సత్యశోధన/నాల్గవభాగం/7. మట్టితో నీటితో ప్రయోగాలు

వికీసోర్స్ నుండి

7. మట్టితో, నీటితో ప్రయోగాలు

నా జీవితంలో నిరాడంబరత పెరిగినకొద్దీ రోగాలకు మందు పుచ్చుకోవడమంటే అయిష్టత కూడా పెరిగింది. డర్బనులో వకీలుగా పనిచేస్తున్నపుడు డాక్టర్ ప్రాణజీవనదాసు మెహతా నన్ను చూచేందుకు వచ్చేవారు. అప్పుడు నాకు నీరసంగా వుండేది. అప్పుడప్పుడు వాపు కూడా వస్తూ ఉండేది. ఆయన చికిత్స చేయగా ఆ నలత తగ్గిపోయింది. ఆ తరువాత భారతదేశానికి తిరిగి వచ్చేవరకు చెప్పుకోదగ్గ జబ్బు చేసినట్లు నాకు గుర్తు లేదు.

జోహన్సుబర్గులో నన్ను విరోచనాలు పట్టుకున్నాయి. తలనొప్పి కూడా వుండేది. విరోచనాలకు మందు పుచ్చుకుంటూ ఉండేవాణ్ణి. పత్యంగా వుండేవాణ్ణి. అయినా పూర్తిగా వ్యాధి తగ్గలేదు. విరోచనాలు కట్టుకుంటే బాగుంటుందని మనస్సు సదా కోరుకుంటూ ఉండేది.

ఇదే సమయాన నేను మాంచెస్టరు పత్రికలో “నో బ్రేక్‌ఫాస్టు అసోసియేషన్” (టిఫెన్ల త్యాగ సంఘం) స్థాపనకు సంబంధించిన వార్త చదివాను. ఆ వార్తా రచయిత ఇంగ్లీషు వాళ్ళు చాలాసార్లు చాలా ఆహారం భుజిస్తారనీ, రాత్రి పన్నెండు గంటలదాకా తింటూనే వుంటారనీ, తత్ఫలితంగా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ వుంటారనీ, ఈ బాధ తొలగాలంటే ఉదయం తీసుకునే టిఫెను (బ్రేక్ ఫాస్టు) మానివేయాలని వ్రాశాడు. ఈ ఆరోపణ పూర్తిగా కాకపోయినా కొంతవరకు నాకూ వర్తిస్తుందని భావించాను. నేను మూడు పర్యాయాలు కడుపు నిండా తినేవాణ్ణి. మధ్యాహ్నం పూట టీ కూడా త్రాగేవాణ్ణి. శాకాహారం, మసాలాలు లేని ఆహార పదార్థాలు భుజించేవాణ్ణి. ఆరు లేక ఏడు గంటలకు ముందు లేచేవాణ్ణి కాదు. నేను కూడా ఉదయం టిఫెను మానేస్తే మంచిదనీ, తలనొప్పి తగ్గవచ్చుననీ నిర్ణయానికి వచ్చాను. ఉదయం టిఫెసు మానివేశాను. కొద్దిరోజులు బాధ కలిగింది. కాని తత్ఫలితంగా తలనొప్పి తగ్గిపోయింది. దానితో నేను అవసరమైన దానికంటే ఎక్కువగా తింటున్నానని తేలిపోయింది.

విరోచనాలు తగ్గలేదు. కూనే తెలిపిన ప్రకారం కటిస్నానం మొదలు పెట్టాను. బాధ కొద్దిగా తగ్గింది. కాని పూర్తిగా తగ్గలేదు. ఈ లోపున ఆ జర్మనీ హోటలువాడో మరో మిత్రుడో, జుస్ట్ రచించిన “రిటర్న్ టు నేచర్” (ప్రకృతి వైపు మరలుము) అను పుస్తకం నా చేతికి ఇచ్చారు. అందు మట్టి చికిత్సను గురించిన వివరం చదివాను. ఎండుద్రాక్ష వగైరా పండ్లు, ఆకుపచ్చని పండ్లు మనిషికి ప్రాకృతిక ఆహారమని కూడా వ్రాసి ఉన్నది. పండ్లను గురించిన ప్రయోగం అప్పుడు నేను చేయలేదు కాని మట్టి చికిత్స వెంటనే ప్రారంభించాను. ప్రయోజనం కలిగింది. పరిశుభ్రమైన, పొలంలో దొరికే ఎర్రని లేక నల్లని మట్టి తెచ్చి అందు సరిపోయేలా నీళ్ళుపోసి కలిపి, పల్చటి తడి బట్టమీద దానివేసి చుట్టి పొట్టమీద ఉంచాను. దాని మీద పట్టీ కట్టాను. ఆ విధంగా మట్టిపట్టి రాత్రి నిద్రపోయే ముందు కట్టి, ప్రొద్దునగాని లేక రాత్రి మెలకువ వచ్చినప్పుడు గాని విప్పదీసేవాణ్ణి. దానివల్ల విరోచనాలు కట్టుకున్నాయి. ఈ విధమైన మట్టి చికిత్స నా అనుచరులకు కూడ చాలాసార్లు చేశాను. అది ఎంతో ప్రయోజనం చేకూర్చిందని నాకు ఇప్పటికీ జ్ఞాపకం.

