సత్యశోధన/నాల్గవభాగం/8. ఒక జాగరూకత

వికీసోర్స్ నుండి

8. ఒక జాగరూకత

నా వివిధ ప్రయోగాల గాధను గురించి చెప్పడం తరువాతి ప్రకరణం వరకు ఆపుతాను. గత ప్రకరణంలో మట్టి చికిత్సను గురించి వ్రాసిన విధంగానే ఆహారం విషయంలో కూడా పలు ప్రయోగాలు చేశాను. అందువల్ల అందుకు సంబంధించిన వివరాలు ఇక్కడ చెప్పివేయడం అవసరమని భావిస్తున్నాను. ఆహారం విషయంలో నేను చేసిన ప్రయోగాలను గురించి, అందుకు సంబంధించిన యోచనలను గురించి పూర్తిగా ఈ ప్రకరణంలో వివరించడం సాధ్యం కాదు. ఆ విషయాలు దక్షిణాఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్ పత్రిక కోసం నేను వ్రాసిన వ్యాసాలు తరువాత పుస్తక రూపంలో ప్రకటించబడ్డాయి. నేను వ్రాసిన చిన్నచిన్న పుస్తకాలలో ఈ పుస్తకం పాశ్చాత్య దేశాల్లోను, మనదేశంలోను బాగా ప్రసిద్ధికెక్కింది. అందుకు కారణం ఏమిటో ఈనాటివరకు నేను తెలుసుకోలేకపోయాను. ఆ పుస్తకం ఇండియన్ ఒపీనియన్ పత్రిక కోసం వ్రాయబడింది. అయితే దాన్ని ఆధారంగా తీసుకుని చాలామంది సోదర సోదరీమణులు తమ జీవనంలో ఎన్నో మార్పులు చేసుకున్నారు. నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరిపారు.

అందువల్ల ఆ విషయాన్ని గురించి ఇక్కడ కొద్దిగా వ్రాయవలసిన అవసరం ఏర్పడింది. ఆ పుస్తకంలో వ్రాసిన నా భావాలలో మార్పు చేయవలసిన అవసరం ఏమీ కలుగకపోయినా, నేను జీవితంలో చేసిన అత్యవసరమైన కొన్ని మార్పుల్ని గురించి ఆ పుస్తకం చదివిన పాఠకులకు తెలియదు. వారు ఆ వివరం తెలుసుకోవడం చాలా అవసరం.

మిగతా పుస్తకాలవలెనే నేను ఈ పుస్తకం కూడా కేవలం ధార్మిక భావంతో వ్రాశాను. ఇప్పటికీ నేను చేసే ప్రతి పనిలో ఆ భావమే నిండి ఉంటుంది. అందువల్ల అందలి అనేక విషయాల్ని నేను అమలు చేయలేకపోయాను. ఇది నాకు విచారం, సిగ్గు కలిగించే విషయం.

బాల్యంలో బిడ్డ తల్లి పాలు త్రాగుతాడు. ఆ తరువాత మరో పాలు త్రాగవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. పండిన వన్య ఫలాలతో బాటు ఆకుపచ్చని పండ్లు, ఎండు ఫలాలు మనిషికి మంచి ఆహారం. వాటికి మించినది మరొకటి లేదు. బాదంపప్పు, ద్రాక్ష మొదలుగాగలపండ్ల వల్ల మనిషి శరీరానికి, మెదడుకు అవసరమైన పోషణ లభిస్తుంది. ఇట్టి ఆహారం మీద ఆధారపడి వుండగల వారు బ్రహ్మచర్యం మొదలగు ఆత్మ సంయమగుణాల్ని అలవరచుకోవచ్చు. తిండిని బట్టి త్రేపులు ఉంటాయి. తినే తిండిని బట్టి మనిషి తయారవుతాడు. అను సామెత యందు సత్యం ఇమిడి ఉంది. నేను, నా అనుచరులు అట్టి అనుభవం పొందాం.

