీయ క్రైస్తవులతో నాకు పరిచయం ఏర్పడింది. కోర్టులో దుబాసిగా వున్న పాల్ గారు రోమన్ కేథలిక్. మాయిద్దరికీ స్నేహం కుదిరింది. ప్రొటెస్టెంట్‌మిషన్‌లో బోధకుడుగా వున్న సుభాన్‌గ్రాండ్‌ఫ్రే గారితో స్నేహం ఏర్పడింది. వీరు యిటీవలే గతించారు. దక్షిణ ఆఫ్రికా భారతీయ ప్రతినిధి సంఘ సభ్యులుగా నిరుడు ఇండియాకు వచ్చిన జేమ్స్‌గాడ్‌ఫ్రే గారికి వీరు జనకులు. ఇదే విధంగా పార్సీ రుస్తుం గారితోను, అదంజీ మియాఖాన్ గారితోను మైత్రి ఏర్పడింది. వీరిద్దరూ యిటీవలే గతించారు. వ్యాపార వ్యవహారంలో దప్ప యిక ఎన్నడూఒకరి ముఖం మరొకరు చూచుకోని వీరంతా ఏవిధంగా గాఢ మిత్రులైనారో తరువాత వివరిస్తాను. ఈ విధంగా నా పరిచితుల సంఖ్య పెరిగిపోసాగింది. యింతలో అబ్దుల్లాగారి వకీలు నుంచి వారికి ఒక సమాచారం అందింది. ఇక కేసుకు సిద్ధం కావాలి. అందువల్ల అబ్దుల్లాగారే రావడమో, లేక వారి తరపున మరొకరినెవరినైనా పంపడమో చేయమని ఆ సమాచార సారాంశం. అబ్దుల్లాగారు నాకా లేఖను చదవమని యిచ్చి ప్రిటోరియాకు వెళతారా అని అడిగారు. “నేను ఆ వ్యవహారమంతా క్షుణ్ణంగా తెలుసుకొని వెళతాను. అక్కడ ఏం చేయాలో నాకిప్పటికి తెలియదు.” అని నేను చెప్పాను. అప్పుడు ఆయన ఆ విషయం నాకు బోధపరచమని కొందరు గుమాస్తాలను ఆదేశించాడు.

ఆ కేసును కొంత ఆకళింపు చేసుకున్న తరువాత అసలు యీ కేసును ఓం నమఃశ్శివాయతో ప్రారంభించవలసియున్నదని అర్థం చేసుకున్నాను. జాంజిబారులో వున్న కొద్ది రోజులు అక్కడి కోర్టుకు వెళ్ళి వివరాలు తెలుసుకున్నాను. పార్శీ వకీలొకడు ఒక సాక్షి ఖాతాలోగల జమా ఖర్చులను గురించి అడుగుతూ వుండటం గమనించాను. జమాఖర్చులంటే నాకు అంతా అడవి గొడవ. నేను హిందూదేశపు స్కూళ్ళలోగాని, ఆంగ్లదేశంలో గాని జమా ఖర్చులను గురించి నేర్చుకోలేదు.

దక్షిణ ఆఫ్రికాకు ఏకేసును గురించి నేను వచ్చానో అదంతా ఖాతాలకు సంబంధించిందే. జమా ఖర్చుల లెక్కలలో నిపుణుడైన వాడే వాటి వివరాలు తెలుసుకోగలడు. ఇతరులకు తెలుపగలడు. గుమాస్తా యిది జమ, ఇది ఖర్చు అని చెప్పుకు పోతూ వుంటే నాకంతా గందర గోళంగా వుంది. పి.నోటు అంటే ఏమిటో నాకు బోధపడలేదు. ఇంగ్లీషు నిఘంటువును తిరగవేశాను. ఆ శబ్దం ఎక్కడా కనబడలేదు. నా యిబ్బంది ఆగుమాస్తాకు తెలియజేశాను. ఆ గుమాస్తా వెంటనే పి. నోటు అంటే ప్రాంశరీ నోటు అని చెప్పాడు. అప్పుడూ జమా ఖర్చులకు సంబంధించిన పుస్తకం ఒకటి కొని చదివాను. దానితో కొంత ధైర్యం వచ్చింది. ఆదావా నాకు అర్థమైంది. అబ్దుల్లాసేఠ్ జమా ఖర్చులు ఎలా వ్రాయాలో ఎరుగడు అయినా ఎంత చిక్కులెక్కనైనా చిటికెలో విడదీసి చెప్పగల అనుభవం ఆయన గడించాడని నేను తెలుసుకున్నాను. “ప్రిటోరియా వెళ్ళడానికి యిప్పుడు నేను సిద్ధం” అని అన్నాను.

