సత్యశోధన/మొదటిభాగం/20. మతాలతో పరిచయం
20. మతాలతో పరిచయం
ఆంగ్లదేశంలో వున్న రెండవ ఏడు చివరిభాగంలో ఇద్దరు దివ్యజ్ఞాన సామాజికులతో నాకు పరిచయం కలిగింది. వారు సోదరులు, అవివాహితులు. భగవద్గీత చదవమని వారు నన్ను ప్రోత్సహించారు. వారు సర్ ఎడ్విన్ అర్నాల్డుగారు గీతకు చేసిన ఆంగ్లానువాదం చదువుతున్నారు. తమతో కలిసి సంస్కృతం గీత చదువుదాము రమ్మని నన్ను ఆహ్వానించారు. నేను సిగ్గుపడ్డాను. దాన్ని అంతవరకు చదవకపోవడం. కనీసం గుజరాతీ అనువాదాన్ని అయినా చదవకపోవడమే అందుకు కారణం. ఈ విషయం సంకోచిస్తూనే వారికి చెప్పాను. నాకు సంస్కృతం ఎక్కువగా రాదు. అయితే మూలానికి అనువాదానికి తేడా వస్తే ఆ వివరం చెప్పగలను అని చెప్పి వారితో బాటు గీత చదవడం ప్రారంభించాను. ద్వితీయ ఆధ్యాయంలో రెండు శ్లోకాలున్నాయి.
“ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే!
సంగాత్సంజాయతేకామః కామాత్ క్రోధోభిజాయతే
సాంఖ్యయోగం - శ్లోకసంఖ్య 62
క్రోధాద్భవతి సంమోమః సమ్మోహాత్ స్మృతి విభ్రమ:
స్మృతి భ్రంశాద్బుద్ధినాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి
సాంఖ్యయోగం. శ్లోక సంఖ్య 63
(శబ్దాది విషయాలను సదా ధ్యానిస్తూ వుంటే మనిషికి వాటియందు ఆకర్షణ కలుగును. దానివలన కోరిక పుట్టును. కోరిక ద్వారా కోపము కలుగును.
కోపం వల్ల అవివేకమావహించును. అవివేకం వల్ల మతి భ్రమ కలుగును. దాని వల్ల బుద్ధి నశించును. బుద్ధి నశించినచో సమస్తము హతమగును.) ఈ రెండు శ్లోకాలు నా మనస్సునందు నాటుకున్నాయి. ఇప్పటికీ వాటి ధ్వని నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది. భగవద్గీత అమూల్యమైన గ్రంథమను విశ్వాసం రోజురోజుకు నాలో పెరగసాగింది. తత్వజ్ఞానంలో దానితో సమానమైన గ్రంథం మరొకటి లేదను నమ్మకం నాకు కలిగింది. నా మనస్సు చెదిరినప్పుడు భగవద్గీత నాకు ఎంతో సహాయం చేసింది. ఆంగ్లగీతానువాదాలన్నింటిని దరిదాపుగా నేను చదివాను. అర్నాల్డుగారి ఆంగ్లగీతానువాదమే ఉత్తమమైనదని నా అభిప్రాయం. అతడు మూలానుయాయి. అది అనువాదంలా వుండదు. ఆ మిత్రులతో కలిసి గీత చదివానే గాని క్షుణ్ణంగా అర్థం చేసుకొని చదివానని చెప్పలేను. ఆ తరువాత కొంతకాలానికి నాకు అది నిత్యపారాయణ గ్రంథం అయింది,
