సత్యశోధన/ఐదవభాగం/31. ఆ వారం - 1

వికీసోర్స్ నుండి

31. ఆ వారం -1

దక్షిణాదిన కొద్దిగా పర్యటించి ఏప్రిల్ 4వ తేదీ నాటికి బొంబాయి చేరాను. శంకర్‌లాల్ బాంకరు ఏప్రిల్ 6వతేదీ నాడు హర్తాళ్ జరిపేందుకై బొంబాయిరమ్మని తంతి పంపాడు. మార్చి 30వతేదీన ఢిల్లీలో హర్తాళ్ జరిగింది. కీ.శే. శ్రద్ధానందగారు, డా. హకీమ్ అజమల్ ఖాన్ సాహెబ్ అందుకు పూనుకున్నారు. ఏప్రిల్ 6వ తేదీన హర్తాళ్ జరపాలనే వార్త ఢిల్లీకి ఆలస్యంగా చేరింది. ఢిల్లీలో 30వ తేదీన జరిగిన హర్తాళ్ ఎంతో బాగా జరిగింది. హిందువులు, మహమ్మదీయులు కలిసి హృదయపూర్తిగా చేసిన హర్తాళ్ అది. ముస్లిములు శ్రద్ధానంద్ గారిని జామా మసీదుకు ఆహ్వానించడమే కాక అక్కడ వారిచే ఉపన్యాసం కూడా చేయించారు. ప్రభుత్వాధికారులు యీ వ్యవహారాన్ని సహించలేకపోయారు. రైలు స్టేషను వైపు ఊరేగింపుగా వెళుతున్న జనాన్ని పోలీసులు ఆపి వారిని తుపాకీ గుండ్లకు గురిచేశారు. కొంతమంది చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. అధికార్లు అణచివేత చర్యకు పూనుకున్నారు. శ్రద్ధానందగారు నన్ను వెంటనే డిల్లీ రమ్మని తంతి పంపారు. ఏప్రిల్ 6వ తేదీన బొంబాయిలో వుండి వెంటనే ఢిల్లీ వస్తానని శ్రద్ధానందగారికి తంతి ద్వారా తెలియజేశాను ఢిల్లీలో జరిగినట్లుగానే లాహోరు, అమృతసర్‌లో కూడా హర్తాళ్ జరిగింది. వెంటనే అమృతసర్ రమ్మని డా. సత్యపాల్ మరియు కిచలూగారల తంతి అందింది. యీ యిద్దరు సోదరుల్ని నేను బొత్తిగా ఎరుగను. ముందు ఢిల్లీ వెళ్లి తరువాత అమృతసర్ వస్తానని వారికి తెలియజేశాను. బొంబాయిలో ఆరవ తేదీ ఉదయం వేలాదిమంది జనం చౌపాటీ దగ్గర స్నానం చేసి దేవాలయానికి వెళ్ళేందుకు ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపులో స్త్రీలు, పిల్లలు కూడా వున్నారు. ముస్లిములు కూడా పెద్ద సంఖ్యలో అందు పాల్గొన్నారు. వారు త్రోవలో మమ్మల్ని మసీదుకు తీసుకువెళ్లారు. అక్కడ సరోజినీదేవిని మరియు నన్ను ఉపన్యాసం యిమ్మని కోరారు. మేము ఉపన్యాసాలు యిచ్చాము. శ్రీ విఠల్ దాస్ జెరాజాణి స్వదేశీ మరియు హిందూ ముస్లిం సమైక్యతకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయిద్దామని సూచించాడు. తొందరపాటుగా ప్రతిజ్ఞ చేయించడానికి నేను యిష్టపడలేదు. జరిగినదానితో తృప్తిపడమని సలహా యిచ్చాను. ప్రతిజ్ఞ చేసిన తరువాత ఉల్లంఘించకూడదు కదా! స్వదేశీ అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలని, హిందూ ముస్లిం సమైక్యతకు సంబంధించిన ప్రతిజ్ఞను అర్ధం చేసుకోవాలని చెప్పి యిట్టి ప్రతిజ్ఞ చేయదలచినవారు రేపు ఉదయం చౌపాటి దగ్గరకు రమ్మని చెప్పారు.

బొంబాయిలో పూర్తిగా హర్తాళ్ జరిగింది. అక్కడ చట్టాల్ని ఉల్లంఘించే కార్యక్రమం నిర్ణయించబడింది. రద్దు చేయడానికి అనుకూలమైన చట్టాలను, ప్రతివారు తేలికగా ఉల్లంఘించుటకు వీలైన చట్టాలను ఉల్లంఘించాలని నిర్ణయం చేశాము. ఉప్పు పన్ను ఎవ్వరికీ ఇష్టం లేదని తేలింది. దాన్ని రద్దుచేయాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీమీ ఇండ్లలో ఉప్పు తయారుచేసి తీసుకురమ్మని చెప్పాను. ప్రభుత్వం నిషేధించిన పుస్తకాల్ని అమ్మాలని చెప్పాను. అట్టి పుస్తకాలు నావే రెండు వున్నాయి (1) హింద్ స్వరాజ్ (2) సర్వోదయ్. యీ పుస్తకాలను అచ్చు వేయడం తేలిక. ఆ విధంగా చట్టాన్ని ఉల్లంఘించవచ్చు. వెంటనే ఆ పుస్తకాలు అచ్చువేయాలని మరునాడు సాయంత్రం చౌపాటీలో జరిగిన సభలో వాటి అమ్మకం జోరుగా జరపాలని నిర్ణయం గైకొన్నాం. ఒక కారులో నేను, మరో కారులో సరోజినీ నాయుడు బయలుదేరాం. ముద్రించబడిన పుస్తక ప్రతులన్నీ అమ్ముడుబోయాయి. వచ్చిన సొమ్మంతా యుద్ధ కార్యక్రమం నిమిత్తం ఖర్చు చేయాలని నిర్ణయం గైకొన్నాం. పుస్తకం ధర నాలుగు అణాలు, అయితే నా చేతికి, సరోజినీ దేవి చేతికి మూల్యం మాత్రమేగాక తమ జేబులో వున్న సొమ్మంతా యిచ్చి చాలామంది పుస్తకాలు కొన్నారు. కొందరు అయిదు, పది రూపాయల నోట్లు కూడా యిచ్చారు. ఒక ప్రతికి 50 రూపాయలు ఒకరు యిచ్చినట్లు నాకు గుర్తు. యీ పుస్తకాలు కొన్న వారికి కూడా జైలు శిక్ష పడవచ్చునని ముందుగానే జనానికి చెప్పాం. కాని ఆ క్షణంలో జైలు భయం జనానికి పోయిందని చెప్పవచ్చు. అయితే ఏ పుస్తకాల్ని ముద్రించి మేము అమ్మకం చేశామో వాటికి నిషేధం లేదని ప్రభుత్వం భావించిందని ఏడవ తేదీన తెలిసింది. అమ్మకం జరిగిన పుస్తకాలు పునర్ముద్రణ పొందినట్టివి. నిషేధం ప్రథమ ముద్రణ వరకే నీమితం. కనుక పుస్తకాల అమ్మకం చట్టవిరుద్ధం కాదని ప్రభుత్వం భావించిందట. యీ వార్త తెలిసినప్పుడు జనం కొద్దిగా నిరుత్సాహపడ్డారు.

ఏడవ తేదీన స్వదేశీ వ్రతం పట్టేందుకు హిందూ ముస్లిం సమైక్యత కోసం ప్రతిజ్ఞ చేసేందుకు చౌపాటీ దగ్గర సభ జరగాల్సి వున్నది. తెల్లగా కనబడేవన్నీ పాలు కాజాలవని తెలిసింది. అక్కడికి బహు కొద్దిమంది మాత్రమే వచ్చారు. వారిలో ఇద్దరు ముగ్గురు మహిళల పేర్లు నాకు గుర్తు వున్నాయి. పురుషులు కూడా బహు కొద్దిమందే వచ్చారు. నేను వ్రతాన్ని గురించిన ముసాయిదా తయారుచేసి వుంచాను. సభలో పాల్గొన్న వారందరికి వివరించి చెప్పి వ్రతాన్ని గురించిన శపథం చేయించాను. కొద్దిమంది మాత్రమే హాజరవడం వల్ల నాకు ఆశ్చర్యంగాని, విచారంగాని కలగలేదు. తుఫానుల వంటి కార్యాలకు, నిర్మాణాత్మక కార్యాలకు గల తేడా నాకు తెలుసు. తుఫాను కార్యాలంటే సహజంగా జనానికి పక్షపాతం వుంటుంది. నెమ్మదిగా సాగే నిర్మాణ కార్యక్రమాలంటే అభిరుచి వుండదు. దీన్ని గురించి వ్రాయాలంటే మరో ప్రకరణం అవసరం.

9వ తేదీ రాత్రి ఢిల్లీ అమృత్‌సర్‌లకు బయలుదేరాను. ఎనిమిదవ తేదీన మధుర చేరాను. నన్ను అరెస్టు చేయవచ్చునను వార్త నా చెవినపడింది. మధుర తరువాత ఒక స్టేషను దగ్గర రైలు ఆగుతుంది. అక్కడ ఆచార్య గిద్వానీ వచ్చి కలిశారు. నన్ను అరెస్టు చేయబోతున్నారని ఆయన నన్ముకంగా చెప్పాడు. నా సేవలు అవసరమైతే చెప్పండి, సిద్ధంగా వున్నానని అన్నాడు. ధన్యవాదాలు చెప్పి అవసరమైతే మీ సేవల్ని ఉపయోగించుకుంటానని చెప్పాను.

రైలు పల్వల్ స్టేషనుకు చేరక పూర్వమే ఒక పోలీసు అధికారి నా చేతిలో ఒక ఆర్డరు పత్రం వుంచాడు. “మీరు పంజాబులో ప్రవేశిస్తే అశాంతి ప్రబలే ప్రమాదం వున్నది గనుక మీరు పంజాబు గడ్డమీద అడుగు పెట్టవద్దు.” అని ఆ పత్రంలో వున్నది. ఆ ఆర్డరు పత్రం యిచ్చి ఈ బండి దిగిపొమ్మని ఆ పోలీసు అధికారి ఆదేశించాడు. బండి దిగడానికి నేను అంగీకరించలేదు. “అశాంతి పెంచేందుకు గాక అశాంతిని తగ్గించేందుకై వెళ్లదలిచాను. అందువల్ల యీ ఆదేశాన్ని పాటించలేనని తెలుపుటకు విచారిస్తున్నాను” అని చెప్పివేశాను. పల్వల్‌స్టేషను వచ్చింది. మహాదేవ్ నాతోబాటు వున్నాడు. ఢిల్లీ వెళ్లి శ్రద్ధానంద గారికి యీ విషయంచెప్పి, జనాన్ని శాంతంగా వుండేలా చూడమని మహాదేవ్‌కి చెప్పాను. గవర్నమెంటు ఆర్డరును పాటించకుండా అరెస్టు కావడమే మంచిదని భావించానని, నన్ను అరెస్టు చేశాక కూడా ప్రజలు శాంతంగా వున్నారంటే అది మనకు విజయమని భావించాలని కూడా చెప్పమన్నాను.

పల్వల్ స్టేషనులో దింపివేసి పోలీసులు నన్ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీ నుండి వస్తున్న ఏదో రైల్లో మూడోతరగతి పెట్టె ఎక్కించారు. పోలీసుల బృందం నా వెంట వున్నది. మధుర చేరిన తరువాత నన్ను పోలీసుల బారెక్‌కు తీసుకువెళ్లారు. నన్ను ఎక్కడికి తీసుకువెళతారో ఏ అధికారి చెప్పలేకపోయాడు. ప్రాతఃకాలం నాలుగు గంటలకు నన్ను మేల్కొలిపి బొంబాయికి వెళ్లే ఒక గూడ్సు బండిలో కూర్చోబెట్టారు. మధ్యాహ్నం బండి సవాయి మాదోపూర్ చేరింది. అక్కడ నన్ను దింపివేశారు. బొంబాయి వెళ్లే బండిలో ఎక్కించారు. లాహోర్ నుండి వచ్చిన ఇన్స్‌పెక్టర్ బోరింగ్ అక్కడ నా బాధ్యత వహించాడు. ఫస్ట్‌క్లాస్ పెట్టెలో నన్ను కూర్చోబెట్టారు. నా వెంట బోరింగ్ దొర కూర్చున్నాడు. యిక నేను జెంటిల్‌మెన్ ఖైదీగా మారిపోయానన్నమాట. సర్ మైకాల్ ఓడయరును గురించి తెల్లదొర వచ్చి ప్రారంభించాడు. మాకు మీరంటే వ్యతిరేకత లేదు, కాని పంజాబులో మీరు అడుగు పెడితే అక్కడ అశాంతి ప్రబలుతుంది గనుక అక్కడికి వెళ్లవద్దని, తిరిగి వెళ్లిపొమ్మని నాకు చెప్పాడు. “నేను ఆ విధంగా వెళ్లనని, మీ ఆదేశాన్ని పాటించనని” చెప్పాను. అయితే చట్టరీత్యా చర్య తీసుకుంటామని అన్నాడు. ఏం చేయదలచుకున్నారో చెప్పమని దొరను అడిగాను. నాకేమీ తెలియదని, మిమ్మల్నిబొంబాయి తీసుకు వెళుతున్నానని, మరో ఆదేశం కోసం ఎదురుచూస్తున్నానని అతడు అన్నాడు.