“మీరెక్కడ బస చేస్తారు?” “మీరు ఎక్కడ బస చేయమంటారో చెప్పండి.” “నేను మన వకీలుకు జాబు వ్రాస్తాను. ఆయన మీకు విడిది ఏర్పాటు చేస్తాడు. ప్రిటోరియాలో నాకు మేమన్ మిత్రులున్నారు. వాళ్ళకి కూడా వ్రాస్తాను. అయితే మీరు వారి ఇంట్లో బస పెట్టవద్దు. మన ప్రతిపక్షులకు అక్కడ మంచి పలుకుబడి వుంది. మన రహస్య పత్రాలు వారిలో ఎవరైనా చూచారో, కొంప మునుగుతుంది. వారికి మీరు ఎంత దూరంగా వుంటే అంత మంచిది. “మీ వకీలు ఎక్కడ వుండమంటే అక్కడే వుంటాను. లేకపోతే నేను వేరే బస ఏర్పాటు చేసుకుంటాను. దాన్ని గురించి మీరు విచార పడవద్దు. మన రహస్యం పిట్టకైనా తెలియనీయనని పూర్తిగా నమ్మండి. అయితే నేను వాళ్లతో కలిసిమెలిసి వుంటాను. ప్రతివాదులతో స్నేహం చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఏమాత్రం అవకాశం వున్నా కోర్టుకు పోకుండా చూస్తాను. ఇంతకూ తయబ్‌సేఠ్ చుట్టమే కదా?”. నిజానికి ప్రతివాది స్వర్గీయ సేఠ్ తైయబ్జీహాలీ ఖాన్ మహమ్మద్‌గారు కూడా అబ్దుల్లా సేఠ్‌గారికి దగ్గరి చుట్టమే.

రాజీ మాట వినగానే అబ్దుల్లాగారు కలవరపడటం గమనించాను. అయితే దర్బాను చేరి ఆరే రోజులైనప్పటికీ మేమొకరి హృదయం మరొకరం అర్ధం చేసుకున్నాం. నన్ను తెల్ల ఏనుగుగా భావించిన రోజులు గడిచిపోయాయి. అందువల్ల వెంటనే అందుకొని “మేము రక్తబంధువులం. రాజీద్వారా వివాదం పరిష్కారం అయితే మంచిదే. మేమిద్దరం ఒకరి నొకరం బాగా ఎరుగుదుము. తైయబ్ సేఠ్ త్వరగా పరిష్కారం కానీయడు. ఆయనతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం రహస్యం పసిగట్టినా మనల్ని అధఃపాతాళానికి తొక్కి వేస్తాడు. అందువల్ల ఏమరచకుండా తెలివిగా వ్యవహరించండి.” అని చెప్పారు అబ్దుల్లా సేఠ్.

“ఈ విషయంలో తొట్రుబాటు బడను. దావా విషయమై తైయబ్ సేఠ్‌తోగాని, మరొకరితోగాని మనకేంపని? ఎప్పుడైనా కలిస్తే మాత్రం డొంక తిరుగుడు గొడవలు మాని ఏదో ఒక దారికి రమ్మని చెబుతాను” అని అన్నాను. వచ్చిన ఏడో రోజునో, ఎనిమిదో రోజునో నేను దర్బాను నుంచి బయలుదేరాను. నాకు మొదటి తరగతి టిక్కెట్టు కొనియిచ్చారు. పరుపు కావాలంటే అదనంగా అయిదు షిల్లింగులు అక్కడ చెల్లించాలి. పరుపు తీసుకోమని అబ్దుల్లాగారు మరీమరీ చెప్పారు. కాని అనవసరంగా పట్టుదలకు పోయి, పరుపు తీసుకోకూడదని అనుకున్నాను. అయిదు షిల్లింగులు మిగల్చాలనే భావం కూడా నాలో అప్పుడు పని చేసింది. అయినా అబ్దుల్లా సేఠ్ నన్ను సముదాయిస్తూ “చూడండి! ఇది హిందూ దేశం కాదు. అల్లా అనుగ్రహంవల్ల మనకు తినడానికి కట్టడానికి, ఇతరులకు సాయం చేయడానికి తగినంత సిరిసంపదలు లభించాయి. మీరు సంకోచించకండి. అవసరమైన ఖర్చు చేయండి.” అని నచ్చచెప్పాడు.

నేను ధన్యవాదాలు పలికి పరవాలేదని చెప్పాను. రైలు నేటాలు ముఖ్య పట్టణం మారిట్జుబర్గుకు రాత్రి తొమ్మిది గంటలకు చేరింది. పడుకునే వాళ్ళకు యిక్కడే పరుపులిస్తారు. రైలు జవాను వచ్చి పరుపు కావాలా అని అడిగాడు. నాదగ్గర వుంది. పరుపు అక్కర్లేదని చెప్పాను. అతడు వెళ్లిపోయాడు. ఇంతలో ఒక ప్రయాణీకుడు లోనికి వచ్చి నన్ను ఎగాదిగా చూచాడు. నేను నల్లవాణ్ణి. అతడు సహించలేక పోయాడు. పెట్టెదిగి వెళ్లి ఒకరిద్దరు ఉద్యోగుల్ని తీసుకువచ్చాడు. వారు వెటకారంగా నిలబడ్డారు. ఇంతలో మరో ఉద్యోగి వచ్చి “లేవయ్యా, లే, నీవు వెనుక పెట్టెలో కూర్చోవాలి. లే” అని గద్దించాడు.

