సత్యశోధన/ఐదవభాగం/6. నా ప్రయత్నం
6. నా ప్రయత్నం
పూనా చేరాం. దహన కర్మలన్నీ పూర్తి అయ్యాయి. అంతా సొసైటీని గురించి ఏం చేయడమా అని ఆలోచనలో పడ్డాం. నేను సొసైటీలో చేరాలా వద్దా అను మీమాంసలో పడ్డాను. నామీద పెద్ద బరువు పడినట్టనిపించింది. గోఖలేగారు జీవించియుంటే నేను సొసైటీలో చేరవలసిన అవసరం లేదు. నేను గోఖలేగారి ఆదేశానుసారం నడపవలసినవాణ్ణి. ఆవిధంగా చేయడం నాకు యిష్టం. భారతదేశమనే తుఫానుతో నిండిన సముద్రంలో దూకిప్పుడు నాకు సహాయం చేసేవారు అవసరం. గోఖలేవంటి సహాయకుని నీడన సురక్షితంగా వున్నాను. అట్టి గోఖలే యికలేరు. అందువల్ల వారి సొసైటీలో చేరడం అవసరమని అనిపించింది. గోఖలే ఆత్మ కూడా దీన్నే కోరుతున్నదని అనిపించింది. నేను గట్టిగా అందుకు పూనుకున్నాను. అప్పుడు సొసైటీ మెంబర్లంతా పూనాలోనే ఉన్నారు. వారికి నచ్చచెప్పి నా విషయంలో వారికి గల సందేహాల్ని తొలగించేందుకు ప్రయత్నం చేయసాగాను. మెంబర్లలో అభిప్రాయ భేదం కనబడింది. ఒక వర్గంవారు చేర్చుకోవాలని, మరోవర్గం వారు చేర్చుకోవద్దని భావిస్తున్నారు. యిరువర్గాలవారికీ నా యెడ ప్రేమ వున్నది. అయితే నామీదగల ప్రేమ కంటే కొందరికి సొసైటీ మీద మక్కువ ఎక్కువగా వున్నదని అనిపించింది. మా చర్యలు సిద్ధాంతపరంగా సాగినా ఎంతో మధురంగా వున్నాయి. వ్యతిరేకించిన వారి తర్కం ప్రకారం నా దృక్పధానికి సొసైటీ దృక్పధానికి తూర్పు పడమరలంత వ్యత్యాసం వున్నదని తేలింది. గోఖలేగారు ఏ లక్ష్యాలతో సొసైటీని స్థాపించారో, నేను అందు చేరితే ఆ లక్ష్యాలు దెబ్బతింటాయని వారి భావమని తేలింది. చాలా సేపు చర్చించి మేము విడిపోయాము. నిర్ణయం మరో సమావేశంలో చేయాలని నిర్ణయించారు.
ఇంటికి చేరి ఆలోచనా సాగరంలో పడ్డాను. మెజారిటీ ఓట్లతో నేను సొసైటీలో చేరడం సబబా? అది గోఖలే గారి యెడ నాకు గల నిజాయితీ అని అనిపించుకుంటుందా? నాకు వ్యతిరేకంగా ఓట్లు పడితే సొసైటీ చీలికకు నేను కారణభూతుడను కానా? బాగా యోచించిన మీదట, నన్ను సొసైటీలో చేర్చుకునేందుకు అందరూ అంగీకరిస్తేనే అందు చేరడం మంచిదని, కొందరు వ్యతిరేకించినా అందు చేరడం సొసైటీ క్షేమం దృష్ట్యా మంచిది కాదని భావించాను. గోఖలేగారి యెడ సొసైటీ సభ్యుల యెడ నేను చూపవలసిన విధానం అదేనను నిర్ణయానికి వచ్చాను. అంతర్వాణి యీ విధంగా చెప్పిన వెంటనే నేను శాస్త్రిగారికి జాబు వ్రాసి నాకోసం మళ్లీ సమావేశం ఏర్పాటు చేయవద్దని కోరాను. నా నిర్ణయం వ్యతిరేకులకు నచ్చింది. ధర్మసంకటంలో పడవలసిన అవసరం వారికి కలుగకుండా పోయింది. వారికి నా యెడగల ప్రేమ యింకా అధికమైంది. సొసైటీలో చేరుటకు పంపిన దరఖాస్తు తిరిగి తీసుకోవడం వల్ల నేను సొసైటీ సభ్యునిగా చేరినట్లే అయింది.
తరువాత నేను సొసైటీలో చేరకపోవడమే మంచిదని అనుభవంలో తేలింది. కొందరు నన్ను చేర్చుకోవద్దని తెలిపిన విషయాలు యదార్ధమైనవే. వారికి నాకు సిద్ధాంతరీత్యా తేడా వున్నమాట నిజం. అభిప్రాయ భేధం ఏర్పడినప్పటికీ మాకు గల ఆత్మ సంబంధం ఎన్నడూ చెక్కుచెదరలేదు. మేము మిత్రులంగానే వున్నాము. సొసైటీ స్థలం నా దృష్టిలో తీర్ధక్షేత్రమే. లౌకిక దృష్ట్యా నేను సొసైటీ మెంబరుగా చేరలేదు కాని ఆధ్యాత్మిక దృష్ట్యా నేను మెంబరుగా చేరినట్లే. వాస్తవానికి లౌకిక సంబంధం కంటే ఆధ్యాత్మిక సంబంధం గొప్పది కదా! ఆధ్యాత్మికత్వం లేని లౌకిక సంబంధం ప్రాణం లేని దేహంతో సమానమేకదా!