సత్యశోధన/ఐదవభాగం/42. సహాయనిరాకరణోద్యమ తీవ్రత
42. సహాయ నిరాకరణోద్యమ తీవ్రత
తరువాత ఖద్దరు అభివృద్ధి ఎలా జరిగిందో ఈ ప్రకరణంలో తెలపడం లేదు. ఆ వస్తువు ప్రజల ఎదుటకు ఎలా వచ్చిందో చెప్పిన తరువాత దాని చరిత్రలోకి దిగడం ఈ ప్రకరణాల లక్ష్యం కాదు. ఆవివరమంతా చెబితే పెద్ద గ్రంథం అవుతుంది. సత్యశోధన జరుపుతూ కొన్ని వస్తువులు ఒకటి తరువాత ఒకటిగా నా జీవితంలో సహజంగా ఎలా ప్రవేశించాయో తెలుపడమే నా ప్రధాన లక్ష్యం. ఇదే క్రమంలో యిక సహాయనిరాకరణోద్యమాన్ని గురించి తెలిపే సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. ఆలీ సోదరులు ప్రారంభించిన ఖిలాఫత్ ఉద్యమం ఒకవైపున తీవ్రంగా సాగుతూ వున్నది. కీ.శే. మౌలానా అబ్దుల్ బారీ మొదలుగా గల ముస్లిం పండితులతో యీ విషయమై చర్చలు జరిపాను. మహమ్మదీయులు ఎంతవరకు శాంతిని, అహింసను పాటించగలరా అని యోచించాము. ఒక స్థాయి వరకు వాటిని పాటించడం సులువేనని నిర్ణయానికి వచ్చాము. ఒక్కసారి అహింసా విధానాన్ని పాటిస్తామని ప్రతిజ్ఞచేస్తే చివరివరకు దానిమీద నిలబడాల్సిందే. అంతా సరేనని అన్న తరువాత సహాయ నిరాకరణోద్యమం సాగించాలని ఖిలాఫత్ కాన్ఫరెన్స్‌లో తీర్మానం అంగీకరించబడింది. అందు నిమిత్తం అలహాబాదులో రాత్రంతా సభ జరిగిన విషయం నాకు జ్ఞాపకం వున్నది. హకీంఅజమల్ ఖాను గారిని శాంతియుతంగా ఉద్యమం సాగించాలా అని సందేహం పట్టుకుంది. సందేహనివృత్తి అయిన తరువాత ఆయన రంగంలోకి దిగాడు. ఆయన చేసిన సాయం అపారం. తరువాత గుజరాత్‌లో ప్రాంతీయ సభ జరిగింది. అందు నేను సహాయ నిరాకరణోద్యమ తీర్మానం ప్రవేశపెట్టాను. దాన్ని కొందరు వ్యతిరేకించారు. “జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణోద్యమాన్ని అంగీకరించనంతవరకు ప్రాంతీయ పరిషత్తులకు అట్టి విధాన నిర్ణయాన్ని చేసేహక్కు లేదని వారు తెలిపిన మొదటి అడ్డంకి. అయితే నేను వారి వాదనను అంగీకరించలేదు. ప్రాంతీయ పరిషత్తులకు బాధ్యత లేదని చెప్పి వెనక్కి తగ్గడానికి వీలులేదు. ముందుకు అడుగు వేసే హక్కు అధికారం ప్రాంతీయ పరిషత్తులకు వున్నదని చెప్పాను. అంతేగాక ధైర్యం వుంటే తమ కర్తవ్యమని భావించి యీ విధంగా చేస్తే ప్రధాన సంస్థ యొక్క శోభ పెరుగుతుందని చెప్పాను. తీర్మానం యొక్క గుణదోషాలను గురించి కూడా మధురంగా చర్చ సాగింది. ఓట్లు తీసుకొని లెక్క పెట్టారు. అత్యధిక మెజారిటీతో తీర్మానం ఆమోదించబడింది. ఈ తీర్మానాన్ని ఆమోదింపజేయడానికి అబ్బాస్ తయబ్జీ మరియు వల్లభభాయి ఎంతో కృషి చేశారు. అబ్బాస్‌సాహబ్ ఆ సమావేశానికి అధ్యక్షులు. ఆయన సహాయనిరాకరణోద్యమానికి అనుకూలంగా మొగ్గు చూపారు. భారతీయ కాంగ్రెస్ యీ ప్రశ్నపై ఆలోచించుటకు ప్రత్యేక మహాసభను కలకత్తాలో సెప్టెంబరు 1920 నాడు ఏర్పాటు చేసింది. ఏర్పాట్లు పెద్ద స్థాయిలో జరిగాయి. లాలాలజపతిరాయ్ ఆ మహాసభకు అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఖిలాఫత్ స్పెషల్ మరియు కాంగ్రెస్ స్పెషల్ అను రెండు రైళ్లు బొంబాయి నుండి కలకత్తాకు బయలుదేరాయి. కలకత్తాకు ప్రతినిధులు, దర్శకులు పెద్దసంఖ్యలో చేరారు. మౌలానా షౌకత్ అలీ కోరిక మేరకు సహాయనిరాకరణాన్ని గురించిన తీర్మానం ముసాయిదా రైల్లో తయారు చేశాను. నా తీర్మానాలలో యిప్పటివరకు శాంతియుతంగా అను శబ్ద ప్రయోగం చేయలేదు. ఉపన్యాసాల్లో మాత్రం యీ శబ్దాన్ని ప్రయోగిస్తూ వుండేవాణ్ణి. మహమ్మదీయుల సమావేశాల్లో మాత్రం శాంతియుతం అను శబ్దార్థాన్ని సరిగ వివరించి చెప్పలేకపోతూ వుండేవాణ్ణి. మౌలానా అబుల్‌కలాం ఆజాదును శాంతియుతంగా అనుదానికి ఉర్దూ శబ్దం చెప్పమని అడిగాను. ఆయన “బా అమన్” శబ్దం సూచించారు. సహాయనిరాకరణం అను శబ్దానికి “తరకే మవాలత్” అను శబ్దం సూచించారు. ఈ విధంగా గుజరాతీలోను, హిందీలోను, హిందుస్తానీలోను సహాయనిరాకరణాన్ని గురించిన భాష నా బుర్రలో నిర్మాణం కాసాగింది. కాంగ్రెస్‌లో సహాయనిరాకరణోద్యమాన్ని గురించి ప్రవేశపెట్టవలసిన తీర్మానం తయారు చేసి రైల్లోనే తీర్మానం షౌకత్ అలీకి యిచ్చివేశాను. అయితే అందు “శాంతియుతంగా” అను ముఖ్యమైన శబ్దం లేదని ఆ రాత్రి గ్రహించాను. వెంటనే మహాదేవను పరిగెత్తించి శాంతియుతంగా అను శబ్దాన్ని తీర్మానంలో చేర్చమని చెప్పించాను. ఈ శబ్దం చేర్చక పూర్వమే తీర్మానం అచ్చు అయిందని నా అభిప్రాయం. విషయనిర్ధారణ సభ ఆ రాత్రికే జరుగుతున్నది. ఆ సభలో అందరికీ చెప్పి ఆ శబ్దం చేర్చవలసి వచ్చింది. నేను జాగ్రత్తగా తీర్మానాన్ని సరిచేసి యుండకపోతే చాలా యిబ్బంది కలిగియుండేది. ఎవరు తీర్మానాన్ని వ్యతిరేకిస్తారో, ఎవరు అనుకూలిస్తారో తెలియని స్థితిలో పడ్డాను. లాలాలజపతిరాయ్ గారి అభిప్రాయం ఏమిటో నాకు తెలుసు. అనుభవజ్ఞులగు కార్యకర్తలు పెద్దసంఖ్యలో కలకత్తా సమావేశంలో పాల్గొన్నారు. విదుషీమణి ఎని బెసెంట్, పండిత మాలవ్యా, విజయరాఘవాచార్య, పండిత మోతీలాల్, దేశబంధు