సత్యశోధన/రెండవభాగం/7. కొన్ని అనుభవాలు

వికీసోర్స్ నుండి

7. కొన్ని అనుభవాలు

నేటాలు దేశానికి రేవు పట్టణం దర్బన్. దానికి పోర్టు నేటాల్ అని కూడా పేరు వుంది. అబ్దుల్లా సేఠ్‌గారు నన్ను తీసుకు వెళ్లేందుకు అక్కడికి వచ్చారు. నేటాలు వాళ్లు చాలామంది తమవాళ్లను తీసుకొని వెళ్లేందుకు వచ్చారు. హిందూదేశస్థుల ఎడ అక్కడి వాళ్లకు ఆదరం వున్నట్లు కనిపించలేదు. అబ్దుల్లా సేఠ్‌ను అంతా తేలికగా చూడటం గమనించాను. ఆ స్థితి చూచి నా ప్రాణం చివుక్కుమన్నది. కాని అబ్దుల్లా సేఠ్‌కు యీ విషయంలో బాగా అనుభవం వున్నట్లనిపించింది. అంతా నా వంక వికారంగా చూచారు. తతిమ్మా హిందూదేశస్థుల కంటే నా వేషం వేరుగాను వింతగాను వుంది. ఫ్రాంక్ కోటు బెంగాలీల పగడీ వంటి తలపాగా ధరించాను.

అబ్దుల్లా గారు నన్ను ఇంటికి తీసుకువెళ్లాడు. తన గదికి ప్రక్కనే వున్న గదిని నా కోసం ఏర్పాటు చేశాడు. నా సంగతి వారికి, వారి సంగతి నాకు తెలియదు. తన తమ్ముడు నా చేతికిచ్చి పంపిన కాగితాలు చదివి కొంత గడబిడ పడ్డాడు. తన తమ్ముడు హిందూ దేశాన్నుండి ఒక తెల్ల ఏనుగును తన వద్దకు పంపించాడని ఆయన భావించాడు. నా వేషభాషలు చూచి దొరలకయ్యేటంత వ్యయం నాకోసం అవుతుందని భావించాడు. అప్పుడు ప్రత్యేకించి నాకు అప్పగించడానికి సరియైన పని కూడా లేదు. వారి వ్యవహారం ట్రాన్సువాలులో సాగుతున్నది. వెంటనే నన్నక్కడికి పంపడంలో అర్థం లేదు. పైగా నా శక్తిని, సామర్థ్యాన్ని, యోగ్యతను గురించి ఆయనకు ఏమీ తెలియదు! నాకోసం తాను ఎప్పుడూ ప్రిటోరియాలో వుండవలసి వస్తుంది. అది ఆయనకు వీలుపడని పని. ప్రతివాదులు ప్రిటోరియాలోనే వున్నారు. వాళ్లు నన్ను తమవైపుకు త్రిప్పుకుంటారేమోనని ఆయనకు భయం. అయితే ఆ దావా కాకపోతే నాకు అప్పగించే పని యింకేముంది.

మిగతా పనులన్ని నాకంటే ఆయన గుమాస్తాలే బాగా చేయగలరు. ఆ గుమాస్తాలు తప్పు చేస్తే వాళ్లను దండించవచ్చు. కాని నేను తప్పు చేస్తే దడించేదెలా? ఆ దావాలో ఏదో పని అప్పగించకపోతే ఊరికే కూర్చోబెట్టి మేపవలసి వస్తుంది.

అబ్దుల్లా గారికి అక్షర జ్ఞానం తక్కువే కాని జ్ఞానం ఎక్కువ. ఆయన బుద్ధి చాలా చురుకైనది. బ్యాంకు మేనేజర్లతో వ్యవహారం నడుపుకొనుటకు తెల్ల వర్తకులతో వ్యవహారం గడుపుకొనుటకు, వకీళ్లకు తన వ్యవహారాలు చెప్పుటకు తగినంత ఇంగ్లీషు ఆయనకు నచ్చు. భారతీయులకు ఆయనంటే గౌరవం. వారి వ్యాపార సంస్థ అక్కడి వ్యాపార సంఘాలన్నింటిలోకి పెద్దది. హిందూ దేశస్థుల వ్యాపార సంఘాలన్నింటిలోకి పెద్దది. అన్నీ వున్నాయిగాని ఒక లోటు మాత్రం ఆయనలో వుంది. ఆయనది అనుమాన స్వభావం.

