సత్యశోధన/మూడవభాగం/22. ధర్మ సంకటం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

22. ధర్మసంకటం

నేను ఆఫీసుతో పాటు గిరిగాములో ఇల్లు అద్దెకు తీసుకున్నాను. కాని ఈశ్వరుడు నన్ను స్థిరంగా వుండనీయలేదు. ఇల్లు తీసుకున్న కొద్దిరోజులకే మా రెండో పిల్లవాడికి బాగా జబ్బు చేసింది. టైఫాయిడ్ జ్వరం. ఎంతకీ తగ్గలేదు. మాటలు తడబడడం ప్రారంభమైంది. రాత్రి సన్నిపాత లక్షణాలు. ఈ వ్యాధికి ముందు అతనికి మశూచి ముమ్మరంగా పోసింది. డాక్టరును పిలిపించాను. “ఇందుకు మందు పనిచేయదు. కోడిగుడ్లరసం, కోళ్ళరసం ఇవ్వాలి” అని డాక్టరు చెప్పాడు.

మణిలాలు వయస్సు పదిఏళ్ళు. పిల్లవాణ్ణి ఏమని అడగను? సంరక్షకుణ్ణి నేను. నేనే ఏదో ఒక నిర్ణయం చేయాలి. డాక్టరు సజ్జనుడు. పారసీకుడు “అయ్యా, మేము మాంసాహారులం కాము. మీరు చెప్పిన ఈ రెండు వస్తువుల్లో దేన్నీ ముట్టము. ఇందుకు బదులు మరొకటి చెప్పండి.” అని అన్నాను.

“మీ పిల్లవాడి జీవితాశలేదు. పాలలో నీళ్ళు కలిపి ఇవ్వవచ్చు. కాని ఆ ఆహారం చాలదు. నేను చాలామంది హిందువుల ఇళ్ళల్లో వైద్యం చేస్తున్నాను. మీకు తెలుసు. వాళ్ళంతా నే చెప్పినట్లు చేస్తారు. నేను చెప్పిన వస్తువులు వాళ్ళు తీసుకుంటున్నారు. నేను చెప్పినట్లు మీరు కూడా విని ఈ పిల్లవాడి విషయంలో కాఠిన్యం వహించకుండా వుంటే మేలు జరుగుతుంది.

మీరన్నది నిజమే. కాని ఒక్క విషయం చెప్పక తప్పదు. ఈ విషయంలో నా బాధ్యత చాలా ఎక్కువ. అతడు పెద్ద వాడైయుంటే అతడి ఇష్టానుసారం వ్యవహరించి వుండేవాణ్ణి. కాని ఆ భారం నా మీద పడింది. మనిషికి ధర్మసంకటం ఏర్పడేది ఇలాంటి సమయాల్లోనేనని భావిస్తున్నాను. తప్పో ఒప్పో మనుష్యుడు మాంసం తినకూడదని నా నిర్ణయం. జీవన సాధనానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ప్రాణం నిలుపుకోడం కోసమైనా ఈ వస్తువుల్ని తినరాదని నా అభిప్రాయం. అందువల్ల నాకు గాని నావారికి గాని ఇట్టి సమయంలో కూడా మాంసం మొదలగు వాటిని తినిపించకూడదని నా ధర్మమర్యాద బోధిస్తున్నది. మీరు ఈ పిల్లవాడి జీవితానికి ప్రమాదం అని చెప్పినా లేక నిజంగా ప్రమాదం సంభవించినా నేను వాటిని ముట్టను. కాని ఒక్కటి మాత్రం యాచిస్తున్నాను. మీ మందులు నేను వాడను. నాకు నాడి, హృదయ పరీక్ష తెలియదు. నాకు కొంచెం కొంచెం జల చికిత్స తెలుసు. నేనా చికిత్స చేస్తాను. మీరు నియమప్రకారం మణిలాలును చూచి శరీరంలో కలిగే మార్పుల్ని నాకు తెలిపితే మీ మేలు మరువలేను అని అన్నాను. సజ్జనుడగు అతనికి నా ఇబ్బంది తెలిసింది. నేను కోరిన ప్రకారం వచ్చి మణిలాలును చూచి వెళతానని అన్నాడు.

మణిలాలు తన ఉద్దేశ్యం నిర్ధారించి చెప్పగలవాడు కాకపోయినా, నాకు డాక్టరుకు జరిగిన సంభాషణంతా చెప్పి నీ ఉద్దేశ్యం ఏమిటి అని అడిగాను.

