సత్యశోధన/ఐదవభాగం/3. అది బెదిరింపా?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

3. అది బెదరింపా?

మా అన్నగారు చనిపోయారు. వితంతువు అయిన మా వదినగారు తదితర కుటుంబీకులను కలుసుకునేందుకు రాజకోట మరియు పోర్‌బందర్ వెళ్లాను. దక్షిణ ఆఫ్రికాలో జరిగిన సత్యాగ్రహ సంగ్రామ సమయమప్పుడు నేను నా దుస్తుల్ని గిరిమిటియా కూలీల కనుగుణ్యంగా సాధ్యమైనంత వరకు మార్చుకున్నాను. విదేశాలలో కూడా ఇంట్లో ఆ డ్రస్సే వేసుకునేవాణ్ణి. మన దేశం వచ్చిన తరువాత కాఠియావాడ్ దుస్తులు ధరించాలని భావించాను. కాఠియావాడ్ డ్రస్సు నా దగ్గర వున్నది. ఆ డ్రస్సుతోనే బొంబాయిలో దిగాను. చొక్కా, అంగరఖా, ధోవతి తెల్లని తలపాగా, యిదీ ఆ డ్రస్సు. స్వదేశపు మిల్లుల యందు తయారైన బట్టతో ఆ దుస్తులు తయారయ్యాయి. మూడో తరగతిలో బొంబాయినుండి కాఠియావాడుకు వెళ్లాలి. తలపాగా అంగరఖా రెండూ జంజాటంగా వున్నాయి. అందువల్ల చొక్కా, ధోవతి, పది అణాలకు లభించిన కాశ్మీరు టోపీ ధరించాను. యిట్టి దుస్తులు ధరించే వాణ్ణి బీదవాడనే అంతా భావిస్తారు. అప్పుడు బీరంగావ్, బడవాఫణ్‌లో ప్లేగువ్యాధి వ్యాపించివుంది. ఆరోగ్యాధికారి నా చెయ్యి పట్టుకు చూచాడు. వేడిగా వుంది. అందువల్ల రాజకోటలో డాక్టరును కలవమని ఆదేశించి నా పేరు రాసుకున్నాడు.

బొంబాయి నుండి ఎవరో తంతి పంపగా బఢవాణ్ స్టేషనుకు అక్కడి ప్రసిద్ధ ప్రజాసేవకుడు దర్జీ మోతీలాల్ నన్ను కలుసుకునేందుకు వచ్చాడు. ఆయన బీరంగావ్ లో టోల్‌గేటు దగ్గర జరుగుతున్న పన్నుల వసూళ్లను గురించి, ప్రజలకు కలుగుతున్న యిబ్బందుల్ని గురించి నాకు చెప్పాడు. జ్వర తీవ్రతవల్ల నాకు మాట్లాడాలనే కోరిక కలుగలేదు. క్లుప్తంగా “మీరు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా వున్నారా?” అని అడిగాను.

ఆలోచించకుండా ఠపీమని వెంటనే జవాబిచ్చే పలువురు యువకులవలె ఆయన కూడా వెళతానంటాడని అనుకున్నాను. కాని ఆ విధంగా ఆయన అనలేదు. స్థిరమైన నిర్ణయం వెల్లడించే వ్యక్తిలా “మేము తప్పక జైలుకు వెళతాము. మీరు మాకు మార్గం చూపించాలి. కాఠియావాడ్ వాసులం గనుక మీ మీద మాకు అధికారం వున్నది. యివాళ మిమ్మల్ని మేము ఆపం. తిరిగి వెళుతున్నప్పుడు బడవాణ్‌లో ఆగండి. యిక్కడి యువకుల కార్యక్రమాలు, వాళ్ల ఉత్సాహం చూచి మీరు ఆనందిస్తారు. మీరు మీ సైన్యంలో మమ్మల్ని స్వేచ్ఛగా చేర్చుకోవచ్చు” అని అన్నాడు.