భారతదేశం వచ్చాక ఇలాంటి చికిత్సలను గురించిన ఆత్మ విశ్వాసం తగ్గిపోయింది. ప్రయోగాలు చేసేందుకు ఒకచోట కూర్చునేందుకు సమయమే దొరకలేదు. అయితే ఇట్టి చికిత్స యెడ నాకు గల శ్రద్ధాసక్తులు ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. సమయాన్ని బట్టి అప్పుడప్పుడు మట్టి చికిత్స నేను చేసుకోవడమేగాక నా అనుచరులకు కూడా చేస్తున్నాను. రెండు పర్యాయాలు నేను బాగా జబ్బు పడ్డాను. అయినా మందులు పుచ్చుకోవలసిన అవసరం లేదనే భావించాను. పత్యం, నీరు, మట్టి మొదలుగాగల చికిత్సతో వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది జబ్బులు నయం చేయవచ్చునని నా విశ్వాసం.

క్షణక్షణం డాక్టర్ల దగ్గరికీ, వైద్యుల దగ్గరికీ, హకీములదగ్గరికీ పరుగెత్తుతూ, ఉదరంలో రకరకాల బెరుళ్ళు, ఆకులు మొదలగువాటి రసాయనం పోసి పోసి మనిషి తన జీవితాన్ని తానే కుంచించుకుంటూ ఉన్నాడు. అంతేగాక మనస్సుమీద అతనికి గల పట్టు తప్పుతున్నది. దానితో అతడు మానవత్వం పోగొట్టుకుంటున్నాడు. శరీరానికి బానిస అయిపోతున్నాడు. రోగ శయ్యమీద పడుకొని నేను వ్రాస్తున్నాను. అందువలన నా భావాల్ని తేలికగా తీసుకొని త్రోసివేయవద్దు. నా జబ్బుకు కారణం ఏమిటో నాకు తెలుసు. నా దోషాల వల్లనే నేను జబ్బుపడ్డాను. కనుకనే నేను అధైర్యపడలేదు. ఈ జబ్బు భగవంతుని అనుగ్రహంవల్ల వచ్చిందని భావిస్తున్నాను. మందులు వాడాలనే కోరికకు దూరంగా ఉన్నాను. పట్టుదలతో డాక్టర్లను ఇబ్బంది పెడుతూ ఉన్నాను. అయినా వాళ్ళు ఉదార స్వభావంతో నా మొండిపట్టును చూచి నన్ను వదిలివేయరు. నా ఈనాటి స్థితిని గురించి ఇక వ్రాయను. మనం 1904 పూర్వం నుండి 05కి వద్దాం.

ముందుకు సాగే పాఠకుల్ని ఒక్క విషయమై హెచ్చరించడం అవసరమని భావిస్తున్నాను. నా వర్ణన చదివి జుస్టు పుస్తకం తెప్పించి ఆయన వ్రాసినదంతా వేద వాక్యమని భావించకుందురుగాక. ప్రతి రచనయందు సామాన్యంగా రచయిత భావం ఒక్కటే చోటుచేసుకుంటూ ఉంటుంది. కాని ప్రతి విషయాన్ని పలు రకాలుగా పరిశీలించవచ్చు. ఆయా దృక్పథాల ప్రకారం అది సరిగానే ఉంటుంది. అయితే అన్ని దృక్పధాలు, అన్ని విషయాలు ఒకే సమయాన సత్యాలు కానేరవు. ఇంతేగాక చాలా పుస్తకాలు అమ్మకం కావాలనే భావంతోను, పేరు రావాలనే తాపత్రయంతోను వ్రాయబడుతూ ఉంటాయి. అందువల్ల ఆ పుస్తకం చదవదలచిన సోదరులు జాగ్రత్తగా చదవమనీ, ప్రయోగాలు చేయతలుచుకుంటే అనుభవజ్ఞుల సలహా సహకారాలు పొందమనీ ఎంతో ఓర్పుతో, ధైర్యంతో ఇట్టి ప్రయోగాలకు పూనుకోమనీ మనవి చేస్తున్నాను.