సత్యశోధన/మొదటిభాగం/19. అసత్యవ్రణం

వికీసోర్స్ నుండి

19. అసత్యవ్రణం

నలభై ఏండ్ల క్రితం ఆంగ్ల దేశంలో హిందూ దేశ విద్యార్థుల సంఖ్య ఈ కాలాన్ని బట్టి చూస్తే చాలా తక్కువ. వారు వివాహితులైయుండి కూడా అక్కడ అవివాహితులమని చెప్పేవారు. అందుకు ఒక కారణం ఉంది. ఇంగ్లాండులో ప్రతి విద్యార్థి బ్రహ్మచారియే. వివాహో విద్యనాశాయ అను సూక్తి ననుసరించి ఇక్కడి వాళ్ళు విద్యార్థి దశలో పెండ్లి చేసుకోరు. పూర్వం మనదేశంలో కూడా మనం బ్రతికి యున్న కాలంలో విద్యార్థికి బ్రహ్మచారి అనే పేరు ఉండేది. మనకు బాల్య వివాహాలు వచ్చిపడ్డాయి. కాని ఇంగ్లాండులో బాల్య వివాహం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. భారతీయ విద్యార్థులు ఇంగ్లాండు వెళ్లిన తరువాత తమకు పెండ్లి అయిందని సిగ్గువల్ల అక్కడ చెప్పకోరు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఆ దేశంలో పెండ్లి అయిన మొగవాళ్ళు పెండ్లి కాని ఆడపిల్లలతో కలిసి మెలిసి తిరగకూడదు. తాము బసచేస్తున్న ఇళ్లవారికి తమకు పెండ్లి అయిందని తెలిస్తే వాళ్ళు తమ ఆడపిల్లలతో కలిసి మెలిసి తిరగనీయరు. కులాసాగా కబుర్లు చెప్పుకునేందుకు అవకాశం లభించదు. ఆ ఆమోద ప్రమోదాలు చాలావరకు దోషరహితంగా వుంటాయి. తల్లిదండ్రులకు కూడా ఈ విధమైన ఆమోద ప్రమోదాలు సమ్మతాలే. అక్కడ వరుడే తగిన వధువును వెతుక్కుంటాడు. అందువల్ల కన్యలు, యువకులు కూడా కలిసి మెలిసి ఉంటారు. అది అక్కడ స్వాభావికం. ఇంగ్లాండుకు వెళ్ళగానే హిందూదేశ యువకులు అక్కడి కన్యల మోహంలో పడి పెండ్లి కాలేదని చెబితే దాని పరిణామం భయంకరంగ ఉంటుంది. అట్టి గొడవలు అక్కడ అనేకం విన్నాను. భారతీయ యువకులు అసత్యం పలికి అక్కడి కన్యల వెంటబడి అసత్య జీవితం గడిపేందుకు సిద్ధపడతారు. ఆంగ్లేయులు అందుకు అంగీకరించరు. భారతీయులు ఇలా చేయడానికి సాహసిస్తారు. నేనూ ఇలాంటి వలలో పడ్డాను. నాకు పెండ్లి అయ్యింది. ఒక బిడ్డకూడా పుట్టాడు. అయినా అక్కడ బ్రహ్మచారిగా వున్నాను. అట్టి నటన వల్ల నాకేమీ ఆనందం కలుగలేదు. అయితే సిగ్గు, బిడియాలు నన్ను కాపాడాయి. నేను మాట్లాడకుండా వుంటే నాతో ఎవతె మాట్లాడుతుంది? మొగవాడు ముందుడుగు వేస్తేనే గదా ఆడమనిషి కూడా ముందుకు వచ్చేది.

నాకు పిరికితనంతో బాటు బిడియం కూడా అధికంగా వుండేది. వెంటనర్‌లో నేను వున్న కుటుంబంలో ఇంటి యజమానురాలి కూతురు, తమ అతిథుల్ని షికారుకు తీసుకువెళుతూ వుండేది. అది అక్కడి ఆచారం. ఆమె ఒకనాడు నన్ను దగ్గరలోనే వున్న గుట్టల మీదకు తీసుకువెళ్ళింది. అసలు నాది వడిగల నడక. ఆమెది నా కన్నా ఎక్కువ వడిగల నడక. ఆ మాటలు యీ మాటలు చెబుతూ సన్ను వడివడిగా లాక్కు వెళ్ళసాగింది. నేనూ కబుర్లు చెబుతూనే ఉన్నాను. ఒకప్పుడు ఔను అని, మరొకప్పుడు కాదు అని, ఇంకొకప్పుడు ఆహా! ఎంత బాగా ఉంది? అంటూ ఆమె వెంట నడుస్తున్నాను. ఆమె పిట్టలా తుర్రున పోతూ ఉంది. ఇంటికి పోయేసరికి ఎంత సేపవుతుందోనని ఆలోచనలో పడ్డాను. అయినా నేను వారించకుండా ఆమె వెంటపడి పోతూనే ఉన్నాను. ఒక పర్వత శృంగం మీదకు ఎక్కాం. మడమల జోడు తొడుక్కుని ఇరవై లేక ఇరవై అయిదేళ్ళు వయస్సులో నున్న ఆ యువతి రివ్వున క్రిందికి దిగసాగింది. క్రిందికి దిగడానికి నేను క్రిందుమీదులవుతూ వున్నాను. నా బాధ ఆమె కంట బడుతుందేమోనని నాకు సిగ్గు. ఆమె వెనక్కి తిరిగి నవ్వుతూ ఇటు దిగు, అటు దిగు అంటూ ఊతం ఇచ్చి దింపనా అంటూ రెచ్చగొట్టసాగింది. అసలే ఎక్కడపడతానో అని భయం. అయినా ఆమె పట్టుకుంటే నేను ఆమె ఊతంతో దిగటమా? చివరికి అతికష్టం మీద కొన్నిచోట్ల పాకి, కొన్నిచోట్ల కూర్చొని ఏదో విధంగా క్రిందికి ఊడిపడ్డాను. ఆమె శభాష్ శభాష్ అంటూ బిగ్గరగా నవ్వి నన్ను బాగా సిగ్గుపడేలా చేసింది.

అయితే అన్ని చోట్ల ఇలా ఆమె బాహువుల్లో పడకుండా తప్పించుకోవడం సాధ్యమా? అయితే భగవంతుడు నా అసత్య వ్రణాన్ని మాన్పాలని భావించాడు. నన్ను రక్షించాడు. బ్రైటన్ అను గ్రామం వెంటనర్ గ్రామం మాదిరిగ సముద్రం ఒడ్డున గల పర్యటనా కేంద్రం. అక్కడికి ఒక పర్యాయం నేను వెళ్ళాను. ఇది వెంటనర్ వెళ్ళడానికి ముందు జరిగిన ఘట్టం. నేను బ్రైటన్‌లో గల ఒక చిన్న హోటలుకు వెళ్ళాను. అక్కడ సామాన్య స్థితిగతులు కలిగిన వృద్ధ వితంతువు కనబడింది. ఇంగ్లాండులో ఇది నాకు మొదటి సంవత్సరం. అక్కడ ఆహారపదార్థాల వివరమంతా ఫ్రెంచి భాషలో వున్నది. నాకు బోధపడలేదు. ఆ వృద్ధురాలి బల్ల దగ్గరే నేనూ కూర్చున్నాను. ఇతడు క్రొత్తవాడు. గాబరా పడుతున్నాడని ఆమె గ్రహించింది. ఆమె మాటలు ప్రారంభించింది.

“నీవు క్రొత్తవాడిలా వున్నావు. సంకోచిస్తున్నట్లున్నావు. తినేందుకు ఇంత వరకు నీవు ఆర్డరు ఇవ్వలేదు. కారణం?” అని అడిగింది. నేను ఆహారపదార్థాల పట్టిక చూస్తున్నాను. వడ్డన చేసేవాణ్ణి పిలిచి మాట్లాడదామని అనుకొంటున్నప్పుడు ఆమె మాట్లాడింది. ఆమెకు ధన్యవాదాలు సమర్పించి “ఈ పట్టికలో ఆహారపదార్థాలను గురించి వివరం తెలుసుకోలేకపోతున్నాను. నేను శాకాహారిని. అందువల్ల వీటిలో ఏమేమి మాంసం కలవనివో తెలుసుకో కోరుతున్నోను” అని అన్నాను.

