సత్యశోధన/ఐదవభాగం/37. అమృతసర్ కాంగ్రెస్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

37. అమృతసర్ కాంగ్రెస్

మార్షల్ లా సమయంలో వందలాది నిర్దోషులగు పంజాబీలను తెల్లప్రభుత్వం పేరుకు మాత్రమే స్థాపించబడ్డ కోర్టుల్లో, బూటకపు కేసులు బనాయించి శిక్షలు విధించి జైళ్లల్లోకి నెట్టివేసింది. ఆ దుర్మార్గాల్ని దుండగాల్ని ఖండిస్తూ ఉవ్వెత్తున వ్యతిరేకత వెల్లడి అయ్యేసరికి ఆ ఖైదీలను ఎక్కువ కాలం జైళ్లలో వుంచడం సాధ్యం కాలేదు. కాంగ్రెసు సభలు ప్రారంభం కాక ముందే చాలామంది ఖైదీలు విడుదల చేయబడ్డారు. లాలా హరకిషన్‌లాల్ మొదలగు నాయకులంతా విడుదల అయ్యారు. కాంగ్రెస్ మహాసభలప్పుడు అలీ సోదరులు కూడా విడుదల అయి వచ్చేశారు. దానితో ప్రజల ఆనందం అవధులు దాటిపోయింది. పండిత మోతీలాల్ నెహ్రూ తన వకీలు వృత్తిని కాళ్లతోతన్నివేసి పంజాబులో తిష్ఠవేశారు. వారే అమృతసర్ ఉపన్యాసం యిచ్చి హిందీ భాషయొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పడం, విదేశాలలో వుంటున్న హిందూ దేశస్థుల సమస్యలను గురించి చెప్పడం వరకే నా పని సీమితం అయింది. అమృతసర్ కాంగ్రెసులో కూడా అంతకంటే మించి నేను చేయవలసింది ఏమీ వుండదని భావించాను. కాని అక్కడ ఎంతో బాధ్యత నా మీద పడింది. బ్రిటిష్ చక్రవర్తి తరఫున క్రొత్త సంస్కరణలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. నాకు అవి పూర్తి సంతృప్తిని కలిగించలేదు. యితరులకైతే అసలు తృప్తికరంగా లేవు. అయినా వాటిని ఆ సమయంలో అంగీకరించటమే మంచిదను నిర్ణయానికి నేను వచ్చాను. చక్రవర్తి ప్రకటనలో లార్డ్ సింహ్ చెయ్యి వుందని నాకు అనిపించింది. వారిభాషలో నాకు ఆశారేఖ గోచరించింది. కాని అనుభవజ్ఞులగు లోకమాన్యులు చిత్తరంజనదాసు మొదలగు యోధులు అంగీకరించలేదు. మాలవ్యా వంటి వారు తటస్థంగా వున్నారు.

మాలవ్యాగారింట్లో నా మకాం ఏర్పాటు చేశారు. కాశీ విశ్వవిద్యాలయం శంకుస్థాపన రోజున మాలవ్యాగారి నిరాడంబరత్వాన్ని చూచే అవకాశం నాకు లభించింది. కాని ఈ పర్యాయం వారు నన్ను తన గదిలోనే వుండమన్నారు. అందువల్ల వారి దినచర్యను కండ్లారా చూచే అవకాశం దొరికింది. నాకు ఆనందమేగాక ఆశ్చర్యం కూడా కలిగింది. వారున్న గది బీదలుండే ధర్మశాల అని చెప్పవచ్చు. అక్కడ కొద్దిగా కూడా ఖాళీగా వదిలిన చోటులేదు. అంతటా జనం వున్నారు. ఖాళీ చోటుగాని, ఏకాంత ప్రదేశంగాని అక్కడ లేదు. ఎవరైనా ఎప్పుడైనా సరే రావచ్చు. వారితో మాట్లాడవచ్చు. ఆ గదియందలి ఒక కొసన నా దర్బారు. అంటే నా మంచం వున్నది. అయితే మాలవ్యాగారి నడవడికను గురించి చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. గనుక అసలు విషయానికి వస్తాను. మాలవ్యాగారితో రోజూ మాట్లాడడానికి అవకాశం లభించింది. తన అభిప్రాయాలను పెద్దన్నగారు తమ్ముడికి చెప్పే పద్ధతిన నాకు ప్రేమతో చెబుతూ వుండేవారు. ప్రభుత్వ సంస్కరణలకు సంబంధించిన సభలో పాల్గొనడం అవసరమని భావించాను. పంజాబ్ కాంగ్రెస్ యొక్క రిపోర్టును గురించిన వ్యవహారంలో నాకూ పాలు వున్నది. పంజాబు విషయంలో ప్రభుత్వం చేత పని చేయించుకోవాలి. ఖిలాఫత్ సమస్య సరేసరి. మాంటెగ్యూ హిందూ దేశాన్ని మోసం చేయరను నమ్మకం నాకు వున్నది. ఖైదీలు ముఖ్యంగా అలీ సోదరుల విడుదల శుభ లక్షణమని భావించాను. అందువల్ల సంస్కరణలను అంగీకరిస్తూ తీర్మానం చేయాలని అభిప్రాయపడ్డాను. సంస్కరణలు అసంతృప్తికరంగా వున్నాయి. గనుక వాటిని తిరస్కరించాలనే దృఢ దీక్షతో చిత్తరంజన్‌దాస్ వున్నారు. లోకమాన్యులు తటస్థంగా వున్నారు. అయితే చిత్తరంజన్ ప్రవేశపెట్టే తీర్మానానికే మొగ్గు చూపాలను నిర్ణయానికి వారు వచ్చారు.

