Jump to content

సత్యశోధన/నాల్గవభాగం/27. ఆహారంలో వివిధ ప్రయోగాలు

వికీసోర్స్ నుండి

27. ఆహారంలో వివిధ ప్రయోగాలు

మనోవాక్కాయాల ద్వారా బ్రహ్మచర్యవ్రతం ఎలా సాగించాలి అనేది ఒక యోచన అయితే సత్యాగ్రహ సమరానికి ఎక్కువ సమయం ఎలా మిగలాలి, హృదయ శుద్ధి అధికంగా ఎలా జరగాలి అనునది మరో యోచన. ఈ రెండు చింతలు లేక యోచనలు నన్ను ఆహారంలో ఎక్కువ మార్పులు చేయమని సంయమానికి అవి అవసరమని ప్రోత్సహించాయి. మొదట నేను ఆరోగ్యదృష్ట్యా ఆహారంలో మార్పులు చేసేవాణ్ణి. ఇప్పుడు ధార్మిక దృష్టితో చేయడం ప్రారంభించాను.

ఈసారి మార్పుల్లో ఉపవాసాలు, అల్పాహారాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. రుచులు మరిగిన జిహ్వ వాంఛల్ని రెచ్చగొడుతుంది. నాస్థితి కూడా అంతే. జననేంద్రియం మరియు స్వాదేంద్రియం మీద అధికారం సంపాదించుటకు నేను నానా అవస్థ పడవలసి వచ్చింది. ఈనాటికీ ఆ రెండిటిని పూర్తిగా జయించానని చెప్పలేను. నేను మొదటి నుండి అధికాహారిని. మిత్రులు నీవు సంయమంగా వున్నావని అనేవారు. దాన్ని నేను సంయమమని భావించలేదు. నామీద విధించుకున్న ఆ కొద్దిపాటి అంకుశాన్ని సడలనిచ్చి ఉంటే పశువుకంటే హీనంగా మారిపోయి వుండేవాణ్ణి. నష్టపడిపోయేవాణ్ణి. నా బలహీనతలు బాగా తెలుసుకున్నందువల్ల వాటి విషయమై చాలా జాగ్రత్తపడ్డాను. అందువల్లనే ఈ శరీరాన్ని ఇన్ని సంవత్సరాలనుండి నిలబెట్టి ఉంచగలిగాను. దానిచేత పని చేయించగలిగాను.

ఈ విధమైన జ్ఞానం సంపాదించి అట్టి వారి సాంగత్యం కూడా పొంది ఏకాదశి నాడు పండ్లు తిని ఉండటం, ఉపవాసం చేయడం ప్రారంభించాను. కృష్ణ జన్మాష్టమి మొదలుగా గల వ్రతాలు ప్రారంభించాను. అయితే పండ్లు తినడం, భోజనం చేయడం రెండిటిలో ఎక్కువ తేడా నాకు కనబడలేదు. పండ్లు తిండిగింజలు రెండిటి ద్వారా మనం పొందే ఆనందం ఒకే రకంగా ఉంటుంది. పండ్లు తినడం అలవాటు అయితే ఆనందం అధికంగా లభిస్తుంది. అందువల్ల రోజంతా ఉపవాసం చేయడమో లేక ఒక పూట భోజనం చేయడమో చేసి చూచాను. ప్రాయశ్చిత్తం నెపంతో కొన్ని పూటలు భోజనం మాని కూడా చూచాను.

దీనితో కొన్ని అనుభవాలు కలిగాయి. శరీరం ఎంత శుభ్రంగా ఉంటుందో అంతగా రుచియుందు కోరిక, ఆకలి పెరుగుతాయి. ఉపవాసాలు సంయమనానికేగాక, భోగాధిక్యతకు కూడా ఉపయోగపడతాయని తెలుసుకున్నాను. నాకేగాక నాతోబాటు ప్రయోగాలు చేసిన వారికి కూడా ఇదే విధమైన అనుభవం కలిగింది. శరీరాన్ని పుష్టిగా, తుష్టిగా వుంచుకోవడం, సంయమం అలవరుచుకోవడం, రుచుల వాంఛను జయించడం ఇవే నా లక్ష్యాలు. అందుకోసం తినే పదార్థాల్లో చాలా మార్పులు చేశాను. అసలు రసాస్వాదనం నీడలా మనిషిని సదా వెంబడిస్తూ ఉంటుంది. ఒక పదార్థం తినడం మానుకొని మరో పదార్థం పుచ్చుకోవడం ప్రారంభిస్తే అది ఎక్కువగా అలవాటవుతూ ఉంటుంది.

