సత్యశోధన/ఐదవభాగం/43. నాగపూరులో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

43. నాగ్‌పూర్‌లో

జాతీయ కాంగ్రెసు ప్రత్యేక సమావేశంలో అంగీకరించబడ్డ సహాయ నిరాకరణకు సంబంధించిన తీర్మానాన్ని నాగపూరులో జరుగనున్న వార్షిక మహాసభలో ఆమోదింపజేయాలి. కలకత్తాలో వలెనే నాగపూరులో కూడా అసంఖ్యాకంగా జనం వచ్చారు. ప్రతినిధుల సంఖ్య నిర్ధారణ కాలేదు. నాకు గుర్తు వున్నంతవరకు 14 వేలమంది ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. లాలాలజపతిరాయ్ గారు కోరిన ప్రకారం విద్యాలయాలకు సంబంధించిన తీర్మానంలో ఒక చిన్న మార్పుకు అంగీకరించాను. దేశబంధు కూడా కొద్ది మార్పుచేర్పులు చేయించారు. చివరికి శాంతియుత సహాయనిరాకరణోద్యమ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నియమావళికి సంబంధించిన తీర్మానం అంగీకరించాలి. ప్రత్యేక కాంగ్రెసులో ఆ తీర్మానం ప్రవేశపెట్టాను. అది ప్రకటించబడి చర్చించబడింది కూడా. శ్రీ విజయరాఘవాచార్యులు యీ సమావేశానికి అధ్యక్షులు. నియమావళిలో విషయ నిర్ధారణ కమిటీ ఒక్క మార్పు చేసింది. నేను ప్రతినిధుల సంఖ్య 1500 వుండాలి అని పేర్కొన్నాను. యిన్ని సంవత్సరాల తరువాత యిప్పటికీ నా అభిప్రాయం అదే. ప్రతినిధుల సంఖ్య ఎక్కువగా వుండటంవల్ల ఎక్కువ మంచి జరుగుతుందనో లేక ప్రజాస్వామ్య విధానం ఎక్కువ పాటించబడుతుందనో భావించడం పూర్తిగా భ్రమయని నా అభిప్రాయం. ప్రజాస్వామ్య రక్షణకు ప్రజానీకంలో స్వాతంత్ర్యాభిలాష, ఆత్మాభిమానం, సమైక్యతా భావం గల నిజమైన మంచి ప్రతినిధుల ఎన్నిక జరగడం అవసరం. కాని సంఖ్యామోహంలో పడిపోయిన విషయ నిర్ధారణ సభ ఆరువేల కంటే ఎక్కువ మంది ప్రతినిధులు కావాలని కోరింది. అందువల్ల చివరికి ఆరువేల సంఖ్య అంగీకరించబడింది. జాతీయ కాంగ్రెసులో స్వరాజ్య లక్ష్యాన్ని గురించి చర్చ జరిగింది. నియమావళి యందలి ఒక నియమం ప్రకారం సామ్రాజ్యం లోపల, బయట ఎలా దొరికితే అలా సామ్రాజ్యంలో వుంటూనే స్వరాజ్యం సంపాదించాలనే వర్గం కూడా అక్కడ వున్నది. పం. మాలవ్యా, మి. జిన్నాగారలు యీ పక్షాన్ని సమర్ధించారు. కాని వారికి ఎక్కువ ఓట్లు లభించలేదు. శాంతి సత్యం రెండిటిని ఆధారంగాగొని మాత్రమే స్వరాజ్యం సాధించాలని నియమావళిలో వున్నది. ఈ షరతును కూడా కొందరు వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకతను కాంగ్రెసు అంగీకరించలేదు. చర్చ జరిగిన తరువాత యథాతథంగా తీర్మానం అంగీకరించబడింది. యీ తీర్మానాన్ని జనం నిజాయితీతో అమలుపరిచి వుంటే ప్రజానీకానికి మంచిశిక్షణ లభించి యుండేది. ఆ తీర్మానాన్ని సరిగా ఆచరణలో పెడితే స్వరాజ్యపు తాళం చెవి చేతికి అంది యుండేది. అయితే ఆ విషయం యిక్కడ అప్రస్తుతం.

ఈ సమావేశంలో హిందూ మహమ్మదీయ సమైక్యత, అస్పృశ్యత మరియు ఖద్దరును గురించిన తీర్మానాలు కూడా ఆమోదించబడ్డాయి. అస్పృశ్యతను తొలగించి వేయాలనే గట్టి పట్టుదల సమావేశంలో పాల్గొన్న హిందువులందరి హృదయాల్లో నాటుకోవడం ముదావహం. ఖద్దరు ద్వారా జాతీయ కాంగ్రెసు దేశమందలి అస్థిపంజరాలతో సంబంధం పెట్టుకున్నది. ఖిలాఫత్‌ను గురించి సహాయ నిరాకరణోద్యమ తీర్మానం చేసి హిందూ మహమ్మదీయుల సమైక్యతను సాధించుటకు కాంగ్రెసు మహత్తరమైన ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు.