సత్యశోధన/మూడవభాగం/4. శాంతి

వికీసోర్స్ నుండి

4. శాంతి

ఆ రోజున నా మీద దాడి జరిగిన తరువాత నేను పోలీసు స్టేషను చేరాను. అక్కడ రెండు రోజులు పున్నాను. నా వెంట యిద్దరు పోలీసులు రక్షణ కోసం వున్నారు. తరువాత ఎస్కాంబీగారిని కలుసుకునేందుకు వెళ్ళాను. అప్పటికి పోలీసుల కాపలా అవసరం లేకుండా పోయింది.

నేను ఓడ దిగిన రోజున అనగా పచ్చజెండా దింపిన రోజున నేటాల్ అడ్వర్‌టైజర్ పత్రికా ప్రతినిధి వడివడిగా వచ్చి నన్ను కలిసి మాట్లాడాడు. అనేక ప్రశ్నలు వేశాడు. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం యిచ్చాను. సర్ ఫిరోజ్ షా మెహతాగారి సలహా ప్రకారం హిందూ దేశంలో నేను యిచ్చిన ఉపన్యాసాలన్నీ ముద్రింపబడి వున్నాయి. వాటన్నింటిని నేను అతనికి యిచ్చాను. దక్షిణ - ఆఫ్రికాలో నేను అదివరకు చెప్పిన మాటల్నే హిందూదేశంలో కూడా చెప్పాను. అంతకు మించి ఒక్కమాట అయినా అదనంగా చెప్పలేదని రుజూచేశాను. కురలేండ్, నాదరి ఓడల్లో వచ్చిన వారితో నాకు ఏవిధమైన సంబంధం లేదని స్పష్టం చేశాను. వారిలో చాలామంది నేటాలులో నివసిస్తున్న వారే. మిగిలిన వారు నేటాల్లో ఆగరు. వారు ట్రాన్సువాలు వెళతారు. ఆ సమయంలో నేటాల్లో పనులు తక్కువ. ట్రాన్సువాల్లో పనులు ఎక్కువ. అక్కడ ఆదాయం అధికంగా లభిస్తున్నది. అందువల్ల ఎక్కువ మంది భారతీయులు అక్కడికి వెళ్ళుతూ వున్నారు.

పత్రికా ప్రతినిధితో జరిగిన నా సంభాషణంతా పత్రికల్లో ప్రకటింపబడింది. నన్ను కొట్టినవారి మీద కేసు పెట్టనని సవివరంగా చెప్పిన మాటలు కూడా పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. దానితో తెల్లవారు తలలు వంచుకున్నారు. పత్రికలు నన్ను నిర్దోషి అని ప్రకటించాయి. దుండగుల దుందుడుకుతనాన్ని ఖండించాయి. చివరికి ఈ విధంగా ఆ ఘట్టం వల్ల నాకు లాభం కలిగిందన్నమాట. దీనివల్ల భారతీయుల గౌరవ ప్రతిష్టలు పెరిగాయి. నా మార్గం సుగమం అయింది. మూడు నాలుగు రోజులకు ఇంటికి చేరాను. నా కార్యక్రమాలు ప్రారంభించాను. ఈ ఘట్టం వల్ల నా వకాలతు కూడా పెరిగింది.

ఒకవైపున భారతీయుల ప్రతిష్ట పెరిగిందే కాని మరో వైపున వారి యెడ తెల్లవారిలో ద్వేషం కూడా పెరిగింది. భారతీయుడు పౌరుషవంతుడని తెల్లవారికి తెలిసింది. దానితో భారతీయులంటే తెల్లవారికి భయం ప్రారంభమైంది. నేటాలు లెజిస్లేటివ్ కౌన్సిల్లో రెండు చట్టాలు ప్యాసయ్యాయి. భారతీయులకు కష్టాలు కలిగించేవిగా అవి వున్నాయి. ఒక చట్టం భారతీయుల వ్యాపారానికి హాని కలిగిస్తుంది. రెండోది వలస వచ్చే వారికి హాని కలిగిస్తుంది. వోటు హక్కు కోసం మేము చేసిన కృషి దేవుని దయవల్ల కొంత ఫలించింది. “భారతీయులకు వ్యతిరేకంగా, అనగా భారతీయుడైనంత మాత్రాన వానికి ఏ చట్టమూ వర్తించబడకూడదు” అంటే “చట్టానికి జాతి భేదం వర్ణభేదం ఉండరాదు” అని నిర్ణయం చేశారు. యీ నిర్ణయం భారతీయులకు కొంత ఊరట కలిగించిందని చెప్పవచ్చు. అయితే పై రెండు చట్టాల్లోను ఉపయోగించబడిన భాష పైకి మెత్తగా వున్నా, లోపల మాత్రం భారతీయుల హక్కుల్ని కుంచింపజేసే విధంగా కరుకుగా వున్నది,

ఈ రెండు చట్టాలు నా పనిని పెంచి వేశాయి. భారతీయుల్లో జాగృతి కలిగించాయి. భారతీయులందరకీ యీ చట్టాల ఉద్దేశ్యం స్పష్టంగా అర్థం కావాలనే ఉద్దేశ్యంతో వాటిని అన్ని భాషల్లోకి అనువదించాము. ఇంగ్లాండుకు అర్జీలు పంపించాము. కాని చట్టాలు మాత్రం మంజూరయ్యాయి. నా సమయమంతా సార్వజనిక కార్యక్రమాలకే సరిపోతున్నది. మన్‌సుఖలాల్ నాజర్ గారు నేటాల్లో వున్నారని గతంలో తెలియజేశాను. వారు మా ఇంట్లో ఉండేందుకై వచ్చి ఆ పనుల్ని చూడటం ప్రారంభించారు. అందువల్ల నా పని భారం కొద్దిగా తగ్గినది.

నేను దక్షిణ - ఆఫ్రికాలో లేనప్పుడు ఆదంజీ మియాఖాన్ గారు తమ విధిని సక్రమంగా నిర్వహించారు. వారి సమయంలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య బాగా పెరిగింది. యాత్రీకుల్ని రానీయకుండా చేసే యత్నాన్ని, భారతీయుల వ్యతిరేక చట్టాల్ని ఎదుర్కునేందుకు ఎక్కువ ధనం సమకూర్చాలని నిర్ణయించాం. తత్ఫలితంగా 5000 పౌండ్ల ధనం వసూలైంది. కాంగ్రెస్ కోశానికి స్థిరత్వం చేకూరితే ఆ సొమ్ముతో కొంత ఆస్థి కొని, దాని వల్ల వచ్చే ఆదాయంతో కాంగ్రెస్‌ను ఆర్ధికంగా తీర్చిదిద్దాలని నాకు లోభం కలిగింది. సార్వజనిక సంస్థల్ని నడిపే వ్యవహారంలో నాకు కలిగిన మొదటి అనుభవం యిది. నా అభిప్రాయం తోటి మెంబర్లకు చెప్పాను. వారంతా అందుకు అంగీకరించారు. కొంత ఆస్థి కొన్నాం. అద్దెకిచ్చాం. దానితో కాంగ్రెస్ వ్యయం సరిపోసాగింది. అందు నిమిత్తం ధర్మకర్తల్ని ఏర్పాటు చేశాం. ఆ ఆస్తి యిప్పటికీ వున్నది. కాని తరువాత అది అంతః కలహాలకు దారితీసింది. అద్దె సొమ్ము కోర్టులో జమచేయబడుతూ వున్నది. నేను దక్షిణ - ఆఫ్రికా వదలి వచ్చేసిన తరువాత అలా జరిగింది.

అసలు సార్వజనిక సంస్థలకు మూలధనం ఏర్పాటు చేయడం విషయంలో నా అభిప్రాయంలో చాలా మార్పు వచ్చింది. నేను అక్కడ వున్నపుడు చాలా సార్వజనిక సంస్థల్ని స్థాపించాను. వాటిని నడిపించాను. వాటికి అండగా వున్నాను. వాటివల్ల కలిగిన అనుభవాన్ని పురస్కరించుకొని ఏ సార్వజనిక సంస్థకూ మూలధనం సమకూర్చి పెట్టే ప్రయత్నం చేయకూడదనే దృఢ నిర్ణయానికి వచ్చాను. మూలధనం సమకూర్చి పెట్టగానే దానికి నైతికంగా అధోగతి ప్రారంభం అవుతుంది. అందుకు అవసరమైన బీజాలు మూలధనంలోనే వున్నాయి.

సార్వజనిక సంస్థ అంటే ఏమిటి? సర్వజనుల అనుమతితో, సర్వజనుల ధనంతో, నడుపబడు సంస్థ అని అర్థం. ప్రజల సహకారం అట్టి సంస్థకు లేకుండా పోయినప్పుడు యిక ఆ సంస్థ అనవసరం. మూలధనంతో నడపబడే సంస్థలు ప్రజల అభిప్రాయాలకంటే స్వతంత్రంగాను, అనేకసార్లు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగాను కూడా నడుస్తూ వుంటాయి. మన దేశంలో యిట్టి సంస్థల్ని ప్రతిచోట చూస్తున్నాం. ధార్మిక సంస్థలుగా చలామణి అవుతున్న అనేక సంస్థలకు లెక్కాడొక్కా ఏమీ ఉండదు. ధర్మకర్తలే వాటికి అధికారులుగా తయారవుతున్నారు. వారు ఎవ్వరికీ జవాబుదారీ వహించక అధికారం చలాయిస్తున్నారు. యిది సరికాదని నా అభిప్రాయం. ప్రకృతివలె యిట్టి సంస్థలు వాటంతట అవే పెరగాలని నా అభిప్రాయం. అది నా మతం. ఏ సంస్థకు ప్రజలు సాయం చేసేందుకు సిద్ధంకారో ఆ సంస్థ సార్వజనిక సంస్థయను పేరిట నడపడానికి వీలు వుండకూడదు. ఏ సార్వజనిక సంస్థకైనా ప్రజల సహకారం లభిస్తున్నదని ఎవరైనా చెబితే దానికి ప్రజల వల్ల లభించే చందాల పట్టికను చూడాలి. అదే ఆ సంస్థ యొక్క ధర్మకర్తల యోగ్యతకు, ఆసంస్థయొక్క ప్రజాపరపతికి ఒరిపిడిరాయి అన్నమాట. ప్రతి సంస్థ ఈ ఒరిపిడి రాయి మీద తన రాతను గీచి చూచుకోవాలని నా మతం. దీనికి ఎవ్వరూ దురర్థం చెప్పకుందురు గాక. శాశ్వత భవనాలు లేకపోతే కొన్ని సంస్థలు నడవవు. అట్టి సంస్థల్ని గురించి నేను యిక్కడ పేర్కొనడంలేదు. నేను చెప్పదలుచుకున్నది ఒక్క విషయమే. ప్రతి సంవత్సరం తమ యిష్ట ప్రకారం జనం యిచ్చే చందాలతో సంస్థ వార్షిక వ్యయం చేయబడాలి. అలా జరిగితే ఆ సంస్థకు నైతిక స్ఫూర్తి చేకూరుతుంది.

దక్షిణ - ఆఫ్రికాలో సత్యాగ్రహ సమరం ముమ్మరంగా సాగినప్పుడు నా ఈ ఉద్దేశ్యాలు దృఢపడ్డాయి. లక్షలాదిరూపాయలు వ్యయం చేయాల్సి వచ్చింది. అయినా మూలధనం లేకుండా ఆరు సంవత్సరాలపాటు ఆ మహాసంగ్రామం జరిపాము. చందాలు రాకపోతే రేపు యీ సంగ్రామం గతి ఏమవుతుందోనని మేము భయపడ్డ రోజులు కూడా వున్నాయి. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము కదా! నాకు కలిగిన నిశ్చితాభిప్రాయాల్ని గురించి సందర్భాన్ని బట్టి ముందు వివరిస్తాను.