“ఇదా విషయం! నేను నీకు సహాయం చేస్తాను. పదార్థాల వివరం చెబుతాను. నీవు తీసుకోగల పదార్థాలు చెబుతాను.” అని అన్నది. నేను అందుకు అంగీకరించాను. అప్పటినుండి మాకు దగ్గర సంబంధం ఏర్పడింది. నేను ఆంగ్లదేశంలో వున్నంతవరకే గాక, అక్కడ నుండి వచ్చిన తరువాత కూడా మా సంబంధం చాలాకాలం వరకు చెక్కు చెదరలేదు. ఆమెది లండను. అక్కడి తన అడ్రసు నాకు ఇచ్చింది. ప్రతి ఆదివారం భోజనానికి తనింటికి రమ్మని ఆహ్వానించింది. ఇతర సమయాల్లో కూడా నన్ను భోజనానికి ఆహ్వానిస్తూ ఉండేది. నాకు గల సిగ్గును బిడియాన్ని పోగొట్టేందుకు బాగా సహకరించింది. యువతులను పరిచయం చేసింది. వాళ్ళతో మాట్లాడమని నన్ను ప్రోత్సహించింది. ఒక స్త్రీ ఆమె దగ్గరే ఉండేది. ఆమెను నా దగ్గరకు పంపి ఆమెతో మాట్లాడమని నన్ను ప్రోత్సహించింది. అప్పుడప్పుడు మమ్మల్ని ఇద్దరినీ ఒంటరిగా ఉండనిచ్చేది.

ప్రారంభంలో ఈ తతంగం నాకు నచ్చలేదు. ఏం మాట్లాడాలో తోచేది కాదు. ఎగతాళి మాటలు ఏం మాట్లాడను? ధైర్యం చెబుతూ ఉండేది. అంటే నేను స్త్రీ సాంగత్యానికి “సిద్ధం” చేయబడుతున్నానన్నమాట. ఆదివారం కోసం ఎదురు చూడటం ప్రారంభించేవాణ్ణి. ఆ స్త్రీతో మాట్లాడటం ఎంతో ఇష్టంగా వుండేది.

వృద్ధురాలు కూడా నన్ను స్త్రీ వ్యామోహంలోకి నెట్టసాగింది. మా యీ సాంగత్యం ఆమెకు కూడా ఇష్టమేనన్నమాట. మా ఇద్దరి మేలు ఆమె కూడా కోరియుంటుంది. ఇక నేను ఏం చేయాలి? నాకు పెండ్లి అయిందని ఇదివరకే చెప్పివుంటే బాగుండేది కదా! అప్పుడు ఆమె నా వంటివాడి పెండ్లి విషయం యోచించేదా? ఇప్పటికీ సమయం మించిపోలేదు. నిజం తెలియజేస్తే ముప్పు తప్పిపోతుంది గదా! ఈ విధంగా యోచించి పూర్తి వివరాలు తెలుపుతూ ఆమెకు ఒక జాబు వ్రాశాను. జ్ఞాపకం వున్నంతవరకు నేను రాసిన జాబు సారాంశం క్రింద తెలుపుతున్నాను.

