సత్యశోధన/రెండవభాగం/27. బొంబాయిలో
27. బొంబాయిలో
మా బావ కన్నుమూసిన మరునాడే నేను బొంబాయి వెళ్లవలసి వచ్చింది. ఉపన్యాసం సిద్ధం చేసేందుకు తగినంత వ్యవధి దొరకలేదు. రాత్రింబవళ్ళు నిద్రలేకపోవడం వల్ల నాకు ఒంట్లో బాగుండలేదు. గొంతు బొంగురుపోయింది. అయినా దేవుడి మీద భారం వేసి బొంబాయికి బయలుదేరాను. ఉపన్యాసం వ్రాసుకు వెళ్లాలని నేను కలలోనైనా ఊహించలేదు.
సర్ ఫిరోజ్‌షా మెహతాగారి ఆదేశానుసారం సభకు ఒకరోజు ముందు అయిదు గంటలకు ఆఫీసులో వారి దర్శనం చేసుకున్నాను.
“గాంధీ! నీ ఉపన్యాసం వ్రాసి సిద్ధం చేశావా?” అని అడిగారు. “లేదు ఆశువుగా ఉపన్యసిస్తాను” అని బెదురుతూ జవాబిచ్చాను. “బొంబాయిలో యిది చెల్లదు. పత్రికలకు, దేశ దేశాంతరాలకు ఉపన్యాస విషయం పంపేవారు వారి యిష్టానుసారం మార్చి పంపుతారు. మన సభవల్ల ప్రయోజనం జరగాలంటే ఉపన్యాసం వ్రాసి సిద్ధం చేసుకోవడం అవసరం. ఆ ఉపన్యాసాన్ని తెల్లవారే లోగా ముద్రించాలి. అయితే యీ రాత్రికి ఉపన్యాసం సిద్ధం కాదా?” అని అడిగారు. నేను కంగారుపడ్డాను. తరువాత చిత్తం అని అన్నాను.
“వ్రాత ప్రతి కోసం మున్షీగారిని మీ దగ్గరకి ఎన్ని గంటలకు పంపమంటారో చెప్పండి” అని బొంబాయి కేసరి అడిగారు. “రాత్రి 11 గంటలకు” అని సమాధానం యిచ్చాను. మెహతాగారు మున్షీని పిలిచి రాత్రి 11 గంటలకు గాంధీ దగ్గరకు వెళ్లి ఉపన్యాస ప్రతి తీసుకో, ప్రెస్సులో ముద్రణకు యిచ్చి తెల్లవారేసరికి ముద్రిత ప్రతులు మన చేతుల్లో ఉండేలా చూడు అని ఆజ్ఞాపించి నన్ను యింటికి పంపించివేశారు.
మర్నాడు సభకు వెళ్ళాను. ఫిరోజ్‌షా మెహతాగారు ఉపన్యాసం వ్రాసి చదువమని ఎంత దూరదృష్టితో చెప్పారో నాకు బోధపడింది. ఫ్రాంజీకావన్‌జీ ఇన్‌స్టిట్యూట్ హాలులో సభ జరిగింది. ఫిరోజ్‌షా మెహతాగారి సభ జరిగితే నిలబడడానికి కూడా హాలులో చోటు దొరకదని విన్నాను. వారి ఉపన్యాసం అంటే విద్యార్థులు చెవి కోసుకుంటారు.
అంతమంది జనంతో కిటకిటలాడిన సభను చూడటం నాకు అదే మొదటిసారి. నా కంఠధ్వని ఎవ్వరికీ వినబడలేదు. భయపడుతూ భయపడుతూ కంఠం పెద్దది చేశాను. ఫిరోజ్‌షాగారు బిగ్గరగా, ఇంకా బిగ్గరగా అని అంటూ నన్ను మధ్య మధ్య ప్రోత్సహించారు. వారు ప్రోత్సహించిన కొద్దీ నా కంఠం కుంచించుకుపోసాగింది.
