సత్యశోధన/ఐదవభాగం/4. శాంతినికేతనం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

4. శాంతినికేతనం

రాజకోటనుండి శాంతినికేతనం వెళ్లాను. అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రేమ జల్లులతో నన్ను తడిపివేశారు. స్వాగత విధానంలో సాదాతనం, కళ, ప్రేమ మూడింటి సుందర సమన్వయం కనబడింది. అక్కడే కాకాసాహెబ్ కాలేల్కర్‌ను మొదటిసారి కలుసుకున్నాను. అందరూ కాలేల్కరును కాకాసాహబ్ అని ఎందుకంటారో నాకప్పుడు తెలియదు. కాని తరువాత తెలిసింది. ఇంగ్లాండులో నేను వున్నప్పుడు అక్కడ వున్న కేశవరావు దేశాపాండే బరోడా ప్రాంతంలో గంగానాధ విద్యాలయం నడుపుతూ వుండేవారు. వారికి గల భావాల్లో విద్యాలయంలో పనిచేసేవారంతా ఒకే కుటుంబీకులుగా వుండాలన్నది ఒకటి. ఆ ఉద్దేశ్యంతో అక్కడి ఉపాధ్యాయులందరికీ ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ పద్ధతిలో కాలేల్కరు కాకా (పెదతండ్రి), అయ్యారు. ఫడకే మామ అయ్యాడు. హరిహరశర్మ అన్న అయ్యాడు. తదితరులకు కూడా తగిన పేర్లు లభించాయి. కాలేల్కర్ అనుచరుడు ఆనందనాధ్ (స్వామి), మామ మిత్రుడు పట్వర్ధన్ (అప్ప) పేర్లతో యీ కుటుంబంలో తరువాత చేరారు. యీ కుటుంబానికి చెందిన ఆ అయిదుగురు నా అనుచరులైనారు. దేశపాండే “సాహబ్” పేరట ప్రసిద్ధికెక్కారు. సాహబ్ గారి విద్యాలయం మూతబడగానే ఆ అయిదుగురు చెల్లాచెదురయ్యారు. అయినా తమ మధ్య నెలకొన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని వీరు వదులుకోలేదు. కాకా సాహబ్ పలుచోట్లకు వెళ్లి అనుభవం గడిస్తూ శాంతినికేతనంలో చేరారు. ఆ కోవకు చెందిన చింతామణి శాస్త్రి అను మరొకరు కూడా ఇక్కడే వున్నారు. వీరిద్దరు సంస్కృతం బోధిస్తూ వుండేవారు.

శాంతినికేతనంలో మా అనుచరులకు బస విడిగా ఏర్పాటుచేశారు. అక్కడ మగన్‌లాల్ గాంధీ వారి మంచి చెడ్డలు చూస్తూ వున్నాడు. ఫినిక్సు ఆశ్రమంలో పాటించిన నియమనిబంధనల్ని తాను పాటిస్తూ యితరుల చేత పాటింప చేస్తూ వున్నాడు. తన జ్ఞానం, ప్రేమ, కష్టపడి పనిచేసే మనస్తత్వంతో శాంతి నికేతనంలో సువాసనలు ఆయన విరజిమ్మటం గమనించాను. అక్కడ ఆండ్రూస్ వున్నారు. పియర్సన్ వున్నారు. జగదానందబాబు, నేపాల్ బాబు, సంతోషబాబు, క్షితిమోహనబాబు, నగేన్‌బాబు, శరద్‌బాబు, కాళీబాబు మొదలగువారితో నాకు పరిచయం ఏర్పడింది.

నా స్వభావం ప్రకారం నేను విద్యార్థులతోను, ఉపాధ్యాయులతోను కలిసిపోయి కాయకష్టం గురించి చర్చ ప్రారంభించాను. జీతం తీసుకొని పనిచేసే వంటవానికి బదులు ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి వంటపని చేసుకుంటే మంచిది గదా అని నాకు అనిపించింది. అప్పుడు భోజనశాల ఆరోగ్యకరంగాను, పరిశుభ్రంగాను. ఆదర్శవంతంగాను వుంటుంది. విద్యార్థులు స్వయంపాకాన్ని గురించి ప్రత్యక్ష పాఠం నేర్చుకోగలుగుతారు. యీ విషయం ఉపాధ్యాయులకు చెప్పాను. యిద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు తల ఊపారు. కొంతమందికి యీ ప్రయోగం నచ్చింది. విద్యార్థులకు క్రొత్త విషయం సహజంగానే నచ్చుతుంది. వెంటనే వారంతా ఉత్సాహంతో ముందుకు వచ్చారు. గురుదేవుని దాకా యీ విషయం వెళ్లింది. వారు కొద్ది సేపు యోచించి ఉపాధ్యాయులు అంగీకరిస్తే అమలు పరచడం మంచిదేనని అన్నారు. ఇది క్రొత్త ప్రయోగం. స్వరాజ్యప్రాప్తికి తాళంచెవి యిందు నిహితమై వున్నది అని గురుదేవులు విద్యార్థులకు చెప్పారు.

