సత్యశోధన/నాల్గవభాగం/36. ఉపవాసం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

36. ఉపవాసం

బాలురు, బాలికలు యిద్దరినీ నిజాయితీగా పోషించడం, వారికి విద్య గరపడం ఎంత కష్టమైన పనో నాకు రోజురోజుకూ బోధపడసాగింది. ఉపాధ్యాయుడుగా, సంరక్షకుడుగా వారి హృదయాల్లోకి ప్రవేశించాలి. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. వారి జీవిత సమస్యల్ని పరిష్కరించాలి. వారి యౌవ్వనవికాస తరంగాల్ని సరియైన మార్గానికి తరలించాలి. జైళ్లలో ఉన్న ఖైదీలు కొందరు విడుదలైనందున ఆశ్రమంలో కొద్దిమంది మాత్రమే మిగిలారు. వారంతా ఫినిక్స్‌వాసులు. అందువల్ల ఆశ్రమాన్ని ఫినిక్సుకు తీసుకుని వెళ్లాను. ఫినిక్సులో నాకు కఠినపరీక్ష జరిగింది. టాల్‌స్టాయ్ ఆశ్రమంలో మిగిలిన వారిని ఫినిక్సుకు జేర్చి నేను జోహాన్సుబర్గు వెళ్లాను. జోహాన్సుబర్గులో కొద్దిరోజులు ఉన్నానో లేదో ఇంతలో ఇద్దరు వ్యక్తులు భయంకరంగా పతనం చెందారను వార్త నాకు చేరింది. సత్యాగ్రహ సంగ్రామంలో ఎక్కడైనా వైఫల్యం కలిగితే నాకు ఇంత బాధకలిగించదు కాని యీ వార్త వినగానే నా మీద పిడుగు పడినట్లని పించింది. నా మనస్సుకు గట్టి దెబ్బ తగిలింది. ఫినిక్సుకు బయలుదేరాను. మి.కెలెన్‌బెక్ వెంటవస్తానని పట్టుబట్టారు. వారు నా దయనీయస్థితిని గ్రహించారు. వంటరిగా వెళ్ళనీయనని పట్టుబట్టారు. పతనవార్త వారి ద్వారానే నాకు అందింది.

త్రోవలో నా కర్తవ్యం ఏమిటా అని యోచించాను. ఎవరి సంరక్షణలో వుంటూ వ్యక్తులు చెడిపోతారో ఆ సంరక్షకులు కూడా కొంతవరకు అందుకు బాధ్యులే అని భావించాను. నా బాధ్యత కూడా నాకు బోధపడింది. గతంలో నా భార్య నన్ను హెచ్చరించింది కూడా. కాని సహజంగా అందరినీ నమ్మే మనిషిని గనుక ఆమె మాటల్ని నేను పట్టించుకోలేదు. అందుకు గాను నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయాన్ని అమలుపరిస్తే తప్పుజేసినవారు తమ తప్పేమిటో తెలుసుకుంటారని భావించాను. ఆ ప్రకారం నేను ఏడురోజులు ఉపవాసం చేయాలని నాలుగున్నర మాసాలు ఒక పూట భోజనం చేయాలని నిర్ణయించుకున్నాను. మి. కేలన్‌బెక్ నన్ను ఆపాలని ప్రయత్నించారు. కాని నేను ఒప్పుకోలేదు. చివరికి ఆయన నా నిర్ణయాన్ని ఒప్పుకుని తానుకూడా అలాగే చేస్తానని అన్నారు. నిర్మలమైన వారి ప్రేమను నేను కాదనలేక పోయాను. ఈ విధంగా నిర్ణయానికి వచ్చిన తరువాత నాకు బరువు తగ్గినట్లనిపించింది. మనస్సు కుదుటపడింది. దోషుల మీద కోపం తగ్గిపోయింది. వారిమీద కేవలం దయ మాత్రమే మిగిలింది. ఈ విధంగా రైల్లో మనస్సును శాంతపరచుకుని నేను ఫినిక్సు చేరాను. వివరాలన్నీ తెలుసుకున్నాను. నా ఉపవాసంవల్ల అందరికీ కష్టం కలిగినా వాతావరణం మాత్రం శుద్ధి పడిందని చెప్పగలను. పాపపు భయంకర స్వరూపం ఏమిటో అందరికీ బోధపడింది. విద్యార్థులకు, విద్యార్థినులకు, నాకు మధ్యగల సంబంధం గట్టిపడింది. కొంతకాలం తరువాత మరోసారి నేను 14 రోజులు ఉపవాసం చేయవలసి వచ్చింది. అందుకు ఊహించిన దానికంటే ఎక్కువ సత్ఫలితం చేకూరింది.

