సత్యశోధన/ఐదవభాగం/32. ఆ వారం - 2
32. ఆ వారం - 2
కమీషనరు గ్రిఫిత్ గారి ఆఫీసులోకి వెళ్లాను. మెట్ల దగ్గర తుపాకులు పుచ్చుకొని సిద్ధంగా వున్న సైనికులు కనబడ్డారు. వారంతా యుద్ధానికి సిద్ధంగా వున్నట్లు బోధపడింది. వరండాలో కూడా గందరగోళంగా వున్నది. నేను కబురు పంపి ఆఫీసులోకి ప్రవేశించాను. అక్కడ కమీషనరు దగ్గర మి. బోరింగు కూర్చొని వున్నాడు. నేను చూచిన దృశ్యాన్ని కమీషనరుకు వివరించి చెప్పాను. “ఊరేగింపును ఫోర్టు వైపుకు వెళ్లకుండా ఆపడం నా లక్ష్యం. జనం అక్కడికి చేరితే ఉపద్రవం జరిగి తీరేది. ఎంత చెప్పినా జనం వినే స్థితిలో లేనందున వాళ్లను తొలగించి వేయమని ఆదేశించక తప్పలేదు” అని అతడు క్లుప్తంగా జవాబు యిచ్చాడు.
“ఫలితం మీకు తెలుసుకదా! గుర్రాల కాళ్ల క్రింద జనం నలిగిపోవడం తప్ప జరిగిందేమిటి? అసలు గుర్రపు రౌతుల్ని తీసుకురావడం అనవసరం కాదా!” అని నేను అన్నాను. “ఆ విషయం మాకు తెలియదు. మీ బోధలు జనం మీద ఎలా పనిచేశాయో, చేస్తున్నాయో మీకంటే పోలీసువాళ్లం మాకు బాగా తెలుసు. ముందే మేము జాగ్రత్త వహించకపోతే కీడు అధికంగా జరిగివుండేది. స్పష్టంగా చెబుతున్నాను. జనం మీ మాట వినే స్థితిలోలేరు. చట్టాన్ని వ్యతిరేకించటమంటే జనం ముందుకు ఉరుకుతారు. కాని శాంతంగా వుండమని చెబితే వాళ్ల బుర్రకు ఎక్కదు. మీ విధానం మంచిదే కాని దాన్ని సరిగా అర్ధం చేసుకునే వాళ్లేరీ? వాళ్ల ధోరణి వాళ్లదే!” అని అన్నాడు కమీషనరు. “మీకూ నాకూ మధ్య గల తేడా యిదే. ప్రజలు సహజంగా కొట్లాటలకు దిగరు. వాళ్లు శాంతిప్రియులు” అని అన్నాను. మా యిరువురికి మధ్య కొంత చర్చ జరిగిన తరువాత దొర “సరేనండి, మీ బోధన ప్రజలు అర్థం చేసుకోలేదని మీరు గ్రహించారనుకోండి. అప్పుడు మీరేం చేస్తారో చెప్పండి?” అని సూటిగా ప్రశ్నించాడు. “ఆ విషయం నాకు తెలిపిన మరుక్షణం ఉద్యమాన్ని ఆపివేస్తాను” అని అన్నాను. “ఆపివేయడనుంటే ఏమిటి? మిమ్మల్ని విడుదల చేసిన మరుక్షణం పంజాబు వెళతానని మీరు బోరింగుకు చెప్పలేదా?” “అవును చెప్పాను. ఈ రైలుకే వెళదామని భావించాను కూడా. కాని యివాళ వెళ్లలేను.” “కొంచెం ఓపికపడితే అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. అహమదాబాదులో ఏం జరుగుతున్నదో, అమృతసర్‌లో ఏం జరిగిందో మీకు తెలుసా? జనం బాగా పెట్రేగిపోయారు. నాకూ యింకా పూర్తి సమాచారం అందలేదు. ఎన్నోచోట్ల తంతితీగలు తెగగొట్టారు. యీ రగడకంతటికీ పూర్తిగా మీదే బాధ్యత” “నా బాధ్యత ఎంతవరకో అంతవరకు వహించేందుకు నేను సిద్ధమే. అహమదాబాదులో జనం యిష్టం వచ్చినట్లు వ్యవహరించారు అంటే నాకు విచారం కలుగుతుంది. అమృతసర్‌ను గురించి నాకేమీ తెలియదు. అక్కడికి నేను ఎప్పుడూ వెళ్లలేదు. అక్కడ నన్ను ఎవ్వరూ ఎరుగరు. పంజాబు ప్రభుత్వం నన్ను ఆపి వుండకపోతే అక్కడ జనాన్ని శాంతింపచేసేందుకు గట్టి కృషి చేసి యుండేవాణ్ణి. నన్ను వెళ్ళకుండా ఆపి ప్రభుత్వమే జనాన్ని రెచ్చగొట్టింది” అని అన్నాను.
ఈ విధంగా మాటలు సాగుతూ వున్నాయి. మా ఇద్దరి అభిప్రాయాలు కలవడం లేదు. చౌపాటీ దగ్గర మీటింగు జరిపి ప్రజలకు శాంతంగా వుండమని చెబుతానని చెప్పి అక్కడినుండి వచ్చివేశాను.