“నీవు మామూలుగా జలవైద్యం చేయి. నాకు కోళ్ళూ వద్దు, కోడిగ్రుడ్లరసమూ వద్దు” అని మణిలాలు అన్నాడు. బాబూ, వాటిని తిను అని నేను చెబితే పిల్లవాడు తింటాడని నాకు తెలుసు. అయినా అతని మాటలవల్ల నాకు సంతోషం కలిగింది. నాకు కూనే వైద్యం కొద్దిగా తెలుసు. లోగడ నుండి ఈ వైద్యం నేను చేస్తున్నాను. రోగానికి లంకణం పరమౌషధం అని నా భావం. కూనే వైద్యం ప్రకారం మణిలాలుకు కటిస్నానం మూడు నిమిషాలు మాత్రం చేయించాను. మూడు రోజుల వరకు నీరు కలిపిన నారింజ పండ్ల రసం ఇచ్చాను. కాని ఉష్ణం తగ్గలేదు. రాత్రిళ్ళు కొంచెం కొంచెం పెరుగుతూ వున్నది. 104 డిగ్రీల దాక జ్వరం వుంటున్నది. నాకు కంగారు పుట్టింది. “పిల్లవాడికి ఏమైనా అయితే లోకులేమంటారు? మా అన్నగారేమంటారు? మరో డాక్టరును పిలిపించకూడదా? ఆయుర్వేద వైద్యుణ్ణి పిలిపించకూడదా? అపక్వమైన తమ బుద్ధిని పిల్లలపై ప్రయోగించే హక్కు తల్లిదండ్రుల కెక్కడిది? ఈ రకమైన ఊహలతో మనుస్సు బరువెక్కింది ‘జీవుడా! నీవు నీకోసం ఏంచేస్తున్నావో నీ పిల్లవాడి కోసం కూడా అదే చేయి. పరమేశ్వరుడు సంతోషిస్తాడు. నీకు జలచికిత్స అంటే గురి. మందు మీద అట్టి గురి లేదు. డాక్టరు ప్రాణం పోయలేడు. అతడిచ్చేది మందు. ప్రాణతంతువు దేవుడి చేతుల్లో వుంది. అందువల్ల దైవనామం స్మరించు. దానిని నమ్ము. నీ మార్గం విడవకు’ అను ఊహ మనస్సులో జనించింది.

మనస్సులో ఎంతో మధనపడుతూ వున్నాను. చీకటి పడింది. రాత్రి మణిలాలును దగ్గరకు తీసుకొని పడుకున్నాను. తడిగుడ్డ కప్పవచ్చని అనుకున్నాను. లేచి బట్ట తెచ్చి చన్నీటిలో తడిపి పిడిచి తలవరకు కప్పాను. పైన రెండు కంబళ్ళు, కప్పాను. తలకు తడితువాలు చుట్టాను. ఒళ్ళు పెనంలా కాలుతున్నది. వంటి మీద చెమట బొట్టు లేదు.

నాకు దడ పుట్టింది. మణిలాలును తల్లికి అప్పగించాను. ఒక్క అరగంట సేపు తెరపగాలిలో తిరిగి శ్రమ తీర్చుకొని శాంతి పొందుదామని తలచి చౌపాటి వైపుకు వెళ్ళాను. పదోగంట కొట్టారు. మనుష్యుల రాక పోకలు తగ్గాయి. కాని నాకు ఆదేమీ తెలియదు. నేను దుఃఖ సాగరంలో మునిగి వున్నాను. “ఓ ఈశ్వరా! ఈ ధర్మ సంకటంలో నా ప్రార్ధన అంగీకరించు” అని అంటూ నిలబడ్డాను. నా నాలుక మీద రామనామం ఆడుతూ వుంది. కొంత సేపటికి ఇంటికి బయలుదేరాను. నా గుండెలు దడదడలాడుతూ వున్నాయి. ఇంట్లో ప్రవేశించాను. “నాన్నా! వచ్చావా?” అని మణిలాలు అన్నాడు. “ఆ నాయనా!”

“నన్ను బయటికి తీయండి. చచ్చిపోతున్నాను.”

“చెమట పోస్తున్నదా!”

“చెమటతో స్నానం చేశాను వెంటనే తీసివేయినాన్నా?”

నేను మణిలాలు తల తాకి చూచాను! చెమట చేతికి తగిలింది. జ్వరం దిగజారింది. ఈశ్వరునికి చేతులెత్తి నమస్కరించాను.

“నాయనా! మణిలాలూ! భయంలేదు. యిక జ్వరం పోతుంది. ఇంకొంచెం చెమట పోయనీయి”

“ఇక ఆగలేను. యిప్పుడే నన్ను బయటికి తీయండి. అవసరమైతే యింకోసారి కప్పవచ్చు”

నాకు ధైర్యం వచ్చింది. మాటల్లో కొద్ది నిమిషాలు గడిచాయి. చెమట ధారగా కారసాగింది. కప్పిన బట్టలన్నీ తొలగించాను. ఒళ్ళంతా తుడిచి ఆరనిచ్చాను. తరువాత తండ్రీ బిడ్డలం ఆ మంచం మీదనే నిద్రించాం. మా యిద్దరికీ గాఢంగా నిద్రపట్టింది. తెల్లవారింది. లేచి చూచాను. మణిలాలుకు వేడి చాలా వరకు తగ్గి పోయింది. నలభైరోజులు పాలు, నీళ్ళు, పండ్లు వీటితో నడిపాను. నాకు భయం పోయింది. జ్వరం మొండిదే కాని లొంగిపోయింది. నేడు నా పిల్లలందరిలో మణిలాలు ఆరోగ్యవంతుడు. బలిష్టుడు కూడా.

దీనికి కారణం? రాముడి కృపయా? జలచికిత్సయా? అల్పాహారమా? లేక ఏదేని ఉపాయమా? నిర్ణయం ఎవరు చేయగలరు? ఎవరి విశ్వాసం ప్రకారం వాళ్ళు భావించవచ్చును. కానీ ఆ సమయంలో ఈశ్వరుడే నా ప్రార్థనను ఆలకించాడని నా నమ్మకం. ఆనాటికీ, యీనాటికీ అదే నా నమ్మకం.