నా ప్రయోగాలలో కొంత మంది మిత్రులు కూడా పాల్గొంటూ ఉండేవారు. అట్టివారిలో హర్మన్ కేలన్ బెక్ ముఖ్యుడు. దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్రలో ఆయనను పాఠకులకు పరిచయం చేశాను. అందువల్ల ఈ ప్రకరణంలో ఆ విషయం మళ్లీ వ్రాయను. ఆయన కూడా నాతో బాటు అన్ని ప్రయోగాలు చేశారు. ఏకాదశి ఉపవాసం, రోజంతా ఉపవాసం, ఒక పూట ఉపవాసం మొదలుగాగలవన్నీ చేశాడు. యుద్ధం తీవ్రంగా సాగుతూ ఉన్నప్పుడు నేను వారి ఇంట్లో ఉండేవాణ్ణి. మేము చేసిన ప్రయోగాలను గురించి చర్చించుకొనేవారం. మార్పు చేసినప్పుడు ఆయన అధికంగా సంతోషం పొందేవాడు. అప్పుడు మా సంభాషణ తీయగా సాగుతూ ఉండేది. తప్పు అని అనిపించేది కాదు. కాని తరువాత అనుభవం గడిచినకొద్దీ ఆ విధమైన రసవత్తర సంభాషణ కూడా తగదని తెలుసుకున్నాను. మనిషి రసానందం కోసం ఏమీ తినకూడదని కేవలం శరీర పోషణ కోసమే తినాలనీ తేల్చుకున్నాను. ప్రతి ఇంద్రియం కేవలం శరీరం కోసం, శరీరం ద్వారా ఆత్మ సాక్షాత్కారం కోసం పనిచేస్తుంది. అప్పుడు అందలి రసానుభూతి తగ్గిపోతుంది. అప్పుడే ఇంద్రియాలు సహజంగా పనిచేస్తున్నాయని గ్రహించాలి. ఇట్టి సహజత్వం కోసం ఎన్ని ప్రయోగాలు చేసినా తక్కువేనని మనం తెలుసుకోవాలి. ఆ కృషిలో శరీరాల్ని ఆహుతి చేయవలసి వచ్చినా వెనుకాడకూడదని గ్రహించాలి. ఇప్పుడు అంతా ఉల్టా వ్యవహారమే నడుస్తున్నది. నాశనమై పోయే శరీరం యొక్క శోభను పెంచడానికి, దాని వయస్సును పెంచడానికి ఇతర ప్రాణుల్ని బలిచేస్తున్నాం. అందువల్ల శరీరం, ఆత్మ రెండూ హూనమైపోతాయి. ఒక వ్యాధి వస్తే దాన్ని నయం చేసుకునేందుకు ప్రయత్నించి రుచులు మరిగి, క్రొత్త రోగాల్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. భోగశక్తిని కూడా పోగొట్టుకుంటాం. ఇదంతా మన కండ్ల ఎదుట జరుగుతూ ఉన్నది. మనం చూచి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నాం. కండ్లు మూసుకుంటున్నామన్నమాట.

ఆహార పదార్థాల మార్పును గురించి వివరించాను. అందలి అర్థాన్ని పాఠకులు గమనించాలి. ఆ దృష్టితో వాటి ఉద్దేశ్యం, వాటి వెనుక గల యోచనా సరళిని వివరించడం అవసరం కదా! అందుకే ఇంత వివరం వ్రాశాను.