సత్యశోధన/ఐదవభాగం/33. పర్వతమంత తప్పు
33. పర్వతమంత తప్పు
అహమదాబాదు సభ ముగించుకొని నేను నడియాద్ వెళ్లాను. పర్వతమంత తప్పు అని నేను అక్కడ అన్నమాట ఎంతో ప్రచారంలోకి వచ్చింది. అట్టి మాట అదివరకు నేను ఎప్పుడూ అనలేదు. అహమదాబాదులోనే నా తప్పు నాకు స్పష్టంగా కనబడింది. నడియాద్ వెళ్ళి అక్కడి పరిస్థితిని గురించి యోచించాను. ఖేడా జిల్లాకు చెందిన చాలామందిని అరెస్టు చేశారని విన్నాను. అక్కడి సభలో ప్రసంగిస్తూ ఖేడా జిల్లావాసులను, తదితరుల్ని సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని చట్టాల్ని ధిక్కరించమని నేను కోరాను. ఆ కోరికలో తొందరపాటు కలదని నా మనస్సుకు తోచి పైమాట అనేశాను. ఆ తప్పు పర్వతమంతగా నాకు కనిపించింది. ఆ విషయం బహిరంగంగా ప్రకటించేసరికి నన్ను చాలామంది ఎగతాళి చేసారు. అయినా తప్పును ఒప్పుకున్నాను. కనుక నాకు పశ్చాత్తాపం కలుగలేదు. యితరులు చేసిన ఏనుగంత తప్పును ఆవగింజంత చిన్నదిగా చూడు. నీవు చేసిన తప్పును పర్వతమంతగా భావించు. అప్పుడే తప్పులెన్నువారు తమ తప్పులు తెలుసుకుంటారు. అను మాట చెల్లుబాటు అవుతుంది. ప్రతి సత్యాగ్రహి యీ లక్షణాన్ని అలవరచుకోవాలని నా అభిప్రాయం. అసలు నాకు పర్వతమంతగా కనిపించిన ఆ తప్పేమిటో కొద్దిగా చెబుతాను. చట్టాన్ని పూర్తిగా అమలుబరిచినట్టి వ్యక్తులు చట్టాన్ని సవినయంగా ఉల్లంఘించారు. భయం వల్లనే అలా చేస్తారని గ్రహించాలి. ఉల్లంఘించితే శిక్షపడుతుందనేదే ఆ భయం. నీతికి అవినీతికి సంబంధించని చట్టాల విషయంలోనే యిలా జరుగుతుంది. చట్టం వున్నా లేకపోయినా మంచివాడు ఎన్నడూ దొంగతనం చేయడు. కాని రాత్రిళ్ళు సైకిలు మీద వెళుతూ లైటు వెలుగుతున్నదా లేదా అని ఎవ్వడూ చూడడు. సామాన్యంగా చట్టవిరుద్ధమైన ఆ చర్యను గమనించడు. గమనించమని కోరినా మంచివాళ్లు కూడా అందుకు సిద్ధపడరు. కాని అలా చేస్తే శిక్ష పడుతుందని భయం కలిగినప్పుడు మాత్రం అతడు లైటు వెలిగించడానికి సిద్ధపడతాడు. యీ విధంగా జరిగే నియమపాలనను, స్వేచ్ఛగా జరిగే నియమపాలన అని అనడానికి వీలులేదు. నిజమైన సత్యాగ్రహి చట్టాల్ని స్వేచ్ఛగా పాటిస్తాడు. యీ విషయం తెలుసుకొని సమాజంలో చట్టాల్ని పాటించునట్టి వారే చట్టాల యొక్క నీతిని, అవినీతిని గురించి నిర్ణయించుటకు అర్హులు. అట్టివారికే చట్టాన్ని ఆయా పరిస్థితుల్లో, ఆయా పరిధికి లోబడి వ్యతిరేకించే అర్హత వుంటుంది. అట్టి అర్హత వున్నదా లేదా అని గమనించకుండా నేను చట్టాన్ని ఉల్లంఘించమని వారికి చెప్పాను. నాయీ తప్పు నాకు పర్వతమంతగా కనబడింది. ఖేడా జిల్లాలో ప్రవేశించిన తరువాత నాకు అక్కడి ఉద్యమం జ్ఞాపకం వచ్చింది. నేను బహిరంగంగా కనపడుతున్న ప్రమాదాన్ని గుర్తించలేదని నాకు బోధపడింది. సహాయ నిరాకరణోద్యమాన్ని కొనసాగించేందుకు ప్రజలు అర్హులు కావాలి. అందలి రహస్యాన్ని వారు గ్రహించాలి. తెలిసివుండి కూడా చట్టాల్ని రోజూ ఉల్లంఘించేవారు, రహస్యంగా చట్టాల్ని పలుసార్లు ఉల్లంఘించేవారు హఠాత్తుగా సహకార నిరాకరణం అంటే ఏమిటో ఎలా తెలుసుకోగలరు? దాని మర్యాదను ఎలా కాపాడగలరు?
వేలాది మంది, లక్షలాదిమంది జనం యిట్టి ఆదర్శస్థితిని పొందలేరని అంతా అంగీకరిస్తారు. కాని ఆ విధమైన శిక్షణ ఉద్యమం ప్రారంభించుటకు పూర్వం జనానికి గరపాలి. అట్టి శిక్షణ నొసంగగల నిష్ణాతులగు వాలంటీర్లను ముందు తయారుచేయాలి. వాళ్లకు సహకార నిరాకరణోద్యమం అంటే ఏమిటో బోధించాలి. అప్పుడే యీ ఉద్యమం విజయవంతం అవుతుంది. ఈ విధంగా యోచించి నేను బొంబాయి చేరుకొని సత్యాగ్రహ సంస్థ ద్వారా సత్యాగ్రహుల వాలంటీర్ల దళాన్ని ఏర్పాటు చేసి, సత్యాగ్రహ విధానాల్ని వారికి బోధపరిచి, అందుకు అవసరమైన కరపత్రాలు ప్రకటించే ఏర్పాటు చేశాను. ఈ పని ప్రారంభించానే గాని జనాన్ని ఆకర్షించలేకపోయాను. వాలంటీర్లు అధికంగా దొరకలేదు. చేరినవారైనా పూర్తిగా గ్రహించారా అంటే సమాధానం చెప్పడం కష్టమే. రోజులు గడిచిన కొద్దీ వాళ్లు కూడా జారుకోవడం ప్రారంభించారు. దానితో సహకార నిరాకరణోద్యమం బండి నేను అనుకొన్నట్లు వేగంగా నడవడం లేదని, నెమ్మదిగా నడుస్తున్నదని గ్రహించాను.