ఇటువంటి పండి పోయిన సర్వమాన్యులగు పాత నాయకులతో అభిప్రాయ భేదం రావడం సహించలేక పోయాను. నా అంతర్వాణి నా కర్తవ్యాన్ని స్పష్టంగా సూచించింది. కాంగ్రెస్ సమావేశాల నుండి పారిపోదామని ప్రయత్నించాను. పండిత మోతీలాల్ నెహ్రూగారికి, పండిత మాలవ్యాగారికి నా అభిప్రాయం చెప్పివేశాను. నేను హాజరుకాకపోతే పని సాఫీగా జరుగుతుందని, మహానాయకులను వ్యతిరేకించవలసిన స్థితి నుండి నాకు ముక్తి లభిస్తుందని కూడా చెప్పాను. నా అభిప్రాయం ఆ పెద్దలిద్దరికీ రుచించలేదు. లాలా హరకిషన్‌లాల్ చెవిలో ఈ మాటపడేసరికి “అలా జరగడానికి వీలులేదు. పంజాబీలకు బాధకలుగుతుంది” అని ఆయన అన్నారు. లోకమాన్యునితోను, దేశబంధుతోను మాట్లాడాను. మిష్టర్ జిన్నాను కలిసాను. ఏవిధంగానూ దారి దొరకలేదు. నా బాధను మాలవ్యాగారికి తెలిపి “రాజీపడే అవకాశం కనబడటం లేదు. నా తీర్మానం ప్రవేశపెడితే చివరికి ఓట్లు తీసుకోవలసి వస్తుంది. యిక్కడ ఓట్లు తీసుకునే పద్ధతి కూడా సరిగా వున్నట్లు నాకు తోచడంలేదు. మన మహాసభలో దర్శకులకు, ప్రతినిధులకు తేడా ఏమీ లేదు. యింత పెద్ద సభలో ఓట్లు తీసుకునే వ్యవస్థ మనకు లేదు. నా తీర్మానం మీద ఓట్లు తీసుకోమని కోరదామంటే అందుకు అవకాశమే లేదు” అని అన్నాను. అయితే లాలా హరకిషన్‌లాల్ అట్టి వ్యవస్థ చేయిస్తానని పూచీ పడ్డారు. ఓట్లు తీసుకునే రోజున దర్శకుల్ని రానివ్వం. ప్రతినిధుల్ని మాత్రమే రానిస్తాం. వారి ఓట్లు లెక్కింపచేసే బాధ్యత నాది. అందువల్ల మీరు కాంగ్రెస్‌కు హాజరు కాకపోవడం సరికాదు అని గట్టిగా అన్నారు.

చివరికి నేను తలవంచాను. నా తీర్మానాన్ని తయారు చేశాను. ఎంతో సంకోచిస్తూ నా తీర్మానాన్ని మహాసభలో ప్రవేశపెట్టుటకు సిద్ధపడ్డాను. మిస్టర్ జిన్నా మరియు పండిత మాలవ్యాగారలు నా తీర్మానాన్ని సమర్ధిస్తామని చెప్పారు. ఉపన్యాసాలు పూర్తి అయ్యాయి. భావాలలో వ్యతిరేకత వున్నా కటుత్వానికి ఉపన్యాసాలలో చోటు లభించలేదు. ఉపన్యాసాలలో తర్కందప్ప మరేమీలేదు. అయినా మహాసభలో పాల్గొనే జనం నాయకుల అభిప్రాయభేదాల్ని సహించే స్థితిలో లేరు. సభలో అందరు ఏకాభిప్రాయాన్ని కోరుతూ వున్నారు. ఉపన్యాసాలు జరుగుతూ వున్నపుడు కూడా అభిప్రాయభేదం తొలగించేందుకు వేదిక మీద ప్రయత్నాలు సాగుతూ వున్నాయి. నాయకుల మధ్య చీటీల రాకపోకలు జరుగసాగాయి. ఏది ఏమైనా రాజీ కోసం మాలవ్యాగారు గట్టిగా కృషి చేస్తున్నారు. ఆయన నా చేతికి తన సలహా కాగితం అందించి అందు ఓట్లు తీసుకునే పరిస్థితి ఏర్పడకుండా చూడమని తీయని మాటలతో కోరారు. నాకు వారి సూచన వచ్చింది. మాలవ్యాగారి కండ్లు ఆశాకిరణం కోసం వెతుకుతూ తిరుగుతున్నాయి. “ఈ విషయం రెండు పక్షాలకు యిష్టమయ్యేలా వున్నది” అని అన్నాను. లోకమాన్యునికి నేను ఆ కాగితం అందచేశాను. “దాసుకు యిష్టమైతే నాకు అభ్యంతరం లేదు” అని ఆయన అన్నారు. దేశబంధు కరిగి పోయారు. ఆయన బిపిన్ చంద్రపాల్ వంక చూచారు. మాలవ్యా గారి హృదయంలో ఆశ చిగురించింది. దేశబంధు నోటినుండి ‘సరే’ అనుమాట యింకా పూర్తిగా వెలువడకుండానే మాలవ్యాగారు లేచి నిలబడి “సజ్జనులారా! రాజీ కుదిరిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను” అని ప్రకటించారు. సభాస్థలి అంతా కరతాళ ధ్వనులతో మార్మోగి పోయింది. జనం ముఖాన కనపడుతున్న గాంభీర్యరేఖలు తొలగిపోయాయి. అందరి ముఖాలు సంతోషంతో కళకళ లాడాయి. ఆ తీర్మానం ఏమిటో ఇక్కడ వివరించవలసిన అవసరం లేదు. ఆ తీర్మానం ఏవిధంగా జరిగిందో వివరించడమే నా యీ సత్య శోధన యొక్క లక్ష్యం. ఆ తీర్మానం వల్ల నా బాధ్యత పెరిగింది.