“బ్రైటన్‌లో కలిసినప్పటి నుండి మీరు నన్ను ప్రేమగా చూస్తున్నారు. తల్లి తన బిడ్డను చూచే విధంగా మీరు నన్ను చూస్తున్నారు. నాకు పెళ్ళి అవడం మంచిదనే భావంతోనే యువతుల్ని నాకు పరిచయం చేస్తున్నారు. ఈ వ్యవహారం ముదరక ముందే మీ ఈ ప్రేమకు నేను తగనని తెలియజేయడం నా కర్తవ్యమని భావిస్తున్నాను. నాకు ఇదివరకే పెళ్ళి అయిపోయిందని నేను మీతో పరిచయం అయినప్పుడే చెప్పి వుండవలసింది. హిందూ దేశంలో పెండ్లి అయి ఇక్కడ చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు తమకు పెళ్ళి అయిందని చెప్పరనే విషయం నాకు తెలుసు. నేను కూడా ఆ విధానాన్ని పాటించాను. అయితే ఇప్పుడు ఆ విషయం చెప్పి వుండవలసిందని నాకు బోధపడింది. బాల్యంలోనే నాకు వివాహం అయిపోయిందనీ, నాకు ఒక కొడుకు కూడా కలిగాడని ముందుగానే చెప్పియుంటే బాగుండేది. మీకు చెప్పకుండా దాచి ఉంచినందుకు నేను విచారిస్తున్నాను. అయితే ఇప్పటికైనా మీకు నిజం తెలియజేయాలనే ధైర్యం భగవంతుడు నాకు ప్రసాదించాడు. అందుకు సంతోషిస్తున్నాను. మీరు నన్ను క్షమించండి. మీరు నాకు పరిచయం చేసిన యువతితో ఏ విధమైన అక్రమసంబంధం నేను పెట్టుకోలేదని మీకు తెలుపుతున్నాను. మీరు నా యీ మాటను నమ్మవచ్చు. హద్దు దాటగూడదను విషయం నాకు తెలుసు నాకు మూడుముళ్ళు పడాలనే భావం మీకు కలదని నాకు తెలుసు. ఈ భావం ఇంకా మీ మనస్సులో వ్రేళ్ళూనగూడదనే భావంతో నిజాన్ని ఈ జాబు ద్వారా తెలియజేస్తున్నాను.

ఈ జాబు అందిన తరువాత నేను మీ దగ్గరకు రా తగనివాడినని మీరు భావిస్తే నేను బాధపడను. మీరు చూపిన స్నేహానికి సదా కృతజ్ఞుణ్ణి. మీరు నన్ను వదలి వేయకుంటే చాలా సంతోషిస్తాను. ఇంత జరిగినా మీరు నన్ను మీ దగ్గరకు రానిస్తే, అందుకు నేను తగుదునని మీరు భావిస్తే నాకు క్రొత్త స్పూర్తి లభిస్తుంది. మీ ప్రేమకు పాత్రుడనయ్యేందుకు సదా ప్రయత్నిస్తూ వుంటాను.

ఇంత పెద్ద జాబు త్వరగా వ్రాశానని పాఠకులు గ్రహించకుందురుగాక. ఎన్ని చిత్తులు వ్రాశానో పాఠకులు ఊహించుకోవచ్చు. ఈ జాబు ఆమెకు పంపి పుట్టెడు బరువు తీరిపోయినట్లు భావించాను. ఈ చర్య నాకు హాయి కలిగించింది. మరు టపాలో ఆ వృద్ధ మహిళ వ్రాసిన జాబు అందింది. అందులో ఈ విధంగా వుంది. “నీవు నిర్మల హృదయంతో రాసిన జాబు అందింది. మా ఇద్దరికీ సంతోషం కలిగింది. ఇద్దరం బాగా నవ్వుకున్నాం. నీవు అసత్యానికి పాల్పడ్డావు. అది క్షమించడానికి అర్హమైన తప్పిదమే. నీవు నిజం తెలుపడమే ఆ అర్హతకు కారణం. నీకు స్వాగతం. నా ఆహ్వానం నీకు ఎప్పుడూ వుంటుంది. వచ్చే ఆదివారంనాడు నీ కోసం మేమిద్దరం ఎదురు చూస్తూ ఉంటాము. నీ బాల్య వివాహం గురించి వివరాలు వింటాము. నిన్ను ఎగతాళి చేసి ఆనందం పొందుతాము. మన స్నేహం ఎప్పటిలాగానే స్థిరంగా ఉంటుంది. పూర్తిగా నమ్మవచ్చు,

నాలో ముదిరిన అసత్యమనే ఈ వ్రణాన్ని తొలగించుకుని నయం చేసుకోగలిగాను. తరువాత ఇలాంటి వ్యవహారం జరిగినప్పుడు నా వివాహం సంగతి ముందే చెప్పివేయగల ధైర్యం నాకు కలిగింది.