మోతీలాలును పరిశీలించి చూచాను. అతని అనుచరులు అతణ్ణి గురించి “ఈ సోదరుడు దర్జీ వృత్తి చేపట్టినా ఎంతో నేర్పరి. రోజూ ఒక గంట సేపు కష్టపడి పనిచేసి ప్రతి నెల తన ఖర్చుల కోసం 15రూపాయలు మాత్రం సంపాదించుకుంటాడు. మిగతా సమయమంలో ప్రజల సేవకు వినియోగిస్తాడు. చదువుకున్న మా బోంట్లకు మార్గం చూపించి మా చేత పని చేయిస్తున్నాడు” అని చెప్పారు.

ఆ తరువాత మోతీలాలును దగ్గరగా చూచే అవకాశం నాకు లభించింది. ఆయనను గురించి వాళ్లు చెప్పిన మాటలన్నీ నిజమేనని అందు అతిశయోక్తి లేదని గ్రహించాను. సత్యాగ్రహ ఆశ్రమం స్థాపించినప్పుడు ప్రతినెల కొద్దిరోజులు ఆయన అక్కడ వుండేవారు. బీరం గ్రామాన్ని గురించి నాకు రోజూ చెబుతూ వుండేవాడు. ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాలు సహించలేకపోయేవాడు. యీ మోతీలాలును నిండు యౌవ్వనంలో జబ్బు ఎత్తుకు పోయింది. బడవాణ్ శూన్యమైపోయింది.

రాజకోటచేరి మరునాడు ఉదయం ఆరోగ్యశాఖ అధికారి ఆదేశం ప్రకారం ఆసుపత్రికి వెళ్లాను. అక్కడి వారికి నేను పరిచితుణ్ణే. అందువల్ల నన్ను చూచి డాక్టర్లు సిగ్గుపడ్డారు. ఆవిధంగా ఆదేశించిన అధికారి మీద కోపం తెచ్చుకోసాగారు. నాకు మాత్రం దోషం కనబడలేదు. అతడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. అతడు నన్ను ఎరుగడు. ఒక వేళ నేనెవరినో తెలుసుకున్నా తనకు యివ్వబడ్డ ఆజ్ఞను పాలించడం అతని కర్తవ్యమేకదా! అంతా పరిచితులు కావడం వలన రాజకోటలో నన్ను ఆసుపత్రిలో వుంచకుండా యింటికి పంపి మా యింటిదగ్గరే నన్ను పరీక్షించారు. మూడో తరగతి ప్రయాణికుల్ని యీ విధంగా పరీక్షిస్తూ వుండటం వలన ఆ తరగతిలో ప్రయాణించే గొప్ప వాళ్లకు కూడా అట్టి పరీక్ష జరుగవలసిందే. అధికారులు కూడా పక్షపాతం వహించకూడదని నా అభిప్రాయం. అయితే అధికారులు మూడో తరగతి ప్రయాణీకుల్ని మనుష్యులుగా పరిగణించక జంతువులుగా పరిగణిస్తుంటారు. సంబోధించే తీరు చాలా అసభ్యంగా వుంటుంది. మూడో తరగతి ప్రయాణీకులు మాట్లాడేందుకు వీలులేదు. తర్కించేందుకు వీలు లేదు. అధికారులు చప్రాసీల్లా వాళ్లను చూస్తూవుంటారు. వాళ్లను నిలబెట్టి వేధిస్తారు. టిక్కట్టు తీసుకొని తిరిగి యివ్వక బాధిస్తారు? యీ బాధలన్నీ నేను స్వయంగా అనుభవించాను. యీ పరిస్థితుల్లో మార్పురావాలంటే చదువుకున్న వాళ్లు బీదవాళ్లుగా మారి, మూడో తరగతిలో ప్రయాణిస్తూ, ఆ ప్రయాణీకులకు చేకూరని ఏ సౌకర్యమూ తాముకూడా పొందకుండా అక్కడ కలిగే యిబ్బందుల్ని, అన్యాయాల్ని, బీభత్సాన్ని గట్టిగా ఎదిరించి వాటిని తొలగించాలి.

