Jump to content

సత్యశోధన/ఐదవభాగం/5. బాధాకరమైన మూడోతరగతి ప్రయాణం

వికీసోర్స్ నుండి

5. బాధాకరమైన మూడోతరగతి ప్రయాణం

బర్ద్వాన్ చేరిన తరువాత మేము మూడో తరగతి టికెట్లు తీసుకోవాలి. చాలా యిబ్బంది కలిగింది. ‘మూడో తరగతి ప్రయాణీకులకు ముందుగా టికెట్లు యివ్వం’ అని అన్నారు. స్టేషను మాస్టరును కలుద్దామని వెళ్లాను. ఆయనను కలుసుకోనిస్తారా? ఎవరో దయతో స్టేషన్ మాస్టరును చూపించారు. ఆయన దగ్గరకు వెళ్ళాను. ఆయన కూడా ఆ సమాధానమే యిచ్చాడు. కిటికీ తెరిచిన తరువాత టికెట్లు తీసుకుందామని వెళ్ళాను. బలంగా వున్నవారంతా తోసుకొని ముందుకు వెళ్లి టికెట్లు తీసుకుంటున్నారు. నాబోటి వాళ్లను వెనక్కి నెట్టివేస్తున్నారు. చివరికి టికెట్లు దొరికాయి. బండి వచ్చింది. అక్కడ కూడా ఇదే తంతు. బలిష్టులు ఎక్కుతున్నారు. కూర్చున్నవారికీ, ఎక్కినవారికి ద్వంద్వయుద్ధం సాగుతున్నది. తోపుళ్లు నెట్టుళ్లు అమోఘంగా సాగుతున్నాయి. నాబోటివాడు తట్టుకోగలడా? మేము ముగ్గురం అటుయిటు పరుగులు ప్రారంభించాం. ప్రతిచోట “జాగాలేదు” అన్నమాటే వినబడుతున్నది. నేను గార్డు దగ్గరికి వెళ్లాను. “జాగా దొరికితే ఎక్కు లేకపోతే తరువాత బండిలోరా” అని ఆయన అన్నారు. ఏం చేయాలో తోచలేదు. మగన్‌లాలును ఏదోవిధంగా బండి ఎక్కమని చెప్పాను. భార్యతో సహా నేను మూడో తరగతి టిక్కెట్లతో ఇంటరు పెట్టెలోకి ఎక్కాను. గార్డు నన్ను చూచాడు. అసన్‌సోల్ స్టేషనులో బండి ఆగింది. గార్డు అదనపు రేటు వసూలు చేసేందుకై నా దగ్గరకు వచ్చాడు. ‘నాకు చోటు చూపించడం మీ కర్తవ్యం. చోటు దొరక్క నేను యిక్కడ కూర్చున్నాను. మూడో తరగతిలో చోటు చూపించండి వెళతాను’ అని అన్నాను. ‘నీతో తర్కం నాకు అనవసరం. నీకు చోటు చూపించడం నా పని కాదు. డబ్బు లేకపోతే బండి దిగు’ అని గద్దించాడు గార్డు. నేను పూనా వెళ్లాలి. గార్డుతో తగాదా పడటం అనవసరమనిపించి డబ్బు చెల్లించివేశాను. అతడు పూర్తిగా పూనాదాకా ఇంటరు చార్జీ వసూలుచేశాడు. నాకు యిది అన్యాయమనిపించింది. ఉదయానికి ముగల్‌సరాయి చేరాము. మగన్‌లాలు మూడోతరగతిలో చోటు సంపాదించాడు. ముగల్‌సరాయిలో నేను కూడా మూడో తరగతిలోకి మారాను. టికెట్టు కలెక్టరుకు విషయమంతా చెప్పాను. అతణ్ణి ఒక ధృవీకరణ పత్రం వ్రాసి యిమ్మని కోరాను. అతడు యివ్వనని భీష్మించాడు. నేను రైల్వే అధికారికి జాబు వ్రాశాను. “ధృవీకరణ పత్రం లేనిదే అదనంగా వసూలుచేసిన సొమ్ము తిరిగి చెల్లించడానికి వీలులేదు. అయినా మీకు సొమ్ము చెల్లిస్తున్నాము. బర్ద్వాన్ నుండి ముగల్‌సరాయి వరుకు మాత్రం ఇంటరు తరగతి సొమ్ము చెల్లించబడదు” అంటూ సమాధానం అందింది.

ఆ తరువాత మూడో తరగతి ప్రయాణానికి సంబంధించి నాకు కలిగిన అనుభవాలు కోకొల్లలు. అన్నీ రాస్తే పెద్ద గ్రంధం అవుతుంది. అవకాశం చిక్కినప్పుడు వేరు వేరు ప్రకరణాల్లో కొన్ని అనుభవాలను సందర్భాన్ని బట్టి వివరిస్తాను. శారీరకంగా శక్తిలేనందున నా మూడో తరగతి ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్వే అధికారుల దౌర్జన్యం, అవమానకరమైన వారి ప్రవర్తనా తీరు వర్ణనాతీతం. యిటు ప్రయాణీకుల ప్రవర్తన కూడా అంతకంటే ఘోరమని చెప్పక తప్పదు. ప్రయాణీకుల మూర్ఖత్వం, మురికి, స్వార్ధం, అజ్ఞానం అత్యధికం. తమ తప్పుల్ని వారు గ్రహించరు. తాము చేస్తున్న పని రైటేనని వారు భావిస్తారు. సంస్కారం కలిగిన చదువుకున్న వాళ్లు వారి చర్యల్ని సరిదిద్దేందుకు ప్రయత్నించరు. అలసి సొలసిన మేము కళ్యాణ్ జంక్షను చేరాం. స్నానం చేద్దామని వెళ్లి స్టేషనులో గల పంపు నీళ్లతో మేమిద్దరం స్నానం చేశాం. భార్య స్నానం ఎట్లాగా అను యోచిస్తూ వుండగా భారత్ సేవక్ సమాజ కార్యకర్త శ్రీ కాల్ మమ్మల్ని గుర్తించాడు. ఆయన కూడా పూనా వస్తున్నాడు. సెకండ్ క్లాసులో గల స్నానాల గదిలో ఆమెకు స్నానం ఏర్పాటుచేస్తానని చెప్పాడు. అట్టి సౌకర్యం పొందుటకు నేను సంకోచించాను. నిజానికి సెకండు క్లాసు ప్రయాణీకుల స్నానాల గదిలో స్నానం చేసే హక్కు నా భార్యకు లేదు కదా! అయినా నేను వద్దనకుండా మౌనం వహించాను. సత్యపూజారి యిలా చేయకూడదు. స్నానం కోసం అక్కడికి వెళతానని ఆమె కోరలేదు. భర్త అనే మోహంతో కూడిన స్వర్ణపాత్ర సత్యాన్ని మరుగున పడవేసిందన్నమాట.