చౌపాటీ దగ్గర సభ జరిగింది. ప్రజలకు శాంతిని గురించి, సత్యాగ్రహ ఆదర్శాల గురించి వివరించి చెప్పాను. “సత్యాగ్రహం అంటే సత్యపు క్రీడ. ప్రజలు శాతంగా వుండకపోతే నేను సత్యాగ్రహ పోరాటం జరపలేను” అని చెప్పాను. అహమదాబాదులో కూడా దొమ్మీ జరిగిందని అనసూయాబెన్‌కు సమాచారం అందింది. ఆమెను అరెస్టు చేశారని ఎవరో పుకారు లేవదీశారు. దానితో కార్మికులు పెట్రేగిపోయారు. వాళ్ళు హర్తాళ్‌తోబాటు ఉపద్రవానికి పూనుకున్నారు. ఒక సైనికుణ్ణి ఖూనీ చేశారు. నేను అహమదాబాదు వెళ్లాను. నడియాద్ దగ్గర రైలు పట్టాలు పీకివేసేందుకు ప్రయత్నించారని అక్కడ నాకు తెలిసింది. వీరంగావ్‌లో ఒక గవర్నమెంటు కార్యకర్తను చంపివేశారు. అహమదాబాదు చేరాను. అక్కడ మార్షల్ లా అమలు చేశారు. జనం జంకినట్లు కనబడింది. చేసిందానికి వడ్డీతో సహా జనానికి గవర్నమెంటు వారు సైన్య సాయంతో ముట్టచెబుతూ వున్నారన్నమాట. నన్ను స్టేషను నుండి కమీషనరు మిస్టర్ ప్రెట్ దగ్గరకి తీసుకుని వెళ్లేందుకు మనుష్యులు సిద్ధంగా వున్నారు. నేను వారి దగ్గరికి వెళ్లాను. ఆయన ఎంతో కోపంగా వున్నాడు. నేను ప్రశాంతంగా సమాధానాలిచ్చాను. జరిగిన హత్యలకు విచారం వ్యక్తం చేశాను. మార్షల్ లా అనవసరమని కూడా చెప్పాను. తిరిగి శాంతి నెలకొల్పేందుకు ఏం చేయమంటే అది చేస్తానని చెప్పాను. బహిరంగ సభ జరిపేందుకు అనుమతి కోరాను. ఆశ్రమ ప్రదేశంలో ఆ సభ జరుపుతానని చెప్పాను. నా అభిప్రాయం ఆయనకు నచ్చింది. ఏప్రిల్ 13వతేదీ ఆదివారం నాడు బహిరంగ సభ జరిపినట్లు నాకు గుర్తు. ఆ రోజునో లేక ఆ మరునాడో మార్షల్ లా ఎత్తివేశారు. సభలో ప్రసంగిస్తూ జనం చేసిన పొరపాటు ఏమిటో తెలియజేసేందుకు ప్రయత్నించాను. అందుకు ప్రాయశ్చింత్తంగా మూడు రోజులు ఉపవాసం చేయమని చెప్పాను. హత్యలు కావించి వారు తమ తప్పు అంగీకరించి ప్రభుత్వానికి లొంగిపొమ్మని సలహా యిచ్చాను. నా కర్తవ్యం ఏమిటో స్పష్టంగా బోధపడింది. ఏ కార్మికుల మధ్య అధిక సమయం గడిపానో, ఏ కార్మికులకు నేను సేవ చేశానో, ఏ కార్మికులు సత్కార్యాలు చేస్తారని నేను ఆశించానో ఆ కార్మికులే కొట్లాటలలో పాల్గొనడం సహించలేకపోయాను. వారు చేసిన అపరాధంలో నేను కూడా భాగస్వామినేనని భావించాను.
ప్రభుత్వానికి లొంగిపొమ్మని జనానికి సలహా యిచ్చినట్లే జనం చేసిన తప్పుల్ని క్షమించమని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశాను. కాని నా మాట యిరుపక్షాల వారిలో ఒక్క పక్షం వారు కూడా వినలేదు. ప్రజలు తమ తప్పును అంగీకరించలేదు. ప్రభుత్వం వారిని క్షమించేందుకు సిద్ధపడలేదు. కీ. శే రమణభాయి మొదలుగాగల పౌరులు వచ్చి సత్యాగ్రహం ఆపివేయమని నన్ను కోరారు. ఆ విధంగా నన్ను కోరవలసిన అవసరమే లేదు. శాంతిని గురించి తెలుసుకొని జనం ఆ విధంగా నడుచుకోనంత వరకు సత్యాగ్రహ సమరాన్ని నిలిపివేయాలని నేను అప్పటికే నిర్ణయానికి వచ్చివున్నాను. అందుకు వాళ్లంతా సంతోషించారు. కొంతమంది మిత్రులకు కోపం కూడా వచ్చింది. దేశమందంతట శాంతంగా సంగ్రామం సాగాలని అనుకుంటే అది సాధ్యం కాదని వారు భావించారు. నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను. ఏ ప్రజలకు నేను సేవ చేశానో ఆ ప్రజలు కూడా సత్యాగ్రహ సమరాన్ని గురించి, శాంతిని గురించి సరిగా గ్రహించకపోతే యి సత్యాగ్రహ పోరాటం జరపడం సాధ్యం కాదని చెప్పివేశాను. సత్యాగ్రహులు తమ హద్దు వుండి శాంతియుతంగా పోరాటం సాగించాలని అది నా నిశ్చితాభిప్రాయమని చెప్పాను. యీ నాటికీ నా అభిప్రాయం అదే.