సత్యశోధన/నాల్గవభాగం/37. గోఖలేగారిని కలుసుకొనేందుకై ప్రయాణం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

37. గోఖలేగారిని కలుసుకునేందుకై ప్రయాణం

దక్షిణ ఆఫ్రికాకు సంబంధించిన అనేక స్మృతుల్ని వదిలివేయక తప్పడం లేదు. 1914 సత్యాగ్రహ సమరం ఆగిన తరువాత గోఖలేగారి కోరిక ప్రకారం నేను ఇంగ్లాండు వెళ్ళి అక్కడినుండి హిందూదేశం చేరవలసి వుంది. అందువల్ల జూలై మాసంలో కస్తూరిబాయి, కేలన్‌బెక్, నేను ముగ్గురం ఇంగ్లాండుకు బయలుదేరాం. సత్యాగ్రహ సమరం జరిగిన తరువాత నేను రైళ్ళలో మూడో తరగతిలో ప్రయాణం చేయడం ప్రారంభించాను. అందువల్ల ఓడలో కూడా మూడో తరగతి టిక్కెట్లే కొన్నాను. అయితే ఇక్కడి మూడో తరగతికి మనదేశంలో మూడో తరగతికి చాలా తేడా వున్నది. మనదేశంలో కూర్చునేందుకు, పడుకునేందుకు, అతి కష్టంమీద చోటు దొరుకుతుంది. పారిశుధ్యం అను విషయాన్ని గురించి యోచించడం అనవసరం. కాని యిక్కడ మూడో తరగతి యందు చోటు బాగానే దొరుకుతుంది. పారిశుద్ధ్యం కూడా ఎక్కువగా జరుగుతుంది. మరొకరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వుండేందుకై ఒక పాయిఖానా దొడ్డికి తాళంబెట్టి తాళం చెవి మాకు యిచ్చారు. మేము ముగ్గురం పలావు భుజించేవారం కావడం వల్ల మాకు ఎండు ద్రాక్ష, కిస్‌మిస్, తాజా పండ్లు యిమ్మని స్టీమరు కేషియరుకు ఆర్డరు అందింది. సామాన్యంగా మూడో తరగతి ప్రయాణీకులకు పండ్లు కొద్దిగా లభిస్తాయేగాని ఎండు ద్రాక్ష వగైరాలు లభించవు. ఇట్టి సౌకర్యం లభించడం వల్ల మేము ముగ్గురం ఓడమీద 18 రోజులు ఎంతో ప్రశాంతంగా ప్రయాణం చేశాం.

ఈ యాత్రకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవలసిన అవసరం వున్నది. మి. కేలన్‌బెక్‌కు దుర్భిణీ యంత్రం అంటే సర్దా. ఆయన దగ్గర ఒకటి రెండు ఖరీదైన దుర్భిణీ యంత్రాలున్నాయి. వాటిని గురించి రోజూ చర్చిస్తూవుండేవారం. ఆదర్శంగా వుండాలని, సాదా జీవితం గడపాలని భావించే మనబోటివారికి అంత ఖరీదైన వస్తువులు తగవని నచ్చచెబుతూ వుండేవాణ్ణి. ఒకరోజున యీ విషయం మీద మా యిద్దరి మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. మేమిద్దరం మా కేబిన్ కిటికీల దగ్గర నిలబడి వున్నాం. “మన యిద్దరి మధ్య తకరారు ఎందుకు? ఈ దుర్భిణీ యంత్రం సముద్రంలో పారేస్తే ఆ ఊసే ఎత్తం కదా!” అని అన్నాను. మి. కేలన్‌బెక్ వెంటనే మనిద్దరి మధ్య పొరపొచ్చాలు కలిగిస్తున్న ఈ వస్తువును పారేయండి అని అన్నాడు. “నేను పారేయనా?” అని అడిగాను. ‘పారేయండి’ అని అన్నారు. నేను దుర్భిణీ యంత్రాన్ని సముద్రంలో విసిరి వేశాను. దాని ఖరీదు సుమారు ఏడు పౌండ్లు, అయితే దాని విలువ దాని ఖరీదులో లేదు. దాని యెడ కేలన్‌బెక్‌కుగల వ్యామోహంలో వుంది. అయినా కేలన్‌బెక్‌కు ఎన్నడూ దుఃఖం కలగలేదు. ఆయనకు నాకు మధ్య యిలాంటి వ్యవహారాలు చాలా జరుగుతూ వుండేవి. వాటిలో యిది ఒకటి. నమూనాగా పాఠకులకు యీ విషయం తెలియజేశాను.

పరస్పర సంబంధాల వల్ల ప్రతిరోజు ఏదో క్రొత్త విషయం నేర్చుకొనేవారం. ఇద్దరం సత్యాన్వేషణకు కృషిచేస్తున్నాం. సత్యాన్ని పాటించడం వల్ల క్రోధం, స్వార్ధం, ద్వేషం మొదలుగాగలవి సహజంగా తగ్గిపోయాయి. అవి తగ్గకపోతే సత్యం గోచరించదు. రాగద్వేషాలతో నిండియున్న మనిషి, సరళ హృదయుడు. అయినప్పటికీ సత్యవాక్కులే పలుకుతూ వున్నప్పటికీ శుద్ధసత్యాన్ని దర్శించలేడు. శుద్ధమైన సత్యశోధన జరపడమంటే రాగద్వేషాదుల నుండి విముక్తి పొందడమే. యాత్రకు బయలుదేరినప్పుడు నేను చేసిన ఉపవాసం ముగిసి ఎన్నోరోజులు దాటలేదు. అందువల్ల నాకు పూర్తి శక్తి చేకూరలేదు. రోజూ డెక్ మీద పచార్లు చేసి ఆకలి పెంచుకోవడానికి, ఎక్కువ ఆహారం తీసుకోవడానికి, తిన్న ఆహారం జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేయసాగాను. ఇంతలో నా పిక్కల్లో నొప్పి ప్రారంభమైంది. ఇంగ్లాండు చేరిన తరువాత కూడా నొప్పి తగ్గలేదు. యింకా పెరిగింది. ఇంగ్లాండులో డాక్టర్ జీవరాజ్ మెహతాతో పరిచయం కలిగింది. ఉపవాసాన్ని, పిక్కలనొప్పిని గురించి వివరించి చెప్పాను. అంతా విని “మీరు కొద్ది రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకొనలేకపోతే కాళ్ళు పనిచేయలేని స్థితి ఏర్పడవచ్చు” అని ఆయన చెప్పాడు. ఉపవాసాలు చేసిన వ్యక్తి పోయిన శక్తిని త్వరగా పొందాలనే కోరికతో ఎక్కువ ఆహారం భుజించకూడదను విషయం అప్పుడు నాకు బోధపడింది. ఉపవాసం విరమించినప్పుడు ఎంతో జాగ్రత్తగా వుండి, సంయమం అలవర్చుకోవలసి వుంటుంది. మదిరా స్థావరం చేరినప్పుడు మహాయుద్ధం కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్నదని మాకు సమాచారం అందింది. మమ్మల్ని అక్కడ ఆపి వేశారు. పలుచోట్ల సముద్రంలో మందు పాతరలు పాతి పెట్టారని తెలిసింది. వాటిని తప్పించుకొని సౌదెంప్టన్ చేరడానికి రెండు రోజులు పట్టింది. ఆగష్టు నాల్గవ తేదీన యుద్ధ ప్రకటన వెలువడింది. ఆరవ తేదీన మేము ఇంగ్లాండుకు చేరాము.