సూరత్ చేరాం. మరో అధికారి వచ్చాడు. నా బాధ్యతను తాను స్వీకరించాడు. బండి బయలుదేరింది. మిమ్మల్ని విడుదల చేశారు. మీ కోసం మెరీన్‌లైన్సు స్టేషనులో బండి ఆపిస్తాను. మీరు ఇక్కడ దిగిపోతే మంచిది. కొలాబా స్టేషనులో జనం విపరీతంగా వుంటారని భావిస్తున్నాను అని అన్నాడు. మీరు చెప్పిన ప్రకారం చేయడం నాకు సంతోషదాయకం అని అన్నాను. అతడు ఆనందించి ధన్యవాదాలు తెలిపాడు. నేను మెరీన్‌లైన్సులో బండి దిగిపోయాను. ఎవరో పరిచితుడి గుర్రం బండి కనబడింది. అతడు నన్ను రేవాశంకర్ ఝుబేరీగారి ఇంటి దగ్గర దింపివెళ్లాడు. “మిమ్మల్ని అరెస్టు చేశారని తెలిసి జనంకోపంతో పేట్రేగిపోయారు. వాళ్లకు పిచ్చి ఎక్కినంత పని అయింది. పాయధునీ దగ్గర కొట్లాట జరిగేలా వుంది. మేజిస్ట్రేటు, పోలీసులు అక్కడికి హుటాహుటిన వెళ్లారు” అని నాకు చెప్పాడు. నేను ఇంటికి చేరానో లేదో యింతలో ఉమర్ సుభానీ, అనసూయాబెన్ కారులో వచ్చి నన్ను పాయుధునీకి బయలుదేరమని అన్నారు. “ప్రజలు కోపంతో వున్నారు. వాతావరణం ఉద్రిక్తంగా వుంది. జనం ఎవ్వరు చెప్పినా వినే స్థితిలో లేరు. మిమ్మల్ని చూస్తే శాంతించవచ్చు” అని అన్నారు. నేను కారులో కూర్చున్నాను. పాయధునీ చేరాను. అక్కడ అంతా గందరగోళంగా వున్నది. నన్ను చూడగానే జనం సంతోషంతో ఊగిపోయారు. జనం పెద్ద ఊరేగింపు తీశారు. వందేమాతరం, అల్లా హో అక్బర్ అను నినాదాలతో ఆకాశం మార్మోగింది. పాయధునీ దగ్గర పోలీసులు గుర్రాల మీద ఎక్కి కనబడ్డారు. ఇటుక రాళ్ల వర్షం కురుస్తూ వున్నది. శాంతంగా వుండమని చేతులు జోడించి జనాన్ని ప్రార్థించాను. ఇటుకలు, రాళ్లు మాకు తప్పవని అనిపించింది.

ఊరేగింపు అబ్దుల్ రహమాన్ వీధి నుండి క్రాఫర్జ్ మార్కెట్టు వైపుకు మళ్లింది. ఇంతలో ఎదురూగా గుర్రపు రౌతుల పటాలం వచ్చి నిలబడింది. ఫోర్టువైపు వెళ్లకుండా ఊరేగింపును ఆపేందుకు రౌతులు ప్రయత్నించసాగారు. క్రిక్కిరిసి వున్న జనం ఆగుతారా? పోలీసు లైనును దాటి జనం ముందుకు దూసుకు వెళ్ళారు. నా మాటలు ఎవ్వరికీ వినబడలేదు. వెంటనే గుర్రపు రౌతుల దళాధికారి జనాన్ని చెదరగొట్టమని ఆర్డరు యిచ్చాడు. తళతళలాడే బల్లాలను త్రిప్పుతూ గుర్రపు రౌతులు హఠాత్తుగా జనం మీదకి గుర్రాల్ని తోలారు. నా ప్రక్కగా బల్లాలు బహువేగంగా తళ తళ మెరుస్తూ ముందుకు సాగుతూ వున్నాయి. జనం చెదిరిపోయారు. అక్కడ గుర్రాలు పరిగెత్తేందుకైనా చోటు లేదు. ఎటు పోదామన్నా త్రోవలేదు. దృశ్యం కడు భయానకంగా వుంది. అటు గుర్రపు రౌతులు, ఇటు జనం. యిద్దరికీ పిచ్చి ఎక్కినట్లున్నది. గుర్రాలకు ఏమీ కనబడటం లేదు. ఎటుబడితే అటు, ఎలా బడితే అలా దౌడు తీస్తున్నాయి. వేలాది జనాన్ని చెల్లాచెదురు చేయాలి. గుర్రపు రౌతులకు ఏమీ కనబడటం లేదని బోధపడుతూవుంది. మొత్తం మీద జనాన్ని చెల్లాచెదురు చేసి వాళ్లను ముందుకు సాగకుండా చేశారు. మా కారును మాత్రం ముందుకు పోనిచ్చారు. పోలీసు కమీషనరు ఆఫీసు ముందు కారు ఆపించాను. పోలీసులు వ్యవహరించిన తీరుపై అసమ్మతి తెలుపుదామని కారు దిగాను.