ఆర్నాల్డుగారు “లైట్ ఆఫ్ ఏషియా” (బుద్ధచరితం) చదవమని చెప్పారు. అంతకు ముందు ఆర్నాల్డుగారు ఒక్క గీతనే ఆంగ్లంలోకి అనువదించారని అనుకున్నాను. కాని బుద్ధ చరిత్రను మాత్రం క్రింద పెట్టడానికి మనస్సు అంగీకరించేది కాదు. వారు ఒకనాడు నన్ను బ్లావట్‌స్కీగారికీ, అనిబిసెంట్ సతిగారికి పరిచయం చేశారు. బిసెంట్‌గారు అప్పుడు దివ్య జ్ఞానసమాజంలో చేరారు. అప్పుడు ఆమెను గురించి పత్రికల్లో చమత్కారంగా చర్చలు జరుగుతూ ఉండేవి. నేను ప్రతిచర్చను ఆసక్తితో చదువుతూ వున్నాను. వారు నన్ను దివ్యజ్ఞాన సమాజంలో చేరమని ఆహ్వానించారు. “నా మతాన్ని గురించే నాకు సరిగా తెలియదు. అట్టి స్థితిలో ఇతర మతాలలో ఎలా చేరడం? అని చెప్పి వినమ్రంగా ఆమె ఆహ్వానాన్ని నిరాకరించాను. వారు చెప్పినమీదట నేను “కీ టు థియాసఫీ” అను మదాం బ్లావట్ స్కీ రచించిన గ్రంథాన్ని చదివినట్లు గుర్తు. ఆ గ్రంథం చదివిన తరువాత హిందూ మతగ్రంథాలు చదవాలనే కోరిక నాకు కలిగింది. మూఢ నమ్మకాలమయం హిందూ మతం అని క్రైస్తవ మతబోధకులు చేసే ప్రచారం తప్పు అను నమ్మకం కూడా నాకు కలిగింది.
ఆ రోజుల్లోనే మాంచెస్టరు నుండి వచ్చిన ఒక మంచి క్రైస్తవుడు శాకాహారశాలలో నన్ను కలిసి క్రైస్తవమత ప్రాశస్త్యాన్ని గురించి వివరించాడు. రాజకోటలో నేనెరిగిన క్రైస్తవ పాదరీల బోధల్ని గురించి ఆయనకు చెప్పాను. అది విని ఆయన దుఃఖపడి “నేను శాకాహారిని. నేను మద్యం తాగను. నాతోటి క్రైస్తవులు మద్యం త్రాగుతున్నారు. మాంసం తింటున్నారు. కాని ఈ రెండింటిని తినమని బైబిలు చెప్పలేదు. బైబిలు చదివితే మీకే తెలుస్తుంది.” అని అన్నాడు. అందుకు నేను అంగీకరించాను. ఆయన నాకు ఒక బైబిలు గ్రంథం ఇచ్చాడు. ఆయనే బైబిలు అమ్మినట్లు, పటాలు, అనుక్రమణిక మొదలగునవి కల బైబిలు ప్రతి ఆయన దగ్గర నేను కొన్నట్లు గుర్తు. దాన్ని చదవడం ప్రారంభించాను. కాని ఓల్డ్ టెస్టామెంట్ (పాత నిబంధన) ముందుకు సాగలేదు. సృష్టిని గురించిన అధ్యాయాలు, తరువాతి అధ్యాయాలు చదువుతుంటే నిద్ర వచ్చింది. చదివాను అని అనిపించడం కోసం ఏదో విధంగా మొత్తం చదివాను. కాని ఏమీ రుచించలేదు. నంబర్స్ అను భాగం వెగటుగా వుంది.