మొదలగు వారంతా అక్కడ వున్నారు. నా తీర్మానంలో ఖిలాఫత్ మరియు పంజాబులో జరిగిన దురంతాలకు సహకరించకూడదని పేర్కొన్నాను. శ్రీ విజయరాఘవాచార్యగారికి యీ విషయం రుచించలేదు. సహాయనిరాకరణం సాగించడానికి నిర్ణయించి అది ఫలానా అన్యాయమని కేసుని సీమితం ఎందుకు చేయాలి? స్వరాజ్యం లభించక పోవడం పెద్ద అన్యాయం కదా! దానికోసం సహాయనిరాకరణం అవసరం అని రాఘవాచార్యగారి వాదన. మోతీలాలుగారు కూడా తీర్మాన పరిధిని విస్తరింపచేయాలని భావించారు. నేను వెంటనే వారి సూచనను అంగీకరించాను. స్వరాజ్యం అని కూడా తీర్మానంలో చేర్చాను. విస్తారంగాను, గంభీరంగాను, తీవ్రంగాను చర్చలు సాగిన తదనంతరం సహాయనిరాకరణోద్యమ తీర్మానం ఆమోదింపబడింది.
శ్రీ మోతీలాల్ గారు ఈ విషయమై శ్రద్ధ వహించారు. నాతో జరిగిన వారి తీయని సంభాషణ యిప్పుడు నాకు జ్ఞాపకం వున్నది. కొన్ని మాటలు అటు యిటు మార్చమన్నవారి సూచనను నేను అంగీకరించాను. దేశబంధును ఒప్పించే బాధ్యత వారు వహించారు. దేశబంధు హృదయం సహాయనిరాకరణోద్యమానికి అనుకూలమే, కాని ప్రజలు దాన్ని ఆచరణలో పెట్టలేరని ఆయన బుధ్ధికి తోచింది. దేశబంధు మరియు లాలాలజపతిరాయ్ గారలు పూర్తిగా నాగపూరులో సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో లోకమాన్యుడు లేని లోటు నన్ను కలచివేసింది. వారు జీవించి యుంటే కలకత్తా నిర్ణయానికి తప్పక స్వాగతం చెప్పి యుండేవారని నా విశ్వాసం. అలా జరగక వారు వ్యతిరేకించినా నేను సంతోషించేవాణ్ణి. వారి దగ్గర నేను ఏదో కొంత నేర్చుకునేవాణ్ణి. వారితో నాకు అభిప్రాయభేదం వుండేది కాని అది తీయనిది. మా యిరువురి మధ్య మంచి సంబంధం వుండేది. దాన్ని వారు చెదరనీయలేదు. ఈ వాక్యలు వ్రాస్తున్నప్పుడు వారి చివరి గడియల దృశ్యం నా కండ్ల ముందు కనిపిస్తున్నది. అర్ధరాత్రి సమయంలో వారు తుదిశ్వాస విడిచే స్థితిలో వున్నారని ఫోనులో నా పరిచితులు శ్రీ పట్వర్దన్ తెలిపారు. “ఆయన నాకు పెద్ద అండ. అది కాస్తా వాడిపోయింది” అని ఆ క్షణంలో నా నోటినుండి వెలువడింది. దేశంలో సహాయ నిరాకరణోద్యమం తీవ్రంగా సాగుతున్నది. లోకమాన్యుని ప్రోత్సాహం ఎక్కువగా లభిస్తుందని ఆశించిన తరుణంలో వారు కన్నుమూశారు. ఉద్యమం సరియైన రూపం దాల్చినప్పుడు వారి అభిప్రాయం ఎలావుండేదో భగవంతుని కెరుక. భారతదేశ చరిత్ర బహుసున్నిత స్థాయిలో నడుస్తున్న యీ సమయంలో లోకమాన్యుడు లేకపోవడం నిజంగా తీరని లోటే.