“నా దగ్గర మొదటి తరగతి టిక్కెట్టు ఉన్నది. నా మాట మీరు వినండి. దర్బనులో నన్ను యిక్కడ కూర్చోనిచ్చారు. నేనిక్కడే వుంటాను.”

“అయితే పోవా? నీవు వెళ్లకపోతే పోలీసును పిలిచి నెట్టించి వేస్తాను.”

“సరే! అతడు వచ్చి నెట్టితే నెట్టనీ! నేను మాత్రం పోను.”

పోలీసువాడు వచ్చి నా చెయ్యి పుచ్చుకొని బయటికి దించివేశాడు. నా సామాను కూడా బయటికి విసరి వేశాడు. నేను మాత్రం వెనక పెట్టెలోకి పోనని భీష్మించాను. రైలు వెళ్లిపోయింది. నేను చేతిసంచి పుచ్చుకొని వైటింగు రూములోకి వెళ్లి కూర్చున్నాను. సామాను పడిపోయిన చోటనే వుంది, రైల్వేవారు దాన్ని కాపాడుతూ వున్నారు.

అది చలికాలం. దక్షిణ ఆఫ్రికాలోని పర్వత ప్రాంతలలో చలి అధికం. మారిట్జుబర్గు మరీ ఎత్తు మీద వున్నందున చలి మరీ ఎక్కువగా వుంది. నా ఓవర్ కోటు సామానులో వుంది. దాన్ని యిమ్మని కోరితే మళ్లీ అవమానిస్తారేమోనను భయంతో అడగలేకపోయాను. వణుకు పట్టుకున్నది. ఆగదిలో దీపంలేదు. అర్ధరాత్రి ఒక ప్రయాణీకుడు అక్కడికి వచ్చాడు. అతడు నన్ను పలకరించాలని భావించాడేమో కాని నేను మాట్లాడే స్థితిలో లేను.

ఇక ఏం చేయాలి అని ఆలోచించాను. నా హక్కుకోసం పోరాడాలా? లేక నోరుమూసుకొని ఇండియా దారి పట్టాలా? వచ్చిన పని పూర్తి చేయకుండా వెళితే అవమానం కదా. పిరికితనం కూడా. యిప్పుడు నేను పడ్డ కష్టం కొద్దే. ఇది మహారోగానికి బాహ్యచిహ్నం మాత్రమే. యీ మహారోగం వర్ణానికి అంటే రంగుకు సంబంధించింది. సామర్ధ్యం వుంటే యీ రోగమూలాన్ని పెరికి పారవేస్తాను. ఎన్ని కష్టాలైనా యిందు కోసం సహిస్తాను. వర్ణద్వేషానికి సంబంధించిన యీ జాడ్యాన్ని తొలగించేందుకై ఎంత కృషి అయినా సరే చేస్తాను. యీ విధంగా ఆలోచించి తరువాత వచ్చే రైల్లో ప్రిటోరియాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మర్నాడు రైల్వే జనరల్ మేనేజరుకు ఒక పెద్ద టెలిగ్రాం పంపాను. అబ్దుల్లా సేఠ్ వెంటనే జనరల్ మేనేజర్ని కలిసి మాట్లాడాడు. యీవిషయం నాకు తెలిసింది. “యిందు రైల్వేవారి దోషం ఏమీలేదు. అయినా వెంటనే గాంధీకి సాయం చేయమని స్టేషను మాష్టరుకు తంతి పంపాను” అని ఆయన అబ్దుల్లాగారికి చెప్పాడు. అబ్దుల్లాగారు వెంటనే మారిట్జుబర్గులోని హిందూదేశపు వర్తకులకు మరికొందరికి తంతి పంపి రైలు స్టేషనులో వున్న గాంధీకి సాయం చేయమని కోరాడు. వారంతా రైలు స్టేషనుకు వచ్చి నన్ను కలిశారు. తమకు జరిగిన యిలాంటి అవమానాల్ని గురించి వారు నాకు చెప్పడం మొదలు పెట్టారు.

ఈ దేశంలో యిది క్రొత్తకాదని చెప్పి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఫస్టు, సెకండు క్లాసుల్లో ప్రయాణం చేసే భారతీయ ప్రయాణీకులు ఏ రైలు ఉద్యోగుల చేతుల్లోనో, ఏ తెల్లవారి చేతుల్లోనో యిట్టి కష్టాలు పడేందుకు సిద్ధపడి వుండాలన్నమాట. ఆ రోజంతా మనవాళ్ల కష్టగాధలు వినడంతో సరిపోయింది. రాత్రి రైలు వచ్చింది. అందులో నా కోసం ఒక బెర్తు రిజర్వు చేయబడివుంది. దర్బానులో వద్దన్న పరుపు టికెట్టును మాత్రం యీ రోజున మారిట్జుబర్గులో కొన్నాను. ఆ రైలు నన్ను చార్లెస్ టౌనుకు తీసుకు వెళ్లింది.