ఇంతలో నా పాత మిత్రుడు కేశవరావు దేశపాండే గారు వచ్చి ఆదుకున్నారు. నా ఉపన్యాసం వారి చేతుల్లో వుంచాను. అతని కంఠం సభకు సరిపోయే రకంగా లేదు. సభ్యులెవరు వింటారు? “వాచా, వాచా” అని కేకలు సభలో వినబడ్డాయి. అప్పుడు వాచాగారు లేచి దేశపాండేగారి చేతిలోని కాగితాలు తీసుకొని నా పని పూర్తిచేశారు. సభ నిశ్శబ్దం అయింది. శ్రోతలు చివరివరకు శ్రద్ధగా విన్నారు. విషయాన్ని బట్టి ‘సిగ్గు, సిగ్గు’ అని అరిచారు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. నాడు ఎంతో సంతోషం కలిగింది.
సర్‌ఫిరోజ్‌షా మెహతాగారు నా ఉపన్యాసాన్ని ప్రశంసించారు. నాకు గంగాస్నానం చేసినట్లనిపించింది. దేశ పాండేగారు, మరో పారసీ గృహస్తుడు నాకు పూర్తిగా సాయం చేయటానికి సిద్ధపడ్డారు. ఆ పారసీ మిత్రుడు పెద్ద ప్రభుత్వ ఉద్యోగి. అందువల్ల ఆయన పేరు వ్రాయడానికి జంకుతున్నాను. యీ యిద్దరూ దక్షిణ - ఆఫ్రికాకు వస్తామని మాట యిచ్చారు. కాని అప్పుడు స్మాల్ కాజ్ కోర్టు జడ్జియగు సి.ఎం ఖర్‌సేర్‌జీ వీరి మాటల్ని బూటకం చేశారు. దీనికి కారణం ఒక పారసీ మహిళ. అతడు ఆమెను పెండ్లి చేసుకోవడమే మంచిదని భావించాడు. యీ మిత్రుని వాగ్దాన భంగానికి నేటాలులోని పారసీ రుస్తుంజీ ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. యిప్పుడు అనేకమంది పారసీ మహిళలు ఖద్దరు ప్రచారానికి పూనుకొని ఆ పారసీకుని దోషానికి తాము ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. నేనా దంపతుల్ని సంతోషంతో అభినందించాను. యిక దేశపాండే గారికి పెండ్లి ఆశలేదు. కాని అతడు కూడా రాలేకపోయాడు. నేడు అతడు కూడా అందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు.
నేను దక్షిణ - ఆఫ్రికాకు బయలుదేరినప్పుడు జింజాబిరులో ఒక తైయబ్జీ వంశజుడు కనబడ్డాడు. అతడు కూడా నాకు సాయపడతానని అన్నాడు. కాని అలా చేయలేదు. అందుకు అబ్బాస్ తైయబ్జీగారు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. యీ విధంగా బారిస్టరు మిత్రులను దక్షిణ - ఆఫ్రికాకు తీసుకొని వెళ్లాలని నేను చేసిన మూడు ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సందర్భంలో సేస్తన్‌జీ పాదుషాగారు నాకు బాగా గుర్తు వస్తున్నారు. నేను ఇంగ్లాండులో వున్నప్పటి నుండి మా యిద్దరికీ స్నేహం. మేము మొదట లండనులో ఒక శాకాహారశాలలో కలుసుకున్నాము. యితని తమ్ముడు బరజో-రజీపాదుషా గారిని నేను ఎరుగుదును. అతనికి వెర్రివాడని పేరు వచ్చింది. మేమెన్నడూ ఒకచోట ఉండలేదు. మిత్రులు అతనికి చక్రం (నిలకడలేక గిర్రున తిరిగే చక్రం వంటి వాడు) అని పేరు పెట్టారు. గుర్రాల బగ్గీ ఎక్కడం తప్పని భావించి ఇతడు ట్రాము బండి ఎక్కడం కూడా మానుకున్న రకం. శతావధానికి అవసరమైన ధారణాశక్తి వున్నప్పటికీ ఏ డిగ్రీ అతడు పుచ్చుకోలేదు. స్వయంకృషితో స్వాతంత్ర్యం అలవరచుకున్నాడు. పుట్టింది పారసీకుల్లోనైనా, పేరులేదు. ఇతని బుద్ధి వైభవం ప్రఖ్యాతం. ఇంగ్లాండులో కూడా ఇతనికి మంచి ప్రఖ్యాతి ఉండేది. మా ఇద్దరి మైత్రికి మూలకారణం శాకాహారమే. అతనితో బుద్ధి వైభవంలో పోటీ పడటం నా తరం కాదు.