ఆయనకు ఇస్లాం మతమంటే అమిత అభిమానం. తత్వ జ్ఞానాన్ని గురించి మాట్లాడాలనే తపన ఆయనకు వుంది. ఖురాన్ షరీఫు మరియు తదితర ఇస్లాం మత గ్రంధాలలో ఆయనకు కొద్దిగా ప్రవేశం వుంది. మాట్లాడేప్పుడు అనేక ప్రమాణ వాక్యాలు అమితంగా ఉపయోగిస్తూ వుంటాడు. ఆయనను కలియడం వల్ల ఇస్లాం మతం విషయమై నాకు కొంత పరిజ్ఞానం కలిగింది. మా మనస్సులు కలిసిన కొద్దీ ఇస్లాం తత్వ విషయాలను గురించి చర్చించడం ప్రారంభించాడు.

నేనచ్చటికి వెళ్లిన రెండవరోజునో, మూడవరోజునో అబ్దుల్లా సేఠ్ నన్ను దర్బను కోర్టుకు తీసుకువెళ్లాడు. తమ మిత్రులను నాకు పరిచయం చేశాడు. కోర్టులో తన వకీలు ప్రక్కనే నన్ను కూర్చోబెట్టాడు. మొదటినుండి మేజిస్ట్రేటు నావంక మిర్రి మిర్రిగా చూడటం ప్రారంభించాడు. చివరకు తలపాగాను తీసి వేయమని ఆదేశించాడు. తలపాగా తీయను అని చెప్పి కోర్టునుంచి బయటకు వచ్చివేశాను.

ఇక్కడ కూడా తగవు మొదలైందని భావించాను. భారతీయులచే తలపాగాలు తీసివేయించుటకు గల కారణాలు అబ్దుల్లా వివరించి చెప్పారు. మహమ్మదీయ ఆచారాలు కలవారు తలపాగాలు పెట్టుకోవచ్చు. కాని కోర్టుకు వచ్చే మిగతా హిందూ దేశం వారు మాత్రం తలపాగా ధరించరాదని శాసనం, యీ సూక్ష్మ భేదం తెలుసుకునేందుకు ఇంకొంచెం లోతుకు వెళ్లాలి. అక్కడికి చేరిన మూడు నాలుగు రోజుల్లోనే అక్కడి భారతీయులు రకరకాలుగా విభాజితులై వున్నారని బోధపడింది. ఒకరు తురక వర్తకులు. వీరు తాము అరబ్బులమని చెప్పుకుంటున్నారు. మరొకరు హిందూ గుమాస్తాలు లేక పారసీ గుమాస్తాలు. పారసీ గుమాస్తాలు మేము పారశీకులం అని చెప్పుకుంటారు. యిక హిందూ గుమాస్తాలు అటూగాక, ఇటూగాక వుండిపోయారు. యీ మూడురకాల వారికీ సాంఘిక సంబంధాలు వున్నాయి. వీళ్లందరినీ మించిన మరో తెగ వున్నది. ఆ తెగలో అరవవారు, తెలుగువారు, ఉత్తర హిందూస్థానమునుండి ఇన్‌డెన్‌చెర్డు కూలికి వచ్చినవారు వున్నారు. ఇన్‌డెన్‌చెర్డు కూలీలంటే అయిదేండ్లు నేటాలు దేశంలో పనిచేసేందుకు అంగీకారం కుదుర్చుకున్న కూలివారన్నమాట. వీరికి గిర్మిటియాలని పేరు. యీ శబ్దం అగ్రిమెంట్ అను పదానికి అపభ్రంశమగు గిర్మిట్ అను పదము నుండి ఉత్పన్నమైనది. పై మూడు తెగలవారు కూడా యీ గిర్మిటియాలతో కూలిపని విషయమైదప్ప వేరు సంబంధం పెట్టుకోరు. దొరలంతా వీళ్లను కూలీలు అని అంటారు. భారతీయులలో ఎక్కువ మంది కూలి చేసుకొనేవారే. ‘సామీ’ అని మరో పేరు కూడా వీళ్లకు వున్నది. సామి అను పదం సామాన్యంగా అరవవారి పేర్లకు చివర వుంటుంది. స్వామిన్ అను సంస్కృత పదానికి యిది వికృతి. సామి అని పిలుస్తున్నావు సరేకాని సామి అంటే అధికారి అని అర్ధం, నేను నీకు అధికారిని కాదు కదా! అందువల్ల ఆ శబ్దం నాకు వాడకు అని చెబుతారు. కొందరు ఏమీ మాట్లాడకుండా వుండిపోతారు. మొత్తంమీద సామి శబ్దం నీచార్ధకంగా ప్రచలితం అయిపోయింది.

నాకు కూలి బారిస్టరు అని పేరు వచ్చింది. వర్తకులకు కూలి వర్తకులని పేరు. ఈ విధంగా కూలీ అంటే అసలు అర్ధంపోయి కూలీలంటే భారతీయులు అను అర్ధం రూఢి అయిపోయింది. తురక వర్తకులకిది గిట్టదు. వాళ్లు మేము అరబ్బులం అనో, లేక మేము బేహారులం అనో చెప్పుకుంటూ వుంటారు. తెల్లవాడు మంచి వాడైతే కూలీ అన్నందుకు క్షమాపణ కోరతాడు.

ఇట్టి పరిస్థితుల్లో నేను తలపాగా పెట్టుకోవడం తప్పుగా భావించబడిందన్న మాట. అందువల్ల ఎందుకొచ్చిన గోల అని భావించి తలపాగా తీసివేసి ఇంగ్లీషు వాళ్ల హేటు పెట్టుకొందామనే నిర్ణయానికి వచ్చాను. దానితో యీ తగాదా పోతుందని అనుకున్నాను.

కాని అబ్దుల్లా సేఠ్‌గారు ఒప్పుకోలేదు. “నీవు యీ పని చేస్తే మరీ ప్రమాదం. నీవు యిట్లా చేస్తే తలపాగా ధరించాలని భావించే వారందరినీ మోసగించినట్లవుతుంది. అదీగాక మనదేశం తలపాగా మీకు బాగుంటుంది. ఇంగ్లీషు వాళ్ల హేటు పెట్టుకుంటే ఇంగ్లీషు వాళ్ల హోటళ్లలో పనిచేసే నౌకరని అంతా అనుకుంటారు.” అని అబ్దుల్లా నన్ను హెచ్చరించాడు.

ఆయన బోధలో తెలివి, దేశభక్తి వున్నాయి. అందలి తెలివి స్పష్టం, దేశభక్తి లేందే అటువంటి మాటలు నోట రావు. హోటల్లో పనిచేసే వారి యెడ నైచ్యభావం వుండటం వల్ల తేలికభావం వ్యక్తమవుతూ వుంది. గిర్మిటియాలలో హిందువులు, తురకలు, క్రైస్తవులంతా మతం పుచ్చుకున్న గిర్మిటియాల సంతతివారే. 1893 నాటికే వారి సంఖ్య భాగా పెరిగింది. వాళ్లలో చాలామంది దొరల వేషం ధరించి హోటళ్లలో పనిచేస్తున్నారు. అబ్దుల్లాగారు హేటు విషయంలో తేలికగా మాట్లాడిందీ వీళ్ళను గురించే. హోటళ్లలో చేసే సేవకత్వం ఎంతో దైన్యంగా వున్నదన్నమాట. నేటికీ చాలామందికి అట్టి చులకన భావం పోలేదు.

మొత్తం మీద అబ్దుల్లా గారి సలహా నాకు నచ్చింది. యీ తలపాగా వ్యవహారం మొదలైన తరువాత నేను నా పక్షాన్ని సమర్ధిస్తూ పత్రికల్లో వ్యాసం వ్రాశాను. దానితో తలపాగాను గురించి పత్రికల్లో బాగా రగడ జరిగింది. “అన్‌వెల్‌కం విజిటర్” పిలువని పేరంటగాడు అని నాకు పత్రికల్లో పేరు వచ్చింది. తత్ఫలితంగా మూడు నాలుగు రోజుల్లో నా పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. కొందరు నా పక్షాన్ని సమర్థించారు. కొందరు నా పొగరుబోతుతనాన్ని నోరార తిట్టారు.

నేను దక్షిణ ఆఫ్రికాలో కొంత కాలం తలపాగా తొలగించలేదు. అది నా తల పైనే వున్నది. అయితే తరువాత ఎందుకు తొలగించవలసి వచ్చిందో, నేను ఎందుకు తొలగించానో రాబోయే ప్రకరణాల్లో పాఠకులకు తెలియజేస్తాను.