న్యూటెస్టామెంట్ బాగా ఆకర్షించింది. ముఖ్యంగా అందలి “సెర్మన్ ఆర్ ది మౌంట్” (గిరి - ప్రవచనము) గీతకు ఇది సాటి అని అనుకున్నాను. “ఎవరు ఎట్లు చేయుదురో వారు అట్టి ఫలముననుభవింతురు. కాని అన్యాయంతో అన్యాయాన్ని పారద్రోలలేరు. ఎవరేని నీ కుడిచెంప మీద చెంపదెబ్బ కొడితే నీవు నీ ఎడమ చెంప కూడా వానికేసి త్రిప్పు. ఎవరేని నీ ఉత్తరీయం లాగుకుంటే నీ ఆంతర్యం కూడా యిచ్చవేయి.” అను వాక్యాలు నన్ను బాగా ఆకర్షించాయి. నాకు ఎంతో ఆనందం కలిగింది, శ్యామలభట్టు రచించిన చప్పయ్‌ఛందం జ్ఞాపకం వచ్చింది. నా బాలమనస్సు గీత, ఆర్నాల్డు రచించిన బుద్ధ చరితం, ఏసుక్రీస్తు ప్రవచనాలు ఈ మూడింటినీ ఏకీకృతం చేసింది. త్యాగమే ఉత్తమ మతమని నాకు తోచింది. ఈ గ్రంథపఠనం మెల్లగా ఇతర మతాచార్యుల జీవితాలు చదువుటకు నన్ను ప్రోత్సహించింది. కార్లయిట్ వ్రాసిన హీరోస్ అండ్ హీరో వర్షిప్ అను గ్రంథం చదవమని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. అందు మహమ్మద్ జీవితం చదివి అతడి మహత్యాన్ని, వీరత్వాన్ని తపశ్చర్యను తెలుసుకున్నాను.
పరీక్షలు దగ్గర పడటం వల్ల ఇక ఏమీ చదవలేకపోయాను. కాని వివిధ మతాల్ని గురించి తెలుసుకోవాలని మాత్రం మనస్సులో నిర్ణయించుకున్నాను. నాస్తిక మతాన్ని గురించి కూడా తెలుసుకోవడం మంచిదని భావించాను. బ్రాడ్లాగారి పేరు, పేరుతోపాటు అతని మతాన్ని ప్రతి హిందువు ఎరుగును. నాస్తికతను గురించి నేనొక పుస్తకం చదివాను. దాని పేరు మాత్రం గుర్తులేదు. నాకది రుచించలేదు. అప్పటికే నేను నాస్తిక మరుభూమిని దాటాను. అప్పుడే బిసెంటుగారు నాస్తిక మతాన్నుండి ఆస్తిక మతంలోకి ప్రవేశించారు.
నాస్తికమతం యెడ నాకు కలిగిన అరుచికి అది కూడా ఒక కారణం. బిసెంటుగారు వ్రాసిన “హౌ ఐ బికేమ్ ఎ థియాసఫిస్ట్” (నేను ఎటుల దివ్యజ్ఞాన సమాజంలో చేరితిని) అను గ్రంథం నేను చదివాను. ఆరోజుల్లోనే బ్రాడ్లా గారు చనిపోయారు. వోకింగ్ సెమిట్రీలో ఆయనకు అంత్యక్రియలు జరిగాయి. అప్పుడు లండనులోని భారతీయులంతా ఆయన శవపేటికతో పాటు వెళ్ళారు. అంత్యక్రియలు చూద్దామని నేను, మరికొందరు పాదరీలతోబాటు వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు రైలు కోసం స్టేషనులో వేచి వున్నాము. అక్కడ ఒక నాస్తిక భావాలుగల వ్యక్తి, ప్రక్కనే వున్న పాదరీని చూచి దేవుడున్నాడా? అని ప్రశ్నించాడు. ఉన్నాడు అని పాదరీ జవాబిచ్చాడు. “భూమి చుట్టుకొలత 78,000 మైళ్లు అని మీరు అంగీకరిస్తారా” అని నాస్తికుడు పాదరీని పరాజయం పాలుచేయాలనే భావంతో అడిగాడు.
“అంగీకరిస్తాను” అని పాదరీ అన్నాడు.
అయితే అయ్యా చెప్పండి, భగవంతుని కొలత ఎంత? ఆయన ఎక్కడ ఉన్నాడు.
“ఆయన మనిద్దరి హృదయాల్లోనూ వున్నాడు. అయితే ఆయనను తెలుసుకోగలగాలి అంతే”
“ఏమండీ! యింకా పసివాణ్ణనే భావిస్తున్నారా? అంటూ తాను విజయం పొందినట్లు ఫోజు పెట్టి తలపంకించి చూచాడు. పాదరీ వినమ్రతతో మౌనం వహించి ఊరుకున్నాడు.
ఈ సంభాషణ కూడా నాకు నాస్తికమతం యెడగల అరుచిని పెంచింది.