ఈ భావాలను సమర్థిస్తూ విస్తారంగా నా ఆ పుస్తకంలో వ్రాయడం జరిగింది. కాని హిందూదేశంలో నా ప్రయోగాలు పూర్తి సాఫల్యం పొందే అదృష్టం నాకు కలగలేదు. ఖేడా జిల్లాలో సైనికుల్ని భర్తీ చేసుకుంటూ నా పొరపాటు వల్ల మృత్యుశయ్య మీదకు చేరాను. పాలు లేకుండా జీవించాలని ఎంతో ప్రయాసపడ్డాను. తెలిసిన వైద్యుల, డాక్టర్ల, రసాయన శాస్త్రజ్ఞుల సహాయం కోరాను. పెసరనీళ్ళు తీసుకోమని ఒకరు, విప్పనూనె తీసుకోమని ఒకరు, బాదంపాలు తీసుకోమని ఒకరు సలహా ఇచ్చారు. వాటినన్నింటి ప్రయోగాలు చేసి చేసే నా శరీరాన్ని పిండివేశాను. తత్ఫలితంగా పక్క మీద నుండి లేవలేని స్థితికి చేరుకున్నాను. చరకుని శ్లోకాలు వినిపించి వైద్యులు కొందరు రోగం నయం కావడానికి ఖాద్యాఖాద్యములను గురించి బాధపడవద్దని మాంసాదులు కూడా తినవచ్చునని చెప్పారు. ఈ వైద్యులు పాలు త్రాగకుండా గట్టిగా వుండమని చెప్పలేరని తేలిపోయింది. బీఫ్ టీ (గోమాంసపు టీ), బ్రాంది పుచ్చుకోవచ్చునని చెప్పేవారున్న చోట పాలు త్రాగడం మానమని చెప్పేవారు ఎలా దొరుకుతారు? ఆవుపాలు, గేదెపాలు నేను త్రాగను. అది నా వ్రతం. నా వ్రత ఉద్దేశ్యం పాలు మానడమే. అయితే అట్టి వ్రతం గైకొన్నప్పుడు నా దృష్టిలో వున్నది గోమాత, గేదెమాత మాత్రమే. నేను వ్రతం అనే పదాన్ని పాటించాను. మేకపాలు తీసుకొనేందుకు అంగీకరించాను. మేకమాత పాలు త్రాగుతున్నప్పుడు వ్రతాత్మకు విఘాతం కలిగిందని నాకు అనిపించింది.

అయితే నేను రౌలట్ ఆక్టును ఎదుర్కోవాలి! ఆ మోహం నన్ను వదలలేదు. అందువల్ల జీవించి వుండాలనే కాంక్ష కలిగింది. జీవితంలో మహత్తర ప్రయోగమని దేన్ని భావిస్తూ వున్నానో అది ఆగిపోయింది.

ఆహారంతో జలంతో ఆత్మకు సంబంధం లేదు. ఆత్మ తినదు, తాగదు. ఉదరంలోకి పోయే పదార్థాలతో దానికి సంబంధం లేదు. లోనుండి వెలువడే మాటలే లాభనష్టాలు కలిగిస్తాయని నాకు తెలుసు. అందు నిజం కూడా కొంత వున్నది. తర్కం జోలికి పోకుండా ఇక్కడ నా దృఢ నిశ్చయం ప్రకటిస్తున్నాను. భగవంతునికి వెరచి నడుచుకోవాలని, భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలని భావించే సాధకునకు మరియు ముముక్షువునకు ఆహారపదార్థాల ఎన్నికను గురించి, వాటిని త్యజించడాన్ని గురించి శ్రద్ధ చాలా అవసరం. భావాన్ని, వాక్కును ఎన్నుకోవడం ఎంత అవసరమో నిర్ణయం యెడ శ్రద్ధ వహించడం అంత అవసరం అన్నమాట.

అయితే స్వయంగా నేను చేయని దాన్ని ఆచరించమని ఎవ్వరికీ సలహా ఇవ్వను. అలా ఎవరైనా చేయదలుచుకుంటే వారిని వారిస్తాను. అందువల్ల ఆరోగ్యవిషయమై నేను వ్రాసిన పుస్తకం సాయంతో ప్రయోగాలు చేయదలచిన చాలామందిని హెచ్చరిస్తున్నాను. పాలు మానడం పూర్తిగా లాభకారి. అయితే, అనుభవజ్ఞులగు వైద్యులు డాక్టర్లు పాలుమానమని సలహాయిస్తేనే పాలుమానడం మంచిది. నా పుస్తకాన్ని ఆధారం చేసుకొని మాత్రం పాలు మానవద్దు. నాకు ఇప్పటివరకు కలిగిన అనుభవం వల్ల నేను ఒక నిర్ణయానికి వచ్చాను. జీర్ణశక్తి మందగించిన వారికీ, జబ్బుతో పక్కమీద నుండి లేవలేనివారికి, పాలకంటే మించిన తేలిక అయిన పోషక పదార్థం మరొకటి లేదు. అందువల్ల పుస్తకంలో పాలను గురించి నేను వ్రాసిన మార్గాన నడుస్తామని పట్టుపట్టవద్దని పాఠకులకు మనవి చేస్తున్నాను.

ఈ ప్రకరణం చదివిన వైద్యులు, డాక్టర్లు, హకీములు, అనుభవజ్ఞులు తదితరులెవరైనా సరే పాలకు బదులుగా పోషక పదార్థం మరియు తేలికగా జీర్ణం కాగలిగిన వనస్పతి ఏదైనా ఉంటే చదివిన పుస్తకాల ఆధారంతోగాక, ఆచరించి పొందిన అనుభవంతో ఆ వివరం తెలిపి నన్ను ధన్యుణ్ణి చేయమని ప్రార్థిస్తున్నాను.