పియర్సన్ యీ ప్రయోగాన్ని విజయవంతం చేయుటకు అపరిమితంగా కృషి చేశారు. వారికి యీ పని బాగా నచ్చింది. కూరలు తరిగేందుకు ఒక బృందం ఏర్పడితే తిండిగింజలు శుభ్రం చేసేందుకు మరో బృందం ఏర్పడింది. వంట యింటి పారిశుద్ధ్యానికి నగేన్‌బాబు ఆధ్వర్యంలో కొందరు పూనుకున్నారు. పారలు పుచ్చుకొని వారంతా వంటి యింటిని పరిసరాల్ని బాగుచేస్తుంటే నాహృదయం సంతోషంతో పొంగిపోయింది. ఇది దరిదాపు వందమందికి పైగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక్కసారిగా ఠపీమని చేసేపని కాదు. కొందరికి అలసట కలిగింది. కాని చేసే పనికి ఆయన పూనుకున్నారు. అంట్లు తోముతున్న వారి అలసటను పోగొట్టి వారికి ఆహ్లాదం కలిగించేందుకై కొందరు సితారు వాయిస్తూ వుండేవారు. మొత్తం పనులన్నీ స్వయంగా చేసేందుకు విద్యార్థులు పూనుకున్నారు.

శాంతినికేతం తేనెటీగల తుట్టెలా తళతళ మెరిసిపోయింది. ఇటువంటి మార్పులు ఆగిపోకూడదు. ఫినిక్సు ఆశ్రమంలో మేము ప్రారంభించిన భోజనశాల స్వయంపోషకమై మంచిగా సాగింది. అందు సాదా భోజనం లభిస్తూ వుండేది. మసాలాల వాడకం తగ్గించి వేశాము. ఆవిరితో అన్నం, పప్పు, కూరలు గోధుమతో తయారయ్యే వస్తువులు తయారయ్యేవి.

తరువాత శాంతినికేతనంలో కొన్ని కారణాల వల్ల యీ ప్రయోగం ఆగిపోయింది. ప్రపంచ ఖ్యాతి బడసిన యీ సంస్థలో కొద్దిరోజుల పాటు యీ ప్రయోగం సాగినా సంస్థకు ఎంతో మేలే చేకూరిందని చెప్పవచ్చు. ఇంకా కొద్దిరోజులు శాంతినికేతనంలో వుందామని అనుకున్నాను. కాని సృష్టికర్త నన్ను అక్కడ వుండనీయలేదు. వారం రోజులు మాత్రమే వున్నాను. యింతలో పూనాలో గోఖలేగారు పరమపదించారని సమాచారం అందింది. శాంతినికేతనం విచారసాగరంలో మునిగిపోయింది. తమ విచారం ప్రకటించేందుకు అంతా నా దగ్గరకు రాసాగారు. దేవళంలో ప్రత్యేక సభ జరిగింది. వాతావరణం గంభీరంగా వుంది. ఆనాడు సాయంత్రమే నేను పూనాకు బయలుదేరాను. నా భార్య మరియు మగన్‌లు నాతోబాటు వున్నారు. మిగతావారంతా శాంతినికేతనంలో వుండిపోయారు. ఆండ్రూస్ బర్ద్వాను దాకా వచ్చారు, “హిందూ దేశంలో సత్యాగ్రహం చేయవలసి వస్తుందని మీరు భావిస్తున్నారా? అలా భావించితే ఎప్పుడు జరుగుతుందో ఊహిస్తున్నారా?” అని నన్ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జవాబివ్వడం కష్టం. ఒక్క ఏడాదిపాటు దేశమందంతట పర్యటించమని, ప్రజా సమస్యలను గురించి స్వయంగా తెలుసుకొని యోచించమని, నిర్ణయాలను మాత్రం వెంటనే ప్రకటించవద్దని గోఖలే చెప్పారు. సరేనని వారికి మాట యిచ్చాను. ఆ మాట మీద నిలబడి వుంటాను. ఆ తరువాత అవసరమైతేనే నా అభిప్రాయం వెల్లడిస్తాను. అందువల్ల అయిదు సంవత్సరాల వరకు సత్యాగ్రహం చేయవలసిన అవసరం కలగదని భావిస్తున్నాను” అని చెప్పాను.

ఇక్కడ మరో విషయం పేర్కొనడం మంచిది “హింద్‌స్వరాజ్” లో నేను ప్రకటించిన విషయాలను గోఖలేగారు ఎగతాళిచేస్తూ ఒక్క ఏడాదిపాటు దేశమంతా తిరిగిచూస్తే మీభావాలు వాటంతట అవే త్రోవకు వస్తాయి అని అన్నారు.