ఈ వ్యవహారం దృష్ట్యా ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి సంరక్షకుడు ఇలాగే చేయాలని మాత్రం నేను అనను. కొన్ని కొన్ని సందర్భాలలో యిట్టి ఉపవాసాదులకు అవకాశం కలదని చెప్పగలను. అయితే అందుకు వివేకం, అర్హత అవసరం. ఉపాధ్యాయునికి విద్యార్థికీ మధ్య శుద్ధమైన ప్రేమలేనప్పుడు విద్యార్థి చర్యవల్ల ఉపాధ్యాయుని హృదయానికి నిజమైన దెబ్బతగలనప్పుడు, విద్యార్థికి ఉపాధ్యాయుని గౌరవభావం లేనప్పుడు ఇట్టి ఉపవాసాదులు వ్యర్ధం. నష్టం కూడా కలిగించవచ్చు. ఏది ఏమైనా ఉపవాసాదులు వహించినా వహించకపోయినా ఇట్టి విషయాలలో ఉపాధ్యాయునికి బాధ్యత ఉండి తీరుతుందని నా నిశ్చితాభిప్రాయం. ఏడురోజుల ఉపవాసం, నాలుగున్నరమాసాల ఒంటిపూట భోజనవ్రతంవల్ల మాకెవ్వరికీ యిబ్బంది కలుగలేదు. నా పనియేదీ ఆగలేదు. మందగించలేదు. అప్పుడు నేను పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకున్నాను. అయితే ఆ తరువాత చేసిన 14 రోజుల ఉపవాస సమయంలో చివరి రోజుల్లో మాత్రం కష్టం కలిగింది. అప్పటికి రామనామస్మరణ యందలి మహిమను పూర్తిగా నేను గ్రహించలేదు కాబోలు. సహనశక్తి తగ్గింది. ఉపవాస సమయంలో నీరు బాగా త్రాగాలి అను విషయం నాకు తెలియదు. అందువల్ల కూడా ఉపవాస సమయంలో బాధకలిగింది. అంతకు పూర్వం చేసిన ఉపవాసాలు ప్రశాంతంగా సాగటంవల్ల 14 రోజుల ఉపవాసం గురించి తేలికగా వ్యవహరించాను. మొదటి ఉపవాససమయంలో కూనేగారి కటిస్నానం చేస్తూవున్నాను. 14రోజుల ఉపవాసం చేసినప్పుడు రెండుమూడు రోజుల తరువాత దానిని ఆపివేశాను. నీరు రుచించేదికాదు. నీళ్ళు త్రాగితే డోకు వచ్చినట్లుండేది. అందువల్ల నీళ్ళు త్రాగటం తగ్గించాను. దానితో గొంతు ఎండిపోయింది. బలహీనమైపోయాను. చివరిరోజుల్లో మాటకూడా మెల్లగా మాట్లాడవలసి వచ్చింది. కాని రాతపని మాత్రం చివరిరోజువరకు చేస్తువున్నాను. రామాయణాదులు చివరివరకూ వింటున్నాను. అన్ని విషయాల్లోను సలహాలు యిస్తూవున్నాను.