కాఠియావాడ్‌లో పర్యటించిన ప్రతిచోట జనం బీరం గ్రామంలో పన్ను వసూలు చేస్తున్న తీరు పట్ల అసమ్మతి తెలియజేశారు. వివరమంతా తెలుసుకొని లార్డ్ విల్లింగ్టన్ లోగడ నాకు యిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. కాగితాలన్నీ చదివాను. సత్యం గ్రహించాను. బొంబాయి ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను. సెక్రటరీని కలిశాను. ఆయన అంతా విని విచారం వెల్లడించి ఢిల్లీ ప్రభుత్వం యీ విషయమై చూపుతున్న తీరును వివరించాడు. “మా చేతుల్లో వుంటే యీటోలుగేటును ఎప్పుడో ఎత్తి వేసే వాళ్లం. కాని అది తిన్నగా భారత ప్రభుత్వానికి సంబంధించినది కనుక మీరు వారి దగ్గరకు వెళ్లడం మంచిది” అని సెక్రటరీ చెప్పాడు. నేను భారత ప్రభుత్వానికి జాబు వ్రాశాను. ఉత్తరం అందినట్లు తెలియజేయటమే తప్ప వారేమీ చర్య గైకొనలేదు. లార్డ్ చేమ్స్‌ఫర్డును కలుసుకునే అవకాశం లభించినప్పుడు అనగా రెండు సంవత్సరాల తరువాత యీ వ్యవహారం మీద చర్య తీసుకున్నాడు. నేను యీ విషయం చెప్పగా లార్డ్ చేమ్స్‌ఫర్డు నివ్వెరబోయాడు. ఆయనకు బీరం గ్రామాన్ని గురించి ఏమీ తెలియదు. నా మాటలు ఓపికగా విని ఫోను చేసి అందుకు సంబంధించిన కాగితాలు వెంటనే తెప్పించుకున్నాడు. మీరు చెప్పిన విషయాలపై అధికారులు వ్యతిరేకించకపోతే తప్పక పన్నుల వసూళ్లను నిలిపి వేస్తానని మాట యిచ్చాడు. తరువాత కొద్ది రోజులకే పన్ను వసూళ్లు రద్దు చేశారని పత్రికల్లో చదివాను.

ఈ విజయం సత్యాగ్రహ విజయానికి పునాది అని భావించాను. అందుకు కారణం పున్నది. బొంబాయి ప్రభుత్వ సెక్రటరీ బీరం గ్రామ పన్నును గురించి మాట్లాడుతూ మీరు యీ విషయమై బగ్‌సరాలో చేసిన ప్రసంగపాఠం నాదగ్గర వున్నది. అందు మీరు సత్యాగ్రహం విషయం కూడా ఎత్తారు అని అంటూ “మీరు చేసింది బెదిరింపు కాదా? శక్తి సామర్థ్యాలుగల ఏ ప్రభుత్వమైనా యిలాంటి బెదిరింపులకు తలవంచుతుందా?” అని ఆయన నన్ను ప్రశ్నించాడు.

ఆయన ప్రశ్నకు సమాధానం యిస్తూ “ఇది బెదిరింపు కాదు. ప్రజాశిక్షణ, ప్రజలకు వారి కష్టాల్ని తొలగించుకునేందుకు అవలంబించవలసిన చర్యలను గురించి చెప్పడం నా ధర్మం. స్వాతంత్ర్యం కోరే ప్రజల దగ్గర తమ రక్షణకు అవసరమైన సాధనాలు కూడా వుండటం అవసరం. సాధారణంగా యిట్టి సాధనాలు హింసాపూరితంగా వుంటాయి. కాని సత్యాగ్రహం పూర్తిగా అహింసతో కూడిన సాధనం. దాని ఉపయోగాన్ని గురించి, దాని ప్రయోగాన్ని గురించి తెలియజేయడం నా కర్తవ్యం. ఆంగ్ల ప్రభుత్వం శక్తివంతమైనది. అందు నాకు సందేహం లేదు. అయితే సత్యాగ్రహం సర్వోన్నతమైన ఆయుధం. యీ విషయమై నాకెట్టి సందేహమూ లేదు” అని చెప్పాడు. ఆ సెక్రటరీ చతురుడు. “మంచిది చూద్దాం” అని అంటూ తల ఊపాడు.