సత్యశోధన/ఐదవభాగం/38. కాంగ్రెసులో చేరిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జలియావాలాబాగ్‌లో జరిగిన మారణకాండకు స్మారక చిహ్నం ఏర్పాటు చేయడం ఒక కార్యక్రమం. దీన్ని గురించి మహాసభలో బ్రహ్మాండమైన తీర్మానం చేశారు. అందు నిమిత్తం అయిదు లక్షల రూపాయలు వసూలు చేయాలి. ట్రస్టీలలో నాపేరు కూడా చేర్చారు. దేశంలో ప్రజల కార్యక్రమాల నిమిత్తం బిచ్చమెత్తగల మహాశక్తిమంతుల్లో మొదటి పేరు పండిత మాలవ్యాగారిది. నా పేరు వారి పేరుకి చాలా క్రింద ఉంటుందని నాకు తెలుసు. నా శక్తి ఏమిటో దక్షిణ ఆఫ్రికాలో తెలుసుకున్నాను. రాజుల్ని మహారాజుల్ని గారడీచేసి లక్షలాది రూపాయలు తీసుకురాగల శక్తి నాకు అప్పటికి లేదు. యిప్పటికీ లేదు. యీ విషయంలో మాలవ్యాగారిని మించిపోగల వ్యక్తిని నేను చూడలేదు. జలియావాలాబాగ్ స్మారక చిహ్నం కోసం వారిని చందాలడగడానికి వీలులేదని నాకు తెలుసు. అందువల్ల యీ బాధ్యత నామీద పడుతుందని అప్పుడే గ్రహించాను. అదే జరిగింది కూడా. యీ కార్యక్రమం నిమిత్తం బొంబాయిపౌరులు హృదయపూర్వకంగా విరాళాలు యిచ్చారు. ప్రజలు యిటువంటి పనులకు కావలసినంత ధనం యిచ్చే స్థితిలో వున్నారు. అయితే జలియన్‌వాలాబాగ్ గడ్డ హిందూ ముస్లిం సిఖ్కుల రక్తంతో తడిసినది గనుక యిక్కడ ఎలాంటి స్మారకచిహ్నం ఏర్పాటు చేయాలి అని ప్రశ్న బయలుదేరింది. మరో మాటల్లో ప్రోగైన డబ్బును ఎలా ఉపయోగించాలా అనునది గడ్డు ప్రశ్న అయింది. ఆ బాధ్యత నా మీద పడినట్లే. సామరస్యం లేకపోవడం వల్ల ఇది సమస్యగా మారిందని చెప్పవచ్చు.

గుమాస్తాగా పనిచేయడం నాకు గల రెండో శక్తి. దాన్ని కాంగ్రెస్ సంస్థ ఉపయోగించుకునే స్థితిలో వున్నది. చిరకాలం పనిచేసి గడించిన అనుభవం వల్ల ఎక్కడ, ఏ విధంగా తక్కువ మాటలను ఉపయోగించి వినయ విధేయతలతో కూడిన భాష వ్రాయాలో నాకు బాగా తెలుసునని అంతా గ్రహించారు. కాంగ్రెస్‌కు వున్న నియమావళి గోఖలేగారు అప్పగించి వెళ్లిన ఆస్తియే. ఆయన కొన్ని నియమాలు తయారుచేసి యిచ్చి వెళ్లారు. వాటి సాయంతో కాంగ్రెస్ నడుస్తున్నది. ఆ నియమాలు తయారుచేసిన విధానాన్ని గురించి వారి నోట నేను విన్నాను. ఆ కొద్ది నియమాలతో యిక కాంగ్రెస్ సంస్థ నడవదని అంతా తెలుసు కున్నారు. నియమావళి తయారుచేయాలని ప్రతి సంవత్సరం చర్చ జరిగేది. కాని సాలు పొడుగునా సంస్థ పనిచేయవలసిన వ్యవస్థగాని, అందుకు అవసరమైన ఏర్పాటుగాని జరుగలేదు. ముగ్గురు కార్యదర్శులు ఉండేవారు. కాని కార్యనిర్వాహక సెక్రటరీ ఒక్కడే మొత్తం వ్యవహారమంతా చూస్తూ వుండేవాడు. ఒక్క కార్యదర్శి ఆఫీసును నడుపుతాడా? భవిష్యత్తును గురించి యోచిస్తాడా? భూతకాలంలో చేయబడ్డ నిర్ణయాలను అమలు బరిచి నడుస్తున్న సంవత్సరంలో పూర్తిచేయగలుగుతాడా? అందువల్ల అందరి దృష్టి యీ విషయం మీద కేంద్రీకృతం అయింది. వేలాదిమంది ప్రతినిధులుగా గల సభ మీద ఆధారపడి దేశానికి సంబంధించిన కార్యక్రమాలు ఎలా సాగుతాయి? ప్రతినిధుల సంఖ్యకు హద్దు అంటూ ఏమీలేదు. ప్రతి ప్రాంతాన్నుండి ఎంత మందైనా సరే ప్రతినిధులు రావచ్చు. ఎవరైనా సరే ప్రతినిధులు కావచ్చు. ఇందు కొంత మార్పు అవసరమని అంతా నిర్ణయానికి వచ్చాము. యిక నియమావళిని తయారుచేసే బాధ్యత నేను వహించాను. అయితే ఒక షరతు పెట్టాను. ప్రజల మీద యిద్దరు నాయకుల పట్టు నేను గమనించాను. అందువల్ల వారి ప్రతినిధులు నాతోబాటు వుండాలని కోరాను. వాళ్లు హాయిగా కూర్చొని నియమావళి తయారుచేయలేరని నాకు తెలుసు. అందువల్ల లోకమాన్యునికి, దేశబంధువుకి విశ్వాసపాత్రులగు ఇద్దరు ప్రతినిధుల పేర్లు ఇమ్మని వారిని కోరారు. వారు తప్ప నియమావళి కమిటీలో మరెవ్వరూ వుండకూడదని చెప్పాను. అందుకు అంతా అంగీకరించారు. లోకమాన్యులు శ్రీ కేల్కారు గారి పేరు, దేశబంధు శ్రీ ఐ.బి. సేన్ గారి పేరు సూచించారు. యీ కమిటీ సమావేశం ఒక్కరోజున కూడా జరగలేదు. అయినా మేము మా పని ఏకగ్రీవంగా పూర్తిచేశాం. ఇట్టి నియమావళి తయారు చేయగలిగామనే అభిమానం మాకు కలిగింది. ఈ విధానం ప్రకారం సంస్థను నడిపితే సంస్థ యొక్క పని సవ్యంగా సాగుతుందని నా విశ్వాసం. అయితే నేను యీ బాధ్యత వహించి నిజంగా కాంగ్రెస్ సంస్థలో ప్రవేశించినట్లయిందని అభిప్రాయపడ్డాను.