అతని చిరునామా బొంబాయిలో వెతికి సంపాదించాను. పేస్తన్జీ హైకోర్టులో ఉద్యోగం చేస్తూ వున్నాడు. అప్పుడతడు పెద్ద గుజరాతీ నిఘంటువు తయారుచేస్తున్నాడు. దక్షిణ - ఆఫ్రికాలోని ఉద్యమానికి సహాయపడమని ఎంతో మందిని కోరాను. పేస్తవన్జీ పాదుషా తాను ఎట్టి సాయం చేయనని చెప్పడమేగాక, నీవు కూడ తిరిగి దక్షిణ ఆఫ్రికాకు వెళ్లవద్దని గట్టిగా చెప్పాడు.
“నేను నీకు సాయం చేయలేను. నీవు తిరిగి దక్షిణ - ఆఫ్రికా వెళ్లడం మంచిది కాదని నా అభిప్రాయం. మనదేశంలో చేయవలసిన పని కరువైందా? మనం మాతృభాషకు చేయవలసిన పని తక్కువగా వున్నదా? నేనిప్పుడు విజ్ఞాన శాస్త్రానికి భాష వెతుకుతున్నాను. మనం చేయవలసింది ఎంతో వుంది. దాని ముందు దక్షిణ - ఆఫ్రికా వ్యవహారం ఎంత? లొడితెడు. దేశ దారిద్ర్యం చూడు. దక్షిణ ఆఫ్రికాలో భారతీయులు చిక్కుల పాలై వుండటం యదార్థమే, కాని నీ వంటివాడు దానికి బలి కావడం నాకు ఇష్టంలేదు. మనం స్వరాజ్యం సంపాదిద్దాం. అప్పుడు దక్షిణ - ఆఫ్రికాలో వున్న భారతీయులకు తేలికగా సహాయపడవచ్చు. నిన్ను మార్చలేనని నాకు తెలుసు. కాని నీతోపాటు మరొకరిని తీసుకొనిపోవడం నాకు సమ్మతం కాదు” అని స్పష్టంగా చెప్పివేశాడు.
నాకీ ఉపదేశం రుచించలేదు. కాని యీ సంభాషణ వల్ల ఆయన యెడ నాకు ఆదరం పెరిగింది. అతని దేశప్రేమ మరియు భాషా ప్రేమను చూచి ముగ్దుడనయ్యాను. ఈ ప్రసంగం వల్ల మా మైత్రి యింకా సుదృఢమైంది. ఆయన ఉద్దేశ్యం నేను గ్రహించాను. కాని నేను దక్షిణ - ఆఫ్రికా ఉద్యమం మానుకోవడానికి బదులు మరికొంచెం ఉధృతం చేశాను. ఏ దేశభక్తుడూ దేశసేవలో ఏ దేశాన్ని మరువలేడు కనుకనే నాకు క్రింది గీతాశ్లోకం సదా జ్ఞాపకం వస్తూ వుండేది.
"శ్రేయాన్ స్వధర్మో నిగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్
స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మో భయావహః"
(గీత. 3వ అధ్యాయం 35 వ శ్లోకం)
“పరధర్మాన్ని అనుష్టించడం కంటే గుణములేనిదైనను స్వధర్మాన్నే అనుష్టించడం మంచిది. స్వధర్మం నిర్వహిస్తూ చచ్చినా మేలే, పరధర్మం భయావహం”